[dropcap]క[/dropcap]విత్వాన్ని అభిమానించే వాళ్లు, ప్రేమించేవాళ్ళు,కవిత్వంతో కవాతుచేసేవాళ్ళు అనేకం తెలుగు నాట అనేకం
ఇటీవలి కాలంలో వాట్సప్ గ్రూపుల ద్వారా ఫేస్ బుక్ గ్రూప్ ల ద్వారా కవిత్వం ఎంతమందినో చేరుతోంది
ఎంతోమంది కొత్త కవులు ఉత్సాహంగా కలం పడుతున్నారు..
ప్రింట్ మీడియా ఇవ్వని అవకాశాలు సామాజిక మాధ్యమాలిస్తున్నాయి…
అలాంటి ఒక వాట్సప్ గ్రూప్ క్రియేటివ్ ప్లానెట్..దీన్ని నెలకొల్పిన వజ్రనాభ్ నటరాజ్ మహర్షిగారు కవిత్వంలో కవి వ్యక్తిత్వం కూడా ప్రతిఫలించాలని తపించే వ్యక్తి..ఇటీవలే శ్రీ కారం పేరుతో కవిత్వ సంకలనాన్ని ప్రచురించారు..
శ్రీకారం కవిత్వ సంపుటికి ఒక పాటరాసి కంపోజ్ చేయటమో విశేషం..కవిత్వం ఎలాఉండాలో చెప్పే పాట అది…
అక్షర చక్షువు సంధించిన బాణం శ్రీకారం
*అక్షర కరముల నర్తననాదం శ్రీకారం*
*అక్షరమాల విన్యాసం*
*అనంతాక్షర విశ్వాసం*
*అనంతవిశ్వమాలపించె శ్రీకారం*
*అక్షర పరిమళధూపం* *కవిహృదినంటిన సుగంధం శ్రీకారం*
*సాంధ్యసమీర వాసంతిక*
*కనురెప్పల చప్పుడు శ్రీకారం*
*అక్షర పత్రహరితపు కిరణజన్యసంయోగక్రియ*
*విశ్వాంతర గర్భంనుంచి భువికి జారిన వాగ్దేవిస్పర్శ
అంటారు వారు…అలా కవిత్వం లోని నర్మగర్భతను భావవిన్యాసాన్ని మనకు పరిచయం చేస్తారు..
కవర్ పేజీ డిజైనింగ్ లోనే ఒక కొత్త స్ఫూర్తిని కలగచేసి శ్రీకారం కవిత్వ సంపుటి మనల్ని లోపలికి నడిపిస్తుంది…ఇందులో దాదాపు 70మంది కవులు రెండువందల కవితలతో మనల్ని పలకరిస్తారు…కాబట్టి ఒక వైవిధ్యం తొలిమంచు కిరణంలా మనల్ని చుట్టేస్తుంది..ఇంతమంది కవులు కట్టిన అక్షరతోరణం మిలమిలలాడే హేమంతపు నీరెండై హృదయానికి గొడుగు పడుతుంది.. అందమైన దృశ్యాలు,నిలదీసే ప్రశ్నలు నిలువెల్లా తడిపేస్తాయి..ఈ సంపుటిలో జాతీయ స్థాయిలో బహుమతి పొందిన మూడు కవితలను కూడా పొందు పరచారు.
విస్తరించిన వస్తు వైచిత్రి పూదోటపరిమళమై పాఠకులను ఆకట్టుకుంటుంది..”మట్టిరోదిస్తోంది” అనే కవితలో నటరాజ్ మహర్షి.ఉద్యమాలను నడిపి వదిలేసే వాళ్ళను చూసి మట్టి రోదిస్తోంది అన్న భావాన్ని”ఆకాశం చేతిలో మొహాన్ని దాచుకుని రోదిస్తున్న మనిషిని ప్రేమించే మట్టిని” అన్న వాక్యాలు పాఠకుడికి గుచ్చుకుంటాయి…
వీరిదే మరో కవిత “కూల్చేస్తున్నారు” లోని ఈ వాక్యాలు చూడండి..” నిర్మించడం చేతకాని మీకు / సమాధైన బతుకుల ఆత్మఘోష ఎలా అర్థమవుతుంది/ చావడం,చంపడం తప్ప బ్రతకడం తెలియని మీకు నా శ్రద్ధాంజలి/
అని ముగిస్తారు.అలా పదునైన వాక్యఘోషను మనలో ప్రతిధ్వనింపచేస్తారు…
నవ్వంటే అందరికీ ఇష్టమే.ఆ నవ్వు నిష్కల్మషమైనదయితే బతుకంతా పూలబాటే అంటారు అంబల్ల జనార్ధన్ నిష్కల్మష నవ్వు కవితలో…నిష్కల్మష నవ్వు సవ్వడి /ఆహ్లాద నదీ ప్రవాహమై /మనఃతంత్రులను మీటుతుంది/ఆ నవ్వు జల్లుతో /బీడువారిన జీవిత పుడమి/పులకించి పుష్పించాలి/…ఎంచ అందమైన భావన..కవి తాదాత్మ్యం చెందితే కానీ వెల్లలడించలేడు…
మనిషి మరో మనిషికి భరోసా కివాలని తపిస్తారు పుష్యమిసాగర్ ‘ జీవితపాఠం కవితలో..నిన్ను మోసిన భుజాలిప్పుడు / వెతుక్కుంటున్నాయి/నిలబడే ఆసరాకి దిక్కెవరని/…మరోచోట ఇదే కవితలో నిన్నటి గతానికి చిక్కుముడిగా మారకు/ అని హెచ్చరిస్తాడు.పేదరికం కవిని ఎప్పుడూ కదిలించి
మంచి వాక్యాలను మనసులోంచి రాల్చుతుంది.ఎప్పుడు భూమ్మీద పడ్డారో/ మట్టిగా మారేవరకు/ శ్రమ కణమై రగులుతుంటారు/ అంటారు కవి పుష్యమి సాగర్ కొన్ని శ్రమ జీవితాలు కవితలో…
మనిషి కడవరకూ స్వప్నాలను జపిస్తాడు..ఆశల ఊసులతో..ఆ ఊహకు అద్దం పట్టే కవిత చిగురించే స్వప్నం కోసం…ఈ వాక్యాలు చూడండి.”మళ్ళీ ఓ స్వప్నం చిగురిస్తోంది/ఉదయించే సూర్యుడి సాక్షిగా/కాంక్రీట్ వనాలలో/పచ్చని చెట్లను మొలకెత్తించాలని/ఆకుపచ్చని అక్షరద్వారాలను కట్టాలని/”
సి.యస్ రాంబాబు కవితలో ధ్వంసమవుతున్న ప్రకృతిని చూసి బెంగపడిన కవి ఆశను మొలకెత్తించే ప్రయత్నాన్ని చూస్తాం…
నడకంటే ఆరోగ్యానికే అన్న సామాన్య దృష్టిని దాటి విశాల ప్రాతిపదికను మందుంచుతాడు కవి.కవి చూపులో దార్శనికత చూడండి.ఆ కవి పెరుగు రామకృష్ణ అయితే ఆ భావం మరింత చిక్కగా జాలువారుతుంది..”నేలను తడవాలన్నా/మనసుల్ని గెలవాలన్నా/బాధల్నీ,హృదయాలను గెలవాలన్నా/నడక అనివార్యం/నడకంటే కాళ్ళే కాదు/కాళ్ళతోపాటు మనసూ నడుస్తుంది/”.
పచ్చని మాగాణి చూసినప్పుడు కవి పులకించక ఎలా ఉంటాడు..కవయిత్రి తాటికోల పద్మావతి గారి సస్యశ్యామలం కవితలోని భావధార గరికపచ్చ సంగీతం మై మనల్ని అల్లుకుంటుంది.ధవళ కాంతుల రవళిలో/మౌనంగా నిరాశ చీలిన సవ్వడి/ఊరుమ్మడిగా ఒక విచలిత సంకీర్ణం/ అంటారు కవయిత్రి…
ఆధ్యాత్మికమంటే ఏమిటి అన్న ప్రశ్నకు కవి సమాధానం ఎలా ఉంటుందో కీసరి నర్సయ్య కవిత ఆధ్యాత్మికం
చెబుతుంది..”దేవునిలో విలీనమవడమేకాదు/ఆధ్యాత్మిక మంటే/ఆధ్యాత్మిక మంటే/మానవాళిని బతికించడమే/ఆధ్యాత్మికమంటే /మట్టినితాకుతు బతకటమే/”
కవిలో నిరంతరం భావాల సంఘర్షణ చెలరేగుతూనే ఉంటుంది.ఆ మధనమే కవితామృతమై వెలువడుతుంది.ఒక్కసారి వచనం పాలు ఎక్కువున్నా
ఆలోచనను తట్టిలేపే వాక్యాలు ఆ వచనంలోనే పలకరిస్తాయి..సమాజంతో పోటీపడాలనే/పొంతనలేని అంతర్యుద్ధాలెందుకు/..అన్న వాక్యం జరసోచో కవిత లో దర్శనమిస్తుంది…
ఇక జాతీయ కవితల పోటీలో మొదటి బహుమతి పొందిన మంచుదుప్పటి కప్పుకుని కవిత దేశం కోసం సైనికుడు చేసే నిశ్శబ్ద తపస్సును
త్యాగాలబాటగా కీర్తిస్తుంది…జడ సుబ్బారావు రచన
“మంచుదుప్పటి కప్పుకుని…కవిత.‘నిశ్చింతను మాకిచ్చి /నిశీధిలో నిర్భయంగా /మంచు దుప్పటి కప్పుకుని సరిహద్దుల వెంట గస్తీ తిరుగుతుంటావు / అన్న వాక్యాలు మనసును కుదిపేస్తాయి.
అలాగే రెండవ బహుమతి పొందిన కవిత మాభూమి-మా బతుకు నామని సుజనాదేవి గారి రచనలో నమ్ముకున్న నేలకు వెలకట్టే/ నయా వలసవాదులకి ఏమితెలుసు/తరతరాలుగా నేలతో /మేమేర్పరుచుకున్న పేగుబంధం/ అంటారు
నేలతో రైతుకున్న బంధాన్ని ఆర్ద్రంగా వివరించే కవిత…
ఇక మూడవ బహుమతి పొందిన కవిత గుండాన జోగారావు గారిది..శీర్షిక ఓ గుప్పెడు అక్షరాలకై..
కవితకై కవి తపనకు గొంతుకీ కవిత.. కవిత రాయలేని క్షణాన ఆ కవి యాతనను ఈ కవి పట్టుకుంటారు..ఒకానొక అంతర్మధన సెగ/చుర్రుమనిపించకపోతే/కవిత లో వాడీవేడీ లోపిస్తుందికదా…/అని కవి బాధ పడుతుంటాడు
ఇంకా ఈ సంకలనంలో అనేకమంది కవుల కవితార్చన మనం చూస్తాం…లోపలి గది అన్న కవితలో కవి గుబ్బల శ్రీనివాస్ “కిటికీ రెక్కల వెనక/ వెలుగు రాలుతున్నచప్పుడు/ఊచలను తోస్తున్న కాంతి/అన్న కొత్త ఊహను మనముందుంచుతారు.
రవీందర్ విలసాగరం పదచిత్రాలను అందంగా పొదుగుతారు “ఓ పూవు హృదయం ” కవితలో..” బతుకమ్మ పండుగ పాటలో / ఓ పదాన్నయినా చాలు/పూరి గుడెసె గుడిలో/ఓ లేలేత రాగాన్నయినా బాగుండు/
అన్న ఆర్ద్రగీతాన్ని వింటాం ఈ కవి గొంతులో..
కవికి నేలంటే అపారమైన ప్రేమ..”భూమి దుఃఖం” అనే కవితలో కవయిత్రి శైలజా మిత్ర పతనమవుతూ మనిషి ఎలా వ్యామోహ సంద్రంలో కొట్టుకుపోతున్నాడో అంటూ కలవరపడుతూ మనల్ని కలవరపెడతారు..”వెలిగే సూర్యుడిని సైతం కలుషితం చేస్తావా/భరించలేని బతుకులో భూమిని చులకన చేస్తావా/ ” అంటారు
మగవాడి మోసాన్ని మగువ వివరించిన వైనాన్ని మనముందుంచుతారు “ప్రశ్నల ముంగిట” అనే కవితలో..ప్రేమను ఎలా ప్రశ్నిస్తారో చూడండి.”అసలిది/ఆత్మబంధమా/ఆకర్షణల వలయమా/ఆర్థికబంధాల మోహమా/” అని ప్రశ్నిస్తారు.‘నిత్య ప్రశ్నల ముంగిట/జవాబే తట్టని సగటు స్త్రీ గా నేను/..అన్న ముగింపు గుండెను తాకుతుంది..
కవి ఎప్పుడూ ఓ దుఃఖాన్ని మోస్తూనే ఉంటాడు..తగుళ్ళ గోపాల్ ఆ దుఃఖాన్ని ఎలా వర్ణిస్తాడో చూడండి.”ఏకాంతంగా దుఃఖిస్తున్నప్పుడు/కన్నీళ్ళతో/కొన్ని అక్షరాలూ రాలుతుంటాయి/దోసిట్లో పట్టి కాగితంపై చల్లితే /పచ్చని కావ్యాలు మొలవవచ్చు/”
ఎంతందమైన భావన..
రాలిపడిన చంద్రుడిని ఆకాశానికంటించి/చిట్లిన గుండెకు కట్టుకట్టాలి/లేదంటే-పురుడుపోయిన వాక్యమేదో/సలుపుతూనే ఉంటుంది/
అన్న దాట్లదేవదానంరాజు గారి కవిత “ఆఖరి వాక్యం కోసం”
కవికుండే మానసిక సంఘర్షణను చిత్రిక పడతాడు కవి ఇక్కడ.
శ్రీకారము అనే కవితలో తెలుగు కవుల నుడికారమై/పశ్చిమాన ప్రాకారమై/పలుకెడి వాడికి ఓంకారమై/
అంటూ శ్రీకారం మకుటానికి ఆభరణం తొడుగుతారు యుగంధర్ జనగాని
అమ్మంటే ఎవరికైనా ప్రేమే.”నిశీధిని ఆకలిగా మింగి నాకో వెలుగైనావు/నాకోసం వేచియుండు నక్షత్రమైనావు/నా ఆశలు తీర్చు వెండి జాబిలివయ్యావు/ అంటూ అమ్మను కీర్తిస్తాడు కవి.ఆ కవి అద్వైత్ బొమ్మెర.
లక్ష్మీ వేణుగోపాల్ తన కవిత “పుట్టుక “లో విజయాలు సాధించినవారి స్ఫూర్తిని వివరిస్తారు. చిట్టితీగలు మీటినవారు/మీగడ తరగలు తేలించినవారు/ అంటారు
ఒంటరితనం నాతో జతకట్టింది/రోజూ కొంత దిగులును క్రమం తప్పకుండా /మందుబిళ్ళలా నాతో మింగిస్తోంది/
అంటారు కవి చౌడారపు శ్రీ ధర్ తన కవిత “నువ్వెళ్ళిపోయాక “లో ఎంతందమైన భావన
కవులేం చేస్తారు…నాలుగు అక్షరాలను జేబులో వేసుకుని కవితా విత్తనాలను చల్లుతారు..అవి మొలకెత్తి మనిషితనం పూలను కానుకిస్తుంటే పరిమళమై వ్యాపిస్తుంటే మనిషి మాధవుడయ్యే ప్రక్రియ మొదలవ్వదా…ప్రకృతి పులకించదా అనిపిస్తుంది ఈ కవిత్వాన్ని చదివినప్పుడు…మనిషిని ప్రకృతిని అనేక కోణాలనుంచి దృశ్యబద్ధం చేసే శ్రీకారం
కొత్త రాగాన్ని ఆలపించి గుండెలో చెమ్మను తడిని సృష్టించి మనసుకో హాయిని కలగచేస్తుంది…
కాస్త అక్కడక్కడా అక్షరదోషాలున్నా మంచి ముద్రణ మేలిమి కవర్ పేజీ కవిత్వానికి పట్టం కట్టాయి…గుండెన మోగిన గుడిగంట ఈ “శ్రీకారం”
వాట్సప్ గ్రూప్ లేమి చేయగలవన్న ప్రశ్నకు క్రియేటివ్ ప్లానెట్ గ్రూప్ సంధించిన సమాధానమీ శ్రీకారం కవితా సంకలనం. ముంబయిలో ఉండి కవులను కవిత్వాన్ని పొదిగిన సంపాదకులు వజ్రనాభ్ మహర్షిగారిని అభినందిద్దాం, కవులందరికీ అభినందనలు తెలియచేద్దాం.
***
శ్రీకారం (కవిత్వం)
ప్రచురణ: వాయుధ్వని ప్రొడక్షన్స్
పుటలు: 200, వెల: రూ.500/-
ప్రతులకు:
క్రియేటివ్ ప్లానెట్/ వాయుధ్వని ప్రొడక్షన్స్, ఫోన్: +917715984574
ఈమెయిల్: natraajmaharshi@gmail.com
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు