శ్రీమద్దేవీ భాగవతం – వ్యాసప్రోక్తం

1
14

[విజయదశమి సందర్భంగా శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్దేవీ భాగవతం – వ్యాసప్రోక్తం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

[dropcap]దే[/dropcap]వీనవరాత్రులలో మహాదేవి, చిచ్ఛక్తి, పరా భట్టారిక, ఆదిశక్తిని ఆరాధించడం సంపత్శుభకరం. సృష్టి స్థితి లయకారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తమ కర్తవ్యాన్ని నిర్దేశించినది అమ్మవారు. సకల సృష్టికి మూలభూతమై, నిఖిలజగాలను పరిపాలించే దయగల తల్లి ఆ జగన్మాత. ఆమెను పోతన్నగారు ఇలా స్తుతించారు –

ఉ.
అమ్మల గన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాల బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్

దుర్గామహదేవి నిజతత్త్వాన్ని ఇంత సులభసుందరంగా ఆవిష్కరించడం సహజ పాండిత్యం గల పోతనగారికే చెల్లింది. అంతా సుబోధకమే గాని ‘సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ’ అనడంలోనే ఆయన గడుసుతనమంతా ఉంది. సురారులు అంటే రాక్షసులు. వాళ్లమ్మకు కడుపుకోత మిగిల్చింది అని శర్థం. రాక్షససంహారం చేసింది. కాని వాళ్ల తల్లికిది పుత్రశోకమే కదా! చేసింది దుష్టసంహారమైనా, నాణేనికి అటువైపు కూడ చూపి, తల్లి హృదయాన్ని వర్ణించారు కవి. ఈ పద్యంలో వృత్యానుప్రాసాలంకారం అత్యంత సుందరంగా వాడబడింది. ‘ముగ్గురమ్మలు’ లక్ష్మి, పార్వతి, సరస్వతి. వారికి మూలం ఆదిశక్తి. ఆమె ‘మాయమ్మ’ కూడా! ఇక్కడ తల్లిని ‘విశ్వమాత’ గా, చూపారు.

శ్రీదేవీభాగవతం, ఈ సృష్టి అంతా స్త్రీనుండి సంభవిస్తూ ఉన్నదని ప్రామాణికంగా ఋజువు చేస్తుంది. పురుషుడు ప్రాణప్రదాత, స్త్రీశరీరదాత్రి. పంచభూతాలన్నీ ఈ కార్య కారణ సంధానానికి కారణం. ప్రధాన చైతన్య లక్షణం పురుషుడు. కాని ఈ సృష్టి అంతా స్త్రీ స్వరూపం. దేవీ భాగవతంలో పలుచోట్ల అమ్మవారిని పురుషుడా లేక స్త్రీయా అని దేవతలు, ఋషులు సందేహించడం ఉంది. పంచేంద్రియాలు మనకు మనోవికారాలన్నింటిని కలిగిస్తాయి. కాని ఇవి జీవి జీవికీ భిన్నంగా ఉంటాయి. కాని పంచభూతాలకు ఆ లక్షణం లేదు. అది సర్వదా ఒకే శక్తి. రూపాన్ని బట్టి, దిశ కాల పరిస్థితులను బట్టి వేరుగా ఉంటుంది. కాని, చైతన్యస్వరూపాన్ని బట్టి, కర్మను బట్టి, మారదు. అదే మహాశక్తి. ఆమెయే దుర్గా పరాంబిక. సనాతని. ఎప్పటిదో ఎవరూ చెప్పలేరు. సృష్టికి పూర్వం, సృష్ట్యాది నుంచీ ఆమె ఉంది.

శ్రీమద్దేదేవీభాగవతం ఒక శాక్తేయ పురాణం. మార్కండేయ పురాణము లోని దేవీ మహత్మ్యము కూడ అటు వంటిదే. దీని మూలం వ్యాసప్రోక్తమే. దీనిలో 18 వేల శ్లోకాలు, పన్నెండు స్కంధాలు, మూడు వందల పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి. మహపురాణానికి అయిదు లక్షణాలుండాలని లాక్షణికులు చెప్పారు. అవి.

1) సర్గము 2) ప్రతిసర్గము 3) వంశము 4) మన్వంతరము 5) వంశానుచరితము

శ్రీ దేవీ భాగవతం పారాయణ గ్రంథం. ‘నవాహ దీక్ష’ గా దీనిని దేవీనవరాత్రములలో పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాని ఇది ఉద్గ్రంథం. కాబట్టి కొంత కుదించుకుని చేస్తుంటారు.

ఈ సంస్కృత పురాణాన్ని తెలుగులో చక్కని పద్యకావ్యాలుగా వ్రాసినవారు

1) ములుగు పాపయారాధ్యుల వారు 2) దాసు శ్రీరాములుగారు 3) త్రిపురాన తమ్మన దొరగారు 4) తిరుపతి వెంకటకవులు 5) నోరినరసింహ శాస్త్రిగారు (పాక్షికంగా)

తెలుగు వచనంలోకి అనువదించినవారు శ్రీ సరిపెల్ల విశ్వనాథ శాస్త్రి, శ్రీ యామిజాల పద్మనాభ స్వామి గారు. అన్నిటికంటే ప్రాచుర్యం పొందిన వచన రచన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారిది. దానికి వారు కేంద్ర సాహిత్య అకాడమీ వారిచే అనువాద సాహిత్య పురస్కారం అందుకున్నారు.

స్కంధాలవారీగా దీవీ భాగవతములో వివరించ బడిన అంశాలు.

  1. ప్రథమ: దేవీమహిమ, హయగ్రీవ, మధు కైటభ, పురూరవ, ఊర్వశి, శుక జనన, వృత్తాంతాలు
  2. ద్వితీయ: మత్స్యగంధి, పరాశర, వ్యాస, శంతను, గాంగేయ, సత్యవతి. కర్ణ, పాండవ జనన, పరీక్షిత్, ప్రమద్వర, తక్షక ,సర్పయాగ జరత్కారు, వృత్తాంతాలు.
  3. తృతీయ: సత్యవతి, దేవీయజ్ఞం, ధృవసంధి, భారద్యాలు, నవరాత్రి పూజ, శ్రీరామ వృత్తాంతాలు
  4. చతుర్థ: నరనారాయణ, ఊర్వశి ప్రహ్లాద, భృగుశాపం, శ్రీకృష్ణ చరిత్ర.
  5. పంచమ: మహిషాసుర, తామ్రభూషణ, చక్షరత్రామ, అసిలోమ, రక్త బీజ, శంభనిశుంభ సంహారం
  6. షష్ఠి: సహుష, అడీబకయుద్ధ, నిమివిదేహ, హైహయ, నారద వృత్తాంతాలు
  7. సప్తమ: బ్రహ్మ సృష్టి, సూర్యవంశ చరిత్ర, సుకన్యాచ్యవనుల చరిత్ర, దేవత, సత్యవ్రత, మాంధాత, ఆశంకు, దక్షయజ్ఞ్నన్న వృత్తాంతాలు.
  8. అష్టమ: ఆదివరాహ, సప్తద్వీప, కాలపర్వత, శింశిమీర, మధ్యక పూజావిధి మొ॥
  9. నవమ: సరస్వతీపూజ, కలి లక్షణాలు, గంగోపాఖ్యానం, వేదవతి, తులసి చరిత్ర, మొ॥
  10. దశమ: వింధ్య పర్వత, మనువులు, భ్రామరి
  11. ఏకాదశ: రుద్రాక్ష మహత్మ్యం. జపమాలలు, శిరోవ్రతం, గాయత్రి.
  12. ద్వాదశ: గాయత్రీ కవచము, హృదయము, స్తోత్రము, గాయత్రీ దీక్ష, గౌతముని శాపం, మణి ద్వీపం.

ముఖ్యంగా గమనించవలసినది ఏమిటంటే ఈ వృత్తాంతాలన్నీ విడిగా ఎక్కడో ఒక చోట మనం చదివినవే. కాని వాటివెనక ఉన్న మహాదేవీ శక్తిని. ఆయా మహా పురుషులు నిర్వర్తించిన మహకార్యాలలో సాఫల్యం చేసిన ఆదిపరాశక్తి మహిమను దేవీ భాగవతం వివరిస్తుంది. ఉదా: రావణవధకు ముందు శ్రీ రామచంద్ర ప్రభువు, నారదుల వారి ఆధ్యర్యంలో దేవీ దీక్షను స్వీకరించడం

దేవీ భాగవత పారాయణం:

దీనికి రెండు పద్ధతులున్నాయి. 1) త్రయంగం 2) నవాంగం.

త్రయంగంలో: 1) దేవీ కవచం 2) ఆర్గల స్తోత్రం 3) దేవీ కీలకం (నవాక్షరి)

నవాంగంలో: తొమ్మిది ప్రార్థనలు, దేవీన్యాస, అమిహన, నామ, ఆర్గల, కలక, హృదయ, ధాల, ధ్యాన, కవచాదులు.

పఠనం ముగించిన తర్వాత, దేవీసూక్తంలోని, 8వ అధ్యాయంలోని 7 నుండి 36 శ్లోకాలు జపించాలి.

ప్రతి అధ్యాయాన్ని ఒకసారి చదవాలి .

ఆగస్త్యబుషి తన భార్య లోపాముద్రతో కలిసి కైలాసానికి వెళ్లి కుమార స్వామిని అభ్యర్ధించి, దీవీ మహత్మ్యాన్ని తెలుసుకున్నాడు.

పారాయణం జరిగే ప్రతి రోజూ ఆరంభంలోను, ముగింపు లోను జగదంబికను ఇలా స్తుతించాలి.

“కాత్యాయని మహామాయే భవాని భువనేశ్వరి
సంసారసాగరే మగ్నం మాముద్ధర కృపామయే
బ్రహ్మవిష్ణుశివారాధ్యే ప్రసాదం జగదంబికే
మనోభిలషితం దేవి వరం దేహి నమోస్తుతే”

శ్రీలలితా ధ్యానమ్

శ్రీవిద్యాం పరిపూర్ణ మేరుశిఖరే బిందుత్రికోణే స్థితాం
వాగీశాది సమస్తభూత జననీం మంచే శివాకారకే
కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం
కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీబ్రహ్మ విద్యాం భజే.

‘రహస్యం’ అన్న సినిమా మాన్యులు మల్లాది రామకృష్ణశాస్త్రివర్యులు వ్రాసిన ‘గిరిజాకల్యాణం’ అన్న కూచిపూడి సాంప్రదాయ యక్షగానం ఉంది. అది రాగమాలిక. దీనికి సంగీతాన్ని ఘంటసాల వారు కూర్చగా, వారు, సుశీలమ్మ గారు అత్యద్భుతంగా ఆలపించారు. మల్లాదివారి సాహిత్యం, ఘంటసాలవారి సంగీతం నభూతో నభవిష్యతి. ఈ యక్షగానంలో అమ్మవారి అయ్యవారి తత్త్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.

శివుని వద్దకు బయలు దేరిన భవానిని చెలికత్తెలు ‘ఎక్కడికి వెళుతున్నావ’ని అడుగగా “మానస సరసిని మణి పద్మదళముల రాణించు అల రాజహంస సన్నిధికే” అంటుంది లోకమాత. తల్లిని “లోకాన్నత మహాన్నతునితనయా, మేనా కుమారి రాజసులోచన రాజాననా” అని సంబోధిస్తారు మల్లాదివారు. ‘ఈశుని మ్రోలహిమగిరిబాల కన్నెతనము ధన్యమైన గాథ’గా ఈ వృత్తాంతాన్ని అభివర్ణిస్తారు.

మహిషాసుర మర్దినిగా అవతరించి అతి దుస్సహంగా వెలిగిపోతున్న, అనంత తేజోరాశి, పద్మరాగమణి ప్రభను వ్యాసుడు ఇలా వర్ణిస్తాడు.

శ్వేతాననా కృష్ణనేత్ర సంరక్తాధరపల్లవా
తామ్రపాణి తలా కాంతా దివ్యభూషణ భూషితా
అష్టాదశా భుజాదేవీ సహస్ర భుజమండితా
సంభూతా సురనాశాయ తేజోరాశి సముద్భవా
(8-45, 46)

జగన్మాత, తారకాసుర సంహారం కోసం, హిమవంతుని పుత్రిక హైమవతిగా జన్మిస్తుంది. ఆదిదంపతులకు స్కందుడు జన్మించి, తారకుని చంపాలి. హిమవంతుడు ఆమెను తనకు జ్ఞానబోధ చేయమని అభ్యర్థిస్తాడు. దానినే ‘దేవీగీత’ అంటారు. దానిలో పరాశక్తి అనంతమైన ఆధ్యాత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తుంది

ప్రాజ్ఞస్తు కారణాత్మా స్యాత్సూక్ష్మధీ తు తైజసః
స్థూలదేహీతు విశ్వాఖ్యః త్రివిధః పరికీర్తితః (32-48)

ఈశ సూత్ర విరాట్పద వాచ్యుడైన జీవుడు వ్యష్టిరూపుడు. ఈశ్వరుడు సమిష్టి రూపుడు. ఆయన జీవానుగృహ కాంక్షతో, సర్వభోగాశ్రయంగా ఈ విశ్వాన్ని సృష్టిస్తాడు. అతనికి ఆ శక్తినిచ్చేది అమ్మవారే.

మన్మాయా శక్తి సంక్లుప్తం జగత్సర్వం చరాచరం
సాపి మత్తః పృథగ మాయా నాస్త్యేవ పరమార్థత

హిమగిరీంద్రా! ఈ చరాచర జగత్తు అంతా నా మాయాశక్తి అధీనంలో ఉంటుంది. వాస్తవానికి నేనే మాయను. నాకంటే మాయ వేరుగా లేదు. వ్యవహారంలో మాయను విద్య అని చెబుతారు. సర్వ జగత్తునూ నేనే సృష్టిస్తాను. మాయా కర్మాది సహితనై అందులోకి ప్రాణపురస్సరంగా ప్రవేశిస్తాను.

సావిత్రి, యమ సంవాదం (నవమస్కంధం) లో సావిత్రి యముని ఎన్నో ప్రశ్నలు వేస్తుంది. కర్మను ఎలా క్షయింప చేసుకోవాంటి సమవర్తి ఆమెకు బోధిస్తాడు

నా భుక్తం క్షయతేకర్మ కల్పకోటిశతై రపి
అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం
దైవతీర్ధ సహాయేన కాయవ్యూహేన శుద్ధ్యతి

శతకోటి కల్పాలు గడిచినా అనుభవించనిదే కర్మ నశించదు. చేసిన శుభాశుభ కర్మలు ఫల రూపంలో ఆవశ్యభోక్తములు. కాని దైవపూజ, తీర్థ క్షేత్ర సందర్శన, కాయ వ్యూహం, యోగమార్గం ద్వారా కర్మ శుద్ధి సాధ్యం.

శ్రీదేవీ భాగవత మహాపురాణం సముద్రమంత విస్తారమైనది. దానిని మథించే కొద్దీ ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది.

సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ
పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం
క్రీడనం యా పరాఖ్యా
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ
వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా
విధి హరి గిరిశారాధితాలంకరోతు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here