శ్రీ సీతారామ కథాసుధ-3

0
9

[ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య రచించిన ‘శ్రీ సీతారామ కథాసుధ’ అనే పద్యకావ్యాన్ని అందిస్తున్నాము.]

~

తే.గీ.
యోగశిఖవైన నిన్ను నా యుదితచిత్త
మందు నిలుపంగ ప్రాణమే యదుపు నిడదు
మహతి నొకమాటు మీటవే దహర గగన
మార్గనాదవినోదివి మాన్య! గురువ! (21)

ఉ.
ఎన్నికకెట్టు లక్షరమహిమ్నుడు రాముడు మంత్రమూర్తి స
ర్వోన్నతి శ్రీవికుంఠమున నుండును జీవసదాశ్రయుండు నా
పన్నశరణ్యుడై నిరతి పాల్కడలిన్‌ శయనించు వేల్పు సం
పన్నుడు నున్మనీచరమభాగరహస్స్థితు డెట్లు కన్పడున్‌? (22)

ఉ.
ఆ భువనైక మాత జగదంబుజ కర్ణిక శ్రీవసుంధరా
ప్రాభవమూర్తి యౌచు తలపన్‌ జనియించెను సీరపద్ధతిన్‌
శోభనమూర్తి ధూర్జటి ధనుః పణమై రఘు రామచంద్రు ప్రా
ణాభరణంబుగా జగములందున పూజ్యత సంభవింపగన్‌. (23)

సీ.
కొనగొని యాజ్ఞవల్క్యుని పాదముల జేర
వేదవేదాంతముల్‌ విదితమయ్యె
మేత్రేయి గార్గుల మంతనంబుల లోన
నపర పరావిద్యలన్వయించె
సభలోన మునుల వాక్సరణి సంభావింప
యజ్ఞప్రతీకలు నన్వయించె
జనకుని ముఖమున శాంతి సంగతి చూడ
సమహితత్త్వ స్థితి సంభవించె

తే.గీ.
ఇంతగా నెదుగుచు సీత అంతలోన
చెల్లియల తోడ నేరుగా చెమ్మ చెక్క
లాడుచును పాట బాడుచు నా మిథిలను
బాల్య లీలలు పరవశ పడగ జేసె. (24)

తే.గీ.
ఆమె హొయలను గుర్తింప అచ్చమైన
పసిడిపై వెన్నెలల పొంగు లెసగినట్లు
ఆమె నవ్వులు పొంగిన యపుడు గగన
మెల్ల తానయి నేల రహించినట్లు. (25)

సీ.
కడిమిపూవులు మాలగా జేర్చి పొందిక
జడపైన చెలువుగా చాలు దీర్చు
కస్తూరికా తిలకమ్మును నుదుటిపై
నందకాసిని బోలునట్లు దిద్దు
శ్రీగంధమును జేర్చి చెక్కిళ్ళపై మెడ
పయినను తీరుగా పరగజేయు
కనురెప్పలందు చెంగల్వ పూవుల వోని
పెదవుల కప్పుర మొదవ జేయు

తే.గీ.
గంధవతి బిడ్డ కస్తూరికాది దివ్య
వస్తువులకామె స్పర్శ ప్రావణ్యమొసగు
ఆమె పద్మగంధిగ నడయాడునపుడు
క్రొన్ననల విచ్చు తావుల సన్న తెలియు. (26)

తే.గీ.
ఆమె చెల్లెండ్రు మువ్వురు నమృతకళలు
అసితనేత్రాంశు విధృతచంద్రాంశురేఖ
లమృత వాహినీ వీచిక లక్కవలెనె
పసిడిముద్దలు సమ్మోదభావనిధులు. (27)

సీ.
నేత్రాంశువీధి వర్ణింప సరస్వతీ
దేవి తానై రూపు దిద్దుకొనుచు
తానేకపద, ద్విపదయును, చతుష్ప్పద,
అష్టాపదయు నంత నవపదయును
పరము వ్యోమమునందు మెరసి సహస్రాక్ష
రయునుగా దివ్యసారస్వతముగ
సర్వశాస్త్రములును సర్వకావ్యములును
విశ్వరూపత బ్రహ్మవేశ్మమందు

తే.గీ.
ఆవహిల్లిన తల్లి రసానుభావ
సర్వచిత్తానుభావ విస్తరత నొంది
అఖిల భువన మానందవిన్యస్తముగను
చేసి మిథిలాపురిని నివసించు సీత. (28)

ఉ.
శ్యామల కోమలాంగుడు ప్రసన్నుడు స్మేరవిలాసవిభ్రమ
స్థేముడు రాజశేఖరుడు చిత్రముగా కళలందు తోచె వీ
క్షామధుమూర్తియై తనను గైకొనినట్టుల తోచె నంతరా
రాముడు వీడెవం డనుచు ప్రాణములందున సీత చింతిలెన్‌. (29)

చం.
వితథకథా ప్రసంగములు పెక్కువలై కొనసాగ శ్రీరమా
పతి అవతారలీలలను ప్రాజ్ఞులు వెల్లడిసేయ తాను అ
చ్యుతునికి తోడుగా నచట నున్నటులన్‌ తలపోసినంత పి
చ్చితనమటంచు నవ్వుకొనె శ్రీ మధురాకృతి చిద్విలాసియై. (30)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here