శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-7

0
11

[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]

నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.

***

ప్రథమాశ్వాసము:

వైకుంఠపుర వర్ణనము

86.

శా:
ఆ వైకుంఠము దివ్యమైన హరి నామాసక్తులన్ జీరు, రా
జీవాక్షున్ తిరమైన భక్తి నెపుడున్ చేరంగ బ్రార్థించుచున్
కైవల్యంబును కోరు సంతుల నటుల్ గావించు దివ్యాత్ములన్
ఆవాసం బది గాన శౌరికి, మహౌఘధ్వంసి, కంసారికిన్

87.

మత్తకోకిల:
వేదవంద్యుని వీట నంగడి విక్రయించెడు వస్తువుల్
ఆది మోహ విరాగ ముక్తుల సాధనంబులు గావొకో!
మోదమొప్పగ వాటి మూల్యము మోక్షదాయక జ్ఞానమే
ఆదరంబున వాని గొందురు ఆత్మశోధన సొమ్ముతోన్

88.

చం:
వనితలు విష్ణువాసమున వారిజ నేత్రలు, మారుతూపులున్
గనులు సుసౌఖ్య సంపదకు, కాముని కామిని గెల్చు సుందరుల్
తనరెడు వారి నవ్వులవి తన్మయ కారణ దివ్యకాంతులే
తనువులు పుష్ప శోభిత లతా వితానము లాపురంబునన్

89.

ఆ.వె.
మరుడు తనయుండు మాలచ్చి ధర్మపత్ని
సకల శృంగార రసస్ఫూర్తి సదనమదియె
పురవరంబది కైవల్య వరప్రదంబు
తగిన యిల్లది, మురహరి, దాంతునకును

90.

శా:
రాశీభూత దయార్ద్ర మానసు హరిన్ లక్ష్మిన్ వివాహంబునన్
ఆశీర్వాదము చేసినట్టి యువిదల్ ఆ పెద్ద ముత్తైదువల్
ఈశుండైన వికుంఠనాథునకు తామే వేళ సేవార్తులై
ఆశల్ వీడి చరించు చుంద్రునచటన్ ఆనంద సంపూర్ణులై

91.

కం:
ఆ పురి వనములు ప్రసవము
లేపారగ సౌరభముల నెల్లెడ నటులన్
వ్యాపింపజేయు మధురా
లాపంబుల సంచరించు లలనలు పొగడన్

92.

దత్తగీతి:
కీరములు భావిగని కీర్తనలు సేయన్
శారికలు శ్రీహరిని సంస్తుతి సలిర్పన్
చేరియటు తుమ్మెదలు శ్రీ నాదమనగన్
గారముగ కోకిలలు కావించె జతులన్

వ:

మరియు, నా పుర రత్నమందలి సరోవరమ్ములు..

93.

మ:
వర శంఖమ్ములు చక్రముల్ యను నటుల్ వర్తించు పక్ష్యాదులున్
పరిపూర్ణోదర పద్మ సంపదనగా భాసించు క్షీరాబ్ధియున్
హరి మేనుంబలె నల్లకల్వ లచటన్ ఆహ్లాదమున్ గూర్చగా
సురవంద్యుడు వసించు ప్రోలు దనరున్ శోభాయమానంబుగన్

94.

ఉ:
వీచెడు మందమారుతము విష్ణుని నాభి సరోజ వాసనల్
తోచగ, పాదపద్మముల తోయమనంగను గంగ పారగాన్
వేచెడు లచ్చి గాత్రమున వేలుగ బుల్కులు గ్రమ్మగా, కృపన్
గాచెడు పద్మనాభు సురగణ్యులు జూడగ వత్తు రిమ్మెయిన్

95.

వ:

గావల మునీంద్రా, ఆ పట్టణ మహిమంబు పరమాత్మ తత్త్వంబు నుంబలె వర్ణనాతీతంబు. శ్రీదేవీ వాస యోగ్య నారాయణధామము. దివ్య యోగీశ్వర దర్శన యోగ్య వేదాంత పరమార్థము. శ్రీమద్భాగవతమును వలె కేశవ కథాపూరితము. నరకేసరి దివ్యమూర్తిని బోలు ప్రహ్లాదవరదము. అహోబల మహాక్షేత్రంబును బోలి భవనాశినీ ప్రవాహ పావనము మరియును..

96.

సీ:
నారసింహుని నిద్ర నాదరించెడు గుహ
పాతాళమట్టుల పాముల బస
జ్యోతి చక్రము బోలి శోభిల్లు తేజము
ఆత్మ యోగుల కెప్డు నాటపట్టు
సర్వధర్మములకు శాశ్వత ధర్మంబు
భయము లేమియు లేని భద్రపురము
సకల శృతి శాస్త్రసు పురాణ సంస్తుతంబు
సాధు జనాళికి శౌరి యిల్లు
తే.గీ.
తెలియు గమ్యంబు జ్ఞాన జితేంద్రియులకు
ప్రళయ క్లేశంబు జేరని ప్రాపు, మిగుల
విస్మయంబుల నెలవైన విష్ణునిలయ
మట్లు సుభగత్వ యోగ్యంబు నై వెలుంగు

లఘువ్యాఖ్య:

ఈ భాగంలో కవి శ్వేతద్వీపాంతర్గతమైన వైకుంఠ పురమును వర్ణిస్తున్నారు. పద్యం 86 లో శౌరికి ఆవాసం – మహాపాపాలను ధ్వంసం చేసే చోటు. పద్యం 87లో ‘మత్తకోకిల’ అనే విభిన్న వృత్తాన్ని ఉపయోగించారు. అతి లలిత లయాన్వితము. విష్ణుపురాన అమ్మే వస్తువులన్నీ వైరాగ్యశీలుర సాధనాలే. వాటి ధర మోక్షకారియైన జ్ఞానమే. సత్పురుషులు ‘ఆత్మశోధన’ అనే తమ డబ్బుతో వాటిని కొంటారు. ఇక పద్యం 88లో అక్కటి స్త్రీలు మన్మథుని బాణాలు. ఇక్కడ ‘మారు తూపులున్’ అన్న అచ్చ తెనుగు పదబంధం హృద్యం. పద్యం 89లో కొడుకేమో మన్మథుడు. లక్ష్మి భార్య, సకల శృంగార రసస్ఫూర్తికి ఆ పురం ఆలవాలం. అట్లే కైవల్య వరప్రదం కూడా. ఈ పద్యంలో విరోధాభాసాలంకారం ఉంది.

పద్యం 90లో అక్కడి ముత్తయిదువలు హరికి లక్ష్మికి వివాహ సమయంలో ఆశీర్వాదం చేసిన ధన్యులు. పద్యం 92లో అక్కడి చిలుకలు, పిట్టలు తమ శ్రావ్యమైన ధ్వనులతో శ్రీహరిని స్తుతిస్తుంటాయి. తుమ్మెదల ధ్వని శ్రీనాదంలో ఉంది. కోకిలలు జతులను పలికిస్తాయి. ఈ ‘దత్తగీతి’, కవి సొంత ఛందస్సు.

పద్యం 93లో, పక్షులు అక్కడ శంఖచక్రాలవలె ఉన్నాయట. నల్లకలువలు శ్రీహరి శరీరం వలె శోభిల్లుతున్నాయి. 95 లోని వచనము లలిత సమాస బంధురము. ఆది పరమాత్మ తత్త్యంవలె వర్ణించశక్యం కానిది. వేదాంత పరమార్థము. ఇక్కడ కావ్యార్థ భావిసూచనగా, కవి దానిని నరసింహుని దివ్యమూర్తిని బోలు ప్రహ్లాదవరదమని ముందుగానే చెప్పి, నృసింహునిపై తన అచంచల భక్తిని చాటుకొన్నారు. పద్యం 96 లోని సీసపద్యములో శ్రీహరివాసమును భౌతిక, ఆధ్యాత్మిక సౌరభపూరితముగా కవి వర్ణించినారు. అది జ్యోతిచక్రం వలె తేజోపూరితం. సర్వధర్మాలకు శాశ్వత ధర్మము. ప్రళయము అక్కడికి చేరదు. ఎన్నో విస్మయాలకు నెలవు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here