శ్రీకాళహస్తీశ్వర శతకంలో మాధురీమహిమ

0
10

[box type=’note’ fontsize=’16’] ఇది మహాకవి ధూర్జటి గారి శ్రీకాళహస్తీశ్వర శతకమునకు వ్యాఖ్యాప్రాయమైన వ్యాసావళిలోనిది ఈ వ్యాసం. శతకసారాన్ని సార్థకంగా నిరూపించే ముఖ్యమైన కొన్ని పద్యాలతో దీనిని అందిస్తున్నారు శ్రీ ఏల్చూరి మురళీధరరావు. [/box]

[dropcap]తె[/dropcap]లుగు సాహిత్యంలో శివాద్వైతులైన మహాకవుల శ్రేణిలో ధూర్జటి వంటి మహాకవి వేరొకరు లేరు. కవిత్రయం వారి స్వతఃప్రామాణికత, నాచన సోమనాథుని సర్వజ్ఞత, మల్లికార్జున పండితారాధ్యుల తత్త్వవివేకం, పాల్కురికి సోమనాథుని ధర్మప్రచారదీక్ష, శ్రీనాథుని శబ్దబ్రహ్మానుభవగరిమ, పోతన గారి వైచిత్రీప్రాణశక్తి ఒక్క రూపై అవతరించిన మోక్షవిద్యానిధి ఆయన. శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము, శ్రీకాళహస్తీశ్వర శతకము ఆయన మనకు అందించిన కల్పవృక్షాలు. భక్తిపారమ్యసిద్ధి, జీవన్ముక్తిసాధన  సర్వప్రాణిసామాన్యములైన కృత్యవిశేషాలని తన కావ్యముఖంగానూ, జీవులకు సర్వాతీతమైన వైరాగ్యలబ్ధి విజ్ఞానావేశం వల్ల గాక కేవలం భగవత్కరుణ వల్ల మాత్రమే కలుగుతుందని తన శతక రచనాముఖం గానూ లోకానికి ఉపదేశించిన ఆచార్యేంద్రుడాయన. తన శబ్దశక్తినంతటినీ విషయభోగవైముఖ్యబోధకు వినియోగించి సర్వోపరమరూపమైన చిత్తశాంతికి మార్గదర్శనం చేసిన మహాత్ముడాయన.

విజయనగర సామ్రాజ్యం విజయ మహోన్నత దశలో ఉన్న తరుణంలో ఆయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానప్రవేశం చేశాడు. అది 1509-1524 సంవత్సరాల నడిమికాలం. అక్కడి భోగజీవితం ఆయనను ఆకర్షించింది. ఆ సౌఖ్యావస్థలో తామరాకుపై నీటిబొట్టు లాగా ఉండటం సాధ్యం కాకపోయినట్లుంది. ఎంతటి మానసిక సంఘర్షణకు లోనయ్యాడో ఊహింపలేము. శ్రీకృష్ణదేవరాయల అవసాన వేళకు ఉత్తరవయస్సులో ఉన్నాడేమో, భవపరాఙ్ముడయ్యాడు. విజయనగరం నుంచి వెనుదిరిగి స్వస్థలమైన శ్రీకాళహస్తి క్షేత్రానికి చేరుకొన్నాడు కాబోలు. అప్పటికి శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్య మహాప్రబంధ రచన పరిపూర్ణం కావచ్చినట్లుంది. తన కళ్ళెదుటే దక్షిణదేశం మొత్తానికీ ఒక్కటంటే ఒక్కటిగా వెలుగులీనిన రాచగొడుగు రాయల అనంతరం నేలకూలి రాజ్యవైభవం పతనమైపోవటాన్ని చూశాడు. ఇంద్రియాకర్షణలు వికర్షణలుగా పరిణమించాయి. అటువంటి చిత్తావస్థలో మనస్సు వికలమై ఉల్లోలకల్లోలంగా ఉన్న రోజుల్లో శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని చెప్పాడు.

శ్రీకాళహస్తీశ్వర శతకం తెలుగులోని శతక సారస్వతంలో ఉత్తమోత్తమమైన జీవనిధి. సామాన్యకవుల వలె రచనారంభవిద్యార్థివేళలో గాక ఆయన దానిని సుఖదుఃఖాల అంతుచూసిన చరమకాలంలో చెప్పినందువల్ల అది విజ్ఞానావేశ ప్రబోధరూపంలో సర్వజన కంఠాలంకరణీయమైన మహాకృతిరత్నమై వెలుగులీనుతున్నది. తన రచనలోని ప్రతిపాద్యాంశమంతటినీ మొదటి పద్యంలోనే అతిరుచ్యంగా మనకు అందించాడు:

శ్రీవిద్యుత్కలితాజవంజవ మహాజీమూత పాపాంబు ధా
రావేగంబున మన్మనోఽబ్జసముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్
దేవా! నీ కరుణాశరత్సమయ మింతేఁ జాలుఁ జిద్భావనా
సేవం దామరతంపరై మనియెదన్ శ్రీకాళహస్తీశ్వరా!

అని. ఆయన మనోగతం ఏమిటంటే – శ్రీకాళహస్తీశ్వర స్వామీ! క్షణకాలం మెరిసి అంతలో అంతరించిపోయే ఐశ్వర్యము అనే మెరుపుతో కూడిన సంసారము అనే పెనుమబ్బు నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన పాపములనే జలధారల వల్ల నా మనఃపద్మవికాసాన్ని కోల్పోయాను. నీ కరుణ అనే శరత్ సమయం ఏ కొద్దిమాత్రమో అయినా చాలు. నీ చైత్యచోదనను మనస్సులో ధ్యానిస్తూ, నీ సేవలో ఆధ్యాత్మిక జీవన వికాసాన్ని పొందుతాను – అని.

బంధాలన్నింటికీ కారణం సంసారము. అది మాయావిలసనానికి మూలకారణం. దేహము, ఇంద్రియములు, ప్రాణము, అంతఃకరణము, బుద్ధి మొదలైనవాటి స్థితిలయాదులు ఆ మాయాప్రభావం వల్లనే కలుగుతున్నాయి. ఆకలి, దప్పిక, దుఃఖము, భయము మొదలైన సంసారధర్మాల మూలాన జీవులు మాయకు లోనవుతున్నారు. ఆ మాయ మనోమూలకమైనదే కాని వాస్తవం కాదు. దానినే సంసార మంటారు. “చిత్తే చలతి సంసారః” అని శ్రుతి. విద్యావిద్యలు, సంకల్పవికల్పాలు, జననమరణాలు, మానాభిమానాలు మొదలైన ద్వంద్వగుణాలన్నీ మనోధర్మాలే. బంధానికీ, మోక్షానికీ రెండింటికీ కారణం అదే. మనస్సును అదుపులోకి తెచ్చుకోగలుగుతే మాయ కూడా మాయమైపోతుంది. మాయాజయమంటే మనోజయమేనని అందుకే పెద్దలన్నారు. .

ఈ మనోజయం మనోనాశం మూలాన మాత్రమే సాధ్యమవుతుంది. మనోనాశనం సరూప మనోనాశమని, అరూప మనోనాశమని రెండు విధాలు. మనిషి సుషుప్తిలో ఉన్నప్పుడు తానంటే ఎవరో తెలియరాకుండా తెలివి లీనమవుతున్నది. అది స్వరూప మనోనాశం. తురీయావస్థలో తానెవరో తనకు తెలిసిన పిమ్మట లీనమవుతుంది. అది అరూప మనోనాశం.

మాయాస్వరూపాన్ని నిరూపించి, మనోజయాన్ని సాధించటానికి భగవన్నామ మంత్రజపం ఒక్కటే కర్తవ్యం. భగవన్నామ మంత్రప్రభావం వల్ల మనస్సు కుదుటపడుతుంది. క్రమక్రమంగా ఇంద్రియముల ప్రకోపం అణగారిపోతుంది. సచ్చిత్స్వరూపంతో ఈశ్వరుడు ఎల్లెడల ఉన్నాడని గుర్తుంచుకొంటే పాపసంకల్పాలన్నీ పటాపంచలవుతాయి.

స్వచ్ఛమైన దృష్టి కలవారికి కన్నులకు సూర్యుని ప్రకాశం కానవచ్చినట్లు పరిశుద్ధమైన అంతఃకరణలో జ్ఞానవంతులకు పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. శ్రీ పరమేశ్వరుని యందు అనన్యమైన భక్తి గలవారు సత్త్వరజస్తమోగుణాల మూలాన, సుకృత దుష్కృతాల మూలాన ఏర్పడిన మాలిన్యాలన్నింటినీ క్షాళన చేసుకొని, పాపరహితులై భగవంతుని మందిరాన్ని చేరుకొంటారు.

అందువల్లనే మహాకవి “శ్రీవిద్యుత్ కలిత ఆజవంజవ మహాజీమూత పాప అంబుధారా వేగంబున మత్ మనోబ్జ సముదీర్ణత్వంబు కోల్పోయితిన్” అన్నాడు. అందుకు పరిష్కారం ఏమిటి? భగవంతుని కరుణ ఒక్కటే. భగవంతుని కరుణ లేకుండా ఈశ్వర నామధ్యానం మాత్రం సాధ్యమవుతుందా? అందుకే, “నీ కరుణా శరత్ సమయము ఏ కొంతైనా చాలును స్వామీ! శ్రీకాళహస్తీశ్వరా! శ్రీకాళహస్తీశ్వరా! అంటూ నామమంత్రధ్యానంతో తరిస్తాను” అని మనకు కూడా కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు.

“జీమూతము” అంటే పర్వతము అని కూడా అర్థం ఉన్నది. సంసారమును చెట్టుతో, అడవితో, పర్వతముతో, సముద్రముతో సరిపోల్చటం ఉన్నదే. సంసార మహాజీమూతముపై నిరంతరం పాపవర్షధారలు కురుస్తున్నప్పుడు మనఃపద్మము ముకుళించుకొనిపోయింది. దానిని వికసింపజేయటం భక్తుని ప్రయత్నానికి అతీతమైంది. అది మానవసాధ్యం కాదన్నమాట. అందువల్లనే భక్తుడు భగవంతుని కరుణను అర్థించాడు.

ఇందులో ఇంకొక అంతరార్థ చమత్కారం కూడా ఉన్నది. పాపాంబువర్షధారలు కవి మనస్సును కలచివేశాయి. కవి శరత్సమయంకోసం ఎదురుచూస్తున్నాడు. శరదృతువు అంటే ఆశ్వయుజ కార్తీక మాసాలు. నదీస్నానం, దీపారాధనం, శివపురాణ పఠనం, శివనామధ్యానం, శివాలయ దర్శనం, సర్వజనులూ శివపూజలో తరించే సమయం. “నీ కరుణా శరత్ సమయము ఇంతేన్ (ఏ కొద్దిమాత్రమైనా) చాలు; చిత్ (శివార్చనా) భావనా (ధ్యాన్) సేవన్ తరిస్తాను – అన్నాడు.

ఎంతైనా మహాకవి కదా, ఆ మాట మాత్రం అపురూపమైన కవితాసౌగంధ్యం లేకుండా అంటాడా? వికాసాన్ని కోల్పోయి, ముకుళితమైన మనస్సనే తామరపువ్వు భగవత్కరుణానుభవం వల్ల నిండుగా విచ్చుకొని “తామరతంపర” అవుతుందట!

శ్రీకాళహస్తీశ్వరా – శ్రీ = సాలెపురుగునకు, కాళ = కాలసర్పమునకు, హస్తి = ఏనుగుకు, ఈశ్వరా = ఉపాస్య దైవతమవైన స్వామీ! (భక్తులకోసమై శ్రీకాళహస్తి క్షేత్రంలో నెలకొన్న ప్రభూ!), దేవా = ఓ పరమేశ్వరా!, శ్రీ = ఐశ్వర్యము అనే, విద్యుత్ = మెరుపుతో, కలిత = కూడిన, ఆజవంజవ = సంసార రూపమైన, మహాజీమూత = పెనుమబ్బు యొక్క, పాప+అంబుధారా = పాపములు అనే జలధారల, వేగంబున = త్వరితగతి మూలాన, మన్మనోబ్జ – మత్ = నా యొక్క, మనః = మనస్సనెడి, అబ్జ = పద్మము యొక్క, సముదీర్ణత్వంబున్ = వికాసమును, కోల్పోయితిన్ = పోగొట్టుకొన్నాను, నీ = నీ యొక్క, కరుణా శరత్ సమయము – కరుణ = కనికరము అనే, శరత్ సమయము = శరదృతువేళ, ఇంత+ఏన్ = ఏ కొద్ది మాత్రమైనా, చాలున్ = సరిపోతుంది, చిత్+భావనా = నీ యొక్క స్వరూప జ్ఞానాన్ని మనస్సులో అనుసంధించుకోవటం అనే, సేవన్ = శుశ్రూషతో, తామరతంపర+ఐ = నిత్యవికాసాన్ని పొంది, మనియెదన్ = ఈ జీవితాన్ని గడిపివేస్తాను – అని ప్రార్థన.

ఎటువంటి కర్మకైనా ఫలమనేది ఉంటుంది. సత్కర్మలను సంకల్పించినవారు వాటిని శ్రద్ధతో ఆచరించినప్పుడు ధర్మము అనే ఫలం ఉదయిస్తుందని పెద్దలంటారు. ఆ ఫలభోగాన్ని అనుభవించేందుకు జన్మ జన్మాంతరాలు కలుగుతుంటాయి. అందువల్ల ఆ పరమేశ్వరుని నిష్కామబుద్ధితో మనస్సులో నిలుపుకొని తనకోసమై దేనినీ కోరుకొనక ఫలాన్ని భగవదర్పితం చేయటాన్ని అభ్యసించాలి. అప్పుడు కర్మ వలన కలిగే ఫలం చిత్తశుద్ధికరమై చివరికి కర్మబంధాల నుంచి విడివడేందుకు దోహదం చేస్తుంది. అందువల్ల ఎవరు ఎటువంటి కర్మను ఆచరించినప్పటికీ ఆ కర్మదేవతను పరిచ్ఛిన్నమైన భావంతో కాక పరమేశ్వరుని విరాడ్రూపాన్ని మనస్సులో అనుసంధించికొని చేయవలసిన కర్మను చేయవలసినట్లుగా ఫలాపేక్ష లేకుండా చేయగలగాలి. తదేకధ్యానంతో తనకు విహితమైన కర్మను నెరవేర్చాలి. అప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది. శుద్ధచిత్తుని హృదయాకాశంలో పాపాంబుధారల వేగం ఉపశమించి, మ్మనస్సుకు వికాసం కలిగి, భక్తుని హృదయాకాశంలో భగవంతుడు ప్రకాశిస్తాడు. అందుకే మహాకవి “చిద్ భావనా సేవన్ తామరతంపరై మనియెదన్” అని వేడుకొన్నాడు. తనతోపాటు ఇంటిల్లిపాదినీ కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాడు.

శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్య మహాప్రబంధాన్ని పూర్తిచేసిన కొంతకాలానికి మనస్సు వికలమైన రోజులలో ఈ ధూర్జటి ఈ శతకాన్ని చెప్పాడు. ఆ ప్రబంధ రచనావేళ నాటి భావాలు, అందులోని పదబంధాలు, అప్పటి అభివ్యక్తులు ఆయన హృదయఫలకం పైని సుస్థిరంగా నిలిచి ఉన్నాయి. ఎన్నో మార్లు అందులోని మాటలను నెమరువేసుకొన్నాడు. మాహాత్మ్య గ్రంథంలో ద్వితీయాశ్వాసం చివర 160-వ పద్యంలో “ఖండిత ఆజవంజవ అంధకార సత్యసంవిద్ అభ్రమండితా” అన్నాడు. పరమేశ్వరుని దయ ఉంటే సంసారంలోని చీకట్లన్నీ పటాపంచలై దహరాకాశంలో నిర్మలమైన మేఘమండలం దేదీప్యమానంగా సాక్షాత్కరించినట్లు ఆయన సత్స్వరూపం, ఆయన చైతన్యశక్తి భక్తునికి అనుభవగోచరం కాగలుగుతాయి. ఇక్కడ దానినే మరొక తీరున, “శ్రీవిద్యుత్కలిత ఆజవంజవ మహాజీమూత పాపాంబుధారావేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు కోల్పోయితిన్” అని అన్నాడు.

దేనికైనా భగవంతుని కరుణ అవసరం. పాపకర్మలను ఆచరించిన ప్రాయశ్చిత్తార్థులకు చిత్ భావనా సేవ ఒక్కటే కర్తవ్యం అని మహాకవి ఉపదేశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here