శార్దూలము
విన్నాణం బిసునుంతలేక, మదిలో విత్తేష రెట్టించగా,
నిన్నుం గానక, నీదు దిన్యకథలన్ నిత్యంబు వల్లించి ని
న్నెన్నం జాలక కాలమెల్ల గడిపె న్నా కాయ మిన్నాళ్ళుగా;
కన్నయ్యా! యిక నేను నిన్ను గొలుతున్ కైవల్య మందించుమా! 33
మత్తేభము
ఘనధాధర కాంతికందళిత కాయజ్యోత్స్నలం గాంచుచో,
వనవీరంధర కోటి నొక్కపరి వర్షాభ్రాగమభ్రాంతమై,
గునిసాడంగ దొడంగు దృశ్యమది గోవర్గంబు వీక్షించుచున్,
చినుకుల్ వచ్చుట తధ్యమంచు దలచెన్ చిత్రంబుగా, కేశవా! 34
శార్దూలము
ఆ కారుణ్యకటాక్షవీక్షణములున్, ఆ భవ్యశోభాననం,
బా కౌశేయ విలాస దివ్యతనువున్, ఆ దివ్యలాస్యంబునున్,
ఆ కేకావలపింఛమున్, మనమునన్ హర్షంబు గల్పించగా
నింకన్ జాగును జేయకో, హరి! దయ న్నిష్టార్ధముల్ గూర్చుమా! 35
శార్దూలము
శ్రీలక్ష్మీకరపద్మసంగతములై శ్రీదంబులై వెల్గుచున్,
నాళీకాసన శంకరేంద్ర విభవ న్నాకౌక సేవ్యంబులై,
లోలోనమ్మిన భక్తకోటి భవముల్ లుప్తంబు గావించుచున్,
కేళీనృత్యసులగ్న కృష్ణపదముల్ కీర్తించెదన్ భక్తితో. 36
మత్తకోకిల
వల్లవాంగన లెల్ల నిన్గని వాంఛితార్థము లందగా
నుల్లమందున నిశ్చయించుచు, నూర్జితంబగు బుద్ధితో,
నిల్లువాకిలి బంధనమ్ముల నెల్ల వీడిన వేళలన్,
చల్లగా గని వారినేలిన శ్యామసుందర సన్నుతుల్. 37
శార్దూలము
సంసారార్ణవమందు గ్రుంకులిడుచున్, సత్యంబులోనెంచకన్,
శంసద్ధివ్యపదారవిందయుగళీ సంస్పర్శనాసక్తులై
సంసేవింపక, మోహబద్ధులగుచున్, సాధింతురే సద్గతిన్?
సంసిద్ధి న్నిడి నన్ను గావుము, నమస్కారమ్ములో మాధవా! 38
ఉత్పలమాల
ఉల్లమునందు నిల్పి కవితోక్తుల నిన్గొనియాడనెంచి, నే
తెల్లకాగితంబు గొని తీయనిపద్యము లల్ల నెంచగా,
నెల్లెడ నిండియున్న హరి నెటుల వర్ణనజేతు వంచు, నా
నల్లని యక్షరాకృతులు నను వింతగ నన్నుజూచుచున్. 39
శార్దూలము
ఓంకారంబున కాత్మయై నిలచుచున్ ప్రోద్యత్ప్రభన్ గ్రాలుచున్,
హ్రీంకారంబున కాలవాలమగుచు న్నీహంబు లీడేర్చుచున్,
ఐంకార ప్రతిబింబమై వెలుగుచు న్నజ్ఞానమున్ బాపుచున్,
శ్రీంకారాకృతి బ్రోవు నన్ను దయతో, శ్రీరుక్మిణీవల్లభా! 40