శ్రీ మహా భారతంలో మంచి కథలు-1

1
8

[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]

ఉపోద్ఘాతం:

[dropcap]“య[/dropcap]దిహస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్” ఉగ్రశ్రవసుడు (సూతుడు) శౌనకాది మనులతో భారత కథనంతా చెప్పి చివరగా అన్న మాటలు.

“ఇందులో ఉండేదే ఎక్కడైనా ఉంటుంది, ఇందులో లేనిది ఎక్కడా లేదు”

“What is in Mahabharatha is everywhere, what is not in Mahabharatha is nowhere” – అని దాని అర్థం.

“ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రంబని

        యధ్యాత్మవిదులు వేదాంతమనియు

నీతివిచక్షణుల్ నీతిశాస్త్రంబని

           కవివృషభులు మహాకావ్యమనియు

లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని

           యైతిహాసికు లితిహాస మనియుఁ

బరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్ఛ

           యంబని మహిఁ గొనియాడుచుండ

వివిధవేదతత్త్వవేది వేదవ్యాసుఁ

డాదిముని పరాశరాత్మజుండు

విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై

పరఁగుచుండఁ జేసె భారతంబు.” (1-1-32)

ధర్మ స్వభావం తెలిసినవారు ధర్మశాస్త్ర గంధమని, పరమాత్మ జీవాత్మల సంబంధం తెలిసినవారు (వేదాంతులు) వేదాంత శాస్త్రమనీ, నీతి విషయ కోవిదులు నీతులను తెలిపే శాస్త్రమనీ, కవిశ్రేష్ఠులు గొప్పకావ్యమనీ, లక్షణం తెలిసినవారు పెక్కు లక్ష్యాల సంపుటమనీ, పూర్వకథలు తెలిసినవారు ఇతిహాసమనీ, ఉత్తమ పౌరాణికులు పెక్కు పురాణాల సమూహమనీ, భూమియందు కొనియాడుతూ ఉండగా సర్వవేదాల సత్యస్వరూపాన్ని ఎరిగినవాడూ, వేదాలను విభజించి వేదవ్యాసుడనే పేరుపొందిన వాడూ, ప్రాచీన మునియైనవాడూ, విష్ణువుతో సమానమైనవాడూ అయిన పరాశరుని కుమారుడైన కృష్ణద్వైపాయనుడు సర్వజనులకు హితకరంగా సంస్కృతంలో ‘భారతం’ అనే గ్రంథాన్ని రచించాడు.

‘వ్యాసో నారాయణో హరిః’ – భాగవతంలో చెప్పబడిన శ్రీ మహావిష్ణువు యొక్క ఇరువది యొక్క అవతారాలలో వ్యాసుడు ఒకడు. ఆ వ్యాస భగవానుడికి సాష్టాంగ దండ ప్రణామములు.

మహాభారతం ఒక కథల పేటిక. సామాన్యుడు సైతం ఆ కథలు చదివి అర్థం చేసుకొని, తన జీవన శైలిని మార్చుకోవడానికి యేర్పరచిన వేదిక. మహాభారతం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం. నీతి సూత్రాల సంకలనం. ఆధునిక మానవుడు తాను ఎదురీదుతున్న అనేక సమస్యల సుడిగుండాల నుండి, పరిష్కార తీరాలకు చేర్చే నావ. జీవన కురుక్షేత్రంలో సమస్యల శతృవులను ధీటుగా, ధాటిగా ఎదుర్కొని ధర్మ విజయం పొందడానికై చూపబడిన వెలుతురు త్రోవ. తాకిన జీవన సమస్యా పదఘట్టన విగత జీవికి మహాభారతం సంజీవనీ పానం. ఐహికాముష్మిక పరమైన వాంఛలు అభిలషించే వారికి మహాభారతం కల్పవృక్షం. ప్రాపంచిక దుఃఖ వ్యాధి పీడిత నరునికి మహాభారతం దివ్యౌషధం. నిరాశా నిస్పృహలు, అపజయాలు. కష్టనష్టాలు, అపార దుఃఖాలు, అంతులేని అవమానాలు కలిగినవారికి సాంత్వన వచనం. ప్రియవాక్యం. కాంతా సమ్మిత ప్రేమపూర్వక ఉపశమనం మహాభారతం.

మహాభారతం అమృతఝరి వంటిది. దానిని ఎంతగా గ్రోలాలనుకుంటే అంతగా గ్రోలవచ్చు. ఆస్వాదన పాత్ర ఎంత పెద్దగా ఉంటే దాహం అంతగా తీరుతుంది. మహాభారతం మహాసాగరం. ఉత్తమ కథా మౌక్తిక నిలయం. సాగర గర్భమును మథిస్తే ఆణిముత్యాలు దొరికినట్లుగా, మహాభారత సాగర గర్భాన్ని ఎంత లోతుగా అధ్యయనం చేస్తే, అంత గొప్పవైన వ్యక్తిత్వ నిర్మాణ భావాంశాలు కలిగిన కథలు అనే మేలిమి ముత్యాలు లభిస్తాయి.

మహాభారతం ఇతిహాసం. ఇతిహాసమంటే పరంపరగా చెప్పబడే కథ. ఇందులో కథకుడు శ్రోతలకు కథ చెబుతుంటాడు. కథకుడు ఆఖ్యాత. అతడు చెప్పే కథ ఆఖ్యానం. ఆఖ్యానం అనగా పూర్వోత్తర కథనం, ప్రత్యుత్తరం, భారతాది ఆర్ష మహాకావ్యాలలో నడుమ వచ్చే కథా విశేషం కథ.

ఆఖ్యానం కంటే చిన్న కథ ఆఖ్యానకం. ఇతిహాసంలో ప్రధాన కథ ఆఖ్యానం అయితే దాన్ని అనుసరించి అనుబంధంగా సాగే కథనం ఆఖ్యానకం. పురాణాలలోని సర్గప్రతి సర్గాదులకు సంబంధించిన కథనాలను ఆఖ్యానకాలు అంటారు. స్వయంగా చూచిన చెప్పిన కథనాన్ని అఖ్యానకము అంటారు. ప్రధాన కథనమైన ఆఖ్యానముతో కలిసి దానిని పోషిస్తూ సాగే అనుబంధ కథనం ఆఖ్యానకం. ఇరతుల వలన విన్నదానిని చెప్పటం ఉపాఖ్యానం. ఇది స్వయం సమృద్ధిగా ఉండి ప్రధాన కథలో ఏదో ప్రయోజనాన్ని సాధించడానికి చెప్పబడుతుంది. అలాంటి ఆఖ్యానకాఖ్యానకోపాఖ్యానాలతో నిండి, సార్వజనీన, సార్వకాలిక మానవతా ముత్యాలను బోధించునది మహాభారతం.

అస్తవ్యస్తమైన, అగమ్యగోచరమైన, అశాంతియుతమైన, అవిద్యా పూరితమైన, అసత్యభావ నిర్మితమైన, ఆత్మజ్ఞాన విలుప్తమైన, అధర్మ, పరధర్మ పర్యాప్తమైన ఆధునిక మానవుడి జీవితానికి శాస్త్రమై జ్ఞానము నిచ్చునది, గురువై అంధకారం తొలగించి, వెలుతురు నింపునది, మహాత్ములవలె మార్గదర్శనము చేయునది, కరదీపమైనది పంచమవేదమైన మహాభారతం.

సర్వమానవాళి శ్రేయస్సుకై శ్రీ వేదవ్యాసులవారు వేదాలు విభజించారు. అష్టాదశ పురాణాలు రచించారు. గంభీరమైన భావ సంచయం సామాన్య ప్రజాళి ప్రజ్ఞ కందదని భావించారు. అందుకే ధార్మిక, సామాజిక, ఆర్థిక, నైతిక, ఆధ్యాత్మిక అంశములను సార్వకాలిక సత్యాలను, మానవతా మూల్యాలను, నైతిక సూత్రాలను, మానవ జీవన సంఘర్షణలను, మనుష్యుల చిత్తవృత్తులను, లోకపు పోకడలను, లౌకిక జీవనాన్ని గడుపుతున్న వారికి సులభ గ్రాహ్యమయ్యే విధంగా, ప్రధానాఖ్యానంతో పాటుగా అనేక ఆఖ్యానకోపాఖ్యానాలు అందమైన కథలుగా మలచి మహాభారతంలో పొందుపరిచారు.

మహాభారతంలో గల పిట్టకథలు, పొట్టికథలు, గట్టి కథలు, గుబ్బు కథలు ఆబాలగోపాలాన్ని అలరించడమే కాక మానవాళికి మానసిక వికాసాన్ని సర్వతోముఖాభివృద్ధిని కలిగిస్తూ, అంతర్లీనమైన శక్తులను ప్రేరేపిస్తూ, విజయ లక్ష్యాలను నిర్దేశిస్తూ, అత్యున్నత గమ్యాలకు చేరుస్తాయి. ఈ కథలు హృద్యంగా అపూర్వంగా ఉంటాయి. చతుర్విధ పురుషార్థ జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. ఉత్తమ సంస్కారం ఉన్నత పరిణామం కలిగిస్తాయి.

నాడు ధర్మరాజు వ్యాస, భీష్మ, మార్కండేయ, నారదాది మహాత్ముల నడిగిన ప్రశ్నలను ఏనాడో ఒక జిజ్ఞాసువు మరొకరిని అడిగి ఉంటాడు. ఒక బోద్ధా దానికి సమాధానం చెప్పి ఉంటాడు. అలా ప్రశ్నలకు సమాధానంగా, దృష్టాంతంగా చెప్పబడిన కథలు పరంపరగా జనప్రతిలో సాగి ఉంటాయి. ధర్మబోధలలో దృష్టాంతాలుగా ఇతిహాసాలైన కథార్థాలను నిబంధించే వైఖరి మహాభారతంలో కనబడుతుంది.

మహాభారతంలో కథల ద్వారా చెప్పబడిన ధర్మాలు, నీతులు కొన్ని ఆయా కాలపు సామాజిక, సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కనబడతాయి. రసజ్ఞులైన వారు ఆ కథలలో అంతస్యూత్రంగా చెప్పిన మంచి విషయాలను నేటి పరిస్థితులకు తగినట్లుగా మలుచుకొని, అర్థం చేసుకోవలసి ఉంటుంది. అపుడు చెప్పిన సందర్భాలు ఇప్పటి సందర్భాలకు, వ్యక్తులకు, వ్యవస్థలకు తగిన విధముగా మార్చుకొని, అందులోని సారాన్ని, నైతికతా మూల్యాలను మాత్రం అన్వయించుకోవాలి.

కొన్ని సందర్భాలలో మహాభారతంలో చెప్పినట్లుగానే కథలు ఇందులో చెప్పబడలేదు. ఈ కాలానికి తగినట్లు చాలా చాలా స్వల్పమైన మార్పులు కథలోని ఆత్మ చెడకుండా చెప్పే ప్రయత్నం చేయబడినది. మహాభారత సాగరములో ఆణిముత్యాల వంటి కథలు మాత్రమే స్వీకరించబడ్డాయి.

అయితే పానకం త్రాగేటప్పుడు, అపుడపుడు పంటిక్రిందికి పండ్ల యొక్క తోలుకాని, పిప్పికాని వచ్చి మాధుర్య భంగం చేసినట్టుగా కథా పానమవుడు కొన్ని ప్రస్తుత విషయాలు తగులుతాయి. అలా రసభంగం జరుగకుండా, కథాధారకు అడ్డు రాకుండా, సందర్భాన్ని అనుసరించి, కొన్నింటిని ప్రక్కకు పారవేయడం జరిగింది.

ఇక్కడ ఈ కథలతో పాటు వృత్తాంతాలు, సంవాదాలు, గీతలు (కొన్ని) ప్రస్తావించబడ్డాయి. ఎందుకంటే వీనిలో మానవాళికి కలిగే ఐహికాముష్మిక సందేహాలకు, సమస్యలకు పరిష్కారాలు సూచించబడ్డాయి. కథలు చెప్పే నీతులు, ధర్మోపదేశాలు ప్రత్యక్షంగా పలు పాత్రలచే సూచించబడ్డాయి. కథలో ఉండే సంఘటనలు, సన్నివేశాలు, రసవంతమైన మలుపులు, అద్భుతమైన కొస మెరుపులు వీనిలో లేకపోయినప్పటికీ, మానవ జాతికి ఆవశ్యకమైన వ్యక్తిత్వ వికాసము, మానవతా ముత్యాల బోధన, సందేశం ఇందులోనూ ఉండుటచేత అక్కడక్కడ చేర్చబడ్డాయి.

18 పర్వాలు గల మహాభారతంలో లెక్కకు మిక్కిలిగా కథలు ఉన్నప్పటికీ మానవ జీవన పయనంలో ఎదురయ్యే అనేక సమస్యలకు అంతర్లీనంగా, పరిష్కారాలుగా ఉన్న కథలను ఎంచుకొని, ‘శ్రీ మహాభారతంలో మంచి కథలు’ అనే శీర్షిక ద్వారా పొందుపరచడమైనది.

ఇలా ఈ కథలు/వృత్తాంతాలు/సంవాదాలలో విభిన్న వ్యక్తిత్వాలు దర్శనమిస్తాయి. యే వ్యక్తిత్వం ఉన్నతమైనది, యే వ్యక్తి యే గుణాల చేత ప్రకాశితమయ్యాడు, పతనమయ్యాడు అనే అంశాలు అనేక పాత్రల ద్వారా అవగతమవుతాయి.

ఈ కథల్లోని కొన్ని పాత్రలు సందేశాలు ఇవ్వకపోవచ్చు. కాని వారి జీవన విధానం, చిత్తవృత్తి, నడవడి మానవ జాతికి సందేశాలు. అనుసరణీయాలు. కొన్ని కథలలో ఆ కాలపు ధర్మాలు, మర్మాలు కనిపించి, అభ్యుదయ విరోధంగా, వ్యక్తి స్వాతంత్ర్య నిరోధంగా కనిపిస్తాయి. అయితే కథల వెనుకగల గంభీరమైన తత్వం, ఉద్దేశము అర్థం చేసుకుంటే, ప్రస్తుత కాలం నిజాలు, ఇజాలు మనకు అడ్డురావు.

కొన్ని కథలు ప్రత్యక్షంగా, కొన్ని అప్రత్యక్షంగా సత్య సందేశాన్నిచ్చేవి. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు చెప్పిన సత్యాలు జీర్ణించుకున్న ఈ కథలు కొన్ని గంభీరంగా ఉండి, పాఠకుడు లోతుగా అర్థం చేసుకొని అనుష్ఠించే ప్రయత్నం చేస్తే కాని ఫలితాన్ని ఇవ్వనివి.

సర్వజన సమ్మత, సర్వజనహిత పంచమ వేదమైన మహాభారత బృహత్కథా పంచమ విజ్ఞానాన్ని ఆకళించే ముందు –

వక్త, సృష్టికర్తయైన వేదవ్యాసుల వారిని,

లేఖకుడైన విఘ్నవినాయకునికి,

లోకంలో ప్రవర్తింపచేసిన

వైశంపాయన జనమేజయులకు,

నైమిషారణ్యంలో అనుగ్రహింపచేసిన

ఉగ్రశ్రవసు శౌనకాది మునులకు

ఆంధ్ర జాతికి తెలుగు క్షీరధారతో ముంచి ఇచ్చిన

నన్నయ, తిక్కన, ఎర్రనాదులకు

వేనవేలుగా సాష్టాంగ దండప్రణామాలు సభక్తి పూర్వకంగా

ఆచరిస్తూ..

నన్నీరీతిగ నిలిపిన శ్రీమన్నారాయణుడికి,

నన్నీరీతిగ దీవించిన వాగ్దేవికి,

నన్నీరీతిగ మలిచిన గురుదేవులకు, తల్లిదండ్రులకు

నన్నీరీతిగ స్ఫురింపిన వేనవేల ఉత్తమ గ్రంథములకు, గ్రంథకర్తలకు,

నన్నీరీతిగ రచనకి పురికొలిపిన

తిరుమల తిరుపతి అలమేల్మంగ శ్రీ వేంకటేశ్వరునికి

తిరుమల తిరుపతి దేవస్థాన గ్రంథములకు అనేకానేక ఇతర

గ్రంథములకు, గ్రంథకర్తలకు

శిరసువంచి వేనవేల ప్రణామములు సమర్పిస్తూ..

ఒక్కొక్క కథను తెలుసుకొంటూ, మానవ జీవనాభ్యున్నతి సోపానంలో

ఒక్కొక్క మెట్టును అధిరోహిద్దాం.

– కుంతి (కౌండిన్య తిలక్)

***

1. దీర్ఘతముని వృత్తాంతం!

పూర్వం ఉచధ్యుడు అనే మహాముని ఉండేవాడు. అతడి భార్య పేరు మమత. ఆమె గర్భవతి. వారింటికి బృహస్పతి అతిథిగా వచ్చి, ఆమెను కోరాడు. ఆమె గర్భంలో ఉన్న బాలుడు, దానిని తెలుసుకొని, ఆది ధర్మ వ్యతిరేకమని అరిచాడు. దానికి ముని కోపించి “జీవులందరు కోరే పనిలో నాకు వ్యతిరేకుడవైనావు. కాబట్టి దీర్ఘకాలం చీకటిని అనుభవించు” అని శపించాడు. అతడు దీర్ఘతముడు అనే పేరున పుట్టి వేద వేదాంగాలను తెలుసుకున్నాడు. పుట్టు గ్రుడ్డి అయినప్పటికీ విద్యాబలాన్ని పొందాడు. ప్రద్వేషిణి అనే బ్రాహ్మణ వనితను పెండ్లాడి గౌతముడు మొదలగు పుత్రులను కన్నాడు.

అయితే పుట్టు గ్రుడ్డి అయిన దీర్ఘతముడు ఆనందంగా ఉన్నాడని చెప్పలేము. ఎందుకంటే అతడి భార్య అతడిని విపరీతంగా ద్వేషించేది! ఒకనాడు “నీవు ఎందుకు నన్ను మెచ్చవు” అని అతడు ఆమెను అడిగాడు. ఆమె,

“పతియు భరియించుగావున భర్తయయ్యె

భార్య భరియింపబడుగాన భార్యయయ్యె;

బరగనది మనయందు వీడ్వడియె నిన్ను

నేన యెల్ల కాలము భరియించుగాన” (1-4-228)

భార్యను భరిస్తాడు కాబట్టి మగాడిని భర్త అనే, భర్త చేత భరింపదగినది కాబట్టి ఇల్లాలిని భార్య అంటారు. అది మన పట్ల, నేను నిన్నే యెల్లకాలం భరిస్తూ ఉంటాను కాబట్టి ఆ సంబంధం తారుమారైనది. అయినా ఎంతకాలం నిన్ను భరించగలను. నీవు మరొకచోటకి వెళ్ళుమనగా, దీర్ఘతముడు స్త్రీలు కఠినులు అనుచూ,

“పతిహీనులయిన భామిను । లతిధనవంతలయ్యుఁ గులజులయ్యును ననలం కృతలయ్యెడు మాంగల్యం । హితలయ్యెడు గృపణ వృత్తినిదియు మొదలుగన్”

భర్తలు కోల్పోయిన భార్యలు ఎంత ధనవంతులయినా, ఉత్తమ కులంలో పుట్టిన వారైనా ఇప్పటినుండి దయనీయంగా అలంకారాలు లేని వారివలె, తాళి లేని వారివలె అయ్యెదరు గాక అని శపించాడు. దానికి కోపించిన ప్రద్వేషిణి “ఈ ముసలివాడిని నా కళ్ళ ముందునుండి ఎక్కడికైనా తీసుకొని వెళ్ళండి” అని ఆజ్ఞాపించింది. అతడి కుమారులు గర్వాంధులై, ఆ మునిని కట్టెల మోపుతోపాటుగా కట్టి గంగలో పడవేశారు. అతడు ఆ ప్రవాహంలో కొట్టుకు పోసాగాడు. గంగానదికి బలి అనే రోజు స్నానానికి వచ్చాడు. కట్టెలకు కట్టుబడి ఉండి కూడా, వేదమంత్రాలను చక్కగా చదువుతున్న ఆ బ్రాహ్మణుడిని చూచి, మోపు నుండి విడిపించి, అతడు దీర్ఘతముడని తెలుసుకొని, అంతఃపురానికి తీసుకువచ్చాడు. ఆ రాజు సంతానహీనుడు. కావున దీర్ఘతముని పిలిచి, “నేను కొడుకులు లేనివాడను, నాకు సంతానం దానం చేయుము” అన్నాడు. దానికి ముని అంగీకరించాడు. ఋతుస్నానయైన సుధేష్ణకు అర్పించాడు.

పుట్టు గ్రుడ్డివాడు, ముసలివాడు, నోటినుండి దుర్గంధం వస్తున్న అతడిని అసహ్యించుకొని, రాణి, తనను పోలిన దాది కూతురును ముని చెంతకు పంపింది. దీర్ఘతముడు, ఆ దాది కూతురుకు పదకొండుమంది బలవంతులైన కాక్షి వదులు మొదలైన వారిని కని రాజునకు అర్పించాడు. రాజు “వీరందరూ నా కొడుకులేనా?” అనగా, “కాదు, నీ దాది కూతురు సంతానం, కాని ధర్మ పరాయణులు” అని తెలిపాక, రాజు మరలా, ఆ మునిని వేడుకొని సుదేష్ణను ఋషి తోడ పొందుకు నియోగించాడు. అపుడు ఆ ముని సుదేష్ణ యొక్క శరీరాన్ని తాకి, అత్యంత బలం గలవాడు జన్మిస్తాడని వరమీయగా, అంగ రాజు అనే పేరుగల రాజర్షి పుట్టాడు.

“పూర్వం బ్రాహ్మణ శ్రేష్ఠులు ధర్మశాస్త్ర విధి ప్రకారం రాజు పత్నులందు సంతానాన్ని కలిగించి రాజు వంశాలను నిలిపారు” అని భీష్ముడు సత్యవతికి తెలిపిన కథ.

ఆదిపర్వము చతుర్థాశ్వాసం లోనిది.

***

2. మాండవ్యోపాఖ్యాం!

తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. బాల్య చాపల్యంతో చేసినా, భావగాంభీర్యంతో చేసినా తప్పు తప్పే. చేసిన తప్పుకు శిక్ష తప్పదు. పాపకర్మకు ఫలితం పొందవలసినదే. అది ఎంతటి వారినైనా విడిచి పెట్టదు. ఒక్కొక్కసారి తప్పు చిన్నదైనా శిక్ష పెద్దగా ఉండవచ్చు. ఈ విషయాన్ని తెలిపే కథ మాండవ్యోపాఖ్యానం.

కోపంతో చేసిన పనుల వల్ల ఎంతటి అనర్థాలు సంభవిస్తాయో తెలిపే కథ.

పూర్వం మాండవ్యుడనే బ్రహ్మర్షి అనేక పుణ్యతీర్థాలు సేవించాడు. అడవిలో ఒక ఆశ్రమం నిర్మించుకున్నాడు. అక్కడే ఒక వృక్షం మొదట్లో చేతులు పైకెత్తుకొని ఉంచి, మౌనవ్రతంతో తపస్సు చేయసాగాడు. ఆ ఆశ్రమానికి కొంత దూరంలో ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో గల రాజు యొక్క ధనాగారాన్ని కొందరు దొంగలు దోచుకున్నారు. ఆ దొంగలను భటులు వెంటాడారు. వారు పారిపోయి, ఈ ముని ఆశ్రమానికి వచ్చి ఇక్కడ దాక్కున్నారు. భటులు దొంగలను వెంటాడి వచ్చి, అక్కడ మునిని చూచారు.

“రాజధనం దొంగిలించిన వారు ఇటే వచ్చారు. నీకు తెలిస్తే వారి జాడను చెప్పవలసినది” అన్నారు. ముని మౌనవ్రతంలో ఉండుటచేత మాటలాడలేదు. ఉత్తముల మౌనం సామాన్యులకు అర్థం కాదు. దుర్మార్గులకు ఆ మౌనం కోపం తెప్పిస్తుంది. వారు ఆశ్రమమంతా వెదికి దొంగలను పట్టుకున్నారు. ముని కూడా వారితో కూడిన వాడని భావించి, అతడిని కూడా బంధించి, రాజు దగ్గరికి గొనిపోయారు.

రాజు ఆ దొంగలకు ఉరిశిక్ష వేశాడు. రాజు మునిని చూచి, తపస్వి వేషములో ఉన్న దొంగగా భావించాడు. మునిని నగరం వెలుపలి భాగంలో ఇనుప టెక్కెంలో దిగవేసి, కట్టి వేయించాడు. శూలం మీద శిక్షబడిన ముని చలించకుండా, సుఖదుఃఖాలకు కలత చెందని యోగ చిత్తంతో, నిరాహారియై చాలాకాలం ప్రాణాలతో కూడినవాడై తపస్సు చేయసాగాడు.

ఇంతటి క్లేశం అనుభవిస్తూ, తపస్సు చేస్తున్న ఆ మునిని చూచి, ఇతర ఋషులు రాత్రివేళ పక్షుల ఆకారంలో అతడి దగ్గరికి వచ్చి “నిన్నింతగా బాధ పెట్టిన వారెవరు?” అన్నారు. అతడు

“ఎఱిఁగి యెఱిఁగి, నన్నడుగంగనేల దీని

సుఖము దుఃఖంబు బ్రాప్తించుచోట నరుఁడు

దగిలి తన కర్మవశమునఁ దనరుఁదాని

కర్తగా కన్నులకు నేమి కారణంబు” (1-4-267)

“మీ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా నీన్నడగడం దేనికి? నరుడు తన పూర్వ పాపపుణ్య కర్మల ఫలంగానే సుఖదుఃఖాలు అనుభవిస్తారు. నరుడు తన కర్మ ఫలాలకు తానే కర్త. కాని ఇందులో ఇతరులు కారణమెలా అవుతారు” అన్నాడు.

ప్రారబ్దభోగాన్ని అనుభవిస్తూ బ్రహ్మలో నెలకొని ఉన్న అతడిని చూచి ఋషులు ఆశ్చర్యపోయారు. ఆ మాటలు విన్న, అక్కడ ఉన్న భటులు రాజుగారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు. రాజు వచ్చి అతడిని క్షమార్పణ వేడుకున్నాడు. శూలమును అతడి నుండి విడిపించబోయాడు. ఆ శూలం అతడి శరీరం నుండి విడివడలేదు. దానిని మొదటితో పాటుగా నెమ్మదిగా నరికించగా, అతడి కంఠంలో శూలభాగం మిగిలిపోయింది. దానితో అతడు ఆణి మాండవ్యుడు అని పిలవబడ్డాడు. ఆ ముని గొప్ప తపస్సు చేసి లోకాలన్ని దాటి యమపురికి పోయాడు. మాండవ్యుడు యముడితో, “ఇంత భీకరమైన శిక్షకు నేనేమి తప్పు చేశాను. బ్రాహ్మణుడైన నన్ను ఇంతగా కోపించి కూడని శిక్ష వేయడం న్యాయమా?” అన్నాడు. దానికి యముడు, “నీవు చిన్నతనములో తూనీగలను ఎగురనీయకుండా పట్టి మేకులకు గ్రుచ్చి ఉంచావు. దాని ఫలాన్ని ఇపుడు అనుభవిస్తున్నావు. మరియు “తొలగునె హింసాపరులకు దుఃఖప్రాప్తత” అని సెలివిచ్చాడు.

యముడి మాటలకు మాండవ్యుడు కోపించి, “పుట్టినది మొదలు పదునాలుగేండ్ల వరకు పురుషుడు బాలుడనబడతాడు. అతడు ఏది చేసినా పాపాన్ని పొందడు. అతడికి ఇతరులు కీడు చేస్తే పాపులవుతారు. ఇది నేను చేసిన కట్టడి. నీవు ఇట్టి ధర్మాన్ని భావించక స్వల్పమైన దోషాన్ని చేసిన నాకు బ్రాహ్మణులకు యోగం కాని కఠినమైన శిక్షను ఇచ్చావు. కావున నీవు భూలోకములో శూద్ర వనితకు పుట్టుము” అని శపించాడు. దానితో యముడు విదురుడై పుట్టాడు.

మహాత్ముల శాపం ఎంతటి వారినైనా విడిచి పెట్టదని, అయితే ఆ శాపం ఒక్కొక్కమారు జగత్కల్యాణకారకము అవుతుందని ఈ కథ నిరూపిస్తుంది. ఎందుకంటే మహాభారతంలో విదురుడు ధర్మావలంబియై, నీతి కోవిదుడై, పాండవులకు మార్గదర్శియై తద్వారా మానవాళికి నీతి సారాన్ని అందించాడు. మహాభారతంలో అతడు పోషించిన పాత్ర మరువలేనిది.

జీవహింస చేయటం వలన, పర్యావరణమునకు హాని తల పెట్టటం వలన అది చివరికి మనకు అనేక రకాలైన కష్టాలను కొని తెస్తుందని ఈ కథ తెలియ చేస్తుంది.

‘అవశ్యమనుభోక్తవ్యం కృతం శుభాశుభమ్’ అన్న సూక్తిని నిరూపించునది ఈ కథ.

వైశంపాయనుడు జనమేజయునికి చెప్పినది.

ఆదిపర్వం చతుర్థాశ్వాసం లోనిది.

(The reward of) deeds done, be they good or evil, will assuredly be received.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here