[box type=’note’ fontsize=’16’] భర్తలకి భార్యలందించే సహకారాన్ని గుర్తు చేసుకుంటూ, తన కృతజ్ఞతని కవితాత్మకంగా… ‘శ్రీమతికో ప్రేమలేఖ!’ పేరిట వెల్లడిస్తున్నారు వెన్నెల సత్యం. [/box]
[dropcap style=”circle”]మూ[/dropcap]డు ముళ్ళ బంధాన్ని
ముచ్చటగా స్వీకరించి
ఏడడుగుల హరివిల్లును
నా జీవితాకాశంలో పూయించిన
నా ఇంటి వేలుపు నీవు!
నాలో నువ్వు సగమని
నే మురిసిపోతుంటే
నీలో నన్ను సంపూర్ణం చేసి
అర్థ నారీశ్వర తత్వానికి
అందనంత ఎత్తుకెదిగావు!
ఏమండీ!
ఆ తీయని పిలుపుతో
మండే నా గుండెను సైతం
మంచు ముద్దను చేస్తావు నువ్వు!
అనారోగ్యం నా వైపు
కన్నెత్తి కూడా చూడకుండా
ఆరోగ్య భాగ్యాన్ని అందించే
నా సౌభాగ్య దేవత నువ్వు!
చిక్కటి అమృతంలాంటి
నీ చేతి కాఫీతో
చక్కని కవిత్వానికి నా మదిలో
ఊపిరి పోసేదీ నువ్వు!
నా కలం కదలనని
మొరాయించే వేళలో
క్షణంలో కవితా వస్తువుగా
మారిపోతావు నువ్వు!
అసలు నా కవితకు
ఆలంబనే నువ్వు కదా శ్రీమతీ!
పక్కన నువ్వుంటే చాలు
ప్రపంచాన్ని ఒంటి చేత్తో
జయించడం నాకో లెక్క కాదు!
నువ్వు లేని క్షణం నాకు
ఈ ప్రపంచంతోనే పనిలేదు!!