శ్రీ మహా భారతంలో మంచి కథలు-10

0
14

[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]

26. గురుదక్షిణ!

[dropcap]పూ[/dropcap]ర్వం గురుకుల విద్యా వ్యవస్థలో నున్న విద్యార్ధులు లేదా యే గురువు దగ్గరనైనా విద్యను అభ్యసించిన వారు తమ విద్యాభ్యాసం అయిన పిమ్మట గురువుగారికి ధనద్రవ్యవస్తు రూపేణా గురుదక్షిణ సమర్పించుకునే వారు. కొన్ని సందర్భాలలో అలా కాక శిష్యులు గురువుగారి అభీష్టాన్ని కనుక్కుని దానిని నెరవేర్చి అదియే గురుదక్షిణగా భావించేవారు. గురువులు తమ శిష్యులను అలాంటి గురుదక్షిణను కోరేవారు.

శ్రీకృష్ణుడు సాందీపుడు అనే గురువు దగ్గర చదువుకొని, అతడి కొడుకును బ్రతికించి తెచ్చి, ఇచ్చి గురుదక్షిణగా ఇచ్చాడు. గురువు ఆశీస్సులను అందుకున్నాడు. అలాంటి గురుదక్షిణకు సంబంధించిన కథయే భారతంలోనున్నది. అది అర్జునుడు ద్రోణునికి చెల్లించిన గురుదక్షిణ.

కురుపాండవులు తమ తమ విద్యాభ్యాసాలు ముగించుకున్నారు. ఒకనాడు ద్రోణుడు శిష్యులందరిని పిలిచి “నాకు గురుదక్షిణ ఇవ్వండి” అన్నాడు. వెంటనే శిష్యులు “సెలవీయండి” అన్నారు. “బాల్య మిత్రుడనని చూడకుండా, నా పిల్లవాడికి పాలకై గోవును కోరి వెళితే ఘోరంగా అవమానించాడు ఆ ద్రుపదుడు. అవివేకంచే, భయంకరమైన ఐశ్వరంచే గర్వితుడైన ద్రుపదుని ప్రాణములతో బంధించి తెండు, అదియే నాకు గురుదక్షిణ” అని పలికాడు.

రాకుమారులందరు యుద్ధోచిత అస్త్రశస్త్రాలతో, సరంజామాతో పాంచాలపురంపై దండెత్తారు. ముందుగా కౌరవ సేనలు తామే గురువుకు దక్షిణ చెల్లించి, అతడి మెప్పు పొందాలని ద్రుపదుని కోటను ముట్టడించాయి. కాని ద్రుపదుని బాహుపరాక్రమము ముందు దుర్యోధన, యుయుత్స, దుశ్శాసన, వికర్ణాదులు నిలవజాలక భయపడి, పారిపోయి ప్రాణాలు దక్కించుకొని వచ్చినారు. ద్రోణుడు పాండవులను ఆదేశించాడు. తనను మొసలి నుండి అయిదు బాణాలు వేసి కాపాడిన అర్జునుడు ఆ పని చేయగలడని అతడికి తెలుసు. అర్జునుడు, భీముడు ముందుండి నడువగా, నకుల సహదేవులు పార్శ్వమున నుండి నడువగా అన్న ఆశీస్సులు గైకొని ద్రుపదుని రాజ్యంపై దండెత్తాడు. సైన్యాలను చెల్లాచెదురు చేశాడు. చతరుగం బలాలను నుగ్గు నుగ్గు చేశాడు. కోట పేటలు మట్టి చేశాడు. ద్రుపదుడిని ప్రాణంతో బంధించాడు.

“ప్రక్షీణదర్పు ద్రుపదు ర | థాక్షముతోఁ గట్టి తెచ్చి యర్జునుఁడు క్రియా

దక్షుం డయి గురునకు గురు | దక్షిణగా నిచ్చి చేసెఁ దత్సమ్మదమున్‌” (1-6-88)

అర్జునుడు కార్యసాధనా సమర్థుడై గర్వం కోల్పోయిన ద్రుపదుడిని, రథచక్రానికి కట్టి తెచ్చి గురుదక్షిణగా ఇచ్చి ద్రోణుడిని సంతోషపెట్టాడు. అప్పుడు ద్రోణుడు ద్రుపదునితో “మహారాజ్యమదమనెడి అహంకారం తొలగినదో లేదో, ఇకనైనా బాల్య మిత్రుడిని గుర్తుపట్టినాడో లేదో” అని ఎత్తిపొడుపు మాటలు పలికాడు.

ఉత్తమేచ క్షణం కోపో

బ్రాహ్మణుల కోపం క్షణకాల మాత్రమగు గడ్డి మంట యుగుడచే దయతో ద్రుపదుని విడిపించెను. కాని పుట్టుకతో రాజ్య, ధన, బలహంకారాలు కలిగిన ద్రుపదుడు ఆ అవమానాన్ని మనసులో నుంచుకొని, తన రాజ్యానికి వెళ్ళిపోయెను. ఆపై ద్రోణుడు అర్జునుడి గురుభక్తిని మెచ్చుకొని బ్రహ్మశిరోనామక అస్త్రమును ప్రయోగ ఉపసంహారాలతో బోధించెను. నీవే నా ప్రియ శిష్యుడివని సంభోదించెను. తనను ఉన్నతమైన విలుకాడిగా తీర్చిదిద్దిన గురువు అభీష్టం నేరవేర్చి అర్జునుడు పొంగిపోయెను.

ఆదిపర్వం షష్టాశ్వాసం లోనిది.

I am indebted to my father for living, but to my teacher for living well. – Alexander the Great

27. ఏకచక్రపురంలో బ్రాహ్మణ గృహస్థు కథ!

ప్రాచీన భారతదేశపు కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబంలో ఉన్న సభ్యులకు ఒకరి పట్ల మరొకరికి గల ఆత్మీయతల గూర్చి, బాధ్యతలు, ప్రేమలు గూర్చి గృహస్థాశ్రమంలో వచ్చే కష్టాల గూర్చి, వాటిని ఎదుర్కునే తీరుతెన్నులు గూర్చి వివరించే ఇతివృత్తాలు మహాభారతం అడుగడుగునా దర్శనమిస్తాయి. ఆధునిక భారతంలో అడుగంటిపోతున్న మానవతా విలువలకు, కౌటుంబిక విలువలకు అవి మార్గదర్శనం చేస్తాయి.

ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుడి ఇంటిలో పాండవులు తలదాచుకున్నారు. ఆ బ్రాహ్మణుడి ఇంట్లో ఒక సంక్షోభం తలెత్తింది. అక్కడ జరిగిన కథ ఇది. కుటుంబ సంబంధాల గూర్చి, ఎవరెవరి బాధ్యతలు ఎలాంటివో చెప్పడం గూర్చి, ఆతిథ్య, సాంఘిక మర్యాదల గూర్చి వ్యాస మహర్షి నిర్మించిన ఇతివృత్తం మానవీయ కోణాన్ని స్పర్శించడమే కాక కుటుంబ మూలాలకు పట్టుగొమ్మగా నిలుస్తుంది. ఈ కథలోని పాత్రల మధ్య జరిగిన సంభాషణలు, చెప్పబడిన ధర్మాలు పాఠకులకు కళ్ళు తడి పెట్టిస్తాయి. ఔరా! కుటుంబబంధం ఎంత గొప్పదీ అనిపించేలా చేస్తుంది.

పాండవులు లక్షాగృహం నుండి క్షేమంగా బయటపడ్డారు. ఆడవులలో సంచరించసాగారు. ఇక్కడే భీముడు హిడింబాసురుని చంపి, హిడింబను పెండ్లాడి ఘటోత్కచునికి తండ్రి అయ్యాడు. ఆ తరువాత వారు ఏకచక్రపురానికి వచ్చారు. అది ఒక అగ్రహారం. అక్కడ పాండవులు జటావల్కలధారులై, కృష్ణజినాంబరులై, వేదములు పఠిస్తూ, బ్రహ్మచర్యము నవలంబిస్తూ, బ్రాహ్మణవేషాలతో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఉన్నారు.

ఆ ఊరివారిని బకాసురుడను రాక్షసుడు పట్టి వేధిస్తుండేవాడు. వాడి పీడను హింసను భరించలేక, ఆ ఊరి వారందరూ బకాసురుడితో – ప్రతి దినం రాశుల రాశుల ఆహారం, రెండు దున్నపోతులు, ఒక మనిషిని ఆహారంగా పంపే ఒప్పందం చేసుకున్నారు. అలా రోజులు గడుస్తున్నాయి. బకుడు ఊరు మీద పడి బతుకుతున్నాడు.

ఒక రోజు పాండవులు ఆతిథ్యం పొందుతున్న కుటుంబం వంతు వచ్చింది. ఇప్పుడు ఆ ఇంటి నుండి ఒక మనిషిని బకుడికి ఆహారంగా పంపించాలి. ఇంటిలో దుఃఖపు ఛాయలు అలుముకున్నాయి. వారు ఏడువసాగారు. ఇదంతా గమనిస్తున్న కుంతీదేవి తమ ఇంటి యజమానికి యేదో కష్టం వచ్చిందని తెలుసుకొని చలించిపోయింది. వారికి సంతోషం కలిగించాలి అనుకున్నది.

“కృత మెఱుఁగుట పుణ్యము; స | న్మతి దానికి సమముసేఁత మధ్యము; మఱి త

త్కృతమున కగ్గలముగ స | త్కృతిసేయుట యుత్తమంబు కృతబుద్ధులకున్‌” (1-6-244).

“బుద్ధిమంతులైన వాళ్లు ఎదుటి వాళ్ళు చేసిన ఉకారాన్ని గుర్తించటమే గొప్ప పుణ్యకార్యం. మంచి బుద్ధితో దానికి సమానమైన ప్రత్యుపకారం చేయటం మధ్యమమార్గం. అలా కాక చేసిన ఉపకారం కంటే ఎక్కువగా ప్రత్యుపకారం చేయడం ఉత్తమం” అని భీముడితో చెప్పింది. అప్పుడు భీముడు “వాళ్ళ కష్టం తెలుసుకొని నాకు చెప్పు. నేను వారి దుఃఖాన్నిపోగొట్టుతాను” అన్నాడు.

కుంతి వాళ్ళ యింటిలోకి వెళ్ళి దుఃఖిస్తున్న వారిని చూస్తుండగా, ఆ గృహస్థు తన బంధువులతో ఇలా అన్నాడు – “సంసారం గడ్డి వలె నిస్సారము, భయంకరము, దుఃఖావహము, చంచలము. పండితులు యిది సత్యమని నమ్మరు. ఎంతటి యోగికైన పూర్వ జన్మ కర్మ వలన కలవటం, విడిపోవటం వంటి ద్వంద్వాలను అనుభవించటం తప్పదు. నేను నా కుటుంబం ఈ ఆపద నుండి ఎలా తప్పించుకోగలము. ఇక్కడి నుండి వెళ్ళిపోదామంటే నా భార్య వినిపించుకోలేదు. అయినా ఇదంతా చేస్తున్న బ్రహ్మ మమ్మల్ని ఎందుకు పోనిస్తాడు. కర్మ ఫలం తప్పించుకోవటం సాధ్యమా? వేద మంత్ర పూర్వకంగా వివాహమాడిన న భార్యను, ధర్మపత్నిని, ధర్మాభివృద్ధికై వరుడికిచ్చి వివాహం చేయడానికి ఇల్లడగా ఉంచిన నా కుతురుని, పితృదేవతలకు పిండోదకాలు ఇచ్చే ఈ కుమారుడిని, ఈ చిన్నారి పసి బాలుడిని క్రూరంగా బకాసురుడికి ఆహారంగా పంపలేము. కాబట్టి నేనే వెళ్ళి ఇప్పుడే ఆ రాక్షసుడికి ఆహారమవుతాను” అన్నాడు. అపుడు ఆ గృహస్థు భార్య అతడితో ఇలా అన్నది.

“మానవులు దాటరానిదైన ఆపద విషయంలో దుఃఖించరాదు కదా. నా ద్వారా సంతానాన్ని పొందారు. నేను ఋణం తీర్చుకున్నాను. ప్రాణాలు వదిలి అయినా భార్య భర్తకు మేలు చేయాలి.”

“పురుషుకంటె మున్ను పరలోక మేఁగిన | సతియ నోఁచినదియు సతులలోనఁ;

బురుషహీన యైనఁ బరమపతివ్రత | యయ్యు జగముచేతఁ బ్రయ్యఁబడదె” (1-6-256)

“భర్త కంటే ముందు భార్య మరణిస్తే పుణ్యాత్మురాలు. పతివ్రత అయినా భర్త లేని స్త్రీ లోకం చేత నిందింపబడుతుంది. క్రింద పడిన మాంసం ముక్కను పక్షులు కోరే విధంగా భర్త లేని స్త్రీలను పాపులు కోరుకుంటారు. భార్య మరణిస్తే భర్త మరొక భార్యను స్వీకరించటం శాస్త్ర సమ్మతం. భర్త మరణిస్తే భార్య మరొక భర్తను స్వీకరించుట నింద్యం. మీరు లేని నేను జీవించలేను. మీరు మరొక వివాహం చేసుకొని గృహస్థు ధర్మాన్ని పరిరక్షించండి. నేను రాక్షసుడికి ఆహారంగా వెళతాను” అన్నది.

అప్పుడు చనిపోవడానికి సిద్ధపడుతున్న తల్లితండ్రులను చూచి కూతురు ఇలా అన్నది “ఎంత కాలం కలిసి ఉన్నా నేను మీ దానిని కాదు. ఇతరుల సొమ్మును. ఎప్పుడైనా ఇతరులకు ఇవ్వవలసినదే. నన్ను ఆ రాక్షసునికి ఆహారంగా పంపండి.”

“తండ్రిచేయు తిలోదక దాన విధులు | పొందుఁ బరలోకగత యైన పుత్త్రియందుఁ;

బుత్త్రి చేసిన విధులు దత్పురుషుఁ గాని | తల్లిదండ్రులఁ బొందవు ధర్మయుక్తి” (1-6-261)

“తండ్రి వదిలే నువ్వులు, నీళ్ళు మరణించిన కొడుకుకు చెందుతాయి. కాని నీ కూతురు చేసే కర్మలు ధర్మప్రకారం ఆమె భర్తకే కాని తల్లిదండ్రులకు చెందదు. మీకు నా యందు మనమడు పుట్టడం అనే లాభం కంటే, మీరుంటే వంశం నిలుస్తుంది” అన్నది. అపుడు ఆ యింట్లో వున్న పసివాడు, ఒక చిన్న కఱ్ఱను చేత పట్టుకొని, “మీరు దుఃఖించకండి. నన్ను పంపండి. ఆ రాక్షసుడిని చంపి వస్తాను” అని వచ్చీ రాని మాటలతో ఓదార్చాడు. ఆ కుటుంబ సభ్యుల ప్రేమలు, త్యాగనిరతి, ధర్మచింతన, గృహస్థాశ్రమ నిర్వహణా విధానంను చూచి కుంతీదేవి తన మనసులో పులకించిపోయింది. తన మనసులో వారిని అభినందించింది. ఆ గృహస్థు దగ్గరికి వెళ్ళి, అతడి కష్టాన్ని చెవులారా విని, “మీరు విచారించవద్దు. మీకు ఒక్కడే కొడుకు. నాకు అయిదు మంది బిడ్డలు. నా కుమారుడిని మీ ఇంటి వంతుగా రాక్షసుడికి ఆహారంగా పంపుతాను” అన్నది.

దానికి విప్రుడు “అతిథిగా వచ్చిన బ్రాహ్మణుడిని నా జీవితాన్ని నిలుపుటకు ఎలా రాక్షసుని బారిన పడవేస్తాను? బ్రాహ్మణుడిని అవమానించడమే తప్పు. అలాంటిది బ్రాహ్మణ హత్య మహాపాపం కదా.”

“ధృతి సెడి వేఁడెడువానిని | నతిథిని నభ్యాగతుని భయస్థుని శరణా

గతుఁ జంపఁగ నొడఁబడు దు | ర్మతి కిహముం బరముఁ గలదె మదిఁ బరికింపన్‌” (1-6-274)

“ధైర్యము కోల్పోయి ప్రార్థించేవాడిని, అతిథిని, అభ్యాగతుడిని, శరణార్థిని చంపాలనుకునే వాడికి ఇహపరములుంటాయా? మరి నన్ను నేను చంపుకోవడం (ఆత్మహత్య) పాపమంటావేమో, దాటరానిదై, మార్పుకు వీలులేనిదై, ఇతరుల చేత జరుపబడుతున్నది కనుక నాకు పాపం లేదు” అన్నాడు.

ఇట్టి తర్కవితర్కలు అయినప్పటికీ, బ్రాహ్మణుడు సాయం చేస్తే కీర్తీ, పుణ్యం, శుభం కలుగుతాయని భావించి, పైగా భీముడి శక్తి ఎరిగినది కాబట్టి, విప్రుడి కుటుంబాన్ని ఎలాగైనా రక్షించాలని నిర్మయించి, ధర్మజాదులను ఒప్పించి భీముడిని బకాసురుడికి ఆహారంగా పంపించి, ఆ రాక్షసుడి పీడను ఆ కుటుంబానికి, ఆ ఊరుకు లేకుండా చేసింది. ఆతిథ్యం పొందిన యింటి వారి కష్టాలను తొలగించి, కృతజ్ఞత అనెడిది ఎలాంటిదో లోకానికి చాటి చెప్పింది.

కుటుంబంలోని సభ్యుల మధ్య ఉండే ప్రేమానురాగాలు, బాధ్యతలు, ఎలాంటివో కష్ట కాలంలో దైవాంశ సంభూతులైన వారి సహాయం ఎలా ఉంటుందో, కష్టాలు ఎలా దూరమవుతాయో, తిథి, అతిథేయ ధర్మాలు ఎలాంటివో ఈ కథ తెలియజేస్తుంది.

ఆదిపర్వం షష్ఠాశ్వాసంలోనిది.

ఒక ఊరిలో ఏదైనా సమస్య వస్తే, గ్రామస్థులందరూ కలిసి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఏ రకమైన కట్టుబాట్లు చేస్కోనేవారో అన్న విషయం కూడా ఈ కథ ద్వారా తెలుస్తుంది.

Mankind is divisible into two great classes: hosts and guests – Max Beerbohm

త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్

గ్రామం జనపదస్యార్థే, ఆత్మార్థే పృథివీం త్యజేత్.

You should forsake a man for the sake of your family. You should forsake your family for the sake of your village. You should forsake your village for the sake of your country. You should forsake the Earth for the sake of yourself.

28. అంగారపర్ణుడి కథ!

ఏకచక్రపురంలోని బ్రాహ్మణ గృహము నుండి పాండవులు తల్లి ఆజ్ఞ మేరకు పాంచాలదేశానికి పయమనయ్యారు. దారిలో వ్యాసమహర్షిని సందర్శించారు. అతడు ద్రుపదపురానికి వెళ్ళండి మీకు మేలు కలుగుతుంది అని తెలిపాడు. అక్కడ నుండి వారు ఎడతెగకుండా రాత్రింబవళ్ళు ప్రయాణం చేశారు.

ఒక నాటి అర్ధరాత్రి సోమశ్రవమనే తీర్థంలో స్నానం చేయాలని వారు అనుకున్నారు. అర్జనుడు వెలుగు, కొరకు, రక్షణ కొరకు ఒక కొరవిని చేతబూని నడుస్తుండగా అందరూ అతని వెంట వెళుతున్నారు. అప్పుడు అంగారపర్ణుడు అను గంధర్వడు తన భార్యలతో కూడి రాత్రి వేళ జలకాలాడడానికి అక్కడికి వచ్చాడు. పాండవులు అక్కడ ఉండడం చూచి, ధనుస్సు చేతబూని కోపంతో “ఈ అర్ధరాత్రి సమయంలో భూత, యక్ష, రాక్షస, గంధర్వాదులు తిరుగుతుంటారు కనుక ఆ వేళలలో మానవులు తిరగడానికి భయపడతారు. ఈ సమయంలో తిరిగే వాళ్ళను ఎంత బలవంతులైనా, రాజులైనా పడద్రోయగలం. దూరంగా తొలగండి. అంగారపుర్ణుడనే గంధర్వడిని. కుబేరుడి మిత్రుడిని. నేను ఎప్పుడూ ఇక్కడ విహరిస్తుంటాను. ఈ అడవి, గంగాతీరం అంగారపర్ణుడివని ప్రపంచ ప్రసిద్ధి పొందాయి” అని అంగారపర్ణుడు పలికాడు.

అప్పుడు అర్జునుడు “బలహీనులైన ఇతర మానవులు అర్ధరాత్రి, సంధ్యాసమయాలలో నడవటానికి, భయపడతారు. మేము భయపడతామా. వీరులం అవడంచేత ఎప్పుడైనా, ఎక్కడైనా సంచరిస్తాము.”

“అడవులు నేఱులు నివి నీ | పడసిన యవి యట్టె; పుణ్య భాగీరథి యి

ప్పుడమిఁ గల జనుల కెల్లను | నెడపక సేవ్యంబ కాక యిది నీయదియే?” (1-7-41)

“అడవులు, నదలు, నీవు సంపాదించినవా ఏమి? పవిత్ర గంగానది భూమి మీది జనులందరికి తప్పక సేవింపదగినిదే. ఇది నీదా? ప్రకృతి సంపాదించినది. అందరూ సమానంగా అనుభవించవలసినవి కదా” అంటూ సమన్యాయం, సామ్యవాదపు దృక్పథంతో పలికాడు. మరలా అతడే “శివుని జటాజూటంలో ఉచిత స్థానం పొందిన గంగలో స్నానం చేయవచ్చాము. నీ మాటలకు మేము భయపడము” అని పలికాడు. దానితో అంగారపర్ణుడు అర్జునుడిపై కొన్ని వాడి బాణాలు వేశాడు. వానిని తన కొరివితో త్రిప్పి కొట్టాడు. “ఈ మాత్రం బెదిరింపులు, మాయలు మమ్మల్నేమి చేయగలవు. ఈ ఆగ్నేయస్త్రం పూర్వం అగ్నిదేవుడు బృహస్పతుడి ఇచ్చాడు. అతడు భారద్వాజునికిచ్చాడు. ఆ ముని పరశురామునికి, అతడు ద్రోణుడికి, ఆ మహానుభావుడు నాకు ఇచ్చాడు” అంటూ గంధర్వుని మీద ప్రయోగించాడు. తక్షణమే అతడి రథం దగ్ధమైపోయి, దిమ్మతిరిగి నేల మీద పడిపోయాడు. అతడిని ఈడ్చుకొని తీసుకొని వచ్చి ధర్మరాజు కాళ్ళమీద పడవేశాడు. అంగారపర్ణుడి భార్య కుంభీవసి ధర్మరాజును శరణు కోరింది. ధర్మరాజు ఆయనకి శరణును ఇచ్చి, అర్జునినితో విడిచిపెట్టుమన్నాడు. అంగారపర్ణుడు, “ఓటమి చెందిన వాడిని. ఇక నా పేరును విసర్జిస్తాను. చిత్రరథుడిగా పేరు మార్చుకుంటాను. నీతో స్నేహం చేయాలని ఉంది. తపస్సు చేసి పొందిన చక్షుషీ విద్యను నీకిస్తాను. మనువు నుండి చంద్రుడు, చంద్రుడి నుండి విశ్వావసుడు, అతడి నుండి నేను ఈ విద్యను పొందాము. ఈ విద్య చేత సర్వం చూడగలం. దీని వలన దేవతల చేత ఆజ్ఞాపించబడకుండా ఉండగలము. దీనిని తీసుకొమ్ము. అంతేకాదు, మీ అయుదుగురికి ఒక్కక్కరికి వంద గంధర్వ జాతి గుర్రాలను ఇస్తాను” అన్నాడు. “రాజులు, వీరులు ఊరికే తీసుకోరు. కావలసిస్తే ఈ ఆగ్నేయాస్త్రాన్ని తీసుకొని గుఱ్ఱాలనివ్వుము” అని అర్జనుడు అన్నాడు. వారు అలాగే చేశారు. ఆదిపర్వం సప్తమాశ్వాసం లోనిది.

కన్నుమిన్ను కానుక గర్వాంధులై వీరులతో యుద్ధం తెచ్చుకొని పలుచనైన వాడి కథ యిది.

The Lord will destroy the house of the proud – Bible.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here