శ్రీ మహా భారతంలో మంచి కథలు-2

0
13

[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]

3. మందపాలోఖ్యానం!

[dropcap]కు[/dropcap]టుంబంలో తల్లిదండ్రులు పిల్లలు ఒకరి పట్ల ఒకరు ఎలా వ్యవహరించాలో, వారి వారి మధ్య ప్రేమానురాగాలతో పాటు బాధ్యతలు ఎలాంటివో, ఒకరికై ఒకరు చేసే త్యాగాలు ఎటాంటివో తెలిపే కథ.

కుటుంబ రక్షణలో అందరికి తెలిసేలా అమ్మ కష్టం, నిగూఢంగా నాన్న కష్టం ఎలా ఉంటుందో చెప్పే కథ. ధర్మార్థ కామానికి నెలవైన గృహస్థాశ్రమ ధర్మం నెరవేర్చలేనిదే, సంసారియై గృహస్థు జీవితం గడపనిదే మోక్షార్హులం కాలేమని తెలిపే కథ. అన్నిటికీ మించి ఆపదలు వచ్చినప్పుడు యే పనిచేస్తే విజ్ఞత అవుతుంది? ఎట్లు మనల్ని మనం రక్షింప చేసుకోవాలో తెలిపే కథ.

పూర్వం మందపాలుడు అనే ముని వెయ్యి సంవత్సరాలు బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి, ఘోరమైన తపస్సు చేశాడు. యోగాభ్యాసం చేత శరీరం విడిచి పుణ్యలోకాలకు ప్రవేశించలేక, దేవతలలో ధైర్యంగా, “నేనేమి పాపం చేశాను? పుణ్యలోకాలు లేకుండా పోయాయి” అని అన్నాడు. “ఎంత తపస్సు చేసినా సంతానం లేని వారు మోక్షాన్ని పొందగలరా? నీ తపస్సెందుకు? వెళ్ళి సంతానం పొందుము” అని దేవతలు పలికారు. మందపాలుడు మానవలోకానికి వచ్చాడు. తాను త్వరగా పుత్రులను ఎలా పొందాలో ఆలోచించాడు.

పక్షులలో సంతానం అధికం. కావున, తాను మగ లావుక పక్షి రూపం దాల్చాడు. ఆడ లావుక పక్షితో సంభోగించాడు. జరితారి, సారిసృక్కు, స్తంభమిత్ర, ద్రోణులు అనే నలుగురు కొడుకులను కన్నాడు. వాళ్ళను ఖాండవవనంలో ఉంచాడు. తన మొదటి భార్య అయిన లపితతో విహరిస్తున్నాడు. ఒకరోజు అగ్నిహోత్రుడు, ఖాండవవనాన్ని దహించడం చూసి, అగ్ని సూక్తాలతో ఆయనను ప్రార్థించి ‘నా బిడ్డలను కాపాడు వారి ప్రాణాలను తీయకుమని’ అర్థించాడు.

ఇది ఇలా ఉండగా, అక్కడ ఖాండవవనంలో జరిత తన నలుగురు పిల్లల తోటి ఉంది. అపుడు ఖాండవ వనం దహించబడటం చూచింది.

రెక్కలు మొలవని, ఎక్కడికి వెళ్ళలేని, బీద మనస్కులైన తన పిల్లలను చూచి దుఃఖించింది. ‘వీళ్ళను వెంట పెట్టుకుపోతాను. వీరి తండ్రివలె దయమాలి, వీరిని విడిచిపోలేను. విధికృతం తప్పించుకోవటం ఎవరికి సాధ్యం’ ఒంటరి ఆడది పిల్లల్ని సాకుతూ, కష్టాల కెదురీదుతూ, ఎవరూ తోడు లేనప్పుడు, ఆపదలు చుట్టుముట్టితే ఇంతకంటే ఎలా భావిస్తుంది. “బిడ్డల్లారా! ప్రళయాగ్నివలె నిప్పుకణాలు దిక్కులన్ని కప్పుతూ అగ్నిదేవుడు ఇటు వస్తున్నాడు. మీరు ఈ బొరియలో దాక్కునండి. నేను మిమ్మల్ని మంటలు తాకకుండా పెద్ద దుమ్ముతో బొరియను కప్పివేస్తాను” అన్నది. “మీ తండ్రి కోరుకున్నట్లు బ్రహ్మజ్ఞానం కల వారిని నలుగురు కొడుకులను కన్నాను. ఈ మహాత్ములకు అపాయం కాకుండా చూసుకో” అని నాకు చెప్పి, తానెటో వెళ్ళాడు. నేనేమి చేసేది” అని కలవరపడుతుంది.

అపుడు పెద్ద కొడుకు జరితారి “అమ్మా! కలుగులో దూరితే ఎలుక చంపుతుంది. ఇక్కడ ఉంటే అగ్ని చంపుతాడు. ఎలుక చేతిలో చావడం కంటే, అగ్నిచేత పడి చచ్చిపోయి, పుణ్యలోకాలకు పోవడం మేలుకదా! అక్కడ చావు తథ్యం. ఇక్కడ మరణం అనుమానాస్పదం. ఎట్లా అంటే

‘జ్వలనంబు వాయువశమునఁ

దొలఁగుడు జీవనము మాకు దొరకొనుఁ; గృచ్చ్రం

బుల సంశయయుతకార్యం

బులు గర్తవ్యములు; నియతములు వర్జ్యమ్ముల్‌’ (1-8-3)

మంటలు గాలి వశమున తొలగి పోతే మేము బ్రతుకుతాము. కష్ట సమయాలలో బాధ కలుగవచ్చును లేదా తప్పిపోవచ్చును అని అనిపించే పనులు చేయాలి. బాధ తప్పదు అనిపించే పనులు విడవాలి. కావున బిలంలోకి వెళ్ళము. నీవు మాత్రం మాపై ప్రేమను విడిచి వెళ్ళుము. నీవు జీవించి ఉంటే మరలా పుత్రులను పొందగలవు. నీ పుణ్యం వలన మేము బ్రతికి ఉంటే, నీవు మా వద్దకు వచ్చి రక్షిస్తావు” అని మ్రొక్కగా జరిత కన్నీరు విడుస్తూ, వస్తున్న అగ్నిహోత్రుడిని చూచి ప్రాణభయంతో ఎగిరిపోయింది. ఆ నలుగురు బ్రహ్మదేవుని నాలుగు ముఖముల వలె నాలుగు వేద మంత్రాలతో, మాకు అభయమిమ్మని అగ్నిహోత్రుని ప్రార్థించారు. అగ్నిదేవుడు మందపాలుని ప్రార్థన మేరకు వారిని భక్షించలేదు. జరిత మళ్ళీ కొడుకుల దగ్గరికి వచ్చి సుఖంగా నున్నది. అక్కడ మందపాలుడు ఖాండవవనము దహించబడడం తెలుసుకొని తన భార్యా పుత్రుల గూర్చి దుఃఖించాడు. అగ్నిహోత్రుడు మాట నిలబెట్టుకున్నాడో, లేక నా పిల్లలను చంపివేసాడోనని సందేహించాడు. భయపడ్డాడు ‘ఎంతైనా దుర్మార్గులను నమ్మరాదు కదా’ అనుకున్నాడు.

అపుడు మందపాలుడి భార్య లపిత, “నీవు ప్రార్థించగా, అగ్నిదేవుడు వార్యులను రక్షిస్తాను అన్న మాట మరిచావా? భార్య మీది ప్రేమతో నీవు దాని యోగక్షేమాలు విచారిస్తున్నావు. అది పక్షి. ఎక్కడికైనా పరుగెత్తగలదు. దానికేమీ కాదు చింతించకు” అనగా మందపాలుడు నవ్వుతూ – “వశిష్ఠుని వంటి పురుషుడునైనా అరుంధతి వంటి భార్య కూడా స్త్రీ విషయంలో అనుమానించకుండా ఉండదు. ఇది స్త్రీ సహజం” అని లపితను వదిలి అడవికి వెళ్ళి, కొడుకులతో ఉన్న జరితను చూచి సంతోషించి, తన ఇచ్ఛానుసారం వెళ్ళిపోయాడు.

మానవీయ కోణం, మాతృహృదయం, పితృహృదయం. పెద్ద కొడుకు బాధ్యత, ఆపత్కాల విచక్షణ వంటి అంశాలను ఆవిష్కరించిన ఈ కథలో స్త్రీ సహజమైన అసూయ (లపిత), స్త్రీలు భర్తలు పడే కష్టాలను గమనించక, భర్తలు చూపే బాధ్యతలను అర్థం చేసుకోక (జరిత) చూపే అసహనం కూడా కలగలసి ఈ కథ మరింత అందమైనదై మానవ జీవితాన్ని వ్యాఖ్యానించింది.

ఆదిపర్వం – అష్టమాశ్వాసం లోనిది.

జనమేజయుడు వైశంపాయనకు చెప్పినది.

Mother is the name for God in the lips and hearts of little children. -W.M.Thackornay

A mother who is really a mother is never free. – Honorede Balzae

4. అగ్రతాంబూలం!

ధర్మరాజు రాజసూయ యాగం అత్యంత వైభవంగా, వందనీయంగా జరిగింది. ముల్లోకాలు ధర్మరాజును ప్రశంసించాయి. ఇంత ఘనంగా జరిగిన ఈ వేడుకలో ఒక అత్యున్నత వ్యక్తిని గౌరవించి అతడికి అగ్రతాంబూలం ఇవ్వాలన్న ఉద్దేశంతో భీష్ముడు ధర్మరాజుతో ఇలా అన్నాడు.

“స్నాతకుండును ఋత్విజుండును సద్గురుండును నిష్టుఁడున్‌

భూతలేశుఁడు సంయుజుండును బూజనీయులు; వీరిలోఁ

బ్రీతి నెవ్వఁడు సద్గుణంబులఁ బెద్ద యట్టి మహాత్ము వి

ఖ్యాతుఁ బూజితుఁ జేయు మొక్కనిఁ గౌరవాన్వయవర్ధనా!” (2-2-4)

ఓ ధర్మరాజా! స్నాతకుడు, ఋత్విజుడు, సగ్దురుడు, ఇష్టుడు, భూపాలుడు, జ్ఞాన సంపన్నుడు – పూజించదగినవాళ్ళు. ఈ ఆరుగురిలో సద్గుణాల చేత ఎవడు అధికుడో అలాంటివాణ్ణి ఒకణ్ణి ప్రేమతో పూజించుము” అని శ్రీకృష్ణుడు అందరిలోకి గొప్పవాడు, మహాత్ముడు లోక విఖ్యాతుడు అని స్ఫురించేట్లుగా సందేశమునిచ్చాడు.

ధర్మరాజు సూక్ష్మం గ్రహించాడు. కాని ఇందరు పెద్దలుండగా తనకిష్టమైన నిర్ణయం తీసుకోవడం ఇష్టం లేక, “అటువంటి వాడు ఎవడో నాకు తెలియజెప్పుము, తాతా!” అన్నాడు.

అపుడు భీష్ముడు – సూర్యుడు తన కిరణాల సమూహంతో అంతరిక్ష గుహను వెలిగించేటట్లు, చల్లని కిరణాలు గల చంద్రుడు అమృత సమూహాన్ని స్రవించే వెన్నెల చేత ఆనందించేసేట్లు, సత్పురుషులతో సేవించదగినవాడు, తెల్లదామరల వంటి కన్నులు కలవాడు, ఆద్యంతాలు లేనివాడు, పద్మాన్ని నాభిలో కలవాడు అయిన విష్ణు స్వరూపుడగు శ్రీకృష్ణుడు అర్ఘ్య ప్రదానికి అర్హుడు. అగ్రతాంబూలం ఇచ్చి పూజించదగినవాడు. కావున సర్వలోక పూజ్యుడు అయిన అచ్యుతుడిని పూజించమని పలికాడు.

భీష్ముని మాటలు అనుసరించి, సహదేవుడు తెచ్చిన అర్ఘ్యాన్ని పూజార్హుడైన శ్రీకృష్ణుడికి శాస్త్రోక్త పద్ధతి ప్రకారం సమర్పించాడు.

ఆ విధంగా ఆ ఘట్టం వైభవంగా ముగిసింది. సభాసదులు సంతోషించారు అనుకుంటాం. ఆ ఘట్టం శిశుపాల వధకు దారితీసింది.

ఈ ఘట్టం చిన్నదైనా సందేశంతో కూడినది. మనం రకరకాల కార్యక్రమాలు, ఉత్సవాలు, గృహసంబంధ శుభకార్యాలు నిర్వహిస్తుంటాం. అలాంటి కార్యక్రమాల చివరలో ఒక ఉన్నతుడిని పూజించడం మంచి సంప్రదాయం. మరి ఎవరిని పూజించాలి. దండలు వేస్తామంటే వంచే మెడలు చాలా ఉంటాయి. ఎవరిని గౌరవించినా మరొకరికి కోపం వస్తుంది. ధర్మం ఏమి చెబుతుంది? అన్నది ఆలోచించాలి. మహాభారతం పై లక్షణాలు కలవాడిని ఉత్తముడిగా, దైవసమానుడుగా నిర్ణయించుకోమని తెలిపింది. కొండొకచో అలాంటి సందర్భాలలో ఆక్షేపించే శిశుపాలుని వంటివారు ఎదురైనా భయపడరాదు.

సభాపర్వం ద్వితీయాశ్వాసం లోనిది.

Show me the man you honour and I will know what kind of man you are. – Thomas Carlyle.

5. విరోచన సుధన్వుల వృత్తాంతం!

“ధర్ము వెఱిఁగి దానిఁ దా నొండుగా లాభ

లోభ పక్షపాతలోలబుద్ధి

సభల నెవ్వఁడేని సభ్యుఁడై పలుకు వాఁ

డనృతదోషఫలము ననుభవించు” (22-238)

ధర్మాన్ని తెలిసి కూడా, లాభం చేతనో, లోభం చేతనో, పక్షపాతం చేతనో, ఊగిసలాడే బుద్ధితోనో సభల్లో ఎవడైనా – దానిని మరొక విధంగా పలికితే, అతడు అసత్యదోషం వల్ల కలిగే ఫలాన్ని పొందుతాడు.

ఈ న్యాయం పురాణేతిహాసాల్లో వినిపిస్తుంది.

పూర్వం ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు, అంగిరసుడనే బ్రాహ్మణుడి కొడుకు సుధన్వుడు ఒక కన్యను దానం పుచ్చుకొనే విషయంలో – అన్ని సుగుణాలలో ‘నేనెక్కువ’, ‘నేనెక్కువ’ అంటూ పోట్లాడారు. కన్య కోసమై ప్రాణాలు పందెంగా ఒడ్డ, తగవులాడుకొని ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళారు. సుధన్వుడు ప్రహ్లాదునితో, “నీవు ధర్మం తెలిసిన వాడివి. మా తగవు తెలుసుకొని గుణాల చేత గొప్పవాడు ఇతడో, నేనో తీర్పు చెప్పు. నీ పుత్రుడని పక్షపాత బుద్ధితో తీర్పు చెప్పితే దేవేంద్రుని వజ్రాయుధం నీ తలను పగుల గొట్టుతుంది” అని అన్నాడు. ప్రహ్లాదుడు భయపడి కశ్యపుని దగ్గరికి వెళ్ళి, జరిగినదంతా చెప్పాడు.

“సాక్షియును ధర్మదర్శియు సాక్షిధర్మ

విధులు దప్పంగఁ జెప్పిన నధమవృత్తి

వరుణపాశసహస్రంబు వానిఁ గట్టి

పాయు నేఁటేఁట నొక్కొకఁ డాయతముగ.” (2-242)

సాక్షీ ధర్మాన్ని దర్శించే న్యాయమూర్తి అయిన వాడు – సాక్షి నియమాలను, ధర్మ నియమాలను తప్పి నీచంగా ప్రవర్తించి సాక్ష్యం, ధర్మం చెప్పితే అలాంటివాణ్ణి వెయ్యి వరుణ పాశాలు బంధిస్తాయి. ఏటేటా ఒక్క పాశం వంతున వదులుతాయి. ధర్మం అధర్మం చేత బాధింపబడి సభకు వస్తే, దాన్ని తీర్చని సభ్యులు అధర్మం చేత బాధించబడతారు. అంతేకాదు సభ్యులు కామక్రోధాలు విడిచి అధర్మాన్ని ఆపనినాడు, ఆ అధర్మంలో ఒక నాలుగవ భాగం సభ్యులకు, మరొక నాలుగవ భాగం రాజుకు మిగిలినది వర్తకు సంక్రమిస్తుంది. అందుచేత ధర్మం తప్పక చెప్పాలి” అని కశిపుడు ప్రహ్లాదునికి సలహా ఇచ్చాడు.

ధర్మబుద్ధి కల ప్రహ్లాదుడు ఆ సలహా పాటించి, ఆలోచించి తన కొడుకు కంటె సుధన్వుడే గొప్పవాడని తేల్చి చెప్పాడు. “పుత్ర ప్రేమ వదిలి ధర్మం తప్పక చెప్పావు” అని ప్రహ్లాదుడిని సుధన్వుడు పొగిడి, వెళ్ళిపోయాడు. పుత్ర ప్రేమ కంటే ధర్మం గొప్పదని, ధర్మ విచారణలో తనపర తేడా లెంచక నిష్పాక్షికంగా ఉండాలని చెప్పే కథ ఇది.

నేటి న్యాయవ్యవస్థలో ఉంటున్న న్యాయవాదులు, న్యాయమూర్తులకు తప్పక మార్గదర్శకత్వం చేస్తుంది.

సభాపర్వం ద్వితీయాశ్వాసం లోనిది.

The administration of justice is the firmest pillar of government. – George Washington

He who decides a case without hearing the other side, though he decides justly, cannot be considered just – Seneca.

జన వాక్యంతు కర్తవ్యం ॥ One should act according to the people’s voice.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here