శ్రీ సీతారామ కథాసుధ-10

1
8

[ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య రచించిన ‘శ్రీ సీతారామ కథాసుధ’ అనే పద్యకావ్యాన్ని అందిస్తున్నాము.]


~
తే.గీ.
కలిగె పుత్రుడు పితరుల వలెనె బ్రహ్మ
తేజమును సంతరించెను ధీకుశలుడు
తా శతానందుడానంద సంభృతుండు
జనకునకు పురోహితుడయ్యి చేరె మిథిల. (91)

తే.గీ.
ఒక్కనాడు రాత్రమ్మున ఒక్క కలత
నిద్ర మేల్కొని గౌతము నిద్ర లేపి
సతి అహల్య దు:ఖోర్మి విచలిత యగుచు
పలికె పతనమైనట్టిదౌ పక్షివోలె. (92)

తే.గీ.
ఋషి వివస్వంత! చిత్తేశ! హృదయ నాథ
నా మనస్సులో నింద్రియనాథమైన
నీడ మసలెను కోర్కెలు జాడ తప్పె
నే రసాతలమున నుంటి నెలవు తప్పి. (93)

తే.గీ.
ఈ మహాపాపభావమె ఇరకటముగ
నున్నదద్దాని శిక్షింపు నొవ్వు దీర్ప
ఏదొ దీర్ఘతపమ్ము సాగింప వలయు
జడత నుండి నేనున్మనీస్థాయి జేర. (94)

తే.గీ.
అపుడు గౌతముడనియె దుఃఖాబ్ది తరచ
ఒక్క పాషాణదశలోన నుందువీవు
అచట మెట్లెక్కవలయు ప్రయత్నపడుచు
ప్రభువపుడు వచ్చు శాపమ్ము పాసిపోవు. (95)

మధ్యాక్కర
అనుకొనుచున్నంత గౌతమాశ్రమ పదము కన్పించె
ఇనకులాంబోధిచంద్రులకు ఇది పూర్వదృష్టమన్పించె
ఘనుడగు గౌతముని కర్చ గావించె పరికించు చుండ
కనిపించెనొక శిలామూర్తి గాఢ తపస్వి రూపమున. (96)

మధ్యాక్కర
ప్రభువు నమస్కరింపంగ పాదముల్‌ తాకినాడేమొ
నిభృతియై తన పాదములను నెఱి తాకె తడబాటు వలన
శుభలిప్తలో లేచి నిలిచె శోభాపరిష్కారమూర్తి
స్వభువుని కీర్తించె నిట్లు సామము పాడినయట్లు. (97)

మధ్యాక్కర
పరమ పదమ్మున యందు భాసించు పరవాసుదేవ
వరగుణుల్‌ దివ్య సూరులును వరుసలై సేవలు నెరప
పరమ కల్యాణ గుణాబ్ధి పాలింతువెల్ల లోకముల
పురుషకారము చేయు తల్లి పూర్ణత్వ సంసిద్ధి కూర్చు. (98)

మధ్యాక్కర
విరజకావల నున్న లోకవితతియు జన్మమృత్యువుల
తరిమెడు పాప పుణ్యముల దవ్వుల దవ్వుల చేర్ప
కరుణ పొంగినవాడ వ్యూహపద్ధతి విభవమునగుచు
నిరతము శిష్టుల బ్రోవ నేలకు దిగివత్తువీవు. (99)

మధ్యాక్కర
హృదయములోన యోగీశ హేలాంతరాత్మవై పొలిచి
సదయత భక్తుల కోర్కె సఫలమ్ము చేయ అర్చనల
ఒదిగి సదనములన్ గొల్తు, ఉన్నిద్ర లీలా విలాస
ఎదలోన ముంగిట పొల్చి తీనాడు నా పంట పండె. (100)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here