శ్రీపర్వతం-12

0
7

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 12వ భాగం. [/box]

21

[dropcap]సం[/dropcap]క్రాంతి వెళ్లి నాగులు రోజులే అయింది. పండుగ ముందు, అటు తరువాత, పనులు మందకొడిగా ఉన్నాయి. లోయలో చలిగానే ఉంది. తూర్పున ఫిరంగి మోటునుంచి చల్లగాలులు అప్పుడప్పుడు వీస్తున్నాయి. మధ్యాహ్నపుటెండ ఏలేశ్వరం కొండల నుంచి లోయలోకి పడుతున్నాది. వేగంగా సూర్యుడస్తమించి, చీకటి లోయను ఆక్రమించుకుంటున్నది.

మోహన్ ప్రతి సోమవారం ఉదయం కృష్ణకు పోయి బట్టలుతుక్కొని, స్నానం చేసి పదికి ముందుగా టెంట్లను చేరుకుంటాడు. మరొక్క అరగంటలో కొరియర్ అబ్బాయి హైదరాబాదు నుంచి ఉత్తరాలు, పళ్లు, కూరలు, బ్రెడ్ మొదలైనవి తెస్తాడు. ఈసారి అతడు మోహన్ తల్లి గారు సంక్రాంతి పండుగకు చేసిన లడ్డూలు, జంతికెలు మొదలైనవి తెచ్చాడు. కొరియర్ అబ్బాయి వచ్చిన అరగంటకు సుబ్రహ్మణ్యేశ్వరరావు మాచర్ల నుంచి సున్ని ఉండలు, అరిసెలు, చక్కిలాలు మొదలైనవి అత్తవారింటి నుంచి తెచ్చాడు. అత్తవారు పండుగకు పిలిచి, కాసెత్తు ఉంగరం, బట్టలిచ్చారు. అతని పనే బాగుంది.

పండుగ మూడు రోజులు మోహన్ లోయనంతటిని చాలాసార్లు చుట్టివచ్చాడు. శశికళ టెంటులోనే ఉండి నోట్సు వ్రాసుకోవడం, పుస్తకాలు చదువుకోవడం చేసింది.

పండుగ వెళ్లింది – తవ్వకాల ఫలితాలు మాత్రం కనుచూపు మేరలో లేవు.

ఆ సోమవారం నాడు భోజనాలయే సరికి మధ్యాహ్నం ఒంటి గంటన్నర అయింది. అన్నిటికన్న హైదరాబాదు నుంచి తెప్పించిన కిళ్లీలు – అరటి పాతలలో పెట్టి ఆరు కిళ్ళీలు తెచ్చాడు కొరియర్ అబ్బాయి. అడవి మధ్య ఉన్నా వేటికీ లోపం లేకుండా జీవితం గడుస్తున్నందుకు వాళ్ళు చాల సంతోషంగా ఉన్నారు.

భోజనాల తరువాత ఒక గంటసేపు వాళ్లు విశ్రమించి, తిరిగి రావడానికి బయలుదేరారు. ఏవో మాటలాడుకుంటూ సర్వదేవాధివాసం చేరుకున్నారు. అక్కడ కృష్ణకు అభిముఖంగా కూర్చొని, ఎండ కవోష్ణంగా హాయినిస్తుంటే మాట్లాడుకున్నారు.

శశికళ పంజాబీ దుస్తులు వేసుకుంది. పైన కాశ్మీరపు శాలువ కప్పుకుంది. మోహన్ నిండు చేతుల చొక్కా తొడుక్కొని స్వెట్టరు వేసుకున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వరరావు మాత్రం అరచేతుల తెల్ల చొక్కా తొడుక్కున్నాడు. చలికి అతను ఉన్ని బట్టలు వేసుకోలేదు.

ఉన్నట్లుండి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఒక ప్రశ్న వేశాడు.

“మీకు మంత్రాల మీద, తంత్రాల మీద నమ్మకముందా?”

“నాకీ విషయం అంతగా తెలియదు” అంది శశికళ.

“మంత్రాల మీద నాకు నమ్మకముందో లేదో చెప్పమంటారా? లేకపోతే మంత్రాల గురించి, వాటి శక్తి గురించి చెప్పమంటారా?” ప్రశ్నించాడు మోహన్.

“అదే, మంత్రాల శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకోవాలనే.”

“అయితే వినండి!”

మోహన్ చెప్పడం మొదలుపెట్టాడు.

“వంగ దేశంలో, బర్ద్వాన్ జిల్లాలో, దీనినే బర్దమాన్ జిల్లా అని కూడా అంటారు. ఒక గ్రామంలో 1897 సంవత్సరం, జనవరి 6వ తారీకున బినయతోష్ భట్టాచార్య జన్మించారు. వీరి తండ్రిగారు మహామహోపాధ్యాయ హరప్రసాద్ శాస్త్రిగారు, హేమంత కుమారీ దేవీ వీరి తల్లి. వీరు స్కాటిష్ చర్చి కాలేజి, కలకత్తాలో బి.ఏ పాసయ్యారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి 1919లో ఎమ్.ఏ. పాసయి బంగారు పతకం పొందారు. వీరు 1925లో డక్కా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటు పట్టం పొందారు. ఆయన బరోడాలో సంస్కృత కళాశాలలో ప్రొఫెసరుగా పనిచేశారు. చాలా సంస్కృత గ్రంథాలను ప్రచరించారు. ఇండాలజీ మీద 200 వరకు వ్యాసాలు వ్రాశారు. చాల సంస్థలకు వీరు జీవితపర్యంతం సభ్యులుగా ఉన్నారు. రాజ్యరత్న బిరుదుని, బంగారు పతకాన్నీ, జ్ఞానజ్యోతి బిరుదుని, రజత పతకాన్ని అందుకున్నారు. బౌద్ధమతంలో దేవతా విగ్రహాల గురించి, బౌద్ధుల రహస్య పూజా విధానం గురించి వీరు గ్రంథాలు రచించారు. సాధనమాల సిరీస్‌లో తాంత్రిక దేవతల ఆరాధన గురించి ప్రచురించారు.

ప్రకృతిలో గల శక్తులతో మానవజాతికి సేవ చేయాలని వీరు సంకల్పించారు. రత్నాలలోను, అయస్కాంత పదార్థాలలోను గల రోగనివారక శక్తిపై చాల పరిశోధనలు జరిపారు. కాస్మిక్ కిరణాల వైద్యం, రత్నవైద్యం, అయస్కాంత సాయంతో భూగర్భ జలాలను కనుగొనడం వీరికి బాగా తెలుసు. బరోడా నుండి 1952లో వారు రిటైరయి నైహాటీలో స్వగృహంలో ఉంటూ మానవ సేవ చేస్తూ కాలం గడుపుతున్నారు.

వీరు మంత్రాలపై చాలా పరిశోధనలు చేశారు.

ఈ మంత్రాలు వైదిక మంత్రాలు కావు.

వేద సమ్మతములు కానట్టి మంత్రాలు. తంత్రాలకు సంబంధించినవి.

ఒక పద్ధతిలో సూత్రీకరించిన అక్షరాలు, మాటలు, వాక్యాలు అర్థం కలిగినా, అర్థం లేకపోయినా అవి నిజానికి శూన్య సంబంధమైనవి. ఇవి శూన్యము యొక్క సంక్షిప్త రూపాలు. ఇవి అధిక స్థితిలో నున్న కాస్మిక్ శక్తితో పులకించినవి. ఈ అక్షరాలు, ఈ మాటలు, ఈ వాక్యాలు వీటిన్నటికి ఒక నియమితమై కంపనశక్తి ఉంది. ఈ ప్రకంపనాలను మంచికి గాని చెడుకు గాని ఉపయోగించవచ్చు.

కంటికగుపించే ప్రపంచములో మనమందరం ఉన్నట్లు, అదృశ్యమైన లోకంలో దేవతలుంటారు. ఈ దేవతలందరూ శూన్యానికి సంబంధించినవారే. ప్రతి దేవతకు ఒకే ఒక ప్రకంపన సంఖ్య ఉంటుంది.

దేవతను ఉద్దేశించి చదివే మంత్రం యొక్క ప్రకంపనలు, ఆ మంత్రం యొక్క అదిష్ఠాన దేవత యొక్క ప్రకంపనలతో సమానంగా ఉన్నప్పుడు మంత్రాలలోని బీజాక్షరాలు దేవతలను ఆకర్షించి మనోనేత్రానికి కనిపించినట్లు చేస్తాయి. సాధనలో చివరి దశకు చేరుకున్నప్పుడు, దేవత మామూలుగా దర్శనమిస్తుంది. దీనిని దేవతాదర్శనమంటారు. అపుడు దేవతకు సాధకునికి భేదముండదు. ఇద్దరూ ఒకటిగానే భావింపబడతారు. తాను ప్రార్థించిన దేవతకున్న అద్భుతశక్తులన్నీ సాధకునికి లభిస్తాయి. మంత్రాలలో గల అక్షరాలపై మనసు నిలిపి విడువకుండా మంత్రాన్ని జపిస్తూ ఉంటే మంత్రం చాలా శక్తివంతమవుతుంది. మంత్రాలను తిరిగి తిరిగి చదువుతుంటే, అవి ప్రకంపనలను విడిచి పెడతాయి. ఈ ప్రకంపనలు దేవతలను చేరుతాయి. అవి చాల శక్తివంతములైనపుడు, దేవతను సాధకునివైపు ఆకర్షిస్తాయి. కాస్మిక్ జగత్తులో నామానికి రూపానికి బేధం లేదు. నామం ఎప్పుడు స్మరించినా, రూపానికి అది తగులుతుంది. దేవత పేరు గల మంత్రాలను ఉచ్చరిస్తే, అదృశ్య లోకంలో గల దేవతను అవి చేరుతాయి. మంత్రాన్ని మాటిమాటికి ఉచ్చరించడం వలనదేవత ఆకర్షింపబడి సాధకునికి ప్రత్యక్షమవుతుంది.

ఈ సందర్భంలో భట్టాచార్యగారు తన అనుభవాన్ని ఉదహరించారు.

ఆయన తంత్రాల గురించి తీవ్రమైన పరిశోధన చేయక మునుపు, కొన్ని మంత్రాలు ఎంత సార్థకమైనవో తెలుసుకోదలిచారు.

ముందుగా ఆయన తారా మంత్రం యొక్క శక్తిని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఈ మంత్రాన్ని పఠిస్తే విజయం తప్పకుండా లభిస్తుంది. మంత్రం ఈ విధంగా ఉంటుంది.

ఓం తారే తుత్తారేస్వాహా.

ప్రతిరాత్రి అతను మనసును కేంద్రీకరించి, చాల భక్తితో, మంత్రాన్ని తిరిగి తిరిగి పఠించేవారు. ఏదేనా నూతనమైనట్టి అనుభవం కలులుగుందేమో తెలుసుకోదలచారు. ఒక పదిహేను రోజులు, తీరిక దొరికనప్పుడు, ఆయన చాల తీవ్రంగా మంత్రజపం చేశారు. మంత్రజపం చేసినప్పుడు ఆయన కళ్ళు మూసుకున్నారు. మనస్సు మరొక్కవైపు తిరగకుండా, అద్భుతమైన దేవతా దర్శనం తప్పిపోకుండా ఆయన కళ్ళు మూసుకున్నారు. ఒక పక్షం దినాలు ఈ విధంగా గడిచిన తరువాత, ఒక రోజు అకస్మాత్తుగా ఆయన మూసిన కళ్ళు ముందు తీక్షణమైన తెల్లటి వెలుగు, చాలా అద్భుతమైనది, మెరిసింది. ఆ కాంతిలో ఆయనకు స్పష్టంగా ఒక దేవత యొక్క రూపం కనిపించింది. ఆమె ఆకుపచ్చని మరకత కాంతిలో ఉంది. సర్వాంగ సౌష్టంగా దివ్యసుందరరూపంతో ఆమె సాక్షాత్కరించింది. మాటలతో ఆమెను వర్ణించడానికి సాధ్యంకాదు. ఆ దేవత రెండు పద్మాల మీద లలితాసనంలో ఆసీనమై ఉంది. ఆమె ఎడమ చేతిలో ఏవో ఆకులున్నాయి. కుడిచేయి వరదముద్రలో ఉంది. అరచేతిలో వజ్రమొకటి అత్యధికమైన కాంతితో ప్రకాశిస్తున్నది. ఆ దేవత ఆయన కనుల ముందు కొద్ది క్షణాలు కనిపించి, తెల్లటి కాంతిలోకి అదృశ్యమైంది. ఆయనకు మొదటి అనుభవంతో సంతృప్తి కలిగింది. అక్కడితో మంత్రజపం ఆపివేశారు. ఇప్పటికీ కూడా కష్టాలు ఎదురైనప్పుడు, ఆయన మంత్రాన్ని జపిస్తారు. కాని, దేవత మాత్రం కనపించడంలేదు.

దేవత తార చాలా దయగలది.

తరువాత ఆయన ఉగ్రదేవత యొక్క మంత్రమొకటి జపించడానికి పూనుకున్నాను. ఆ దేవత పేరు ఉగ్రతార, ఆమె మంత్రం – హ్రీం ట్రిం హుం ఫట్.

ఈ మంత్రాన్ని ఆయన తీరిక దొరికనప్పుడు తీవ్రంగా జపించారు. ఆఫీసుకు వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు, ఆఫీసులో ఖాళీగా ఉన్నప్పుడు, ఇంటి దగ్గర ఉదయం వేళ, సాయంకాలం, రాత్రి ఆయన ఉగ్రతార యొక్క మంత్రాన్ని జపించారు. ఒక వారం రోజుల తరువాత, రాత్రి 9 గంటలవేళ ఆయన మూసిన కన్నుల ఎదుట వింతయైన నీలపు కాంతి కనిపించింది. అది ఆయన ‘మనో-ఆకాశా’న్ని పూర్తిగా కప్పేసింది. ఆ కాంతి యొక్క లోతుల నుండి భయంకరమైన దేవత, ఉగ్రతార పైకి వచ్చింది. ఆమె గాడమైన కాటుక రంగులో ఉంది. ఆమె పొడువుగా ఉంది. శరీర అవయవాలు దృఢంగా ఉన్నాయి. ఆమె పూర్తిగా దిగంబరంగా ఉంది. భూమిపై పాదాలు మోపి ఆమె నిలిచింది. ఆమె శిరస్సు గది పైకప్పును తాకుతున్నది. ఆమె కేశాలు చెదిరిపోయాయి. ఆ జుత్తు మేఘంవలె గది పైకప్పును, నాలుగు పక్కలను కప్పివేసింది. ఆమె ముఖం చూడడానికి చాల భయంకరంగా ఉంది. ఆమె క్రోధతామ్రాయతాక్షి. ఆమె కోరలు పైకి వచ్చాయి. ఆమె తన చేతులతో కత్రి లేక ఖట్వాంగము (కత్తి), నెత్తుటితో నిండిన కపాలం పట్టుకుంది. ఆమె వక్షం కపాల మాలిక చేత అలంకృతమై ఉంది. కపాలాలు ఒకదానికొకటి కొట్టుకొని కర్యశంగా భయంకొలిపే ధ్వని వెలువడుతున్నది. ఆమెను చూడగానే భయంతో ఆయన విరుచుకుపడ్డారు. ఎప్పుడు మంత్రోచ్చారణ మానివేశారో ఆయనకే తెలియదు. ఈ దేవతా దర్శనం కేవలం అరనిమిషం మాత్రమే కలిగింది. కాని ఈ కొద్ది కాలం యుగయుగాలుగా ఆయనకి అనిపించింది. ఆయన మృత్యువు సమీపించిందని భావించారు. ఎప్పుడయితే ఆయన మంత్రోచ్చారణ మానివేశారో దేవత క్రమంగా గాలిలోకి అదృశ్యమైంది. ఆయన భయ విముక్తులై ధీర్ఘంగా నిశ్వసించారు. అటువంటి దేవతలను, జీవితంలో మరెప్పుడు కదపకూడదని ఆయన నిశ్చయించారు.

భట్టాచార్యులు ఈ విషయాలను చాలా రహస్యంగా ఉంచారు. ఎవరికీ చెప్పలేదు. ఈ విలక్షణమైన అనుభవాల గురించి ఎక్కడా పుస్తకంలో కాని, వ్యాసంలో కాని ఆయన ప్రస్తావించలేదు. ఎవరైనా ఈ సాధనలు ఆచరిస్తే ఆయన అనుభవాలు వారికి సహాయకారులౌతాయని ఆయన భావించారు. భయంకరమైన స్త్రీ దేవతలను సులభంగా దర్శించవచ్చునని, దయాళువులైన పురుషదేవతలు దర్శనమివ్వడానికి చాల హెచ్చుకాలం తీసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. అవలోకితేశ్వరుని సాక్షాత్కారం చేసుకోవడానికి ఆయన ‘ఓం మణి పద్మే హూం’ అన్న ప్రఖ్యాత మంత్రాన్ని జపించారు. కాని, ఆయన ప్రయత్నాలన్నీ వమ్మయాయి.

మంత్రాలంటే బీజాక్షరసముదాయాలు. రహస్యమైన తాంత్రిక పూజావిధానాలకు, వజ్రయానానికి ఇవి వెన్నెముకవంటివి. ఈ మంత్రాలు చాలా రకాలు – బీజ హృదయాలు, ఉప హృదయాలు, పూజామంత్రాలు, అర్ఘ్యమంత్రాలు, పుష్పమంత్రాలు, దీపమంత్రాలు, ధూపమంత్రాలు, నైవేద్య మంత్రాలు, నేత్రమంత్రాలు, శిఖామంత్రాలు, అస్త్రమంత్రాలు, రక్షామంత్రాలు. ఈ విధంగా ఎన్నో ఈ మంత్రాలు అర్థం లేని అక్షరాల మాలలు ఒకొక్కప్పుడు, మనకు తెలియని భాష యొక్క ప్రభావానికి ఇవి లోనయినట్లనిపిస్తుంది. వేదంలో వచ్చే దేవతాస్తుతులను మంత్రాలంటారు. ఈ మంత్రాలకు అర్థమంటూ ఉంటుంది. తాంత్రిక మంత్రాలకు ఇది లేదు. వజ్రయాన తాంత్రికులు తమ మంత్రాలు బుద్ధుడి నుంచి వచ్చినవని తలుస్తారు. వజ్రయానంలో వచ్చే మంత్రాలు ధారుణుల నుండి వచ్చినవని అంటారు. ధారణులు బౌద్ధమతంలో పురాతన కాలం నుండి ఉండేవని, అంతగా బౌద్ధమత తత్వం తెలియని ఉపాసకుల కొరకు ప్రవేశపెట్టబడ్డాయని విశ్వసిస్తారు. ఈ ఉపాసకులు ఈ లోకంలో తమకున్న ఆస్తిపాస్తులు, ఐశ్వర్యం మీద హెచ్చు శ్రద్ధ చూపించవలసినవాళ్లు. వాళ్లకి నిర్వాణం మీద ధ్యానం లేదు. ఇటువంటి ఉపాసకులు, బౌద్ధమతానికి కొత్తగా పరిచయమైనవాళ్ళు. కొన్ని సూత్రాలు చదవవలసి ఉంది. వాళ్ళకు సులువుగా ఉండడం కోసం ఈ సూత్రాలను సంగ్రహంగా చేసి ధారుణులుగా రూపొందించారు. ఉపాసకులను ఈ ధారుణులను కంఠస్థం చేయమన్నారు. ఈ విధంగా సూత్రాలు ధారణులుగా మారి, ధారణులు కుదింపబడి మంత్రాలుగా ఉద్భవించాయి.

ఈ సందర్భంలో ఒక ఉదాహరణ చెప్తాను.

మహాయాన గ్రంథమైన అష్టసాహస్రిక ప్రజ్ఞాపారమిత ఎనిమిదివేల శ్లోకాలు కలది. బాగా విద్యావంతుడైన బౌద్ధుడు కూడా దీనిని చదివి అర్థం చేసుకోవడం కష్టం. అటువంటిది అల్ప విద్యావంతులు చదివి అర్థం చేసుకోలేరు. దీనిని నూరుశ్లోకాలు కల ‘ప్రజ్ఞాపారమిత’ గ్రంథంగా తీర్చారు. ఈ శ్లోకాలను ఇంకా తగ్గించి, కొద్ది శ్లోకాలతో ‘ప్రజ్ఞాపారమితా హృదయ సూత్ర’ గ్రంథంగా రూపొందించారు. ఈ గ్రంథాన్ని ఇంకా కుదించి ‘ప్రజ్ఞాపారమితాధారణి’గా తీర్చారు. ఈ ఆవిర్భావశృంఖలలో తరువాత చేసినది ‘ప్రజ్ఞాపారమితా మంత్రము’. ఈ మంత్రానికి బీజాక్షరం ‘ప్రం’. దీనిని బట్టి శూన్యం ప్రజ్ఞాపారమిత దేవతగా రూపాంతరాన్ని పొందుతుంది. ఈ విధంగా తాంత్రిక మంత్రం వివిధ దశలలో రూపాన్ని ధరిస్తుంది. ఇవన్నీ బౌద్ధంలోని తాంత్రిక మంత్రాలు. మనం హిందూతంత్రాల వేపు దృష్టి మరలిస్తే, బౌద్ధతాంత్రిక మంత్రాలు వాటిలో చోటు చేసుకున్నట్లు స్పష్టమవుతుంది. హిందూ తంత్రాలు వజ్రయానం తరువాత వచ్చాయి. బౌద్ధతంత్రాలలోని మంత్రాలు కొన్ని యథాతథంగా వీటిలో ఉపయోగించబడ్డాయి.

బౌద్ధంలోని తంత్రాలు తొలి దశలో సంగీతులుగా ప్రవేశపెట్టబడ్డాయి. వీటిలో బుద్ధుడు ఒక విశ్వాసుల సమావేశంలో ఉన్నట్లు, అక్కడ అతడు తంత్రాలను సమర్పించినట్లు చెప్తారు. తంత్రాలనే కాక మంత్రాలను, రహస్య పూజావిధానాలను కూడా తెలియజేశాడు. అంతకు పూర్వం ఈ తంత్రాల గురించి ఎందుకు తన వారికి తెలియజేయలేదో వివరించాడు. ప్రజలు కొత్త తంత్రాన్ని స్వీకరించే స్థితిలో లేరని అతను చెప్పాడు. అందుచేత బుద్ధుడే ఈ తంత్రాలకు, మంత్రాలకు, రహస్య పూజావిధానాలకు, వాటి ఆచరణకు మూలపురుషుడని నమ్మవలసి వస్తుంది. ప్రజాపారమితా మంత్రాన్ని బుద్ధుడే స్వయంగా చెప్పాడని అంటారు. బుద్ధుడే స్వయంగా ముద్రలు, మంత్రాలు, మండలాలు మొదలైన వాటి గురించి ప్రజలకు ఉపదేశించాడని, వాటి ఆచరణ వలన భోగభాగ్యాలు లభిస్తాయని ఆనాటి మేధావులు అభిప్రాయపడ్డారు. ఈ సాక్ష్యాలను బట్టి, బుద్ధుడు తన మతంలోకి రహస్య పూజావిధానాలను ప్రవేశ పెట్టాడని ఒక నిశ్చయానికి రావచ్చు. ఈ పద్ధతులు క్రమంగా పలుకరాల విధానాల ప్రభావం వలన సర్వసంపూర్ణమైన రహస్య సాధనా పద్ధతిగా, వజ్రయానంగా క్రమంగా రూపొందాయి.

వజ్రయాన తాంత్రికులు మంత్రాలకు మరో ప్రభావముందని గుడ్డిగా నమ్ముతారు.

“నియమాలను అనుసరించి మంత్ర ప్రయోగం జరిగితే, అవి ప్రపంచంలో సాధించనివేమున్నాయి?” అని ఒకచోట ఉంది.

“మంత్రాలను తిరిగి తిరిగి జపించడం వలన మహాశక్తి జనిస్తుంది. ఈ శక్తిని చూసి ప్రపంచమంతా దిగ్భ్రాంతి చెందుతుంది” అని మరొకచోట ఉంది.

మంత్రజపం వలన బుద్ధత్వం ప్రాప్తిస్తుందని నమ్మకముంది. లోకనాథుడి మంత్రం జపిస్తే పంచమహాపాతకాలు నశిస్తాయి.

అవలోకితేశ్వరుడి ధారణిని జపిస్తే గర్దభం కూడా 300 శ్లోకాలను జ్ఞాపకముంచుకుంటుంది.

నియమాలను అనుసరించి జపిస్తేనే మంత్రాలు ఫలితాలనిస్తాయి. అందుచేతనే సాధారణ మానవులు మంత్రజపం చేయలేరు.

మంత్రాలను చాల జాగ్రత్తగా ఉచ్చరించాలి. తంత్రాలు సరియైన మంత్ర జపం జరగడానికి మార్గాన్ని సూచిస్తాయి.

మంత్రాలను చాల తొందరగా గాని, చాల మెల్లగా గాని చదవరాదు. మంత్ర జపం చేస్తున్నప్పుడు మనకు నిర్మలంగా ఉండాలి. చెడు తలపులుండరాదు. అలసట పొందనంత వరకు మంత్రజపం చేయాలి.

మంత్రాలు చాల పవిత్రమైనవని వజ్రయాన తాంత్రికులు భావిస్తారు. వేదమంత్రాలను కొన్ని పద్ధతుల వలన మార్పులేకుండా కాపాడినట్లే, తాంత్రికులు కూడా తమ మంత్రాలను నిర్దుష్టంగా ఉండడానికి చాల పద్ధతులను అవలంభించారు. ఈ మంత్రాలు సాధారణంగా వచనంలో ఉంటాయి. వాటి అర్థం మామూలుగా బోధవడదు. కొన్ని మంత్రాలను జ్ఞాపకంగా ఉంచుకోవడానికి శ్లోకాలలో చెప్పారు. ఈ శ్లోకాలు చాలా వింతగా ఉంటాయి. మామూలు పాఠకులకు ఎటువంటి అర్థం తెలియదు.

ఒక ఉదాహరణ వినండి.

అదౌ చక్రధర స్తతః పిచుయుగాత్ ప్రజాన్వితో వర్ధని

తస్మాచ్చ జ్వలయుగ్మమస్య చ ప రే మేధా పరే వర్ధని

ఏతస్మాచ్చరమం ధిరిద్వయమతో బుద్ధిస్తథా వర్ధని

స్వాహంతః కథితః స ఏవ సుగతైర్మంత్రః కవిత్వాదిభిః

ఈ శ్లోకానికి తాత్పర్యం ఈ విధంగా ఉంటుంది.

ముందుగా చక్రధరుడు అతని వెనుక రెండు పిచులు, ఒక వర్ధని వీటిని కలుపుతూ ప్రజ్ఞా తరువాత రెండు జ్వాలలు, వాటి తరువాత వర్ధని, వర్ధనికి ముందు మేధ చివరను రెండు ధిరిలు బుద్ధి, వర్ధని అన్నవి స్వాహాతో ముగుస్తాయి. ఈ మంత్రం కవి యొక్క మేధాశక్తిని పెంపొందిస్తుంది.

శ్లోకం చదివినప్పుడు ఏ విధమైన అర్థమూ గోచరించదు. ఇది వజ్రవీణా సరస్వతి యొక్క మంత్రమని తెలుసుకున్న తరువాత పై శ్లోకానికి రూపం ప్రసాదించవచ్చు.

ఓం పిచు పిచు ప్రజ్ఞావర్థని జ్వలజ్వల మేధావర్థని ధిరిధిరి బుద్ధివర్థని ‘స్వాహా’!

మంత్రం ఏవిధంగాను చెడిపోకుండా అక్షరాలను వేరు వేరుగా చేసి, వాటిని ప్రతీకలుగా చెప్పడం మరొక పద్దతి.

ఈ మంత్రం సరస్వతీ దేవికి చెందినది. ఈ క్రింది శ్లోకంలో చెప్పబడింది.

సప్తమస్య ద్వితీయస్థమష్టమన్య చతుర్థకమ్

ప్రథమస్య చతుర్ధేన భూషితం తత్ సబిందుకం.

అది ఏడవ దానియందు రెండవది, ఎనిమిదవ దానియందు నాలుగవది, మొదటి దాని యొక్క నాలుగవదానిచే అనుగమించి, బిందువుచే భూషితమైనది.

ఈ తాత్పర్యానికి వివరణ – వర్ణసమామ్నాయానికి చెందిన ఏడవ తరగతి అంతస్థుములలో రెండవది ర (యరలవ లలో రెండవది). ఎనిమిదివ తరగతి ఊష్మములలో నాలుగవది-హ-(శషనహలలో నాలుగవది). మొదటి అచ్చులలో లేక స్వరములలో నాలుగవది ఈ (అఆఇఈ లలో ‘ఈ’) కూడ బిందువుచే అలంకరింబడినది అనుస్వారము కలిగినది. ఈ ప్రకారము సిద్ధించిన బీజమంత్రము.

ఇది సరస్వతీ బీజము.

మోహన్ చెప్పడం ఆపాడు – క్షణం పాటు మౌనంగా కూర్చొని అన్నాడు.

“తంత్రాలకు మంత్రాలు మూలాధారాలు. తంత్రాల గురించి చెప్పేటప్పుడు మంత్రాల వివరణలు చెప్పవలసి ఉంటుంది. ప్రస్తుతానికి మీకు మంత్రాల గురించి పరిచయ వాక్యాలు మాత్రమే చెప్పాను”.

తరువాత వాళ్లు కృష్ణలోకి దిగి కాళ్ళు కడుక్కొని పడమట పసుపు కుంకుమలు మేళవించగా టెంట్లవేపు మరలిపోయారు.

22

సైటులో మూడుగంటల వరకు మోహన్, శశికళ పనిచేశారు. గురువారం నాడు మధ్యాహ్నం మ్యూజియంకి వెళ్లి స్కాలర్లు చెప్పిన విషయాలు వ్రాసుకోవడం పరిపాటయింది. సుబ్రహ్మణ్యేశ్వరరావు రావడంతో ముగ్గురూ కలిసి మ్యూజియంకి బయలుదేరారు.

చలికాలం వెళ్లిపోయింది. మధ్యాహ్నపు టెండలో చిన్న వేడి కనిపిస్తుంది. కాని, గాలి మాత్రం చల్లగానే ఉంది. ఆకురాలుకాలం ఎక్కడుందో కాని, వసంతం మాత్రం రావడానికి తొందర పడుతోంది.

మ్యూజియంలో క్యూరేటరు ప్రసాద్ ఒక్కరే ఉన్నారు. ఆయన ఎటెండెంట్లు ఎక్కడికో వెళ్లారు. కుశల ప్రశ్నలయిన తరువాత, అందరూ సావకాశంగా కూర్చున్నారు.

“కిందటసారి, రామచంద్రగారు జరిపిన తవ్వకాలలో వెలువడిన వాటి గురించి మీరు చెప్పారు. 1954 నుండి మూడోసారి తవ్వకాలు జరుగుతున్నాయి. అవి కూడా పూర్తి కావచ్చాయి. మీరు ఈ తవ్వకాల గురించి వివరంగా చెప్పవలసిందని కోరుతున్నాను” అన్నాడు మోహన్.

ప్రసాద్ తను వ్రాసిన నోట్సు ఒకసారి తిరగేశారు. తరువాత చెప్పడం మొదలు పెట్టారు.

“మూడవసారి నాగార్జునకొండ లోయలో 1954వ సంవత్సరం అక్టోబరు నెల నుండి తవ్వకాలు ప్రారంభమయాయి. డాక్టర్ రావిప్రోలు సుబ్రహ్మణ్యంగారి పర్యవేక్షణలో జరుగుతున్నాయి.

తవ్వకాలు సాధారణంగా, సంవత్సరంలో, మూడు లేక నాలుగు నెలల్లో మాత్రమే జరుగుతాయి. దీనిని ఒక సీజనంటారని మీకందరికి తెలుసు. ఇది సాంప్రదాయం ప్రకారం చేసిన తవ్వకాలకు చెందుతుంది. మేమీ సాంప్రదాయానికి భిన్నంగా, నిర్విరామంగా 1954 నుండి నేటి వరకు తవ్వకాలు సాగిస్తూనే ఉన్నాం. ఆఖరిదశకు చేరుకుంటున్నాం. ఇప్పటికి ఈ లోయగురించి సంపూర్ణమైన అవగాహనకు వచ్చాం.”

“తవ్వకాలు జరిగిన వెంటనే, బయటపడిన వస్తువుల గురించి మీరొక నిర్ణయానికి వస్తారు కాని, తవ్వకాలు పూర్తి అవుతుంటే ఆ నిర్ణయం మారిపోతుంది. కాబట్టి మీరు, క్రమంగా త్రవ్వకాలు జరిపి, దశలవారీగా ఎటువంటి నిర్ణయాలకు వచ్చారో వివరంగా చెప్పవలసింది” అంది శశికళ.

“అంటే ప్రతి సంవత్సరం జరిగిన తవ్వకాల గురించి వివరంగా చెప్పమంటారు. ఆ విధంగానే చేస్తాను” అన్నారు ప్రసాద్.

శశికళ నోట్సు వ్రాసుకోడానికి సిద్ధమయింది.

ప్రసాద్ చెప్పారు.

1954-55వ సంవత్సరంలో ఏడు ముఖ్యమైన సైట్లలో తవ్వకాలు జరిగాయి. వాటిలో కట్టడాల శిథిలాలు బయటపడ్డాయి. స్తూపాలు, విహారాలు, ఒక సమావేశ మండపం, నాలుగు పక్కల మూసిన స్నానశాల, రెండు దేవాలయాలు లభించాయి. ఈ రెండు దేవాలయాలలోను ఒకటి హారీతిది.

సైటు-3లో ఒక విహారం బయటపడింది. దానికి పెద్ద పెరడుంది. అక్కడ ఒక కుండ పెంకు పెద్దది దొరికింది. దాని మీద ‘నాకతర’ అన్న పేరు చెక్కబడింది. ఈ విహారం పేరు ‘నాకతర’ అన్నమాట. అంటే స్వర్గం కన్న గొప్పదని అర్థం. ఈ స్థలంలోనే, చతురస్రాకారంలో ఉన్న స్తంభమొకటి బయట పడింది. ఈ స్తంభంలో మూడు వంతులు గోడలో కలిసిపోయాయి.

ఒక వంతే బయటికి కనిపిస్తుంది. ఆ స్తంభం మీద ఒక శాసనముంది. ఇక్ష్వాకు రాజు వీరపురుషదత్తుడు వదనపాలనా సంవత్సరంలో ఈ శాసనం చెక్కబడింది. బౌద్ధులకు ఇతర మతస్తులకు చేసిన దానం గురించి దీనిలో ఉంది.

సైటు-4లో కొన్ని కట్టడాలు బయట పడ్డాయి. ఒక విహారం, ఒక స్తూపం, రెండు ప్రార్థనాస్తూపాలు ఈ సముదాయం లోనివి. విహారానికి ఇరుపక్కలా, నాలుగు గదులు ఒక వేపు, మరొక నాలుగు గదులు రెండవ వేపు ఉన్నవి. విహరానికి పడమట వేపు స్తూపముంది. తూర్పు వేపున రెండు ప్రార్ధనా స్తూపాలున్నాయి. స్తూపాన్ని చెక్కడపు రాళ్లతో కట్టారు. విహరంలో విరిగిన బుద్ధ విగ్రహాలు కొన్ని లభించాయి. కొన్ని జాడీలు, బహుశా మూత్ర విసర్జనకు ఉపయోగించినవి దొరికాయి, మరికొన్ని మృణ్మయ పాత్రలు (పాలికల వంటివి) దొరికాయి. బహుశా ఈ విహరం మృణ్మయ పాత్రలను, ప్రతిమలను ఉంచే కోశాగారం అయి ఉండవచ్చు.

సైటు-4 లోని విహారానికి పక్కపక్కలనే మరోస్తూపం బయటపడింది. ఇది ఆంధ్రులు నిర్మించిన స్తూప పద్ధతులలో ఉంది. ఈ స్తూపానికి ఆయకస్తంభ వేదికలున్నాయి. స్తూపం వ్యాసం 48 అడుగులు. ఈ స్తూపం పునాదులు చక్రాకారంలో ఉన్నాయి. దీని ఇరుసుకు పది అడ్డకమ్ములున్నాయి. స్తూపం వెలుపలి భాగం రెండంగుళాలు మందంగల చెక్క సున్నంతో చాల నునుపుగా చేయబడింది. ఆయకవేదికలు కూడా ఈ విధంగానే నునుపుగా చెక్కసున్నం చేయబడ్డాయి.

ఈ సంవత్సరం జరిపిన తవ్వకాలలో సైటు- 7(ఎ) అన్నది చాల ముఖ్యమైనది. కొండ వంపులలో హారీతి ఆలయం బయట పడింది. హారీతి ఆలయం చేరడానికి కొండనెక్కాలి. కొండ దిగువను ఒక దీర్ఘ చతురస్రాకారపు వేదిక ఉంది. ఆ వేదిక పొడవు 54 అడుగుల 6 అంగుళాలు – వెడల్పు 45 అడుగులు. దీనికి నాలుగు వేపుల ఇటుకమెట్ల వరుసలున్నాయి. వాటిపై కడపరాతి పలకలు అతికి ఉన్నాయి. ఈ వేదికకు నైరుతి దిక్కున ఒకరాతి అరుగు ఉంది. సమావేశానికి వచ్చిన సభికులు పాదప్రక్షాళన చేసుకోడానికి అనువుగా అది నిర్మితమయింది. కాళ్లు కడుక్కున నీళ్లు పైకి పాడానికి ఒక కాలువ ఉంది. ఈ వేదిక మధ్యను రాతి స్తంభం యొక్క వర్తులమైన భాగం ఒకటి ఉంది. ఒక రాతి పలక మీద త్రిరత్నాల చిహ్నం, విల్లు – అమ్ముల గురుతు కనిపిస్తాయి. మరొక అరుగు మీద శాసన మొకటి ఉంది. ‘కామశర’ అని అది చెక్కబడింది. ఈ వెడల్పైన ఆవరణలోంచి, ఎత్తుగా ఉన్న మెట్లెక్కి కొండ చివరనున్న హారీతి దేవాలయం చేరుకుంటాము. హారీతి దేవాలయానికి రెండు పక్కల రెండు పెద్ద గదులున్నాయి. ఆలయంలో ఉన్న హారీతి విగ్రహం సున్నపు రాతిపై చెక్కి ఉంది. విగ్రహానికి పైభాగం (మొండెం) లేదు. హారీతి కాళ్లు వెల వేసుకొని కూర్చున్నట్లు కనిపిస్తుంది. విగ్రహం మీదనున్న అలంకరణ వలన ఈ ఆలయం నాలుగు లేక అయిదో శతాబ్దాలకు చెందినట్లు తెలుస్తుంది. హారీతి ఆలయం పరిసరాలలో శాసనం చెక్కిన స్తంభం ఒకటి లభించింది. ఒక ఉత్సవ సందర్భంలో అఖండదీపం ఉంచడం గురించి దీనిలో ఉంది.

హారీతి దేవాలయానికి ముందు భాగంలో చాలా దంతపు గాజులు దొరికాయి. ఈ ఆలయం వెనుక భాగంలో మరొక పెద్ద ఆలయం బయటపడింది. ఈ ఆలయ నిర్మాణంలో రెండు దశలు కనిపిస్తాయి. రెండు దశల నిర్మాణం ఇక్ష్వాకుల తరువాతే జరిగింది. తొలి దశలో నిర్మించిన ఆలయం యొక్క గర్భగృహం నుండి అభిషేక జలం పైకి తీసుకుపోయే కాలువ ఒకటి ఉంది. తొలిదశలో నిర్మించిన ఈ గర్భగృహం తరువాత కాలంలో మూయబడింది. తూర్పు దిక్కున మూయబడి, మండపంగా తీర్చబడింది.

మెట్ల వరుస ఒకటి దానికి చేరింది. ఈ విధంగా చేయడంతో, పడమరకు తిరిగిన విగ్రహం తూర్పుముఖంగా తిరిగినట్లవుతుంది.

తొలిదశలలో నిర్మించిన ఆలయం చుట్టూ ప్రదక్షిణాపథముంది. దాని వెలుపలి గోడలకు, విగ్రహాలకు ఉంచవలసిన గూళ్లున్నాయి. ఈ తొలి ఆలయం గజపృష్ఠాకారంగానున్న పునాదులపై లేచిందో లేదో అప్పటికీ తెలియలేదు.

సైటు-5లో ఒక స్తూపం లభించింది దీని పునాదులు చక్రాకారంలో ఉన్నాయి. ఈ స్తూపం వ్యాసం 27 అడుగులు, నాలుగు అడ్డకమ్ములున్నాయి. ఈ స్తూపం పునాదులు, మరొక స్తూపం యొక్క వర్తులాకారపు పునాదల మీద లేపబడ్డాయి. ఈ ప్రాంతాలలో శాసనం చెక్కిన స్తంభమొకటి లభించింది. కులపత్రుడూ, ఉన్నత వంశమువాడూ అయిన శ్రమణుడొకడు అందరు బ్రాహ్మణులకు దానిని ఉదాత్తమైన అభిలాషతో బహూకరించాడు.

ఈ సంవత్సరం వేరువేరు స్థలాలలో జరిపిన తవ్వకాలలో, సరుకు నిలువచేసే జాడీలు, ఆహారం తీసుకుపోయే పాత్రలు, పూర్ణకుంభాలు, భిక్షా పాత్రలు ఇవన్నీ విహారాలలో ఉపయోగించేవి బయటపడ్డాయి. స్త్రీమూర్తి కొమ్ముగా ఉన్న మంచినీటి జాడీ ఒకటే ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది.

మృణ్మయ పాత్రల మీద సుడివలె పైకి లేచిన రేఖలు, స్వస్తిక చిహ్నాలు, సమాంతర రేఖలు, సూర్యుడి గురుతులు, నిలువుగా అడ్డుగా గీసిన గీతలు, జపమాలలు, జడల అల్లికలు, ఇంద్రధనువులు, తలకిందులుగా చెక్కినవి ఆకారాలు, క్రాస్ గురుతులు, ఆలిచిప్పలు, చిన్న దేపల ఎముకలు, లతలు, పువ్వులు మొదలైనవి చెక్కి ఉన్నాయి.

సున్నపు రాతితోనూ, మట్టితోను చేసిన వస్తువులు ఈ తవ్వకాలలో లభించాయి. ఇవి రెండవ శతాబ్ది నుండి అయిదవ శతాబ్ది మధ్యను గల కాలానికి చెందినవి.

1955-56వ సంవత్సరంలో తవ్వకాలు డాక్టర్ రావిప్రోలు సుబ్రహ్మణ్యంగారి ఆధ్వర్యంలోనే జరిగాయి. వీటిలో 15 విహారాలు, 8 స్తూపాలు, ఒక మధ్యకాలానికి కల మండపాలు బయటపడ్డాయి.

ఇప్పటి వరకు జరిగిన తవ్వకాలలో ఇక్ష్వాకు వంశానికి చెందిన ముగ్గురు రాజుల పేర్లు మాత్రం ఉన్న శాసనాలు లభించాయి. సిరి ఛాంతమూలుడు, సిరి విరపురినదతుడు, సిరి ఏహువుల ఛాంతమూలుడు అన్నవి ఈ రాజుల పేర్లు. ఈ సంవత్సరం తవ్వకాలలో కొత్త రాజు రుద్రపురుషదత్తుడి పేరుగల శాసనం బయటపడింది. ఇతనితో పాటు బృహత్పలాయన గోత్రానికి చెందిన రాజు శ్రీవర్మన్ పేరు కూడా అందులో ఉంది. ఒకానొక శాసనంలో తేరవాద – విభజ్యవాదులకు చెందిన మహావిహారవాసుల పేరు కనిపించింది. నాగార్జున కొండలోయలో ఉన్న సింహళతేర వాదుల మూడవ విభాగమిది. జేతవయ విభాగం, అభయ గిరివాసుల విభాగం మిగిలిన రెండు విభాగాల పేర్లు భవనావశేషాల్లో ఇక్ష్వాకుల నాటివే కాక వారికి ఒక శతాబ్దం ముందువి, రెండు శతాబ్దులు వారి తరువాతవి బయటపడ్డాయి.

సైటు వి-6లో అన్ని హంగులతో ఉన్న బౌద్ధ విహారం ఒకటి బయటపడింది. దానికి నాలుగు పక్కల గదుల వరుసలున్నాయి. దానిలో స్తూపమొకటి ఉంది. చైత్యగృహం, మూడు పూజాస్తూపాలు, బయటపడ్డాయి. స్తూపంలోకి ప్రవేశించే ద్వారం దగ్గర ఒక శిలాఫలకం దొరికింది. దీనిమీద బుద్ధ పాదాలు చెక్కి ఉన్నాయి. రెండు మత్స్య చిహ్నాలు, వృక్షం, పూర్ణఘటం, స్వస్తిక చిహ్నం, ధర్మచక్రం, అంకుశం మొదలైన వాటితో అలంకరింపబడి ఉంది. రాతి పలక శిలాఫలకం మీద చెక్కిన శాసనాన్ని బట్టి అది మూడవ శతాబ్దం మధ్య భాగానికి చెందినదని తెలుస్తుంది. మహావిహారవాసినులకు మహావిహారవాసుల చేత అంకిత మీయబడిందని శాసనంలో ఉంది. బుద్ధుడి పవిత్ర పాదాలు గల శిల్పం మహావిహారవాసులే ఊహించారని ఉంది. వీరు సింహళంలోని తేరవాడ విభజ్యవాద శాఖకు చెందిన వాళ్లు వారుండే ధరణీ విహారం ప్రవేణిపై ఉంది. మహావిహారవాసులు సాముద్రిక శాస్త్రం తెలిసిన వాళ్లని, జాతకాలు వేయగల వారని అందులో ఉంది. బుద్ధుడు చాటిన నవాంగములో ఎనిమిదవ సాసనం (అబ్బుతం) ఇది.

సైటు-8 లో ఇటుకలతో నిర్మింపబడిన స్తూపం ఒకటి బయటపడింది. దీని పునాదులు చక్రాకారంలో ఉన్నాయి. ఎనిమిది అడ్డముక్కలున్నాయి. స్తూపం వ్యాసం 50 అడుగులు. ఈ స్తూపంలో శారీరకావశేషాలు కల రెండు పేటికలు లభించాయి. ఒక పేటిక రాగిలో చేసినది, రెండవది నాసిరకం వెండిది. ఈ రెండిటితో పాటు స్వర్ణపుష్పాలు, ముత్యాలు, ఒక మాదిరిగా విలువగల రాళ్ళు, ఎముకల పాడి ఈ స్తూపంలో లభించాయి. ఈ స్తూపంలో లభించిన ఒక వస్తువుపై ‘త్రిరత్న’ చిహ్నముంది.

సైటు-9లో ఒక విహారం బయటపడింది. సంపూర్ణంగా ఉన్న ఈ విహారం ‘యు’ ఆకారంలో ఉండి, మూడువేపుల గదుల వరుసలతో ఉంది. ఒక్కొక్క వరుసలో ఎనిమిది గదులున్నాయి. ఈ విహారంలో ఉన్న చైత్యగృహం గజపృష్ఠాకారంలో నిర్మింపబడినది ఇక్కడ లభించిన ఒక సున్నపురాతి స్తంభం మీద శాసన మొకటి ఉంది. ‘భగవతో మూల ఛేతియే పతిఠాపిత’ అని అందులో ఉంది. ఈ కట్టడం బుద్దుడి మూల చైత్యానికి చెందినదనో, లేక ఈ స్తంభమే అంకితమీయబడిందనో తెలుస్తుంది. ఈ ఆదిమచైత్యం ఏ స్థలంలో ఉందని సందేహం కలుగుతుంది.

సైటు-13లో నాలుగు వేపులా గదుల వరుసలున్న విహారమొకటి బయటపడింది. చతురస్రాకారమైన అంగణంలో స్తంభాలు గల మండపము ఒకటి ఉంది. అవికాక వర్తులాకారంలో ఉన్న పూజాస్తూపం ఒకటి ఉంది. ఈ చైత్య గృహంలో ఒక ఛాయాస్తంభం లభించింది. బుద్ధుడి పెంపకం తల్లి ప్రజాపతి గోతమి, శిశువుగా ఉన్న బుద్ధుడిని ఒక అంగవస్త్రంలో చుట్టి ఎత్తుకున్నట్లు ఆ స్తంభం మీద చెక్కబడింది. ఆ శిల్ప చిత్రం కింద ఒక శాసనం లభించింది. ఆ శాసనంలో ‘ఛాయా కంభ మ’న్న పదం మొదటిసారిగా మనకు పరిచయమవుతుంది. ఈ ఛాయాస్తంభం మీద ఇక్ష్వాకు రాజుల వంశావళీ లిఖింపబడి ఉంది. ఛాంతమూలుడు, వీరపురిసదతుడు, ఏహువల ఛాంతమూలుడు, రుద్రపురి సదతుడు. వీరి పేర్లు ఆ వంశావళిలో ఉన్నాయి. అంతేకాక, క్లాత్రపులకున్న బిరుదులో ‘స్వామి’ అన్న బిరుదం వీరి పేర్లకు తగిలించబడింది. బృహత్పలాయన గోత్రుడైన శ్రీవర్మ అన్న అతడు, ఇక్ష్వాకుల మహారాణి మహాదేవి జ్ఞాపకార్ధం ఈ ఛాయా స్తంభాన్ని ప్రతిష్ఠాపించాడు.

సైటు-21 నది గట్టున ఉంది. ఇక్కడ స్తంభాలు కల మండపాలు బయటపడ్డాయి. చైత్యగృహ నిర్మాణంకాని, స్తూప నిర్మాణం కాని ఈ ప్రాంతాలలో కనిపించలేదు. బహుశా ఈ మండపాలు, నదీతీరంలో ప్రజలు సమావేశమవడానికి అనువుగా నిర్మించినవని అనిపిస్తుంది. ఈ స్థలంలో శంఖాలు, ఇక్ష్వాకుల సీసపు నాణాలు, తోరణానికి ఇటు అటూ ఉన్న రెండు సున్నపురాతి స్తంభాలు లభించాయి. స్తంభాలు ఏకాండీగా లేకుండా, పైభాగం, కింది భాగం వేరువేరుగా దొరికాయి. ఇవి 7 అడుగుల 6 అంగుళాలు ఎత్తు, 10 అంగుళాలు మందం కలవి. స్తంభం యొక్క కిందిభాగం ఘనాకారంలో ఉంది. ఈ స్తంభాల మీద ఏనుగు ఒకటి ముందు భాగంలో చెక్కి ఉంది. అష్టభుజాకారపు పట్టికమీద ఆకులలో కప్పబడిన పిల్లలు, కోళ్ల పందాలు వేస్తున్న పిల్లలు – ఈ విధంగా చాలా బొమ్మలు చెక్కబడి ఉ న్నాయి. పక్షులతో ఆడుకుంటున్న పిల్లలు, ఎలుగు బంట్లు, ఆబోతులు, తేళ్లు, గుర్రాలు, సింహాలు, ఎనిమిది కాళ్లు గల చేప, విప్పిన పాము పడగలు, గ్రీకుదేశపు పర్లేరు మొక్కలు వాటిమీద ఉన్నాయి. వర్తులంగా స్తంభాకారంలో ఉన్న మధ్యభాగంలో ఆరుదళాలు విడిన తామరపూవు సంపూర్ణంగా చెక్కబడింది. స్తంభం మీదభాగాన్న అడ్డు వట్టెలు తగిలించే చోట పద్మనాళాలు, పత్రాలు ఉన్నాయి. స్తంభం యొక్క పై అంచు మీద ఏనుగులు, రెక్కలున్న సింహాలు చెక్కబడ్డాయి. కొన్ని నాలుగు కాళ్ల మీద కూర్చున్నట్లు, కొన్ని ముందుకు దుముకుతున్నట్లు చెక్కబడ్డాయి. శిల్పం యొక్క శైలిని బట్టి చూస్తే ఇవి మూడవ శతాబ్ది చివరిభాగంలో కాని, నాలుగవ శతాబ్ది మొదటి భాగానికి గాని చెందినట్లు కనిపిస్తాయి.

సైటు-25లో మామూలుగా ఉన్న విహారానికి ఎదురుగా ఒక స్తూపం వెలువడింది. ఈ స్తూపం యొక్క పునాదులు వర్తులాకారంగా చక్రంవలె ఉన్నవి, దీని వ్యాసం 27 అడుగులు లోపలనున్న పునాది మధ్య భాగం వ్యాసం 6 అడుగులు. దీనికి 6 అడ్డుకమ్ములున్నాయి. అడ్డకమ్ముల మధ్యను ఒక భిక్షాపాత్ర లభించింది. ఇది పునాదుల పై అంచులకు తాకుతూ ఉంది.

సైటు-15లో మూడుగదుల వరుసలున విహారమొకటి వెలువడింది. తూర్పు వేపున్న వరుసలో ఎనిమిది గదులన్నాయి. దక్షిణపు వరుసలో అయిదు, ఉత్తరపు వరుసలో అయిదు గదులున్నాయి. మిగిలిన స్థలంలో దక్షిణభాగంలో ఒక స్తూచైత్యం, ఉత్తరభాగంలో ఒకటి ఉన్నాయి. మధ్యభాగంలో మండపం ఉంది. విహారానికి పశ్చిమభాగంలో రెండు చైత్యగృహాలున్నాయి. అవి గజపృష్ఠాకారంలో నిర్మించబడ్డాయి. ప్రతిదానిలో పూజా స్తూపమొకటి ఉంది. ఉత్తరదిశలోనున్న చైత్యగృహం, అంతకు పూర్వం నిర్మించిన మరొక స్తూపం యొక్క పునాదులపై కట్టబడింది. స్తూపం ఆవరణలో రెండు చైత్యగృహాలుండడం అబ్బురమైన విశేషమే. బహుశా ఈ విహారంలో పడమటి వేపు ఒక స్తూపమొకటి ఉండి ఉండవచ్చు. ఈ స్థలంలో కొన్ని సీసపు నాణాలు, ఇక్ష్వాకుల కాలానికి చెందినవి, లభించాయి. దీనిని బట్టి ఇది ఇక్ష్వాకుల పాలనలో నిర్మింపబడి ఉండవచ్చు.

సెటు వి-2 లో స్తంభాల మండపమొకటి బయటపడింది. మండపం నేల రాతిఫలకలతో నాటినది – గోడలు ఇటుకలతో కట్టినవి.

సైటు వి-4 ముందు భాగంలో ఒక దిబ్బ ఉంది. దిబ్బకు దిగువ భాగంలో ఒక స్తంభాల మండపముంది. మండపం ఉన్న స్థలంలో, స్తంభాలకు దిగువభాగాన్న, ఒక స్మారక స్తంభ శాసనం లభించింది. ఈ శాసనంలో భాష సంస్కృత ప్రాకృతాల మిశ్రమం. కాబట్టి, ఇది తప్పక నాలుగవ శతాబ్ది మొదటి భాగానికి చెందినదని స్పష్టమవుతుంది. శ్రీ ఛాంతమూలుడి శౌర్యపరాక్రమాలను సంక్షేపంగా పునశ్చరణ చేస్తుంది ఈ శాసనం. శ్రీఛాంతమూలుడికి చాలామంది బంధువులున్నారు. ఇతడు మహాసేనాపతి – శత్రువుల గర్వమణచగలవాడు. అంతేకాక దిలిబకుడు అన్న వాని ఏనుగును పట్టుకున్నాడు. ఇతడు ఇక్ష్వాకు ఛాంతమూలుడికన్న భిన్నమైనవాడు. కులహక వంశానికి చెందినవాడు. మహాయోధుడు. స్కంధావారంలో ఇతడు సంహరింపబడ్డాడు. ఈ శాసనంలో లిఖింపబడిన విలువైన విషయం, ఈ స్తంభం మీద చిత్రింపబడిన విషయం ఒకదానిని ఒకటి అనుసంధానించినవి. వెనుకను తామరపువ్వులున్నాయి. వాటి ముందొక ఒక మహాగజముంది. దాని మీద ఒక రాజు కూర్చున్నాడు. బహుశా అతడు శాసనంలో పేర్కొన్న ఛాంతమూలుడు కావచ్చు. అతని వెనుక ఛత్రచామరాలు ధరించిన సేవకుడు కనిపిస్తాడు. ఇవి రాచరికపు చిహ్నాలు. శాసనంలోని ‘దిలిబక – హథిగాహకస’ అన్నమాట ఏనుగు కుంభస్థలంపై అంకుశం మోపి రాజు కూర్చుండడంతో సార్ధకమవుతుంది.

సైటు వి-7 లో విరిగిన సున్నపురాతి పలక ఒకటి లభించిది. ఇది ఒకడుగు పదంగుళాలు పొడవు, ఒకడుగు అయిదంగుళాలు వెడల్పు కలది. ఆ ఫలకం మీద స్త్రీరూపంలో మహాసేనుని శక్తి సమభంగస్థితిలో చెక్కబడి ఉంది. ఆమె కుడిచేతిలో శూలముంది. ఆమె రెండవ చేయి, మొలకు వేలాడుతున్న ఖడ్గంపై అని వుంది. ఇది కట్యావలింగిత భంగిమ. ఆమె శరీరంపై అలంకరింపబడిన భూషణాలు అమరావతి శిల్ప శైలిలో ఉన్నాయి. ఆమెకు కటిమేఖల కూడా ఉంది. విగ్రహం వెనుక భాగంలో ఛత్రమొకటి, నెమలి ఈకలు గల జండా ఒకటి కనిపిస్తాయి. మహాసేనుడి వాహనం మయూరం. నెమలి ఈకలు వెనుక భాగంలో ఉండడం చేత, ఈమె మహాసేనుడి శక్తి అని నిశ్చయమవుతుంది. నాగార్జునకొండ లోయలో లభించిన శాసనాలలో ఉన్న స్త్రీల పేర్లలో అటవి ఛాంతిసిరి అను ఆమెను మహాతలవరి, మహాసేనావతిని అని పేర్కొన్నాడు. ఇక్ష్వాకులు తాము విరూపాక్షపతి మహాసేన పరిగృహీతులమని చెప్పుకుంటారు. అందుచేత ఈ దేవతను మహాసేనుని శక్తి అని గుర్తు పట్టవచ్చు.

రాజుగారికోట లేక రాజభవనం ఉన్న సైటులో రెండు జాగాలు బైటపడ్డాయి. కృష్ణానది గట్టున కట్టిన స్నానఘట్టం మొదటిది – మెట్లు, పిట్టగోడలు దీనికి కనిపిస్తాయి. మెట్లు నదిలోకి ఉన్నాయి.

మొదటి స్నానఘట్టానికి తగులుతూ, దానికి ఉత్తరాన మరొక స్నానఘట్టముంది. ఇక్కడ కృష్ణానది గట్టు ఇటుకలతో కట్టబడి, వంకరటింకరలు కల మెట్ల వరుసలతో ఉంది. బహుశా ఈ రెండవ ఘట్టం, రాజకుటుంబాలవారు ఉపయోగించడం కోసం ప్రత్యేకంగా కట్టినట్లున్నారు.

ఈ ఘట్టంలో, పైన తాపిన రాతి పలకలమీద ‘వేణిసిరి’ అన్న పేరు, “అనల’ అన్న పేరు కనిపిస్తాయి. తాపీ పనివాళ్ల చిహ్నం – ధనువు – అమ్ము (కామశర) కూడా కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని సీసపు నాణాలు దొరికాయి. వాటిపై తొండం పైకెత్తిన ఎనుగు ముద్ర ఒక పక్కను, సిరి ఛాంతమూలుడి పేరుకాని, సిరి వీరపురి సదతుడి పేరు కాని రెండవ పక్కను కనిపిస్తాయి. స్నానఘట్టం పలకల పైన కట్టిన ఒక రాతి గోడ, మధ్యయుగానికి చెందనిది బయట పడింది. విజయనగర పాలకుడైన సాళువ నరసింహరాయలుకి చెందిన రాగినాణెమొకటి, కుతుబ్ షాహి పరిపాలనా కాలానికి చెందిన మరొక రాగినాణెం పైపొరలలో లభించాయి. విజయనగర రాజుల నాణెం మీద గండభేరుండ ముద్ర కనిపిస్తుంది.

ఇవికాక ఈచోట మరికొన్ని ఆసక్తిదాయకమైన వస్తువులు లభించాయి. రాతిశిల్పాలు, ఎర్రమట్టితో చేసిన బొమ్మలు, చాల రకాలైన పూసలు దొరికాయి. ఈ పూసలు అమూల్యమైన రత్నాలతోను, సూర్యకాంతపు మణులతోనూ, కురువింద రత్నాలతోనూ, గవ్వలతోనూ, ఎముకలతోనూ, గాజుతోను ఎర్రమట్టితోను చేసినవి.

ఇంత వరకు చెప్పి ప్రసాద్ ప్రసంగం ఆపివేశారు.

అప్పటికి బాగా చీకటి పడింది. పెట్రోమాక్సులైటు వెలిగించారు. శశికళ చాలా నోట్సు తీసుకుంది. చెప్పాలని ప్రసాద్‌కి, వినాలని మోహన్ వాళ్లకి ఆసక్తి ఉన్నా, రాత్రి రావడంతో ఆపక తప్పింది కాదు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here