శ్రీమద్రామాయణము – సుందర కాండ – విశిష్టత – ఒక పరిశీలన

1
9

[శ్రీ చిరువోలు విజయ నరసింహారావు రచించిన ‘శ్రీమద్రామాయణము – సుందర కాండ – విశిష్టత – ఒక పరిశీలన’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఆ[/dropcap]ది కవి శ్రీ వాల్మీకి మహర్షి కృత రామాయణాంతర్గత సుందర కాండ పారాయణము సకల శుభప్రదము. ఇష్ట కామ్యార్థ సిద్ధి దాయకము. దీనిని సమగ్రముగా చదివిన వారికి వివిధ మహత్తర విశేషము లవగాహనకు వచ్చును. హనుమ ఉదధి లంఘనము, లంకా ప్రవేశము, సీత్యాన్వేషణము, మాతకు అభయ ప్రదానము, లంకాధిపతి రావణుని దర్శించుట, వన భంగము, వాలాగ్ని చేత లంకాదహనము, రావణ నియుక్త రాక్షస వీర సంహారము, సీత క్షేమము నరసి రామ దత్తాంగుళీయకము నొసగి, సీత ఇచ్చిన చూడామణిని గ్రహించి, తిరిగి సాగరమును లంఘించి వానరులకు సీతా మాత దర్శన క్షేమములను వివరించుట, మధు వనమున మధు పానము, తిరిగి కిష్కింధ కేతెంచి రామలక్ష్మణ సుగ్రీవులకు సీతా మాత దర్శన వృత్తాంతము నంతయు సవిస్తరముగా వివరించి, చెప్పుట –ఇది ప్రధాన గాథ. ఇక వెంటనే లంకపై దండెత్తి రావణుని శిక్షించి సీతను శ్రీరామ సన్నిధికి జేర్చిఅయోధ్యకు పోవుటయే తదుపరి తక్షణ కర్తవ్యమని హనుమ విన్నవించెను. ఆయా విషయ వివరములను మహర్షి అతి సుందరముగా చిత్రించుటచే ఈ సుందరకాండ అతి సుందరమై యొప్పినది. ఇందలి ప్రథమ సర్గ శ్లోకములు 202. అతి పెద్దది–58వ సర్గ శ్లోకములు 165, చిన్నది– 60 వ సర్గ శ్లోకములు 6, ఇది అతి చిన్నది.

రావణుడు సీత నపహరించి, లంక కేగెనని సంపాతి నిశ్చయముగా తెలుపగా, వానరు లెల్లరు హర్షించి, ఆంజనేయుని స్తుతించి సాగరమును లంఘించి, లంక కేగుమని ప్రోత్సహించిరి. శ్రీరామ భక్తి మహాత్మ్యమున, తన సంకల్ప బలమున హనుమ సాగర లంఘనా సాహస మొనరించి, క్షేమముగా సత్వర వేగమున లంకా నగరమును చేర గలిగెను. మార్గ మధ్యమున మైనాకుని ఆతిధ్యమును గౌరవించి, గమ్యమును చేరువరకు తానెచట నెట్టి విలంబమును సహించనని ప్రతిన బట్టితినని తెలిపి, ముందునకు సాగెను. నాగమాత సురసను మెప్పించి, ఆమె ఆశీస్సులను బడసెను. ఆమెను జయించ గలుగుట ఆంజనేయుని మేధాసంపత్తి చేతనే సాధ్య పడినది. సింహిక యను రక్కసిని చంపి, తాను పారమును జేరెను. లంకా నగర ప్రవేశము నడ్డిన లంకిణి యను రక్కసిని నిర్జించి, తన మార్గమును సుగమము చేసికొనెను. సమయానుకూలముగా తన చాకచక్యమును, ధీరతను ప్రదర్శించి, కార్య సాఫల్యమును పొంద గలిగెను. హనుమ కార్య దక్షతను దేవ, గంధర్వ, యక్ష, కిన్నరాదులును, ముని గణంబులును శ్లాఘించిరి.

హనుమ లంకను జేరు సరికి సూర్యాస్తమయ సమయ మయ్యెను. తానా రాత్రి వేళ లఘు రూప ధారియై, రక్కసులకు చిక్కక, తెలివిగా వారిని మోసగించి, తన సీతాన్వేషణమును కొనసాగించ నెంచెను. చంద్రోదయమును హనుమకు సాయపడెను. లంక వైరి నగర మగుట ముఖ ద్వారమున గాక, వెనుక నుండి తన వామ పాదమును బెట్టి, లోనికి ప్రవేశించెను. లంకా నగర దివ్య వైభవమును గాంచి ముగ్ధుడయ్యెను. అచటి రాక్షస సైన్యముల నగర రక్షణా దక్షత కచ్చెరు వందెను. ఇట్టి లంకను, రావణుని గెలుచుట రామచంద్రున కంత సులభము కాదని కొంత శంకించెను. అచట హనుమ కాంచిన నగర సౌందర్యమును వాల్మీకి సవివరముగా వర్ణించి, వివరించెను. రాచ నగరు కుండవలసిన మణి, మాణిక్య, వజ్ర, వైడూర్య కాంచనాదులును, రథ, గజ, తురగ వాహనములును పట్టస, శూల, ముద్గర ఖడ్గాది వివిధ శస్త్రములను కాంచి, హనుమ నివ్వెరబోయెను. రమ్య తుంగ హర్మ్యములను, ఉపవనములను, క్రీడోద్యాన వనములను తరువులను, ఫల పుష్ప సంతతులను పరిశీలించెను. నగర మంతయు దీపములతో దేదీప్యమానమై యుండెను. రెండు మూడంతస్తుల భవనములను హనుమ కాంచెను. విశ్వకర్మ నిర్మితమైన పుష్పక విమానము నచట హనుమ చూచెను. అందు బహువిధ చిత్రములు, ఆసనములు, మణి మయాలంకారములతో నా విమానము శోభించెను. పలు విధములైన స్త్రీలచట క్రీడించుచు, మిగుల యానందించు చుండిరి. రాక్షస వనితలు వివిధాలంకృతులతో నచట యథేచ్ఛగా విహరించు చుండిరి. నగర నిర్మాణములు, రాచ వీధులు కడు శోభాయమానముగా భాసిల్లుచుండెను. అన్ని రకముల నలంకార దృశ్యములను తిలకించు చుండియు, సీతాన్వేషణ మొక్కటియే హనుమ ధ్యేయము.

శ్లోకము లందలి వివిధ వర్ణనల యందనేక ఉపమాలంకారములు విరివిగా ప్రయోగింపబడినవి. భాషా పదములు, ప్రాస యుతముగా, కర్ణ పేయముగా నానంద దాయకములై యున్నవి. మహర్షి సకల ద్రష్ఠ యగుటచే ప్రతి విషయమును, సన్నివేశమును బహు సుందరముగా పఠితలకు కనులకు కట్టినట్లు చిత్రించి చూపించెను. ద్విరుక్త పద విన్యాసములు, అనేక అంత్య ప్రాసలు ఆయా శ్లోకముల కత్యంత సహజ శోభను సంతరించినవి. హనుమ మనోగత విషయములను, అతని కార్యాచరణ విధానమును, యుక్త భాషణమును మహర్షి అత్యంత సుందరముగాను, న్యాయ సమ్మతముగాను రచించెను.

ధీరుడైన రావణుడు కామాతురుడై, సీత ననునయించ నరుదెంచి, చాల సౌమ్యము గాను, మర్యాద పూర్వకముగాను తనను వరించుమని యామె నర్థించుట సమంజసముగా చిత్రీకరింప బడినది. సీత రావణుని కామమును తృణప్రాయముగా తిరస్కరించి, తన పాతివ్రత్యమును ప్రకటించుటయు సహజమై యొప్పినది. రావణుని పనుపున రాక్షస వనితలు సీతను భయపెట్టి, వేధింప సాగిరి. ఆయా రక్కసి గణముల పేర్లను రూపానుగుణముగా వివరించుటయు నొక విశిష్ట ప్రక్రియయే. అశోక వనమున, శింశుపా తరువుపై దాగి, హనుమ అచట జరుగుచున్న వృత్తానంతము నంతయు గమనించుట, తనకు సీత జాడ తెలియక పోవుటచే తిరిగి వానరుల కడకేగి, ఏమి చెప్పవలయునో యని తన మదిలో దుఃఖియించుటయు చక్కగా చిత్రించ బడినది. తన రాకను, రామలక్ష్మణుల క్షేమమును సీతకు త్వరగా తెలుపవలెనను ఆరాట మధికమైనది. ఆలస్యము చేసినచో, సీతాదేవి తాను మరణించెదనన్న నిర్ణయ మాతని కలచి వేసెను. రావణ అంతఃపుర వర్ణన, అచటి మద్య, ఖాద్య వస్తువులు, రావణుని రాణి వాసపు స్త్రీలు, వారి తన్మయము, వారి నిద్రా సమయ వస్త్ర భూషణాదుల వర్ణనయు హృద్యమే. వివిధ రకముల మాంసము లచ్చట పాత్రల యందు మిగిలి యుండుటయు హనుమకు కాననయ్యెను. అశోక వన వర్ణమును హృద్యమై, యొప్పినది. తరు, లతా, పుష్ప వితానములు, కొలనులు, పలు రకముల పక్షులు – ఇతర ప్రకృతి శోభనంతయు కవి వర్ణించెను. త్రిజటా స్వప్న వృత్తాంన్తమున లంకకు చేటు రానున్నదనియు, రావణాదుల వధయు, విభీషణ పట్టాభిషేకమును, శ్రీరామ విజయమును సీతా మాత చెరను విడిపించి, రామ సన్నిధికి చేర్చుటయు నచటి రక్కసి వనితల కామె తెలిపెను. అందుచే వారు సీతను బాధించక, శరణు వేడుమని త్రిజట బోధించెను.

హనుమ దూతగా తన విధులను గమనించి, సీతకు తగిన ధైర్యము నొసగుటకు తన సంభాషణ నామెతో ప్రారంభించెను. ఆమె తనను విశ్వసించు రీతిగా తన వివరణను తెలివిగా మలచు కొనెను. శ్రీరామ వర్ణనము, వన వాసము, సీతాపహరణము, విరహ వేదన, సుగ్రీవునితో మైత్రి, రాముడతనికి సాయ మొనర్చి, వాలిని వధించుట, సుగ్రీవ పట్టాభిషేకము, తాను సుగ్రీవుని సచివుడనని తెలుపుట-సుందరముగా వివరించబడినది. సీతను తన భుజములపై మోసి, సాగరమును లంఘించి, వెంటనే రామసన్నిధికి శీఘ్రముగా చేర్చ గలననియు, శోకము నిక త్యజించు మనియు హనుమ మాతతో సంభాషించెను. ఆమె రామ లక్ష్మణుల స్వరూప, స్వభావముల వివరములను తెలుపు మనగా – నతడు శ్రీరాముని శరీర, మనో భావ, ధీర, వీర , ధార్మిక వేద పాండిత్య, కారుణ్యాది లక్షణముల నన్నిటిని ఆమెకు సవిస్తరముగా వర్ణించి చెప్పెను. రాముడు పంపిన అంగుళీయకము నామెకు గుర్తుగా నొసగెను. ఆమెకు పరమానందమును, విశ్వాసమును కలిగించెను.

అంతట, సీత తన దుస్థితిని, విరహమును, రామచింతా పరాయణత్వమును, రాక్షస తర్జనమును, రావణు డిచ్చిన కాలావధి ఇంకా రెండు మాసములే యున్నదనియు, అంతలో రామ లక్ష్మణులు వచ్చి, తనను రక్షించనిచో తనకిక మరణమే శరణ్యమనియు రామునకు తెలుపుమని హనుమ కామె వివరించెను. గుర్తుగా తన చూడామణిని అతని కిచ్చి, రామునకు చేర్చుమని ఆమె పలికెను. కాకాసుర కథను కూడా గుర్తు చేయు మనెను. కొంత ధైర్యమును, నమ్మకమును ఆమె పొందగలిగెను. తన దీనావస్థను రామునకు తెలుపుమని యామె హనుమను కోరెను. వారిరువురి సంభాషణల యందలి ఔచిత్యమును కవి ప్రదర్శించెను. అంత, హనుమ సీత చెంత శలవు గైకొని, వన భంగమును చేసెను. రక్కసులు రావణుని కీవిషయమును చెప్పగా, అతడు హనుమను బంధించమని చెప్పెను. రాక్షస వీరులు హనుమతో యుద్ధమును చేసి మరణించిరి. తాను నిరాయుధుడయ్యును. రాక్షసులను నిర్జించుట అతని పోరాట పటిమను వెల్లడించును. అతడొక భవన తోరణముపై కూర్చుండి, విశ్రాంతి నందెను. తానా రాక్షసుల బల శౌర్యములను పరీక్షించెను.

చివరగా ఇంద్రజిత్తు రణమున కరుదెంచి, హనుమను గెలువలేనని గ్రహించి, బహ్మాస్త్రమున హనుమను బంధించి, రావణుని సన్నిధికి కొనిపోయెను. అచట రాక్షస సార్వభౌముని రాచ ఠీవిని, బలదర్పములను గాంచి, హనుమ వెఱగందెను. కొంత మెచ్చుకొనెను. హనుమను చంపుమని రావణుడు తెలుపగా, విభీషణుడు ధర్మము నెరిగిన మంత్రిగా దూతను చంపుట శాస్త్ర సమ్మతము, రాజనీతి కాదని వారించి అతనికి అంగవైకల్యమును చేయుడని బోధించెను. రావణుడంత హనుమ తోకను కాల్చుమని ఆజ్ఞ నిచ్చెను. వారా వాలమునకు తైల వస్త్రములను చుట్టి, అగ్ని నంటించిరి. హనుమ హస్వ రూపధారియై బంధముల నూడ్చుకొని, స్వతంత్రుడయ్యెను. రాక్షసు లతనిని నగర వీధులందు ఊరేగించిరి. ఈ వార్తను విన్న సీతా మాత అగ్నిని ప్రార్థించి, హనుమను దహించ వలదని యర్థించెను. హనుమకే అపాయమును వాటిల్లలేదు. అంత హనుమ తాను నగరము నంతయు వీక్షించుచు, హర్మ్యముల నన్నిటిని కాల్చివేసెను. ఆ అగ్ని లంక నంతను దగ్ధము చేసెను. ఇక, తన వాలమును సముద్రమున ముంచి, చల్లార్చి, సురక్షితుడయ్యెను.

అంతలో నతని మదిలో సీత గుర్తుకు వచ్చెను. లంక అంతయు దహింపబడగా, అమ్మ కూడా అగ్ని కాహుతి యయ్యెననియు, తన కామె క్షేమము గుర్తు లేక, తొందరలో లంకను కాల్చితి ననియు, తన తప్పువలన అమ్మకు హాని జరిగినదనియు తన శ్రమ యంతయు వృథాయయ్యె ననియు, ఇది విన్న రామలక్ష్మణ సుగ్రీవాదులు జీవించి యుండరనియు దుఃఖించెను. తనకిక జీవించు హక్కు లేదని విచారించెను. ఇక తనకు మరణమే శరణమని తలచెను. అంతలో చారులు లంకంతయు కాలిపోయినను సీత క్షేమముగా నుండుట చాలా అద్భుతమని పలికిరి. అది విన్న హనుమ రామ కృపకు ఆనందించెను.

రావణుని సభలో తాను శ్రీరాముని దూత ననియు, రాముడు మహాపురుషుడనియు శ్లాఘించెను. శ్రీరాముని కారుణ్యమును, సద్గుణములను ధర్మనిరతిని, వీర, ధీర, శూర తేజములను ప్రజా రక్షణా దక్షతను వివరించి చెప్పెను. తానా రామునకు దూతగా లంకకు వచ్చితి ననియు చెప్పెను. సీతాపహరణము క్షమించరాని నేరమనియు, ఆమెను తిరిగి రాముని దగ్గరకు మర్యాదగా పంపుమనియు, లంకను తన పౌరులను కాపాడుకొను మనియు హనుమ రావణునకు హితవు పలికెను. అయినను రావణుడు తూష్ణీ భావమున హనుమ బోధను గ్రహించ లేక పోయెను.

తిరిగి వార్ధిని లంఘించి, హనుమ అంగదాది వానరులను చేరెను. వెంటనే తాను సీతామాతను లంకా పట్టణమున అశోక వనము నందు శోక సంతప్తయై యుండుటను కాంచితినని చెప్పగా, వానరు లెల్లరును ఆనంద పరవశులై, హనుమను శ్లాఘించిరి. సీతా వృత్తాంతమును, హనుమ రణ కౌశలమును విని, వారందరు సంతసించిరి. వానర లక్షణముగా వారందరు తమ తోకలను పైకెత్తి, యెగిరి, గంతులు వేసిరి. అంతట వారు సుగ్రీవుని సన్నిధికి పోవుటకు బయలుదేరిరి. మార్గ మధ్యమున నున్న మధువనము నందు మధు భక్షణమును చేసిరి. అచట వారు పాలకులతో తలపడిరి. వారి యానందమున కవధులు లేవు. వారు తమ కోతి చేష్టలను ప్రదర్శించిరి. వనపాలుడైన దధిముఖుని అధిక్షేపించి, గేలి చేసిరి. అతడు వారిని నిరోధించలేక పోయెను. వెంటనే అతడు సుగ్రీవుని దరి కేగి వానరుల రాకను, వారి చేష్టలను వివరించెను. సుగ్రీవుడు వారి రాకని విని, సంతోషించెను. హనుమ సీతను చూచి యుండెనని సుగ్రీవుడు నమ్మి రామలక్ష్మణులకు వివరించెను. వనపాలకుని వెళ్లి వెంటనే వానరులను తన దరికి పంపుమని ఆదేశించెను. వానరు లందరు మధువనమును వీడి, సుగ్రీవుని దరికి వెళ్లిరి. అందరును మిగుల సంతసించిరి. సుగ్రీవుడా హనుమ సాహసమునకు , కార్య విజయమునకు మిగుల సంతసించెను. అంత సుగ్రీవుడా వనపాలకుని త్వరగా తిరిగి పోయి, వానరు లందరిని తన దరికి శీఘ్రముగా పంపుమని ఆదేశించెను. అతడు మధువనమునకు జేరి, వానరుల నందరినీ సుగ్రీవుని సన్నిధికి బంపెను. తమపై సుగ్రీవుడు కోపించ లేదని తెలిసి, వానరులు మిగుల ఆనంద మందిరి.

రామసన్నిధికి జేరి, హనుమ నమస్కరించి, తాను సీతను దర్శించితి నన్నవార్తను తెలిపెను. తన సముద్ర లంఘనము నుండి తిరిగి వానరులను జేరు వరకు జరిగిన ప్రతి విషయమును రామ, లక్ష్మణ, సుగ్రీవులకు హనుమ వివరించెను. వెంటనే లంకపై దండెత్తి, రావణుని జయించి, సీతను గొని తెచ్చి, రామ సన్నిధికి చేర్చవలసిన కార్యక్రమము యొక్క ప్రాధాన్యమును సూచించెను. ఈ కాండలో హనుమ పాండిత్యమును, ధర్మ నిరతిని, వాక్చాతుర్యమును, యుక్తా యుక్త వివేచనమును, సమయ స్ఫూర్తిని, సంభాషణా కౌశలమును, కార్య దీక్షా దక్షతను దౌత్య కార్య నిర్వహణా నైపుణ్యమును – మహర్షి చక్కగా వర్ణించి, తెలుపుట మహత్తరము. పలు మార్లు రామ వృత్తాన్తము, హనుమ దౌత్యము, రాక్షసుల వర్ణనము, నగర సౌధ వివరములు ప్రస్తావించ బడినవి. కొన్ని శ్లోకములను యథాతథముగా మరల మరల చెప్పినట్లుగా మన కర్థమగును. ఆయా ఉదాహరణలను క్రింద సవివరముగా వివరించు చున్నాను. అందుచే పఠితల కిది సంపూర్తిగా నందింపబడినది.

సీతామాత గాథ సుందరము. ఆమె సుందరము. వర్ణన లతి సుందరము. హనుమ కార్య దీక్షయు, సిద్ధియు కడు సుందరము. అతని వాక్చాతుర్యము, యుక్త విషయ వివరణ మతి సుందరము. శ్లోకములు సుందరములు. వాల్మీకి కవితా చాతురి అతి సుందరము ప్రకృతి రామణీయకతయు సుందరము. హనుమ సమయానుకూల నీతి సంభాషణ లతి సుందరము. శ్రీరాముడు సుందరుడు. అతని ధర్మనిరతి, శౌర్యములు సుందరము. ఈ రీతిగా నీ కాండ యందలి వృత్తాంత మంతయు సుందరాతి సుందరమై శోభిల్లుటచే – దీనికి సుందర కాండ యను నామము సముచితము. ఈ రీతిగా సుందర కాండ యందు హనుమ ప్రతాపమును, దక్షతను, దౌత్య నిర్వహణమును, రణ కౌశలమును, నిరాయుధుడయ్యును నిర్భీతిగా రక్కసుల నెదుర్కొని, నిర్జించుటయును – ఇత్యాదుల సమగ్ర వర్ణనముచే నిది అతిగా శోభిల్లినది. రామాయణమునకు సుందర కాండ జీవము (హృదయము) వంటిది. కవిత మనోహరమై, ఆనంద దాయక మైనది. ఈ కథ అందరికిని సుపరిచిత మైనదే కదా!

అనుబంధము:

గాయత్రీ మంత్రము –ఇతర బీజాక్షరములు

సుందరకాండ యందు మహర్షి శ్లోకముల యందు పలు బీజాక్షరములను నిక్షిప్తము చేసెను. దీనిని పారాయణ చేయు వారికి నిత్య జీవితము నందు కలుగు బహు విధ క్లేశములు తొలగి, సకల వాంఛితార్థము లీడేరి, శీఘ్ర కార్య సిద్ధి ఫల ప్రాప్తి లభించ గలదు. కొన్ని గాయత్రీ మంత్రాక్షరముల నిందు నిలుపుటచే , నాయా శ్లోక పఠన , పారాయణలు సత్ఫల దాయకము లగు చున్నవి.

ఉదాహరణలు –

  1. “తతో రావణ నీతాయాం” అను ప్రథమ శ్లోకమును విన్నచో – తలచిన కార్యము నెరవేరును.
  2. మొదటి సర్గ లోని హనుమ బల పరాక్రమములను విన్నచో మూర్ఛ, కుష్ఠు రోగములు తొలగి పోవును. భూత, ప్రేత, పిశాచాది బాధలు నివారణ మగును.
  3. “సనిర్జిత్య పురీం శ్రేష్టామ్” (4–1) అను శ్లోకము లోని మొదటి అక్షరమును విన్నచో బంధ విముక్తుడై, పరబ్రహ్మ ఐక్యమును పొందును. (స–గాయత్రి లోని రెండవ అక్షరము. )
  4. సీతను మారుతి చూచిన ఘట్టము (14 వ సర్గ) త్రిజట స్వప్న వృత్తాంత మును విన్నచో (27 వ సర్గ) దుస్స్వప్నములు తొలగును.
  5. శ్రీ రామ ముద్రికను హనుమంతుడు సీత కిచ్చిన ఘట్టము (36 వ సర్గ)ను విన్నచో యుద్ధమున శత్రువులను గెలిచి, స్థిరమైన రాజ్య సంపదను పొందును.
  6. “ధన్య దేవాస్సగన్ధర్వా” అను శ్లోకము లోని మొదటి అక్షరమును (గాయత్రిలో 14వ అక్షరము) విన్నచో సంసార బంధములనుండి విడి వడును.
  7. ఇంద్రజిత్తు హనుమను బంధించిన ఘట్టమును (48 వ సర్గ) విన్నచో బంధ విముక్తు డగును. లంకా దహనమును (54 వ సర్గ) విన్నచో త్రివిధ తాపము లడగును.
  8. “మంగళాభిముఖీ” లోని మొదటిది (గాయత్రిలో 15వ అక్షరమును) విన్నచో శివ స్వరూపమును పొంద గలరు.
  9. ఈ సుందర కాండను విన్నవాడు ఆంజనేయానుగ్రహమును బడసి, బ్రహ్మలోకమును పొంద గలడు.
  10. ప్రతి గ్రహ దోషశాంతికి నిర్దేశిత శ్లోక పారాయణచే సత్ఫలము లబ్బును.
  11. జీవితమున కలుగు పలువిధ క్లేశముల నివారణకు సంచిత శ్లోక, జప, నైవేద్య, పారాయణలు నివృత్తి నొసగి, వాంఛితార్థ సిద్ధి కలుగును.
  12. సప్త సర్గ పారాయణ క్రమము శ్రేష్ఠమైనది.
  13. గాయత్రీ మంత్రాక్షరములతో శ్లోకములను వాల్మీకి రచించగా, నిది గాయత్రి రామాయణమై యొప్పెను. పఠితలకు సకల వాంఛా ఫల ప్రాప్తి కలుగును.
  14. “సుందరే సున్దరో రామః, సుందరే సుందరే సున్దరః కపి:, సుందరే సుందరీ సీతా, సుందరే కిమ్ న సుందరం”
  15. బుద్ధిర్బలం, యశో ధైర్యం, నిర్భయత్వ మరోగతా, అజాడ్యం, వాక్పటుత్వంచ – హనుమత్ స్మరణాత్ లభేత్.
  16. మానవుల కెట్టి వాంఛలు కలవో, అవి యన్నియు ఆయా ప్రత్యేక శ్లోక రాయణ వలన తప్పక తీరునని పండితుల అభిప్రాయము.
  17. హనుమ సంకల్పము సఫల మందుటకు అతి తక్కువ సమయము –రెండు దినముల లోపుననే పూర్తి యగుట చాలా మహత్తరమును, శ్లాఘనీయమును అగును.
  18. శ్రీరాముని అంగుళీయకమును గ్రహించి, సీతను చూచు వరకును, సీత చూడామణిని గ్రహించి, రామునకు నిచ్చువరకును హనుమ వానిని జాగ్రత్తగా నుంచి, వాని తోనే పలు యుద్ధములను చేయుట హనుమ దివ్య శక్తికి తార్కాణము.

అంత్య ప్రాసలు:

5, 7 వ సర్గలన్నియు మొత్తము అంత్య ప్రాసలే.

ద్విరుక్త పద ప్రయోగములు:

పీడ్యమానేన పీడ్యమానాని (1-17) వానరాన్ వానర శ్రేష్ఠ (1-39) సాగరాం సాగరనుపజాన్ (1-194) లక్ష్యా లక్ష్యేణ లంకాపురీ (2-35) ఏకమేకాశ్చ (2–38) అర్థానర్థాన్తరే (2-40) సలంబ శిఖరే లంబ తోయద సన్నిభే (3-1) భవనాత్ భవనం గచ్ఛన్ (4–8) దివ్యం దివ్యనాద వినాదితం (4–24) మత్త ప్రమత్తాని (5–10) మనః కాంతాం –కాంతా మివ స్త్రియమ్ (9–22) పంచ –పంచభి రుత్తమై:(9–30) సంసర్గాన్ మన్దమ్ –మన్దమ్ సుయోషితః (9–56) తస్మై పృథక్ పృథక్ (11-21) విరూప రూపా విరూప దర్శనా (12–4) కుల నాశశ్చ నాశస్చైవ వనౌకసామ్ (13-37) అశోకై:శోక నాశనై:(15-7) మపశ్యన్తీమ్ పశ్యన్తీమ్ (15-23 ) గుణాభిరామం రామం (16–1) నిర్మలో నిర్మల స్వయం (17–1) లలంత్యాశ్చ లలతాం బాంధవాస్తవ (20–25) చారుస్మితే చారుదతీ చారు నేత్రే విలాసినీ (20–29) మయి లల లలనే యథా సుఖం త్వం (20–35) సాధు ధర్మ మవేక్షస్వ సాధు సాధు వ్రతం చర (21–6) యథా యథా సాన్త్వయితా వశ్య:స్త్రీణా తథాతథా, యథా యథా ప్రియ వక్తా పరి భూతస్తథా తథా (22-2) యాని యాని బ్రవీషిమామ్ తేషు తేషు వధో యుక్తస్తవ మైథిలి దారుణః తాభిరాశ్వాసితా సీతా (22–6)పరుషమ్ పరుషానార్య (24–1) పునః పునశ్చోదయ తీవ హష్ట : (27–50) సీతా వేన్యుద్గ్రధనం గృహీత్వా, ఉద్బధ్య వేన్న్యుద్గ్రధనేన శీఘ్రం (28–78) తతః కుర్యుస్సమాహ్వానం రాక్షస్యో రక్షసామహి, రాక్షసేన్ద్ర నియుక్తానాం రాక్షసేన్ద్ర నివేశనే (30–26) రామేతి రామేతి సదైవ బుధ్యా (32–11) యథా యథా సమీపమ్ తథా తథా రావణం (34–9) వానరాన్ వానరేన్ద్రాభామ్ (39–48) తా విహ్వలా శోక లతా ప్రతానా, కపేర్చలార్థి ప్రవధావనస్య (41–20) తై స్దయి ప్రహరణైర్భీమై రభిపేతు స్తతస్తతః సురా సురాణామపి సంభ్రమ ప్రదః (47–12) ఇవాంశు మాలిక: (47–15, 17) రథీ రథి శ్రేష్ఠ తమః కిరన్ శరై: (47–22) సురాసురాణామపి (48–2) సురాసురేంద్రా వివ బద్ధ వైరౌ (48–27) నతే శక్యం నతే స్థ్యకార్యం, నతోస్తి కశ్చిత్ నావేద యస్తేన్ద్ర బలం (48–5) న వీర సేనా నవజ్ర మారాయ, న మారుతస్యాస్య నచాగ్ని కల్ప: (48–12) కృతార్చిమాలీ –ఇవాంశు మాలీ ( 54–45) బోధ్యమాన మివ ప్రీత్యా దివాకర కర శ్శుభై:(56–11) దృశ్యాదృశ్య ధనుర్వీరస్తదా–నదన్నదేన ( 57–10) తే నగాగ్రాన్నగాగ్రాణి శిఖరాచ్చిఖ రాణిచ (57–25) ప్రియాఖ్యానోన్ముఖాస్సర్వే సర్వే (61–6)వానరాన్ వారయామాస (62–10) వానరా వానరేన్ద్రస్య (61–10) వానరాన్ వారయామాస (62-29) మర్షితం మర్షణీయం చేష్టితం (63-–26) కృత్వాకాశం నిరాకాశం (64–22) సన్నస్య త్వయి రామ రామ మనోహరం (65–10) కథం సామ సుశ్రోణీ భీరు భీరు (66-12) మథురా మథురాలాపా కిమాహ (66-15) పునః పునరుపాగమ్య (67–5) దుఃఖాది దుఃఖ పరాభూతాం (68–6) నహి ప్రకృష్టా ప్రేష్యన్తే ప్రేష్యన్తే (68–22) వానరాన్ వారణేంద్రాభాన్ (68—26) .

నీతి శ్లోకములు:

అనిర్వేదం శ్రియో మూల మనిర్వేదం పరం సుఖం, తస్మాదనిర్వేదం యత్నం చేష్టేహముత్తమం (12–10, 11) విషముద్భంధనం వాపి ప్రవేశం జ్వలనస్యవా ఉపవాస మేధో శస్త్రం ప్రచరిష్యంతి వానరాః (13–36) వినాశో బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి, తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః (13–47 ) నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైచ తస్మై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేన్ద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభః (13–59) నతేభ్యస్త నమస్కృత్యసుగ్రీవాయచ మారుతి: దిశా స్సర్వాస్సమాలోక్యహ్యశోకవనికామ్ప్రతి (13–60) బ్రహ్మస్సయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు తే , సిద్ధి మగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వ్రజ భుత్, వరుణ పాశ హస్తస్య సోమాదిత్యవ్ తధై వచ , అశ్వినౌచ మహాత్మానౌ మరుతఃశ్శర్వ యేవహి, సిద్ధి సర్వాణి భూతాని భూతానాంచైవ ప్రభు:దాస్యంతి మమ యేచాన్యే హ్యదృష్ఠా పథి గోచరాః (3—65, 66, 67) ధన్యా: ఖలు మహాత్మానో మునయ స్త్యక్త కిల్బిషా:, జితాత్మానో మహాభాగా ఏషామ్ సంత: ప్రియాప్రియే (26—49) ప్రియాన్న సంభవే ద్దుఃఖమప్రియాదధికం భయం, తాభ్యాం హి యుజ్యన్తే నమస్తేషామ్ మహాత్మనాం (26–50) తస్యాశ్శుభం వామ మరాళ పక్షి రాజీవృత కృష్ణ విశాల శుక్లమ్ –ప్రాస్పన్ద తైకమ్ నయనం సుకేశ్యా మీనాహతమ్ పద్మ మివాభి తామ్రం, చిరేణ వామస్య మవేపతాశు: (29–2, 3) అసత్యానిచ యుద్దా విసంశయో మేన రోచతే , కశ్చ నిస్సంశయం కార్యం కుర్యాత్ ప్రాజ్ఞస్ససంశయం (30–35) భూతశ్చార్థా వినశ్యంతి దేశ కాల విరోధితాః , విక్లబం దూత మాసాద్య తమ స్సూర్యోదయే యథా(30–37) అర్థానర్థాన్తరే బుద్ధిర్నిశ్చితాపి న శోభతే, ఘాత యంతి హి కార్యాణి దూతా: పండిత మానినః (30–38) నమోస్తు వాచస్పతయే సవజ్రినే, వనౌకసా తచ్చ యథాస్తు నాన్యథా (32–14) ఐశ్వర్యేవా సువిస్తీర్ణే వ్యసనేవా సుదారుణే, రజ్జేవ పురుషం బద్ధ్వా కృతాంత: పరికర్షతి (37–3) కార్యే కర్మణి నిర్దిష్టేయో బహూన్యపి సాధయేత్, పూర్వ కార్యా విరోధేన న కార్యం కర్తు మర్హసి (41—5) సహ్యేక స్సాధకో హేతు: స్వల్ప స్యాపీహ కర్మణః , యోహ్యర్థం బహుధా వేదస స్సమర్ధోర్ధ సాధనే (41–6)

లంకానగర వర్ణనము:

రక్షితం రాక్షసై ర్ఘోరై స్సింహైరివ మహద్వనమ్, లంకాభరణ మిత్యేవ సోమన్యత మహా కపి:(6–3నుండి 14)

రావణ భవనము–విమానము == సవేశ్మ జాలం బలవాన్ దదర్శ, నుండి—హిమాత్యయే నగామివ చారు కందరం (7–1 నుండి 17వరకు) ఉత్తమం రాక్షసావాసం హనుమానవలోకయన్ , విమానం పుష్పకం దివ్య మారురోహ మహా కపి: (9–4 నుండి 19 వరకు)

రాజ హర్మ్యములు —అవప్లుత్య మహావేగః ప్రహస్తస్య నివేశనం , క్రమమాణశ్చ క్రమేనైవ హనుమాన్ మారుతాత్మజ:(6—17 నుండి 26 వరకు) .

సైనికుల వివరములు— ఆసనాసాధ లక్ష్మీవాన్ రాక్షసేన్ద్ర నివేశనం హనుమాన్ ప్రవివేశ మహా గృహం (6 –28నుండి 44 వరకు).

రామదూత ననుట–దూతోహమితి విజ్ఞేయో రాఘవస్యామిత తేజసః , శ్రోయతాంచాపి వచనం మమ పథ్యమిదం ప్రభో (50–19) .

రాక్షస వర్ణనము– దీక్షితాన్, జటిలాన్, ముణ్డాన్, గోజినామ్బర వాససమ్, నుండి–ధ్వజినీ పతాకినశ్చైవ దదర్శ వివిధాయుధాన్ (14–4 నుండి 18 వరకు. )

రాక్షస స్త్రీలు – ఏకాక్షీ మేకాకర్ణాంచ కర్ణ ప్రావరణాం తథా , అకర్ణాం శంకు కర్ణాంశ్చ మస్తకో చ్వాస నాసికాం (17–5) తా దదర్శ కపి శ్రేష్ఠో రోమ హర్షణ దర్శనా, స్కంద వంత ముపాసీనా: పరివార్య వనస్పతిమ్ (17–17)

రావణ వర్ణనము —సీతను చూడ వచ్చుట– ససర్వాభరణైర్యుక్తో బిభ్రత్ శ్రియ మనుత్తమమ్, తం నగై ర్బహుభి ర్జుష్టామ్ సర్వ పుష్ప ఫలోపగై:(18–6) దీపికాభిరనేకాభిః సమంతా దవభాసితం, గంధ తైలావ సిక్తాభిర్భ్రియ మనాభిః రగ్రతః(18-22) తం దదర్శ మహా తేజా స్తేజోవంతం మహాకపి:(18–27) ఏకాక్షీ మేక కర్ణాంశ్చ కర్ణ ప్రావరణం తథా , అనాసికాం సింహముఖీమ్ గోముఖీం సూకర ముఖీమ్ (22—33నుండి 36 వరకు)

హనుమ ఉవాచ–పృష్ఠ మారోహమే దేవీ, మా వికాంక్షస్వ శోభన్, యోగ మన్విచ్ఛ రామం శశాంకేనేవ రోహిణీ (37–24)

సీతామాత– భర్తృర్భక్తి పురస్కృత్య రామాదన్యస్య వానరసి , న స్పృష్యామి శరీరం తు పుంసో వానర పుంగవః (37–60) త్రయానేవ భూతానాం సాగరస్యాస్య లంఘనే, శక్తిస్యాద్వైనతేయస్య, తవవా, మారుతస్యవా(39–25)

సీతామాత వర్ణన:

నత్వేవ సీతాం పరమాభిజాతాం , ప్లవంగమో మంద యివా చిరస్య(5-23నుండి-27 వరకు)

హనుమ రాముని గూర్చి సీతకు వర్ణించుట –తస్య పుత్ర: ప్రియో పృధు శ్రీ:పార్థివర్షభ , రామో నామ విశేషజ్ఞ: శ్రేష్ఠస్సర్వ ధనుష్మతాం (31–6) . నుండి, యధా రూపం యధా వర్ణాం యథా లక్ష్మీఞ్చనిశ్చితామ్, అశ్రషౌధం రాఘవస్యాహం సేయ మాసాదితమయాం (31–16)

సీత హనుమను చూచుట—సా వీక్షమాణా పృథు భుగ్న వక్త్రం , వాతాత్మజం బుద్ధిమతాం వరిష్టమ్ (32–7)

శ్రీరామ వర్ణన—దద్యాన్న ప్రతి గృహ్ణీ యాన్న బ్రూయాత్ కిఞ్చిదప్రియం , అపజీవిత హేతోర్వా రామస్సత్య పరాక్రమః (33–25)

హనుమ రామ చరితమును చెప్పుట —అహం రామాస్య సందేశా ద్దేవి దూతస్తవాగతః, వైదేహి కుశలీ రామసత్వరం కౌశల మబ్రవీత్ (34–-2) ఆదిత్యయివ తేజస్వీ లోకకాంత శ్శశీ యథా నుండి –రోషప్రముక్తై రిషుభిః ర్బలద్భిరివ పావకై :, తేనాహం ప్రేషితో దూత స్త్వత్సకాశ మిహాగతః (34—28 –32)

రామ లక్ష్మణ శరీర లక్షణములు—- రామ: కమల పత్రాక్ష స్సర్వ సత్వ మనోహరః, నుండి అనురాగేణ రూపేణ గుణ శ్చైవ తథా విధః (35–8 నుండి 22 వరకు) త మాం రామకృతోద్యోగంనిమిత్త మిహా గతం , అభిభాష స్వమాం దేవి దూతో దాశరథే రహం (35—72)

రామ మహిమ —-రాజా దశరాధోనామ రధ కుంజర వాజిమాన్, నుండి –రామేణ నిహతస్సంఖ్యే శరే నైకేన వానరః (51–4నుండి 11వరకు)

హనుమ రావణునకు నీతి బోధ— మహంతు హనుమన్నామ మారుతస్సౌరసస్సుతః నుండి

ఇన్ద్రో మహేంద్ర స్సుర నాయకో, త్రాతమ్ నశక్తా యుధి రామ వధ్యం (51—13 నుండి 44 వరకు)

దూత విధులను విభీషణుడు రావణునకు తెలుపుట—-క్షమస్వ రోషం త్యజ రాక్షసేన్ద్ర , ప్రసీద మాద్వాక్య మిదం శృణుస్వ, యుక్తాయుక్తం వినిశ్చిత్య దూత దండో విధీయతాం (52—5 నుండి 9 వరకు)

సీత అగ్నిని ప్రార్థించుట–యద్యస్తి పతి శుశ్రూషా యద్యస్తి చరితం తవ-యది చాస్తేక పత్నీ త్వం శీతో భవ హనూమతః:(53–29 నుండి 32 వరకు

హనుమ తలపు–సీతాయాశ్చ నృశంసేన తేజసా రాఘవస్య చ పితృశ్చ మమ సఖ్యేన నమాం దహతి పావక: (53–39)

హనుమ లంకను కాల్చ తలచుట–దుర్గారావుఇనాశితే కర్మ భవేత్ సుఖ పరిశ్రమమ్ అల్పయత్నేన కార్యేస్మిన్ మమస్యాత్సఫలమ్ శ్రమ: (54–4 నుండి 8 వరకు) అగ్నిం తత్ర సంన్నిక్షిప్త శ్వసనేన సమో బలీ (54–45)

దేవతలవెరగు–తత్ర దేవాస్సగన్ధర్వాస్సిద్దౌశ్చ పరమర్షయ:, దృష్ట్వా లంకా ప్రదగ్ధామ్ తాం విస్మయం పరమం గతాః (54–49)దేవాశ్చాస్సర్వాణి ముని పుంగవాశ్చ జగ్ము:పరామ్ పుర్రెతిమతుల్య రూపామ్ (54–51)

హనుమ ఆలోచన– మయా ఖలు తదేవేదం రోష దోషాత్ ప్రదర్శితమ్ ప్రధితం త్రిషు లోకేషు కపిత్వ మనన స్థితమ్ (55–16) తపసా సత్య వాక్యేన అనన్యత్వాచ్చ భర్తరి, అపిసా నిర్దహేదగ్నిమ్ నత్వా మగ్ని ప్రదక్షతి (55–29)

రాక్షస స్త్రీల నిద్రావస్థ–తతస్తాం ప్రస్థితశ్శా లాం దదర్శ మహాతీమ్ శుభామ్, నచా పి కాంతస్య న కామనీయా(9–4నుండి 71 వరకు)

మండోదరీ రావణ శయన మందిర వర్ణనము– తత్ర దివ్యోపమం ముఖ్యం స్పాటికం రత్న భూషితమ్ నుండి ప్రకాశీకృత సర్వాంగం మేఘం విద్యుద్గణైరివ (10–1 నుండి 29 వరకు)

స్త్రీల అవస్థ–మద వ్యాయామ ఖిన్నాస్తా రాక్షసేన్ద్ర యోషితః: కపిర్మండోదరీమ్ తత్ర శయానామ్ చారు రూపిణీమ్ (10–35 నుండి 52 వరకు) క్రీడితే నాపరా:కాంతా గీతేన తథా పరాఃసరాక్షసేంద్ర శ్శుశుభే తాభి: పరివృతస్వయం (11– 4 నుండి 9 వరకు)

భోజన శాల–మృగాణాం మహిషాణాంచ వరాహాణాంచ భాగశ:నుండి–క్వచిత్సంపృక్త మాల్యాని , జలాని , ఫలానిచ (11 –11నుండి 27 వరకు)

అశోక వన వర్ణనము–సతు సంహృష్ట సర్వాంగ:ప్రాకారస్తో మహా కపి:పుష్పితాగ్రాన్ వసంతాదౌ దదర్శ వివిధాన్ ద్రుమాన్ –నుండి—సా రామ మహిషీ రాఘవస్య ప్రియా సతీ , వాన సంచార కుశలా నూన మేష్యతి జానకీ (14—2నుండి 45 వరకు)

సీతాదేవి వర్ణనము–తతో మలిన సంవీతాం రాక్షసీభిస్సమాహృతాం ఉపవాస కృశామ్ దీనాం నిశ్వసంతీమ్ పునః పునః —నుండి—ఇయం కనక వర్ణాంగీ రామస్య మహిషీ ప్రియా , ప్రణష్టా సతీ యాస్య మనసో న ప్రణశ్యతి (15–18 నుండి 47 వరకు)

యది రామస్సముద్రాంతాం మేదినీం పరివర్తయేత్ , అస్యాకృతే జగచ్చాపి యుక్తమిత్యేవ మే మతి: —నుండి—హిమవత నళినీవ నష్టశోభా:జనక సుతా కృపణాం దశామ్ ప్రపన్నా (16–13 నుండి 30 వరకు) నిష్ప్రభామ్ శోక సంతప్తాం మల సంకుల మూర్ధజామ్ , క్షీణ పుణ్యాం చ్యుతా భూమౌ నిపతితా మివ —నుండి—తాం క్షమాం సువిభక్తాంగీమ్ వినాభరణ శోభినీం , ప్రహర్ష మతులం లేభే మారుతి:ప్రేక్ష్య మైథిలీం (17–19నుండి 30 వరకు)

హనుమ సీతతో భాషించుట–అవశ్యమేవ వక్తవ్యం మానుషం వాక్య మర్థవత్, మయాసాంత్వయితుం శక్యా నాన్యథేయ మనిన్దితా (30–19)

హనుమ సాగర లంఘనము — నీల లోహిత మాంజిష్ట పత్ర వర్ణౌ స్సితా స్సితై:, స్వభావ విహితైశ్చిత్రై ర్ధాతుభిస్సమలంకృతమ్ –నుండి—స సాగర దానవ పన్నగా యుతం , దదర్శ లంకా మమరావతీ మివ (1–5 నుండి 202 వరకు ) ఇందు పూర్తిగా ననేక ఉపమాలంకారములు ప్రయోగింప బడినవి.

హనుమవాలాగ్నితో హర్మ్యములను కాల్చుట—తతో పుప్లువే వేశ్మ మహా పార్శ్యస్య వీర్యవాన్ నుండి—-శ్వసనేన సంయోగాదాతి వేగో మహాబలః , కాలాగ్ని రివ జజ్వాల ప్రావర్దత హుతాశనః (54—9 నుండి 21 వరకు)

హనుమ శక్తికి లంక వాసులు వెరగదుట—లంకాం సమస్థాన్ పరివార్య తిష్ఠన్, తతస్తు లంకా సహసా ప్రదగ్ధా , దుర్యోద దీనా తుములం సశబ్దం (54—-34నుండి 40 వరకు)

హనుమ తిరిగి బయలుదేరుట—సాగర, గిరి వర్ణనము— తుంగ పద్మక జుష్టాభిర్నీలాభిర్వన రాజిభిః , సొత్తరీయ మివామ్భోదై శృంగాంతర విలంబిభిః, సలిలంఘయిషు ర్భీమం సలీలం లవణార్ణవమ్, కల్లోలాస్ఫాల వేలాంచిత ముత్సపాత నభో హరి:(56–10 నుండి 34 వరకు)

అనేక ఉపమాలంకారములు—సచంద్ర కుముదం రమ్యం సార్క కారండవమ్ శుభమ్, ధారయే న్మేఘబృందా నిష్పతంశ్చ పునః పునః (57—-1 నుండి10 వరకు)

హనుమను గాంచి వానరుల ఆనందము—- క్ష్వేళంతన్యే నదంతేన్తే గర్జన్త్యన్యే మహాబలా: , చక్రు:కిలి కిలా మన్యే ప్రతి గర్జంతి చాపరే , ఆపరేచ హనూమన్త మంగ దస్త మథాబ్రవీత్ , సర్వేషామ్ హరి వీరాణాం మధ్యే వచన ముత్తమం (57—41 నుండి 43 వరకు)

హనుమ తెలిపిన తన కార్యక్రమ పూర్తి కథనము —ప్రత్యేక్షమేన భవతాం మహేంద్రాగ్రాత్

ఖమాప్లుత్య, ఉదదేర్దక్షిణ పారం కాంక్షమాణ స్సమాహితఃఏతత్సర్వం మయా తత్ర యథావదుపపాదితం, అత్ర యన్నకృతం శేషం తత్సర్వం క్రియతామితి (58—7 నుండి 165 వరకు) –పూర్తి సర్గ .

హనుమ యుద్ధ వర్ణనము—–(జంబుమాలి) ==విన్నపం కర్మ తద్దృష్ట్వా హనుమాన్ చండ విక్రమః , సాలం విపుల ముత్పాట్య బ్రామయామాస వీర్యవాన్ (44–12) తస్య చైవ శిరో నాస్తి న బహూనచ జానునీ, నధనుర్న రథో నాశ్వాస్తత్రా దృశ్యంత నేషవః (44—17)

మంత్రి పుత్రులతో రణము—-తలేనాభ్యహన్తామ్ కాశ్చిత్పాదైక్శ్చాత్ పరంతపః , ముష్టినా భ్యహన త్కాం శ్చిత్పా దై:కాంశ్శ్చిత్యదారయత్ (45–12) ప్రమమాధో రసా కాంశ్చిత్దూదూరూభ్యా మకరోత్ కపి:, కేచిత్తస్య నినాదేనా తత్త్రైవ పతితా భువి (45–13), న దూరం న హసోత్పత్య దుర్ధరస్య రథే హరి:, నిపపాత మహావేగో విద్యుద్రాశిరిగిరానివ (46–25) తతస్య మథితా ష్టాశ్వం రథంచ భగ్నాక్ష కూబరం, విహాయాన్యపత్థద్భూమౌ దుర్ధరస్త్యక్త జీవితం (46–26), ససాల వృక్షమాసాద్య తాముత్పాట్యచ వానరః , తావుభౌ రాక్షస వీరౌ జఘాన పవనాత్మజ :(46–30), అశ్వై రశ్వాన్ గజైర్గజాన్ యోధైర్యోధాన్ , సకపిర్నాశయాస సహస్రాక్ష ఇవాసురాన్946–37) నతస్యహ నష్ట హయాన్మనోజవాన్ , పపాత భూమౌ హత వాజి రంబరాత్(47–31, 32)–(అక్షయ కుమారుడు)

శరమన్తరేష్వాశుత్యవీరత మహా కపి: , హరిస్తస్యాభిలక్షస్య మోఘయన్ లక్ష్య సంగ్రహం —(ఇంద్రజిత్తు) (48–31)

హనుమ ప్రకటన —జయత్యబలో రామో లక్ష ణశ్చ మహా బలః , రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః (42—33 నుండి 36) నుండి అర్ధయిత్వా పురీ లంకామభివాద్యచ మైథిలీం , సముద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వ రాక్షసాం (42—-36)

అస్త్రవిజ్జయతా రామో లక్షణశ్చ మహా బల:, రాజా జయతి రాఘవేణాభి పాలిత: ,

దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ఠ కర్మణ:హనుమాన్ శత్రు సైన్యానాం నిహన్తాశత్రు మారుతాత్మజ:, న రావణమ్ సహస్రం మే యుద్ధే , అర్థయిత్వా పురీం లంకాం అభివాద్యచ మైథిలీం (43–8నుండి 11 వరకు )

తథా పితు న యజ్ఞేన జయమాకామాంక్షితా రణే , ఆత్మా రక్ష్యా ప్రయత్నేన యుద్ధ సిద్ధిర్హి చంచలా (46–14)

ధన్యాస్తే పురుష శ్రేష్టా యే బుద్ధ్యా కోప ముత్థితం , నిరుంధతి మహాత్మానో దీప్తమగ్న మివాంభసా . . క్రుద్ధం పాపం న కుర్యాత్త్క: క్రుద్ధ: హన్యానురూనపి, క్రుద్ధ:పరుషయా వాచానరస్సాధూ నధి క్షిపేత్ , వాచ్యావాచ్యం ప్రకుపితో నవినాజానాతి కర్హచిత్ నా కార్య మస్తి క్రుద్ధస్య నా వాచ్యం విద్యతే క్వచిత్ , యస్య ముత్పతితం క్రోధ క్షమ యైవ నిరస్యతి, యథోరగ స్త్వచం జీర్ణాంస వై పురుష ఉచ్యతే (55-4నుండి 7 వరకు)

హనుమ విశ్వాసము–కృతజ్ఞత ==

తతః పవన చంద్రార్క సిద్ధ గంధర్వ సేవితం, పంధాన మహమాక్రమ్య భవతోద్రుష్ట వానిహ (58-163), , రాఘవస్య ప్రభావేన భవతాంచైవ చేతసా, సుగ్రీవచ కార్యార్థం మయా సర్వ మనుష్ఠితం (58–164), ,

 హనుమ లంకలో ప్రకటన =జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహా బలః , రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః, , అహం కోసల రాజస్య దాసః పవన సంభవః, హనుమానితి సర్వత్ర నామ విశ్రావితం మయా (59—22నుండీ 23 వరకు).

సీతా మాత పరిస్థితి==

అనురక్తాహి వైదేహీ రామం సర్వాత్మనా శుభా , అనన్య చిత్తా రామేచ పౌలోమీవ పురందరే , తదేక వాసస్య వీతా రజో ధ్వస్తా తథైవ చ , శోక సంతాప దీనాంగీ సీతా భర్తృ హితే రతా ,

సా మయా రాక్షసీ మధ్యే తర్జమానా ముహుర్ముహు:, రాక్షసీభిర్విరూపాభి ర్దృష్ట్వాహి ప్రమాదావనే , , ఏక వేణీ ధరా దీనా భర్తృ చింతా పరాయణా , అధశ్శయ్యా వివర్ణాంగీ పద్మినీవ హిమాగమే, , రావణాద్వినివృత్తా మర్తవ్య కృత నిశ్చయా , కధంచిన్మృగశాబాక్షీ విశ్వాస ముపపాదితా (59–27 నుండి 31 వరకు)

మధు వనమున వానరుల చేష్టలు ==

గాయంతి కేచిత్ ప్రాణమంతి కేచిత్ , నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ , ప్లవంతి కేచిత్ ద్విచరంతి కేచిత్ ప్లవంతి కేచిత్ ప్రలపంతి కేచిత్ (61–14), , పరస్పరం కేచిదపద్రవన్తే-పరస్పరం కేచిద్దుపాక్రమంతే (61–15) గాయంతమన్య:ప్రహసన్నుపైతి-హసంతమన్య:రుదన్తమన్య:ప్రనదన్నుపైతి నుదన్త మన్య:ప్రణదన్నుపైతి (61–17) ద్రుమాద్రుమ కేచిదభిద్రవంతే క్షితౌ నగాగ్రాన్నిపతంతి కేచిత్ -మహీ తలాత్ కేచిదుదీర్ణ వేగా మహాద్రుమాగ్రా న్యాభిసమ్పతంతి (61-16) నఖైస్తు దంతోదశనైర్దశంత-స్థలైశ్చ పాదైశ్చ సమాపయంత:మదాత్కపింతం కవయస్య మగ్రా-మహావనం నిర్విషయంచ చక్రు : (61–23)

మధు వనమున వానరులు – మధూనిద్రోణ మాత్రాణి బహుభిః పరిగృహ్యతే కృత్వా కేచిత్ మదంత్యన్తే కేచిర్భుధ్యంతి చేతరత్ (62 –9 నుండి 14) .

58 వ సర్గ యంతయు సుందర కాండ సంగ్రహ గాధ పరిపూర్ణముగా హనుమచే వానరులకు వివరించ బడినది.

ప్రార్థన

వాయు నందన బలభీమ! భక్త వర్య! సతి సువర్చలా సహిత ప్రసన్నవరద!

ఆర్త రక్షణ పారీణ! ఆంజనేయ! భూత భయహరా! హనుమంత! పూత చరిత! ఆయురారోగ్యదాత! మహానుభావ! శరణ మన్యథా నాస్తి మత్స్వామి! రక్ష.

స్వస్తి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here