శ్రీపర్వతం-1

0
6

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం’ అనే చారిత్రక నవలలో ఇది మొదటి భాగం. [/box]

1

అనంతమైన ఆకాశం

దానిమీద వజ్రాలవలె విరజల్లిన నక్షత్రాలు

ఉత్తరం నుండి చిన్న చలిగాలి రివట

చుట్టూ అంధకారం

ధనంబొడ్డుమీద దట్టంగా పెరిగిన గడ్డి

అందరూ దానిన ధనం బొడ్డని అంటారు. అది కుబేరుడి నిలయమా? కుబేరుడు యక్షుకులు రాజు. యక్షులు నిధి నిక్షేపాలకు పాలకులు.

కాని అది ధనంబోడు కాదు, ధ.శ్రీ నంబోడు – ధనస్సు వంటిది. ఒక చివర వేలాద్రి – యాలాద్రి – వేదాద్రిలో ఉంది. రెండవది ఇక్కడ.

ఈ గ్రామానికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది.

ఇది ఇప్పుడు గ్రామం కన్న పెద్దది. ఇంకా పట్టణం కాలేదు.

ఈ గ్రామం చరిత్ర ఎవరికి తెలుసు?

ఆ ఊళ్ళో ఉన్న ప్రసాద్ గారికి తెలుసు.

ప్రసాద్ గారిని అతడు సాయంకాలం కలిశాడు. వారి వయస్సు అరవై దాటింది. అజానుబాహుడాయన. పొడవాటి చెవులు, కొనదేరిన నాసిక, వర్చస్సు వారి ముఖంలో ప్రస్ఫుటమవుతుంది. వారెక్కడో మంచి ఉద్యోగమే చేసేవారు. నాలుగు సంవత్సరాల క్రింద బుద్ధ జయంతి సంచికను వెలుగులోనికి తెచ్చారు. బౌద్ధం గురించి వారు చాల లోతైన పరిశోధన గావించారు. దానికి సంబంధించిన పుస్తకాలు తెలుగులోను ఇంగ్లీషులోను వ్రాశారు.

డాక్టర్ మోహన్ మధ్యాహ్నం మూడు గంటలకు బస్సులో దిగాడు. హైదరాబాదు నుండి తొలిసారి అక్కడికి వచ్చిన మనిషికి మతి పోయినట్లే అయింది. వెదకుదామన్నా మంచి హోటలు కనిపించలేదు. మడత మంచాలు అద్దెకిచ్చే లాడ్జీలు తప్ప కంటికి ఇంపుగా ఉన్నవేవి దృష్టిలో పడలేదు.

ఇంతకీ ఆ స్తూపమెక్కడుంది?

కాఫీ హోటలు ఒకటి కనిపిస్తే అందులోకి దూరాడు. మధ్యాహ్నం కూడా అక్కడ ఇడ్లీ అమ్ముతున్నారు. వేడిగా అప్పుడే వాయ దింపాడు హోటలు వాడు. వాటిని మించిన ఉత్తమమైన ఆహారం అతనికి దొరకదనిపించింది. ఇడ్లీ తిని, కాఫీ తాగి డబ్బులు చెల్లిస్తూ హోటలు వాడి నడిగాడు స్తూపం గురించి. అతనికా సంగతి తెలియదు. కాని అతడో ఉపకారం చేశాడు. ప్రసాద్ గారి ఇల్లు చూపించమని కుర్రాడినొకడిని ఇచ్చి పంపించాడు.

ప్రసాద్ గారి ఇల్లు చాల పెద్దది. వరండా చాల విశాలమైనది. వారు నరసారావు పేట వాలు కుర్చీలో చేరబడి పుస్తకమేదో చదువుకుంటున్నారు.

ఆ విధంగా వారితో పరిచయమయింది.

వారిని కలియడం వారితో మాట్లాడడం చాల గొప్ప అనుభవం. వారికి జగ్గయ్యపేట చరిత్ర బాగా తెలుసు. శాసనాల్లో ఆ గ్రామన్ని వేల్లగిరి అంటారు. వేత్రగిరి వేల్ల గిరి అయి ఉంటుంది. అంటే తీగ కొండ అని అర్థం. ఈ ప్రాంతాలలో పేము చెట్లు హెచ్చుగా పెరిగేవి. అందుచేతనే దీనిని బేతవోలు అన్నారు. బెత్తు – బేత – ఈ విధంగా వేల్ల గిరికి నామం బేతవోలు. తరువాత ఈ బేతవోలు కూడా మారిపోయింది.

ఇప్పుడీ గ్రామం పేరు జగ్గయ్య పేట.

ఈ పేరు వెనుక కూడా చరిత్ర ఉంది.

ఈస్టిండియా కంపెనీ వాళ్ళ పద్దెనిమిదవ శతాబ్దం చివరి భాగంలో నాయుడు గారికి కృష్ణా జిల్లా పాలనను అప్పగించారు. వారి ఏలుబడిలో పిండారీలు గ్రామలు తగులబెట్టి, ఆస్తులను కొల్లగొట్టి ప్రజల మాన ప్రాణాలకు ముప్పు దెచ్చారు. అపుడు నాయుడు గారు ఈ బందిపోట్లను పట్టి నిర్దాక్షిణ్యంగా చంపించారు. ఎంత బందిపోట్లయినా వారు కూడా మానవులే కదా! తప్పు పని చేసినప్పుడు మనఃక్లేశం తప్పదు. పశ్చాత్తాపం కలుగక మానదు. ఈ పాప పరిహారం కోసం వారు కృష్ణా జిల్లాలో నూటొక్క దేవాయాలను నిర్మించారు.

నాయుడుగారి తండ్రిగారు జగ్గయ్యగారు, వారి పేరున బేతవోలు గ్రామాన్ని పునర్నిర్మాణం గావించి జగ్గయ్య పేటగా మార్చారు.

వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగారి పేరు వినగానే అమరావతి జ్ఞాపకం వచ్చి డాక్టర్ మోహన్ ఒళ్ళు జలదరించింది.

ప్రసాద్ గారి ఇంటినుండి వచ్చేసరికి సాయంకాలం ఆరుగంటలయింది. ధనంబోడు – కొండమీద బౌద్ధ స్తూపం యొక్క అవశేషాలు మిగిలాయని, రాత్రి కెక్కడో బస చేసి ఉదయమే చూసి పొమ్మన్నారాయన. కాని మోహన్ అంతవరకు వేచి ఉండలేక పోయాడు. తనతో తెచ్చిన చేతి సంచీ భుజానికి తగిలించుకొని కొండ ఎక్కడం మొదలు పెట్టాడు.

అతడు కొండమీదకి చేరేసరికి చీకటి కుమ్ముకుంటోంది. స్తూపం ఆవరణ చుట్టూ ముళ్ళతీగ కట్టి ఉంది. ఆవరణలోపల రెండడుగుల ఎత్తుకు గడ్డి పెరిగింది. ఆవరణ గేటు దగ్గిర ప్రభుత్వం వారి ప్రకటన ఉంది. లోపల శిథిలాల నెవరూ పాడుచేయకూడదని, చేసినవారి మీద చర్య తీసుకుంటారని అందులో ఉండి ఉంటుంది.

ఒక్కక్షణం సేపు గేటుదగ్గిర నిలబడి మెల్లిగా దానిని తెరచి లోపలికి ప్రవేశించాడు మోహన్. కాలి దారి ఒకటి స్తూపం వైపు పోయింది. దాని వెంబడి వెళ్తే స్తూపం చుట్టూ ప్రదక్షిణాపథం కనిపించింది. దాని మీద చుట్టూ తిరిగి ఒకచోట అతడు కూర్చున్నాడు.

పడమటి ఎరుపులు పూర్తిగా మాయమై చీకటి చిక్కగా వ్యాపించింది. ఆకాశం నిండా చుక్కలు, తూర్పు నుంచి వస్తున్నగాలిలో చల్లదనం తోచింది. మోహన్ పద్మాసనం వేసుకున్నాడు. ఎన్నో ఆలోచనలతో నిండిన అతని తల ఇపుడు శూన్యంగా ఉంది. దేనిమీదికి తలపులు పోవడంలేదు. మహత్తరమైన శాంతి అంతటా అలముకుంది.

కాల గమనం కూడా అతనికి తెలియకుండా పోయింది. ఎంత సేపు అతడు ఆ విధంగా కూర్చున్నాడో! అతడు దూరానికి శూన్యంలోకి చూస్తున్నాడు.

దట్టంగా అతని ఎదుట ఉన్న గరిక, గాలికి కదలడం మొదలు పెట్టింది. ఆ కదలిక, వచ్చే కెరటాల వరుస వలె తోచింది. మహా సర్పమొకటి నడచినట్లుంది. ఆ కదులుతున్న సర్పం తలనెత్తింది. అది ఒక తలకాదు. పంచశీర్షాలున్నదా పడగ. ఆ సర్పం నడచి వస్తున్నది. ఆ కదలికలో వేగం తగ్గింది. అది అతని వేపే వచ్చింది. అంత చీకటిలోనూ ఆ అయిదు పడగలపాము ప్రకాశిస్తున్నది.

ఆ పాము అతనిని సమీపించింది. అతనికి కొంచెం కూడా భయం కలుగలేదు. ఆ పాము ప్రదక్షిణా పథం మీదికి వచ్చింది. ఆ మహోరగం పడగనెత్తి అతనిపై గొడుగు పట్టింది. ఆ పడగలో ఏమి మణులున్నవో, ఎదుటనున్న స్థలం విశాలంగా కాంతితో నిండిపోయింది. కాలం స్థంభించి పోయింది.

మోహన్ చూస్తున్నాడు. ఎదురుగా ఉన్న ప్రదేశం సాపుగా కనిపించింది. ఇంతలో దూరం నుంచి త్రిరత్నాల నెవరో స్తుతిస్తున్నారు.

బుద్ధం శరణం గచ్ఛామి – ధర్మం శరణం గచ్ఛామి – సంఘం శరణం గచ్ఛామి.

ముందు మగవారి గొంతులు – వాటి ననుసరిస్తూ స్త్రీల కంఠాలు ఆ ఉచ్చారణలో ధర్మం అనే పదం ధమ్మలగా వినిపిస్తోంది.

వాళ్ళు కొండ ఎక్కి ముందుకు వస్తున్నారు. నామమాత్రంగా కనిపిస్తున్న వారి రూపాలు క్రమ క్రమంగా వెలుతురు పడి స్పష్టంగా కనిపించాయి.

చూస్తుండగా వాళ్ళు తనవేపే వస్తున్నారు. వచ్చి వచ్చి ప్రదక్షిణా పథానికి రెండడుగులు దూరంలో సామాను దింపుకున్నారు.

వచ్చిన వాళ్ళు పదిమంది, సగంమంది స్త్రీలు – సగం మంది పురుషులు. వాళ్ళ బట్ట కట్టూ విచిత్రంగా కనిపించాయి. స్త్రీలు కటి ప్రదేశం వరకూ ఒక బట్ట చుట్టు కున్నారు. పై భాగం మరో వస్త్రంతో కప్పుకున్నారు. పురుషులు ఒకే పుట్టాన్ని భుజం మీద నుండి వెనుకకు పోయేటట్లు ధరించారు.

వాళ్ళలో ముందు నడుస్తున్న మగాడు ఏవో చదువుతూ అడుగు వేస్తున్నాడు.

ఓం వేడుయీ వేడుయా – ఇది ఉత్తే హస్తి పలాయతే !

ఓం మర్మా మర్మా ఇతి ఉత్తే వ్యాఘ్రః పలాయతే!

ఓం తేలియా తేలియా ఇతి ఉత్తే గంఢా పలాయతే!

ఇలి మిలి ఫుః పుః ఇతి ఉత్తే సర్పః పలాయతే!

చివరి ఉచ్చాటనతో గొడుగు బట్టిన అయిదు తలలపాము ఒక్క క్షణం చలించి తిరిగి స్థిరంగా నిలిచింది. ఆ మమా సర్పం పూర్తిగా ప్రదక్షిణా పథం మీదనే ఉంది.

మగవాళ్ళ మాటలలో సంస్కృత పదాలు వినిపిస్తున్నా స్త్రీల మాటలు ప్రాకృతంలోనే ఉన్నాయి.

ముందు నడుస్తున్న పురుషుడు మాత్రం చాల దృఢంగా కనిపించాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతడు కార్యానికి ఉపక్రమించాడు.

స్తూపానికి ఎదురుగా ఉన్న సమతల ప్రదేశంలో అతడు ఊరతో కొలవడం మొదలు పెట్టాడు. మూడు మూరలు, ఒక బెత్తెడు – బహుశా మూడు మూరల మూడంగుళాలు భుజంకల చతురస్రం కాబోలు ముగ్గుతో ప్రత్యేకించాడు.

అతడు మధ్యను నిలబడి అన్నాడు.

“సితా సిత రక్తా కారేణ వజ్రధృక్ – అక్షోభ్య”

స్త్రీలు బుట్టలలో ఉన్న తెల్లముగ్గు, నల్లని బొగ్గు పొడి, మరొక ఎర్రటి పొడి అతనికిచ్చారు.

మధ్యను చిన్న చతురస్రం గీసి దానిలో అక్షోభ్యుడిని స్థాపించాడు.

తూర్పున యమాంతకుడు, దక్షిణాన ప్రశాంతకుడు, పశ్చిమాన పద్మాంతకుడు, ఉత్తరాన విఘ్నాంతకుడు – వీరిని స్థాపించాడు. వీరు ద్వార పాలకులు.

తరువాత నాలుగు దిక్కులలో వైరోచనుడు, రత్న సంభువుడు, అమితాభుడు, అమోఘ సిద్ధి – వీరిని స్థాపించాడు.

పిమ్మట వారి శక్తులను స్థాపించాడు. ద్వేషరతి అక్షభ్యుడితో మధ్య చదరంలో కోణాలలో ఈర్ష్యారతి, రాగరతి, వజ్రరతి, మోహరతి ఉన్నారు.

చతురస్రంగా తయారయిన మండల మధ్యంలో సాధకుడు నిలబడి ధ్యానం చేశాడు.

బోధిచిత్త విశాలాక్ష ధర్మచక్ర ప్రవర్తక

కాయ వాక్చిత్త సంశుద్ధ వజ్రయాన నమోస్తుతే

సాధకుడు పాత్రలోని నీరు శరీరం మీద జల్లుకున్నాడు. ఏవో పూవుల పేర్లు – కర్ణికారం – మల్లికా గుచ్చం – కరవీరం మొదలైన పేర్లు వినవచ్చాయి. చిన్న వెదురు బుట్టలలోని పూలను స్త్రీలు సాధకుడికి అందించారు. అతడు అయిదుగురు బోధి సత్వులను, వారి శక్తులను వాటిలో పూజించాడు.

ఈ తతంగం అయిన పిమ్మట వరిపిండితో బొమ్మనొకటి తయారు చేశాడు. దానిని చిన్న పీట మీద నిలబెట్టాడు.

‘అస్యనామౌ ఆనందః’ అంటూ ప్రాణ ప్రతిష్ఠ చేశాడు.

‘ఆనంద’ అన్నమాట వినగానే మోహన్ వణకిపోయాడు.

సాధకుడు ‘చితాంగారః’ అంటూ కేక పెట్టాడు.

ఆడవాళ్ళు అర్థం కానట్లు చూశారు.

‘శ్మశానాంగారః’ మళ్ళా సాధకుడు బిగ్గరగా అన్నాడు.

అప్పుడొకపాతిక సంవత్సారాల సుందరి మట్టి మూకుడులో ఉన్న నిప్పులను కదిపి అతనికి అందించింది.

సాధకుడు ఆ మూకుడును సులువుగా రెండు అరచేతుల లోను పట్టుకున్నాడు. ప్రతిమ ఎదుట నిలుచున్నాడు. మరికొన్ని బొగ్గులు ఆ నిప్పుమీద వేశాడు. మూకుడును ఊయల ఊపినట్లు పక్కలకు ఊపాడు. ఆ నిప్పు రాజుకుంది.

మూకుడులో నిప్పు కణకణ లాడుతోంది. దానినతడు పిండి బొమ్మకు దగ్గరగా ఉంచి పట్టుకున్నాడు. నిప్పుల కాంతిలో తెల్లటి పిండి బొమ్మ ఎర్రగా కనిపించింది.

సాధకుని కంఠం ఆ మహా నిశ్వబద్ధంలో ఒక్కసారి ఉరుముల మ్రోతవలె నిర్గమించింది.

‘నమః సమంత కాయ వాక్ చిత్త వజ్రాణామ్…. ఓం ఏహ్యేహి భగవన్ నీల వజ్రదండ….. తురు తురు హులు హులు హాహా గులు గులు…..”

దుందుభి మ్రోయించినట్లు అతడు వర్ణిస్తున్నాడు. ఆ మమా ధ్వనిలో కొన్ని పదాలు చెవిని పట్టకుండా పోయాయి.

‘వాయువేగేన భూతాన్ శీఘ్రం దహ దహ దర దర వహ వహ పచ పచ…..

‘……. భక్ష భక్ష మేద మాంస రుధిర మత్స్య మేదమజ్జా ప్రియ, ఏహ్యేహి భగవన్ సర్వ విఘ్నాని సర్వ మంత్రాణి సర్వఊల కర్మాణి సర్వమూల గ్రహాన్ హన హన, భంజ భంజ…. ఇదం మే కార్యం సాధయ హుం…’

‘…… హన హన దహ దహ కురు కురు తురు తురు ఫట్ ఫట్ హూం హూం……’

సాధకుడు చదువుతూ ఉంటే పాతికేళ్ళ సుందరి అతని పక్కను చేరింది. అతడు చదవడం అపాడు.

రాజిన బొగ్గుల వెలుగులో ఆ సుందరి ముఖం తామర పూవులా కనిపించింది.

అతడు గొంతు సవరించుకున్నాడు.

‘దహ దహ దహ దహ

చక్షౌ చక్షౌ కురు ఆనందం

అంధం అంధం

జ్వాలయ జ్వాలయ

నయనౌ నయన్‌’

ఈ విధంగా అతడు అయిదుసార్లు చదివాడు. ఆ నిప్పుమూకుడును పిండి బొమ్మ ఎదురుగా ఉంచాడు. ఉచ్చారణలో భూమి కంపించినట్లయింది.

ఆనందుడిని గుడ్డివాడుగా చేయమన్న ప్రార్థనను విని మోహన్ కంపించి పోయాడు.

సాధకుడు నిప్పుతో ఉన్న మూకుడును పక్కకు పెట్టాడు. “మహా మాంస గుళికా……”

ఆ సుందరి ఒక బుట్టనుండి దేనినో తీసి మోదుగ ఆకులో ఉంచి అతనికిచ్చింది. దాని నతడు ఒక్కసారే నోట్లో వేసుకున్నాడు.

మిగిలిన వాళ్ళు కూడా ఆ విధంగానే తింటున్నారు. హయ, గజ మాంస, గుళికలవి.

“మద్యం …..” అందరూ చిన్న చిన్న పాత్రలతో మద్యం సేవించారు. తరువాత దృశ్యంతో మోహన్ మతి పోయింది.

మగవాళ్ళు ఆడవాళ్ళు కట్టిన పుట్టిలు విడిచి దిక్కులనే అంబరాలుగా ధరించారు.

స్త్రీలు ఘనజఘనలు, పృధుపయోధరలు, ఉరునితంబలు

ముఖ్య సాధకుడు ఏదో చదువుతున్నాడు.

ప్రాప్య కన్యాం విశాలాక్ష్మీం రూపయౌవనమండితామ్

పంచ వింశతికాం గుహ్యే తిర్యగస్యా…

మోహన్ తన కళ్ళను నమ్మలేకపోయాడు. పాతికేళ్ళ సుందరి సాధకుడిని చేరింది. అందరూ మిధున కర్మకు ఉద్యుక్తులయారు. గొంతెత్తి వాళ్ళు పాటలు పాడారు. నాట్యం చేశారు.

ఆకాశం భూమి బద్దలైనట్లయింది. దూరం నుండి కోడికూత వినిపించింది.

ఒక్క క్షణంలో స్త్రీ పురుషులు వేరయారు. బట్టలు వేసుకున్నారు. సామాను సర్దుకున్నారు. త్రిరత్నాలను ధ్యానిస్తూ వారు కొండ దిగడం ప్రారంభించారు. పాతికేళ్ళ సుందరి కొంచెం వెనుక పడింది. ముందు వాళ్ళు పిలిచారు, ‘రతివశ! రతివశ’.

ఆమె పరుగెత్తింది.

బుద్ధం శరణం గచ్ఛామి – ధర్మం శరణం గచ్ఛామి – సంఘం….

అప్పటికే వాళ్లు కనిపించకుండా పోయారు.

మోహన్ తలపై అంతవరకు గొడుగు పట్టిన మహాసర్పం అతనిని తగులుతూ ప్రదక్షిణా పథం నుండి నేలకు దిగింది.

ఆ స్పర్శ అతనికి అభయమిచ్చినట్లనిపించింది. అయిదు తలల పాము నడిచింది. పడగలలోని మణుల కాంతి ముందు భాగంలో ప్రసరించి వెనుక నున్న ప్రదేశం అంధకారంలో మునిగి పోయింది.

డాక్టర్ మోహన్ చేష్టా రహితుడై స్తూపానికి చేరబడ్డాడు. అతనికి తెలివి వచ్చేసరికి బాగా ఎండ వచ్చింది.

ఎదురుగా ఉన్న భూమి నున్నగా ఉంది. అక్కడ గరిక పూర్తిగా కోసి ఉంది. ఎడమ వేపు మాత్రం గరిక కనిపించింది.

గరిక ఎదురుగా కూర్చున్న వాడు ఇక్కడికెలా వచ్చాడు?

గేటు తెరచే ఉంది. గడ్డి మేసుకోడానికి ఆవరణలోకి వచ్చిన గేదెలు మోహన్ ని వెర్రిగా చూస్తున్నాయి.

(మళ్ళీ ఇరవై అయిదు సంవత్సరాల తరువాత డాక్టర్ మోహన్ విదేశాల నుండి రాగానే ఒక రాత్రి స్తూపం దగ్గిర ప్రదక్షిణా పథం మీద గడిపాడు. అతనికి ఎదురుగా కాకతీయ సిమెంటు ఫాక్టరీలోని దీపాలు మెరుస్తూ కనిపించాయి. కుడి పక్కను, కొండ దిగువను కొత్తగా రైల్వేలైను వేస్తున్నారు. పనివాళ్ళు టెంట్లు వేసుకున్నారు. పాకలు నిలుపుకున్నారు. వాళ్ళు వంటలు చేసుకుంటుంటే చీకట్లో ఆ మంటలు కనిపించాయి. రాత్రంతా ప్రదక్షిణా పథం విడవకుండా మేల్కొని కూర్చున్నాడు అతడు. కాని, అయిదు పడగల పామూ రాలేదు – అందమైన ఆడవాళ్ళూ రాలేదు.)

2

డాక్టర్ మోహన్ విజయదశమి మరునాడే బయలుదేరి మాచర్ల వెళ్ళాడు. సుబ్రహ్మణ్యేశ్వరరావుని కలిశాడు. నిజానికి రావే బస్సు స్టాండు దగ్గిర మోహన్ కోసం వేచియున్నాడు. నమస్కారాలయిన తరువాత మోహన్ తాను తెచ్చిన రికమెండేషను లెటరు అతనికిచ్చాడు.

సుబ్రహ్మణ్యేశ్వరరావు నాగార్జున సాగర్ డామ్ నిర్మాణం చేస్తున్న చీఫ్ యింజనీరు ఆఫీసులో డ్రాఫ్ట్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అతడు కూడా మోహన్ వయసువాడే. అయితే సుబ్రహ్మణ్యేశ్వర రావుది కసరత్తు చేసిన శరీరం. మనిషి కూడా పొడవుగా ఉంటాడు. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు.

ఆ రోజుల్లో మాచర్లనుండి బస్సొకటి నాగార్జున కొండకు ట్రిప్పులు వేసేది. మధ్యాహ్నం ఇద్దరూ మాచర్లలో భోజనం చేసి బస్సులో బయలుదేరారు. నాగార్జున కొండలోయ ప్రారంభంలో దిగిపోయి వాళ్ళు

లంబాడీ గూడెం వేపు నడిచారు. లంబాడీ తండా అని కూడా ఆ పల్లెను పిలుస్తారు.

పుల్లారెడ్డి గూడానికి కొంచెం దూరంలోను, తండాకు కొంచెం సమీపం లోను చదునుగా నున్న చోటొకటి వాళ్ళు చూశారు. అక్కడ టెంట్లు వేసుకోవచ్చునని రావు సూచించాడు. మోహన్ కూడా ఆ స్థలాన్ని నచ్చుకున్నాడు.

అక్కడనుండి క్షుల్ల ధర్మగిరి రమారమి ఒక మైలు దూరముంటుంది. ధర్మగిరికి సమీపంలో, కొండవాలులో ఉన్న రెండెకరాల చోటును త్రవ్వకాలకు ప్రభుత్వం అనుమతించింది. అపుడు లభించిన నిక్షేపాలను మహా స్తూపం సమీపంలో ఉన్న తాత్కాలికమైన మ్యూజియముకు తరలించారు.

సుబ్రహ్మణ్యేశ్వరరావుకి పెద్ద కంట్రాక్టరొకరు తెలుసు. అతడు కూడా జీపులో వచ్చి వాళ్ళను కలుసుకున్నాడు. అతనికి స్థలం చూపించి రెండు పెద్ద టెంట్లు, వాటి మధ్యను దారి, ఏర్పాటు చేయమని మోహన్ చెప్పాడు. లంబాడీ గూడెం వేపున్న టెంటుకు వెనుకద్వారం మూసివేయడమే కాకుండా, అటుపక్క నుండి జంతువులు లోపలికి రాకుండా, ఆరడుగుల ఎత్తున ఒంటి ఇసుక గోడొకటి కట్టమని అతడు చెప్పాడు. వెనుక టెంటులోకి ముందు దానిలోంచే పోవాలి. రావాలి. టెంట్లకు మధ్యనున్న స్థలంలో ఒక వేపు బాత్ రూము ఉంటుంది. రెండవవేపు ఖాళీ చోట కూడా రాటలు పాతి, రేకులు కొట్టి లోపలికి రావడానికి వీలులేకుండా అడ్డుకట్టమన్నాడు. రెండు టెంట్లలోను, వాటి మధ్య దారిలోను ఇటుకలు వేసి, సిమెంటు చేయించమన్నాడు.

కంట్రాక్టరు వెళ్ళిపోయిన తరువాత సుబ్రహ్మణ్యేశ్వర రావుతో టెంట్లలోకి కావలసిన సామాన్లు గురించి మోహన్ వివరించాడు. మూడు నర్సారావు పేట మడత మంచాలు, మూడు పడక కుర్చీలు, రెండు మడత టేబిళ్ళు, రెండు పెద్ద బెంచీలు, నాలగు కుర్చీలు, రెండు పెట్రోమాక్సు లైట్లు, మూడు హరికన్ లాంతరులు, రెండు అయిదు సెల్సు బాటరీ లైట్లు, వంట సామాన్లు, స్టౌలు, ఈ విధంగా ఇద్దరు ఆర్కియాలజిస్టులకు, ఒక అతిథికి భోజనానికి, బసకు లోటులేకుండా సామానులు ఖరీదు చేయమని సుబ్రహ్మణ్యేశ్వరరావుకి మూడువేల రూపాయలిచ్చాడు. మోహన్.

అప్పటికి బాగా సాయంకాలమయింది. సుబ్రహ్మణ్యేశ్వరరావుని మోహన్ విడిచి పెట్టలేదు. కొంచెం చీకటి పడుతుంటే ఆర్కలాజికల్ స్టాఫ్ ఉన్న క్వార్టర్సు వేపు వాళ్ళు నడిచారు.

డాక్టర్ సుబ్రహ్మణ్యంగారు వగలంతా ఫీల్డులో పనిచేసి అలసిపోయారు. 1960 సంవత్సరంలో త్రవ్వకాలు పూర్తికావాలి. శిల్పాలు మొదలైన వాటిని పెర్మనెంటు మ్యూజియంకి తరలించి ఆకర్షణీయంగా అమర్చితే చాల పెద్ద బరువు వారి గుండెల మీదనుంచి దిగుతుంది. 1947 నుంచీ ఆయన లోయలో పనిచేస్తున్నా 1954 నుండి చాల పెద్ద బాధ్యతను తలదాల్చి నిర్విరామంగా కృషి చేస్తున్నారు.

డాక్టర్ మోహన్‌కి సుబ్రహ్మణ్యంగారు బాగా తెలుసు. వారిని కలియగానే చాల ఆదరంతో మాట్లాడారు. మోహన్ తవ్వలసిన చోటులో ఏవి లభిస్తాయో చెప్పలేనని, కాని ఏవైనా తప్పకుండా ఆ ప్రాంతంలో లభించవచ్చని అన్నారు. బౌద్ధులు సాధారణంగా పర్వత సమీపాలలో ఎత్తయిన ప్రదేశాలలో ఉండడానికి ఇష్టపడతారు. ప్రస్తుతం కృష్ణ గట్టున చాల పని ఉండడం చేత దీనిని వెనుక బెట్టామని చెప్పారు. విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్నా లోయలోని తవ్వకాలకు తన అండ దండలు తప్పకుండా ఉంటాయని అభయమిచ్చారు. తమతో రాత్రి భోజనంచేసి ఉండిపోమన్నారు. తన స్నేహితులు ఇంకొకరున్నారని మరొకసారి వస్తానని వారి దగ్గిర సెలవు తీసుకొని మోహన్, సుబ్రహ్మణ్యేశ్వరరావు వచ్చేశారు.

ఆ సరికి రాత్రి ఎనిమిదయింది. శరత్కాలపు వెన్నెల లోయను తన వెండి జరీ పోగులతో కప్పేసింది. అక్కడక్కడ దూర దూరంగా దీపాలు – పొయ్యిమంటలు – తూర్పునుంచి వచ్చే గాలిలో చల్లదనం – డాక్టర్ మోహన్ ఆబగా ఆ చక్కదనాన్ని కళ్ళతో జుర్రుకుంటున్నాడు. ఈ లోయలో అతడు ఆరునెలలో లేక సంవత్సరమో శ్రమించి తాను కన్నకలలు సఫలమయి వెళ్ళిపోవాలి.

అతడు నవ్వుతున్నాడు. ఏడాది పాటు తవ్వినా ఈ కొండ సమీపంలో ఏమీ దొరక్కపోతే ఏంచేయడం?

అతని అంతరాత్మ ఏదో ఘోషిస్తున్నది. ఎక్కడ తవ్వినా ఈ లోయలో బంగారమే – శిల్పనిధులే – తాను మాత్రం ఆ అదృష్టానికి నోచుకోలేదా?

మాటలు లేకుండా నడుస్తున్నా వాళ్ళిద్దరూ మాటలు చేరుకున్నారు. కొత్తలో నెల్లూరు రెడ్లు డాక్టర్ సుబ్రహ్మణ్యంగారి పిలుపును ఆమోదించి కాంటీను నడిపారు. ఇప్పుడో అరవ ఘాటలు అక్కడ వెలిసింది.

సుబ్రహ్మణ్యేశ్వరరావు భోజనం చేస్తూ ప్రశ్నించాడు. “మీతో కలిసి పనిచయడానికి రెండో ఆర్కియాలజిస్టు లభించారా?”

“వార్తా పత్రికలలో వేసిన ప్రకటనకు ముగ్గురు మాత్రమే ముందుకొచ్చారు. టెలిగ్రాముల ద్వారా సమ్మతి తెలిపారు. రోజు కొకరు చొప్పున రేపటి నుండి వారిని ఇంటర్వ్యూ చేయాలి”.

“మీరు ఎన్నిక చేసిన పెద్దమనిషి ఆరోగ్యవంతుడై శ్రమకు ఓర్చగలిగే వాడయి ఉండాలి. ఈ లోయలో ఒక సంవత్సరం పాటు ఏ సౌకర్యాలు లేకుండా నెగ్గుకు రావడం చాల కష్టమైన పని.”

“అవును – ఇది చాల ముఖ్యమైన పాయంటే.”

“మీకు, తవ్వకానికి పనిముట్లు, మనుషులు అవసరమనుకుంటాను?”

“అయ్యయ్యో! ఎంత మతి మెరుపు! అన్నీ కావాలి! ఎనమండుగురు కూలీలు, వారిమీద ఒక మేటు – ఇక పనిముట్లంటారా, పిక్కాసు, సలకపారలు, తట్టలు, మూలమట్టాలు, కొలత బద్దలు, రసమట్టం, నూరడుగుల టేపు, తూక్కుగుండు మొదలయినవి ఈ చిన్న యూనిట్ కోసం కొనాలి”.

“పనిముట్లు కొనగలం, కాని, కూలీలు, మేటు దొరకడం చాల కష్టం. రమారమి రెండు వేల అయిదువందల మంది తవ్వకాలలో పనిచేస్తున్నారు. వారికి మంచి కూలులు ముడుతున్నాయి. అన్ని విధాల వారికి సదుపాయాలు కల్పిస్తున్నారు. వారిని స్వంత మనుషుల్లా చూసుకుంటున్నారు. అందుచేత అనుభవమున్న మనుషులు దొరకడం కష్టమే”.

“నేనీ విషయం మా గురువుగారితో ప్రస్తావించి ఉండవలసింది. వారికి చాలమంది తెలుసు. ఏం చేయడం? ప్రతి కూలీకి ప్రభుత్వం వారిచ్చే దానికి అదనంగా అయిదు రూపాయలు, మేటుకి పదిరూపాయలు ఇద్దాం.”

“నేను ప్రయత్నం చేస్తాను కాని, నిర్ధారించి చెప్పలేను.”

“లంబాడీ గూడెంలో వాళ్ళు మీకు తెలుసా? సుంకశల తండా ఒకటి ఉందట. దానికి నాయకుడు కాలా అతని చెల్లెలు, ఆమె భర్త హైదరాబాదులో మాయింటికి దగ్గరలోనే ఉంటున్నారు. ఆ అమ్మాయి మాయింట పని చేస్తున్నది. వాళ్ళన్నతో చెప్తే అన్ని విధాల సహాయం చేస్తాడని చెప్పింది.”

“మీ టెంట్లకి నీళ్ళు తీసుకురావడం, నేల చిమ్మడం, దీపాలు తుడవడం వంటి పనులు ఆడవాళ్ళు చేస్తారేమో! తవ్వకాలలో పనిచేయడానికి అనుభవమున్న వాళ్ళు కావాలి.”

“మన కాంట్రాక్టరుగారితో చెప్పండి. వాళ్ళందరికీ సోమవారం నాడు సెలవు. ఆ రోజున పనిచేస్తే రెండు రెట్లు కూలి ఇస్తామని చెప్పండి. ఇప్పటివరకూ అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. మనుషులు లేకపోతే పనేం సాగుతుంది? పైనుంచి ఎవరినేనా తేవచ్చు. అనుభవమున్న వాళ్ళు దొరికితే పనులు సులువవుతాయి.”

సుబ్రహ్మణ్యేశ్వర రావు మరేం జవాబు చెప్పలేదు. భోజనాలు పూర్తికాగానే ఇద్దరూ పైకి వచ్చారు. కంట్రాక్టరుగారి గెస్టు రూములో ఇద్దరూ పడుక్కున్నారు.

ప్రొద్దున్నే లేచి బస్సు స్టాండుకి నడిచారు.

“మీరెప్పుడు వచ్చి పని ప్రారంభిస్తారు?” సుబ్రహ్మణ్యేశ్వరరావు ప్రశ్నించాడు.

“దీపావళి వెళ్ళిన రెండోరోజున నాతో వనిచేయవలసిన ఆర్కియాలజిస్టుతో కలిసి వస్తాను. ఎవరిదేనా జీపు తీసుకొని వస్తాం. వచ్చిన నాలుగు రోజులలో పని ప్రారంభిస్తాం. మనకి పదిహేను రోజులు వ్యవధి ఉంది. ఆ సరికి అన్ని ఏర్పాటులు పూర్తిచేసే భారం మీ మీద ఉంచుతున్నాను.”

సుబ్రహ్మణ్యేశ్వరరావు చిన్న నవ్వు పెదవుల మీద కనిపించగా తల ఊపాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here