శ్రీపర్వతం-28

0
6

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 28వ భాగం. [/box]

37

[dropcap]రో[/dropcap]జు తరువాత రోజు గడచి పోతున్నది. లోయలో మార్చి నెల మద్యనుంచే ఎండాకాలం మొదలయింది. విజయపురిని, శ్రీపర్వతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, స్కాలర్లు చెప్పిన విషయాలను నోట్ చేసుకోడం పూర్తయింది. శశికళ టైపు చేసి టేబిలు మీద పెట్టిన కాగితాలలో కొన్ని ఫైలయి, కొన్ని విడిగా, గుట్టలు గుట్టలుగా పెరిగాయి. ఈ పనంతా ఎండాకాలం ప్రారంభించక ముందు చేయడం మేలయింది. కొన్ని కాగితాలు ఫైలు చేయడం మాత్రం మిగిలింది. అదేమంత పనికాదు.

ఇప్పుడు పగలంతా ఎండలో గడిపి, సాయంకాలం టెంట్సు చేరేసరికి ఇద్దరికీ నీరసం ముంచుకొస్తోంది. దేనికీ చెక్కుచెదరని వాడు సుబ్రహ్మణ్యేశ్వరరావు. ఎండలు ముదురుతున్న కొద్దీ అతనిలో ఉత్సాహం పెరుగుతున్నది. ఏప్రెలు నెల పదిహేనో తారీకు నుండి అతడు నెల్లాళ్ళు సెలవు పెట్టి మోహన్, శశికళలతో ఉంటున్నాడు. వారానికో, పది రోజులకో మాచర్ల వెళ్ళి కాబోయే భార్యను చూసి వస్తుంటాడు. ప్రియురాలి కన్నా విజయపురి, ఇక్ష్వాకులు, బుద్ధుడు, నాగార్జునుడు అతనిని లోయలోకి లాక్కున్నారు. ఈ మహానగరం నీటిలో మునిగిపోతున్నదే అని అతడు బాధపడుతున్నాడు.

సైటుకి దగ్గరలో కాంట్రాక్టరు చేత ఒక పాక వేయించారు. అందులో ఒక టేబిలు, నాలుగు కుర్చీలు వేయించారు. చిన్న ఇసుక గుట్టమీద, రెండు పెద్ద కుండలతో నీళ్ళు పెట్టంచారు. శశికళ మాత్రం నీళ్ళు కాచి, చల్లార్చి, పెద్ద కాంటీన్‌లో పోసి తనతో తెస్తుంది. తాను విధిగా ఆ నీళ్ళే తాగుతుంది, మోహన్ చేత తాగిస్తుంది.

ప్రసాద్, కృష్ణమూర్తి, కార్తికేయ శర్మ, వీరభద్రరావు, కృష్ణారావు మొదలైన స్కాలర్లందరూ చాలా పని తొందరలో ఉన్నారు. డాక్టరు సుబ్రహ్మణ్యం గారు బదిలీ మీద వెళ్ళిపోయారు. కొత్తతను వచ్చారు. సోమవారం నాడు కూడా వాళ్ళను కలియడానికి ఆపడం లేదు.

ఏప్రెలు రెండో వారంలో ప్రభుత్వమిచ్చిన ఆరు నెలల గడుపు పూర్తయింది. ఫిబ్రవరి నుండి మోహన్ ఢిల్లీతో మంతనాలు జరుపుతూ ఉన్నాడు. మూడు రోజుల కిందే మరో ఆరు నెలల వరకు తవ్వకాలు సాగించడానికి ప్రభుత్వం నుండి అనుమతి కోరుతూ అతడు తిరిగి ఉత్తరం వ్రాశాడు. నిధులు కూడా ఆ మేరకు విడుదల చేయనున్నట్లు ఆ ఉత్తరంలో కోరాడు.

అన్నీ బాగానే ఉన్నాయి. ఒక్కటి మాత్రమే నిరాశాజనకమైన విషయం. ఇంతవరకు తవ్విన ట్రెంచిలలో చారిత్రకమైన వస్తువు ఒకటి కూడా బయటపడలేదు. ప్రతి ట్రెంచి లోను అడుగు పొర, నాచురల్ సాయిల్, తగిలేముందు, ఇక్ష్వాకుల పొరలో, ఎండిన మొక్కలు వాటివేళ్ళు, రెమ్మలు బయట పడ్డాయి. జావా మొగుడు, వాటినన్నిటినీ జాగ్రత్తగా రోడ్డు వరకు తీసుకుపోయి, రోడ్డుకు రెండవవేపు గుట్టగా పోస్తున్నాడు. ఈ మార్చినెల చివరి వారంలో చిరుతపులి టెంట్లలోకి ప్రవేశించడం ఒక పెద్ద సంఘటన. లంబాడీ తండాలో వాళ్ళు, పుల్లారెడ్డి గూడెంలో వాల్ళు, కాలనీవాళ్ళు చాలా కలవరపడ్డారు. అడవుల్లోకి పారిపోయిన చిరుతపులి మరి రాలేదు.

ఇది బాగానే ఉంది. కాని, మరో విషయం మాత్రం ఇప్పటికీ అంతు పట్టడం లేదు. శశికళ టెంటులోకి రెండు పాములు ప్రవేశించి అందరినీ హడలు గొట్టిన తరువాత జావా మొగుడు పని చేశాడు. ట్రెంచిల అడుగు పొరలో దొరికిన మొక్కలను, వాటి వేళ్ళను తెచ్చి, టెంట్ల చుట్టూ ఉన్న హిడ్డింగ్ మొదటను చుట్టూ పోశాడు. ఆనాటి నుండీ పామన్నది ఆ ప్రాంతాలకు రాలేదు. అడపా దడపా కనిపించేవి కూడా అదృశ్యమయాయి. ఈ సంగతి మోహన్‌‍కి చాలా అశ్చర్యం కలిగించింది. లోయలో తవ్వకాలలో దొరికిన చాలా శిల్పాలమీద లతలు, పుష్పాలు చెక్కారు. కొన్ని శిల్పాలలో గ్రీకు పల్లేరు కాయ తీగలను చెక్కారు. వాటితో ఈ మొక్కలను సరిపోలిస్తే ఫలితం లేకపోయింది. వాటికీ వీటికి చాలా తేడా కనిపించింది.

ఆ మొక్కలను మోహన్ తీసికెళ్ళి ప్రసాద్‌కి, మిగిలిన స్కాలర్లకి చూపించాడు. వాళ్ళు కూడా అవి ఏ మొక్కలో చెప్పలేకపోయారు.

అప్పుడు శశికళ ఒక సలహా యిచ్చింది. వాటిని యూనివర్సిటీ బాటనీ విభాగానికి పంపమంది. కొరియర్ అబ్బాయి ద్వారా మొన్ననే వాటిని హైదరాబాదు పంపించారు. అక్కడనుండి జవాబు వచ్చేసరికి కొంచెం ఆలస్యమవుతుంది. విద్యార్థులకు పరీక్షలు, అందుచేత ఎవరికీ తీరిక ఉండదు.

కొండమీద నుండి ఎండ, లోయలోకి దిగక పూర్వమే వాళ్ళు ముగ్గురూ సైటు చేరుకున్నారు. బుద్ధ పూర్ణిమ ఎల్లుండి బుధవారమే. ఆరోజు చాలా పెద్ద పండుగ జరపాలని ఏర్పాటులు చేస్తున్నారు.

లోకమంతా ఆనందోత్సాహాలతో నిండిపోయింది.

మోహన్ మాత్రం చాలా కుంగినట్లు కనిపిస్తున్నాడు.

ఆ విషయం సుబ్రహ్మణ్యేశ్వరరావు ముందుగా గుర్తించాడు. సాధారణంగా మోహన్ నవ్వుతూ ఉంటాడు. నవ్విస్తాడు. అతడు ఇప్పుడు మూభావంగా ఉన్నాడు. రెండు మూడు సార్లు అడిగితేనే కాని అడిగిన ప్రశ్నకు జవాబివ్వడం లేదు. రాత్రులందు, టెంటు బయట, ఆవరణలో, కుర్చీ వేసుకొని కూర్చొని ఏవో ఆలోచిస్తున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వరరావు, సమయం చూసుకొని శశికళతో ఈ సంగతి చెప్పాడు. ఆమె కూడా అదే అభిప్రాయానికి వచ్చింది.

వాళ్ళు ముగ్గురూ ట్రెంచిల దగ్గిర తొమ్మిదిన్నర వరకూ ఉండి, పాకలోకి వచ్చి కూర్చున్నారు. శశికళ పెద్ద ప్లాస్కులో పళ్ళరసం నింపి తెచ్చింది. ముగ్గురూ దానిని తాగి కూర్చున తరువాత శశికళ మాట్లాడం మొదలు పెట్టింది.

“మోహన్! మనం మంచి ముహూర్తం చూసే ఈ తవ్వకాలు మొదలు పెట్టామా?”

మోహన్ ఆమె ముఖంలోకి ఆశ్చర్యంతో చూశాడు.

“ఈ ముహూర్తాలమీద మీకు నమ్మకముందా?” రావు ప్రశ్నించాడు.

“నమ్మకం ఉన్నా లేకపోయినా మనం భూమి పూజ చేసి మరీ పని మొదలు పెట్టాము. మనం పని చేస్తూ ఆరు నెలలు గడిపాము. ఇప్పటికీ, తవ్వకాలలో ఏమీ దొరకలేదంటే, ఆ ముహూర్తం మంచిది కాదనే నా అభిప్రాయం” అంది శశికళ.

మోహన్ ఇంకా ఆశ్చర్యపోయినట్లు అతని చూపులు చెప్పాయి.

“ఇందులో మోహన్ తప్పేమీ లేదు. మాచర్లలో సుబ్బావధానులుగారు చాలా పేరు పొందిన జ్యోతిష్యులు. భూమి పూజకోసం ముహూర్తం పెట్టించడానికి మేమిద్దరం వెళ్లాము. మోహన్ నక్షత్రం, మీ నక్షత్రం అతనికి చెప్పాము. ఆయన ముహూర్తం కడుతూ, ఈ సంవత్సరం ఉండే మంచి ముహూర్తాలలో నూటికి నూరు పాళ్ళు ఉత్తమమైనవి లేవన్నారు. అన్ని ముహూర్తాలకు దోషాలున్నాయని అన్నారు. తక్కువ దోషాలున్న ముహూర్తం ఇదేనని చెప్పారు. కాబట్టి ఇది దోషం లేని ముహూర్తం కాదు. చిన్న దోషమైనా మనకి ఇబ్బందులు కలుగజేస్తున్నది” అన్నాడు రావు.

మోహన్ ఒక్కసారి నవ్వి అన్నాడు.

“ఈ విషయం ఇంత ప్రాధాన్యత వహిస్తుందని నేననుకోలేదు.”

“మనం చేస్తున్న పని మంచిదో కాదో నాకు తెలియదు. ఈ లోయలో, మట్టిలో పాతుకు పోయిన విశేషాలను బయట పెడుతున్నాం. ఇక్కడి గృహాలలో మనుష్యులుండేవారు. వాళ్ళు అకస్మాత్తుగా ఇళ్ళు వాకిళ్ళు విడిచి వెళ్ళిపోయినట్లు మనం భావిస్తున్నాం. వారి జీవితాలను బట్టబయలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. వాళ్ళు ఏ శాపాలు పెట్టారో! తవ్వకాలలో పనిచేసే పరిశోధకులు వాటికి గురి అయారంటే…” అంది శశికళ.

“శశికళ! ఇక్కడికి ఆపండి – 1926 నుండి నేటివరకు తవ్వకాలు జరుగుతున్నాయి. వారి శాపల ప్రభావం ఎప్పుడో అయిపోయింది. మనం ఈ శాపాల గురించి ఆలోచిస్తే, పని ఇక్కడితో ఆగిపోతుంది” అన్నాడు మోహన్.

“మీరిద్దరూ బాగా చదువుకున్నవాళ్ళు. మూఢ నమ్మకాలను పట్టించుకోవలసిన వాళ్ళు కారు. మీరే ఈ విధంగా బెదిరిపోతే…” అన్నాడు రావు.

“ఆర్కియాలజిష్టులకు కలిగిన ఇబ్బందులను తలచుకుంటే, మన అభిప్రాయాలు మారవచ్చు” అంది శశికళ.

“వివరంగా చెప్పండి!” అన్నాడు మోహన్.

“కథలో ఇదో కొత్త మలుపు” అన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరరావు.

“దేనికైనా ముందు పరిచయ వాక్యాలు కావాలి. వినండి” అంది శశికళ.

శశికళ చెప్పడం మొదలు పెట్టింది.

1922వ సంవత్సరం, నవంబరు నెల, 30వ తారీకున, ‘ది టైమ్స్’ పత్రికలో, ముందు పేజీలలో ప్రపంచ వార్తలు వచ్చాయి. కాని, పదమూడవ పేజీలలో అత్యంత ఆసక్తికరమైన వార్త ఒకటి వెలువడింది. ఈజిప్టు పురాతన చరిత్రలో ఒక అద్భుతమైన విచిత్రం తవ్వకాలలో బయటపడింది. ఈ శతాబ్దిలో లభించిన వాటిలో ఇది చాలా గొప్పది. అది టూలన్ ఖామున్ సమాధి. ఆర్కియాలజిస్టులు ఓర్పుతోను, పట్టుదలతోను, కుశాగ్ర బుద్ధితోను చేసిన పనికి ఇది బహుమతి.

లార్డ్ కారనర్‌వాన్, అతని సహాయకుడు హెూవర్డ్ కార్టర్ పదహారు సంవత్సరాలయి తవ్వకాలు చేస్తున్నారు. నైలునది పడమటి గట్టున, పురాతనమైన థేబిస్ ఉన్న చోట, లక్సర్ నగరం దగ్గర ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. అప్పుడూ అప్పుడూ ఏదో చరిత్రకు సంబంధించిన వస్తువులు బయట పడ్డాయి, కాని, చెప్పుకోదగ్గవి వాటిలో లేవు.

ఏడు సంవత్సరాలకింద, రాజుల లోయ, అంటే వాలీ ఆప్ కింగ్సులో, వీళ్ళిద్దరూ తవ్వకాలు మొదలు పెట్టారు. అంతకు పూర్వం, పురాతత్వ పరిశోధకులు ఆ చోట త్వవకాలు జరిపి, మట్టిని గాలించి, మరేవీ లేవని విడిచి పెట్టారు. కానీ వీళ్ళకు కూడా ఏవీ దొరకలేదు. ఒకొక్కప్పుడు ఏవీ దొరకలేదని వాళ్ళు నిరాశ పొందారు. వాళ్ళు మాత్రం అధైర్యపడలేదు.

క్రమబద్ధంగా అన్వేషణ కొనసాగింది. చివరకు కార్టర్ యొక్క మొండిపట్టుదల, సమగ్రంగా అతడు చేసిన పని, అన్నిటికీ మించి ఉత్తమమైన కార్యాన్ని తీర్చిదిద్దే కౌశలం, ఈ మహత్తరమైన పురాతత్వ విశేషాన్ని కనుగొనడానికి కారణమయి, ఫలితాన్ని ఇచ్చాయి.

ఇది వార్త – దీని వెనుక ఒక వ్యక్తి యొక్క అదృష్టం దాగి ఉంది. స్మృతి పథంలోంచి జారిన ఒక ఫారో, గురించి అతడు జీవితమంతా శ్రమించాడు. ఫారో అంటే ఈజిప్టును పాలించిన పురాతన చక్రవర్తి అని మీకందరికీ తెలుసు. ఇది పురాతత్త్వ చరిత్రలో మహా సాహసమైన కార్యం. ఈ ఫారో గురించి తవ్వకాలు జరపడం, ఆనాటికి ముప్పై సంవత్సరాలకి ముందు ప్రారంభమయింది.

హెూవర్డ్ కార్టరు పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, లార్డ్ అమ్హరెస్టు అతనిని ఈజిప్టు పంపించాడు. విలువైన వ్రాతప్రతులు, పురాతన వస్తువులు తవ్వకాలలో లభిస్తే సంపాదించమని అమ్హరెస్టు ప్రభువు కార్టర్‌ని నియోగించాడు.

కార్టర్ సన్నగా పొడవుగా ఉండేవాడు. ఈ మనిషి ఆర్కియాలజీకి ఏం పనికి వస్తాడని అక్కడి ఫ్రెంచి పరిశోధకుడు భావించాడు. కార్టర్‌కి ఒక గొప్ప యోగ్యత ఉంది. చిత్రాలు గీయడమే ఆ ప్రత్యేకత.

ఫ్రెంచి పరిశోధకుడి పేరు పెట్రీ. అతడు ఈజిప్టులో గుప్తనిధుల కోసం పది సంవత్సరాలయి తవ్వకాలు జరుపుతున్నాడు. అతడు అమ్హరెస్టు ప్రభువు పంపిన యువకుడికి ఒక చోటు చూపించాడు. అంతకు ముందే పెట్రీ అనుచరులు ఆ ప్రదేశాన్ని జల్లెడ పట్టారు. పెట్రీ చాలా నిశితంగా కార్టర్ చేస్తున్న పనిని పరిశీలించాడు. తనను మరొకరు పరిశీలిస్తున్నారని కార్టర్ అనుమానపడలేదు, కపటం లేకుండా అతడు పనిచేశాడు. ఆసక్తితో శ్రమ పడ్డాడు. విడువని పట్టుదలతో ముందుకు సాగాడు. కార్టర్ పడ్డ శ్రమకు మొదటి రోజు ఫలితం లభించలేదు.

దానికతడు వెనుకంజ వేయలేదు. రెండవదినం అధికమైన ఉత్సాహంతో తవ్వకం చేశాడు. మూడో రోజు కార్టరు ఎలా పని చేస్తున్నాడో చూడడానికి పెట్రీ వెళ్లాడు. అక్కడ కార్టర్ పారలతో మట్టి పారబోస్తూ పూర్తిగా అలసిపోయాడు. పెట్రీ ఈ పని చేసి, అంతరవకు తవ్వకాలు జరగని స్థలం ఒకటి కార్టర్‌కి ఇవ్వాలనుకున్నాడు. పెట్రీ దగ్గరికి రాగానే, కార్టర్ చాలా హుషారుగా కనిపించాడు. తన చేతిలో ఉన్న ఒక మహారాణి యొక్క ప్రతిమాశకలాన్ని పెట్రీకి యిచ్చాడు. అంతేకాక, ఆరోజే, జల్లెడ పట్టి ఏమీ లేవని విసర్జించిన తొక్కుల నుండ తీసి చాలా విగ్రహాల మొండాలను వెలికి తీశాడు. ఆ రోజు లభించిన వస్తువులను, అమ్హరెస్టు ప్రభువు చనిపోయిన పన్నెండు సంవత్సరాల తరువాత, 1921లో వేలం వేశారు. కొన్ని వందల ఏండ్లకు అవి పోటీలో వెళ్ళిపోయాయి.

ఫ్రెంచి పరిశోధకుడు ఫిండర్స్ పెట్రీ, కార్టర్‌లో గల ఉత్సాహాన్ని, యౌవన బలాన్ని గుర్తించాడు. ఆ కాలంలో ఆర్కియాలజిస్టులు తవ్వకాల దగ్గిర ఫ్రాక్ కోటులు తొడుక్కొని, స్టిఫ్ కాలర్లతోను, టోపీలతోను దర్శనమిచ్చేవారు. కాని, పెట్రీ, చినిగిపోయి మాసిపోయిన జుత్తుతో నిటారుగా నిలబడి, కాళ్ళు తవ్వకాల ధూళితో నిండి, అస్తవ్యస్తంగా ఉన్న చెప్పులతో కనపడేవాడు.

ఆక్స్‌ఫర్డ్ ఆర్కియాలజిస్ట్ ఆర్బిబాల్డ్ హెన్రీ అక్కడ పనిచేసేవాడు. అతడు భోగలాలసుడు – శాస్త్రం కోసం కన్న సుఖం కోసమే తాపత్రయ పడేవాడు. కాని, పెట్రీ మాత్రం, ఆర్కియాలజిస్టు అనేవాడు తాను చేస్తున్న తవ్వకాలకు అనుగుణమైన పురాతన వాతావరణంలోనే పనిచేయాలనేవాడు. తన పనివాళ్ళను కూడా చాలా నిరాడంబర జీవితం సాగించమని అతను ప్రోత్సహించేవాడు. అది అనుభవం వలన తీసుకున్న నిర్ణయం కాదు. ఈ విధంగా జీవించాలని అతడు తొలుతునే ఒక నిశ్చయానికి వచ్చాడు. తక్కువ తిండి తినాలని, ఆ విధంగా చేస్తే, కష్టపడి పనిచేయడానికి వీలవుతుందని అనేవాడు. ఒకసారి అతడు అయిదు షిల్లింగులు మాత్రమే ఖర్చు పెట్టి వారానికి సరిపడిన సామగ్రిని తెచ్చాడు. అతను తక్కువ ధరకు తెచ్చిన ఆహారపదార్థాలు బాగులేక, బృందంలో వాళ్ళకు వాంతులు పట్టుకున్నాయి.

ఫ్లిండర్స్ పెట్రీ, ప్రపంచ విఖ్యాతులైన ఆర్కియాలజిస్టులలో ఒకడు. అతడు ఘన విజయాలు పొందాడు. దూర ప్రాచ్యంలో అతడు నలబై రెండు సంవత్సరాలు తవ్వకాలు జరిపాడు. అంతకు పూర్వం ఎవ్వరూ కనుక్కోలేవన్ని విశేషాలు వెలికి తీశాడు. అతని శాస్త్ర పరిశ్రమ వేయి పుస్తకాలలో, వ్యాసాలలో, రిపోర్టులలో వచ్చింది.

అతని తండ్రి పేరు విలియం. అతడు ఇంజనీరు. కొడుక్కి అతడు భూమికొలతలు కొలవడంలో, వస్తువులను తూచడంలో అభినివేశం కలిగించాడు.

ఫ్లిండర్స్ తండ్రికి స్పానిష్ అంతరిక్ష పరిశోధకుడు స్మిత్ స్నేహితుడు. అతడు రచించిన, Our Inheritance in the Great Pyramid (పిరమిడ్సు – మన వారసత్వం) అన్న పుస్తకాన్ని ఒకసారి పుస్తకాల దుకాణంలో కొన్నాడు. దానిలోని విషయాలను అతడు జీర్ణించుకున్నాడు. కోణాలను గీయడం, నక్షత్రాల గమనాన్ని గణించడం అతనిని ఆకర్షించాయి.

ఫ్లిండర్స్‌కి సరియైన విద్య అబ్బలేదు. ఇంగ్లండు దక్షిణ ప్రాంతాలలో, చరిత్రకు పూర్వమున్న అవశేషాలను వెలికి తీస్తూ కాలం గడిపాడు. అప్పుడతడు వారానికి అయిదు షిల్లింగుల ఆరు పెన్సు మాత్రమే భోజనం కింద ఖర్చు పెట్టేవాడు. ధాన్యపు కళ్ళాలలో పడుక్కునేవాడు. ఈ విధంగా తీర్చిన అతని శిక్షణ, తరువాత ఏడారి జీవితానికి అనుకూలించింది.

ఈ విధంగా స్వయం నిర్ణయం తీసుకునే పెట్రీ అంటే కార్టర్‌కి ఆసక్తి కలిగింది. అతనిది ఒక సాహస కార్యం కోసం అన్వేషించే జీవితమా, లేక అతని సంపూర్ణ జీవితమే ఒక సాహస కార్యమా?

సూవర్డ్ కార్టర్‌ని పిలిచి, అతని జీవితం గురించి పెట్రీ చెప్పమన్నాడు. కాని, కార్టర్‌కి చెప్పడానికేముంది? అతనికి పదిహేడేళ్ళు, అంతకు ముందు ఎప్పుడూ ఇంగ్లండు విడిచి పెట్టలేదు. ఏడేళ్ల ప్రాయం వరకు ఇంట్లో హాయిగా ఉండేవాడు. అతనిని బడికి పంపాలని తల్లి అనుకున్నా, కుర్రాడు అర్భకంగా ఉండడం నుంచి, తండ్రి మరో మార్గం ఆలోచించాడు. ఇంటి దగ్గరే చదువు చెప్పడానికి ఒక గురువును నియమించాడు.

కార్టర్ తండ్రి జంతువుల బొమ్మలు గీసేవాడు. కార్టర్ కూడా బొమ్మలు గీయడంలో ఆసక్తి చూపించాడు. ఇది గమనించి, ఆ తండ్రి తన కొడుక్కి చిత్రలేఖనంలో పాఠాలు నేర్పాడు.

కార్టర్ వస్తువుల బొమ్మలను గీసేవాడు. 1891లో, లేడీ అమ్హరెస్టు, ఆ పదిహేడేళ్ళ యువకుడి చిత్రకళ యందు ఆసక్తి కనపరిచింది.

మధ్య ఈజిప్టు తవ్వకాలలో ఫ్లిండర్స్ పెట్రీ, పెర్సీ న్యూబెర్రీ, వేలకొలది పెన్సిల్ స్కెచెస్ వేశారు. వాటిని ఇంగ్లండు తెచ్చారు. పాపం! న్యూ బెర్రీ, లండన్లోని బ్రిటీష్ మ్యూజియంలో రాత్రుళ్ళు పగళ్ళు కూర్చొని డ్రాయింగులు పూర్తిచేసేవాడు. అతనికి సహాయం చేయమని, లేడీ అమ్హరెస్టు కార్టర్‌ని లండన్ పంపింది. అతడు మూడు నెలలో డ్రాయింగులను కాపీ చేశాడు. ఈ పని అతనికి నచ్చింది. పై వాళ్ళు కూడా తృప్తి పడ్డారు.

1891 అక్టోబరులో ఈజిప్టులో మరొక కొత్త తవ్వకానికి పెర్సీ న్యూబెర్రీ వెళ్తూ తనతో కార్టరును కూడా తీసుకుపోయాడు. ఇంతవరకు తవ్వకాలు జరుపుతూ, డ్రాయింగులు తయారుచేసేవారు. కార్టరు రావడంతో అతని మీద బొమ్మలు గీసే పని ఉంచి, తక్కినవాళ్ళు తవ్వకాలలో పనిచేసేవారు. కాని, అమరెస్టు దొర, కార్టరు కేవలం బొమ్మలు గీయడంతోనే సంతృప్తి పడడానికి వీలు లేదన్నాడు. తవ్వకాలలో కూడా సహాయం చేయవలసిందని మరో షరతు కూడా విదించాడు. అమ్హరెస్టు ప్రభువు పురాతన వస్తువులను సేకరించేవాడు.

ఆ విధంగా కార్టరు ఈజిప్టు వచ్చాడు. రెండు నెలలు రాత్రుళ్ళు, పగలు ఎడతెరపి లేకుండా, పెర్సీ పనిచేసే స్థలంలో, బొమ్మలు గీశాడు. తవ్వకాల జోలికే అతడు పోలేదు.

టెల్ అమర్నాల్ అమ్హరెస్టు ప్రభువు, పురాతన వస్తువులను సేకరించాలనుకున్నాడు. కార్టరు పనిచేయాలని కోరాడు.

టెల్ అమర్నాల్ ఫ్రెంచి పరిశోధకుడు. ఫ్లిండర్స్ పెట్రీ తవ్వకాలు జరుపుతున్నాడు. అతని పర్యవేక్షణలో కార్టరు పనిచేయడం ప్రారంబించాడు.

పెట్రీ తన ఇరవై ఏడో సంవత్సరంలో తవ్వకాలకోసం ఈజిప్టు వచ్చాడు. చాలా కాలం మరొకరికోసం పనిచేశాడు. రెండు సంవత్సరాలయి స్వతంత్రంగా పనిచేస్తున్నాడు. ఈజిప్టులో పెట్రీ తవ్వకాలు జరపమని ప్రదేశమంటూ లేదు.

సూవర్డ్ కార్టర్‌కి ఇంతకన్న మంచి గురువెవరు దొరుకుతారు? పెట్రీ కొద్దిరోజులలోనే కార్టర్ సామర్థ్యాన్ని గుర్తించాడు. కార్టర్‌ని తన బసలోనే ఉంచాడు.

వాళ్ళుండే గ్రామంలోని ప్రజల ఇళ్ళు పావురాయిగూళ్ళవలె ఉండేవి. వాటికి గోళాకారపు పైకప్పులుండేవి. అవి పచ్చి ఇటుకలతో కట్టినవి. ఆ ఇటుకలు చాలా చవుక పది పెన్నీలకు వేయి ఇటుకలు వచ్చేవి.

అఖేనటేన్ చక్రవర్తి తన రాజధానిలోని గృహాలను, నైలునది మట్టితో చేసిన పచ్చి ఇటుకలతో కట్టించాడు. అందుచేతనే, ఆ రాజధాని నగరం తొందరగానే కూలిపోయి, నాశనమయింది. ఆ పచ్చి ఇటుకలు, కాలానికి నిలువులేక పోయాయి.

బ్రిటీష్ పరిశోధకులు బస చేసిన చోట, కుక్కల బెడద హెచ్చుగా ఉండేది. అవి రాత్రి పూట తెగ అరుస్తూ ఉండేవి. విశాలమైన అమర్నా మైదానంలో వాటి అరుపులు ప్రతిధ్వనించేవి. ఆ అరుపులకి కార్టర్‌కి నిద్రలేకుండా పోయేది. అతడు ఉదయం లేచేసరికి చాలా నీరసంగా ఉండేవాడు. సాయం వేళల్లో చాలా ఉత్సాహంతో పనిచేసేవాడు. ఇటువంటి జీవితం గురించే హెూవర్డ్ కార్టర్ కలలు గన్నాడు. ఏకాంతమైన ఈ ప్రదేశంలో, నిర్దాక్షిణ్యంగా కాసే ఎండ వెలుతురులో తన భవిష్యత్తు ఉందని భావించాడు. ఆ భవిష్యత్తు సామాన్యమైనదా? ఊపిరి తిరగనీయనది, మలినమైనది, కుళ్ళి దుర్గంధం చిమ్మవలసినది. తిండి తిప్పలు సరిగా దొరకనటువంటిది, లేమి తప్ప మరేదీ లేదని భవిష్యత్తు, నరాలను నులిమివేసే భవిష్యత్తు, ఈర్ష్య, దుర్మార్గత్వం, ద్వేషం – వీటితో కూడుకొన్నది. చాలా శ్రమతో కూడినదీ భవిష్యత్తు.

తవ్వకాలలో పనిచేసే వాళ్ళు ఏ ఉద్దేశాలను మనసులో ఉంచుకొని ఈ పనిని చేబడతారు? ఈ ప్రశ్నకు, ప్రపంచ విఖ్యాత పరిశోధకుడైన సర్ లియోనార్డ్ వూలీ చెప్పిన వాక్యాలు గుర్తుంచుకోదగినవి.

“సూక్ష్మంలో చెప్తున్న విషయమిది. క్షేత్ర పరిశోధన అంటే ఫీల్డ్ ఆర్కియాలజీ – అంటే శాస్త్రీయమైన పద్ధతులతో పురాతన వస్తువులను తవ్వి తీయడం – తవ్వకాలలో లభించిన వస్తువు యొక్క చారిత్రకమైన విలువ, ఆ వస్తువు యొక్క స్వభావం మీద ఆధారపడి ఉండదు. పరిసరాలలో దానికి గల సంబంధం మీద ఆధారపడుతుంది. శాస్త్రీయ పద్ధతులలో జరిపిన తవ్వకమొక్కటే ఈ సంబంధాన్ని కనుక్కోగలదు. మామూలుగా తవ్వకాలు జరిపేవాళ్ళు, దోపిడి గాళ్ళు, కళాత్మకమైన విలువనో, వాణిజ్య పరమైన విలువనో, దృష్టిలో ఉంచుకొని తవ్వుతారు. అంతటితో వాళ్ళ ఆసక్తి ఆగిపోతుంది. పురాతత్వ పరిశోధకుడు కూడా మానవుడే. అపురూపమైనట్టిది, అందమయినట్టిది అయిన వస్తువు లభించడంతో అతడు కూడా ఆనందిస్తాడు. కాని, అంతటితో ఆగిపోడు. ఆ వస్తువుల గురించి అన్ని వివరాలు తెలుసుకో గోరుతాడు. ఏది ఏమయినా, ఆ వస్తువులకన్నా, వాటి పుట్టుక, పూర్వోత్తరాల గురించి జ్ఞానం పొందడానికి ప్రయత్నిస్తాడు. అతని దృష్టిలో తవ్వకమంటే, నిశితపరిశీలన – పరిశీలించిన విషయాలను వ్రాసుకోడం – వ్రాసుకున్న వాటికి భాష్యం చెప్పడం”.

ఈ దృష్టితో చూస్తే, హెూవర్డ్ కార్టర్ నూటికి నూరు పాళ్ళు ఆర్కియాలజిస్టే. మొదట మొదట అతడు గుప్త నిధులకోసం వెదికేవాడు. బలవంతంగా తవ్వకాల పనిలో బుర్ర దూర్చాడు. తనను పంపిన వారికోసం నిధులను వెదకడం తప్పనిసరి అయింది. కాని, తవ్వకాలలో వెలువడిన వస్తువులు అందమైనవా, కావా అని మాత్రం అతడు ఆలోచించేవాడు. చారిత్రక దృష్టితో వాటి గురించి తెలుసుకోవలసిన అవుసరమే అతనికి లేకుండా పోయింది. ఆ వస్తువులు, అద్దాల బీరువాలలో కనిపిస్తే చాలు, శ్రమ ఫలించినట్లే అయేది.

ఒక శిల్ప ఖండం చాలా అందంగా ఉంటుంది. అది లభిస్తే తప్పక ఆనందం కలుగుతుంది. కాని, ఒక శాసన ఖండం దొరికిందనుకోండి. అది చరిత్ర రచనకు పునాదిగా నిలుస్తుంది. దీనిని కనుగొనడం వలన కలిగే ఆనందం, కళాఖండాన్ని కనుగొనడం వలన కలిగే ఆనందం కన్న గొప్పది.

అమర్నా ప్రాంతాలలో తవ్వకాలు తప్పక ఫలిస్తాయని అధికారులు భావిస్తారు. ఆ స్థలంలో చాలా మేరకు తవ్వకాలు జరుగలేదు. ఎన్నో రహస్యమైన నిధులు అక్కడ లభిస్తాయని వాళ్ళనుకుంటారు. అమర్నా ఒక ఎడారి మైదానం. తూర్పువేపు రాతి గోడలున్నాయి. పడమట నైలునది ప్రవహిస్తోంది. అమర్నా, కొద్ది సంవత్సరాలు మాత్రమే ఈజిప్టుకు రాజధానిగా ఉండేది. ఆ నగరాన్ని నెఫర్‌టిట్, అఖేనటేన్లు పరిపాలించారు. దాని జీవితం చాలా తక్కువే అయినా, నేటికీ అమర్నా అన్న పేరు వ్యాప్తిలో ఉంది. ఇప్పుడక్కడ కొన్ని దిబ్బలు, కొన్ని దారులు మిగిలి, ఆనాటి నగరానికి సాక్ష్యం పలుకుతాయి. ఒక యుగానికి ఆ పేరు నిలిచింది.

టెల్ ఎన్ అమర్నా దగ్గిర తవ్వకాలు జరపడానికి ఎంత ప్రయత్నించినా లైసెన్సు దొరకదు. తనకు లైసెన్సు దొరుకుతుందని, పెట్రీకి అసలు నమ్మకం లేదు.

ఈజిప్టు ప్రభుత్వం వారే తవ్వకాలు జరిపించాలని ఆత్రత కనబరిచారు. అమర్నా మైదానంలో ఇరవై ఆరు గోరీలున్నాయి. అవి గణింపరాని విలువకలవి. వాటిని మాత్రం ఎవరూ ముట్టుకోకూడదు.

ఫ్లిండర్స్ అదృష్టవంతుడు. అతనికి అనుమతి లభించింది. అతడు, తన పాత పనివాళ్ళలో అయిదుగురిని వెంటబెట్టుకొని, 1891 నవంబరు 17 తారీకున అమర్నా చేరుకున్నాడు. బస చేయడానికి, గుడిసెలు కట్టుకోడానికి కొంతకాలం పట్టింది. నవంబరు 23న అతడు పని ప్రారంభించాడు.

అమర్నా నగరం అక్కడ ఉందని చెప్పడానికి, తవ్వకాల నాటికి, పునాది గోడలు మాత్రమే మిగిలాయి. పొద్దున్న, సాయంకాలం సూర్య కిరణాలలో భవనాలు, వీథులు ఛాయా మాత్రంగా తోచేవి. ఇక్కడా అక్కడా తవ్వకాలు జరిపితే, అప్పుడూ అప్పుడూ ఆసక్తికరమైన వస్తువులు బయటపడేవి. ఈజిప్టుకు పాలించిన ఫారోలకు, మధ్య ప్రాచ్యంలోని రాజులకు ఉత్తర ప్రత్యుత్తరాలుండేవి. అప్పటికి నాలుగు సంవత్సరాల కింద ఒక పల్లెటూరి ఆమెకు, విధివశాత్తు, కొన్ని చిన్న సైజు మట్టి పలకలు, వందల సంఖ్యలో, లభించాయి. పైన చెప్పిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆ పలకలపై కనిపించాయి. ఈ విధంగా ఆ చోట లభించిన మట్టి పలకల వలన, అక్కడ తవ్వకాలు జరిపితే ఫలితాలు ఉండవచ్చునని తేలింది.

భవనాల యొక్క శిథిలాల సహాయంతో, పెట్రీ వీథులను గుర్తించగలిగాడు. రాజుల కోట యొక్క పునాదులను, అక్కడ ఉన్న ఆలయాన్ని గుర్తించాడు. ఒక క్రమ పద్ధతిలో తవ్వకాలు సాగించాడు. ఆ విధంగా తవ్వకాలు జరిపిన వాళ్ళలో అతడే మొదటివాడు. రాజుల కోట ఉన్నచోట ట్రయల్ ట్రెంచ్‌లు తవ్వాడు. పని మొదలు పెట్టిన మూడో రోజునే, అతడు ఒక బాటను కనుగొన్నాడు. రాళ్ళు పరచి, చదును చేసిన ఆ బాట ప్రత్యేకమయినది. ఆ బాట రంగుల బొమ్మలతో చిత్రించబడి అద్భుతంగా కనిపించింది. తుంగలలో ఉన్న నీటి బాతుల చిత్రాలు, గాఢమైన రంగులతో చిత్రించిన విదేశపు పుష్పాలను ఆ బాట మీద అతడు కనుగొన్నాడు. తరువాత మరొక రాజభవనపు నేల భాగం కనుగొన్నాడు.

తవ్వకాలు జరిపి, అమర్నా రాజభవనాన్ని, పెట్రీ బయట పెట్టాడు.

హెూవర్డ్ కార్టర్, కొద్దిరోజుల శ్రమతో, మమా ఆలయం దగ్గర కొన్ని వస్తువులను వెలుపలికి తీశాడు. అక్కడే అతడు నిలకడగా పనిచేశాడు. కాని, వచ్చిన వెంటనే అతనిని వరించిన అదృష్టం, కొద్ది రోజుల తరువాత అతనిని విడిచి పెట్టింది. పూనకం పూనిన వాడివలె అతడు, తన మనుషులను శ్రమపెట్టాడు. కాని, వారాల తరబడి శ్రమపడిన తరువాత, మూడు రాతి దిమ్మలు మాత్రం అతనికి లభించాయి. ఆ దిమ్మలు మూడూ పెద్ద స్మారక ఫలకానికి చెందినవి. ఒక రాతి దిమ్మ మీద అఖెనటేన్ యొక్క శిరస్సు చెక్కబడి ఉంది. మిగిలిన రెండింటిమీద వ్రాత గురుతులు మాత్రం కనిపించాయి. అవి స్మారక ఫలకం యొక్క ముక్కలని పెట్రీ భావించాడు. అటువంటివి అమర్నా మైదానంలోను, చుట్టుపట్ల చాలా లభించాయి.

తవ్వకాలలో కార్టర్‌కి కన్నులకు ఇంపుగొలిపే వస్తువులు లభించలేదు. కాని అతడు జరిపిన తవ్వకాలు మాత్రం, శాస్త్రీయంగా గొప్ప ప్రాముఖ్యత గలవి. ఈ తలబిరుసు మనిషి వాటిని అంతగా పట్టించుకోలేదు. అప్పటికి కూడా అతని అభిప్రాయం – ఆర్కియాలజిస్టు అంటే నిధులను వెలికి తీసేవాడని – అమ్హరెస్టు ప్రభువు యొక్క టేబిలును అలంకరించవలసిన అపురూపమైన వస్తువు లభించకపోతే, తాను పడిన శ్రమ అంతా వ్యర్థమేనని అతడు భావించాడు. ప్రపంచంలో మహత్తరమైన దేవాలయాల్లో ఒకదాని పునాదులను బయట పెట్టడం చాలా గొప్పపని అని, ఆ పునాదులు ఆర్కియాలజీ చరిత్రకే చాలా ముఖ్యమని, చరిత్రను అర్థం చేసుకోడానికి అవి చాలా ఉపయోగిస్తాయని, అవి అక్కడ దొరికే బంగారపు ముక్కలకన్నా, జాతి రత్నాలకన్న చాలా మేలయినవని అతడు బోధపరచాడు. క్రమంగా కార్టర్ ఆ నమ్మకాన్నే తనకు అన్వయించుకున్నాడు.

పనివాళ్ళు మహా ఆలయం దగ్గిర తవ్వకాలు చేస్తుంటే, కార్టర్ నిరాశతో ఒక చోట కూర్చొని, ఆ కట్టడం యొక్క ప్లానులు గీయడం మొదలు పెట్టాడు. పెట్రీ అది చూశాడు. అమర్నా నగరపు ప్లాను గీసి, అందులో మమా ఆలయం యొక్క ప్లానును అమర్చమని అతడు కార్టర్‍కి సలహా ఇచ్చాడు. ఇంతవరకూ ఎవరూ ఆ పని చేయలేదు. డ్రాయింగులో శిక్షణ పొందిన కార్టర్‌కి అది చాలా నచ్చింది. అతడు రోజూ ముప్పై, నలభై, అప్పుడప్పుడు ఏభై కిలో మీటర్లు, అంతం లేని విశాలమైన మైదానంమీద, దిమ్మరిగా తిరిగాడు, కొలతలు తీశాడు, బొమ్మలు గీశాడు. కొద్ది వారాలలో అమర్నా నగరపు మొట్టమొదటి ప్లాను వేశాడు. ఆఖేటాటాన్ యొక్క పురాతన రాజధాని అది.

ఆ ప్లాను చాలా నిర్దుష్టమైనది. పెట్రీ దానిని చూసి ఒక సలహా యిచ్చాడు. కెయిరోలో ఉన్న ప్రభుత్వపు పురావస్తు శాఖకు దానిని పంపితే, ప్రభుత్వం అతనికి ఆర్కియాలజిస్టుగా గొప్ప గౌరవమిస్తుందని, గొప్ప ఆర్కియాలజిస్టుల జాబితాలో అతని పేరు కూడా చేరుతుందని పెట్రీ చెప్పాడు.

కార్టర్ ఆ విధంగానే ఆ ప్లానులను, మినియాకు పోయి, పోస్టు చేశాడు. అటు తరువాత అవి మాయమై పోయాయి. వారాల తరబడి కార్టర్ పడ్డ శ్రమ వ్యర్థమయింది. తవ్వకాలు అతని విషయంలో శుభప్రదంగా ప్రారంభం కాలేదు.

ఫ్లిండర్స్ పెట్రీకి ముఫ్పై ఎనిమిదేళ్ళు. ఆర్కియాలజిస్టుగా అతడు ఉన్నతమైన స్థాయికి చేరుకున్నాడు. ఏ ఆటంకాలు లేకుండా అతడు పురాతన వస్తువులను బయట పెట్టాడు. నవంబరు నుండి జూన్ నెలవరకు అతడు తవ్వకాలలో వెలికి తీసిన వస్తువులు 137 పెట్టెలలో నింపారు. ఈ పెట్టెలను సరిగా నింపడానికే రెండు నెలలు పట్టింది.

కాని, కార్టర్ వయసులో చిన్నవాడు, కాబట్టి అతను ప్రయత్నం నుండి విరమించుకునే ప్రసక్తే లేదు. అతడు తన మార్గదర్శి జరిపిన తవ్వకాలను ఆశ్చర్యంతోను, శ్రద్ధతోను అనుసరించాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here