శ్రీ మహా భారతంలో మంచి కథలు-6

0
8

[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]

15. సత్యవాది కథ!

[dropcap]ఒ[/dropcap]కానొక గ్రామమున కౌశికుడను బ్రాహ్మణుడుండేవాడు. అతడు పుణ్యనదీ సంగమ క్షేత్రమున నివసిస్తూ సత్యమునే పలికెదనని వ్రతం పూని, ఆచరించు చుండెను. సత్యమునే పలికెదనని ప్రతిన పట్టిన ఆ కౌశికునకు ‘సత్యవాది’ అని పేరు కలిగినది. ఒకనాడు అతను తపస్సు చేయుచుండగా, కొందరు అమాయకులు దొంగలకు భయపడి యాతని ఆశ్రమం చెంతనున్న ఒక పొదలోకి దూరినారు. వారని వెండిస్తూ వచ్చిన, ఆ దొంగలు కౌశికుని చేరి ఇప్పుడిక్కడికి వచ్చినవారు ఎక్కడికి పోయినారని ప్రశ్నించినారు.

కౌశికుడు సత్యవ్రతం పూనినాడు కావున, తనకు అసత్య దోషము కలుగుతుందన్న భయంతో, జనులు ఈ పొద చాటుననున్నారని చెప్పినాడు. అపుడా దోపిడికాండ్రు వారిని చంపి ధనం దోచుకొని వెళ్ళిపోయినారు. వాగ్దోషం చేత సత్యవాదికి నరకము ప్రాప్తించినది.

కేవలం సత్యం పలకడమే కాక, అసత్య వ్రతం వల్ల ఇతరులకు ప్రమాదం, కీడు కలిగితే దానివల్ల ప్రయోజనం శూన్యం. ఆ వ్రతం ఆచరించే వారికి ఆ వ్రత పరమార్థం గ్రహించలేదన్నమాట.

హింసాకరమగు సత్యము ధర్మము కాదు అను విషయాన్ని ఈ కథ తెలుపును. శ్రీ మహాభారతం కర్ణపర్వం లోనిది.

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం

ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మః సనాతనః

Speak the truth and speak to please, Speak not the truth, to displease, Speak not untruth, to please, this is eternal virtue.

17. కుర్కుర నీచత్వము!

పూర్వము ఒక ముని ఎవరూ చేయనలవి కానంతగా తపస్సు చేశాడు. అతడు దయాదాక్షిణ్యాలు కలవాడు. అతడి ఆశ్రమములో అన్ని జంతువులూ హాయిగా యే చీకు చింతా లేకుండా బ్రతుకుతుండేవి. వాటిల్లో ఒక కుక్క ఎంతో విశ్వాసంతో ఆ మునిని సేవిస్తుండేది. ఆ ముని ఎటువెళితే అటు వెంబడించి వెళుతుండేది. అది చూచి సహించలేక ఒక పులి కుక్క మీద ద్వేషం పెట్టుకొని పంజాతో కొట్టబోయింది. ప్రాణ భయంతో ఆ కుక్క ఆ ముని చాటుకు పోయింది.

ఆ ముని దానిమీద జాలిపడి, దానికంటే పెద్దదైన పులిగా మార్చాడు. మొదట మీద పడిన అసలు పులి దీనిని చూచి భయపడి పారిపోయింది. అలా ఆ ముని ఆ కుక్కను పెద్దపులి వెంబడిస్తే పులిగాను, ఏనుగు వెంబడిస్తే మదించిన ఏనుగుగాను, సింహము తరిమితే సింహముగాను, శరభం దాడిచేస్తే మరింత ఉత్సాహము కల శరభము గాను ఎప్పటికప్పుడు మార్చి భయాన్ని పోగొట్టి గెలిపించాడు. ఇలా రోజు రోజుకూ ఆ కుక్క మరింత బలము పుంజుకొని శరభ మృగంగా ఎంతో గర్వంగా తిరుగుతున్నది.

అయినా ఆ కుక్క ముందటి తన సహజ స్వభావమైన నీచ స్వభావాన్ని వదులుకోలేక పోయింది. అందుకే కుక్క ‘శరభ రూపములో నున్న నన్ను చూచి మరొక మృగము భయపడి పారిపోవచ్చును. ఆ జంతువు మీది జాలితో ఈ ముని దానిని నాకంటే మిన్నగా చేయవచ్చును. అట్లా అయితే నేను గర్వంగా తల ఎత్తుకొని తిరుగలేను. కాబట్టి అట్లాంటి స్థితి రాకుండా నా శక్తి యుక్తులను కలబోసి ఈ మునిని చంపివేయాలి’ అనుకున్నది.

ముని దివ్యదృష్టితో కుక్క చెడ్డ తలంపును గ్రహించాడు. “నీచురాలైన కుక్కకు ఉదాత్త స్వభావం తెలియదు. కనుక ముందటి రూపాన్ని పొందుతుంది గాక” అనగానే శరభరూపంలో ఉన్న కుక్క మామూలు కుక్కగా మారిపోయింది.

ఆంతర్యాన్ని తెలుసుకొనకుండా కేవలం తనవాడు కదాయని దుష్టుడిని అందలం ఎక్కించకూడదు. సేవకులు ఎలాంటివారో తెలుసుకొని, వారి  యోగ్యతను బట్టి ఉత్తమ మధ్యమ, అధమ స్థాయి పదవులలో ఉంచటం రాజధర్మం.

శౌర్యము సత్యంబును స, త్కార్యజ్ఞానమును భక్తి తాత్పర్యము గాం

భీర్యముఁ గలిగినఁ గురుకుల, వర్య కులంబేల సిరికి వాఁ డుక్తుఁ డగున్. (12-3-99)

పరాక్రమం, నిజాయితీ, మంచీ చెడుల వివేకం, సేవాభావం, గాంభీర్యం కలవాడు సిరికి యోగ్యుడు అవుతాడు. అలాంటివాడికి కలంతో పనిలేదు. అలాగని ఇదే ప్రమాణం అనుకోరాదు. మంచి గుణము, కులము కలవాడిని పెద్ద పదవులలో ఉంచాడు. సింహం తన జాతి సింహాల వల్ల ఫలితాలు సాధిస్తుంది. కాని కుక్కలను చుట్టూ చేర్చుకుంటే తాననుకున్నది నేరవేర్చలేదు.

ఆంతర్యాన్ని తెలుసుకొనకుండా కేవలం తనవాడు కదా అని దుష్టుడిని అందలం ఎక్కించకూడదు. సేవకులు ఎట్లాంటి వారో చూసుకొని, వారి యోగ్యతలను బట్టి ఉత్తమ, మధ్యమ, అధమ స్థాయి పదవులలో ఉంచటం రాజుధర్మం. ప్రభుత్వ విధి.

భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన కథ.

శాంతి పర్వము తృతీయా శ్వాసములోనిది.

నీచ స్వభావము దలంపదు నీచపు బ్రాణి యెయ్యెడస్

ఉపకారేణ నీచానామపకారోహి జాయతే।

పయః పానం భుజంగానాం కేవలం విషవర్ధనం॥

By doing good to base man, evil results, the drinking of milk is to snakes only on uncreating of person.

18. బోయవాడు – పావురాల జంట కథ!

పూర్వం పాపాత్ముడైన ఒక బోయవాడు ఉండేవాడు. అతడు పిట్టలను పట్టి కొన్నిటితో పొట్ట పోసుకొంటూ, ఎక్కువగా అమ్ముకొంటూ బ్రతికేవాడు. ఒకనాడు పిట్టలను పట్టుకొనే పనిముట్లను సమకూర్చుకొని అడవిలో తిరుగుతుండగా, పెద్ద గాలివాన వచ్చింది. ఆ వాన అన్ని జీవులకు ముప్పు కలిగిస్తూ అడవంతా నిండిపోయింది. ఆ బోయవాడు బెదిరిపోయాడు. వాన ఉరవడికి తట్టుకోలేక మెరక చేరాడు. గుబురుగా ఉన్న చెట్టు క్రిందికి చేరాడు. రాత్రి అయింది. అక్కడే రాతిబండ మీద చలిగాలికి గడగడ వణుకుతూ, ఆ చెట్టును చూచి భక్తితో ‘నా మీద కనికరం చూపినట్టు కాపాడటానికి ఈ అడవిలోని జంతువుల నన్నింటిని ఎంతో వినయంగా సేవిస్తాను’ అనుకొంటూ బోయవాడు రాతిమీద పడుకున్నాడు. ఆ చెట్టు మీదనే తొర్రలో ఒక పావురం కాపురం ఉన్నది.

ఆ పావురం మేతకు పోయిన భార్య ఎంతకూ రాలేదని విచారిస్తూ, ‘నా భార్య ఇంతసేపు ఎక్కడుందో, నన్ను వదిలి ఎక్కడా ఉండదు. ఆమె లేని నా బ్రతుకు ఎందుకు పనికిరాదు. అనురాగవతి అయిన భార్య సుగుణాలే మగవాడికి ఇహపరసాధనాలు. ఏ కారణంగా ఏమయిపోయిందో యేమో. ఈ కుండపోత వానలో బ్రతికినదో, చచ్చిపోయినదో, నా ఇల్లు పాడయిపోయినది. ఆమె లేని నా ఇల్లు పాడుపడిపోయినట్లున్నది’ అని అనుకుంటుండగా, పావురం మాటలన్ని పెంటి విన్నది.

‘పతిమదికి నింత యెక్కిన, యతివగదా పుణ్యవతి’- పెనిమిటి మెప్పు పొందిన స్త్రీ ఎంతో పుణ్యవంతురాలు. నన్ను గూర్చి నా మగడి మాటలు విన్నాను. జన్మ ధన్యమైనది. యముని గెలిచాను అని తన మనసులో అనుకొంటూ తన ఉనికిని పెనిమిటికి తెలిపింది. బ్రహ్మ చేష్టకు విచారించి ప్రయోజనం లేదు.

“శరణము సొచ్చినం దగఁ బ్రసన్నతఁ గైకొని రక్షణంబు సా

దరముగఁ జేయు టత్యధికధర్మముగా బుధకోటి సెప్పు నీ

– ఆదుకొనుమంటూ ఆశ్రయించిన వాడిని కనికరంతో ఆదరించి ఆదుకొనటం కన్నా మించిన పుణ్యం మరొకటి ఉండదు అన్నారు పెద్దలు. చలికి వణుకుతున్న ఈ బోయను కాపాడమన్నది. పెంటి మాటలు స్పష్టంగా మగ పావురం చెవిని బడ్డాయి. భార్య ఏమయిందో అనే విచారాన్ని అది వదిలి పెట్టింది. బోయవాడి మీద జాలి పడింది. తాను పావురాన్నని చెప్పుకున్నది. మానవుల భాషలో బోయవాడితో “ఓ అన్నా! నీవు చాలా బడలికతో ఉన్నావు. మా ఇంటికి వచ్చిన అతిథివి నీవు. నీకు ఆలస్యం లేకుండా వెంటనే అతిథి విందు చేయాలి. నీకు కావలసినవి చెప్పు” అన్నది. గువ్వ పలుకులకు బోయవాడు సంతోషిస్తూ “ఈ చలికి నా అవయవాలు తీపు పెడుతున్నాయి. కనుక ఈ చలిని పోగొట్టువలసినది” అన్నాడు. ఆ పావురం పుల్లా పుడకలను ముక్కుతో కరిచి, తెచ్చి, పొగుపెట్టి, ప్రక్కనే ఉన్న పల్లెకు గబగబా పోయి, నిప్పు తీసుకువచ్చి మంటపెట్టి, చలి కాచుకొనటానికి మంట దగ్గరికి రమ్మని పిలిచింది. బోయవాడు ఆ మంటల్లో చలి కాచుకొన్నాడు. అంతలో అతడికి ఆకలిగా అనిపించింది. పావురముతో అదే చెప్పాడు. ఆ గువ్వకు అతడి ఆకలిని తీర్చే మార్గం కనబడలేదు. దుఃఖిస్తూ బోయవాడితో, “పిట్టల బతుకుల్లో తిండిని కూడబెట్టుకొనటం అనేది ఉండదు, ఆకలికి దొరికింది ఏమైనా తినడమే తప్ప. అయితే నీవు బాగా అలసి ఉన్నావు. తప్పనిసరిగా నీ ఆకలి తీర్చాలి. కావున నా శరీరాన్ని నీకు ఆహారంగా అర్పిస్తాను. తీసుకొనుము” అంటూ మంటచుట్టూ తిరిగి ఆ నిప్పుల మంటలలో పడిపోయింది. అది చూచి బోయవాడు నివ్వెరపోయాడు. కొంచెం సేపు కొయ్య బారిపోయాడు.

‘లోకంలో ఇలాంటి సాహసం, పురుష ధర్మం ఎక్కడైనా ఉంటుందా? బాగా జాలిపడి ఈ గువ్వ ఈ తీరున తనను అర్పించుకుంటుందా? నా నడవడి ఈ లోకంలో నిందల పాలయింది. ఇలాంటి దయాదాక్షిణ్యాలు లేని ఘోరపు పనులు చేయను. ఆ పిట్ట నాకు గురువై మంచిని తెప్పించింది’ అని మనసులో విరక్తిని పొందాడు. ఇక అక్కడ ఉండలేక, “ఈ పావురం తనవారిని వదులుకొని తనకు తానుగా నిప్పులోకి దూకింది. ఇలాంటి తెగువతో పాపం పోగొట్టుకొని వైరాగ్య భావంతో ఇపుడే దేహాయాత్ర చాలిస్తాను. పుణ్యాత్ముడనవుతాను” అని మనసులో ఊరటపొందాడు.

ఆ బోయవాడు వలలో పట్టి ఉంచిన పిట్టలన్నింటిని బయటికి వదిలి పెట్టాడు. పిట్టలను పట్టి చంపే వలనూ, పనిముట్లనూ అక్కడే ఉంచేశాడు. నియమం పూనిపోయాడు. బోయవాడి తిండి కొరకు నిప్పుల్లో పడిన తన పెనిమిటిని గూర్చిన దుఃఖంతో పెంటి మనసు కలవరపడింది. గొంతు వణికి పోయింది. కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. “నాకు ఆకలి వేస్తే నీవు ఎపుడు తట్టుకొనలేకపోయేవాడివి. ఆరునూరైనా నూరు ఆరైనా నేను తిన్న తరువాతనే తినేవాడివి. నేను కష్టపడటం చూచి నొచ్చుకునే వాడివి. అలాంటి నీవు నన్ను వదిలిపెట్టి ఇలా వెళ్ళటం ధర్మమా? నన్ను ప్రేమలో ముంచెత్తిన నీవు లేకపోతే నేను బ్రతకలేను. ఇపుడే ప్రాణాలు తీసుకొని నిన్ను చేరుకుంటాను. అంతేకాక, భర్తతోపాటు చనిపోయిన స్త్రీ అతడితో పాటు ఉత్తమ గతులను పొందుతుందని, నిలకడగా అంతులేని భోగాలు అనుభవిస్తుందని పెద్దలు చెప్పగా విన్నాను” అని అంటూ నిప్పుల్లోకి దూకింది.

దేవతా గణముతో, రత్నాభరణములతో దేవ విమానము మీద దేవత్వములో ఒప్పారుతున్న భర్తను కలుసుకొన్నది. ఆపై వారు ఎనలేని సంపదలతోనున్నారు. బోయవాడు ఆ రెండు పిట్టల నడవడి, వాటి జీవితములో నున్న పవిత్రతకు మురిసిపోయి, అడవిలో చొరబడ్డాడు. తన ఎదుట కార్చిచ్చు కనబడడముతో అందులోకి దూకి ప్రాణాలు వీడి, దేవతారూపాన్ని పొందాడు. శరణన్న వారిని ఆదుకొన్న వారికి ఎంతటి పుణ్యలోకాలు లభిస్తాయో రాక్షసాచార్యులు శుక్రాచార్యుడు ముచికుందునికి చెప్పిన వైనాన్ని భీష్ముడు ధర్మరాజునకు, ‘బోయవాడు – పావురం జంట’ కథగా చెప్పాడు.

గృహస్థాశ్రమ ధర్మములో త్యాగానికి గల స్థానము, ఆతిథ్య ధర్మములు, మానవతా కరుణలు ఎంతటి క్రూరనైనా మార్చగలవు అన్న సత్యము ఈ కథలో మనకు తెలుస్తుంది.

భార్యాభర్తల మధ్య పరస్పరానురాగము, పక్షుల జంట రూపములో కనిపించి చదువరులకు ఆనందాన్నిస్తాయి.

శాంతి పర్వము తృతీయాశ్వాసము లోనిది.

– True importance cleanses the maligned heart.

– Love begets love, Respect reciprocates. – Rigveda

– Self-sacrifice enables us to sacrifice other people without blessings. – G.B.Shaw

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here