శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-11

0
13

[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]నా[/dropcap] ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.

***

ప్రథమాశ్వాసము:

140.
తే.గీ.:
కాన శోకము విడనాడి మనమునందు
నన్ను ధ్యానించి శుభముల నందుకొనుడు
మీకు సాయుజ్యమిచ్చెద బ్రీతి తోడ
దీని బడసెడు పథమును తెలుపుచుంటి

141.
సుగంధి:
వైరులైన మూర్ఖులైన పాపకర్ములైననున్
కోరి నన్ను ధ్యానమెప్డు కూర్మితోడ జేయగన్
వారి జేతు ధన్యులన్ అపార పుణ్యశీలురన్
నీరజాక్ష మగ్నచిత్త మేయొనర్చు సర్వమున్

142.
సీ.:
నాదైన తత్త్వంబు నజ్ఞానమున నెవ్వ
డెఱుగక నన్నెప్డు దూఱునేని
నా చరిత్రంబును మదిని ద్వేషించుచు
నెవ్వాడు నను నింద జేయునేని
నా గుణగానంబు మహనీయ ముక్తిదం
బని యెరుగ కెవ్వడు వదరునేని
నా దివ్యమహిమంబు నచ్చక నిచ్చలున్
విద్వేషమున నన్ను వీడునేని
తే.గీ.:
వాని వైక్లబ్యమది నేను పరిగణింప
నన్ను నామంబున తలువ నదియె చాలు
అట్టి వానిని, దురితంబులన్ని ద్రుంచి
మోక్ష పదమును ఇచ్చెద మోదమునను

143.
కం.:
దితి కశ్యపులకు సంతుగ
నతులితమగు జన్మ నంది మహితయశంబున్
సతతంబును గడియింతురు
అతిలోకం బైన శౌర్య భాసితులగుచున్

144.
చం.:
అని సెలవిచ్చె శ్రీధరుడు, వారును మిక్కిలి మోదమందుచున్
వినతులు చేసి విష్ణునకు వెళ్లగ, కేశవ దర్శనార్థులై
మునిసుర యక్ష కిన్నరులు పూనిక వేచుచునుండ, వారికిన్
తనదగు దివ్య దర్శనము దారతనిచ్చెను, ధన్యులైచనన్

జయ విజయుల పునర్జన్మము

145.
మ.:
దితికిన్ కశ్యప మౌనికిన్ సుతులుగా దివ్య ప్రభామూర్తులై
క్షితి జన్మించిరి రాక్షసాన్వయమునన్, క్షేమంబు లేకుండగన్
వితతంబైన సురాళి దుఃఖగతులై వేమారు చింతింపగన్
సతతంబున్ సుర ద్వేషమగ్నమతులై శౌర్యంబు పెంపొందగన్

146.
వ.:
ఇవ్విధంబున దేవశ్రవ మునీంద్రుండు గాలవ మహర్షికి వెల్లడించె. ఆ జయవిజయులే, హిరణ్యకశిప, హిరణ్యాక్షులుగా దితి గర్భంబున నుదయించిరని ఎఱింగించెను.

ఆశ్వాసాంత పద్య గద్యములు

147.
మాలిని:
సకల మహిమ భాసా, సర్వ ధర్మ ప్రకాశా
చకిత దివిజ కీర్తీ, సత్య వాక్యానువర్తీ
సుకవి వినుతనామా, సుందరానంద శ్యామా
వికసకమలనేత్రా, విశ్వసమ్మోహ గాత్రా!

148.
స్తోత్రం:
మహిత చాంచల్య ధ్వంసీ, విహిత విజ్ఞానహంసీ
సహిత శ్రీమూర్తి ధారీ, సుహిత కల్యాణకారీ

149.
తరువోజ:
నిరతము జగముల నిలుపుచు ఘనత
విరచితమగు తన విభవము దనర
సురముని నరవర సురుచిర నుతులు
తిరముగ దొరకగ దివిజుల యధిప
వరదుడవయి మము పరమును గనగ
చిరమగు ఘనమతి సురపతి, యొసగు
తరతమముల విడి తగ నిను గొలుచు
విరహితగతి గను విధమును తెలియ

150.
కవిరాజ విరాజితము:
నిజకృప లోకము నిత్యము గాచెడు నిర్ణయశీలుని నిశ్చలునిన్
అజుడును సృష్టికి నంచిత భక్తిని ఆ పరమాత్ముని యాన గొనన్
రజత నగాధిప రాజిత నాట్యము రంజిల విష్ణు విలాసముగా
విజిత సురారి నివేదిత శౌర్యము విశ్వహితంబుకు వేదికగా

151.
కం:
అనితర దివ్య ప్రభావా
ఘనతర మహిమా ప్రకాశ! కరుణాపూర్ణా!
వినతాసుత పరివాహా
మనసిజ జనకా! విభూతి పరిపాల! హరీ!

ఇది పృథమాశ్యాసము

152.
గద్యము:
ఇయ్యది బ్రహ్మశ్రీ లక్ష్మీనరసింహశాస్త్రిపుత్ర, అహోబల నృకేసరి దయా లబ్ధపాండిత్య యుక్త, దత్తశర్మ నామధేయ ప్రణీతంబైన, శ్రీలక్ష్మీనృసింహమాహత్మ్యము నందు, ప్రథమాశ్వాసము.

~

లఘువ్యాఖ్య:

మహా విష్ణువు జయవిజయల కభయమిచ్చినాడు (140). పద్యం 1421 లో తనను చేరు మార్గమును చెప్పినాడు. ఇక పద్యం 143లో స్వామి యొక్క నిర్వికారతత్త్వమును కవి వర్ణించినారు. ఎవరైనా తనను ద్వేషించినా, దూషించినా, గర్వముతో వదరినా వాని వైక్లబ్యము (మూఢత్వము)ను తాను పరిగణించననియు, తన నామస్మరణ చేస్తే చాలు, వారి పాపాలు హరించి, మోక్షమును ప్రసాదిస్తానని చెప్తాడు హరి. పద్యం 143లో జయవిజయులు దితి, కశ్యపులకు పుత్రులుగా జనించి కీర్తిగాంచెదరని హరి నుడివినాడు.

పద్యం 147 నుండి 152 వరకు కావ్య లక్షణముల ననుసరించి కవి ఆశ్వాసాంత పద్యగద్యములు కృతిపతియైన నారసింహ ప్రభువునకు సమర్పించినారు. ఈ పద్యములలో వృత్తి భేదములుండి, కృతిభర్తను కీర్తించునవై ఉంటాయి. పద్యం 147 మాలిని వృత్తం, స్వామి గుణగణముల వర్ణన. పద్యం 148 ఒక సంస్కృత శ్లోకం. కవి స్వంత ఛందస్సు. నరసింహుడు మనో చాంచల్యాన్ని ధ్వంసం చేస్తాడు.

విజ్ఞానమనే హంస. పద్యం 149 తరువోజ. ఇది దేశీ ఛందస్సు. సర్వలఘు సహితము. ప్రతి పాదములో 30 అక్షరములు, 3. యతి స్థానములు. పద్యం 150 కవిరాజు విరాజిత వృత్తము – దీనిలో చక్కని rhythm ఉంటుంది. 3 యతి స్థానాలు. 151 గద్యము. ఇది అశ్వాసము చివర ఉండును. దీనిలో కవి తన తండ్రి గురించి, నరసింహ కృప గురించి సవినయంగా చెప్పి, తన చేత ప్రణీతము (రాయబడినది) ఐన ప్రథమాశ్వాసము ముగిసినదని చెబుతున్నారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here