శ్రీరస్తు దేవతలు శుభమస్తులనగా

0
10

[dropcap]మా[/dropcap]నవ పుట్టుకే పాటతో ముడిపడి ఉంది. అప్పుడే పుట్టిన పసిగుడ్డు కూడా గుక్క పట్టి ఏడవగానే తల్లి ‘హాయీ! చిచ్చుళుళుళువ హాయీ’! అని జోలపాట అందుకుందంటే చాలు టక్కున ఏడుపు ఆపేస్తాడు. అందుకే పూర్వకాలంలో పసిపిల్లల కొరకు బోలెడు జోలపాటలు, లాలిపాటలు రచించబడ్డాయి. పిల్లల నలుగులు, స్నానాలు, సాంబ్రాణులు, ఆరోగ్యం, దిష్టి, ఆటలు అన్నీ విషయాలు ఈ పాటల్లో ఉండేవి. ఈ రోజున తల్లిదండ్రుల ఉద్యోగాల వల్ల పిల్లలు ఆ పాటలు వినకుండానే పెరిగి పెద్దవుతున్నారు. కానీ నా చిన్నతనాన నాకీ దుస్థితి లేదు. మా నాయనమ్మ, ఇరవై నాలుగ్గంటలు ఏదో ఒక పాట పాడుతూనే ఉండేది. మాట మాటకి ఒక పాట అందుకునేది. మా అమ్మ కూడా బాగా పాడేది. ఆ పాటల్లో పిల్లల ఊకీళ్ళ పాటలు, ముద్దకుడుముల పాటల దగ్గర్నుంచి మంగలహారతులు, సమర్త పాటలు, పెళ్ళిలో వియ్యాల వారిని వెక్కిరిస్తూ పాడే పాటలు, తలుపు దగ్గర పాటలు ఒకటేమిటి సమస్తం పాడుతుండే వాళ్ళు ఇంట్లో. అలా చాలా పాటల్ని మా అమ్మ పుస్తకాల్లో వ్రాసి భద్రపరచుకొంది. ఆ పుస్తకాల్లో కొన్ని కనపడకుండా పోయి, కొన్ని చినిగిపోగా మిగిలిన పాటల్ని ఒక పుస్తకంగా తీసుకు వద్దామని ఆరేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది.

మా ఇంటి చుట్టు ప్రక్కల ఇళ్ళలో ఏ పిల్ల సమర్తాడినా, ఏ ఆడపిల్లకు సీమంతం జరుగుతున్నా, ఏ పిల్లోడి బారసాల అవుతున్న వాటికి సంబందించిన పాటల్ని మా అమ్మతో పాడించుకున్నాకే హరతిపళ్ళెం తీసేవాళ్ళు. పాట పాడందే హారతి అద్దేవాళ్ళు కాదు. అందుకని ఒక్కసారి మా అమ్మ పనిలో ఉంటే నన్నూ తీసుకెళ్లమనేది. మా అమ్మ పాడే పాటలన్నీ నాకూ వచ్చూ. మా నాన్నతో పూజలో కూర్చుని గాయత్రి మంత్రాన్ని పఠించడం, మంత్రపుష్పాన్ని లయబద్ధంగా పాడడం, ‘బ్రహ్మ మురారి సురార్చిత లింగం’ అంటూ లింగాష్టకం, ‘రవి సుధాకర మహ్నిలోచన’ అంటూ భ్రమరాంబాష్టకం పాడేదాన్ని. కాబట్టి వాళ్ళంతా “రామ్మా! రామ్మా! ఒక్క ముక్కన్నా పాడి పొదువుగాని రామ్మా” అంటూ నన్ను వెంట తీసికెళ్లి పాటలు పాడించుకొని హారతి అద్దుతూ ఉంటే నేనేదో గొప్ప ఘనకార్యం సాదించినదానిలా ఫీలయ్యేదాన్ని. మా ఇంటి దగ్గర్లో శివాలయం, వీరబ్రహ్మేంద్రస్వామి గుడి ఉండేవి. ప్రతిరోజూ సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి రాగానే (ఇప్పటిలా విపరీతమైన హోం వర్కు ఉండేది కాదు) శివాలయంలో ‘అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, అదిపరాశక్తి పాలయమాం’ అంటూ తాళాలతో భజనలు చేసేవాళ్ళం. అప్పటి పిల్లలకు అయితే ఆటలు లేకపోతే పాటలు అన్నట్లుగా ఉండేది. ‘అన్నా అన్నా విన్నారా వీరబ్రహ్మం వస్తాడు’ అంటూ ఎన్నో పాటలు పాడేవాళ్లం. ప్రతి సోమవారం అక్కడ పూజలకు వెళ్ళి పాటలు పాడి పొంగలి నైవేద్యం తిని ఇంటి కొచ్చేవాళ్ళం.

చిన్నప్పుడు నా ప్రతి పుట్టినరోజును మా నాన్న గ్రాండ్‌గా జరిపించేవాడు. అలా జరిగే ప్రతి పుట్టినరోజుకు మా అమ్మ ఒకటే పాట పడుతుండేది. ‘శ్రీరస్తు దేవతలు శుభమస్తులనగా’ అనే ఈ పాటలో చిన్నారి శశిరేఖా బదులు చిన్నారి రాణి అని మార్చి పాడుతుంది. అందరూ నా కోసమే ఈ పాట తయారుచేశారేమో అన్నంతగా సంతోషపడేవారు. మిగతా పాటంతా శశిరేఖా తల్లిదండ్రులైన రేవతీ, బలరాముల గారాబము, పినతల్లి, పినతండ్రులైన రుక్మిణీ శ్రీకృష్ణులు, మేనత్త సుభద్రల రక్షణ, ముద్దు చేయడం కనిపిస్తుంది. కొంతమంది అక్కడ కూడా ఇంటివారి పేర్లను మార్చి పాడుకుంటుంటారు. కానీ మా అమ్మ శశిరేఖ పేరు దగ్గర తప్ప మిగతా పేర్లను మార్చదు. ఆ దేవదేవుల ఆశీర్వాదాలు, గారాలు మనకే చెందాలని అలాగే ఉంచి పాడుతుంది. ఇలా ఈ పాట మా ఇంటి శుభకార్యల్లోనే కాదు మేం ఏ ఫంక్షన్‌కు వెళ్ళినా ఈ పాటను పాడి తీరవలసిందే. ఈ పాట ఇప్పటికీ కొన్ని వేల సార్లు నా నోట మా అమ్మ నోట పలికి ఉంటుంది. ఎంతో మండి ఈ పాటను మా అమ్మ దగ్గర రాయించుకొని వెళ్లారు. సినిమా పాటే అయినా ఎంతో అర్థవంతంగా ఉండడంతో ఇంటి మంగళహారతి అయి కూర్చుంది. ఈ పాటను నేను పుట్టిన దగ్గర నుంచీ ఇప్పటి వరకూ కూడా వింటూనే ఉన్నాను. బంధువర్గం కూడా “అత్తయ్యా! శ్రీరస్తు దేవతలు అని పాడతావే! ఆ పాట పాడు” అనో, “పిన్ని! పిల్లల పేర్లు పెట్టి పాడతవే! ఆ పాట పాడు” అనో అడుగుతూ ఉంటారు మా అమ్మను. మా బంధువర్గానికంతటికి మా అమ్మ ఈ పాటతోనే గుర్తుంటుంది. మా ఇంట్లో ఆ పాట నిరంతరం వినిపిస్తుండటం వల్ల ఆ పాట నా స్వంతం అన్నంత ఆత్మీయత కలుగుతుంది. అంతగా అల్లుకుపోయింది ఈ పాట మా ఇంట్లో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here