శ్రీమతి – శ్రీవారు

2
13

[శ్రీ మల్లాప్రగడ రామారావు రచించిన ‘శ్రీమతి – శ్రీవారు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

శ్రీమతి – శ్రీవారు 

(ఇంకా స్నేహితురాళ్ళు-వాళ్ళ భర్తలు)

అవతారిక:

శ్రీవారు తట్టకనే తలుపు తెరుచుకుంది. ఎదురుగుండా నవ్వు ముఖంతో, చెప్పుల చప్పుడు విని‌‌ తలుపు తెరచిన శ్రీమతి.

“ఏమిటీ వింత” కళ్ళెగరేస్తూ శ్రీవారు.

“వింతేనండి. ఎప్పుడూ‌ గొప్పలకి పోతారు కదా ‘మా స్నేహితులు. మా స్నేహితులు’ అంటూ” శ్రీమతి.

“కొంచెం వివరించమని రాణి గారికి మనవి” నడుం వరకు వంగి, నాటకీయంగా శ్రీవారు.

“వేషాలు చాలించి, ముందు కాళ్లు, చేతులు కడుక్కోండి.” శ్రీమతి.

సతీశాసనం శిరసావహించి, శ్రీవారు కాళ్లు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కుని, హాల్లోని కుర్చీలో ఆసీనుడయ్యాడు.

తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ, శ్రీమతి అందించిన టీ కప్పు అందుకుని, “ఇప్పటికైనా చెప్పమ్మా తల్లీ!” శ్రీవారు.

“ఎప్పుడూ అంటారు కదా. ఊర్లో ఉన్న స్నేహితులం శర్మ, నేను, రామారావు ముగ్గురం ప్రతినెలా మొదటి రోజో, రెండో రోజో క్రమం తప్పక కలుసుకుంటాము. ఏడాదికోసారి భువనేశ్వర్ నుండి అజిత్, తుని నుండి మాధవరావు కూడా వస్తారు.” అని.

“ఇందులో గొప్పలు పోవడమేముంది? కళాశాల రోజుల్లో మొదలైన మా స్నేహం, మధ్యలో సుధీర్, స్వామీజీలు పరలోకానికి ప్రయాణమైనా, నలభై సంవత్సరాలు పైగా కొనసాగడం‌ నీకు మాత్రం తెలియదా.”

“తెలుసులెండి. ఎక్కడెక్కడో ఉద్యోగం చేసినన్నాళ్ళూ ఏమైపోయాయి మీ స్నేహాలు? రిటైరై మళ్లీ మనం ఈ ఊరు వచ్చిన తర్వాత కదా ఈ నెలవారీ సమావేశాలూ, వార్షిక సమావేశాలూ. అలా మాకెలా కుదురుతుంది? మిమ్మల్ని కట్టుకుని మీతో నేనూ దేశాలు పట్టేను.

ఇందిర‌‌ ఉద్యోగమూ, కాపురమూ‌ చెన్నైలో. నిర్మలేమో చక్కగా పెరంబూరులో స్వంతంగా ప్రారంభించిన‌‌ ఫ్యాక్టరీ వ్యవహారాలు భర్తతోపాటు చూసుకుంటోంది. దానికి తినడానికే తీరికుండదు. ఇంక బంధువులు స్నేహితుల ఇళ్లకేం వస్తుంది” నిష్ఠూరంగా శ్రీమతి.

“మన్నించాలి మేడం! మనం పక్కదారి పట్టినట్టున్నాం. తలుపు తీయగానే వికసించిన ముఖకమలంతో స్వాగతించారు. ఆ విశేషమేమిటో కాస్త సెలవివ్వండి.” శ్రీవారు.

“సరిగ్గా చెప్పారు. మీకు మూడు రోజులు సెలవులే (ముఖంలో ముసిముసి నవ్వులు). మధ్యాహ్నం నిర్మల ఫోన్ చేసింది.‌ శుక్రవారం సాయంత్రం ఫ్లైట్లో తనూ, ఇందిరా ఇక్కడకొస్తున్నారు; మొగుళ్ళతో సహా.

సోమవారం రాత్రి తిరుగు ప్రయాణం. మూడు రోజులు మన ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడేమంటారు?” శ్రీమతి సవాలు.

“సంతోషం అంటాను. రానీ చూద్దాం అంటే నీకు కోపం వస్తుంది. ఇంతకు ముందు రెండుసార్లు ఇలాగే చెప్పి బురిడీ కొట్టారని జ్ఞాపకం చేస్తే నీకు మండుకొస్తుంది” శ్రీవారు.

“చెప్పక చెప్పారు కదా! ఇప్పుడు మీకొక్కటిచ్చినా తప్పులేదు” శ్రీమతి.

“తప్పదంటే, సత్యభామలా పాదతాడనం వద్దు. ప్రబంధ నాయికలా జడతో దండించవచ్చు” శ్రీవారు.

“నవ్వులాట చాలు. శ్రద్ధగా వినండి. మీకసలే మతిమరుపు. దానికి తోడు ఆఫీసు పనిలో పడితే, నేనూ, పిల్లలూ కూడా గుర్తుకురాం. పోయిన రెండుసార్లూ వాళ్లు రాకపోబట్టి సరిపోయింది. లేకపోతే మీ నిర్వాకానికి..” శ్రీమతి.

“అప్పుడంటే అలా మరిచిపోయాను కానీ,..”

కథాక్రమం:

“ఏం చేశారు మీకు చెప్పి వారమయింది” కోపంగా శ్రీమతి.

“ఏ విషయమే!” నిదానంగా శ్రీవారు.

శ్రీమతి దీర్ఘమైన నిట్టూర్పు. “ఏమీ లేదు లేండి”.

“చెప్పు. పర్వాలేదు. ఏమీ లేకపోతే అంత కోపం ఎందుకు?”

“ఎందుకేమిటి మిమ్మల్ని కట్టుకున్నందుకు?”

“నువ్వెక్కడకట్టుకున్నావ్? నీ వెంటపడి, బతిమిలాడితే, చివరికి ‘ఊ’ అన్నావు.”

“అప్పుడన్నందుకే ఇప్పుడనుభవిస్తున్నాను. ‘ఏదో నల్లగా ఉన్నా, లక్షణంగా ఉన్నాడు. తియ్యగా మాట్లాడుతాడు. రెండు పద్యాలు కూడా రాసిచ్చాడు’ అనుకున్నానే కాని, ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని నాకేం తెలుసు!‌ అప్పటికీ మా అక్క చెప్తూనే ఉంది. అంత వేగంగా నమ్మకే ఈ కోస్తా వాళ్ళనని.”

ఇంక నవ్వాపుకోవడం శ్రీమతి వల్ల కాలేదు.

తొలివలపు జ్ఞాపకాలు మారాకు వేస్తుండగా

“నిజం పిల్లా! ఏ విషయమో నాకు గుర్తు రావడంలేదు” శ్రీవారు.

“ఎందుకు వస్తుందండీ? వచ్చేవారు మా స్నేహితులు కదా! ఎన్నాళ్లయింది ఇందిరనీ, నిర్మలనీ చూసి. ‘లా’ చదివిన మూడేళ్లూ, మబ్బుల్లో తేలుతున్నట్టే ఉండేవాళ్ళం.” శ్రీమతి.

“అవుననుకో. కానీ, అప్పుడప్పుడు మీ లెక్చరర్ రామావతారం గారి నుండి అప్పు తీసుకొని, చేబదులే అనుకో, తిరుపతి ప్రతాప్ టాకీస్‌లో సినిమా చూడ్డానికి మాత్రం భూమ్మీదకు వచ్చేవారు” శ్రీవారు.

“ఏదో అప్పుడు కాబట్టి బుద్ధి పుట్టినప్పుడల్లా, అవసరమైతే అప్పో సప్పో చేసి, సినిమాకి వెళ్ళేవాళ్ళం ముగ్గురం.‌ మీతో మూడుముళ్ళూ వేయించుకున్నాక ఆ ముచ్చటా అటకెక్కింది. ఏడాదికో, ఆరు నెలలకో ఓ సినిమా. అవీ, మన కష్టాలు చాలవన్నట్టు కన్నీళ్ల సినిమాలు” శ్రీమతి.

“మళ్లీ దారిమళ్ళాం. నా బంగారంవి కదూ. విషయమేమిటో విశదపరచు” శ్రీవారు.

“పిలుపులకే బంగారం! పెళ్లయి ఇరవై సంవత్సరాలవుతున్నా తులం బంగారం కొన్న పాపాన పోలేదు. ఏదో పెళ్ళిలో పెట్టిన గొలుసు, గాజులు తప్ప.” శ్రీమతి.

“మన్నించాలి సుందరీ! ఇలా పిలిస్తే అభ్యంతరం లేదు కదా! నిజం నీకూ తెలుసు. జీతం పెరిగి బకాయిలు వచ్చినప్పుడల్లా నా‌ ప్రతిపాదనను తిరస్కరిస్తూ వచ్చావు. ప్రతిపక్ష బలం ముందు ప్రతిసారీ ఓటమి పాలవుతున్నాను” శ్రీవారు.

“బండి లూప్ లైన్ లోకి వెళుతోంది. చెప్పేది శ్రద్ధగా వినండి. ఇందిరా, నిర్మలా వాళ్ల వాళ్ళాయనలతో వస్తూన్నారని తెలుసుకదా. ఇవాళ బుధవారం. ఎల్లుండి శుక్రవారమే వాళ్ళొచ్చేది. మనకున్నవే రెండు పడక గదులు. బడులకు సెలవు మూలాన పిల్లలు అమ్మా వాళ్ళింటికి వెళ్లారు కాబట్టి, ఆడవాళ్ళిద్దరికీ మన రెండో గది ఇచ్చినా, సుందరం గారికీ, శంకరం గారికీ పడుకోవడానికి వేరే ఏర్పాటు చేయొద్దా”

“అదా! అదెంతసేపు. రిజర్వేషన్ చేసుకున్నారా? ఏ ట్రైన్‌కి వస్తున్నారు?”

“మీకేం చెప్పినా పరగడుపే. వాళ్ళకేం ఖర్మండీ మనలాగా రైల్లో రావడానికి! విమానంలో వస్తున్నారు”

“సరే బంగారం! ఇవాళ చయనులు గారితో మాట్లాడతాను.‌ నీకు తెలుసు కదా! వాళ్ళది లంకంత కొంప. నిరుడు మన గృహప్రవేశానికి అందరూ వచ్చినప్పుడు, రెండు గదులు ఇచ్చారు కదా” భరోసా ఇచ్చారు శ్రీవారు.

“బాగుందండి. మన ఇంటి నుంచి రెండిళ్లు దాటితే చయనులు గారి బంగళాయే” మెచ్చుకోలుగా చూసింది శ్రీమతి.

ఉత్తరాయణం:

శుక్రవారం సాయంకాలం. మామూలు వేళకే కార్యాలయం నుంచి ఇంటికి వచ్చాడు శ్రీవారు.

తలుపు బాదగా, బాదగా, నిదానంగా తలుపు తీసిన శ్రీమతి ముఖం చిన్నబోయి ఉంది.

“ఏమైంది” కించిత్ కంగారుగా శ్రీవారు.

“మళ్లీ అదేనండి. ఏదో ఇబ్బంది వచ్చిందట. ఇందిరా, నిర్మలా రావడం లేదు.” దిగాలుగా శ్రీమతి.

“పాపం ఏం ఇబ్బందో ఏమిటో! ఇంకోసారి వస్తారులే. ఐనా,ఇలా వస్తాననడం రాకపోవడం వాళ్లకి అలవాటే కదా” ఓదార్పుగా శ్రీవారు.

“సర్లెండి. ముందు చయనులు గారికి ఫోన్ చెయ్యండి. మనవాళ్లకోసం వాళ్ళేమీ ఏర్పాట్లు చేయక్కర్లేదని”

అప్పుడు బల్బు వెలిగింది శ్రీవారికి. గుండె గుభిళ్ళుమంటుండగా “అక్కర్లేదే” నసిగాడు.

“ఎందుకు? వాళ్లు రామని మీకేమైనా ఫోన్ చేశారా” ఆత్రంగా అడిగింది శ్రీమతి.

మొదట తల మాత్రం అడ్డంగా ఆడించాడు శ్రీవారు. తర్వాత ఇలా గొణిగాడు “నువ్వు బుధవారం కదా చెప్పావు. చయనులు గారికి చెప్పడానికి తొందరేముంది. లక్ష్మివారం చెప్పొచ్చనుకున్నాను. తీరా నిన్న ఏదో ఆఫీస్ పనిలోపడి..”

“పడి?”తీవ్రంగా రెట్టించిన శ్రీమతి.

ఈ లోగా పడకగది తలుపు తెరచుకుని,

“ఇంక చాలించే త్రిపురా!” అంటూ, నాటకానికి తెరదించుతూ, హాల్లోకి ప్రవేశించింది ఇందిర. కూడా నిర్మల.

ఇద్దరినీ చూసి నోరు వెళ్ళబెట్టాడు శ్రీవారు.

ఎంతైనా వెంటబడి, ప్రేమించి పెళ్లాడిన మొగుడు కదా! శ్రీమతికి జాలేసింది. “నిన్న లక్ష్మివారం కదండీ. షిరిడి సాయిబాబా మందిరంలో రాధ కనబడింది. అదేనండి చయనులు గారి భార్య. ఆవిడని అడిగితే మీ బండారం బయటపడింది.”

‘హమ్మయ్య’ అనుకున్న శ్రీవారు,

“మరి సుందరం గారు, శంకరం గారు రాలేదా!” అని ఆశ్చర్యపోబోయాడు.

నవ్వుతూనే నిర్మల గుట్టు విప్పింది.

“వచ్చారు అన్నయ్యగారు. మీ మిత్రులు ఇద్దరూ మీకై చయనులు గారింట్లో ఎదురుచూస్తున్నారు.”

“అవునండీ. ఈ మూడు రోజులు మేం ముగ్గురం మన ఇంట్లో. మీ ముగ్గురికీ దేవుడీమన్నా. ఉదయం మా బద్ధకాలు తీరి, మేం ఫోన్ చేసే వరకు మన ఇంటి ఛాయలకు కూడా మీ త్రిమూర్తులు రాకూడదు. ఎన్ని కబుర్లు చెప్పుకొని ఎప్పుడు పడుకుంటామో మాకే తెలియదు. ఉదయం కాఫీ, ఫలహారాలకు, మధ్యాహ్నం భోజనాలకు, మాత్రం మినహాయింపు. సాయంకాలం టీ, స్నాక్స్, రాత్రి భోజనాలకు మీ పాట్లు మీరే పడాలి

‌మాతో హోటళ్ళకి, సినిమాలకి, షికార్లకి రారాదు.‌”

“త్రిపురా! పాపమే!” ఇందిర.

“నువ్వూరుకోవే! ఈ మాత్రం శాస్తి జరగాల్సిందే ఈ పురుష పుంగవులకి” నిర్మల.

ఇంకేమి నిషేధాలు‌ వినవలసివస్తుందోనన్న భయంతో “సరే, సరే” అని తలాడించిన శ్రీవారు సూట్‌కేస్ సర్దుకునేందుకు త్వరపడ్డాడు.

మంగళం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here