శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం-2

0
12

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం-2’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]ఓం [/dropcap]శ్రీ సాయి అరుణాయ నమః

ఓం శ్రీ సాయి కరుణారససింధవే నమః

ఓం శ్రీ సాయి అచ్యుతాయ నమః

ఓం శ్రీ సాయి అనంతాయ నమః

ఓం శ్రీ సాయి సుప్రసన్నాయ నమః

శ్రీ సాయినాధులు సర్వ శక్తిమంతులు, సర్వజ్ఞలనీ తెలియజేసే మరొక అపూర్వమైన సంఘటన శ్రీ సాయి సచ్చరిత్రలో 15వ అధ్యాయంలో వ్రాయబడింది.

ఒక రోజు ఒక భక్తుడు శిరిడీ లోని మశీదులో శ్రీ సాయి పాదాల చెంత కూర్చోని వున్నాడు. అంతలో ఒక బల్లి మశీదు గోడపైకి ఎగబ్రాకి టిక్కు టిక్కు మని అరిచింది. అంతట ఆ భక్తుడు “ఆ బల్లి అరిచిన దానికి అర్థం ఏమిటి సాయి, అది శుభమా లేక అశుభమా?” అని శ్రీ సాయిని అడిగాడు.

శ్రీ సాయి చిరునవ్వుతో “ఆ బల్లిని చూడడానికి ఔరంగాబాదు నుండి తన చెల్లెలు వస్తోంది, అందుకనే ఆ బల్లి చాలా ఆనందంగా అరుస్తోంది” అని అన్నారు. శ్రీ సాయి తనతో పరిహాసమాడుతున్నారని తలిచి ఆ భక్తుడు నోరు మూసుకొని కూర్చున్నాడు. కొద్ది సేపటి తర్వాత ఔరంగాబాదు నుండి ఒక భక్తుడు శ్రీ సాయి దర్శనానికి మశీదుకు వచ్చాడు. అతను స్వారీ చేసిన గుర్రానికి ఆకలి వలన అలసటతో కూలబడిపోయింది. దానికి ఉలవలు తీసుకురావడానికి తన దగ్గర వున్న సంచీని తీసి అందులో వున్న దుమ్ము, ధూళిని పోగొట్టడానికి సంచీని విదిలించాడు. ఆశ్చర్యకరంగా అందులో నుండి ఒక బల్లి క్రింద పడింది. చకా చకా ప్రాకుకుంటూ ఆ బల్లి మశీదు గోడను ఎక్కి ఇంతకు ముందు వున్న బల్లిని చేరుకుంది. రెండు బల్లులు ఆనందంతో కలుసుకొని, కౌగలించుకొని ముద్దాడుకున్నాయి. ఎంతో ప్రేమతో కలిసి ఆడుకోసాగాయి. బల్లి గురించి ప్రశ్నించిన ఆ భక్తుడికి ఇక నోట మాట రాలేదు. ఎక్కడ శిరిడీ? ఎక్కడ ఔరంగాబాదు? జరగబోయే సంఘటనను అద్దంలో చూపించిన శ్రీ సాయి సర్వజ్ఞత్వానికి జోహార్లు!

శ్రీ సాయి సాధారణ యోగి, సాధు సత్పురుషుడు కాదు. పరిశుద్ధ, పరమేశ్వర, పరబ్రహ్మ అవతారం. త్రిమూర్తి స్వరూపులు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో జరగబోయే సంఘటనలన్నీ ఆయనకు తేటతెల్లం.

మరొకసారి శ్రీ సాయి భక్తాగ్రేసరుడైన నానా చందోర్కర్ మరొక భక్తునితో కలిసి శిరిడీ నుండి బయలుదేరడానికి శ్రీ సాయిని శెలవు అడిగాడు. శ్రీ సాయి వారిరువురినీ దీవించి “భోజనం చేసి తాపీగా బయలు దేరండి” అని అన్నారు. శ్రీ సాయి ఆజ్ఞను శిరసా వహించి నానా చందోర్కర్ వాడాకు వెళ్ళి సుష్టుగా భోజనం చేసి బయలుదేరాడు. కాని నానా స్నేహితుడు మాత్రం రైలుకు వేళ అయిపోతోందంటూ ఒకటే హడావిడి చేసి భోజనం చేయ్యలేదు. మాటిమాటికీ చేతికి వాచీలో సమయం చూసుకుంటూ బయలుదేరమంటూ నానాను ఒకటే తొందర పెట్టసాగాడు, భోజనం కూడా చెయ్యలేదు. కోపర్‌గావ్ స్టేషనుకు వచ్చాక ఆ రోజు రైలు ఆలస్యంగా వస్తోందని తెలిసింది. రైలు ప్రయాణంలో కూడా సరైన తినుబండారాలు దొరకలేదు. శ్రీ సాయి మాటలను వేదవాక్కుగా భావించిన నానా రైల్లో హాయిగా నిదురపోగా, శ్రీ సాయి మాటలను పట్టించుకోకుండా తన స్వంత బుద్ధితో ఆలోచించి తదనుగుణంగా ప్రవర్తించిన ఆ భక్తుడు బొంబాయి చేరే వరకూ ఆకలితో మాడిపోయాడు. తనను నమ్ముకుంటే జీవితంలో ఇక ఏ సమస్యలు ఎదురవవని, ఏ చీకు చింతా లేకుండా హాయిగా వుండవచ్చని శ్రీ సాయి ఈ లీల ద్వారా అపూర్వంగా తెలియజేసారు.

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు

లోకాస్సమస్తా సుఖినోభవంతు

సర్వే జనః సుఖినోభవంతు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here