శ్రీ డబ్బీ చెల్లయ్య గారి స్మారకోపన్యాస సభ ప్రెస్ నోట్

0
11

[dropcap]వి[/dropcap]శాఖ సాహితి స్వర్ణోత్సవాలలో భాగంగా 25-7-2021 తేదీన, విశాఖ సాహితి అధ్యక్షులు ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి అధ్యక్షతన ‘శ్రీ డబ్బీ చెల్లయ్య గారి స్మారకోపన్యాస సభ’ అంతర్జాల మాధ్యమంలో జరిగింది.

సభ ఆరంభించే ముందు, విశాఖ సాహితి సభ్యులు శ్రీమతి తిరుమల పెద్దింటి విజయలక్ష్మి గారి మరణానికి సంతాప సూచకంగా ఒక నిముషం పాటు సభ్యులు మౌనం వహించారు. పిమ్మట శ్రీమతి భమిడిపాటి కళ్యాణీ గౌరి ప్రార్థనా గీతంతో ప్రారంభమైన సభలో అఆచార్య మలయవాసిని గారు, ఇప్పటివరకు విశాఖ సాహితి స్వర్ణోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన స్మారకోపన్యాస సభలలొ ఈ సభ మూడవదిగా పేర్కొంటూ, GVMCలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేసిన కీ.శే శ్రీ డబ్బీ చెల్లయ్యగారి పేరిట ఈ స్మారకోపన్యాసాన్నిస్పాన్సర్ చేసిన వారి తనయులు శ్రీ డబ్బీ రాంబాబు గారిని అభినందించారు.

“నేటి తెలుగు భాష – పరిణామము – తీరు తెన్నులు” అనే అంశంపై ప్రసంగించిన ఆచార్య ఎలవర్తి విశ్వనాథ రెడ్డి గారిని శ్రీ డబ్బీ రాంబాబు గారు పరిచయం చేస్తూ ఆచార్య విశ్వనాథ రెడ్డి గారు తమ గురువుగా పేర్కొని, వారు తెలుగు భాష మీద చేసిన పరిశోధనలని కొనియాడారు. తమ పితృపాదులు శ్రీ చెల్లయ్యగారు తెలుగు భాషపట్ల ఎంతో మక్కువ చూపేవారని, వారి ప్రోత్సాహంతోనే తాను తెలుగులో ఎం.ఎ. చేసినట్లు శ్రీ రాంబాబు గారు వివరించారు.

ఆచార్య విశ్వనాథ రెడ్డి గారు విశాఖ సాహితికి ధన్యవాదాలు తెలియచేస్తూ, తమ ప్రసంగంలో, నేటి తెలుగు భాషలో అన్య భాషలలోని పదాలు ఎలా చోటు చేసుకుంటున్నదీ సోదాహరణంగా వివరించి, వార్తా పత్రికలలోని వాడే భాషలోని మార్పులను కూడా కూలంకషంగా చర్చించారు.

సభలో ప్రసంగిస్తున్న ఆచార్య ఎలవర్తి విశ్వనాథ రెడ్డి గారు

కేంద్ర ప్రభుత్వంలోని సెంట్రల్ ఏక్సైజ్ విభాగంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న డా.కె.వి. మోహన్ రావు గారు సభలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ, తమ ప్రకటనలలో వివిధ వ్యాపార సంస్థలు తెలుగు భాషని వినియోగించడం, తెలుగు భాష వాణిజ్య పరంగా ప్రాచుర్యం పొందుతున్నదనదానికి తార్కాణమని పేర్కొన్నారు. తెలుగు భాషని ప్రోత్సహించే దిశగా సంస్థలు, ప్రభుత్వంతో బాటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకి మాతృ భాష నేర్పే విధంగా కృషిచేయాలన్నారు.

తమ అభిభాషణలో ఆచార్య మలయవాసిని గారు, అమెరికాలోని తెలుగు వారు పిల్లలకి ‘మా బడి’ అనే కార్యక్రమం ద్వారా తెలుగు భాష నేర్పడానికి తద్వారా తెలుగు భాషాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని అంటూ, సివిల్ సర్వీసెస్ పరీక్షలలో తెలుగు భాష ప్రధానాంశంగా తీసుకొనే విద్యార్థులకు సహాయ సహకారాలు అందచేస్తున్న శ్రీ డబ్బీ రాంబాబు గారిని, వారి మితృలు శ్రీ రాజ్ కుమార్ గారిని కొనియాడారు.

దేశ విదేశాల నుంచి పలువురు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పాల్గొన్న ఈ సభకు విశాఖ సాహితి కార్యదర్శి శ్రీ ఘండికోట విశ్వనాధం సమన్వయకర్తగా వ్యవహరించగా, సంయుక్త కార్యదర్శి శ్రీమతి లలితా వాశిష్ట వందన సమర్పణ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here