పుట్టపర్తి ప్రణీత శ్రీనివాస ప్రబంధ ప్రశస్తి – పుస్తక పరిచయం

0
10

[dropcap]శ్రీ [/dropcap]పుట్టపర్తి నారాయణాచార్యుల వారు వ్రాసిన ‘శ్రీనివాస ప్రబంధ’మనే బృహత్ గ్రంథాన్ని సంక్షిప్త వ్యాఖ్యానంతో, కొన్ని పద్యాలతో ‘భారతీ సంహిత’ రచించిన  గ్రంథం ఇది. ఇందులో అయిదు ఆశ్వాసాలున్నాయి.

***

“సరస్వతీపుత్రులు డా. పుట్టపర్తి నారాయణాచార్యుల వారి ప్రస్తావన వస్తూనే సాహిత్యాభిమానులకు “శివతాండవము’ అన్న కావ్యం చప్పున స్పురిస్తుంది.

గొప్ప భావావేశపూరితుడైన సుకవి, ఆ స్వభావానికి విరుద్ధంగా, భక్తిభావ సమన్వితంగా, శాంతరసప్రధానంగా, శ్రీవైష్ణవ సిద్ధాంత ప్రాతిపాదికగా రచించిన పద్యకావ్యం – “శ్రీనివాస ప్రబంధం”. నారాయణాచార్య సుకవి వ్యుత్పత్తికి, బహుముఖీనమైన ప్రతిభకు, రసదృష్టికి, నవ్యమైన కవిత్వ మార్గానికి, పురాణధురీణతకు, ప్రబంధపు ఒరవడికి నిదర్శనమైన విశిష్ట కావ్యం.

ఈ రచన సప్తగిరి పత్రికలో ధారావాహికగా వచ్చింది. ఆపై రెండు సంపుటాలుగా పుస్తకరూపేణా వచ్చింది. వస్తుతః ఈ కావ్యం శ్రీనివాసుని దివ్యధామమైన శ్రీవేంకటాచలాన్ని, ఆ పరిసరప్రాంతాల మాహాత్మ్యాన్ని వివరించే కావ్యం. కథలు విష్ణు, వరాహ, బ్రహ్మాండ పురాణాదుల నుంచి స్వీకరింపబడినవి. ఒకట్రెండు కథలు, మరికొన్ని కథాంతర్భాగమైన ఉదంతాలు కవి స్వీయకల్పితాలు. కథనం పూర్తిగా కవిదే.

రాముని కథలో – శ్రీరామచంద్రుడు వేంకటాచలాన్ని దర్శించుకున్నట్లు కల్పించాడు కవి. త్రేతాయుగపు రాముడు – కలియుగపు దైవాన్ని ఎలా దర్శించాడా? ఇందుకు వివరణ – ‘వేంకటాచలేతిహాసమాల’ అన్న వైష్ణవ గ్రంథంలో ఉంది. ఈ వివరణను ఈ వ్యాఖ్యానంలో పొందుపరచడం జరిగింది.

ఏవిధంగా చూచినా శ్రీనివాసప్రబంధం బహుముఖీనమై కావ్యం. నవ్యమార్గాన్ని, ప్రాచీన సాంప్రదాయాన్ని సమపాళ్ళలో మేళవించిన చిక్కని రచన, బహుశా తెలుగు భాషలో నేటికి (2018 – విళంబి నామ వత్సరం) చిట్టచివరి సమగ్రమైన తెలుగు కావ్యం” అని అంటారు “అర్ఘ్యము”లో వ్యాఖ్యాత భారతీ సంహిత.

***

ప్రథమాశ్వాసంలోని ఓ పద్యం, తాత్పర్యం, వివరణ:

కం. “తోచిన యట్టుల నుందువు
తోచవు నెమ్మనములందు, దుస్తరమాయా
ప్రాచుర్యము నీ రూపము
నీ చనవులు మాకు కల్ల నిజములు దేవా!”

తా: స్వామీ! నీవు తోచినట్లే అగుపిస్తావు. కానీ మనములలో నీవెవరో తెలుసుకోలేము.  నీ రూపము విస్తృతమైన మాయకు ఆలవాలము. నీ సహవాసము స్వామీ, మాకు అబద్దపు నిజములు దేవా!

(వి: అపూర్వమైన వర్ణన కాని వర్ణన. భగవంతుడు త్రిగుణాతీతుడని వ్యంగ్యము. ఈ వ్యంగ్యం అర్థం ద్వారా స్పురిస్తోంది కాబట్టి అర్థశక్త్యుద్భవధ్వని) నిన్ను తెలియక నిన్ను విడచి కుత్సితసుఖంబులను కోరుకొండ్రు జనులు. ‘విరి వదలి నారకెగబ్రాకు వెఱ్ఱులట్లు’, ‘పూలను వదిలి నార కోసం ఎగబడిన వెఱ్ఱి వాని వలె ఇది తెలుగు జాతీయము. “ఆ ఖలునిఁద్రుంచి కర్తవ్యమునకు నిర్విఘ్నత నిచ్చితిని స్వామీ శరణు” అన్నాడు. ఆపై వేదపురుషుడు స్వామిని ప్రస్తుతించాడు. రుద్రుడు స్వామిని వినయంగా కీర్తించినాడు. ఇంద్రుడు స్వామిని ద్వయమంత్రంతో ధ్యానించి సంతసించాడు. పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, పన్నగ సార్వభౌములు, వసువులు, ప్రజాపతులు, గంధర్వులు, యక్షులు, వైతాళికులు, కిన్నెరులు, మదనుడు, ఆదిమునులు యజ్ఞవరాహుని పరిపరివిధాలా ప్రార్థించిరి.

***

పుట్టపర్తి ప్రణీత శ్రీనివాస ప్రబంధ ప్రశస్తి
వ్యాఖ్యానం: భారతీ సంహిత
ప్రచురణ: డా. పుట్టపర్తి నాగ పద్మిని
వెల: రూ.200/- పేజీలు: 151
ప్రతులకు: ఎన్.సి.హర్షవర్థన్, ప్లాటు నెం.37, వంశీ నిలయం, తరుణ ఎవెన్యూ, లక్ష్మీనగర్, ఈస్ట్ ఆనంద్‌బాగ్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్-47

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here