శ్రీరామ జయం

0
9

[dropcap]సై[/dropcap]న్యంలో పని చేస్తున్న జయరాం, సరిగ్గా పది నెలల క్రితం దేశ సరిహద్దులలో పొరుగు దేశంతో జరుగుతున్న యుద్ధంలో పాల్గొంటూ శత్రువులకు చిక్కాడు. ఆ తర్వాత అతడి తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా జయరాం గురించి ఎటువంటి సమాచారమూ తెలుసుకోలేకపోయారు. దాంతో జయరాం తండ్రి దశరథరామయ్య తమ కుమారుడు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని రకరకాల పూజలు చేస్తూ దేవుడి గదికి అంకితమైపోయాడు. కొడుకు మీద బెంగతో జయరాం తల్లి సుందరి అనారోగ్యం పాలయ్యి మంచంపట్టింది.

ఒక మంగళవారంనాటి మధ్యాహ్నం సుందరి జయరాం చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, అతడి ఫోటోను చేత్తో ఆప్యాయంగా నిమురుతూ ఉండగా, ఆమె పక్కనున్న ఫోను మోగింది. కళ్ళల్లో ఉబికివస్తున్న కన్నీటిని చీర కొంగుతో అద్దుకుంటూ ఫోను ఎత్తి, “హలో..!” అంది సుందరి.

“ఆంటీ..! నేను వంశీని మాట్లాడుతున్నాను..”, అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు జయరాంతో కలిసి సైన్యంలో పనిచేస్తున్న వంశీ.

“బాబూ వంశీ..! నా బిడ్డ గురించి ఏమైనా తెలిసిందా నాయనా?”, ఆతృత ఆపుకోలేక దుఃఖంతోనూ, భయంతోనూ పూడుకుని పోయిన కంఠంతో అడిగింది సుందరి.

“ఆంటీ! గుడ్ న్యూస్!! జయరాం వచ్చేశాడు ఆంటీ! అది చెప్పటానికే మీకు ఫోను చేశాను. మీరు ఒక్కసారి టీ.వీ. ఆన్ చెయ్యండి. అన్ని ఛానెళ్లూ మన జయరాం గురించే చెబుతున్నాయి. మరి కాసేపట్లో నేనూ, జయరాం మీ దగ్గర ఉంటాం ఆంటీ!”, అన్నాడు వంశీ.

“మంచి మాట చెప్పావు నాయనా!”, అంటూ ఆనందంతో దశరథరామయ్యను పిలిచి విషయం చెప్పింది సుందరి.

దశరథరామయ్య వెంటనే రిమోట్ తీసుకుని టీ.వీ.ని ఆన్ చేశాడు. టీ.వీ. స్క్రీన్‌లో జయరాం ముఖాన్ని చూసిన దశరథరామయ్య దంపతుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి! దాదాపు పది నెలల తర్వాత శత్రువుల చెరనుండీ విడుదల అయ్యి, స్వదేశానికి చేరుకున్న జయరాం ముఖమంతా గాయాలున్నాయి. సరైన ఆహారం లేక అతడి శరీరం క్షీణించి ఉంది. గడ్డమూ, జుట్టూ పోషణ లేక పిచ్చి పిచ్చిగా పెరిగిపోయి ఉన్నాయి. బట్టలు మాసిపోయి చిరుగులు పడ్డాయి. కానీ అతడి కళ్ళల్లో ధైర్యం, గుబురు గడ్డంలో తొణికిసలాడుతున్న చిరునవ్వు అతనిలోని చెదరని ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తూ, అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాయి. అక్కడ గుమిగూడినవారిలో కొందరు, “జయరాం..! జయరాం..!” అంటూ నినాదాలు చేస్తున్నారు. మరికొందరు జయరాంకు అభినందనలు చెబుతూ ఇవ్వడానికి పూలదండలూ, పుష్పగుచ్ఛాలూ పట్టుకుని వరుసలో నిలబడి ఉన్నారు. జయరాం వారందరికీ నమస్కరిస్తూ, తెలిసినవారిని మర్యాదగా పలకరిస్తూ తన కోసం వేచి ఉన్న కారులోకి ఎక్కి కూర్చున్నాడు. మెల్లిగా అక్కడినుంచీ కారు బయలుదేరింది.

“ఏమండీ! ఇదంతా కలా? నిజమా??”, తనకు నమ్మశక్యం కావట్లేదన్నట్లుగా దశరథరామయ్యని అడిగింది సుందరి.

“ఇదంతా నిజమే సుందరీ! నేను ప్రతిరోజూ ఆరాధిస్తున్న ఆ శ్రీరాముడు మన కష్టాన్ని ఇన్నాళ్లకు తీర్చాడు!”, అన్నాడు దశరథరామయ్య తన ఉత్తరీయంతో ఆనందభాష్పాలను తుడుచుకుంటూ.

కొద్దిసేపటి తర్వాత జయరాం వంశీతో కలిసి ఇల్లు చేరుకున్నాడు. జయరాంను చూసిన దశరథరామయ్యకూ, సుందరికీ కన్నీళ్లు ఆగలేదు. తమ బిడ్డను గట్టిగా కౌగలించుకుని కాసేపు ప్రపంచాన్ని మరచి అలాగే ఉండిపోయారు సుందరి, దశరథరామయ్యలు.

“నా చిట్టి తండ్రి! ఎప్పుడు తిన్నావో ఏమో! స్నానం చేసి వస్తే భోజనం చేద్దువుగాని!”, అంది సుందరి జయరాం బుగ్గలను ప్రేమగా నిమురుతూ.

సరేనని జయరాం స్నానం ముగించుకుని వచ్చి వంశీతో కలిసి భోజనం చేశాడు. ఆ తరువాత జయరాం, వంశీలు కాసేపు విశ్రాంతిగా కూర్చుని కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు.

అప్పుడు వంశీ జయరాంని, “ఒరేయ్ జయరాం! శత్రువుల చెరనుండీ నువ్వు ప్రాణాలతో తిరిగి రావడం నిజంగా ఒక అద్భుతం. పైగా, కొరకరాని కొయ్యగా ఉన్న ఆ శత్రువుల మనసును మార్చి, యుద్ధాన్ని ఆపించి, ఇరుదేశాలలో శాంతి స్థాపనను చేయగలిగావు. ఇది మా ఊహకు కూడా అందని విషయం! నువ్వు అసాధ్యమని అనుకున్నదానిని ఎలా సాధ్యం చెయ్యగలిగావురా?”, అని అడిగాడు.

అందుకు జయరాం వంశీతో, “నాకు రామాయణం నేర్పిన పాఠాలే నేటి ఈ విజయానికి కారణమయ్యాయి. రామాయణం గొప్పతనాన్ని గోరుముద్దలు తినిపిస్తూ నేర్పిన మా బామ్మకు నేను ఎప్పటికీ ఋణపడి ఉంటాను”, అన్నాడు.

“రామాయణమా?!! ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిన రామాయణం నేటి కలియుగంలోని పరిస్థితులకు ఎలా వర్తిస్తుంది?”, జయరాంను అడిగాడు వంశీ ఆశ్చర్యంగా.

“ఏ కాలానికైనా ఉపయోగపడే మహాకావ్యం శ్రీమద్రామాయణం. రాముడు తన తండ్రి కోసం వనవాసానికి వెళ్ళాడు. నేను మా నాన్న కోరిక తీర్చడం కోసం సైన్యంలో చేరాను. నేను ఏ పరిస్థితులలో ఉన్నా రామతారక మంత్రం నన్ను కాపాడుతుందని మా నాన్న ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అది నిజంరా! శత్రువులు నన్ను తీసుకుని వెళ్లి అనేక చిత్రహింసలకు గురి చేశారు. అయినా నేనెన్నడూ అధైర్య పడలేదు. ఎందుకంటే ఎప్పటికైనా ధర్మానిదే గెలుపని శ్రీరాముడి చరిత్ర ద్వారా తెలుసుకుని ఉన్నాను. శత్రువుల చేజిక్కి, చెరశాలలో పడి, ఒళ్ళంతా గాయాలై, ‘నా’ అన్నవారు కనపడని క్షణాలు నాకు సీతమ్మవారిని తలచుకుంటే ఎక్కడలేని ధైర్యం వచ్చేది. రాక్షస వలయంలో ఒంటరిగా ఉన్నా, రాముడు వచ్చి ఏదో ఒకనాటికి తనను రక్షిస్తాడని ఎదురు చూసింది సీత! అలాగే నన్ను కూడా ఆ భయంకరమైన కష్టంనుండీ శ్రీరామచంద్రుడే ఏదో ఒకనాడు బయట పడేస్తాడని నమ్మి ఆయన నామాన్ని నిరంతరం స్మరిస్తూనే ఉన్నాను. అప్పుడు గుర్తుకొచ్చాడు హనుమంతుడు! శక్తి పనిచెయ్యనప్పుడు యుక్తిని వాడాలని ఆయన మనకు తను చేసిన పనుల ద్వారా తెలియజేశాడు. అంతేకాదు. అతి కోపం ఎంత చేటో అతి దుఃఖం కూడా అంతే చేటని సుదరకాండ మనకు ఉపదేశిస్తుంది. కాబట్టి కోపాన్ని, బాధనూ పక్కనపెట్టెయ్యాలని అనుకున్నాను. ఆ పని చేశాక నా మనసు కొంత శాంతపడింది. నేను అప్పుడున్న స్థితిలో ఏం చెయ్యగలనా అని ఆలోచించాను. నా సమస్యకు పరిష్కారం రామాయణమే చూపించినట్లయ్యింది. శ్రీరాముడు మైత్రికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చాడు. గుహుడు, జటాయువు, సుగ్రీవుడు.. ఇలా రాముడికి సీతమ్మను వెదకటంలో సహాయమందించినవారెందరో! ఆ సమయంలో నా చుట్టూ ఉన్న కాపలాదారులను జాగ్రత్తగా గమనించాను. వారంతా నన్ను చంపాలని అనుకుంటున్న శత్రువులు! అయినప్పటికీ రాముడి దయవల్లనో ఏమో కానీ వారిలో ఒక మంచి మనసున్న వ్యక్తి ఉన్నాడు. అతడు అప్పుడప్పుడు నన్ను పలకరించి మాట్లాడేవాడు. మెల్లిగా అతడితో స్నేహం చేసి, అతడి సహాయంతో అతడి ఉన్నతాధికారులతోనూ, వారి సహాయంతో ఆ పై అధికారులతోనూ నేను మాట్లాడగలిగాను. ఈ యుద్ధం మొదలుకావడానికి అసలు కారణం తెలుసుకునే ప్రయత్నం చేసి అందరికీ సమ్మతమైన పరిష్కారాన్ని సూచించాను. అది వారికి నచ్చి మన దేశం వారితో చర్చలు జరిపి, యుద్ధాన్ని ఆపేశారు! నా మానవ ప్రయత్నానికి దైవానుగ్రహం తోడయ్యింది. అంతే!”, అన్నాడు జయరాం.

జయరాం చెప్పినది వంశీని విస్మయానికి గురిచేసింది. క్షణకాలం నిశ్శబ్దంగా ఉండిపోయాడు వంశీ.

“ఒరేయ్ జయరాం! మరి నీ ప్రయత్నాలు ఫలించి ఉండకపోతే ఏం చేసుండేవాడివిరా?”, జయరాంను అడిగాడు వంశీ.

“జీవితంలో మనం అనుకున్నది సాధించాలంటే అందుకు మనకు ఎంతో ఓర్పు, సహనం ఉండాలి. శ్రీరాముడి కోసం శబరి జీవితాంతం ఎదురు చూసింది. నేను కూడా అలాగే సరైన అవకాశం కోసం ఎంత కాలమైనా ఎదురు చూసేవాడిని”, అన్నాడు జయరాం.

“రామాయణం గొప్ప కావ్యమని విన్నాను. కానీ దానివల్ల ఇంత ప్రయోజనం కలుగుతుందని నేను అనుకోలేదు!”, అన్నాడు వంశీ.

“అందుకేరా! పెద్దలంతా చిన్నతనంనుండే రామాయణాన్ని తమ పిల్లలకు నేర్పించాలి. అప్పుడు ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో వారికి తెలుస్తుంది. రామాయణంలో నేర్చుకోదగ్గ జీవితపాఠాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరిస్తే రామరాజ్యం మన కళ్లెదుట మళ్ళీ నిలిచే అవకాశముంటుంది!”, అన్నాడు జయరాం.

“రామాయణాన్ని విభిన్న కోణాల్లో విశ్లేషించిన వారున్నారు. శ్రీరాముడి ప్రవర్తనను తప్పుబట్టినవారూ లేకపోలేదు. మరి అటువంటివారికి ఏ సమాధానం ఇవ్వాలి?”, అడిగాడు వంశీ.

“ఒక పని మనకి మంచి చేస్తుందనీ, ఆచరణయోగ్యమనీ పెద్దలు చెప్పినప్పుడు అందులో తప్పులెంచడం అవివేకమే అవుతుంది. ఉదాహరణకు మనకు జబ్బు చేసినప్పుడు వైద్యుడు మందు ఇస్తాడు. ఆ మందు తీసుకోవడంవల్ల మనకు జబ్బు నయమవుతుంది. అలా అది మనకు మంచి చేస్తుంది. ఆ మందు చేసే మంచిని వదిలి, దానివల్ల దుష్ప్రభావాలున్నాయన్న అపోహతో  ఆ మందును వేసుకోకపోతే పోయేది రోగి ప్రాణాలే కదా! ఇది కూడా అంతే!”, అన్నాడు జయరాం నవ్వుతూ.

“ఏదేమైనా నువ్వు చేసిన మంచిపని వల్ల మన దేశప్రజలలో స్ఫూర్తిని నింపావు. మన అధికారులంతా నిన్ను చాలా పొగుడుతున్నారు. నీ స్నేహితుడినైనందుకు నేను కూడా గర్వపడుతున్నాను”, అన్నాడు వంశీ జయరాంను ఆప్యాయంగా కౌగిలించుకుంటూ.

జయరాం, వంశీల సంభాషణను విన్న సుందరి గబగబా మంచం దిగి తూలి పడబోయింది. తన రెండు చేతులూ అడ్డుపెట్టి, “పడిపోతావు సుందరీ! ఎక్కడికెడుతున్నావూ?”, అని అడిగాడు దశరథరామయ్య.

సుందరి దశరథరామయ్యకు బదులివ్వకుండా అడుగులో అడుగు వేసుకుంటూ తన అత్తగారికి చిత్రపటం వద్దకు వెళ్లి, “అత్తగారూ! మీరు జయరాంకు రామాయణం చెప్పిన ప్రతిసారీ నేను మిమ్మల్ని నానామాటలూ అని మీ మనసును చాలా బాధపెట్టాను. ఆ రామాయణమే ఈనాడు నా బిడ్డను బ్రతికించింది. నన్ను క్షమించండి!!”, అంటూ కన్నీటి పర్యంతమయ్యింది.

అప్పుడు దశరథరామయ్య సుందరితో, “చూడు సుందరీ! రామాయణంలో మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేమిటో తెలుసా? ప్రతి మనిషి జీవితం కష్టాలమయం. ఈ కష్టాలన్నీ రామాయణంలో రాక్షసులలాంటివి. కష్టాలన్నిటిలోకీ అతిపెద్ద కష్టం రావణాసురుడన్న మాట. కష్టాన్ని దాటాలంటే మనకు ధైర్యమనే శక్తి కావాలి.ఆ శక్తే సీత! ఆ సీతను పొందాలంటే రాక్షస సంహారం జరగాలి. కష్టాలలో మన మనసు నిలకడను కోల్పోకుండా ఉండాలన్నా, ఆ రాక్షసుల సంహారం జరిగి భవసాగరాన్ని అవలీలగా దాటాలన్నా రామతారక మంత్రమే మనకు శరణ్యం!”, అన్నాడు.

“మీరన్న మాట అక్షరాలా నిజం! పదండి దేవుడి మందిరంలో ఉన్న ఆ రాముడికి ఇవాళ నేను కూడా మీతోపాటూ పూజ చేస్తాను!”, అంటూ దశరథరామయ్య చెయ్యి పట్టుకుని దేవుడి గదివైపుకి నడిచింది అంతవరకూ నాస్తికురాలైన సుందరి!

“రామనామంలోని తియ్యదనాన్ని నువ్వు కూడా రుచి చూద్దువుగాని! రారా వంశీ!!”, అంటూ సుందరిని తన స్నేహితుడితో కలిసి అనుసరించాడు జయరాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here