శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం

0
11

[dropcap]శ్రీ [/dropcap]కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ‘అధర్మం పెచ్చు మీరినప్పుడు ధర్మ సంస్థాపనకు ఏదో రూపంలో ఈ భువిపై అవతరిస్తాను’ అని వాగ్దానం చేసారు. అట్లే ప్రతీ యుగం నందు ఆ పరమాత్మ ధర్మ సంస్థాపన కోసం ఏదో ఒక రూపంలో అవతరిస్తునే వున్నారు. సాధువులు, పుణ్యమూర్తులు, అవతార పురుషులు ఆ పరమాత్మ యొక్క ప్రతిరూపాలే. అట్లా మన దేశంలో హిందు, ముస్లింలు తమలో తాము కలహించుకుంటూ, పెద్ద ఎత్తున మత ఘర్షణలకు పాల్పడుతునప్పుడు వారిలో వారికి సద్భావం, మత సామరస్యం నెలకొల్పడానికి, ఆ పరిశుద్ధ, పరబ్రహ్మ మహారాష్ట్ర దేశములోని శిరిడీ గ్రామంలో సాయినాథుని గ్రామములో అవతరించారు. చిరిగిన చొక్కా, చీనా రేకు డబ్బా, ఫకీరు రూపంలో ‘అల్లా మాలిక్’ అంటూ ఒక విలక్షణ వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటింపజేస్తూ మానవాళిని ఉద్ధరించడానికి వచ్చిన అవతారమే శ్రీ సాయి. అటువంటి శ్రీ సాయినాథుని సంపూర్ణ కరుణా కటాక్షాలను పొందిన ఒక కుటుంబం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ మేనేజర్ అనువాడు బొంబాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగం చేస్తుండేవాడు. మేనేజర్ దంపతులిద్దరికీ బాబాలన్నా, సాధువులన్నా ఏ మాత్రం నమ్మకం లేదు. ఒకసారి వారి పదిహేను నెలల బిడ్దకు తీవ్ర అనారోగ్యం సంభవించింది. బిడ్డ కళ్ళు తేలేసి, నిశ్చలం అయిపోయాడు. స్పెషలిస్ట్ డాక్టర్లకు చూపించినా ఫలితం స్వల్పం. సరిగ్గా అంతలోనే బాబాకు భక్తుడైన మేనేజర్ తమ్ముడు వచ్చి శ్రీ సాయినాథుని లీలలు గూర్చి తెలిపి , ఊదీ ప్రసాదాలను వారికి అందించాడు. ఏ పుట్టలో ఏ పాముందో? అనుకొని శ్రీమతి మేనేజర్ ఆ ఊదీని పిల్లవాడికి పట్టించి, అనారోగ్యం తగ్గితే శిరిడీ వస్తానని మొక్కుకుంది. ఆశ్చర్యాలలో కెల్లా ఆశ్చర్యం. పిల్లవాని అనారోగ్యం తగ్గనారంభించి ఏ డాక్టర్ సహాయం లేకుండానే నాలుగు రోజులలోనే స్వస్థత చేకూరింది. అన్న మాట ప్రకారం శ్రీమతి మేనేజర్ తన పిల్లవాడిని, మరొక సేవకుడిని తీసుకొని శిరిడీ వెళ్ళింది. మశీదులో భక్తుల మధ్య కూర్చోని వున్న శ్రీ సాయి శ్రీమతి మేనేజర్‌ను చూడగానే “రావమ్మా! నీ కోసమే ఎదురు చూస్తున్నాను. పిల్లవానికి అనారోగ్యం తగ్గింది కదా!” అని నవ్వుతూ పలకరించారు. బాబా వారి సర్వాంతర్యామి తత్వానికి శ్రీమతి మేనేజర్ మదమొందింది.

శ్రీమతి మేనేజర్‌తో పాటు శిరిడీ వెళ్ళిన సేవకుడు తీవ్రమైన నడుం నొప్పితో బాధపడుతుండేవాడు. నిరక్షరాస్యుడైనా , అతనికి దైవం పట్ల అచంచల విశ్వాసం, ప్రేమ , భక్తి వున్నాయి. మశీదులో బాబా ఎదుట కూర్చోని బాబా నామస్మరణ చేసుకుంటూ వుండగా బాబా హఠాత్తుగా “నా నడుమ చాలా నొప్పిగా వుంది.” అని అన్నారు. ఎవరో భక్తుడు “మీ బాధ తగ్గాలంటే ఏం చెయ్యాలి బాబా” అని అడుగగా “లెండీ తోటలో వున్న కలబంద ఆకులు తెచ్చి వేడి చేసి, నొప్పి వున్న చోట పెడితే నొప్పి తగ్గుతుంది” అని బాబా ఆ సేవకుని వైపు చిరునవ్వుతో చూసారు. ఆశ్చర్యంతో బాబా చెప్పినట్లే చేయగా, ఆ సేవకుని నడుం నొప్పి ఎన్ని ఇంజక్షన్లు, మందులు తీసుకున్నా తగ్గనిది వెంటనే తగ్గిపోయింది.

మరొక సారి సకుటుంబ సపరివార సమేతంగా శిరిడీ వచ్చి దర్శనం చేసుకున్న శ్రీమతి మేనేజర్‌తో శ్రీ సాయి “ఈ రోజు నీకు గండం వుంది, జాగ్రత్తగా వుండు” అని అన్నారు. ఆ మాటలకు భయపడిన శ్రీమతి మేనేజర్‌తో తిరిగి శ్రీ సాయి “ఏం భయపడవలదు. ఈ ద్వారకామాయి అత్యంత దయార్ద్ర హృదయం కలది.ఈ మశీదు మెట్లు ఎక్కిన మరుక్షణం తన భక్తుల సంరక్షణ బాధ్యత తానే స్వయంగా చూసుకుంటుంది.” అని అన్నారు.ఆ సాయంత్రం శిరిడీ లోని వీధిలో చీకటిలో శ్రీమతి మేనేజర్ నడుస్తుండగా అకస్మాతుగా ఎవరో ఆపినట్లు ఆగింది. ఎటు నుంచో వెలుగు ప్రసరించి “ముందుకు చూడు” అన్న మాటలు వినిపించాయి. ఆతృతగా ముందుకు చూసిన ఆమెకు రోడ్డుకు అడ్డంగా బుసలు కొడుతూ పడుకొని వున్న ఒక విష సర్పం కనిపించింది. ఇంకొక అడుగు ముందుకు వేసి వుంటే పాముపై అడుగు పడి వుండి ఆవిడ ప్రాణాలు పోయి వుండేవి. ఆ సర్పం వెంటనే చరా చరా పాక్కుంటూ పక్కకు వెళ్లిపోయింది. ప్రాణాపాయ స్థితి నుండి ఆమెను బాబా ఆ విధంగా కాపాడారు.

సర్వం శ్రీ సాయినాథ పాదారవిందార్పణమస్తు

లోకాస్సమస్తా సుఖినోభవంతు

సర్వే జన: సుఖినోభవంతు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here