శ్రీలంకలో నేనూ, బాడ్మింటన్

0
6

[ఇటీవల శ్రీలంకలో జరిగిన మాస్టర్స్ బాడ్మింటన్ పోటీలలో పాల్గొని, అక్కడి అనుభవాలను వెల్లడిస్తున్నారు డా. నర్మద రెడ్డి]

[dropcap]నే[/dropcap]ను 48 సంవత్సరాల నుండి బ్యాడ్మింటన్ ఆడుతున్నాను. అయితే ఈసారి నాకు ఒక మంచి ఛాన్స్ దొరికింది. అది ఏమిటంటే శ్రీలంకలో మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ జరగబోతుందని విని చాలా సంతోషించాను. మే నెలలో ఈ ఈవెంట్‌కి సంబంధించిన వివరాలన్నీ మాకు పంపారు.

మే నుండి శ్రీలంక కి వెళ్లాలని ఉవ్విళ్లూరుతూ దాని కోసం, నా పార్ట్‌నర్స్‌ని వెతుక్కున్నాను. ఈ పోటీలలో నాలుగు ఈవెంట్స్‌లో నేను పాల్గొనాలని అనుకున్నాను. ఒకటి ఉమెన్ డబుల్స్, రెండవది ఉమెన్ డబుల్స్ 100+ మూడవది మిక్స్ డబుల్స్, నాలుగవది మిక్స్ డబుల్స్ వన్ 120+. ఈ నాలుగు ఈవెంట్స్‌లో పాల్గొనాలని బయలుదేరాము. ఈ నాలుగింటికి కూడా దగ్గర దగ్గర ఒక వన్ మంత్ పట్టింది.

పార్ట్‌నర్స్‌ని వెతుక్కోవటం, అందులో మళ్ళా వస్తారా రారా అని లాస్ట్ మినిట్ వరకూ చూసుకోవటం – ఇవన్నీ దగ్గర దగ్గర రెండు నెలలు పట్టాయి. మేము వాటి గురించి ఆలోచిస్తూ అందరితో మాట్లాడుతూ చివరికి పార్ట్‌నర్స్‌ని ఫిక్స్ చేసుకొని శ్రీలంకకి బయలుదేరాము.

24 జులై 2024 హైదరాబాదు నుంచి నేను శ్యామల, ప్రసాద్, రాజేష్, సుందరయ్య గారు ఐదుగురము ఈ బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొనటానికి హైదరాబాదు నుంచి బయల్దేరాం, 24 పొద్దున పదింటికి మా ఫ్లైట్. పొద్దున్నే ఆరింటికి అందరము మా ఇంటి దగ్గర కలుసుకొని అందరం ఒకటే కారులో ఎయిర్‌పోర్ట్‌కి చేరాము.

మేము శ్రీలంకలో అడుగుపెట్టగానే మాకు ఘనస్వాగతం లభించింది. అందర్నీ తీసుకెళ్లడానికి వాళ్ళే బస్సులు పంపించారు. వాటిల్లో మేము మా హోటల్స్ వరకూ ప్రయాణించాం. ప్లేయర్స్ అందరూ ఆ బస్సులోనే వచ్చారు. ఒక్కొక్క హోటల్ దగ్గర ఎవరైతే దిగాలో వాళ్ళందరూ దిగారు. మేము గ్రాండ్ ఓరియంటల్ హోటల్ అని ఒక హోటల్లో దిగాము.

ఈ హోటల్లో చాలా పురాతనమైనది. ఈ హోటల్‌ని 16వ శతాబ్దంలో కట్టారు. ఇందులో క్వీన్ ఎలిజబెత్ కూడా బస చేశారు. ఆమె అక్కడ బస చేసిందని, దాని గురించి అంతా ఒక హిస్టరీలా రాసి ఫొటోస్ అక్కడ పెట్టారు. నేను, మంజిత్ అనే ఒక గుజరాత్ అమ్మాయి, శ్యామలగారు ముగ్గురము ఒక రూమ్‌లో ఉన్నాం.

***

24వ తారీఖు మేము వెళ్ళిన రోజే మధ్యాహ్నం మూడు గంటలకి ప్రాక్టీస్ కోసం ఎం.బి.ఏ అనే ఒక కోర్టుకి బయలుదేరాను. మా క్యాబ్ వాడు ఆ కోర్టు వెతుక్కోవడానికి కొద్దిగా అటూ ఇటూ తిప్పినా కూడా కరెక్ట్ ప్లేస్‌కి తీసుకెళ్లగలిగాడు. అక్కడ లోపలికి వెళ్ళగానే రిజిస్ట్రేషన్ ఫీజు కలెక్ట్ చేసుకుంటున్నారు. అందరం అమౌంట్ కట్టిన తర్వాత మాకు ఒక బ్యాగ్‌లో ఒక టీ షర్టు, ఐడెంటిడి కార్డు ఇచ్చారు. తర్వాత రెండు మూడు కూపన్స్ ఇచ్చారు. తినడానికి కొన్ని చిప్స్ లాంటి పాకెట్స్, శ్రీలంకన్ టీ ప్యాకెట్ మాకు ఫ్రీగా ఇచ్చారు. అవన్నీ తీసుకొని మేము 2 గంటలు అక్కడ ప్రాక్టీస్ చేసి రూమ్‌కి బయల్దేరాము.

 

రూమ్‌కి రాగానే రాత్రి భోజనం ఫోర్త్ ఫ్లోర్‍లో సిద్ధంగా ఉందని తెలిసి పైకి వెళ్లి అక్కడే భోజనం చేసి వచ్చి, 9 గంటల కల్లా పడుకున్నాము.

మర్నాడు ఉదయం అంటే 25 జూలై నాడు మాకు 8:30 కి ఒక గేమ్ ఉంది. ఆరోజు నాకు 10 మ్యాచులు అంటే ఒక్కొక్కటి 3 ఈవెంట్స్. ఈ లెక్కన నేను పది మ్యాచులు ఆడాను. సాయంత్రం అయ్యేసరికి చాలా అలసిపోయి హోటల్‌కి వెళ్ళిపోయి పడుకున్నాము.

 

నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మళ్లీ 10 మ్యాచెస్ ఆడాము. ఆరోజు నాకు మోకాలి నొప్పి వచ్చింది. అప్పుడు ప్రసాద్ గారు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు. తర్వాత శ్యామల గారు ఆయింట్‍మెంట్ ఏదో ఇచ్చారు. అవన్నీ రాసుకొని రాత్రీ పొద్దున్నా ఆ టాబ్లెట్ వేసుకొని మ్యాచ్‌కు వెళ్లాను. ఆరోజు చాలా ఈజీగా ఆడగలిగాము. సాయంత్రం నేను ద్రువిని అనే అమ్మాయి శ్రీలంకన్ అమ్మాయి తోటి 100+ లో  – దగ్గర దగ్గర నాలుగు బ్యాచుల తోటి ఆడాము. చైనీస్, శ్రీలంక, వాళ్లతోటి తరువాత; ఇండియా ఇండియన్స్ తోటి. ఈ మ్యాచెస్ అన్ని గెలిచి మేము ఫైనల్‌కి చేరుకున్నాము.

ఆరోజు సాయంత్రం మాకు 8:30 కి ఈ మ్యాచ్ అయింది. బయటికి రాగానే ఏదో ఒక లైవ్ మ్యూజిక్ తోటి అందరూ ప్లేయర్స్ అందరూ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. చక్కగా లేడీస్ అందరం కలిసి హాయిగా గెంతుతూ పాడుతూ గడిపాం. అందులో గెలిచానని సంతోషంలో ఇంకా కాసేపు గెంతి రూమ్‍కి బయల్దేరాము. మంజిత్ నేను ఆటోలో హోటల్‌కి వెళ్ళిపోయాము.

మర్నాడు మళ్ళీ సేమ్ ప్రాసెస్! మళ్ళీ మోకాలి నొప్పి వల్ల టాబ్లెట్ వేసుకుంటూ పొద్దున్నే పరిగెత్తటం. ఫైనల్ మ్యాచ్ అయితే అర్ధరాత్రి. నాకు 28వ తారీకు ఫ్లైట్ ఉంది.

నెక్స్ట్ డే సెమీ ఫైనల్స్ చేరాము. సెమీ ఫైనల్స్‌లో గెలిచాము. ఫైనల్స్‌కి చేరుకున్నాము.

ఇంకొక మ్యాచ్ 65+ లేడీస్ విభాగంలో కూడా సెమీ ఫైనల్స్ నుండి ఫైనల్స్‌కి చేరుకున్నాము.

***

“రేపే మన ప్రయాణం కదా, త్రీ ఫోర్ అవర్స్ అయినా ఎక్కడికైనా వెళ్దామండి” అన్నాడు రాజేష్. ఒక ప్లేస్ సజెస్ట్ చేశాడు. మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 5:00 వరకు మాకు వేరే మ్యాచెస్ లేవు. అందుకని బయల్దేరాం.

నిగాంబో లగూన్ అనే ప్లేస్‌కి ఒక క్యాబ్‌లో అందరం సరిగ్గా ఒంటిగంటకి బయలుదేరాము.

నిగాంబో లగూన్ చేరడానికి రెండు గంటలు పట్టింది. 3 గంటలకి అక్కడికి చేరాము. బ్యాక్ వాటర్స్ ఉన్న ప్రదేశానికి డైరెక్ట్‌గా తీసుకువెళ్ళేందుకు పది పడవలు ఉన్న ప్లేస్‌కి తీసుకెళ్లి ఇదే నిగాంబో లగూన్ అని చెప్పాడు డ్రైవర్. అక్కడ చూస్తే ఒక్క మనిషి లేడు. ఒక చిన్న ప్లేసు. మన పల్లెటూర్లలో పడవలు నడుపుకునేవాళ్ళు పెట్టుకునే ప్లేస్ లాగా అనిపించింది. నిగాంబో లగూన్ ఇంత చిన్నదా, అయ్యో ఏంటి ఎంతో ఖర్చు పెట్టుకుని ఇంత దూరం దేనికోసం వచ్చామా అని అందరి ముఖాలు డీలా పడిపోయాయి.

 

మాకు కాఫీ కూడా లేదు ఆ టైంలో. ఎందుకంటే ఈ ప్లేస్ చేరడానికి ఎంత టైం పడుతుందో తెలియక ఎక్కడ ఆగకుండా డైరెక్ట్‌గా ఇక్కడికి వచ్చాము. ఆ తర్వాత డ్రైవర్‍ని అడిగాం – నిగాంబో లగూన్‌లో మనకి కాఫీ దొరుకుతుందా అని. దొరుకుతుందన్నాడు. ఆ భరోసా తోటి వస్తే, ఇక్కడ మాట్లాడడానికి ఒక మనిషి లేడు. ‘సరే మళ్ళీ కారు వెనక్కి తీసుకొని సిటీ వైపు వెళ్దాము అక్కడ ఎవరైనా అడుగుదాము. ఇంకా ఏదైనా మంచి ప్లేస్ ఉందేమో’ అని అందరం అనుకుని మళ్ళా వెనక్కి బయలుదేరాము.

ఈ లోపల మా టాక్సీ డ్రైవర్ – శ్రీలంకన్ రూపాయలు 2600 కే వచ్చేది వాడు ఆ మీటర్‌ని తిప్పేసి 4900 రూపాయలని చెప్పాడు! అయ్యో అదొక బాధ! ఏమీ చూడకుండా డబ్బు ఖర్చు పెడుతున్నామని అదో బాధ! సరే అక్కడి నుంచి లోకల్ వాళ్ళని అడుగుతూ వెళ్తే వాళ్ళు – మీరు ఇంకొద్ది ముందుకు వెళ్తే మీకు అక్కడ నిగాంబో లగూన్ కనిపిస్తుంది – అని చెప్పారు.

అంటే మేం వచ్చింది నిగాంబో లగూన్ కాదన్నమాట. అలా వెతుక్కుంటూ వెళ్తే నిజంగానే చాలా చక్కటి ప్లేస్ కనబడడింది. అక్కడ పెద్ద పెద్ద షిప్స్ కూడా ఉన్నాయి. అలా రోజులు తరబడి మనం వెళ్లేటట్టుగా ఒక షిప్పు ఉంది.

ఆ షిప్పు గంటకి 2,5000/- రూపాయలట. అందులో రెండు బెడ్రూములు, హాలు ఉన్నాయి. తర్వాత బయట కూడా కూర్చోవడానికి తిరగడానికి ప్లేస్ ఉంది. ఆ బోర్డులో వివరాలు చూస్తూ కొన్ని ఫొటోస్ దిగాం.

అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక వారం, 10 రోజులు, 15 రోజులు ఉండేందుకు మంచి మంచి రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఆ రిసార్ట్స్‌లో ఉండి ఈ జర్నీని బాగా ఎంజాయ్ చేయొచ్చన్నమాట. కానీ మేము వెళ్ళింది నాలుగైదు గంటలకు మాత్రమే. ఊరికే అలా వెళ్లి చూడడం వరకే కానీ ఆ నీళ్లలోకి వెళ్లి చక్కగా తిరిగి రావడం అనేది జరగలేదు.

నిగాంబో లగూన్‍లో అబ్బాయిని టీ ఇవ్వమన్నాము. టీ ఇచ్చాడు. తర్వాత కూల్ డ్రింక్స్ ఇచ్చాడు. తాగేసి అక్కడ నుంచి వెనక్కి బయలుదేరాము. ఎందుకంటే నాకు మ్యాచ్ ఉంది. చాలా హడావిడిగా గబగబా కారెక్కేసి స్ట్రైట్ ఫార్వర్డ్‌గా సగం దూరం వచ్చాము. కోర్టుకి సుమారు 5 కిలోమీటర్లు ఉందనగా మా కారు పాడైపోయింది. ఆ కారు ఛార్జ్ పెట్టుకోలేదట, అది ఆగిపోయింది. మ్యాచ్ కి టైం అవుతోందని నేను గబగబా దిగేసి ఒక ఆటో తీసుకొని నా కోర్టుకి చేరుకున్నాను. ఆ రోజు నేను తార ఇద్దరం కలిసి మీరా మా అపొనెంట్ తో ఆడాం. రాత్రి మా హోటల్ లోనే భోజనం చేసి పడుకున్నాను.

***

నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నాకు అంటే రెండింటికి ఫ్లైట్ ఉన్నా కూడా అది ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి రాత్రి 10 గంటలకే బయలుదేరాలి.

“నా ఫ్లయిట్ ఎర్లీ మార్నింగ్. నా గేమ్ 9 గంటలకి పెట్టండి” అని మా రిఫరీని రిక్వెస్ట్ చేశాను. కానీ రాత్రి 11:30కి మాకు ఆన్‍లైన్‍లో –  నా మ్యాచ్ టైమ్ 12:00కి అని మెసేజ్ పెట్టారు. అంటే 12:00 గంటలకి ఆడొచ్చు అని. అది చూడగానే చాలా భయమేసింది. ‘అయ్యో నేను ఫైనల్స్ ఆడలేక పోతున్నాను’ అనుకుని, వెంటనే మళ్ళీ రిఫరీ గారికి, సంబంధిత అధికారులకీ ఫోన్లు చేస్తూ కూర్చున్నాను. వాళ్లు సరే అని చెప్పి నా గేమ్‍ని 9:00 కి మార్చేసారు.

కరెక్ట్‌గా 8:00 కల్లా మా సామానంత సర్దుకుని ఆ కోర్టుకి బయలుదేరాము. అలాగే శ్యామల గారికి కూడ ఒక గేమ్ ఉందండి. ఇద్దరం కలిసి సేమ్ ప్లేస్‌కి వెళ్ళాము. మొదట – ఎం.బీ.ఏ. కోర్ట్ అని చెప్పారు, సరేనని అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాం. సామానంత దించేసి లోపలికి వెళ్తే – ‘కాదు కాదు, ఈ కోర్టు కాదు అట్లాస్ అని ఇంకొక కోర్టుకి వెళ్లాలి’ అని చెప్పారు. మళ్లీ హడావుడి. పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళాను. ఒక వ్యాన్ ఇప్పుడే వెళ్తుంది, మీరు అట్లాస్‌కి వెళ్ళొచ్చు అని చెప్పారు అక్కడి అఫీషియల్స్. సో ఆ వ్యాన్లో వెళ్లాను. ఈ లోపల నా పార్ట్‌నర్‌కి కూడా ఫోన్ చేసి – “అమ్మాయి గేమ్ ఎం.బీ.ఏలో కాదు నువ్వు అట్లాస్‌కి వచ్చేసెయ్. అక్కడ ఆడదాం” అని చెప్పాను. తను కూడా కరెక్ట్ టైంకి అక్కడికి వచ్చింది. ఇద్దరం కలిసి ఆ రోజు ఫైనల్స్ ఆడాము.

ఈ ఫైనల్స్‌లో మా అపోనెంట్స్ గెలిచారు, మేము ఓడిపోయాము. అందువల్ల మాకు సిల్వర్ మెడల్ వచ్చింది. వాళ్లకి గోల్డ్ మెడల్ వచ్చింది. కానీ 14 దేశాల క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నమెంట్లో నేను సిల్వర్ మెడల్ గెలుచుకోవటం అనేది చాలా చాలా సంతోషం కలిగించింది. నా మనసులో అయితే ఆ సంతోషానికి అవధులు లేవు. ఎగిరి గంతేయాలనిపించింది. అలా ఎంత ఆనంద పడిపోయాను నాకే తెలుసు. ఎందుకంటే ఈ వయసులో నేను ఈ టోర్నమెంట్ అంటే బాడ్మింటన్ మాస్టర్స్ ఓల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మెడల్ గెలుచుకోవడం అనేది గొప్పే! నా జన్మ సార్థకమైంది. సంతోషంతో ఎగిరి గంతేసాను.

వెంటనే అట్లాస్ నుంచి మల్లా ఎం.బీ.ఏ కోర్టుకు వెళ్ళాము. ఏం.బి.ఏ. కోర్టులో మాకు ఆ సిల్వర్ మెడల్ ఇవ్వడానికి ఆఫీస్‍కి వెళ్ళమన్నారు. అక్కడ “ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తాము” అన్నారు. ఇద్దరికి కలిపి 30,000/- శ్రీలంకన్ రూపాయలని క్యాష్ ప్రైజ్‍గా ఇచ్చారు. ఇక్కడ డబ్బు కోసం కాదు కానీ, మెడల్ గెలుచుకున్న సంతోషం మాత్రం చాలా ఉంది. సరే సిల్వర్ మెడల్ గెలిచాము కదా అని చెప్పేసి – వేరే వాటి గురించి ఏమీ ఆలోచించకుండా ఫ్లైట్ టైం అయిపోతుందని శ్యామల గారిని గబగబా లాక్కెళ్లి కారులో కూర్చున్నాను.

నేను శ్రీలంకకి వెళ్ళటం ఇది మూడోసారి. అయితే ఈసారి శ్రీలంకకి వెళ్ళినప్పుడు నాకు ట్రైన్ ఎక్కాలని చాలా చాలా కోరికగా ఉంది. ఇంతకుముందు కూడా ట్రైన్ ఎక్కాను, అంతా తిరిగాను కానీ ఎక్కడా ఫోటోస్ దిగలేదు.

ఈసారి ఈ నాలుగు రోజులు సరిగ్గా తిండి తిప్పలు లేవు. నిద్ర లేదు. అలా ఆడుతూనే ఉన్నాం. కాబట్టి ఎక్కడా ఎక్కువగా తిరగడానికి కుదరలేదు. ఎయిర్‍పోర్ట్‌కు వెళ్లే దారిలో ఒక స్టేషన్ ఉందని మా డ్రైవర్ చెప్పాడు.

అది కూడా 1600 శతాబ్దంలో కట్టినదని, చాలా పురాతనమైనదని చెప్పి, “అమ్మా రండి” అని అక్కడికి తీసుకెళ్లాడు. సరేనని ఆ స్టేషన్‌కి ఒక ట్రైన్‍లో కూర్చుందామనుకున్నాను. కానీ ట్రైన్ మాస్టర్ లోపలికి ఎక్కనివ్వలేదు, ఫోటోస్ ఏమీ దిగనివ్వలేదు. ఎందుకంటే ఇది ఎయిర్‍పోర్ట్‌కి దగ్గరలో ఉంది. కాబట్టి సెక్యూరిటీ రీజన్స్‌తో ఫోటోలు తీసుకోవడానికి లేదని చెప్పారు.

ఆ ట్రైన్ స్టేషన్ లో ఒక ట్రైన్, బయట ట్రైన్స్ వెళ్ళే సమయాల చార్ట్ మాత్రమే ఉన్నాయి. అక్కడ రెండు ఫొటోస్ దిగేసి చకచకా వచ్చి కార్లో కూర్చోని ఎయిర్‍పోర్ట్‌కి వచ్చేసాము.

***

గతంలో వెళ్లిన రెండు సార్లు వెళ్లిన శ్రీలంక యాత్రల గురించి చెప్తాను.

ఒకసారేమో అక్కడ శక్తి పీఠం ఉందని జాఫ్నాలో అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళాము. ఐదు జంటలతోటి మేము శ్రీలంక వెళ్ళాము. అక్కడ అన్ని చక్కగా చూసుకొని మేము అప్పుడు ప్రతి గుడికి వెళ్ళాము ఆరు రోజులు ఉన్నాము. క్యాండీ, బెడ్డోట, తర్వాత జాఫ్నా, ఇవన్నీ కూడా చూసి తిరిగి వచ్చాము.

2,000 సంవత్సరంలో కూడా ఒకసారి వెళ్ళాము. అప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగిందక్కడ. అప్పుడు కూడా చక్కగా అన్నీ చూసుకొని తిరిగి వచ్చాము. ఈ విధంగా శ్రీలంకకి మూడుసార్లు వెళ్లడం అయింది.

కానీ ఒక జ్ఞాపక చిహ్నంగా ఎప్పటికీ మరువలేని మధురానుభూతి పొందింది మాత్రం ఈసారి మాత్రమే. అలాగా మా శ్రీలంక ప్రయాణం జరిగింది.

మధ్యలో సుదర్శన్ గారు కూడా నా ఫోటోని వాళ్ళ పేపర్లో వేసి నేను శ్రీలంక వెళ్తున్నట్టుగా వేశారు. నిజంగా ఆయన నాకు ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేను. ఎప్పుడూ వెన్నంటి ఉంటూ ఆయన నాకు చాలా చాలా సపోర్ట్ ఇస్తారు.

నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈ శ్రీలంక ప్రయాణం.

***

తీరెను కోరిక తీయ తీయగ హాయిగ మనమిక తేలిపోవగ కలసి ప్రయాణం కలదు వినోదం అనుకున్నాం!

ఎయిర్‍పోర్ట్‌కి వచ్చాక ఆలోచిస్తూ ఉంటే ‘అరే నాకు బ్రాంజ్ మెడల్ కూడా వచ్చింది కదా! నేను ఎందుకు అడగలేదు’ అని గుర్తొచ్చింది. ఇండియాలో దిగగానే వెంటనే అఫీషయల్స్‌కి కాల్ చేసి “మాకు బ్రాంజ్ మెడల్ కూడా వచ్చింది. మీరు ఇవ్వలేదు. నేను అడగలేదు. ప్లీజ్ దాని గురించి చూడండి” అని అడిగితే, వాళ్ళు సరేనని అన్ని వెతికి “అవును అమ్మా మీరు మర్చిపోయారు. మీ బ్రాంజ్ మెడల్ మేము పంపిస్తాము” అని చెప్పారు.

ఈ లోపల మా గ్రూప్ ఎక్కడైతే ఉందో ఆ గ్రూపులో మెసేజ్ పెట్టాము. ఎవరైనా శ్రీలంకలో ఉంటే మా బ్రాంజ్ మెడల్స్‌ని ఇండియాకి తీసుకురావల్సిందిగా కోరము. అందులో ఒక పూనా ప్లేయర్ ఉన్నారు. ఆయన వెంటనే స్పందించి “నేను మీ బ్రాంజ్ మెడల్స్ ని నేను తీసుకొస్తాను ఇండియాకి” అని చెప్పారు.

అప్పుడు మేము అఫీషియల్స్‌కి ఫోన్ చేసి ఆయన ఉన్న జానకి హోటల్‌కి మెడల్స్ పంపమని కోరము. వాళ్ళు వెంటనే అక్కడికి పంపించారు. ఆయన వాటిని ఇండియాకి తీసుకువచ్చారు. మాకు అందజేశారు. అలా అఫీషియల్స్, మా ప్లేయర్ల కోపరేషన్ తోటి బ్రాంజ్ మెడల్ కూడా మాకు చేరింది.

ఈసారి రెండు మెడల్స్ తీసుకోవటం అనేది మాత్రం చాలా చాలా సంతోషం వేసింది. బ్యాట్మెంటన్ ఆటలో 48 ఏళ్ల పాటు చేసిన కృషి ఫలితం నాకు కనిపించింది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. నిజంగా ఇన్నేళ్ళు విడవకుండా ఈ గేమ్‌ను ఆడుతూన్నందులే నాకిది దక్కిందేమో అని అనిపించింది.

ఈ ప్రయాణం మాత్రం నా జీవితంలో ఒక కలికితురాయి. ముఖ్యమైన మెమొరబుల్ ట్రిప్.

మెడల్స్ తీసుకొని నేను ఇంటికి రాగానే నాకు – మా బాబు, మా వారు ఇద్దరు దండల తోటి స్వాగతం పలికారు. మా మనవరాలు నాకు దండ వేసింది. నాలుగు రోజులు తిండీ తిప్పలు, నిద్రాహారాలు అన్ని మానేసి పడిన కష్టాలని ఆరోజు మర్చిపోయాను.

రెండో రోజు మా అల్లుడు నన్ను వాళ్ళింటికి ఆహ్వానించి – 20 మందిని పిలిచి గెట్ టుగెదర్‍లో నాకు సత్కారం చేశారు. ఆత్మీయభావంతో ఇంత చక్కగా నన్ను రిసీవ్ చేసుకొని వాళ్ళు అభినందించిన తీరు నేను నా జన్మలో మర్చిపోలేను. నా పూర్వజన్మ సుకృతమేమో అని అనుకుంటాను.

ఇవీ నా శ్రీలంక యాత్ర విశేషాలు.

కొసమెరుపు:

శ్రీలంకలో రోడ్ల మీద పాలిథిన్ కవర్స్ కనిపించలేదు. చాలా ఆశ్చర్యం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here