తిరుమలేశుని సన్నిధిలో – శ్రీనివాస వైభవం-1

0
10

[box type=’note’ fontsize=’16’] తిరుమలేశుని సన్నిధిలో తమ అనుభవాలను, అక్కడ జరిగే పలు ఉత్సవాలను, వేడుకలను ‘శ్రీనివాస వైభవం‘ పేరిట వివరిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

బ్రహ్మోత్సవ సంరంభం:

“క్షేత్రాణాం క్షేత్రముత్కృష్టం
తీర్థానం తీర్థముత్తమం
శ్రీ వేంకటగిరిర్నామ
క్షేత్రం పుణ్యం మహీతలే”

[dropcap]ఏ[/dropcap]డుకొండలపై వెలసిన ఆ శ్రీనివాసుని తిరుమల క్షేత్రం అన్ని క్షేత్రాలలో ఉత్కృష్టమైనది. తీర్థాలలో పాపనాశము, ఆకాశగంగాది తీర్థాలు ఉత్తమం. స్వామి పుష్కరిణీ స్నానం పవిత్రం. సప్తర్షులు తిరుమలను సందర్శించిన అంశాన్ని తెనాలి రామకృష్ణుడు ‘ఘటికాచల మాహత్యం’లో విపులంగా వర్ణించాడు. తలకు ఒక సీసం చొప్పున ఏడుగురు ఋషులు ఏడు సీస పద్యాలలో వెంకటేశ్వరస్వామి శరీర సౌందర్యాన్ని వర్ణించారు.

16వ శతాబ్ది చివరి భాగానికే తిరుమల ప్రసిద్ధంగా వుందనడానికి ఆ కాలం వాడైన పింగళి సూరన తన ‘కళాపూర్ణోదయం’లో మణికంధరుని తిరుమల క్షేత్రాన్ని సందర్శించిన సందర్భం నిదర్శనం. మణికంధరుడు తిరుమలపై 3 అహోరాత్రాలు నివసించి స్వామిని దర్శించాడు. ఆ గంధర్వుడు స్వామిని ఆనందనిలయంలో దర్శించినప్పుడు ఇలా కనిపించాడు. పాదాల నుంచి శిరస్సు వరకు నఖశిఖపర్యంతం కవి వర్ణించిన సీసమిది:

సీ॥ మృదుపదాంబుజములు, మెఱుగుటం దెలుఁ బైడి
దుప్పటియును, మొల ముప్పిడియును
మణిమేఖలయు, బొడ్డుమానికంబును, వైజ
యంతియు, నురమున నలరు సిరియు
వరదహస్తము, కటి వర్తిల్లుకేలు, శం
ఖము, చక్రమునుదాల్చు కరయుగంబు
తారహారంబులు, జారుకంఠంబు, ని
ద్దపు చెక్కులును నవ్వుదళుకు పసలు

గీ॥ మకరకుండలములును తామరల నెగడు
కన్నులు మానోజ్ఞనాసయు, కలికి బొమలు
ముత్తియపునామమును రత్నమకుటవరము
నెసగ గనుపట్టు శ్రీవేంకటేశు జూచె.

ఆ శ్రీనివాసునికి బ్రహ్మోత్సవాలను ఏటా ఆశ్వయుజ మాసంలో వైఖానసామోక్తంగా నవాహ్నికంగా సెప్టెంబరు – అక్టోబర్ మాసాలలో నిర్వహిస్తారు. చక్రస్నానంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. బ్రహ్మరథం ముందుండి వాహన సేవలు జరుగుతాయి.

రామానుజులు:

రామానుజాచార్యులకు, తిరుమలకు అవినాభావ సంబంధం ఉంది. తిరుమల ఆలయ వ్యవస్థకు ఒక రూపాన్ని ఇచ్చింది ఆయన. అందులో ప్రధానం బ్రహ్మోత్సవ సంరంభం. ఊర్థ్వపుండ్ర వివాదాన్ని ఆయన సున్నితంగా పరిష్కరించారు. రామానుజ కాలం నాటికి కొండమీద బ్రహ్మోత్సవ కాలంలో కేవలం ధ్వజారోహణము, ధ్వజావరోహణం జరిగేవి. వాహన సేవలు అన్ని తిరుచానూరులో జరిపేవారు. ఇది సరికాదని రామానుజులు తన కాలం నాడే తిరుమలలో ఉత్సవాలు జరిపించారు. మాడ వీధుల విస్తరణ అప్పటికే పూర్తి అయింది. వాహనాలపై మలయప్పస్వామి విహరిస్తూ జన సందోహానికి ఆనందం కలిగించసాగాడు.

అన్నమయ్య:

16వ శతాబ్ది వాడైన తాళ్లపాక అన్నమాచార్యుడు బ్రహ్మోత్సవ వైభవాన్ని వివిధ కీర్తనలలో వర్ణించాడు. కన్యామాసంలో శ్రవణా నక్షత్రం రోజున కలియుగ దైవమైన వేంకటేశ్వరుడు తిరుమల క్షేత్రంపై స్వయంవ్యక్తమూర్తిగా అవతరించాడు. శ్రవణా నక్షత్రానికి తొమ్మిది రోజుల ముందు ఉత్సవాలు ఆరంభిస్తారు. బ్రహ్మ జరిపే ఉత్సవాలు కావడం వల్ల ఇవి బ్రహ్మోత్సవాలు.

వాహన సేవలు ఇలా కొనసాగుతాయి: ఉదయం, సాయంకాలం వాహనాలలో మలయప్పస్వామి తిరుమాడవీధుల్లో సంచరిస్తాడు. శ్రీహరికి సేనాధిపతి అయిన విష్వక్సేనుల వారు ఉత్సవాలకు ముందు నడిచి కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తాడు. ‘వీధులవీధుల విభుడేగీ నిదె’ అంటాడు అన్నమయ్య.

వాహన సేవలివి: పెద్దశేష, చిన్నశేష, హంస, సింహ, ముత్యపు పందిరి, కల్పవృక్ష, భూపాల వాహనాలు, మోహినీ అవతార తిరుచ్చి, గరుడోత్సవము, హనుమంతుడు, గజము, సూర్యప్రభ, చంద్రప్రభ, అశ్వవాహనాధిరూఢుడై స్వామి వేంచేస్తాడు.

‘రథస్థం కేశవం దృష్ట్యా, పునర్జన్మ నవిద్యతే’ అన్నారు. రథంపై స్వామి వారు ఊరేగడం కనులారా దర్శించి తరించే సందర్భం. చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తి.

‘నానా దిక్కుల నరులెల్లా
వానలలోనె వత్తురు కదిలి’ అంటాడు అన్నమయ్య.
‘ఇటు గరుడుని నీవెక్కినను
పటమట దిక్కులు బగ్గున పగిలె’ అని గరుడాధిరూఢుడై వచ్చిన స్వామిని దర్శించడం అదృష్టం.

దాదాపు 6 నుంచి 7 లక్షల మంది వచ్చినా తొక్కిడి లేకుండా భద్రతా ఏర్పాట్లు కొనసాగుతాయి. తిరుపతిలో వారంతా ఆ రోజు స్కూటర్లపై, కార్లలో కుటుంబ సమేతంగా విచ్చేసి వాహనంపై స్వామిని చూసి తిరిగి వెళ్ళిపోతారు.

2008లో అని గుర్తు. బ్రహ్మోత్సవ బందోబస్తు కార్యక్రమానికి వందలాది పోలీసు బలగాలు వివిధ జిల్లాల నుండి విచ్చేశారు. ఐ.జి. ఆఫ్ పోలీస్ పర్యవేక్షణలో ముందురోజు రాత్రి ఎవరెవరు ఏ ప్రదేశంలో డ్యూటీ చేయాలో నిర్ణయించారు. ఆ రాత్రి 11 గంటల ప్రాంతంలో రథం సమీపంలో డ్యూటీ చేస్తున్న పోలీసు కొండ మీద జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ని అటకాయించారు. ఆయన నేను ‘జె.ఈ.వో’ నని చెప్పిన వినిపించుకోలేదు. ఏదో కారణం మిషగా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

మరి కొద్ది నిమిషాలలో బందోబస్తు డ్యూటీలో ఉన్న పోలీసులంతా సమ్మె చేస్తామని బెదిరించారు. ఆలయ అధికారులకు, పోలీసులకు మధ్య యుద్ధ వాతావరణం, మాటపట్టింపులు నెలకొన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రంగంలోకి దిగారు. ‘మీరు క్షమాపణ చెప్పాలి. కాదు వారు క్షమాపణ చెప్పాలి’ అని రాయబారాలు జరిగాయి. చివరికి భగవంతుని దయవల్ల పరిస్థితి సద్దుమణిగింది. మర్నాడు గరుడసేవ యథావిధిగా సాగిపోయింది.

గరుడసేవ రోజు విశేషాలు చెప్పుకోవాలి. తమిళనాడు నుండి భక్తబృందము ఊరేగింపుగా 7 నూతన వెల్ల గొడుగులను అంచెలంచెలుగా మోసుకొని వచ్చి గరుడసేవ రోజు శ్రీ కార్యనిర్వహణాధికారికి సమర్పిస్తారు. ఏటా కొత్త గొడుగులను వివిధ సైజులలో సమర్పిస్తారు. శ్రీ విలుబుత్తూరు నుండి గోదాదేవి పక్షాన పూలమాలలు ఆరోజు ఉత్సవంగా తెచ్చి సమర్పిస్తారు. మరో విశేషం మూలవిరాట్టుకు సమర్పించే మకరకంఠి, లక్ష్మీహారం, వెంకటేశ్వర సహస్రనామమాలను గరుడసేవ రోజు మాత్రమే మలయప్ప స్వామికి సమర్పిస్తారు. తిరుమల గరుడసేవ దర్శించడం మహద్భాగ్యం.

‘కంచి గరుడసేవ’ అనే నానుడి ప్రచారంలో వుంది. బ్రహ్మోత్సవాలకు వచ్చిన బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెబుతూ వెంకటేశ్వరుడిలా అన్నట్లు అన్నమయ్య వర్ణించాడు:

‘భోగీంద్రులును మీరు పోయి రండు
వేగిన మీదటి విభవాలకు’ అంటాడు.

మళ్ళీ వచ్చే సంవత్సరం ఉత్సవాలకు రమ్మని సూచిస్తున్నాడు స్వామి.

రథోత్సవం:

స్వామి బ్రహ్మోత్సవాలలో అత్యంత వైభవంగా సాగేది రథోత్సవం. తిరుమాడ వీధులను వారం రోజుల ముందే ఇంజనీరింగ్ విభాగం వారు పటిష్టంగా మలుస్తారు. సాఫీగా రథం నడక సాగిపోతుంది. పరమభక్తురాలైన తరిగొండ వెంగమాంబ జీవితంలో ఒక అద్భుత సంఘటనను విశేషంగా చెప్పుకొంటారు. ఆమె పిలుస్తే వెంకటనాథుడు ‘ఓ!’ అని పలికేవాడట.

వెంగమాంబ తిరుమలలో ఉత్తరమాడ వీధిలో బృందావనంలో నివసించేది. ఒకసారి బ్రహ్మోత్సవాలలో రథం బయలుదేరి ముందుకు సాగింది. ఉత్తరమాడ వీధిలో ప్రవేశించింది. స్థానికులు కొందరు ఆ బ్రహ్మోత్సవ వాహనాలకు విధవరాలైన వెంగమాంబ హారతి ఇవ్వరాదని ఆక్షేపించారు. ఆమె మౌనంగా ఉండిపోయింది. రథం వెంగమాంబ ఇంటి ముందుకు రాగానే నిలిచిపోయింది.

ఎంతో విశ్వప్రయత్నం చేసి రథాన్ని లాగడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఇంతలో ఒక వృద్ధ అర్చకుడు వెంగమాంబను వెంటపెట్టి తీసుకువచ్చి హారతి ఇప్పించాడు. కొబ్బరికాయ కొట్టాడు అర్చక స్వామి. ‘గోవిందా! గోవిందా!’ అంటూ భక్తులు రథం తాళ్ళు లాగారు. స్వామి రథం ముందుకు నడిచింది.

ప్రత్యక్ష వ్యాఖ్యానము:

1978 నుండి ఆకాశవాణి కేంద్రాల ద్వారా (ఆంధ్ర ప్రదేశ్‌లోని కడప, విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలు) బ్రహ్మోత్సవాలకు ప్రత్యక్ష ప్రసారాలు మొదలు పెట్టింది. 1980లో బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యానం చేయడానికి బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు విచ్చేశారు. నేనూ ఓ వ్యాఖ్యాతను.

ఆ రోజు ఉదయం రథోత్సవం ప్రారంభమయింది. మహాద్వార సమీపం నుండి దక్షిణ మాడ వీధి వైపు మలుపు తిరగబోతూ ఆగిపోయింది. ఇంజనీర్లు ఎంత ప్రయత్నించినా కదల్లేదు. రథచక్రానికి కింద పడ్డ గోతిని పూడ్చే ప్రయత్నం చేశారు. గంట గడిచిన రథం కదలలేదు. వ్యాఖ్యాతలం మెత్తబడ్డాం. ప్రత్యక్ష ప్రసార సమయం మించిపోయింది.

‘స్వామీ! మాపై నీకు దయలేదా? ఆగ్రహించావా?’ అంటూ వ్యాఖ్యానం ముగించాం. అలా ఆనాడు జరగడం అనూహ్యం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here