శ్రీ మహా భారతంలో మంచి కథలు-3

0
10

[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]

6. వాతాపి – ఇల్వలుడు!

ఇల్వలుడు – వాతాపి అనే రాక్షసులు బలవంతులు, శత్రుభయంకరులు. వారు మణిమతీ పురంలో వైభవోపేతంగా నివసిస్తూండేవారు. వారిలో అన్నగారు ఇల్వలుడు. అతడు ఒకనాడు ఒక విప్రుడిని భక్తితో పూజించి, “నాకు సమస్తమైన కోరికలు నెరవేరే మంత్రాన్ని ఉపదేశించండి” అని కోరాడు. కాని విప్రుడు అట్టి మంత్రోపదేశం చేయకపోవటంతో మరలిపోయి, కామరూపుడైన తన తమ్ముడు వాతాపిని మేకగా మార్చి ఆ మేక మాంసం వండించి, ఆ బ్రాహ్మణుడికి విందు చేశాడు. ఆ బ్రాహ్మణుడి పొట్టలో ఉండే ఆ పౌరుడిని “ఓ వాతాపీ రమ్ము” అని ఇల్వలుడు ప్రీతితో పిలిచాడు. ఆ విధంగా బ్రాహ్మణుడు మరణించాడు. అప్పటి నుండి తన దగ్గరికి అతిథులుగా వచ్చే విప్రులను యమపురికి పంపుతుండేవాడు. ఇది ఇలా ఉండగా అదే అడవిలో బ్రహ్మచర్య దీక్ష చేస్తూ కఠోర తపస్సు చేస్తున్న అగస్త్య మహాముని ఉండేవాడు. ఒకనాడు లేత తామర చిగురుటాకును ఆధారంగా చేసుకొని తలక్రిందులుగా వ్రేలాడుతున్న తన పితృదేవతలను చూచి “ఈ విధంగా మీరు ఉండటానికి కారణమేమిటి?” అని ప్రశ్నించాడు. అపుడు పితరులు “మేము నీ పితృ దేవతలం. నీవు వివాహం చేసుకోక, సంతానం ఒల్లక గొప్ప నిష్ఠతో బ్రహ్మచర్యం పాటిస్తూ తపస్సు చేస్తున్నావు కదా. ఆ కారణం చేత మాకు ఉత్తమ గతులు లేకుండా పోయాయి. నీవు వివాహం చేసుకొంటే పిల్లల్ని కంటే మాకు పుణ్యగతి లభిస్తుంది” అన్నారు. భారతీయ సంస్కృతి, వాఙ్మయం గృహస్థాశ్రమానికి ప్రాధాన్యతనిస్తూ, జీవితం పండాలన్న సమాజం అభివృద్ధి చెందాలన్నా, మనిషికి ఇహపర సుఖాలు లభించాలన్నా ప్రతి వ్యక్తి వివాహం చేసుకోవాలి. సంతానాన్ని కనాలి. చతుర్విధ పురుషార్ధాలని సాధించాలని పేర్కొంది. పితరులు చెప్పిన మాట విని అగస్త్యుడు సరేనన్నాడు. అగస్త్యుడు ఒకసారి విదర్భ రాజుకు తన తపోమహిమ చేత ఒక కూతురును పుట్టించాడు. ఆమె పేరు లోపాముద్ర. నీటిలో పద్మం వలె, పరిశ్రమ చేసిన వాడిపట్ల విద్యవలె విరాజిల్లుతున్న ఆమెను ఎందరో రాకుమారులు వరించ దలచారు, కాని అగస్త్యుడి భయం చేత పెండ్లాడటానికి ముందుకు రాలేకపోయారు. విదర్భరాజు ఆమెకు తగిన వరుడిని వెదుకసాగాడు.

ఒకనాడు అగస్త్యుడు లోపాముద్రను తనకిచ్చి వివాహం చేయమని విదర్భ రాజును కోరినాడు. దానికి విదర్భ రాజు దంపతులు ఇష్టపడలేదు. వారు తమలో తాము ‘ఇతడు నిరుపేద బాపడు అడవిలో ఆకులూ, అలములు తింటూ, నార బట్టలు కట్టుకొని బ్రతికేవాడు. భోగభాగ్యాలతో తులతూగుతున్న నా కూతురుని ఇతడికిస్తే యేమి సుఖపడుతుంది. ఒప్పుకోకుంటే శపిస్తాడేమో? ఎలా చేయాలి’ అని చింతించసాగారు. అపుడు లోపాముద్ర వారి మనసునెరిగి, వారితో “మీరు మిక్కిలి చింతించకుండా ఈ ఋషీశ్వరుడికి నన్నిచ్చి పెళ్ళి చేయండి.” అన్నది. తల్లిదండ్రులకై ఇది ఆమె చేసిన త్యాగంగా మరియు అగస్త్యుడిపై అభిమానంగా చెప్పుకోవచ్చును. వారి వివాహం ఘనంగా జరిగింది. వస్త్రాభరణాలు, అలంకారాలు తీసివేసి, నారచీరలు, జింక చర్మం ధరింపజేసి భార్యను తీసుకొని అగస్త్యుడు గంగాతీరం వెళ్ళాడు. అక్కడ తపస్సు చేసుకొంటున్నాడు. ఒకనాడు ఆమె సౌందర్యానికి పరవశుడై శృంగార భావంతో అగస్త్యుడు లోపాముద్ర దగ్గరికి చేరగా, అతడి అభిప్రాయం గ్రహించి సిగ్గుపడింది. అతడితో “భర్త భార్యను సంతానార్థమై పొందటం సహజమే. కాని నాదో చిన్న కోరిక. నన్ను శోభాయమానమైన వస్త్రాభరణాలతో అలంకరించుము. నీవు కూడా మైపూతలతో, పూలదండలతో, ఆభరణాలతో అలంకృతుడవై నాకు గర్భాదానం చేయుము” అని కోరింది. కూతురికి భోగాలు సమకూరవు అని విదర్భ రాజ దంపతులు వివాహానికి ఒప్పుకోకపోతే శపించబడే వారేమో. నాకు లోపాముద్ర భర్తను యద్ధస్థితిలో అంగీకరించింది. నేడు భర్తలో రసోల్లాసం కలుగగానే ఆమెలోని భోగలాలసత్వం సాధారణ స్త్రీ వాంఛా పైకి వచ్చింది. కీలెరిగి వాత పెట్టింది. ముట్టొచ్చినప్పుడే చంక నెక్కాలని పెద్దలు చెప్పారు. భార్య అడిగిన దాన్ని యే భర్త కాదనలేడు. దానికి శపించనూ లేడు. పైగా ఇప్పుడు అగస్త్యుడికి భార్య అవసరం కూడా. అప్పుడు అగస్త్యుడు “నా తపస్సు మాత్రమే నా దగ్గర ఉన్న ధనం. వేరు ధనం లేదు. తపస్సుతో ధనాన్ని సృష్టించవచ్చు. కాని నేను తపస్సును వ్యర్థం చేయను” అని పలికి ధన సంపాదనకై ప్రయత్నం ప్రారంభించాడు. ముందుగా శ్రుతపర్వుడు అనే రాజు దగ్గరకు వెళ్ళి, “నీవు పోషించవలసిన వారి పోషణకు భంగం కలుగకుండా నాకు ధనము నిమ్ము” అన్నాడు. ఆ రాజు అగస్త్యుని పూజించి “నా ఆదాయ వ్యయములు సమానంగా ఉన్నాయి. మిగులు ధనం లేదు” అని చెప్పాడు.

ఆపై వారిరువురు బ్రథ్నశ్వుడి దగ్గరికి వెళ్ళారు. ఆ రాజు అగస్త్యుని పూజించి “నా ఆదాయ వ్యయాలు సమానం” అని పలికాడు. ఇప్పుడు ఆ ముగ్గురు పురుకుత్సుని కొడుకైన త్రసదస్సుని దగ్గరికి వెళ్ళారు. అతడూ అగస్త్యుని పూజించి అదే సమాధానం చెప్పాడు. చెప్పిన తరువాత “ఈ మణిమతి పట్టణంలో ఇల్వలుడనేవాడు తన తమ్ముడితో కలిసి ఉంటున్నాడు. అతడు పెద్ద ధనవంతుడు. అతడు మన కోరిక తీర్చగలడు” అని తెలిపాడు. అందరూ ఇల్వలుడి దగ్గరికి వెళ్ళారు. బ్రాహ్మణుడి రాకకు ఆనందించిన ఇల్వలుడు ఎప్పటిలాగే వాతాపిని పచనం చేయించి, ఆ మాంసాన్ని అగస్త్యునికి ఆహారంగా సమర్పించాడు. ఆ విషయం గ్రహించిన ఆ ముగ్గురు రాజులు “ఇల్వలుడు బ్రాహ్మణులకు వాతాపిని ఆహారంగా పెట్టి ఆపై వారి పొట్టలను చీల్చి చంపుతాడు” అని తెలిపారు. “కావున ఈ ఇంటిలో తండి తినరాదు. డబ్బు ఇస్తే తీసుకొని వెళదాం” అన్నారు. సముద్రం నీళ్ళను శోషింపచేసిన శక్తి సంపన్నుడైన అగస్త్యుడు వారి మాటలకు భీతిల్లలేదు. సరికదా, పీకల వరకు చక్కగా భోజనం చేశాడు. ఇల్వలుడు ఎప్పటివలెనె తమ్ముడిని పిలిచాడు. ఆ సంగతి గుర్తించిన అగస్త్యుడు పొట్టను నిమురుకుంటూ గర్రన తేన్చాడు. అంటే వాతాపి అగస్త్య మహర్షి పొట్టలో జీర్ణమైపోయాడు. ఇల్వలుడు అగస్త్యుడికి మహిమకు భయపడి, విషాదం చెంది ఖిన్నుడైనప్పటికీ తన మోసం బయట పడకుండా పైకి సంతోషాన్ని ప్రకటిస్తూ, “మీకేం కావాలి కోరుకోండి” అన్నాడు. అగస్త్యుడు “ఈ రాజన్యులతో నేను ధనార్థినై వచ్చాను. నీవు ధనాఢ్యుడివని విన్నాను” అన్నాడు. “అలాగే మీరు కోరినట్లే చేస్తాను” అన్నాడు ఇల్వలుడు. అగస్త్యుడు “పదివేల ఆవులు, పదివేల బంగారు నాణాలు ఒక్కొక్క రాజుకు ఇమ్ము. వారొక్కొక్కరికి ఇచ్చినదానికి రెట్టింపు గో ధనాన్ని, బంగారు తేరును నాకిమ్ము” అన్నాడు. ఇల్వలుడు రాజులకు అలాగే ఇచ్చాడు. అగస్త్యుడికి విరావ, సురావాలు అనే గుర్రాలను కట్టిన బంగారు తేరును ఇరవైవేల ఆవులను, ఇరవై వేల బంగారు నాణాలను ఇచ్చాడు. ఆ విధంగా రాజులు కూడా తగిన సంపదలు పొంది, అక్కడి నుండి నిష్క్రమించారు. అగస్త్యుడు ఆ సంపదతో లోపాముద్ర కోరిక నెరవేర్చాడు. ఆపై అగస్త్యుడు “పదిమందితో సమానులయిన వందమంది కొడుకులు కావాలా? నూరు మందితో సమానులయిన పదిమంది కొడుకులు కావాలా? వేయిమంది కొడుకులు కావాలా? వేయిమందికి సాటియైన ఉత్తముడైన ఒక కొడుకు కావాలా?” అని లోపాముద్రను అడిగాడు. “వేయిమందితో సమానుడు, బలశాలి, బుద్ధిశాలి అయిన కొడుకు కావాలి. బుద్ధిహీనులు వేయిమంది కొడుకులు ఉన్న లాభమేమిటి?” అని పలికింది.

ఆమె కోరిన వరము నిచ్చి లోపాముద్రకు గర్భాదానం చేశాడు అగస్త్యుడు. ఆపై లోపాముద్రకు దృఢస్యుడు, వాడికి ఇధ్మవాహుడు పుట్టి, అగస్త్యుడు పుత్ర పౌత్రులతో వృద్ధి చెందాడు. అతడి పితరులు ఉత్తమ లోకాలు పొందారు.

గృహస్థాశ్రమం ఎంత గొప్పదైనా ధనం లేకుంటే దాన్ని వెళ్ళదీయడం కష్టం. గృహస్థాశ్రమ నిర్వహణ చేత పితరులు తృప్తి పొందుతారు. లోపాముద్ర పతివ్రతా, తపస్వి భార్య అయినా సాధారణ స్త్రీలా ఐహిక వాంఛలు కోరటం, అగస్త్యుడు తపస్వియైనా భార్య కోరిక నెరవేర్చడానికి తపోశక్తి వ్యర్థం చేయక, సాధారణ వ్యక్తిలా ధన సంపాదన ప్రయత్నం చేయటం, భార్య కోరిక భర్త తీర్చాలన్న ధర్మాన్ని నెరవేర్చటానికి గడప గడప దొక్కటం, పూర్వం బ్రాహ్మణులకు మాంసాహార భోజనం నిషిద్ధం కాదు అని తెలియజెప్పటం వంటి అంశాలు కలిగినది ఈ కథ.

‘జీర్ణం.. జీర్ణం.. వాతాపి జీర్ణం’ అని ఒకప్పుడు తమ పిల్లలకు పాలు పట్టి, పొట్ట నిమురుతూ పాడేవారు. అంటే ఏది తిన్నా ఎలాంటి ప్రమాదం రాకుండా జీర్ణమైపోవాలని భావించేవారు.

అరణ్య పర్వం ద్వితీయాశ్వాసం లోనిది.

రోమశుడు ధర్మజునికి చెప్పిన కథ.

You can fool some of the people all of the time, and all of the people some of the time, but you cannot fool all of the people all the time. – Abraham Lincoln.

What is the price of a thousand horses against a son where there is one son only. – J. M. Synge.

7. అగస్త్యుడు – వింధ్య పర్వతం కథ!

తపోనియతి కలిగినవాడి ముందు, లోకోపకారియైన వాడిముందు, ధర్మవర్తనుడి ముందు నిలువెత్తు పర్వతాలు కురచయిపోతాయి. లోతైన సముద్రాలు చిన్నబోతాయి. సమాజసేవకు శక్తియుక్తులు, దృఢ సంకల్పం, సేవా పరాయణత్వం చాలా ప్రధానమైనవి. అట్టి గుణాలు కలవాడు కావుననే మునికుల భూషణుడిగా పేరొందాడు. విర్రవీగిన వింధ్య పర్వతాల వెన్ను విరిచాడు. జగత్కంటకాలైన కాలకేయుల పని పట్టడానికై, సముద్రపు నీళ్ళను జుర్రుకున్నాడు.

సూర్యుడు ఎంతో గౌరవంతో రోజూ.. మేరు పర్వతం చుట్టూరా ప్రదక్షిణం చేయడం చూచి, వింధ్య పర్వతానికి ఆగ్రహం కలిగింది. “కొండలకు రాజునైన నాకు ప్రదక్షిణం చేయకుండా, బుద్ధిహీనుడైన మేరువుకు ప్రదక్షిణం చేస్తావా?” అని కోపించి పలికింది. సూర్యుడు “ఇది నా ఇష్టానుసారం చేస్తున్న పని కాదు. బ్రహ్మగారి ఆజ్ఞ” అన్నాడు.

దానితో వింధ్య పర్వతం, మేరువుతో మాత్సర్యం వహించి, సాటిలేని ఎత్తుకెదిగి, సూర్చచంద్ర నక్షత్రాదులు వెళ్ళలేకుండా ఆకాశ మార్గాన్ని కప్పి వేసింది. సూర్య చంద్రుల గమనానికి అడ్డు యేర్పడడంతో దట్టమైన చీకటులు కమ్ముకున్నాయి. దేవతలు, మునులు, భూప్రజలు తల్లడిల్లారు. దేవతలు అగస్త్యుని దగ్గరకు వెళ్ళి, వింధ్య పర్వతము యొక్క అహంకారపు దుశ్చర్యలు తెలిపి, ఆదుకోమన్నారు. వెంటనే అగస్త్యుడు లోకకల్యాణం కొరకై భార్యయైన లోపాముద్రతో బయలుదేరాడు.

వింధ్య పర్వతం దగ్గరికి వచ్చాడు. వింధ్య పర్వతం యొక్క పూజలు అందుకున్నాడు. ఆపై – “చనియెద దక్షిణదిశకే, నొనరగఁ దెరువిమ్మునాకు నుర్వీధర”.

“ఓ పర్వతమా! నేను దక్షిణానికి వెళుతున్నాను. నాకు మార్గం ఇవ్వవలసినది” అని వింధ్యను కోరినాడు. వింధ్య “అలాగే స్వామీ” అని తన మాటను తగ్గించుకున్నది. అపుడు అగస్త్యుడు, “ఓ వింధ్యమా! నేను తిరిగి వచ్చేవరకు ఇలాగే ఉండుము. నాతో స్నేహం చేయుము” అని పలికి దక్షిణము వైపుకు వెళ్ళిపోయాడు. వింధ్యను సమ్మతింప చేసి లోక కల్యాణముకై దక్షిణంలోనే ఉండిపోయాడు.

ఇక వింధ్య పర్వతము అగస్త్యుడి పునరాగమనముకై ఎదురు చూస్తూ, పెరగటానికి జంకి అట్లాగే ఉండిపోయింది. అల్పులకు సామాజిక ప్రయోజనాల కన్నా స్వప్రయోజనాలు, మహాత్ములకు స్వప్రయోజనాల కన్నా సామాజిక ప్రయోజనాలు గొప్పవని తెలిపే ఈ కథ మానవాళికి నిస్వార్థ ప్రయోజన సేవా పరాయణత్వ ఘనతను తెలుపుతుంది.

ఒకానొక సమయంలో కాలకేయులు అనే రాక్షసులు నిరుపమానాయుధధారులై దేవతలకు లొంగక పగటిపూట సముద్రములో ఉంటూ రాత్రులు బలవంతులై బయటికి వచ్చి భూప్రజలకు అధికంగా ఉపద్రవాలు కల్పించసాగారు. విద్య తపస్సుల చేత ధార్మిక వర్తనులైన వారివల్ల ఈ లోకం రక్షింపబడుతుంది. కావున లోకానికి కీడు కలగాలంటే పుణ్యాత్ములను సంహరించాలనుకున్నారు. వశిష్ఠ, చ్యవన, భరద్వాజాది మునుల ఆశ్రమంలో చొరబడి వందలాది మునులను సంహరించి భక్షించినారు. భూలోకంలో యజ్ఞ యాగాదులు ఆగిపోయాయి. అష్టదిక్పాలురు దేవేంద్రుడిని ముందు పెట్టుకొని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. అతడిని స్తుతించారు. “పద్మనాభా! నీవు లోక రక్షకుడవు. ఇపుడు లోకాలకు యేర్పడిన విపత్తును దూరం చేయుము. కాలకేయులు అనే రాక్షసులు సముద్రాన్ని జలదుర్గంగా చేసుకొని, రాత్రి వేళలో విజృంభించి బ్రాహ్మణోత్తములను సంహరిస్తున్నారు.

బ్రాహ్మణులు వేదాలు చదివి, పుణ్య కర్మలు చేయటం వలన, వారు వేల్చెడి హవ్య కవ్యాల చేత పితృ దేవతలు, దేవతలు తృప్తి చెందుట వలన తృప్తులైన దేవతల వలన లోకాలు సుఖిస్తున్నాయి. కాని నేడు యే యుగంలో జరుగనట్లుగా బ్రాహ్మణ హింస జరుగుతున్నది. ఆ కీడును దప్పించాలి” అన్నారు.

అపుడు శ్రీహరి “భయంకరమైన ప్రతాపం కల కాలకేయులు యముడితో సమానులు. సముద్రాన్ని ఇంకింప చేసి అందుండే సమస్త ప్రాణకోటిని బయలు పడేట్లు చేస్తే కాని వారిని వధించే సాధ్యం కాదు. నీరు గల సముద్రములో ఉన్నవారిని వేరొక విధంగా సంహరించడం వీలుకాదు” అన్నారు.

వారంతా అగస్త్యుడి దగ్గరికి వెళ్ళారు. “మహానుభావా! పూర్వం వింధ్య గర్వాన్ని అణిచి ప్రపంచానికి మేలు చేసిన పుణ్యాత్ముడవు. ఇపుడు అలాంటి కష్టమే లోకానికి వచ్చింది. కాలకేయులు సముద్రాన్ని ఆక్రమించి లోకాలను హింసిస్తున్నారు. ఆకాశన్నంటుతూ తిరుగుడు పడే కెరటాలు కల సముద్రాన్ని నీవు పానం చేస్తే కాలకేయులు బయటపడతారు. వారిని మేము దివ్యాయుధాలు ప్రయోగించి సంహరించగలం” అని ప్రార్థించారు. లోక రక్షణార్థమై జగత్తుకు సంతోషాన్ని కలిగించేవాడు, పాపాలు నాశనం చేసే వాడైన అగస్త్యుడు దేవతలందరు చూస్తుండగా ఆ సముద్ర జలాలను త్రాగాడు. అంతట కాలకేయ రాక్షసులు భయంతో బయటపడ్డారు. దేవతలు వారితో యుద్ధం చేసి సంహరించారు. దేవతలు అగస్త్యుడి లోక సహాయానికి ప్రశంసించారు.

పుణ్యాత్ములు ఆగ్రహిస్తే, పాపాత్ములు కడలిలో దాగియున్నా, కడలి చిన్నదైపోయి, పాపం బద్దలవుతుంది. పాపాత్ములకు కాలం సమీపించినపుడు వారు కడలి యంతట జలములో ఉన్నా అది చిన్న చెంబులాగా అయిపోయి పుణ్యాత్ములు చేసే పాప సంహారానికి సహకరిస్తుంది. పర్వతాలు కురచయిపోవాలన్నా కడలి పుక్కిట పట్టాలన్నా, ఈ దేశంలో బ్రహ్మజ్ఞానులైన మునులే చేయగలరని నిరూపించిన కథ ఇది.

అరణ్యపర్వం తృతీయాశ్వాసం లోనిది.

రోమశుడు ధర్మరాజుకు చెప్పినది.

We make a living by what we get. We make a life by what we give. – Winston Churchill.

8. దధీచి కథ!

కృత యుగములో కాలకేయులకే రాక్షస సమూహంతో కలిసి వృత్తుడనే రాక్షసుడు గర్వంతో దేవేంద్రాదులను బాధించసాగాడు. దేవతలు వృత్తుడి బాధపడలేక భీతిల్లి బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు. అపుడు బ్రహ్మదేవుడు – సరస్వతీ నదీ తీరాన నిష్ఠతో తపస్సు చేస్తున్న దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి, మీరు ప్రార్థిస్తే అతడు తన ఎముకలను దానం చేయగలడనీ, ఆ ఎముకలు వజ్రాయుధం మొదలైన దివ్యాయుధాలుగా మారుతాయనీ, దానితో శత్రువులను జయించవచ్చుననీ తెలిపాడు.

ఆ దధీచి మహర్షి ఎముకల వలన ఏర్పడిన ఆయుధాలలోని వజ్రం వలన ఇంద్రుడు వృత్తుడిని సంహరించగలడని దేవతలను ఊరడించాడు. అలా బ్రహ్మదేవుడు చెప్పగా, అతడి ఆజ్ఞనుగొని దేవతలందరు దధీచి మహాముని దగ్గరికి వెళ్ళారు.

‘భువనజనస్తుత! నిజగౌ

రవ మెసఁగఁగ నమరపతి పురస్కృతు లగు ని

ద్దివిజుల కెల్ల హితంబుగ

భవదస్థిచయంబు లిమ్ము పరమమునీంద్రా!’ (3-3-5)

“ఓ మహా దధీచి! దేవేంద్రుడిని ముందు పెట్టుకొని నిన్ను అర్థిస్తున్నాము. దేవతలందరికీ మేలు కలిగేటట్లు మీ ఎముకలను దానం చేయగలరు” అని దేవతలు ప్రార్థించారు. మహాత్ములు లోక కల్యాణముకై తమ దేహాన్ని, ప్రాణాన్ని తృణప్రాయంగా భావించేవారు. వెంటనే దధీచి తన జన్మ ధన్యమైనదని సంతోషించాడు.

ఇక్కడ మరొక విషయం గమనించాలి. తన ఎముకలను దేవతలకు ఇవ్వడం ద్వారా, నాడే ‘అవయవదానం’ అనే సత్కార్యానికి దధీచి అంకురార్పణ చేశాడు. పరహితము కోరి తన ప్రాణాలను విడిచాడు. దేవతలందరూ ఆ మహాముని ఎముకలను ఆయుధాలుగా స్వీకరించారు. త్వష్ట అనే ప్రజాపతి నూరు మొనలు దేలి, నిప్పురవ్వలు రాల్చు వజ్రం అనే ఆయుధాన్ని ఆ ఎముకలతో నిర్మించి దేవేంద్రునికి ఇచ్చాడు. దేవేంద్రుడు దుష్టుడైన వృత్తుడిని ఆ ఆయుధంతో సంహరించాడు. ముల్లోకాలు హర్షించాయి. ముని త్యాగం ఆచంద్రతారార్కమైనది.

‘పరోపకారార్థమిదం శరీరమ్’ అన్న ఆదర్శాన్ని ఆచరించి చూపించిన అనుష్ఠాన వేదాంతిగా దధీచి చిరస్థాయిగా నిలిచిపోయాడు.

అరణ్యపర్వం తృతీయాశ్వాసం లోనిది.

ధర్మరాజుకు రోమశుడు చెప్పిన కథ.

Greater love hath no man than this, that a man lay down his life for his friends. – Bible: St. John.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here