ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ ప్రత్యేక ఇంటర్య్వూ

4
12

[ఇటీవల ‘కైంకర్యము’ అనే నవలని వెలువరించిన శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం సంధ్యా యల్లాప్రగడ గారూ.

సంధ్యా యల్లాప్రగడ: నమస్కారమండీ

~

ప్రశ్న 1. ‘కైంకర్యము’ నవల రాయడానికి ఏయే అంశాలు ప్రేరణనిచ్చాయి?

జ: కైంకర్యము నవల వ్రాయటానికి స్ఫూర్తి నిచ్చిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఒక బాధ్యత లేని తనం నుంచి పూర్తి బాధ్యత స్వీకరించే ఒక మనిషి జీవన ప్రస్థానము ఇందులో కూలంకుషంగా ప్రస్థావించబడింది.

మానవ జీవితం కర్మలను తీర్చుకోవటానికే కాదు, ఈ జన్మ పరంపరలను దాటటానికి కూడా అన్న సిద్దాంతాన్ని చూపే ప్రయత్నం కూడా చెయ్యటం జరిగింది.

ప్రశ్న 2. నవలకి ఈ ఇతివృత్తం ఎంచుకున్నప్పుడు ఇలాంటి కథలు/నవలలు చాలానే వచ్చాయని అనిపించిందా? వాటి ఛాయలు మీ నవలలో కనబడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

జ: మనకు రామాయణం ఆది  అన్నీ కథలు తెలిసినవే అనిపిస్తాయి. కథ కన్నా కథనం ముఖ్యం. ఆ కథను మనస్సుకు హత్తుకునేలా ఎలా చెప్పామా అన్నది ముఖ్యం.

కాబట్టి కెంకర్యము వంటి రచన నాకు తెలిసీ రాలేదని (నేను చదివినంత వరకూ) అనుకుంటున్నాను. పాఠకులను చెయ్యట్టుకు నడిపించిందని చదివిన వారు చెప్పారు. కాబట్టి మరి ప్రశ్నలకు తావులేదు.

ప్రశ్న 3. నవలలో శ్రీ వైష్ణవ కుటుంబీకులైన సుదర్శనాచారి, ఆండాళ్లుల జీవన శైలి, ఇంట్లో పూజలు, పాటించే ఆచార సంప్రదాయాలు, కథానుగుణంగా వచ్చే పాశురాలు, శ్లోకాలు – వీటిపై మీకెలా పట్టు దొరికింది? ఆసక్తి ఉండడం వేరు, సాధికారికంగా కథలో ఉపయోగించడం వేరు కదా?

జ: మా చిన్నప్పుడు మాకు ఒక రామాలయ పూజారి కుటుంబముతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. వారు ఎంతో నిష్ఠగా ఉండేవారు.  వారి ఆచార వ్యవహారాలు చాలా విచిత్రంగా ఉండేవి.

ధనుర్మాసం వస్తే వారు ప్రతి ఉదయం తిరుప్పావై చదివి ప్రసాదం పంచేవారు.

అవ్వన్నీ ఈ నవల వ్రాస్తుండగా గుర్తుకు తెచ్చుకోవటమైయింది.

పైగా మాకు తెలిసిన శ్రీవైష్ణవులతో కూర్చుని ఎన్నో విషయాలను వారితో కూలంకుషంగా మాట్లాడి, వారి నుంచి వివరాలు సేకరించటం జరిగింది. పాశురాలు తెలుగులోని అనువాదం మనకు ఎన్నో ఉన్నాయి. గోదా దేవి రచించిన ఆ పాశురాల మీద భాష్యాలతో పాటూ మనకు సవివరంగా గూఢార్థాలు దొరుకుతున్నాయి. శ్రీమాన్ శ్రీ అప్పలాచార్యుల వంటి పూజ్యులు మల్లాది చంద్రశేఖరశాస్త్రి వంటి పెద్దల ప్రవచనాలు ఎన్నో మంచి మాటలను మనకు అందచేశాయి.

కాబట్టి వీటి సాయంతో కథలలో పుష్పగుచ్ఛాలుగా పొదవుకోవటం జరిగింది. ఆయా భాగాలు అందంగా అమరినందు వల్లనే కాబోలు ఎందరో నన్ను “మీరు శ్రీ వైష్ణవులా?” అని ప్రశ్నించటం జరిగింది.

మాకు తెలిసిన హనుమాన్ కోవెల పూజారిగారు కూడా “ఎన్నో మేము వాడే మాటలను పొందపరిచారు.. ఎంతో రీసెర్చు చేశారులా యుంది” అన్న మాట ఆ పరమాత్మ దీవెనగా స్వీకరించటమయింది.

ప్రశ్న 4. ఈ నవల రాయడం కోసం బహుశా మీరు కొన్ని వైష్ణవ కుటుంబాలను దగ్గరగా గమనించి ఉంటారు. పెద్దలు అత్యంత నియమ నిష్ఠలతో ఉండే ఇటువంటి కుటుంబాలలో యువతరం ఇప్పుడు ఎలా ఉంటోంది, ఆధ్యాత్మికతని అనుసరిస్తోందా లేక ఆధునికతని అలవర్చుకుందా? మీ దృష్టికి వచ్చిన విషయాలు ఏమిటి?

జ: మీకు మునుపు చెప్పిన వైష్ణవ కుటుంభములో వారు నేటికీ కోవెలలో సేవలందిస్తున్నారు.

వారే కాదు నేను చూసిన ఎందరో వైష్ణవ కుటుంబాలలో వారు ఎంతో పెద్ద పెద్ద ఆంగ్ల విద్యలు అభ్యసించినా, వారి ఆచారము గురువు విషయంలో వారు ఎక్కడా కాంప్రమైజ్ కారు.

మాకు అట్లాంటా అహోబెళమఠం వారు కొందరు తెలుసు. వారు చిన్న కృష్ణుడ్ని మన ఇంటికి సేవకై తెస్తారు. ఉయ్యాల సేవ అభిషేకం వంటివి.

వచ్చేవారంతా చక్కటి సాంప్రదాయమైన దుస్తులు, పుండ్రాలతో శిఖతో ఉంటారు. మీరు వారిని చూసి అర్చకస్వాములనుకుంటారు.

స్త్రీలు కూడా మడిసై కట్టి సంగీతం పాడుతూ ఉంటారు.

కాని వారు కంపెనీలో CFO, Chief computer officer ఇత్యాది ఉద్యోగాలలో ఉన్నవారు.

అంటే మన ప్రవృత్తికి, వృత్తికి సంబంధం లేక, జీవన విధానం సాగించటము మనకు వైష్ణవులలో కనపడుతుంది.

స్మార్తులలో అటు వంటి నిబద్ధత తక్కువ. బొట్టు పెట్టుకొని ఉద్యోగం వెళ్ళటానికి గిజగిజలాడుతారీ స్మార్తులు. శిఖ అంటే మాట్లాడవలసిన పనేలేదు (స్మార్తులను ఉదహరించటం పుట్టినప్పట్నించి చూస్తున్నందున).

కాబట్టి శ్రీవైష్ణవులలో ఆధునికత ఆధ్యాత్మికతను దూరం చెయ్యలేదని నా వ్యక్తిగత అభిప్రాయం.

ప్రశ్న 5. నవలలో సుదర్శనాచారి ఆండాళ్ళుల సంతానంలోని పెద్ద పిల్లలు (రాఘవ అన్నలు, అక్కలు) గురించి తక్కువ వివరాలే ఉన్నాయి. ఈ కుటుంబాలలోని యువతరం ధోరణిని రాఘవ అన్నలు, అక్కల పాత్రలకి అన్వయించవచ్చా?

జ: లేదండి. రాఘవ అన్నలు, అక్కలూ గురించి తక్కువగా చెప్పడానికి కారణం కథకు అనవసరమని తప్ప మరో విధంగా కాదు.

ప్రశ్న 6. నవల రాసినప్పుడు మొత్తం ఒకేసారి రాసి తరువాత ఆధ్యాయాల విభజన చేశారా? లేక అవుట్‍లైన్ అనుకుని ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం విడిగా రాసుకుని అన్నిటినీ కలిపారా?

జ: మాములుగా ఏదైనా వ్రాసేటప్పుడు అంతా ఒక్కసారే వ్రాసి ఎడిటరు గారికి పంపేయటం అలవాటు. ఆయనకూ తరువాతి భాగం చేతుల్లో ఉంటుందీ, నేనూ నా అధ్యయనం చేసుకోవచ్చని.

చాలా మంది చేయి తిరిగిన రచయితలలా నేను ఇలా అనుకొని అలా వ్రాయలేనండి. నాకు ఆ సబ్జెక్టు గురించి పూర్తి అవగాహాన, నవలలో లేదా కథలో చెప్పే విషయం మీద పట్టు ఉంటే తప్ప వ్రాయలేను. అందుకే ఏది వ్రాసినా, ముందు అధ్యయనం తప్పని సరి.

ఒకసారి అనుకున్న తరువాత చకచకా వ్రాసి ప్రక్కన పెట్టేస్తాను.

ప్రశ్న 7. ఏదైనా అధ్యాయాన్ని ముందు అనుకున్నట్టుగా కాక, రీ-రైట్ చేయవలసి వచ్చిందా? వస్తే ఎందుకు?

జ: పైన చెప్పిన విధంగా ముందే అధ్యయనం చేసి ఆలోచించుకొని వ్రాస్తాను కాబట్టి రీరైట్ చెయ్యను. అవసరం రాలేదు. ఎడిటరు గారు చెబితే చూద్దామనుకుంటాను. కాని వారిప్పటి వరకూ అటువంటి సలహా ఇవ్వలేదు మరి.

ప్రశ్న 8. నవలలో ప్రస్తావించిన శ్రీపీఠంలాంటి ఆధ్యాత్మిక సంస్థల కార్యకలాపాలు, నిర్వహణ, అక్కడి నిర్వాహకులు, విద్యాబోధన తదితర విషయాల కోసం ఏదైనా మఠం/పీఠం లను ప్రత్యేకంగా అధ్యయనం చేశారా?

జ: మా మేనమామగారు శ్రీవైష్ణవం దగ్గర నుంచి పరిశీలించే అవకాశం కలిగించారు. అలా నేను చాలా సంవత్సరాలు చిన్నజియ్యరు స్వామి వారి ఆశ్రమానికి వాలంటీరుగా స్వచ్చందంగా పని చేశాను. ఆశ్రమం చాలా మటుకు కైంకర్యములో చెప్పినట్లుగా ఉంటుంది.

ఋషీకేష్‌లో కొన్ని ఆశ్రమాలను చూశాను. కొన్నింట ఉండి చదువుకున్నాను. అవీ కూడా ఈ నవల వ్రాసేటప్పుడు నా ఆలోచనలలో చోటు చేసుకున్నాయి. వాటి ఛాయలూ ఇందులో కనపడుతాయి.

ప్రశ్న 9. నవలలోని ఆచార్యుల వారి గురించి చెబుతున్నప్పుడు – ఒకరే కాక – జగత్ప్రసిద్ధి చెందిన అనేక మహాపురుషులు వారిలో కనబడతారు. వారి బోధనలు కూడా శ్రీవైష్ణవులే కాకుండా ఎవరైనా ఆచరించేలా ఉంటాయి. ఇదెలా సాధ్యమయింది?

జ: ఆచార్యులంటే ప్రజలను ముక్తి మార్గం వైపు నడిపించే గురువులు. వారు ఏ ఒక్క తెగకో లేక ఒక్క మతానికో, మఠానికీ తమ తమ బోధనలు పరిమితం చేయ్యరు. మానవాళి సర్వులకూ పనికివచ్చే బోధలే ఆచార్యులు చేస్తారండి. అందుకే అవి అందరూ ఆచరించేలా ఉంటాయి.

ప్రశ్న 10. నవలలో ప్రస్తావించిన 108 దివ్యదేశాలలో మీరు కొన్నైనా దర్శించి ఉంటారు. అప్పటి మీ అనుభూతి ఎలాంటింది? అలాగే రాఘవ దంపతులు హిమాలయాలు సందర్శించప్పుడు వారికి కలిగిన అనుభూతులు, పరిసరాల వర్ణన చదువుతున్నప్పుడు కళ్ళకి కట్టినట్టుగా అనిపిస్తాయి. వాటిని మీరు సందర్శించినప్పుడు మీ అనుభూతులని మనసు నిండా నింపుకుని ఈ సందర్భంలో ఉపయోగించారని అనిపిస్తుంది. నిజమేనా?

జ: నేను వైష్ణవ భక్తులలా 108 దివ్యదేశాల యాత్ర చెయ్యలేదు. కాని నవలలో ప్రస్థావించిన ప్రదేశాలను సందర్శించే అదృష్టం కలిగిన జీవిని. హృదయంతో చూసినవి నవలలో వాడినందుకు మీకు, చదువరులకూ అనుభూతులు ఎంతో ప్రత్యేకంగా అనిపించి ఉండవచ్చు.

ప్రశ్న 11. ఆధ్యాత్మిక సాధనా బాటలో నడిచే వారికి గురువు మీద గురి కుదరడం అత్యవసరం. అలా గురి కుదరడం కఠిన పరీక్షల అనంతరమే సాధ్యమవుతుందా?

జ: గురువును నమ్మకపోతే పోయేది ఈ శిష్యపరమాణువులే తప్ప గురువులకు నష్టం లేదు కదా.

గురువు మీద గురి కుదరటం, కఠిన పరీక్షలన్నవి అందరికీ అలాగే జరగవలసిన పని లేదు. వారి వారి కర్మలను బట్టి ఉంటుంది. కర్మ పక్వానికి రాకపోతే జనన మరణ చఠ్రంలో జీవుడు కొట్టుకుపోవలసినదే కదా.

ప్రశ్న 12. నవల లోని నాయకుడు రాఘవ లాంటి వ్యక్తి/వ్యక్తులు మీకు నిజ జీవితంలో తారసపడ్డారా? లేక ఈ పాత్ర పూర్తిగా కల్పితమా?

జ: తారసపడ్డారు. అంటే అంతా అలా కాదు.. కొంత కొంతగా.. అయినా మార్ప సహజం.

మా చిన్నప్పుడు మేము తెలంగాణాలో మారుమూల పెరిగాము. అక్కడ అన్నలంటే చాలా క్రేజ్ ఉండేది. మా చదువుకునే రోజులలో శ్రీశ్రీ అంటే అదో గొప్ప.

మరి నేడు మా పరిధి పెంచుకొని ఈ జన్మ ఏంటి? నేనేంటి? అన్న ఆలోచనలు కలిగాయి కదా. అంటే జీవితంలో మార్పు సహజం. ఆ మార్పు దైవత్వం వైపుగా సాగటమే మనం చూసుకోవాలి.

ప్రశ్న 13. నవలలో మరో ముఖ్యమైన పాత్ర రాజన్న. ఋషితుల్యులు. రాజన్న ప్రస్తావనలు, సంభాషణలు చాలా చక్కగా కుదిరాయి. ఆ పాత్ర స్వభావాన్ని అనుసరించే, నవలలో అంతగా హైలైట్ చేయలేదనిపించింది. రాజన్న/రాఘవ పాత్రలలో మీకు ఏది బాగా నచ్చింది?

జ: రాజన్న ఒక గొప్ప ఋషితుల్యుడు. మాటలు చెప్పలేని మౌనంతో అటువంటి వారిని గురించి తెలుసుకోవాలి.

రాఘవ తన జీవిత ప్రస్థానంలో చాలా తక్కువగా చూసిన వ్యక్తి, హిమాలయాలంత ఉన్నతంగా అగుపించటమే ఆ పాత్ర ఏమిటో చదువరులకు అర్థం అవుతుంది.

గొప్ప ఉపాసకులు, సాధకులు మాటలతో తమ శక్తిని వృథా చేసుకోరు.

సాధకులుగా జీవించటము అత్యంత కష్టమైన జీవన విధానం.

మీకర్థమయ్యే ఉంటుంది ప్రశ్నలో రెండవభాగానికి సమాధానం.

ప్రశ్న 14. మీ ఇతర రచనలు – కార్తీకంలో కాశీయాత్ర, సత్యాన్వేషణ, భారతీయ యోగులు, నమామి దేవి నర్మదే – కంటే భిన్నమైన ఈ ఆధ్యాత్మిక నవలను ఎలా ప్రమోట్ చేస్తున్నారు? వాటిల్లోనూ, ఈ నవలలోనూ ప్రధాన అంశం ఆధ్యాత్మికతే అయినా, ఇది నవల కావడం వల్ల కల్పనకి కాస్త అవకాశం ఉంది కదా. పాఠకుల ఆదరణ పొందుతుందని భావిస్తున్నారా?

జ: ఇప్పటి వరకూ ఏ రచననూ ప్రమోట్ చేసుకోలేదు. జగదంబ వ్రాయించినవి తప్ప ఈ ఉపాధి గొప్ప కాదు. కాబట్టి ప్రమోషను అంటూ ఇంత వరకూ చెయ్యలేదు. కాబట్టి దీనికీ దారి అదే కనపడుతుంది.

పుస్తకం ప్రింటులో సహాయం చేసిన మా పబ్లిషరు కూడా మార్కెటు చెయ్యమని ఎన్నో సలహాలిస్తారు. ఎందరో పంపే మెయిల్స్‌ను పబ్లిష్ చెయ్యమని సలహా చెబుతారు. కాని అవి నా మటుకు నాకు తప్పనిపిస్తుంది.

అయినా పాఠకులు సంచికలో వచ్చినప్పుడు ఆదరించారు. ఇప్పుడు నవలగా కూడా వారు ఆదరిస్తారని నమ్మకం.

ప్రశ్న 15. మీ పుస్తకాల విక్రయాల ద్వారా లభించే మొత్తాన్ని మీరు సేవాకార్యక్రమాలకో, ఆధాత్మిక సంస్థల కోసమే వినియోగిస్తారు. ఈ పుస్తకం విషయంలో ఏదైనా ప్రత్యేక లక్ష్యం ఉందా?

జ: ప్రత్యేకంగా దీనికీ అని ఏమీ అనుకోలేదండి. కాని మా పూజ్యగురుదేవుల ఎన్నో సేవాకార్యక్రమాలకు పంచుకోవటం జరుగుతుంది. ఎందుకంటే పుస్తకం జగదంబ స్వరూపం. ఆమె దాని ద్వారా ధనమిస్తున్నదే అది సమాజానికి పనికిరావాలన్నది ఒక ఆలోచన. అదే బాటలో సాగటమే.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు సంధ్య గారు.

సంధ్యా యల్లాప్రగడ: కృతజ్ఞతలండి!!

***

కైంకర్యము (నవల)
రచన: సంధ్యా యల్లాప్రగడ
ప్రచురణ: అచ్చంగా తెలుగు
పేజీలు: 220
వెల: ₹ 200/-
ప్రతులకు:
అచ్చంగా తెలుగు, 8558899478 (వాట్సప్ మాత్రమే)
https://books.acchamgatelugu.com/product/kainkaryam/
https://www.amazon.in/dp/B0CJZ11PCL/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here