శ్రవ్య కావ్యేతివృత్తము

0
7

[box type=’note’ fontsize=’16’] “కథ నాశ్రయించి రససిద్ధి కలుగుచున్నది, మహాకావ్యము కూడ రసము నాశ్రయించి యున్నది. కథా నిర్మాణదక్షులైన వారికే మహా కావ్యనిర్మాణచణత్వము కల్గుచున్నది. వారే రస సిద్ధులు. మహాకవులు” అంటున్నారు శ్రీ కోవెల సుప్రసన్నాచార్య ఈ వ్యాసంలో. [/box]

[dropcap]మ[/dropcap]హాకావ్యమునందున్న యితివృత్త మీవిధముగా నుండవలయునన్న విషయము ప్రాచ్యాలంకారికులు చేయలేదు. కావ్యాంగములలో సూక్ష్మసూక్ష్మములైన విషయములను వివరించుటయందు జాగరూకత వహించి కృత్యాది నుండి భరత వాక్యము దాక సర్వ విషయముల నిరూపించినవారు దీనినిగూర్చి యంత స్పష్టముగా చెప్పకపోవుట యాశ్చర్యముగానే గోచరించును.

కవికి కావ్యము నిర్వహించుటకు కథ ప్రధానమైనది. కథలోని ప్రధానమైన పాత్రల నాశ్రయించియే రసభావాదులు కలుగును. కవి స్వీకరించిన యొకానొక కథ తాను చెప్పబోవు మహావిషయమున కనుగుణముగా ప్రవృత్తమగుచుండును. ఈ మహా విషయాభిముఖముగా కవి తన కావ్యమునందలి సర్వ సంఘటనలను కల్పించును. పాత్రల మనోవృత్తులను తీర్చును. కావ్యవ్యంగ్యముగా తన చెప్పదలచిన దానిని భాసింపజేయును.

ఊరక కావ్యము వ్రాయుటలో నర్థములేదు. యధేచ్ఛగా తనకు దోచిన విషయముల నల్లు కొనుచుబోయినచో నెంతయేని వ్రాయవచ్చును. త్రాడు బొంగరము లేని యా సంఘటనా మంజరిని కలగూరగంప యనగలము కాని కావ్యమనలేము. అందువల్లననే యొకానొక మహాధర్మమును వ్యంజకముగా జేయుట కొరకు తదనుగుణమైన వస్తువును కవి యెన్నుకొని తదనుగుణమైన కల్పనచేసి కథను కుదించి, పెంచి కావ్యముగా తీర్చును. అందువలన కథాస్వరూప మిట్లుండవలయునని నిరూపించుటలో నంతగా సార్ధక్యము లేదని యాలంకారికులు భావించియుండవచ్చును. కథ యొక్క యంగ ప్రత్యంగములు నిరూపింపబడినప్పుడు కవి తదనుగుణముగా రచియించిన నా కావ్యమును యథాపూర్వ నిర్మాణమై కవి యొక్క ప్రతీభా పూర్వకమైన నిర్మాణదక్షత్వము నరికట్టును.

ఒకానొక విషయమును ప్రతిపాదించుటకు చేయబడిన రచనాస్వరూపము వేరొక విషయమును ప్రపంచించుటకు చేయబడిన రచనా స్వరూపముతో భేదించును. ఆధునిక కాలమునందు కథాప్రధానములై వెలయుచున్న నవలల యొక్క రచనాస్వరూప మిట్టిదని చెప్పుటకు వీలు లేకుండ నవ నవముగా రోజు రోజున కభివృద్ది పొందుచున్నది, ఒకానొక ప్రతిభావంతుడైన రచయిత తత్పూర్వమున్న నవలల నిర్మాణ మార్యమునకు భిన్నముగా వేరొక మార్గమును దొక్కుచున్నాడు. ఈ విషయము నెరింగిన వారగుటచేత కాబోలును కావ్యాలంకార శాస్త్రజ్ఞులు నాయకాది విషయములు, రస భావాదుల విషయములు విపులముగా చర్చించియు కథా విషయమును కవి యొక్క స్వేచ్ఛకే వదలివేసిరి.

“ఇతివృత్తంతు కావ్యస్య శరీరం పరికీర్తితం” అన్న భరతుడు కూడ కావ్యము యొక్క యీ కథా శరీర లక్షణము నెరిగినవాడే. ఏ ఉద్దేశ్యముతో నిర్మించినను కథ తదనుగుణమైన యాకారము తాల్చును. కుంభకారుడు కుండల నొనర్చునప్పుడు తచ్చరీరమును దానియొక్క ప్రయోజనమున కనుగుణముగా బానగా, కడవగా, కూజాగా, మూకుడుగా నిర్మించును. ఈ నిర్మాణమునందలి శక్తి చాల యవసరము. లేనిచో దాని ప్రయోజనము దెబ్బతినును. శరీరము జీవుని ప్రవృత్తికి సాధనమైనట్లు కావ్యకారుని ప్రయోజనమునకు కథ సాధనమగు చున్నది – ఉపకరణ మగుచున్నది.

అందువలననే సంస్కృతభాష యందు కవులు తమ కావ్యముల యందలి కథను స్వేచ్ఛగా తీర్చుకొనిరి. కాళిదాస విరచితములైన రఘువంశ, కుమార సంభవములే ఒక దానినొకటి పోలక కథా రచనమునందు భిన్నతను వ్యక్తము చేయుచున్నవి. మాఘుని కృతియు, భారవి కృతియు నిట్లే కథావిషయమున తమ స్వేచ్ఛను వెల్లడించుచున్నది. శ్రీ హర్షుని నైషధీయ చరితము సాగిన మార్గము వేరు.

రఘువంశము సూర్యప్రభవమైన వంశము యొక్క వైభవమును వర్ణించునట్టిది. వంశవైభవము వర్ణించు కావ్యము నందా వంశము యొక్క ప్రత్యేకములైన సుగుణములను వర్ణింపవలయును. సర్వ జగన్నాధుడైన శ్రీ రామచంద్రు డవతరించిన వంశమది. సేవ, దానము, గాఢ శీలత్వములు వారి గుణములు. అజదిలీపరఘురామాదులు వానికి ప్రతీకలు. ఒక్కొక్క గుణము నొక్కొక్క రాజచరితము నందు ప్రజ్వలించును. తన జీవితమునెల్లయు నా ధర్మము కొరకే యా మహారాజు వెచ్చించును. వీరందరకు సామాన్యమైన ధర్మము లుండనే యున్నవి. “శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయై షిణాం, వార్ధకే మునివృత్తీనాం యోగేనాన్తే తను త్యజాం”.

శిష్ట రక్షణ, ఆశ్రితపోషణ, దుష్ట శిక్షణ మొదలైనవి వారి యాదర్శములు. వాని నా మహారాజులు తప్పలేదు. వేదములందున్న యీ మహాదర్శముల యొక్క దీపమాలికవలె వారి వంశము వెలిగినది. ఈ మహా ధర్మసంపుటి వ్యంగ్యముగా కథయందు భాసింపజేయుటకు నిట్టి కావ్యమును కాళిదాసు రచించియున్నాడు. ఒక మహారాజునందే యిన్ని విషయములు ప్రకాశించినట్లు చెప్పుటకు వీలు లేదు. ఎవ్వని జీవితమేనియు నేది యేనొక పరమార్గాభిముఖముగా సంచరించును. “రామో విగ్రహవాన్ ధర్మః” యన్నను శ్రీరాముని జీవితములో త్యాగమన్నది పరమార్థము, ఆతని జీవితమునందు సర్వేతర ధర్మములు ఈ ప్రధానమైన త్యాగమున్న ధర్మమున కొదిగియుండును. ప్రధానములైన వేదధర్మముల యొక్క ప్రవృత్తిని జీవితమునందు చూపదలచిన కవి రఘువంశము వంటి కథామాలగల మహాకావ్యమునే రచించును.

అతని వేరొక కావ్యము కుమారసంభవము, దీనియందు ధర్మముల యొక్క ప్రతిపాదన యుద్ధిష్టము కాదు. జీవునిలోని ప్రధానమైన కామప్రవృత్తి యొక్క వ్యాఖ్యానము ముఖ్యమైనది. పరమేశ్వరునిదే ఈ కామము. ఇది సృష్ట్యభిముఖమైనది. “సో కామయత” యన్న శ్రుతికి వ్యాఖ్యానము. ఆనందమయమైన బ్రహ్మమునందు సంకల్పము కలుగుటతోడనే సృష్టి కలుగుచున్నది. ఈ సృష్టి యా సంకల్పమునకు కలిగిన ఫలము. ఈ సంకల్పమునే -కామము లేక వాంఛ యనవచ్చును. మాయ యనగా నిదియే. ప్రకృతి యన్న నిదియే. ఈ ప్రకృతి పరమేశ్వరుని సంయోగముపొంది సృష్టిగా పరివర్తనము చెందినది. ప్రకృతి యొక్క స్వరూపమే పార్వతి. అందువలసనే కాళిదాసు కావ్యమునకు పార్వతీపరిణయమని పేరు పెట్టలేదు. కుమారసంభవ మనెను. ఈ కుమారుడు సృష్టి యొక్క స్వరూపము. ఈ కామమునకు ఫలము సృష్టి, అది కలుగుటును సూచించి కావ్యమును ముగించినాడు కాళిదాసు. ఈ కామఫలమైన సృష్టి యొక్క విలాసము చెప్పుట కవి యొక్క సంకల్పము కాదు. అందువలననే కుమారస్వామి చరిత్రను చెప్పలేదు. ఈ యుద్దేశ్యము కలవాడు కావుననే కవికులగురువు భగవంతుని సురతమును వర్ణించినాడు. దానియందలి యౌచిత్య మెరుగని కవులు గతానుగతికముగా కావ్యమునందు శృంగారరసమును పేర సంభోగాదులను వర్ణించుచు వచ్చిరి.

కావ్యస్వరూపము కవియొక్క యుద్దేశ్యము ననుసరించి యుండవలయునని యన్నది, యొక్క కాళిదాసునే కాదు, భారవ్యాదుల కావ్యములను పరిశీలించియు దీనిని నిరూపించుకొనవచ్చును. కావ్యనిర్వహణ మింత క్లిష్టమైనది. కత్తి వాదర మీద నడచుట వంటిది. కవి ప్రతిభ ననుసరించి ఎట్టి స్వరూపమైనను తాల్చగలట్టిది.

సంస్కృత నాటకకర్తలకీ విషయము బాగుగా తెలియును. స్వీకరించిన దొకే యితివృత్తమైనను వారీ కావ్య ప్రయోజనము నుద్దేశ్యమును చెడకుండ కథను నిర్మించిరి. ఆ నాటకములలోని కథల నా మార్గమున భావన చేయవలయును. మహావీరచరితమునకు, నసర రాఘవమునకు, ప్రసన్నరాఘవము నకు, బాలరామాయణమునకు గథా దృష్టితో చూచినచో ననంతమైన భేదము గోచరించును. ఒక్కొక్క నాటకములో నొక సంఘటనకు నొక ప్రవృత్తికి ప్రాధాన్య ముండును. ఇది తారతమ్య పరిశీలనముచేతగాని తెలియరాదు.

కావ్యమునం దంగిరసమును పోషించుట కొరకు తదనుగుణమైన పాత్రల ప్రవృత్తి యేర్పడును. మహావీరుడైన రాముడొకచో మహోదారుడైన రాముడొకచో మహాదుఃఖశీలియైన రాముడొకచో ఆ యా నాటకము లనుసరించి గోచరించును.

ఈ పాత్రల ప్రవృత్తి రసాభిముఖముగా ప్రసరించును. ఈ ప్రవృత్తి తత్పాత్ర యొక్క స్వస్థికి భంగము కల్గించనంతవరకు మారవచ్చును. నిజముగా నిది మార్పుకాదు. ఆ విధముగా నొదిగి పోవుట. తక్కిన గుణములు ప్రధానములు కాకపోవచ్చును. కాని వాల్మీకి చిత్రించిన రామునికన్న విశిష్టముగా నుండవలసిన రాముడు, తద్వ్యతిరేకముగా నుండరాదు. పురాణగాథలకు సవీన వ్యాఖ్యానములను పేర నీకాలమందు దుష్టములు, రసభావ హీనములైన రచనలు వచ్చుచున్నవి. వానియందు రామాదులు సంపూర్ణముగా స్వప్రవృత్తికి వ్యతిరేకముగా నుందురు. పాఠకుల మనస్సులో సుపరిచితములైన రామాదులకు భిన్నములుగా నీ మూర్తులు ప్రవర్తించినప్పుడు బింబప్రతిబింబముల యందలి వైరుధ్యము వలన నది చమత్కారముగా, హాస్యముగా భాసించును. ఒక్కొక్కచో జుగుప్సను కల్గించును.

పరిశీలింపగా కావ్యమునందు కథ ఈ విధముగా నుండ వలయునని యాలంకారికులు నిర్ణయింపలేదు. ఏల యనగా కావ్యము యొక్క పరిధి నాటకాదులకన్న చాల విశాలమైనది. కాని పురాణములయంత విశాలమైనది కాదు. పురాణములు మిత్రోపదేశములు. రసభావాదుల యనుభూతి వీనియందు కలుగుట దుర్లభము. మనకున్న రెండితిహాసములును గొప్ప కావ్యములే. వానిని వస్తువు ననుసరించి యొక పరిధిలో నొదిగించుట కష్టమే. ముఖ్యముగా మహాభారతమునందీ చిక్కున్నది.

ఐనను కావ్యమునందలి యితివృత్తమునను దృశ్యకావ్యములందు నితివృత్తమును గూర్చి చేసిన విభాగమునే పాటింప వలయునని కొందఱు భావించుచున్నారు. రసాది సిద్ధాంతములు తొలుత రూపమునకు చెందినవే యనియు వానిని తరువాత నాటకమున కన్వయించిరని యట్లే కావ్యవస్తు విషయము నందు కూడ నాటక వస్తు విషయమునే పాటింపవలయునని దీనియందును నాటకసంధులన్నియు నుండునని సాహిత్య దర్పణమునందు చెప్పబడి యున్నది –

”సర్గ బంధో మహాకావ్యం తత్రైకో నాయక స్సురః”
సద్వంశః క్షత్రియో వాపి ధీరోదాత్త గుణాన్వితః,
ఏకవంశ భవాభూపాః కులజా బహవోపివా॥
శృంగార వీర శాంతానా మేకాంగీ రస ఇష్యతే
అంగాని సర్వేపిరసాః సర్వే నాటక సంధయః॥
ఇతి హాసోద్భవం వృత్త మన్యద్వా సజ్జ నాశ్రయమ్
చత్వారస్త స్యవర్గాః స్యుః తేష్వేకంచ ఫలం భవేత్”
‘సాహిత్య దర్పణమ్’.

– దీని ననుసరించినపుడు నాటకమునందలి పంచ సంధులు కావ్వమునందు గోచరింపవలయునని తెలియును. ఇతివృత్తమును గూర్చి ఇతిహాసోద్భవముకాని సజ్జనాశ్రయముకాని యని చెప్పబడినది. అనగా కావ్యేతివృత్తము ప్రసిద్ధము కావచ్చును. గ్రధితము కాకపోయినను ప్రజల యందు వాడుకలో నున్నది కావచ్చును. సజ్జనాశ్రయ మన్నప్పుడు సజ్జనులయందున్న కథ యనియేగాక సజ్జనుని గూర్చిన కథ యని చెప్పవచ్చును. ఈ రెండవ పక్షమున కల్పితేతివృత్తము కూడ సజ్జననాయకమైనచో కావ్యము నందుండవచ్చునని చెప్పవచ్చును. ఈ మాటకే చారిత్రకేతివృత్తమని కూడ చెప్పవచ్చును. అనగా విశ్వనాథుడు ఈ రెండు విధములే యితివృత్తమని చెప్పినను దానిని నాలుగు విధములుగా విభాగింపవచ్చును. ఒకటి ఇతిహాసోద్భవము కుమార సంభవాదులవంటిది, రెండు పరంపరలుగా కథలుగా వచ్చునది. ఉదయ నోదయమువలె, మూడు కల్పితమైనది, కాదంబర్యాదుల వలె; నాలుగు చారిత్రకమైనది హర్షవర్ధన రాజవర్ధ నాదుల చరిత్రలవలె. ఈ విధముగా కావ్యేతివృత్త ముండవచ్చునని మనము భావింపవచ్చును.

ఈ ఇతివృత్త విభాగము భరతుని నాడే ఉన్నట్లున్నది. ఆనాడు నాటకముల గూర్చి చెప్పునప్పుడు ప్రఖ్యాతమైన యితివృత్తమును వాడవలయునని చెప్పెను. ఆహార్యమైన యితివృత్తమని మరియొక చోట కలదు. ఇచ్చట ‘అహరింప దగినది’ అనగా నుత్పాద్యమని యర్థము చెప్పవలయును.

భామహు డిట్లు వ్రాసెను –

“వృత్త దేవాది చరిత శంసి చోత్వాద్య వస్తు చ
కలా శాస్త్రాశ్రయం చేతి చతుర్థాభిద్యతే పునః” 1-17.

– దీనియందు కలాశాస్త్రాశ్రయమైన కావ్యవిభాగము కేవల శాస్త్ర రచనకు సంబంధించినది. ఇతివృత్త సంబంధమైన విభాగము మాత్రము వృత్తదేవాది చరితశంసి (ప్రఖ్యాతము)యు, నుత్పాద్యమును ప్రస్తావించినాడు. కావ్యాదర్శమునందు దండి యభిప్రాయ మిదియే.

ఇతిహాస, కథోద్భూత మితరద్వా పదాశ్రయమ్
చతుర్వర్గ ఫలాయత్తం చతురోదాత్త నాయకమ్. 1-15
సర్వత్ర భిన్నవృత్తాంతై రుపేతమ్ జనరంజనమ్
కావ్యం కల్పాంతరస్థాయి జాయేత సదలంకృతి

ఇచ్చట కూడ సాహిత్య దర్పణమున కవిరుద్ధముగా చెప్పబడి యున్నది. ఇచ్చట మిశ్రకథా భేదము స్పష్టముగా చెప్పబడలేదు.

భోజుడు కావ్యేతి వృత్తమును తానైదు భాగములుగా విభాగించెను. ఈ విభాగము చాల సూక్ష్మముగా చేయబడినట్లున్నది. సాహిత్య దర్పణములో సందిగ్ధముగానున్న విషయము లిందు స్పష్టముగా గోచరించుచున్నవి.

“కథా శరీర సంవిధాన భేదాః పంచ, ఇతిహాసాశ్రయమ్ కథాశ్రయమ్, ఉత్పాద్యేతివృత్తమ్, అనుత్పాద్యేతివృత్తమ్, ప్రతి సంస్కార్యేతివృత్త మితి-1 ఇతిహాసాశ్రయమ్ ఆ వృత్త దేవాది చరిత సంశ్రితతా ఇతిహాసాశ్రయమ్, యథా కుమార సంభవః. హయగ్రీవ వధాదయఃతే ఐతిహాసికం చరిత మానేదయంతిః కథాశ్రయమ్; బృహత్కధాది ప్రతిపన్నప్రఖ్యాతోదాత్త నాయక చరిత విషయమపి మహాకావ్యాదేః ప్రబంధ స్యాభిదత్యే యథా వత్సేశ్వరచరితమ్. ఉదయనోదయః, ఉత్పాద్యేతివృత్తమ్ కవి మనీషా ప్రకల్పిత చతుర్వర్గా వబోధ హేతు ర్ధివ్యాదిచరితమ్! కవిర్భూతే యథా చంద్రాపీడ పుండరీకాది చరితమ్! అనుత్పా ద్యేతివృత్తమ్ యథావగత వర్తమానాతీత మహారాజాది వృత్త వర్ణన విషయతా మస్యాం ఆచష్టే యథాహర్షవర్థన రాజవర్ధనాది చరితమ్ హర్ష చరితే, ప్రతిసంస్కార్యేతివృత్తమ్ ఇతిహాసేషు యథాస్థిత వస్తు నిబంధనే న్యాయ ప్రవృత్తే రవ్యఫల వత్త్వ మనిష్టావాప్తి ఫలత్వం చ దృశ్యతే అన్యధా యత్పవృత్తే రపి ఫల యోగ్యావధార్యతే యత్రయత్ర ప్రతి సంస్కార విధేయః యథా శాకుంతలాది ప్రతిసంస్కారః”

(శ్రీ మానవల్లి వారి నాట్యకోశము నుండి)

భోజుడు చెప్పిన యంత విస్తృతమైన కధానిభాగము ఆలంకారికులలో మరియెవ్వరును చేసినట్లు లేదు. ఈ మార్గము ననుసరించి చూచినప్పుడు కావ్యేతివృత మైదు విధములుగా గోచరించుచున్నది. విశ్వనాథుని నిర్వచనమున మన మూహించిన నాలుగు భేదములేకాక, ప్రతి సంస్కార్యేతివృత్తమను క్రొత్త విభాగము గోచరించుచున్నది.

పూర్వ కథ యుండనే యున్నది. కాని దానిని రసానుభవమునకు తగినట్లు సంస్కరింపవలయును. కల్పనలు చేయవలయును. అచ్చటచ్చట కొంత కొంత పరిత్యజింపవలయును. అందువలన ప్రతి సంస్కార్యేతివృత్తము పుట్టుచున్నది.

ఇతివృత్తమును రెండు విధములుగా విభజించినది విశ్వనాథుడు. ఐదుగా విభజించినది భోజుడు. ఈ రెండు విభాగములు పరస్పర విరుద్ధములైనవి కావు. మరియు ఒకదానియం దొకటి యేకీభవించును.

ఈ కథానిర్మాణమునం దౌచిత్యమునకు నధికమైన ప్రాధాన్యమున్నది. ఔచిత్య సహితమైనప్పు డేవిధముగా కథ నిర్మించుకొన్నను బాధ లేదు.

ఒక్కొక్క కధ నిర్మించునప్పుడు దానికి సంబంధించిన జాగ్రత్త యెంతయో యవసరము. తత్సంబంధములైన శిల్ప మర్యాదల నెరిగి కవిత్వనిర్మాణము కావింపవలయును. ఆనంద వర్ధనుడు ప్రబంధగతమైన ధ్వనిని గూర్చి చెప్పినప్పుడి విషయమును చర్చించియున్నాడు. ఈ ప్రబంధనిర్మాణము చాల క్లిష్టమైనది. ఈ కథాశరీరము విభావానుభావ సంచార్యౌచిత్య చారువు. ఈ కథాశరీరము ప్రఖ్యాతముగానీ కల్పితముగాని (ఉత్ప్రేక్షితము) కావచ్చును. ప్రఖ్యాత కథలో మార్పులు చేయవచ్చునని కూడ యాతడుద్దేశించెను.

ఇతివృత్త వశాయాతాం త్యక్త్వా ననుగుణాంస్థితమ్
ఉత్ప్రేక్ష్యాస్యంతరాభీష్ట రసోచిత కథోన్నయః (ధ్వ న్యా 3-11)

కథ ప్రఖ్యాతమైనప్పటికిని అననుగుణమైన దానిని పరిత్యజించి నడుమ నడుమ రసానుకూలమైన క్రొత్త కల్పనలు కూడ చేయవచ్చును. ఈ శ్లోకము వలన నాతడు మిశ్ర కథను కూడ అంగీకరించినట్లు గోచరించును. ఈ మిశ్ర కథయందు రసవిరోధములైన కల్పన లాతడంగీకరింపలేదు.

సన్తి సిద్ధరస ప్రఖ్యా యేచ రామాయణాదయః
కథాశ్రయా న తైర్యోజ్యా స్వేచ్ఛా రసవిరోధినీ.

ఈ రెండు శ్లోకముల వలన మిశ్రకథ యొక్క తత్త్వమును పూర్ణముగా వివరించినట్లైనది. పూర్వాలంకారికులు కారణమేమో తెలియదుకాని మిశ్ర కథ యని యంగీకరించనే లేదు. విడిగా ప్రఖ్యాతమును గూర్చి చెప్పునప్పుడే రసోచితము లైన కల్పనల నంగీకరించినారు. దానినే రామరాజ భూషణుడు మిశ్రకథ యని వేరుగా ప్రతిపాదించియున్నాడు.

సిద్ధ వస్తు నిర్మాణము కూడ జాగ్రత్తగా చేయవలసిదనది. రామాయణాదులు రససిద్ధములు, రసవిరోధములైన కల్పనలు చేయరాదు. “కథా శరీర ముత్పాద్య వస్తు కార్యం తథా తథా యథారసమయం సర్వమేవ తత్ప్రతిభాసతే” యన్న శ్లోకమునందు కల్పితమైన కథయందు కూడ తన్నిర్మాణము కావ్యమును సర్వమును రసమయముగ భావించుట కనుకూలముగా నుండవలయునని చెప్పబడినది.

ఈ సర్వమైన కల్పనయు ఔచిత్యము నాశ్రయించి చేయబడవలయును, అందువలననే “అనౌచిత్యా దృతే నాన్యద్ర సభంగస్య కారణమ్” అనుట.

కేవలము శాస్త్రము కొఱకు కాక కావ్యమునందు సంధి సంధ్యంగఘటనము రసాభివ్యక్త్యపేక్షయా చేయబడవలయును (తృతీయ ఉద్యోతము 12 వ కారిక). కావ్యము యొక్క నిర్మాణము సర్వాంగసుందరముగా నుండుటకొరకే యీ సంధి సంధ్యంగఘటన ముద్దిష్టమైనది.

ధ్వాన్యాలోకము కావ్యము యొక్క వృత్తమును తీర్చుటకు కవికి “స్వేచ్ఛ నెక్కువగా కల్పించినది.

దశ రూపకమునందిట్లున్నది –

ప్రఖ్యాతోత్పాద్య మిశ్రత్వ భేదాత్ త్రేధాపి తత్రిధా
ప్రఖ్యాత మితహాసాదే రుత్పాద్యం కవికల్పితమ్
మిశ్రయం సంకరాత్తా భ్యాం దివ్య మర్త్యాది భేదతః

– ఈ వాక్యము ననుసరించి ప్రఖ్యాతోత్పాద్యములతోబాటు మిశ్ర భేదమును గూడ దశరూపకకారు డంగీకరించినట్లు తెలియవలయును.

ఈ విషయము లన్నియు చక్కగా పరిశీలించి రామరాజు భూషణుడు కావ్యేతివృత్తమును మూడు భాగములుగా నొనరించియున్నాడు. ఈ విభాగము భోజుని విభాగమంత విస్తృతము కాకున్నను స్పష్టముగా సరిహద్దులు గీచినట్లు గోచరించుచున్నది.

కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నమ, లాద్య సత్కధల్
వావిరి పుట్టు రత్నము, లవారిత సత్కవి కల్పనా విభూ
షావహ పూర్వవృత్తములు సానలు దీర్చిన జాతి రత్నముల్,
కావున నిట్టి మిశ్రకథగా నొనరింపుము నేర్పు బెంపునన్.
వసు 1. 19

కావ్యేతివృత్తము, ఆద్యసత్కథలు, కేవల కల్పనా కథలు, మిశ్రకథలు (కల్పన విభూషావహ పూర్వ వృత్తములు) అని మూడు విధములు. కల్పనా కథలన్నవి భోజుని విభాగమున నుత్పాద్యేతి వృత్తములు, ఆద్యసత్కథలు ఇతిహాసాశ్రయములు, కల్పనా విభూషావహ పూర్వ వృత్తములన్నవి ప్రతి సంస్కార్యేతి వృత్తములు. (వీనినే మిశ్ర కథలని చెప్పవచ్చును) ఈ విధముగా చేయబడిన ఈ విభాగమునందు కథాశ్రయములు, అనుత్పాద్యము లన్న భోజుని విభాగములు చేరలేదు. కాని ఈ విభాగము లాద్య పత్కథలన్న మాటలో చేరును. ఆద్యసత్కధలనగా కేవల మితిహాసపురాణకథాశ్రయము లనకపోవుటవలన బృహత్కథాది ప్రఖ్యాతకథలు దీనియందంతర్బవించును. అంతేకాక హర్షవర్ధనాది మహారాజులచరిత్రము కూడ చేరును. దీనినే మనము ప్రఖ్యాత మనవచ్చును. కల్పనా విభూషావహ పూర్వవృత్తముల మిశ్ర కథలని యాతడే చెప్పెను. ఈ విధముగా నాతని విభాగము ప్రఖ్యాతము, కల్పితము, మిశ్రమునని మూడు విధములుగా తేలుచున్నది. ఇది దశరూపకకారుని నిర్ణయముతో సంప్రతించుచున్నది.

దీనివలన భోజుని విభాగమునందు రామరాజభూషణణుని విభాగ మెట్లంతర్భవించునో తెలియవచ్చును. ఇంకొక విషయము. ప్రఖ్యాతమునందు ఇతిహాసాశ్రయాదులైన మూడు విభాగము లెట్లు చేరుచున్నవో, నివి మూడును ప్రతి సంస్కారము నొందినప్పుడు మిశ్ర కథలలో చేరుచున్నవి. ప్రఖ్యాతము నందు సంస్కారము లేదు. దీనియందు సంస్కారమున్నది. ఇదియే ప్రధాన భేదము.

ఈ ప్రఖ్యాతేతివృత్తము రామాయణాదులం దున్నటు యథాస్థితముగా కవులచే స్వీకరింపబడుచున్నది. కవులు తమతమ శక్తి ననుసరించి దానియందు రసభావాదుల కల్పనము చేయుచున్నారు. మూకథ యందలి సంఘటనముల కవిరుద్ధముగా పాత్రల యొక్క ప్రవృత్తి నేర్పరచుచుందురు. వేణీసంహారమున దుర్యోధనుడు భానుమతితో సంభాషించిన ఘట్టమున్నది. అది భారతమున లేకపోవచ్చును. కాని భారతమునకీ సంఘటనము విరుద్ధము కాదు. దానియందు చెప్పబడిన వాని కీ విషయము ప్రతిరోధకము కాలేదు. కాని కావ్యమునందు రస భావముల పోషించుటకొరకు కవి యిట్లు సంఘటన సమకూర్చుచుండును. కుమారసంభవమునందలి రతీవిలాపము కాళిదాసు కల్పించినదే. భర్తృవియోగ మెంత దుస్సహమైనదో తజ్జీవికాజీవయైన భార్య దుఃఖ మెట్టిదో, పరమేశ్వరు డెంత కరుణామయుడో చూపించుట కీ విషయము విస్తరింపబడినది. ఈ సంఘటనలు, ఈ భావములు పురాణేతిహాసములకు విరుద్ధములు కావు. ప్రఖ్యాత వస్తు కావ్యమునందు కవి యొక్క కల్పనము రసభావముల ననుసరించి పురాణాదుల కిట్లో దిగి యుండును. ప్రఖ్యాతమనగా కేవల కల్పనాహినముగా భావింపరాదు. ఆద్య సత్కధలు వావిరిపుట్టు రత్నములని వీనినే రామరాజభూషణుడు పేర్కొనెను. ఈ కథలు సానలు దీర్చని పుట్టు రత్నముల వంటివి. కవి మనుచరిత్రమును ఈ జాతికి చెందిన కావ్యముగా భావించి యుండును. దానిలోని కథ యంతయు మార్కండేయ పురాణము లోనిదే. దానిలోనున్న కల్పనములు తద్రత్నమును సానబట్టలేదా యని యడుగవచ్చును. కాని రామరాజ భూషణుడు దానియందలి కల్పనలతో తృప్తి చెంది యుండకపోవచ్చును. ఇంక నధికమైన కల్పనల ద్వారా దానిని మరియు రమ్యముగా నొనరింప వలయునని భావించియుండును. అందువలననే వానిని సొనలు దీర్చని రత్నము లనుట.

కేవల కల్పనా కథలు కృత్రిమరత్నములని యాత డధిక్షేపించెను. ఈ విషయము కళాపూర్ణోదయమును దృష్టిలో యుంచుకొని యొనర్చినదనీ విమర్శకులు భావించుచున్నారు. కళాపూర్ణోదయములోని కథ ‘కేవలము కల్పితము కాదనియు, లింగపురాణమునందు దాని యందలి నారద తుంబుర సంగీత స్పర యంతయు కలదని బ్రహ్మశ్రీ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి గారు (భారతి, డిసెంబరు 1941) వెల్లడించి యున్నారు. ఈ విధముగా చూచినను ప్రధానమైన కళాపూర్ణ, కలభాషిణి వృత్తాంతములు కల్పితములనక తప్పదు.

కేవల కల్పనాకథలు కృత్రిమరత్నము లనుటలో అలంకారశాస్త్ర సంబంధమైన విషయమొకటి యున్నది. పాఠకునకు ప్రేక్షకునకు మనస్సులో పూర్వ వాఙ్మయముతో -కథలతో, పురాణాదులతో – గల పరిచయము వాసనారూపముగా నుండును. నిత్యపరిచయము వలన సీతారామాదులు, శకుంతలా దుష్యంతులు కేవల నామశ్రవణమునందే స్వస్వరూపములతో సాక్షాత్కరింతురు. మనస్సులో మెలిగిపోదురు. కవియొక్క చమత్కారమ్ము లైన భావములు, కల్పనలు, సంఘటనము లివి యన్నియు మనసులో సుస్థితములైన పాత్రలను గూర్చిన వగుటవలన సద్యఃపర నిర్వృతి కలుగుట కవకాశమున్నది. ఒక యాంజనేయుని, ఒక సుగ్రీవుని ప్రవేశ పెట్టి హఠాత్తుగా కథ నారంభింపవచ్చును. పూర్వకథతో సంబంధ మంతగా కలుప నక్కరలేదు. “కథ జగత్ససిద్ది కావున పూర్వ పర్వార్థ యుక్తి సేయ నట్టి యెడల, యత్న మించుకంతయయినను వలపదు. వలసినట్లు చెప్పవలసియుండు” (విరా 1 – 42) అని తిక్కన విరాట పర్వాదియందు చెప్పెను. ప్రఖ్యాతేతివృత్త మును తీర్చుటలో నీ విశిష్ట సౌలభ్య మున్నది. మాలతీమాధవాది కావ్యము లెంత రసభావ చమత్రియాపరమములయ్యు నుత్తరరామచరిత్రాదుల వలె సుప్రసిద్ధములు కాకపోవుట కిది యొక కారణము. కావ్య రసాస్వాదనకు దాని యొక్క పరిచయ మెంతయో యావశ్యకము.

ధ్వన్యాలోకమున “అతఃఎవ భరతే ప్రఖ్యాత వస్తు విషయత్వమ్, ప్రఖ్యాతోదాత్త నాయకత్వంచ నాటకస్యావశ్య కతయోపన్యస్తమ్. తేనహి నాయక స్యొచిత్య విషయే కవిర్మవ్యా ముహ్యతి. యస్తూత్పాద్య వస్తు నాటకాది కుర్యాల్ తస్యా ప్రసిద్ధానుచిత నాయకస్వభావవర్ణనే మహాన్ ప్రమాదః” (ధ్వ ఉ 111-14 కారికావృత్తి) అని చెప్పబడి యున్నది.

రసభావాదుల నాశ్రయింపని కేవల ముత్కంతయే రేపుట ప్రధానమైన యాధునిక నవలలో నితివృత్తముయొక్క అపరిచయమే ప్రధానమగుచున్నది. ప్రఖ్యాతేతివృత్తము నిర్వహించుటకన్న, కావ్యమున కల్పితేతివృత్తమును నిర్వహించుట చాల కష్టమైన విషయము. కళాపూర్ణోదయమున నున్న కల్పన యెంత యనల్పమై నను కొన్ని పౌరాణికపాత్రల నాశ్రయింపక తప్పలేదు. కథలో ద్వారక, శ్రీకృష్ణుడు, ఆయన యంతఃపురము, నారద తుంబురులు, రంభానలకూబరులు, సరస్వతీ చతుర్ముఖులు ఇవన్నియు పాఠకులకు నిత్య పరిచితములైన పాత్రలు. ఇవన్నియు చుట్టు పట్టుల నుంచుకొని సూరన తన కథను ప్రారంభించినారు. కావ్యమునందలి ప్రధాన సంఘటవే సరస్వతీ చతుర్మఖ సంవాదము. ఏది ఏమైనను కళాపూర్ణోదయ కథ కల్పితమే గాని, మిశ్రకథ కానేరదు.

మిశ్ర కధయందు ప్రధాన కథ ప్రఖ్యాతమైనదేకాని కొన్ని సంఘటనలు కొన్ని పాత్రలు మాత్రము కల్పింపబడును. కళాపూర్ణోదయము నందలి ప్రధానమైన కథ కల్పింపబడినదై కొన్ని పాత్రలు, సంఘటనలు ప్రఖ్యాతములైనవి. ఇది మిశ్ర కథా లక్షణమునకు విరోధ లక్షణము. కల్పిత కథయయినను కేవల కల్పితకథ కాదు. కేవల కల్పనాకథలు కృత్రిమ రత్నములు. అనగా భ్రాంతికల్గించునని. అది చాలకాలము నిలవదు. కొంతకాలమునకే ఆ రత్నములు గాజు ముక్కలని తేలిపోవును. అట్లే కల్పిత కథల యందు కథాత్వ భ్రాంతి కొంత కాలమే నిల్చి వాని కథాత్వమును పోగొట్టుకొనును. ఆ పాత్రల పరిపూర్ణ మనోభావముల నిర్మించుట యంత సులభము కాక పోవుటవలన తొలుత నాకర్షించినను మన మనస్సులలో స్థిరముగా నుండజాలవు. “ప్రాగ్విపశ్చిన్మతంబువ రసము వేయి రెట్లు గొప్పది నవకథా దృతిని మించి” యన్న శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు కూడ నవ కథా సృష్టి యందు రసముయొక్క ప్రాధాన్యము లేదని చెప్పియున్నారు. క్రొత్త కథలను మాత్రమే సమాదరించుట పాశ్చాత్య భావలక్షణము కావచ్చుకొని, ప్రాచ్య భావుకులు రసమునందే నిష్క కలవారని తాత్పర్యము.

ఇక మిశ్ర కధలు. ఇవి “సత్కవి కల్పనా విభూషావహ పూర్వ వృత్తములు.” ఇందన్ని పదములను జాగ్రత్తగా పరిశీలింప వలయును. సత్కవుల చేత తమ కల్పనము లన్నియు విభూషణము లగునట్లుగా తీర్చబడిన పూర్వ వృత్తములు. ఇవి సానలు దీరిన జాతి రత్నములు. ఇచట నికషము కవి ప్రతిభ. పూర్వవృత్తము పుట్టు రత్నము. కల్పనములు రత్నము పొందిన క్రొత్త వంపులు, యొదిగింపులు. ఇట్టి కల్పన ముత్తర రామ చరితమునందున్నది, శాకుంతలమునందున్నది. తొలిదానియం దంతర్నాటక మున్నది. ఇది శ్రీరామునకు సీతా లవకుశల వృత్తాంతము తెల్పుటకు కల్పింపబడినది. దీని యందే లవ కుశుల పరాక్రమాభివ్యంజకముగా రామయజ్ఞాశ్వమును వారు పట్టుకొనుట, చంద్రకేతు లక్ష్మణాదులు వారితో యుద్ధము చేయుట మొదలైన ఘట్టములు కూడ నున్నవి. ఇవన్నియు నానాటకమున రసభావముల పోషించినవి. లవ కుశులను మహావీరుడైన శ్రీరాముని సంతానముగా తీర్చుటకీ ఘట్టములు కల్పింపబడినవి. అంతటి రామాయణములో లవ కుశ పాత్రలకు ప్రాధాన్యము లేదు. కాని యుత్తరరామచరిత్రలో వారు ప్రధానులే. అందు వలన నీ విధముగా తీర్చిదిద్దుటకీ కల్పన యవసరమైనది. శాకుంతలము కూడ ఇట్టిదే. దీనియందున్న దూర్వాసుని శాపము కథను పూర్తిగా మార్చి వేసినది. భారతములోని దుష్యంతుని కథ యొక యుపాఖ్యానమే. దానిలోని పాత్రల ప్రవృత్తి యొక్క సూక్ష్మ భేదములు, ఔచిత్యానౌచిత్యములు ప్రధానమైన పాండవ కథకు నపకర్షాపాదకములు కావు. కాని యా యుపాఫ్యానమునే ప్రధానముగా స్వీకరించినపుడు దాని యందలి

పాత్రలు ప్రాధాన్యము వహించును. ఈ దుష్యంతుని యొక్క శకుంతల యొక్క మనః ప్రవృత్తి తీర్పుననే కావ్యము సొగును. భారతములో లోకాపవాదభీతుడైన దుష్యంతుని శాపకారణముగా శకుంతలావృత్తాంతమును మరచినవాడుగా నత్యంత సత్పురుషుగా తీర్చుటవలన దుష్యంతుడు కావ్య నాయకుడుగా నర్హుడగుచున్నాడు. అనర్హుడైన వారు, మృషావాదియైనవారు చివరకు సత్ఫలమును పొందుట ధర్మభావమునకు విరుద్ధమైన విషయము. ధర్మమున కవిరుద్దముగా కవి కావ్యమును శాపమును కల్గించి లోకోత్తరముగా నిర్మించియున్నాడు.

కాని ఈ కల్పసమున కొక హద్దుండవలయుననియు, ప్రధానమైన పాత్ర ప్రవృత్తుల కవిరుద్ధముగా రచన సాగవలయుననియు చెప్పబడినది. కవియొక్క కల్పన పూర్వవృత్తమునకు విభూషావహముగా నుండవలయునట యిందులకే.

ఈ విధముగా రామరాజభూషణుని శ్రవ్య కావ్యేతివృత్త విభజనము చాల సమంజసముగా నున్నది. ఈ పద్య మును సమకాలికులైన కవుల నాక్షేపించుటకు వ్రాసినాడని మనము భావింపనక్కర లేదు. స్వయముగా తానొక లాక్షణికుడగుట వలన, తానా విషయమునంత విస్పష్టముగా చెప్పినాడన వచ్చును.

సంస్కృతాలంకారికు లొనర్చిన కథా ఆఖ్యాయికాది భేదములు మహా కావ్య వస్తువును గూర్చినవి కావు. అవి గద్య కావ్య భేదములు. సర్గ బంధమైన మహాకావ్యమునకు దీనితో సంబంధము లేదు.

ఇంతవరకు కథాస్వరూపమును దాని భేదములను గూర్చి చర్చయైనది. ఐనను ముఖ్యమైనది కథా గమనము. ఈ కథ యన్నది యెట్టిది? దాని శరీర నిర్మాణ మెట్టిది? ఒక వృత్తాంతము, ఒక సంఘటన, ఒక కథ వీని నడుమ భేదమెట్టిది. ఈ విషయములు చర్చించినగాని కథా శరీర మిట్టి దని చెప్పలేము.

లోకమునం దనేక విషయము లున్నవి. వార్తలున్నవి. దిన దినము గడచిపోవుచున్నది. ఈ విధముగా గడచిపోవుచున్న దినములలో నొకా నొక దినము మాత్రము స్మృతిలో నండును. మిగిలిన దినములు విస్మృతములగు చున్నవి. దారిలో పోవుచుండగా నొక పాము కనిపించినది. దానిని చూచి భయము కల్గినది. ఇంతలో నది పోయినది. ఇది విశేషము. తత్కార్యాచరణ మందు ప్రవృత్తులగుటకు పూర్వము మనమీ పాము యొక్క రాక భావింపలేదు. వచ్చుట పోవుట యన్న భావమునందు లేని యొక నొక నూతన విషయము ‘విశేష’ మగుచున్నది. ఈ విశేషమువలననే ఆ సంఘటనకు ప్రాధాన్యము.

బహుధా లోకమునందు మానవులు తత్తత్కార్యాచరణ కాలముల యందు దానిని గూర్చి ‘నిర్ణయము చేసికొనగా లిప్త లిప్తాంశములుగా విభక్తమైన యా కాలము యొక్క యణువు లలో నీ మానవుని యూహలకన్న విలక్షణమైన యొక నొక విషయము ప్రవేశించినచో నది విశేషము. ఈ విశేషమువలన తదాశ్రితములైన సంఘటనలు వరుసగా జరుగగా నొక ఫలము కల్గినప్పుడు విశేషమునుండి ఫలము పర్యంతము జరిగిన వృత్తాంతమంతయు నొక కథ. దైనికాచరణములన్నియు వార్తలు. హఠాత్తుగా సంభవించెడి విశేషములు సంఘటనములు. ఈ విశషములైన సంఘటనముల నాశ్రయించి ఫల పర్యంతము సాగెడి వృత్తాంతము కథ. ఈ విశేషమువద్దనే కథ యారంభించినట్లు, సీతా వివాహము ఫలమైనప్పుడు విశ్వామిత్రాగమనముతో కథ యారంభము. రావణవధ ఫలమైనప్పుడు కైకేయి వరము అడుగుటలో కథ యారంభము. ఇది రామాయణ విషయము.

ఈ విశిష్ట లక్షణమునందే మానవుని మనస్సు రమించు చున్నది. రస ప్రవృత్తి కూడ ఈ కథా లక్షణమునకన్న వేరుగా లేదు. లోకమునందు మన మనేకములైన వృత్తాంతములను చూచుచున్నాము. ఈ విషయము లన్నియు మనకు పట్టవు. విశేష విషయమునందే మనస్సు రమించుచున్నది. ఈ మనస్సు రమించు లక్షణము యొక్క లోతులందే రసమున్నది. రమణము యొక్క లోతు ననుసరించి స్మరణము, చమత్కారము, భావ ప్రేరణము, రసానుభూతి యన్నవి కలుచుండును. లోతు తగ్గిన కొలది పూర్వ పూర్వమునందే యనుభూతి యాగి పోవును. విశిష్ట లక్షణముగల కథ దానిలోని లోతుల ననుసరించి శ్రోతయొక్క మనోలక్షణము నాశ్రయించి యనుభూతమగుచున్నది. పరమభావుకునియందు ఉదాత్తమైన కథ రసత్వమును పొందుచున్నది. కథ యుదాత్తముకొని చోట విశిష్టమైన కథాస్వరూపమున్నందున పాఠకుని యందు చమత్కారము కల్గ జేయుచున్నది.

రసము విభావానుభావాదుల నాశ్రయించుననగా కథయొక్క ప్రాధాన్యము లేదనికాదు. ఈ విభావాదులన్నియు కథలో నంతర్భాగములే యగుచున్నవి. లౌకికముగా ప్రతిబింబ ప్రాయములయిన సన్నివేశముల యందు కలుగని యానందాదికము కావ్యమునందు కలుగుటకు కారణము తత్సన్నివేశ చారుత్వము. ఈ సన్నివేశము కధాంతర్భాగమై, కథాత్వ లక్షణము సకు మరింత శోభ చేకూర్చుట కూడ యెంతయో ముఖ్య మైన విషయము.

సాధారణమైన సన్నివేశమునందు ఒకా నొక యనూహితమైన ప్రవృత్తి వలన కథ పుట్టుచుండగా నీ ప్రవృత్తిని దైవమని (విధియని) చెప్పినప్పుడు, మనోమయుడైన మనుష్యుడు తన సంకల్పమునకు విరుద్ధమైన దానియందు కూడ రమించుట చిత్రముగనే గోచరించుచున్నది. అనిష్టమైన దాని యందు రమించుట లోకమునకు విరుద్ధమైన విషయము. అందువలన మనస్సున కన్న యతీతమైనదేదో యుండవచ్చును. ఈ మనస్సునకు కూడ తెలియకుండ తదధికమైన యొక చైతన్య భావము దైవమని చెప్పబడుచున్న ఈ విశిష్ట లక్షణమున కవిరుద్ధమైనది కావచ్చును. ఇది ఇట్లే యైనచో మనోతీతమైన ఈ చైతన్యము కాలమునందు ప్రవేశించియున్న దైవమునందు రమణము పొందుచున్నదన్నమాట. ఇదియే వేరొక విధముగా చెప్పినచో జీవుడు పరమేశ్వరునిలో రమణము పొందుట. అందువలననే రసానుభవము బ్రహ్మానందానుభవమని చెప్పిరి.

కథ నాశ్రయించి రససిద్ధి కలుగుచున్నది, మహాకావ్యము కూడ రసము నాశ్రయించి యున్నది. కథా నిర్మాణదక్షులైన వారికే మహా కావ్యనిర్మాణచణత్వము కల్గుచున్నది. వారే రస సిద్ధులు. మహాకవులు. లోకములో కథాత్వములేని ఇతివృత్తముసు స్వీకరించి, ఇతివృత్తమేలేని కావ్యముల నిర్మించువారు మహా కవులు కారు. వారి కావ్యములందు రససిద్ధి లేదు.

ఈ కథా నిర్మాణదక్షత్వము లోకోత్తర స్థితినందినది వాల్మీకి వ్యాసులయందు. తరువాత కథా లక్షణ మెరిగినవారు కాళిదాసాదులు కొందరు మాత్రమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here