శ్రీ సీతారామ కథాసుధ-2

1
11

[ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య రచించిన ‘శ్రీ సీతారామ కథాసుధ’ అనే పద్యకావ్యాన్ని అందిస్తున్నాము.]

తే.గీ.
వాసుదేవుడు దిగివచ్చె వసుధనేల
యోగనిద్రను విడిచి అంహోవిదారి
అంతరాదిత్యుడయి తారకాఖ్య మనువు
రాముడగుచును పట్టాభిరాముడగుచు
పదియునొకవేల యేడులు ప్రభువునగుచు. (11)

మధ్యాక్కర
ఎవనికి మహతి సుషుమ్న, ఎవడు త్రిలోక సంచారి
అవధూతయై సంచరించు నాతడు నారదమౌని
భువనతత్త్వవివేకియైన పూర్ణభావుకుడు నాదాబ్ధి
ప్రవహించు గంగావిలసన ప్రకటించు యోగీశ్వరుండు. (12)

మధ్యాక్కర
భాసితసూర్యతైజసుడు భారతీదేవినందనుడు
ఈ సమస్తమ్మును జ్ఞాన విస్తారమొనరించు గురుడు
పూసిన దివ్యజీవనసమూర్తపరీమళసుమము
దేశికమౌళి తా వచ్చె తెల్వియై వాల్మీకి కడకు. (13)

మధ్యాక్కర
గురుపూజలొనరించి చెంత కూర్చొని అడిగె వాల్మీకి
నిరతనారాయణస్మరణనిర్మలానందుండవీవు
కొరతలు లేవు నీయందు గూఢత ప్రకటము తెలియు
పరమార్థవేదివి నిన్ను భావింప జ్ఞానముప్పొంగు. (14)

మధ్యాక్కర
విధి లోకమున నుండి తపము వీడుల నాదమై సాగి
అధరీకృతామృతాస్వాద్యమైన రామాయణీవిద్య
మధురత కావ్యమై సాగె మాన్య! నీ సత్కృపాబలము
ప్రథిత భూమీభూషణముగ ప్రాజ్ఞచంద్రాపీడముగను. (15)

ఉ.
రాముడనంగ నెవ్వడు? పరాత్పరుడా హృదయాల వెల్గు సం
ధ్యామృదు దీపమా? సకల తామసముల్‌ తొలగించు ఖడ్గమా?
ఏ మెయి సృష్టి కావల వెలింగెడు నట్టి చిదగ్నికుండమా?
ఆ మహితాత్ము నెట్లనుభవావధి నిల్పుట? తెల్పవే దయన్‌. (16)

ఆ.వె.
ఆ వికుంఠమందు నాత్మలో నాత్మగా
చెలువ తోడనుండె శ్రీధరుండు
ఏల భూమి బిడ్డ నేలగా వచ్చెను?
ప్రీతి తోడ తెల్పవే కృపాళు! (17)

కం.
వైదేహి యనగ తెలియం
గా దేహాదులకు పైన గల చిద్ఘనమా?
ఆదిని పురుషుడు తన ని
ష్పాదించిన ప్రకృతి యేమొ? పలుకంగలదే. (18)

తే.గీ.
తాటకాది రావణ వధాంతముగ నెల్ల
అసుర సంహార కేళి సమాప్తమయ్యె
ఆది పురుషు డయోధ్య సింహాసనమున
సీతతో గూడి పట్టాభిషిక్తుడయ్యె. (19)

ఉ.
రామవతార లక్ష్యమది రావణ సంహరణంబె తా పరం
ధాము వయస్సు నాటికిని దగ్గర నల్వది యేండ్లు మాత్రమే ని
స్సీముడు వేల యేండ్లు ధర చేసెను రాజ్యము నే కతంబునన్‌?
రాముని రాజ్యమందు గల ప్రాభవమేమిటొ? తెల్పవే దయన్‌. (20)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here