శ్రీకాళహస్తీశ్వర శతక పద్యాలలో పూర్వకథలు

0
14

(2024 మార్చి 8 న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ.)

[dropcap]శ్రీ[/dropcap]కృష్ణ దేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ధూర్జటి ఒకడు. కృష్ణరాయలు ఈయన కవిత్వానికి ఎంతో సంతోషించి “స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కుల కేల గలిగెనో అతులిత మాధురీ మహిమ…” అంటూ ప్రశంసించాడు. ధూర్జటి రచించిన గ్రంధాలలో అత్యంత ప్రాచుర్యం పొందినవి శ్రీ కాళహస్తి మహాత్మ్యము, శ్రీ కాళహస్తీశ్వర శతకం. ముఖ్యంగా శ్రీకాళహస్తీశ్వర శతకం శతక సాహిత్యంలో మణిమకుటం లాంటిది. ఇందులో పరమేశ్వర భక్తితత్వాన్ని వివిధ పద్యాలలో వివరించాడు. చాలా పద్యాలలో ప్రాచీన శివభక్తుల కథలు అనేకం పొందుపరచాడు. అవన్నీ ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఉదాహరణకు ఈ పద్యం తీసుకుందాం.

“నీతో యుద్ధము సేయనోప గవితా నిర్మాణ శక్తి న్నినుం
బ్రీతుం జేయగలేను, నీ కొరకు దండ్రింజంపగా జాల, నా
చేతన్ రోకట నిన్ను మొత్త వెరతున్ జీకాకు నా భక్తి, యే
రీతిన్ నాకిక నిన్ను జూడగలుగున్? శ్రీకాళహస్తీశ్వరా!”

“నీతో యుద్ధం చేయలేను, కవిత్వం వ్రాసే ప్రతిభతో నిన్ను సంతుష్టుని చేయలేను. నీకోసం తండ్రిని చంపలేను. నా చేతిలో ఉన్న రోకలితో నిన్ను మొత్తటానికి భయం వేస్తున్నది. నాలో ఉన్న భక్తే నన్ను ఇబ్బంది పెడుతున్నది. ఇక నిన్ను చూసే అవకాశం నాకు ఎలా కలుగుతుంది శ్రీకాళహస్తీశ్వరా!” అని ఈ పద్యభావం. ఈ పద్యంలోని ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క కథ ఉన్నది. ఈ పూర్వకథలు అన్నీ చాలా హృద్యమంగా ఉంటాయి.

1.“నీతో యుద్ధము చేయనోప…” అంటే, అర్జునుడిలా నీతో నేను యుద్ధం చేయలేను అంటూ ప్రారంభించాడు ధూర్జటి.

అరణ్యవాసం చేస్తున్న పాండవుల దగ్గరకి ఒక రోజు వ్యాసుడు వచ్చాడు. ఆయన్ని అర్ఘపాద్యాదులతో పూజించాడు ధర్మరాజు. వ్యాసుడు ఆయన్ని ఏకాంతప్రదేశం లోకి తీసుకువెళ్లి “నీ మనసులో బాధ నాకు తెలుసు. నీకు ప్రతిస్మృతి అనే విద్యను ప్రసాదిస్తున్నాను. దీనిని అర్జునునికి నేర్పు. దీనితో అతడు శత్రువులను జయించగలుగుతాడు. అర్జునుడు తన తపస్సుతోనూ, పరాక్రమంతోనూ దేవతలను దర్శించటానికి అర్హుడు. కనుక అస్త్రవిద్యా ప్రాప్తి కోసం అతడిని శివుని గురించి తపస్సు చేయటానికి పంపు” అని చెప్పి వెళ్ళిపోయాడు. అన్నగారి ఉపదేశానుసారం అర్జునుడు తపస్సు చేసుకోవటానికి హిమాలయాను దాటి అడవిలో ప్రవేశించాడు.

నార వస్త్రాలను, జింక చర్మాన్ని, దండ కమండలాలను ధరించి తపస్సు చేయసాగాడు. రానురాను అర్జునుడి తపస్సు తీవ్రం కాసాగింది. తపోశక్తికి దిక్కులన్నీ వేడెక్కిపోయాయి. మునులు, ఋషులు శంకరుడి దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు. “ఇప్పుడే వెళ్లి అర్జునుడి కోరిక తీరుస్తాను” అని శంకరుడు భిల్లుడిగా, పార్వతి భిల్లని రూపాలతో అడవికి వచ్చారు.

ఆ సమయంలో మూకాసురుడు అనే రాక్షసుడు అడవిపంది రూపం దాల్చి ఆర్జునుడిని చంపటానికి వచ్చాడు. “నిరపరాధియైన నన్ను చంపటానికి వచ్చావు. ముందు నిన్ను యమసదనానికి పంపుతాను” అంటూ బాణం వేశాడు అర్జునుడు. అదే సమయంలో శివుడు కూడా బాణం వేశాడు. రెండు బాణాల దెబ్బకు శరీరం ఛిద్రమై మూకుడు మరణించాడు. “ఈ సూకరాన్ని చంపాలని ముందుగానే నేను నిర్ణయించుకున్నాను. నువ్వెందుకు చంపావు? నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను” అన్నాడు అర్జునుడు.

“ఇది నా వేట. నీకన్నా ముందు నేను కొట్టాలని అనుకున్నాను. నీ మీద బాణం వేస్తాను. శక్తి ఉంటే కాచుకో!” అన్నాడు భిల్లుడు. భిల్లుడి మాటకు అర్జునుడు మండిపడి, అతడి మీద బాణవర్షం కురిపించాడు. అవన్నీ చేత్తో అందిపుచ్చుకున్నాడు భిల్లుడు. అర్జునుడు వరసగా బాణాలు వేస్తూనే ఉన్నాడు, భిల్లుడు అవి చేత్తో అందుకుని విరిచి వేస్తున్నాడు. అర్జునుడి తూణీరం ఖాళీ అయిపొయింది. కత్తితో కొట్టబోతే అది రెండు ముక్కలు అయింది. పిడుగు లాంటి పిడికిళ్ళతో గుద్దాడు. భిల్లుడు చలించలేదు. భిల్లుడు అర్జునుడిని తన సందిట ఇరికించుకున్నాడు. అటుఇటు కదలలేకపోయాడు అర్జునుడు. రక్తం స్రవించి నేలవాలిపోయాడు.

కొద్దిసేపటికి తెలివివచ్చింది. అంతక్రితం శివుని ప్రతిష్ఠించి, పూజిస్తూ చల్లిన పూలు భిల్లుడి తలమీద కనిపించాయి. అర్జునుడికి ఆనందం కలిగింది. భిల్లుడి చరణాలపై మోకరిల్లాడు. పరమేశ్వడుడు ప్రత్యక్షమై “అర్జునా! నువ్వు నాతో సమానమైన బలపరాక్రమాలు కలిగినవాడివి. నీ పట్ల నేను ప్రసన్నుడనయ్యాను. నీకేం వరం కావాలో కోరుకో!” అన్నాడు.

“ఈశ్వరా! నాకు వరం ఇవ్వాలనుకుంటే పాశుపతాస్త్రాన్ని ప్రసాదించు” అన్నాడు. శివుడు అంగీకరించాడు. అర్జునుడు స్నానం చేసి శుచిగా వచ్చాడు. శివుడు పాశుపతాస్త్ర ప్రయోగం, ఉపసంహారం ఉపదేశించి, “దీన్ని నీ శత్రువు మీద ప్రయోగిస్తే అతడిని నాశనం చేస్తుంది. జాగ్రత్త! అల్పుల మీద ప్రయోగిస్తే జగత్ప్రళయం సంభవిస్తుంది” అని చెప్పి అంతర్ధానమయ్యాడు.

2.“కవితా శక్తి నిన్నుం బ్రీతుగ జేయగలేను…” అనే దానికి కూడా పూర్వకథ ఒకటి ఉన్నది. ఒకప్పుడు పాండ్యదేశంలో కరువు వచ్చింది. వర్షాలులేక, పంటలు పండక, తినటానికి తిండిలేక జనం అల్లాడిపోతున్నారు. ఒక శివాలయ పూజారి ఒకడు ఉన్నాడు. అతడు శివలింగం దగ్గర కుర్చుని “స్వామీ! ఎన్నో ఏళ్ల నుంచీ నిన్నే నమ్ముకుని సేవిస్తున్నాను. నాకూ, నా కుటుంబానికీ నువ్వే దిక్కు. మమ్మల్ని ఆకలి బాధ నుంచీ రక్షించు” అని వేడుకున్నాడు. అప్పుడు శివలింగం నుంచీ ఒక తాళపత్రం వచ్చిపడింది. “పాండ్యరాజు సాహితీ ప్రియుడు. ఈ పద్యాన్ని తీసుకుని వెళ్లి వినిపించు. నీకు వెయ్యిమాడలు బహుమతిగా ఇస్తాడు. నీ కరువు తీరుతుంది” అనే మాటలు వినిపించాయి.

ఆ పూజారి ఆనందంతో తాళపత్రాన్ని తీసుకుని వెళ్లి అందులోని పద్యాన్ని పాండ్యరాజు దగ్గర చదివి వినిపించాడు. ఆ కొలువులో నత్కీరుడు అనే కవి ఉన్నాడు. తనే గొప్ప పండితుడు అనే గర్వం అతడికి. “ఏమిటేమిటీ? సింధురాజ కన్య కేశ బంధంబు సహజ గంధంబు అనా! స్త్రీల జుట్టుముడి ఎక్కడైనా సహజ సువాసన కలిగి ఉంటుందటయ్యా! సువాసన పూల వలనో, కేశతైలం వలనో వస్తుంది గానీ! ఈ పద్యం తప్పు. వెళ్ళు వెళ్ళు” అని పరిహాసం చేసాడు.

“అయ్యా! ఈ పద్యం నేను రాయలేదు. ఆ పరమేశ్వరుడే రచించి ఇచ్చాడు” అని చెప్పాడు పూజారి. అయినా నత్కీరుడు నమ్మలేదు. పూజారి విచారంగా మళ్ళీ శివాలయానికి వెళ్లి ఈశ్వరుడితో జరిగినదంతా చెప్పాడు. అప్పుడు శివుడు బ్రాహ్మణరూపంలో ప్రత్యక్షమయి “నాతోరా! బహుమతి నేను ఇప్పిస్తాను” అని పాండ్యరాజు కొలువుకి తీసుకువెళ్ళాడు. నత్కీరుడు వెనకటి లాగే ఈ పద్యం తప్పు అన్నాడు.

“సాధారణ మానవ స్త్రీల కొప్పులకు సువాసన ఉండదేమో గానీ, పార్వతీదేవి కొప్పు సహజ సువాసన కలిగి ఉంటుంది” అన్నాడు బ్రాహ్మణ రూపంలో ఉన్న శివుడు.

“పార్వతీదేవి కొప్పు నువ్వు చూశావా!” అంటూ నత్కీరుడు ఫక్కున నవ్వాడు. బ్రాహ్మణుడు పరమేశ్వరుడిగా నిజరూపం ధరించాడు. “నేను త్రినేత్రుడిని” అన్నాడు. పాండ్యరాజుతో సహా సభికులంతా లేచి పరమేశ్వరుడికి నమస్కరించారు. నత్కీరుడు మాత్రం “నీకు మూడుకళ్ళు కాదు, ఒంటినిండా కళ్ళు ఉన్నా సరే, ఈ పద్యం మాత్రం తప్పే!” అన్నాడు అహంకారంతో.

ఈశ్వరుడికి ఆగ్రహం వచ్చింది. “ఓరీ! పరమేశ్వరుడిని అయిన నన్నే తప్పు పట్టి తృణీకరికరిస్తున్నావు. ఈ అపరాధానికి కుష్టువ్యాధితో పరితపించు” అని శపించి అంతర్ధానమయ్యాడు. పాండ్యరాజు భయపడి పూజారికి బహుమతి ఇచ్చి పంపేశాడు.

నత్కీరుడి శరీరంలో క్రమక్రమంగా మార్పులు వచ్చాయి. ఒంటినిండా పుండ్లు వచ్చి రసికారుతూ చూడటానికి భయంకరంగా తయారయ్యాడు. అందరూ అసహ్యించుకుని ఊళ్ళోనుంచీ వెళ్ళగొట్టారు. అప్పటికి అతడి కళ్ళు తెరుచుకున్నాయి. కొండతో పొట్టేలు డీకొన్నట్లు అయింది అనుకుని పశ్చాత్తాపపడి, “స్వామీ! అహంకారంతో నీతో పంతానికి పోయాను. నన్ను క్షమించు” అని శివుడినే శరణు వేడుకున్నాడు. భోళాశంకరుడు ప్రసన్నుడై “కైలాసాన్ని దర్శిస్తే నీ వ్యాధి నయం అవుతుంది” అని పరిహారం చెప్పాడు.

నత్కీరుడు రాళ్ళలో నుంచీ, రప్పల్లో నుంచీ, కొండలమీద నుంచీ అడవులలో నుంచీ ప్రయాణం చేసాడు. శరీరంలో వ్యాధి తీవ్రత హెచ్చింది. శరీరం నడవటానికి సహకరించటం లేదు. అడుగుతీసి అడుగు వేయటం కూడా కష్టంగా ఉంది. ఈ పరిస్థితులలో కైలాసం దాకా ఎలా ప్రయాణించాలి అని దుఃఖిస్తూ కూర్చున్నాడు. అతని స్థితి చూసి కుమారస్వామికి జాలి కలిగి మానవ రూపంలో ప్రత్యక్షమై “కైలాసం దర్శించమని అన్నారు గానీ ఉత్తర కైలాసం (కైలాస పర్వతం) అనలేదు కదా, దక్షిణ కైలాసం (శ్రీకాళహస్తి) ఇక్కడికి చేరువలోనే ఉంది. అక్కడికి వెళ్ళు. నీ వ్యాధి నయం అవుతుంది” అని సలహా ఇచ్చి మాయమయ్యాడు. నత్కీరుడు మళ్ళీ ప్రయాణం కొనసాగించాడు, ఎలాగో దక్షిణ కైలాసం చేరుకొని పరమేశ్వరుడిని సేవించగానే అతడి వ్యాధి నిర్మూలమైంది. “కవితా నిర్మాణ శక్తి నిన్ను ప్రీతుం చేయగలేను” అని ధూర్జటి చెప్పటంలో పూర్వకథ ఇది.

3.“నీ కొరకు తండ్రిం చంపగా జాల..” అనే వాక్యానికి మరొక కథ ఉంది.

ఒక ఊరిలో ఒక గొల్లవాడు ఉండేవాడు. అతడికి మేకల మంద ఉన్నది. వాటిని మేపటానికి కొడుకుని పంపేవాడు. అతడి కొడుకు పేరు శివయ్య. పన్నెండేళ్ళ వయసు ఉంటుంది. శివయ్య ప్రతిరోజు మేకలను సమీపంలోని కొండమీదకు తోలుకుని వెళ్లి సాయంత్రానికి తిరిగివచ్చేవాడు. ఆరోజు బయలుదేరేసరికి బాగా ఎండ ఎక్కటంతో భోజనం చేయకుండా బయలుదేరాడు.

మధ్యాహ్నం అయింది. శివయ్య తండ్రి కొడుకు కోసం అన్నం మూట కట్టుకుని కొండ దగ్గరకు వచ్చాడు. “నువ్వు కాస్త బువ్వ తినరా అయ్యా! మేకలను నేను చూస్తూ ఉంటాను” అని చుట్ట కాల్చుకుంటూ ఒక చెట్టుకింద కూర్చున్నాడు. శివయ్యకు ఒక అలవాటు ఉంది. భోజనం చేసేముందు శివపూజ చేసి తినటం అలవాటు. కొండ చుట్టుపక్కల దగ్గరలో శివాలయం ఏదీ కనబడలేదు.

కొద్దిదూరంలో మేకలు ముద్దలు ముద్దలుగా విసర్జించిన పెంటికలు కనిపించాయి. వాటితో శివలింగం ఆకారం తయారుచేశాడు. సమీపంలోని కొండమీద ఉన్న గన్నేరుపూలు తెచ్చి అలంకరించాడు. ఇంకొక మేక పాలు పిండి అభిషేకం చేశాడు. దూరంగా కుర్చుని ఉన్న తండ్రి ఇదంతా చూస్తూ “ఛీఛీ! మేక పెంటికలతో ఎవరైనా శివుడిని పూజిస్తారా!” అంటూ కాలితో తొక్క బోయాడు.

“వద్దయ్యా! ఆ లింగాన్ని పడదోయవద్దు” అంటూ శివయ్య తండ్రికి అడ్డుపడ్డాడు. అయినా వినకుండా కాలితో శివలింగాన్ని అవతలకు నెట్టేశాడు తండ్రి. శివయ్యకు కోపం ఉవ్వెత్తున లేచింది. మేకల ఆహారం కోసం కొమ్మలు నరకటానికి తెచ్చిన కత్తిని విసిరేశాడు. అది సూటిగా వెళ్లి తండ్రి మెడకు తగిలింది. మెడంతా కోసుకుపోయి రక్తసిక్తమయి కిందపడి మరణించాడు తండ్రి. దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్న తోటి గోపాలురు పరుగెత్తుకుంటూ వెళ్లి రాజుగారికి ఫిర్యాదు చేశారు. విషయం విన్న రాజుకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది.

భటులను, మంత్రులను తీసుకునిపోయి ఆ ప్రదేశానికి వెళ్ళాడు. వారు వెళ్ళేసరికి మేక పెంటికలతో చేసిన శివలింగం స్థానంలో స్పటికలింగం ధవళ కాంతులతో మెరిసిపోతూ కనిపించింది. శివయ్య తన్మయత్వంతో పాటలు పాడుకుంటూ ఉన్నాడు. అతడి తండ్రి యథావిధిగా మందలకు కావలి కాస్తూ కనిపించాడు. శివకటాక్షం చేత అతడు పునర్జీవితుడయ్యాడని అర్థం అయింది రాజుగారికి. శివయ్య భక్తిని ఎంతో మెచ్చుకున్నాడు. ఆ ప్రదేశం శైవక్షేత్రంలా పేరుపొందింది.

4.ఒక ఊరిలో ముత్తవ్వ అనే శివభక్తురాలు ఉన్నది. ఆమె, ఆమె భర్త ప్రతిరోజూ ఒక అతిథికి భోజనం పెట్టి గానీ వారు భోజనం చేసే వారు కాదు. శివుడు ఆమె భక్తిని పరీక్షించాలని ఒకరోజు బ్రాహ్మణుడి వేషం వేసుకుని ఆమె ఇంటికి వచ్చాడు. “అమ్మా! నాకు బాగా ఆకలిగా ఉంది. కొంచెం అన్నం ఉంటే పెట్టు” అని అడిగాడు.

“అయ్యో! ఇంకా వంట కాలేదు. అలా కొద్దిసేపు అరుగుమీద కూర్చో నాయనా! వేగంగా వంట ముగించి వడ్డిస్తాను” అన్నది ముత్తవ్వ.

“ఆకలి విపరీతంగా ఉంది. శరీరం తూలిపోతున్నది. ఈ ఆకలిబాధ భరించలేను. ముందు ఏదైనా ఉంటే తినటానికి పెట్టు తల్లీ!” అన్నాడు బ్రాహ్మణ వేషంలో ఉన్న శివుడు.

“అలాగా! ఈరోజు ఉదయమే పూజచేశాను. ప్రసాదం ఉంది. తెచ్చి ఇస్తాను, ఉండు” అని లోపలికి పోయి, జొన్నలతో చేసిన సంకటి తెచ్చి ఇచ్చింది. బ్రాహ్మణుడు కొంచెం తిని “ఛీ ఛీ! ఇది రుచిగా లేదు, చప్పగా ఉంది” అంటూ పారేయబోయాడు.

“అది శివప్రసాదం. పారెయ్యకూడదు. తప్పు” అన్నది.

“చాల్చాల్లేవమ్మా! ఇది ప్రసాదమా! ఏమైనా బాగుందా! ఆకలితో కడుపు మాడే వాడికి నువ్విచ్చేది ఇదా! ఇంతకన్నా ఇంకొక ఇంటికి వెళ్లి అడగటం మేలు” అని విసిరి కుప్పతొట్టిలో వేశాడు. అది చూడగానే ముత్తవ్వకు కోపం ముంచుకు వచ్చింది.

“ఓరి బుద్ధిహీనుడా! పవిత్రమైన శివప్రసాదాన్ని నేలపాలు చేస్తావా!” అంటూ మూలనున్న రోకలితో బాదింది. బ్రాహ్మణుడు భయంతో పరుగుదీశాడు. చిత్రం! అతడితో పాటు దేవాలయాల్లో ఉన్న శివలింగాలు, అందరి ఇళ్ళలో ఉన్న శివలింగాలు, చెట్టుకింద, పుట్టకింద ఉన్నవి అన్నీ వరస కట్టి అతడి వెనకనే వెళ్ళసాగాయి. గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. అతడిని మారురూపంలో పరమేశ్వరుడిగా గుర్తించింది ముత్తవ్వ. పరుగున వచ్చి అతడి పాదాలమీద పడిపోయింది.

“స్వామీ! అజ్ఞానంతో నేను చేసిన అపచారం మన్నించు. మా దోషాలను క్షమించు” అంటూ వేడుకుంది. బ్రాహ్మణుడు వెనుదిరిగి రాగానే అతడితో పాటు శివలింగాలు అన్నీ వెనుదిరిగాయి. శివుడు యథారూపంతో కనిపించి అందరినీ దీవించి అంతర్ధానమయ్యాడు.

ఇలాంటి శివభక్తుల కథలు అనేకం ఉన్నాయి శ్రీకాళహస్తీశ్వర శతకంలో. రాయలవారు విష్ణు భక్తుడు (శ్రీ మహావిష్ణువు, భూదేవిల కళ్యాణ గాథతో గోదాకళ్యాణం అనే కావ్యం రచించారు రాయలవారు) ధూర్జటి శివభక్తుడు. అయినా ధూర్జటి కవిత్వాన్ని మెచ్చుకుని ఆదరించాడు. అంతేకాదు, ఈ శతకంలో “రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు..” అంటూ రాజులను విమర్శించాడు ధూర్జటి. అయినా అన్ని మతాల వారినీ సమానంగా చూశాడు రాయలవారు. అందరినీ గౌరవించి, ఆదరించాడు శ్రీకృష్ణ దేవరాయలు.

~

ఈ వ్యాసం రాయటానికి ఉపయుక్త గ్రంధాలు:-

  1. కవిత్రయం రచించిన ఆంధ్ర మహాభారతం – వనపర్వం.
  2. ధూర్జటి రచించిన శ్రీకాళహస్తి మహాత్యం.
  3. ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం.
  4. పాల్కురికి సోమనాధ కవి రచించిన బసవ పురాణం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here