శ్రీ మహా భారతంలో మంచి కథలు-12

0
11

[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]

31. ఔర్వుని వృత్తాంతం!

[dropcap]వ[/dropcap]శిష్ఠుడి కుమారుడైన శక్తి, విశ్వామిత్రుడి కుట్ర చేత రాక్షసుడిగా శపించబడిన కల్మషపాదుడి ద్వారా చంపబడ్డాడు. శక్తి కొడుకు పరాశరుడు. పరాశరుడు తన తండ్రి, చిన్నాన్నలు రాక్షసుడి చేత చంపబడ్డారని, కోపాగ్నితో మండుతున్న వాడై తన తపోమహిమతో అఖిలలోకాలను నశింప చేస్తానని పూనుకున్నాడు. అపుడు వశిష్ఠుడు పరాశరునికి ఔర్వుని కథ చెప్పాడు.

పూర్వం కృతవీర్యుడనే రాజు భృగు వంశ బ్రాహ్మణులను యాజ్ఞికులుగా పొంది అనేక యాగాలను, లెక్కలేనన్ని దానాలు చేసి స్వర్గస్థుడయ్యాడు. కృతవీర్యుడి వంశీకులు లోభుడై, “భృగు వంశ బ్రాహ్మణులు కృతవీర్యుని ధనాన్నంతా సంగ్రహించారు” అని కోపగించగా కొందరు బ్రాహ్మణులు భయపడి తమ దగ్గర ఉన్న ధనాన్ని తెచ్చి యిచ్చారు. కొంతమంది తమ వంశీకులకు దానంగా ఇచ్చారు. కొందరు తమ ఇళ్ళలో త్రవ్వి పాతిపెట్టారు. ఆ తరువాత క్షత్రియులు ఒక బ్రాహ్మణుడి ఇల్లు త్రవ్వి అధిక దనమును చూచి రాజధనం సంప్రహించారని కోపించి, కడుపులో ఉన్న పిల్లలతో సహా అందరినీ చంపివేసారు. బ్రాహ్మణుల భార్యలు హిమాలయాలకు పారిపోయారు. ఒక్క బ్రాహ్మణుడి భార్య తన తొడలో గర్భాన్ని ధరించింది. ఆవిడకు ప్రళయ కాల సూర్యుడి వంటి భృగు వంశ శ్రేష్ఠుడు ఔర్వుడు పుట్టాడు. అమిత తేజస్సు కల ఔర్యుడిని చూచిన వెంటనే కృతవీర్య వంశీకులు గుడ్డివాళ్ళయి, అడవులు పట్టిపోయారు. జంకూగొంకూ లేకుండా దుర్మార్గం చేసేవారికి దుఃఖం ప్రాప్తించక తప్పదు కదా. ఆ క్షత్రియులంతా ఔర్వుడి తల్లి దగ్గరికి వచ్చి ‘మాకు చూపును ప్రసాదించమ’ని వేడుకున్నారు. “నా కుమారుడు సూర్యుని తేజము కలవాడు. తన తండ్రి, తాతలను అవమానించి చంపారని కోపించి, మీ పాపబుద్ధికి తగినట్లుగా ఇలా చేసాడు. నా కొడుకు వంద సంవత్సరాలు నా ఊరువులలో ఉండి వేదవేదాంగాలు నేర్చుకున్నాడు. అతడు తపోనిధి. అతడిని వేడుకోండి, కరుణిస్తాడు” అన్నది. వారు ఔర్వుని ప్రార్థించి చూపును పొంది వెళ్ళిపోయారు.

మహాత్ముల కోపం క్షణికం కదా. ప్రేమ శాశ్వతం కదా. అటుపై తన వారందరూ మరణించినందుకు దుఃఖించి భయంకరమైన తపస్సు చేసాడు. ఆ తపస్సునకు ముల్లోకాలు భీతిల్లాయి. పితృలోక వాసులైన అతడి తాతలు, తల్లిదండ్రులు సంతోషంతో దిగివచ్చి మిక్కిలి శాంతచిత్తులై యిలా పలికారు:

“నాయనా! నీ తపోమహిమకు లోకాలు భీతిల్లుతున్నాయి. కోపము విడచి పెట్టు. మేము అసమర్థులమై, క్షత్రియుల చేత చంపబడలేదు. ధనం మీది పేరాశతో దోచలేదు. మాకు అవసరమైతే కుబేరుడే యిస్తాడు. తపోమహిమతో మాకు ఆయుష్యు ఎక్కువ కాగా మిక్కిలి విరక్తి చెంది, మానవలోకంలో ఉండడానికి ఇష్టం లేక, ఆత్మహత్య చేసుకుంటే పుణ్యములు రావని, దానిని వదిలి క్షత్రియులతో వైరం పెంచుకున్నాం. ఆ కారణంగా దేహాలు విడిచాం తప్ప, బ్రాహ్మణుల తేజాన్ని ఇవరలు తట్టుకోగలరా? కావున నీవు ప్రజలకు హాని చేయ వద్దు” అని అన్నారు.

“నా తపోమహిమతో లోకాలు నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. దీనిని ఎలా మరలుస్తాను? సూర్య చంద్రులు సాక్షిగా నా మాట వ్యర్థం కాదు. పైగా, తన ప్రతిజ్ఞను నెరవేర్చుకోనని వాడి కోపాగ్ని వెలుపలికి రానిదై ఆరణిలో పుట్టిన అగ్నివలె వెంటనే అతని శరీరాన్ని కాల్చివేస్తుంది. అంతేకాక ఒక కారణం వలన కలిగిన కోపాన్ని తీర్చుకోకపోతే, శాంతుడైన మానవుడు ధర్మార్థ కామాలను రక్షించగలడా? నీచులైన క్షత్రియులు భృగు వంశ బ్రాహ్మణులను హింసిస్తున్న వేళ, వారి దుఃఖధ్వనిని మా తల్లి ఊరువు నుండి వినీ వినీ సహించరాని కోపం నాలో కలిగింది.”

“ఎఱుక గలఁ డేని మఱి శక్తుఁ డేని యన్యు | లన్యులకు హింస గావించునపుడు దానిఁ

బూని వారింపకున్న నప్పురుషుఁ డేఁగు | హింస చేసినవారల యేఁగుగతికి.” (1-7-146)

“జ్ఞానవంతుడు, సమర్థుడు అయినవాడు ఒకరు మరొకరిని హింసిస్తుంటే ఆ హింసను నివారించకుంటే, అతడు కూడా హింస చేసిన వాళ్ళ గతినే (నరకాన్ని) పొందుతారు. కావున దుర్మార్గుల పట్ల కోపాన్ని వహించాను. దీనిని ఆపకుంటే నన్నే దహిస్తుంది. కావున నేనేమి చేయాలి” అన్నాడు.

“నీ భయంకరమైన కోపాగ్నిని సముద్రంలో విడువు. అది ఔర్వాగ్ని పేరుతో గుర్రపు ముఖముతో సముద్రపు నీటిని తాగుతూంటుంది” అని తెలిపారు. అతడు అలాగే తన కోపాగ్నిని సముద్రంలో విడిచిపెట్టాడు. కొంత వరకు శాంతుడయ్యాడు.

కోపాన్ని విడిచిన వాడే కదా నిజమైన ఋషి.

సమర్థుడైన వాడు హింసను నివారించుకుంటే, హింస చేసిన వారి గతినే పొందుతాడు. అంటే సమస్యలు పరిష్కరించగలిగే, నివారించగలిగే సమర్థులు తమ కళ్ళ ఎదుట అన్యాయం జరుగుతుంటే కళ్ళు మూసుకొని కూర్చోకుండా జరుగుతున్న హింసను, దౌర్జన్యాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. లేకుంటే వారూ దుర్గతి పాలు అవుతారు అన్న సత్యం తెలుపుతుంది ఈ కథ. సమర్థులయిన వారు చుట్టూరా జరుగుతున్న అన్యాయాలను నిర్భయంగా ఎదిరించాలి అన్నది పరాశరుడి బోధ.

త్వరపడి తెచ్చుకున్న కోపం, ఎంతటి మూర్ఖత్వంతో కూడినదో, కోపంతో ఉన్నవాడు ఎలాంటి స్థితిలో ఉంటాడో తెలిపే కథ. ఆదిపర్వం సప్తమాశ్వాసం లోనిది.

Anger begins with folly, and ends with repentance – Pythagoras.

32. సుందోపసుందుల కథ

ఒక స్త్రీ ప్రేమను పొందడానికి, పురుషులు పరస్పరం కలహించుకోవడం, ఒక్కొక్కసారి ఒక్క స్త్రీ కోసం రాజ్యాల మధ్య యుద్ధాలై, రాజ్యాలకు రాజ్యాలు నశించడం మనమెరిగినదే. ఒకే స్త్రీ కోసం ఎంతో ప్రేమగా, ప్రాణములో ప్రాణమకా బ్రతికే అన్నదమ్ములు సహితం కలహించుకొని చావును కొని తెచ్చుకున్న వైనం సుందోపసుందుల కథ.

ద్రౌపదిని పాంశంవులు వివాహమాడిన తరువాత, ఒక భార్యతో ఐదుగురు భర్తలు కాపురం చేసే అంశంలో వచ్చే ఇబ్బందులను హెచ్చరిస్తూ, స్త్రీల అందం ఎంత అన్యోన్యం కల పురుషులనైనా ఏ స్థాయికి తెస్తుందో తెలుపుతూ నారదుడు ధర్మరాజు మొదలగు వారికి చెప్పిన కథ.

పూర్వం దితి కుమారుడైన హిరణ్యకశిపుని వంశంలో పుట్టిన నికుంభుడికి సుందోపసుందులు అనే కుమారులు జన్మించారు. తపస్సు చేతగాని, సర్వం పొందులు సాధ్యం కాదని వింధ్య పర్వతానికి వెళ్ళి వేసవి కాలంలో పంచాగ్నుల మధ్య, వర్షాకాలంలో, చలికాలంలో నీటి ముడుగులలో ఉండి గాలిని భక్షిస్తూ, ఒకే కాలిపై నిలబడి, చేతులు పైకెత్తి తలలు వంచి చాలా కాలం తపస్సు చేసారు.

వారి తపస్సుకు వింధ్య పర్వత గుహలలో అగ్ని పుట్టి, ఆకాశానికి ఎగిసి దేవతలను భయపెట్టింది. వాళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, వారి తపస్సు చెడగొట్టాలని చెప్పారు. బ్రహ్మ వారి దగ్గరికి వెళ్ళి, వారి తపస్సుకు మెచ్చి ‘వరం కోరుకోమ’న్నాడు.

వారు కోరిన రూపం కలిగి ఉండేట్లు, కోరిన విధంగా వెళ్లగలిగేట్టు, అన్ని మాయలు కలిగి ఉండేటట్లు, ఇతరుల చేత చావులేకుండా ఉండేటట్లు, అసలు చావే లేకుండా ఉండేటట్లు వరం కోరుకోగా, ‘చావు లేకుండటం’ అనే వరం తప్ప, అన్ని వరాలు బ్రహ్మ వారికి ఇచ్చాడు. దానితో వారు విర్రవీగుతూ లోకాలన్ని జయించాలనే కోరికతో రాక్షసులకు ఆనందం కలిగేట్లు అకాల కౌముదీ ఉత్సవం చేసారు. దానితో మరింత బలవంతులయ్యారు.

సుర, యక్ష, నాగ, కిన్నర పురాలను కొల్లగొట్టారు, భూలోకంలో రాజులను, ఋషులను, బ్రాహ్మణులను బాధించారు. పుణ్యాత్ముల నైమిత్తిక కర్మలకు ఆటంకాలు కలిగించారు. క్రూరజంతువుల రూపాలు ధరించి, అడవులలో తిరుగుతూ, మునిపల్లెలోని మునులకు ప్రాణభయం కలిగిస్తూ తిరిగారు. బాధితులందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి సుందోపసుందులు కలిగిస్తున్న ఆగడాలను, తెస్తున్న ఉపద్రవాలను గురించి వివరించారు. బ్రహ్మ వారు ఇతరుల చేత చావరని, ఒకరితో ఒకరు యుద్ధం చేస్తేనే, చస్తారని వివరించి, విశ్వకర్మను పిలిపించి అందమైన ఒక కాంతను సృజించమని చెప్పాడు. నువ్వుల వలె సూక్ష్మాలైన రత్నాలు కూర్చి చక్కని దేహం గల ‘తిలోత్తమ’ అనే ఉత్తమ స్త్రీని సృష్టించాడు. బ్రహ్మ “సుందోపసుందులు ముల్లోకాలకు కీడు చేస్తున్నారు, వారిద్దరూ నీ కారణంగా తమలో తాము పోరాడుకొని మరణించేటట్లుగా చేయుము” అని ఆమెను ఆజ్ఞాపించాడు. ఆమె అందుకు ఒప్పుకొని, బ్రహ్మ చుట్టు ప్రదక్షిణ చేయగా, ఆమె అందానికి ముగ్ధుడై తలని నాలుగు వైపులు తిప్పగా చతుర్ముఖుడయ్యాడు. దేవేంద్రుడు రెండు కళ్ళలో చూస్తే తృప్తి కలుగడం లేదీని వెయ్యి కళ్ళతో చూసి, వెయ్యి కళ్ళవాడయ్యాడు. ఆమె వింధ్య పర్వతానికి వెళ్ళింది. అన్నదమ్ములు చూపారు. మన్మథ పీడితులై పరస్పర స్నేహాన్నివదిలి అనురాగంతో ఆమె మీద చూపులు నిలిపారు. ఒకే ఆసనం, ఒకే ఆహారం, ఒకే వాహనం, ఒకే నివాసం, ఒకే శయ్య, ఒకే కార్యంగా ఉన్న బలవంతులు దైవవశాన ఆమెను కామించారు

“ఈమె నా భార్య”, “ఈమె నా భార్య” అంటూ ఆమె కుడి ఎడమ చేతులు పట్టుకున్నారు. “నన్నే పెళ్ళి చేసుకోవాలి” అంటూ ఇద్దరు ఆమెను బలవంత పెట్టారు. “మీలో మీరు యుద్ధం చేసి ఎవరు గెలుస్తారో, అతడిని పెండ్లాడతాను” అన్నది. దానితో వారిద్దరు కొండను కొండతో ఢీకొట్టినట్లుగా ఢీకొని, పరాయి వారి వలె విజృంభించి, భయంకరమైన కోపముతో కొట్టుకొని పొడుచుకొని చచ్చిపోయారు.

“ఇంతుల నిమిత్తమున ధృతి | మంతులుఁ బొందుదురు భేదమతి గావున మీ

రింతయు నెఱింగి యొండులు | చింతింపక సమయ మిందు సేయుఁడు బుద్ధిన్‌.” (1-8-114)

“ధైర్యవంతులు కూడా స్త్రీల కారణంగా విరోధం పొందుతారు, కావున ఈ విషయాన్ని యెరిగి ద్రౌపదితో కాపురం చేయండి” అని నారదుడు పాండవులకు హితవు పలికాడు. కాలక్రమేణా ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడైనా విచక్షణ విడిచి పోట్లాడుతుంటే వాళ్ళు సుందోపసుందులు లాంటి వాళ్ళు అనడం రివాజయింది.

స్త్రీల పట్ల ప్రేమ ఒక్కొక్కసారి ఎంతటి ఘాతుకానికి పూనుకొనేలా చేస్తుందో, విచక్షణ, బాంధవ్యం మరిచిపోయేలా చేస్తుందో తెలిపే కథ యిది. పురాణేతి హాసాల్లోని చాలా కథల మాదిరిగా ఈ కథలో కూడా బలవంతుడై శత్రువు నెదిరించి చంపగలిగే ఏకైక అస్త్రం స్త్రీ వలపు, స్త్రీ మోహం. ఈ అస్త్రం తిరుగు లేనిది. మునుల తపస్సును భంగపరచుట నుండి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకొనే వ్యక్తులను విడదీయుట వరకు అన్ని పనులు చేయగలుగునది. ఆధునిక కాలంలో జనులు స్త్రీని వ్యాపార వస్తువుగా వాడుకోగా, పూర్వం స్త్రీని ‘వ్యవహారాలను సానుకూలపరచగలిగే వస్తువు’గా వాడుకోవటం గమనిస్తాము.

ఆదిపర్వం అష్టమాశ్వాసంలోనిది

పాండవులకు నారదుడు చెప్పిన కథ.

కుంకుమ పంక కళంకిత దేహా గౌర పయోధర కంపిత హారా।

నూపుర హంస రణత్పదపద్మా కం న వశీకురుతే భువి రామా॥ (శృంగార శతకం, 9,  భర్తృహరి)

అందమైన శరీగమున జవ్వాజి కుంకుమ పూత మొప్పగా, గుబ్బి చనుగుబ్బలపై రత్నహారములు మాటి మాటికి పెనుగులాడ, పాద పద్మములయందు గజ్జెల యందె మ్రోత వ్యాపింపగా, మన్మథ శోభ కలుగగా కులుకు యువతి అందము ఎవ్వని మోహింపచేయదు?

Whom on earth will a handsome woman – her body besmeared with saffron paste, a necklace dangling on her fair bosom, bells tinkling on her ankle’s – not subdue. –  Bhartrihari.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here