శ్రీ సీతారామ కథాసుధ-1

0
12

[శ్రీరామనవమి సందర్భంగా ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య రచించిన ‘శ్రీ సీతారామ కథాసుధ’ అనే పద్యకావ్యాన్ని అందిస్తున్నాము. ఇక నుంచి ఈ కావ్యం ప్రతి ఆదివారం కొనసాగుతుంది.]

పలికించెడివాఁడు రామభద్రుండఁట

[dropcap]శ్రీ [/dropcap]సీతారామ కథాసుధ – పద్యకావ్యం అనుకోకుండా 2023 సెప్టెంబరు రెండవ వారం నుండి ఒక ధారగా ప్రవహించుచు వచ్చినది. నవంబరు 4వ తేదీన ముగిసినది. రెండు మూడు సంవత్సరములుగా నాకు చూపు తగ్గిపోయి పద్యరచన ఆగిపోయినది. దాని స్ఫురణ లోపించినది.

అయితే హఠాత్తుగా సంభవించిన ఈ కావ్యోద్గమం నాకే ఆశ్చర్యమును కలిగించినది.

ఈ కావ్యము రామపంచాయతనవర్ణనముతో ప్రారంభింపబడినది. ఈ పంచాయతనము రామోపాసనకు అతిశ్రేష్ఠమైన మార్గము. తల్లియైన సీతాదేవితో కూడిన శ్రీరాముడు కేంద్రబిందువుగా తమ్ములతో కూడి కల్యాణగుణవిశిష్టుడై దర్శన మిచ్చుచున్నాడు. కల్పవృక్షములో పట్టాభిషేకసందర్భమున ఆంజనేయుని తనలోనే సంలీనము చేసికొనినట్లుగా చెప్పబడినది. ఇది హరిహరాభేదమును తెలియజేయును.

ఈ కావ్యమున కవి తారకమంత్రమైన రామమంత్రమును హృదయమున నిక్షేపించుకొని సాధనము చేయుచున్నట్లు చెప్పబడినది. అయినను సాధనమునకు పరాకాష్ఠయైన భాగవతగోష్ఠిలో కొనసాగుచు వారిని స్వామి సమీపములో తనను చేర్చుమని కోరినట్లున్నది. మోక్షము సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము అన్న నాలుగు విధములుగా నుండును.

ఇక్కడి సామీప్యముక్తి ముక్తదశలో కూడ స్వామికి నిత్యకైంకర్యము చేయుటకు వీలైనది. దానిని భక్తుడైన కవి కోరుచున్నాడు.

శ్రీ సీతారామ కథాసుధ రామయణములోని చిన్న ఘట్టము. శ్రీరామాదుల జననము నుండి సీతాకల్యాణము వరకు ఇది కొనసాగినది. రామాయణమునకు అనేక పార్శ్వములున్నవి .

ధర్మస్వరూపమును వెల్లడించు భాగము ప్రధానమైనది. ఈ ధర్మ స్వరూపము షోడశ కళాప్రపూర్ణుడైన శ్రీ రామచంద్రుని రూపమున దీనిలో ఆవిష్కరింప బడినది. ఇది వాల్మీకి నారద సంవాదము.

దీనిలో అంతర్గర్భితముగా అనేకములైన అంశములు స్పృశింపబడినవి. వానిని విశదపరచి అధ్యాత్మరామాయణము, ఆనందరామాయణము మొదలైన గ్రంథములు వెలసినవి.

జ్ఞానవాశిష్టము మొదలైన గ్రంథముల తీరు మరొక విధమైనది. భారతీయ వాజ్మయమున రామాయణము యొక్క సమగ్రరూపమును వెల్లడించుట ఎవ్వరికిని సాధ్యమైన అంశము కాదు. కవికులపతి కాళిదాసు భారతీయ రాజ్య వ్యవస్థా లక్షణమును రఘువంశకావ్యముగా తీర్చి దిద్దినాడు. భాస, భవభూతి, దిఙ్నాగ, జయదేవ, మురారి ప్రభృతులు దానిలోని రహస్యములను నాటకముల ద్వారా వ్యాఖ్యానించినారు.

భారతీయ భాషలలో రామాయణములు వందలాదిగా రచింపబడినవి. ఒక్కొక్క కవి రామమార్గమున తన సాధనమునకు, తపస్సునకు ఆధారముగా దానిని నిర్మించు కొనుచు పోయినాడు.

తెలుగులో రంగనాథ, భాస్కర రామాయణములు, రామాభ్యుదయము మాత్రమే కాక అనేకములైన రామాయణములు రచింపబడుచు వచ్చినవి. ఇంకా రచింపబడుచున్నవి. ఇటీవలి కాలంలో పండరినాథ రామాయణము, వావికొలను వారి రామాయణము, మంథరవ్యాఖ్య ప్రసిద్ధమైనవి. తమిళంలో కంబకవి రామాయణమును రచించినాడు. అట్లే తులసీదాసు రచించిన రామచరితమానస్ అతి ప్రసిద్ధమైనది. నిత్యపారాయణ యోగ్యమైనది. ఆధునిక కాలమున మైథిలీ శరణ్ గుప్త రచించిన ‘సాకేత్’ సుప్రసిద్ధమైనది. కన్నడంలో K.V. పుట్టప్ప రచించిన రామయణ దర్శన, వీరప్ప మొయిలీ రచించిన రామాయణ మహాన్వేషణ మొదలైనవి తమతమ భావనమును, దర్శనమును వెల్లడించినవి.

ఆధునిక కాలమున తెలుగులో విశ్వనాథ సత్యనారాయణ రచించిన శ్రీమద్రామాయణ కుల్పవృక్షము రామాయణములోని అనేక పార్శ్వములను పొరలు పొరలుగా చూపించుచు ఉపనిషత్తుల నాటినుండి నేటివరకు సాగిన తపోమార్గములను, ప్రతీకాన్వయములను రసమార్గమున వెల్లడింప బడిన కావ్యరహస్యములను తెలియ జేయుచు వచ్చినది. పుట్టపర్తి వారి జనప్రియ రామాయణము షట్పదీ గేయరూపమున వెలువడినది.

రామయణ సంస్కృతి తోడి సంబంధము, మా పితామహులు శ్రీమాన్ కోవెల రంగాచార్య స్వామి వారు దివ్యకథా కాలక్షేపములు చేయుచుండగా, 12 ఏళ్ళ వయస్సులో నా మనస్సునకు కలిగినది. తర్వాత అనేక రచనలు నా చైతన్యమును విస్తరించి రామకథానుభవమును నాలో నెలకొనునట్లు చేసినవి.

నేను నా కౌమారములోనే కావ్య రచన ప్రారంభించినను రాముని గూర్చి ప్రత్యేకరచన చేయలేదు. శ్రీకృష్ణుని గురించి ‘కృష్ణ రశ్మి’ అన్న కావ్యమును రచించితిని. అట్లే శ్రీలక్ష్మీనృసింహస్వామి వారిని గురించి ‘శ్రీ నృసింహ ప్రపత్తి’ని, అమ్మవారిని గురించి ‘మణిసేతువు’ రచనను చేసినను ఇపుడు ఎనుబది ఎనిమిదేండ్ల ప్రాయమున శ్రీరామచంద్రుడు నాచేత శ్రీసీతారామ కథాసుధను నిర్మింప జేసికొనినాడు.

ఈ గ్రంథములో పరతత్వము దశరథాత్మజుల రూపమున ఆవిర్భవించిన సంగతి పాంచరాత్రములోని వ్యూహ సిద్ధాంతముతో సమన్వయింపబడినది. తపస్వులు ఉన్మనీదశకు చేరుకొన్నపుడు, బ్రహ్మర్షు లైనపుడు వారు దేశ కాలములకు అతీతులై ప్రవర్తింప గలరను భావము విశ్వామిత్రుని వృత్తా౦తములో చెప్పబడినది. శ్రీరాముని తీసుకొని వచ్చుట, అతనికి అస్త్ర శస్త్రములిచ్చుట, యజ్ఞరక్షణము చేయించుట మొగలగునవి ఆయన సాధనములోని భాగములే.

అట్లే అహల్య గాథలోని ఇంద్రియ భావముద్ర ఆమె మనస్సులో ఒక క్షణకాలము సంభవించుట తెలిపి ఆమె తపస్సు స్వామి వారి దర్శనముతో, పాద స్పర్శనముతో ఎట్లు సఫలమైనదో తెలుప బడినది. అట్లే శివ ధనుర్భంగ సన్నివేశమున శివునకు, శివధనుస్సునకు అభేదము చెప్పుటయే కాక శివునకు రామునకు నడుమ అభేదము వివరింప బడినది.

ఇంతేగాక సీతాదేవి సందర్భములో ఆమె జగన్మాతృలక్షణమును, స్వామియందు ఆమె ఆదినారాయణుని దర్శించుట, తాను ఆద్యాది శ్రీమహాలక్ష్మినని భావించుట సూచింపబడినది. ఈ కావ్యము మొత్తము మీద శ్రీ అరవిందులు ప్రతిపాదించిన దివ్య జీవన పరిణామమును కలిగించుట రామావతార లక్షణమని వ్యాఖ్యానించుట జరిగినది. అందువలన వివాహఘట్టము వివరింపబడలేదు. పరశురాముని వృత్తా౦తము పరిహరింపబడినది. ఒక విధముగా ఈ కావ్యము సుషుమ్నా రూపుడైన నారదుని వలన, వాల్మీకికి ఆయన చేసిన ఉపదేశము వలన, వారిద్దరి సంపాదము వలన యోగ సాధనముగా చిత్రింపబడినది. ఈ దృష్టితో ఈ కావ్యధార ప్రవహించుచు ప్రసరించుచు నాకు దర్శనమిచ్చినది .

నా తొలికావ్యము ఆరంభములో “ఎడదలో నాగేటి చాలు ఈకృతి తీర్చును సుందరుడవైన నిన్నిచట నిలిపి సిరులను కొల్ల గొట్టెదను” అన్న పంక్తులలో శ్రీ సీతారాముల ప్రసక్తియే యున్నది. అది మరల శ్రీసీతారామ కథాసుధగా వెలువడుట నా అదృష్టము.

నాకు పద్యములు వ్రాసికొను వెసులుబాటు లేని సందర్భములో మిత్రుడు పాతూరి రఘురామయ్యకు నేను ఫోన్ లో చెప్తుండగా ఈ పద్యములను వ్రాసికొనినాడు. అతనికి ఆశీస్సులు. ఈ రకముగా ఈ కావ్యము యొక్క స్వరూపము ఏర్పడినది.

కవి, స్వాదు మర్యాదలు గల మిత్రుడు శ్రీ రామా చంద్రమాళి ఇంతకుముందే నా కావ్యాలు మణికర్ణిక, అశ్రుభోగ – ముద్రింప జేసినారు. తమ ఇంటి పేరు కనబడగానే ఈ కావ్యాన్ని కూడ ముద్రింప జేస్తున్నారు. వారికి కృతజ్ఞతలు చెప్పటం కేవలం మర్యాద మాత్రమే. మా ఇద్దరి మైత్రీబంధం దానిని మించినది.

కోవెల సుప్రసన్నాచార్య

~

శా. సీతా లక్ష్మణ వైరిహా భరత సంశ్లిష్టంబు వాతాత్మ సం
జాత ధ్యేయము శ్రీ రఘూత్తమ పరస్థానంబు సుస్పష్టమై
చేతస్సంపుటి రామమంత్రమును నిక్షేపించి నిర్భీకతన్‌
మీతో వచ్చెద భక్తులార! తన సామీప్యంబునన్‌ చేర్పుడీ. (1)

ఉ. అంతయు తామె నేర్చిరొ? తనంతన వ్యక్తతపొందెనో త్రయీ
శాంతవచస్సు రాఘవుల సంగతి నేర్చిరి బ్రహ్మమౌని పా
దాంతికమందు ప్రాణముల ఆగతి సంగతి కట్టివేసిరో
వింతలు వేదవేద్యులగు బిడ్డలు ఆశ్రమవాటిలోపలన్‌. (2)

చం. దశరథుబిడ్డ లందరును ధర్మము తప్పరు మాట తప్పరున్‌
విశదపరాక్రముల్‌, గురువివేకులు, సద్గురు వాక్య కింకరుల్‌,
ప్రశమిత చిత్తవృత్తులును, బ్రధ్నసమానులు, కార్యశూరులున్‌,
నిశితమనస్కులున్‌, గుణ వినిర్మిత జీవను లప్రమేయులున్‌. (3)

సీ. పరవాసుదేవుండు పాల్కడలిని వీడి
వచ్చెను శ్రీరామభద్రుడగుచు
ఆమోదమున నుండి యడుగిడె సంకర్ష
ణాఖ్యను లక్ష్మణు డనగ వెలసె
ఆ ప్రమోదమునుండి యాప్తుడు ప్రద్యుమ్ను
డవతరించెను భరతాఖ్య చెంది
సమ్మోదమున నుండి సాగినా డనిరుద్ధు
డరిహంత సేవ్యనియంత్రణమున

తే.గీ. దశరథావని నాథుని తనయులైరి
పరమతత్త్వము దిగివచ్చె విరళరీతి
సాధుజనుల సంరక్షణస్థాయి చెంది
దుష్ట శిక్షణ గావింప దోహళించి. (4)

ఉ. ఆ పరముండు రాముడు దివాకరదీప్తుడు సాగివచ్చినన్‌
దీపము వెంట దీపముల తేకువ వచ్చిరి తమ్ములందరున్‌
ఆ పరముల్‌ పరాత్పరుని యందున కార్యనిబద్ధులౌచు సే
వా పరదీప్తి సాగిరి వివర్తత లోకములెల్ల బ్రోవగన్‌. (5)

తే.గీ. వ్యూహములు దిగివచ్చెను పుడమిపైకి
దేవ దానవ ఘర్షణ తీరు గెలువ
ఆ వశిష్ఠుని చెంత జ్ఞానాబ్ధులగుచు
తల్లులకు లోకులకు తృప్తి తనరజేయ. (6)

తే.గీ. జనని కౌసల్య శ్రీరామచంద్రు గాంచె
ముదిత కైకేయి కడుపున పొల్చె భరతు
డా సుమిత్ర కాంచెను లక్ష్మణాఖ్యు శత్రు
హరుని, దీప్తతేజులను దాశరథులిండ్ల. (7)

ఉ. సేవయు తత్త్వచింతనము సేవ్యుడి సేవయు సంప్రదాయమై
జీవులు తత్త్వ మార్గమున చేరుదు రా పరమప్రదేశమం
దా విధి ఈశ్వరుండు పరమార్థము చేరెడి త్రోవ తానె సం
భావితమార్గమున్‌ తెలుప వచ్చెను దాశరథప్రసూతుడై. (8)

ఉ. సోదరులన్న రామున కసుప్రమితంబగు ప్రీతి గల్గు న
త్యాదరమొప్ప నన్న యన ఆ యనుజుల్‌ పరమాప్తులై చనన్‌
శ్రీదయితుండు రాముడు వశీకృతచిత్తుడు నాటలందునేన్‌
చేదులు పల్కడెప్పుడును చెల్వము ప్రోవులు దమ్ములందరున్‌. (9)

ఉ. సేశ్వరులై యుషర్బుధుని జిహ్వలు తృప్తి యొనర్త్రు తండ్రితో
ప్రశ్వసనంబు సప్రణవ బంధము సేసెద రాది యోగులై
అశ్వరథాది యూధము నియంత్రణసేతురు యోధులౌచు వై
వస్వతులెల్లవస్థలను ప్రాజ్ఞులు నీడలు లేని వెల్గులై. (10)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here