కాజాల్లాంటి బాజాలు-137: శ్రీరామ జయం

0
12

[ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి.]

[dropcap]ఏ[/dropcap] దేశంలో ఉన్నా.. ఏ ప్రాంతంలో ఉన్నా నమ్మకమున్న ప్రతివారూ.. అమ్మా, నాన్నా, తాతా మామ్మా, పిల్లా మేకా అందరూ కూడా రామభక్తి సామ్రాజ్యంలో మునిగి తేలుతున్నారు. ఎంత బాగుందీ.. మర్యాదా పురుషోత్తముడైన రాముణ్ణి తలచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. ఆ రామనామంలోని మాథుర్యమేమిటో కానీ ఆ అమృతాన్ని తాగినకొద్దీ తాగాలనిపిస్తుంది. ఆ రాముని కథలు చెప్పుకున్నకొద్దీ పెరిగిపోతూనే ఉంటాయి.

అయోధ్యలో జరుగుతున్న అంతటి రాజారాముని ప్రాణప్రతిష్ఠని ప్రపంచమంతా కన్నులపండువగా తిలకిస్తూ పరవశులైపోతుంటే మనం మటుకు ఎందుకు చేతులు కట్టుకుని కూర్చోవాలీ అనిపించింది. అందుకే వదినా, నేనూ కూడా సారథ్యం వహించి కొంతమందిని కూడగట్టుకుని మాకు తోచిన విధంగా తనివితీరా ఆ రామచంద్రునికి సేవ చేసుకోవాలనిపించింది. అలా అనిపించడమేమిటి.. అంతే వదిన మొత్తం కార్యక్రమం ప్రణాళిక సిధ్ధం చేసేసింది.

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది కనక ఇక్కడ మనం కూడా చిన్నపిల్లల చేత బాలరాముని మీద పాటలూ, డాన్సులూ చేయిద్దాం అంది. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను పవిత్రంగా అందరికీ అందజేద్దామంది.

రాముని కీర్తిస్తూ కోలాటాలాడదామంది.. అనడమే కాదు. అందరినీ పోగేసి కార్యక్రమం వాళ్లముందు పెట్టింది. రాముని సేవంటే రానివాళ్ళు ఎవరూ! అందరూ ఎంతో సంతోషంగా ఎవరు చేయగలిగినవి వారు ఎన్నుకున్నారు.

కానీ నాకొక సందేహం వచ్చింది.

“వదినా, బాలకృష్ణుని వయితే బోలెడు లీలలు ఉన్నాయి కనక పాటలు రాసుకున్నా. డాన్సులు చేసుకున్నా అందరికీ సంతోషంగా అనిపిస్తుంది. మరి, బాలరాముడికి లీలలేమున్నాయీ!” అనడిగేను.

దానికి వదిన ఆశ్చర్యపోతూ, “నీకు తెలీదా స్వర్ణా.. కొన్ని రామాయణాలలో చిన్నరాముని చిలిపితనం, పెంకితనం ఎంత బాగా చెప్పారో తెలుసా! అంతదాకా ఎందుకూ.. చిన్నప్పుడు చందమామ కావాలని మారాము చేసినా, ‘రాఘవా ముద్దీయరా..’ అని తండ్రి దశరథుడు పిలిచినపుడు పరుగులిడుతూ తండ్రిని చేరినా, తమ్ములతో కలిసి అయోధ్య వీధులలో నడచి అందరి మనసులనూ ఆనందింపజేస్తున్నా.. ఏది తలచినా, ఏది పలికినా మనకే తెలియని ఒక అలౌకిక స్థితికి చేరిపోతాం. ఒక కవి రాసిన రామాయణంలో ఏముందో తెలుసా! రాముని చిన్నప్పుడు కౌసల్య అన్నం పెట్టడానికి వస్తే చిన్నిముద్ద తినడానికి ఆ తల్లిని తన వెనకాల ఎంతగా పరుగు పెట్టించాడో చెప్పారు. ఆఖరికి ఆమె అలసిపోతే ఈ చిలిపిరాముడు తల్లి దగ్గరికి వెళ్ళకుండా నెమ్మదిగా తండ్రి దశరథుని పక్కన చేరి. ఆయన చేతిముద్ద తిన్నాడుట. అది చూసేకే ఆ తల్లికి తృప్తి కలిగేదిట. ఎంతటి పుణ్యాత్మురాలో కదా కౌసల్యామాత”

వదిన పరవశించిపోయి చెపుతుంటే నేను శ్రధ్ధగా వినడం మొదలుపెట్టేను.

“అంతేకాదు. తమ్ములతో కలిసి పెద్దల దగ్గర వేదాలు, పురాణాలు వినే ఈ రాముడు తర్వాత వాటిలో కొన్ని తమ్ములకి అర్థం కాకపోతే వారికి వివరించి చెప్పేవాడుట. పెద్దలని గౌరవించడం, గురువులని పూజించడం వంటివి ఈ రామకథలో పిల్లల చేత నటింపచేస్తే వాళ్లకి కూడా అంత చక్కటి విలువలు ఒంటబడతాయి.”

వదిన చెపుతుంటే నిజమే కదా అనిపించింది.

“మరి ఇప్పటికిప్పుడు ఈ పాటలూ, నాటకాలూ ఎవరు రాస్తారూ!”

“నేను ఎప్పుడో రాసేసాను. ఇదిగో ఇది విని ఎలా ఉందో చెప్పు” అంటూ వదిన సన్నగా, మథురస్వరంతో వినిపించసాగింది.

~

“రారండి రారండీ.. రాముని చూతము రారండీ
చిన్ననవ్వుతో మనసును దోచే రామయ వచ్చెను రారండీ॥
బుడి బుడి అడుగుల నడకల సొబగుతో
అంతఃపురమున అల్లన నడచే రామయ వచ్చెను రారండి॥
రారండి రారండీ.. రాముని చూతము రారండీ
రాఘవా, ముద్దీయరా యన్న నాన్న పిలుపు విని
గబగబ అడుగులు పరుగున వేసే రామయ వచ్చెను రారండి
రారండి రారండీ.. రాముని చూతము రారండీ॥
చక్కని రాముని అక్కున చేర్చుకు
మురిసిన తండ్రిని ముద్దుగ చూచే రామయ వచ్చెను రారండి॥
రారండి రారండీ.. రాముని చూతము రారండీ॥
అన్నం తిననని మారాం చేస్తూ
చంద్రుని కోసం అలకలు పోయిన రామయ వచ్చెను రారండీ
రారండి రారండీ.. రాముని చూతము రారండీ॥
చంద్రుని మించిన అందమె నీదని
కైక అద్దమున ముద్దుగ చూపిన రామయ వచ్చెను రారండీ
రారండి రారండీ.. రాముని చూతము రారండీ॥
అయోధ్య వీధుల అర నవ్వులతో
అందరి మనసును రంజిల జేసిన రామయ వచ్చెను రారండీ
రారండి రారండీ.. రాముని చూతము రారండీ॥
రామనామమె మథురమ్మంటూ
రాముని తలచే భక్తులందరూ రామయ వచ్చెను రారండీ
రారండి రారండీ.. రాముని చూతము రారండీ॥”

~

అబ్బ.. ఎంత బాగుందీ! అసలే రామనామము. అందులోనూ మృదుమథురమైన వదిన స్వరంలో.. ఇంతకన్న ఆనందం ఇంకెక్కడైనా ఉంటుందా!

“మరి, నన్నేం చెయ్యమంటావు వదినా..!” అన్నాను ఉత్సాహంగా.

“పద చెపుతాను..” అంటూ వదిన నన్ను రాములవారి సేవకి తీసికెళ్ళింది.

శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం
రామ నామ వరాననే॥

అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం.. అంతా రామమయం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here