రచయిత్రి రుబీనా పర్వీన్ ప్రత్యేక ఇంటర్వ్యూ

0
7

[‘జమిలి పోగు’ అనే కథాసంపుటి వెలువరించిన రుబీనా పర్వీన్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం రుబీనా పర్వీన్ గారూ.

రుబీనా పర్వీన్: నమస్కారం.

~

ప్రశ్న 1. రుబీనా గారూ! మీ నేపథ్యం చెప్పండి?

జ: నేను పుట్టింది ఖమ్మం జిల్లా ఇర్సులాపురంలో. ఆ తర్వాత ఇల్లందుకు వచ్చాం. నాన్న ప్రైమరీ స్కూల్ టీచర్. అమ్మ డిగ్రీ కాలేజీ లెక్చరర్. వాళ్లిద్దరూ ఉద్యోగాలకు వెళ్లిపోవడం వల్ల నేను ఎక్కువగా మా నానమ్మ దగ్గరే పెరిగాను. ఆమె బట్టల వ్యాపారం చేసేది. నేను జీవితంలో చూసిన తొలి వ్యాపారవేత్త మా నానమ్మే. ఊరిలో ఆవిడ మనవరాలిగానే నేను అందరికీ తెలుసు. ఆమెకు చదువు లేదు. ఆమె వ్యాపారానికి సంబంధించిన లెక్కలన్నీ నేను రాసేదాన్ని. మా ఇంట్లో మొదటినుంచీ చైతన్యకర వాతావరణం ఉండేది. మా అమ్మ, నానమ్మే నాకు తొలి గురువులు. వారిని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆడవాళ్లు ఊరికే కూర్చోవడం వారిద్దరికీ నచ్చేది కాదు. స్త్రీలు పనిచేస్తూ బతకాలనేది వారి ఫిలాసఫీ. అందరూ టీవీ సీరియళ్ల ధ్యాసలో మునిగిపోయిన కాలంలో మా అమ్మ మాత్రం వాటికి జోలికిపోకుండా, ఇంట్లో ఉండి చదువుకొని పీజీ చేసింది.

ప్రశ్న 2. మీరు సోషల్ ఆంత్రప్రెన్యూర్ (సామాజిక వ్యాపారి). సాహిత్య సృజన వైపు ఎలా మళ్లారు?

జ: సోషల్ ఆంత్రప్రెన్యూర్షిప్ అనేది నా జీన్స్‌లో ఉంది. మా ఇంట్లో మా నానమ్మే నాకు రోల్ మోడల్. ఆమె బట్టల వ్యాపారం చేసినా దాంతోపాటు దానధర్మాలు కూడా చేసేది. అవసరంలో ఉన్నవారిని ఆదుకునేది. అది సోషల్ ఆంత్రప్రెన్యూర్షిప్పే! ఆమె ప్రభావం నా మీద చాలా ఉంది. నేను, మా తమ్ముడు కలిసి పెద్దయ్యాక ఏదైనా చేయాలని తపన పడేవాళ్లం. అయితే దాని పేరు ‘సోషల్ ఆంత్రప్రెన్యూర్షిప్’ అప్పుడు మాకు తెలియదు. 2007లో తొలి కథ ‘ఖులా’ రాసేనాటికి నేను మీడియాలో ఉన్నాను. అప్పటికే మహిళలు, చిన్నపిల్లల గురించి చాలా పనిచేశాను. నాకు మహిళ పట్ల సానుభూతి, పిల్లల పట్ల ఇష్టం, పెద్దలు పట్ల గౌరవం.. ఇవన్నీ ఉన్నాయి. అందుకే మెయిన్ స్ట్రీమ్‌ని ఎంచుకునే అవకాశం ఉన్నా, నేను అటువైపు వెళ్లలేదు. నా జీవితంలో కథారచన, సోషల్ ఆంత్రప్రెన్యూర్షిప్ రెండూ సమాంతరంగా సాగాయి.

 

ప్రశ్న 3. ముస్లిం సమాజంలోని అంశాల గురించి మీరు రాసిన ఖులా’, ‘బుర్ఖాలాంటి కథలు చాలా చర్చకు దారితీశాయి. అలాంటి అంశాల ఎంపిక ఎలా సాధ్యమైంది?

జ: నేను ముందుగా అనుకొని కథలు రాయను, రాయలేను. నన్ను బాగా వెంటాడిన అంశాలే నా కథా వస్తువులయ్యాయి. నేను ఇప్పటిదాకా ఊహించుకొని ఏ కథా రాయలేదు. నన్ను చాలా ఇబ్బంది పెట్టిన అంశాలనే కథలుగా రాశాను. నాకు మాండలికాలు నేర్చుకోవడం, రాయడం ఇష్టం. చిన్నప్పటి నుంచి రకరకాల యాసలు వింటూ పెరిగాను. నా ప్రయాణాల్లో ఒక్కచోట ఒక్కో రకమైన భాషను వింటూ దాన్ని మాట్లాడటం అలవాటు చేసుకున్నాను. నా మొదటి కథ ‘ఖులా’ మొత్తం మాండలికంలో రాశాను. అది ప్రచురితమైన వెంటనే చాలా పేరొచ్చింది. దాని మీద చాలా చర్చ జరిగింది. చలం కాలం నుంచి అప్పటిదాకా తెలుగులో వచ్చిన 41 ఉత్తమ కథలను కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్లు ఎంపిక చేసి హిందీలోకి అనువాదం చేసి పుస్తకంగా వేశారు. అందులో ‘ఖులా’ కూడా ఒకటి. ఆ తర్వాత ఆ కథ 15 భాషల్లోకి అనువాదమైందని తెలిసింది. నిజానికి ముస్లింల గురించి నేను రాసినవి నాలుగు కథలే!

ప్రశ్న 4. ఖులా, బుర్ఖా కథలు ముస్లిం జీవితాలకు సంబంధించినవి. ఈ కథల రచనలో ఇబ్బందులేమయినా ఎదుర్కొన్నారా? ముఖ్యంగా, బుర్ఖాధారణ వివాదాస్పదమై, సంకుచిత భావనలకు తావిస్తున్న సమయంలో బుర్ఖాను స్టీల్ సామానులవాడికి వేసినట్టు చూపటం వల్ల ఎలాంటి స్పందనలను ఎదుర్కొన్నారు?

జ: మా బంధువుల్లో ఒకావిడకు జరిగిన అనుభవాన్నే ‘బుర్ఖా’ కథగా రాశాను. ఈ కథ తొమ్మిదేళ్ల క్రితమే రాశాను. కానీ పోయినేడాది ప్రచురించాను. ఆ కథ ప్రచురితమైన వెంటనే సోషల్ మీడియాలో నాపై ట్రోలింగ్ జరిగింది. చాలా విమర్శలకు గురైంది. నిజానికి మా ఇంట్లో నేను, మా అమ్మ, మా నానమ్మ ఎవరూ బుర్ఖాలు వేసుకోలేదు. నా చిన్నప్పుడు మా చుట్టూ ఉన్న చాలామందికి బుర్ఖా వేసుకునే అలవాటే లేదు. గత పదిహేనేళ్ల నుంచి మన సంస్కృతి మారుతోంది. అందరూ వాళ్ల మతాల పట్ల చాలా కాన్షియస్ అయిపోయారనిపిస్తోంది. ముఖ్యంగా హిందూ ముస్లింల మధ్య దూరం పెరుగుతోంది. అది నన్ను చాలా బాధపెడుతోంది. ‘బుర్ఖా’ కథ రాసేటప్పుడు ఆ విషయం తల్చుకొని చాలా ఏడ్చాను. నా మీద ట్రోలింగ్ చేసేవారిని పట్టించుకునేంత టైం లేదు. నాకు నచ్చిన కథలు రాస్తూ పోవడమే నాకు తెలిసిన పని.

ప్రశ్న 5. మీ కథారచనలో మీరు పాత్రల వ్యక్తిత్వ చిత్రీకరణకు, సన్నివేశ సృష్టీకరణకు, ముఖ్యంగా డ్రమటైజేషన్‌కు అంతగా ప్రాధాన్యం ఇస్తున్నట్టు అనిపించదు. ఇది కావాలని అలవరచుకున్న రచనా సంవిధానమా?

జ: నాకు అణచివేత నచ్చదు. ఎవరైనా ఎవరినైనా ఆదేశించడం, నిర్దేశించడం నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది. అమ్మాయిలు ఇష్టపూర్వకంగా బుర్ఖా వేసుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ బలవంతంగా వారి చేత వేయించడం తప్పు. అలాంటప్పుడు నేను ఆ మహిళల వైపున నిలబడతాను. నా కథల్లో అలాంటి వారే పాత్రులవుతారు. మామూలు కథలు ఎవరైనా రాయగలరు. కానీ రూబీనా పర్వీన్‌గా నేను రాయాల్సిన కథలే నేను రాస్తాను. అందుకే పాఠకులకు అసహజంగా అనిపించదు. అదే నా శైలి.

ప్రశ్న 6. మీ కథాసంపుటిలో 12 కథలున్నాయి. పుస్తకానికి జమిలిపోగుఅని పేరు పెట్టడం వెనుక కారణం ఏమిటి?

జ: ‘జమిలి’ అనే జత అని సాధారణం అర్థం. అల్లికల్లో ‘జమిలిపోగు’ ఉంటుంది. అంటే రెండు దారాలు కలిసి ఒక పోగుగా మారడం. అలా నా కథలు కూడా రకరకాల రంగుల్లా ఒకచోట కలిసి ఉన్నాయి. పుస్తకానికి టైటిల్ కూడా ఆ అర్థంతో రావాలని మా అమ్మాయి సాయిరాతో మాట్లాడుతున్నప్పుడు తను కొన్ని ఇంగ్లీషు పదాలు సూచించింది. ఆ పదాలు విని జోత్స్న భమిడిపాటు పుస్తకానికి ‘జమిలి పోగు’ అనే పేరు సూచించారు.

ప్రశ్న 7. ఇన్నేళ్లలో తక్కువ కథలే రాశారెందుకు?

జ: కొందరు తమకు నచ్చినప్పుడే కథలు రాస్తారు. మరికొందరు ప్రణాళికాబద్ధంగా నెలకొక కథ రాయాలని అనుకుంటారు. రెండూ మంచివే! నేను మొదటి రకం. నన్ను ఒకటి, రెండేళ్లు వెంటాడి, కదిలించిన ఘటనల్నే కథలుగా రాశాను. దాంతోపాటు నా పుస్తకం ‘జమిలి పోగు’ కూడా చాలా ఆలస్యంగా తెచ్చాను. అందుకూ కారణం ఉంది. నాకు పర్ఫెక్షన్ ఇష్టం. ప్రతి అంశం పక్కాగా ఉండాలని కోరుకుంటాను. పైగా నేను రాసిన కథల్ని నేను మురిపెంగా చూసుకుంటూ ఉంటాను. అందుకే పుస్తకం పని ముందే పూర్తయినా చాలా ఆలస్యంగా తెచ్చాను. ఒక్కోసారి పని ఎక్కువగా ఉండటం, ప్రయాణాలు చేస్తూ ఉండటం కూడా కథలు తక్కువగా రాసేందుకు కారణం.

ప్రశ్న 8. ఒకే రకమయిన అంశం ఆధారంగా కథలు రాస్తూంటే, కొంతకాలానికి మీరు కూడా ఇతర మూస రచయితల జాబితాలో చేరిపోయే ప్రమాదం ఉంది. అలా చేరకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

జ: నేను మూసగా రాస్తున్నానని అనుకోవడం లేదు. కథ మూసగా ఉందా, వినూత్నంగా అని ప్రణాళికాబద్ధంగా ఆలోచించుకుని కథలు రాయను. నాకు తోచింది, నాకు నచ్చింది మాత్రమే కథావస్తువుగా తీసుకుని రాస్తాను. స్త్రీలోని అనేక కోణాలను నేను కథలుగా రాశాను. నేను చూసిన రకరకాల స్త్రీల జీవితాలు నా కథాసంపుటిలో ఉన్నాయి. వీటి తర్వాత ఎలాంటి కథలు రాస్తాను, అసలు రాస్తానా లేదా అనేది నాకు తెలియదు.

ప్రశ్న 9. వ్యాపారం పనుల్లో బిజీగా ఉండే మీరు కథారచన కోసం సమయాన్ని ఎలా కేటాయిస్తారు?

జ: నేను మొండిదాన్ని. అనుకున్నది చేయకుండా వదిలే ప్రసక్తే లేదు. కథ నన్ను వెంటాడి, రాయాలని అనిపిస్తే రాసేస్తాను. అయితే అందరికీ అలా ఉండదు. కొందరికి కుటుంబసభ్యుల నుంచి సహకారం ఉండదు. వారి సహకారం, ప్రోత్సాహం దక్కదు. ఒకవైపు ఇంటి బాధ్యత, మరోవైపు ఉద్యోగ బాధ్యతల నడుము రాసేందుకు అనువైన వాతావరణం ఉండదు. వారికి సమయం కుదరదు. ఇవన్నీ దాటుకుని రాసే మహిళలు రెండు, మూడు శాతానికి మించి ఉండరు. అలా రాసేవాళ్ళ మీద రకరకాల విమర్శలు, నిందలు, ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది.

ప్రశ్న 10. ఖులాకథలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఆత్మగౌరవాన్ని నిలుపుకున్న మహిళను చిత్రించారు. కానీ తరువాత కథల్లో శారీరక ప్రలోభానికి లొంగిన స్త్రీలు అధికంగా కనిపిస్తారు. వన్ పర్సన్ కంపెనీలో నరేన్‌ని ప్రేమించి పవన్‌ని పెళ్ళి చేసుకుని శరత్‌కు లొంగుతుంది. రంగుల కలకథలో నీల ప్రలోభాలకు లొంగుతుంది. దేవ్లీకథలో భర్త పోయిన దేవ్లీ రాజు ప్రలోభానికి లొంగుతుంది. ఇలాంటి పాత్రలు పదే పదే కథల్లో కనబడటం ‘a woman is at the mercy of her sex’ అన్న అపోహను స్థిరపరుస్తున్నట్టవుతుందేమో?

జ: సమాజంలో మంచిచెడు ఉంటుంది. ఇక్కడ మంచివారు, చెడ్డవారూ ఉంటారు. సమాజంలో ఉన్నది ఉన్నట్లు రాయడమే కథారచయిత పని. ఆ పరిస్థితిని చూసి, దాన్ని మార్చుకోవడమే కదా మనం చేయాల్సింది. ‘దేవ్లీ’ కథలో దేవ్లీ ఆత్మగౌరవం ఉన్న అమ్మాయే. ‘అపర్ణ’ కూడా ఆత్మగౌరవం ఉన్న మహిళే. అయితే ఎవరి తప్పులు వారికి తెలిస్తేనే వాటిని దిద్దుకునే అవకాశం ఉంటుంది. నా కథల్లో స్త్రీలు అద్వితీయులు, మహాత్ముల్లాగా నేను చిత్రించలేదు. వాళ్ల జీవితాన్ని వారు జీవిస్తూనే ఆత్మగౌరవంతో బతకాలని నా ఉద్దేశం. హింస, అవమానం, అగౌరవం కలిగే చోట ఉండాల్సిన అవసరం లేదని నేను ఆ కథల్లో చెప్పాను. అది ‘a woman is at the mercy of her sex’ అన్న అపోహను ఏమాత్రం స్థిరపరచదు.

ప్రశ్న11. మీ కథలలో రెండు, మూడు కథలు తప్ప మిగతా కథల్లో పురుషులు దుష్టులు. మంచి పురుషులు పాత్రలుగా స్త్రీ సాధికార కథలు రాయటం కుదరదా?

జ: అలా అన్నీ మంచి పురుషుల కథలు రాస్తే మళ్లీ మూస కథలు రాశానని అంటారు. నేను ముందే చెప్పినట్లు సమాజంలో మంచివారు, చెడ్డవారు ఉంటారు. ఎవర్నో ప్రత్యేకంగా దుష్టులు అనడం నాకు ఇష్టం ఉండదు. అందర్నీ మంచిగా చూస్తూనే కథలు రాశాను. అది మా అమ్మ, నానమ్మల నుంచి నాకు అలవడిన గుణం. నా కథల్లో పురుషులను నేనెక్కడా దుష్టులుగా చూపించలేదు. నా కథలన్నీ పాజిటివ్ ధోరణితోనే ఉన్నాయని పాఠకులు అంటున్నారు.

ప్రశ్న12. మీరు రాసిన కథల్లో మీ మనసుకు దగ్గరగా అనిపించిన కథ ఏది?

జ. ఏ తల్లినైనా తన బిడ్డల్లో ఎవరిష్టం అంటే ఏం చెప్తుంది? అందరూ తన కడుపున పుట్టిన బిడ్డలే. ఈ కథలన్నీ నాకు అలాంటివే. ప్రత్యేకంగా ఒకే కథ అని చెప్పలేను. అన్ని కథలూ నా మనసుకు దగ్గరైనవే.

ప్రశ్న13. కథా రచనలో మీ లక్ష్యం ఏమిటి?

జ: నేను లెఫ్ట్ నేపథ్యం నుంచి వచ్చినా దేవుణ్ని నమ్ముతాను. గంటల తరబడి ధ్యానం చేస్తాను. రాయడమనేది ఆ దేవుడు నాకిచ్చిన గొప్ప వరం అని నేను నమ్ముతాను. ఒక్కోసారి కథ రాయడం పూర్తయిన తర్వాత గొప్ప రిలీఫ్ దొరికినట్టు అనిపిస్తుంది. ఏదో భారం దిగిపోయిన భావన కలుగుతుంది. రాజస్థాన్ రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే ఆ ఇంట్లో వాళ్లు శోకదినాలు పాటిస్తారు. అందరూ వచ్చి ఓదార్చి వెళ్తారు. ఆ విషయం నన్ను చాలా రోజులు వెంటాడింది. కథ రాశాక ఆ బాధ నాలో నుంచి కొంత తొలగిపోయింది. ప్రతి కథా రాసిన తర్వాత అలాంటి అనుభూతి పొందుతాను.

ప్రశ్న14. పుస్తక ప్రచురణ , అమ్మకాలలో మీ అనుభవాలేమిటి?

జ: పుస్తక ప్రచురణలో సమస్యలేమీ లేవు. రచయితలంతా స్నేహితులే కాబట్టి పుస్తకం బాగా రావడానికి వారంతా తోడ్పడ్డారు. అమ్మకాల విషయానికొస్తే నేను ఆ విషయంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. పుస్తకం వేశాను, చదివేవారికి అందించాను. అంతవరకే ఆలోచించాను. అమ్మకాలపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం వస్తే తప్పకుండా పెడతాను.

ప్రశ్న15. మీరు డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కదా! ఆ రంగం గురించి చెప్పండి?

జ: నేను 540కి పైగా డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేశాను. 380కి పైగా వివిధ సంస్థలకు యాడ్ ఫిల్మ్స్ చేశాను. ఒక టైం తర్వాత లెక్కపెట్టడం మానేశాను. భారతదేశంలో అన్ని మూలలూ తిరిగి డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేశాను. అందులో గిరిజనులకు సంబంధించి ఫిల్మ్స్ చేశాను. 73 తెగల గురించి అందులో చూపించాను. ఈ సమయంలో విస్తృతమైన జీవితాన్ని, వైవిధ్యతను చూశాను. అయితే ఆ సమయంలో రాయాలన్న ఆలోచన రాలేదు. ఆ తర్వాతే కథలు రాయడం మొదలుపెట్టాను.

ప్రశ్న16. మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి?

జ: 2014లో మా తమ్ముడి మరణం తర్వాత ఆ బాధను మర్చిపోయేందుకు ఓ నవల రాయడం మొదలుపెట్టాను. నాక్కొంచెం బద్దకం ఎక్కువ. పదేళ్లుగా రాస్తూనే ఉన్నాను. ఈ మధ్యే మూడు చాప్టర్లు పూర్తి చేశాను. వచ్చే ఏడాది ఆ నవల విడుదల చేస్తాను. అలాగే మహిళలకు ఆర్థిక స్థిరత్వం, స్వయం ఉపాధి అందించేలా మరిన్ని ప్రాజెక్టులు చేయాలని అనుకుంటున్నారు. స్త్రీలు వారి కాళ్ల మీద వాళ్లను నిలబడేలా చేయడమే నా లక్ష్యం.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు రుబీనా పర్వీన్ గారూ.

రుబీనా పర్వీన్: థాంక్యూ.

***

జమిలి పోగు (కథలు)
రచన: రుబీనా పర్వీన్
ప్రచురణ: సైరా ప్రచురణలు
పేజీలు: 126
వెల: ₹ 145
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‍లైన్‍లో
https://www.amazon.in/Jamili-Pogu-Kathalu-Rubina-Parveen/dp/B0DF6G2T66

 

 

 

~

‘జమిలి పోగు’ కథాసంపుటిపై సమీక్ష:
https://sanchika.com/jamili-pogu-book-review/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here