శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-6

0
10

[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]

నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.

***

ప్రథమాశ్వాసము:

పాలకడలి ఘనత

67.

శా:
క్షీరాంబోధి జనించె చంద్రుడు తగన్ శీతాంశుడై వెల్గుచున్
ఐరావంతము వంటి దివ్యగజముల్ అందుద్భవించెన్ లస
త్కారుణ్యోజ్వల మూర్తి లక్ష్మి గలిగెన్ దామోదరాహ్లాదియై
పారావార విభూత కల్పదృమమే భాసించె దివ్యప్రభన్

68.

తే.గీ:
ఉప్పు సంద్రము యన్నను; నుదధి, మిగుల
తియ్యనైనట్టి యమృతంపు తోయమనిన
పాలసంద్రము యనినను బరగునాత్మ
కడలికొకటియె, స్తోత్రవ్య ఘనగుణంబు

69.

మత్తకోకిల:
కాన నిప్పుడు వార్థి సన్నుతి గాలవాఖ్యుడ! జేసితిన్
తానె శ్రీ హరి స్థానమై మహితాంబు రాశిగ వెల్గెడున్
మానితంబు, గుణానుభావ సమాన్వితంబు ప్రభావమే
దాని వైభవ మెల్ల జెప్పుట దానవాంతకు సేవయే!

70.

కం:
శశి సంభవ వేళ నభో
రాశియు ముదమునను బొంగె రయమున మిన్నున్
విశదముగా నురగలు తమ
భృశ కాంతిని మేఘములను భ్రాంతిని గూర్చెన్

71.

తే.గీ.:
ముత్యముల గుంపు నొడ్డుకు ముదము తోడ
క్షీరసాగరుడటు తెచ్చి పారవేయ
పాలసంద్రము నుండి వెల్వడిన యట్టి
చంద్రకిరణాల పోలిక సౌరు మీరె

72.

చం:
అలలను గౌగిలించె ధర యన్న వధూటిని సాగరుండు, స
ల్లలితసు పల్లవాధరను లాలిత ఫేన నితంబ, స్వేదముల్
మిలమిల ముత్యముల్ యనగ మీనసులోచన, రమ్య భావనన్
అలశశి యేగు దెంచిన, వియత్తల శ్వేతసుధానిధానుడై

73.

సుగంధి:
పర్వతాలనుండి వచ్చు పావన ప్రవాహముల్
సర్వమున్ సమర్పణంబు సల్పి, కల్వ, వార్ధియున్.
గర్వియై నదీ వధూటి గౌగిలించె, ప్రేమతోన్
నుర్వి బొంగె వారి సంగమోధృతీ విలాసమున్

74.

చం:
పగడపు జెట్లు నొడ్డున విభాసిత రక్తసువర్ణకాంతితో
సగర సుతుండు కోపమున చాచినవౌ బడబాగ్ని కీలలో
యగునని తోచ, నిల్చె, నటు భానుడు యెర్రని లేవెలుంగులన్
తగ తరు రాజి పై విసర, ద్వంద్వ విభాస విరాజితంబుగన్

75.

తే.గీ.:
అలల చేతుల నార్చుచు నట్టహాస
రుచిర ఫేనార్క కాంతుల, గోచరించి
జడల పగడాల విదిలించు మృడుని పగిది
జలధి తాండవ నృత్యంబు సల్పుచుండె

76.

మ:
హరి పవళించు పాన్పు, సిరి అందిన యిల్లది, హారి జీరయై
ధరయను కాంత దాల్చు ఘన స్థావరమియ్యది, పర్వతాళికిన్
వర బడబాగ్నికిన్ వసతి, వారిజ శత్రుని వీడు, రత్నముల్
దొరుకు యనంతమైన గని, తోయపురాశి, నదీ శరణ్యమున్

77.

తే.గీ.:
పాలకడలిని మందర పర్వతమున
చిలుకునప్పుడు చిట్లిన శీకరములు
అలుముకొన్నవి తీవల నాకులందు
తెలుపు పూలను బోలుచు వెలుగుచుండె

శ్వేతద్వీప వర్ణనము

78.

వ:

క్షీరాబ్ధిని రమ్యముగా వర్ణించిన తదుపరి దేవశ్రవుండు, శ్రవణ పేయంబుగా, గావలునకు, శ్వేతద్వీపంబు కట్టెదుట నిలుచు భంగి, దాని విశేషంబుల నుడువ దొడంగె –

79

కం:
క్షీరపయోధికి మధ్యన
నెఱచక్కని శ్వేత ద్వీపమింపును గూర్చున్
అరయగ బహు యోజనవి
స్తారము, రమణీయ దివ్య దృశ్యము లలరున్

80.

తరువోజ:
తరగల నురగలు తళతళయనగ
వరశశి వెలుగులు వనరుగ దనర

ఉరగ పతి తనను ఉరుతర సరళి
మరియొక గతిగని మహితము కనగ

నిరతము అలలను నియమిత గతిని
పరిపరివిధముల పనుచుచు గనుచు

ధరనటు నురుగతి తనియగ మురియు
సరితలపతి తన సరసత వెలిగె

81.

తే.గీ.:
జలధి ముత్యాల వన్నియు నలఘ రీతి
శ్వేతదీపంబునందున చేరినటుల
మంచి గంధము మల్లెల పరిమళంబు
చంద్రకాంతిని గూడుచు సాగునచట

82.

ఉ:
ఆ మహనీయ ద్వీపమున నందరు తెల్లని మేనుగల్గి, ని
త్యామరులై, జరంబడక, ధ్యానము సల్పుచు విష్ణు, దేవతల్
తామటు వారి గౌరవము తప్పక చూప జరించుంద్రు, స
న్నేమము సజ్జనత్వమును, మేలు ఘటింపగ, దివ్యరూపులై

83.

కం:
శ్వేత ద్వీపము భవమను
వితతోదధి దాటునావ, విస్తారయశో
ద్యుతులగు సత్పురుషాళికి
సతతామల హర్షమొసగి, సఫలతనిచ్చున్

84.

వ:

గావలమునీ! ఆ శ్వేత ద్వీప వైభవంబును నుతింప నా బోంట్లకు శక్యంబె? దాని మధ్యముననే, వైకుంఠుని ఆవాసము విరాజిల్లుచుండును. దాని మహిమం బమేయము. అది శతసహస్ర దినకరుల వెలుగులు విరజిమ్ముచుండును. దాని హేమప్రాకారములోని మణిశతంబుల కాంతులు, చలించు పతాకముల సొంపు, రత్ననిర్మిత దివ్వ భవన సముదాయములా వికుంఠుని పురమున శోభిల్లుచుండును. వాటి అగ్ర భాగములు అంబరమును చుంబించుచుండును. నాలుగు దిక్కులందు నాలుగు మహా ద్వారములు కలిగి, వాటిపై గల తోరణములతో ప్రకాశించుచుండును. ఆ వైకుంఠపురమును వర్ణింప..

85.

ఉ:
చాలునె నాల్గు శీర్షముల స్వామికి బ్రహ్మకు, తా నుతింపగన్?
వేలుగ నాలుకల్ కలుగు పెద్దని పాముకు నాదిశేషుకున్
మేలుగ విష్ణువాసమును ప్రీతిగ సన్నుతి చేయశక్యమే?
లాలిత సర్వలోకతతి, రాజితభూతి, విశిష్ట ధామమున్

లఘువ్యాఖ్య:

ఈ భాగములో కవి, ముందుగా, మహావిష్ణు నివాసమైన పాలకడలి ఘనతను, అందులోని శ్వేత ద్వీపమును మనోజ్ఞముగా వర్ణించుచున్నాడు. పద్యం 67లో, పాలసంద్రములో చంద్రుడు, ఐరావతము, లక్ష్మీదేవి, కల్పతరువు ఉద్భవించాయని తెలిపారు.

ఉప్పు సముద్రమన్నా, ఉదధి అన్నా, అమృతపు తోయమన్నా, పాలసముద్రమన్నా దానికి ‘ఆత్మ’ ఒకటేనని చెప్పడం (పద్యం 68)లో ప్రకృతిలోని అంతర్లీనమైన ఏకరూపతను కవి ధ్వనిస్తున్నారు. అందుకే మొదట దేవశ్రవుండు దానిని స్తుతిస్తున్నాడు.

పద్యం 70లో, చంద్రోదయ సమయంలో, సముద్రము పొంగి, దాని నురగలు ఆకాశము వరకు వ్యాపించి, మేఘములనే భ్రాంతిని కలిగిస్తున్నాయట. ఈ పద్యములో ఉత్ప్రేక్షాలంకారమున్నది. (Metaphor). డా. జెట్టి యల్లమంద గారు దీనిని భ్రాంతిమదాలంకారమని అన్నారు.

పద్యం 71లో చక్కని ఉపమాలంకారం – పాలసముద్రములోని ముత్యాల గుంపును సాగరుడు ఒడ్డుకు చేర్చగా, అది చంద్రకిరణ సమూహంలా ఉందని కవి పేర్కొన్నారు.

పద్యం 72లో భూమి అన్న స్త్రీని తన అలలతో సాగరుడు కౌగిలిస్తున్నాడని తెలిపారు.

పద్యం 74లో, ఒడ్డున ఉన్న పగడపు చెట్లు ఎర్రని కాంతిలో వెలుగుతుండగా, సగరసుతుడు చాచిన బడబాగ్ని కీలలవలె ఉన్నాయన్నారు. వాటిపై సూర్యుడు ఎర్రని లేత వెలుగులను ప్రసరింప చేశాడు. ఇలా రెండు రకాల ప్రకాశం పరిఢవిల్లిందన్నారు కవి.

పద్యం 77లో పాలసముద్రాన్ని మందర పర్వతంతో చిలుకుతూ ఉన్నపుడు చిట్లిన బిందువులు, తీరమునందలి చెట్ల ఆకులపై పడి తెల్లని పూలవలె ప్రకాశిస్తున్నాయని అన్నారు.

పద్యం 78 నుండి క్షీరాబ్ధిలోని శ్వేతద్వీపాన్ని వర్ణించారు కవి. ఇందులో భాగంగా (పద్యం 80) ‘తరువోజ’ అనే దేశీ వృత్తాన్ని వాడారు. ఇందులో ప్రతిపాదానికి 32 అక్షరాలు 3 యతిస్థానాలు ఉండి, అన్నీ లఘువులే ఉండడం గమనించాలి.

84 ఒక విస్తృత వచనము. దానితో వైకుంఠపుర వర్ణనము ప్రారంభమవుతుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here