శ్రీపర్వతం-3

0
8

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది మూడవ భాగం. [/box]

5

శశికళ చాల చిత్రమైన మనిషి. ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పదిగంటలవరకు నిర్విరామంగా పనిచేస్తుంది. ఆ రోజున చేసిన పని, మరునాడు చేయవలసిన పని, సైటులో చర్చించిన విషయాలు, టెంట్లలో చర్చించిన విషయాలు సమగ్రంగా టైపు చేస్తుంది. ఫీల్డు నోట్‌బుక్ ఒకసారి చూసుకుంటుంది. ఇతర ఆర్కియాలజిస్టులను కలిసి వారితో జరిపిన సంభాషణలలోని విశేషాలను, వాటి గురించి మోహన్ వెలిబుచ్చిన అభిప్రాయాలను, తన అభిప్రాయాలను టైపు చేస్తుంది. ఆర్కియాలజీ మీద, ఇండాలజీ మీద, పురాతన భారత చరిత్ర చదువుతుంది. వ్యాసాలు చదువుతుంది.

సైటులోని పొదలను మొక్కలను తొలగించడానికి ఒక వారం రోజులు పట్టింది. మరొక వారం రోజులు ఆ ప్రదేశాన్ని సమతలంగా చేయడానికి పట్టింది. మూడు రోజులు ట్రెంచ్ లను మార్కు చేయడానికి పట్టింది.

చదును చేసిన తరువాత ఉత్తర దక్షిణాలను నాలుగు వందల ఎనభై అడుగులు పొడవు, తూర్పు పడమరలకు నూట డెబ్బై అడుగుల వెడల్పుగల సైటు త్రవ్వకాలకు నిర్ధారించడమయింది. స్థూలంగా ఇరవై అడుగుల పొడవు, పదహారడుగులు వెడల్పు గల ట్రెంచ్‌లు త్రవ్వడం కోసం మార్కుచేశారు. ట్రెంచ్‌కి నాలుగు వేపుల ఒక అడుగు స్థలం విడిచి పెట్టారు. ఆ విధంగా ట్రెంచ్‌కి ట్రెంచికి మధ్యను రెండడుగులు మందమున్న గోడ వచ్చి, పద్దెనిమిది అడుగుల పొడవు పధ్నాలుగడుగులు వెడల్పు, లోపలి కొలతలున్న ట్రెంచ్‍లు రెండువందల అరవై నాలుగు, త్రవ్వడానికి మార్కు చేశారు. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న సైటుకి కర్ణంగా గీసిన గీత మీద మూడు ట్రయల్ ట్రెంచు త్రవ్వనిశ్చయించారు.

ట్రెంచ్‍లు మార్కు చేసిన మరునాడు, ఉదయం తొమ్మిది గంటలకు సుబ్రహ్మణ్యేశ్వరరావు తిన్నగా సైకిలు మీద సైటుకు చేరుకున్నాడు. డాక్టర్ మోహన్‌కి అతడు నమస్కారం చేశాడు. శశికళ అక్కడికి కొంచెం దూరంలో మధ్యనున్న ట్రయల్ ట్రెంచి దగ్గిర ఉంది. మేటుకి సలహాలిస్తున్న ఆమె రావును చూసి తను కూడా వాళ్ళను చేరుకొంది. కుశలప్రశ్నలైన తరువాత రావు అన్నాడు.

“నిన్నను మా ఛీఫ్ యింజనీరుగారు ఢిల్లీ వెళ్ళారు. ఆఫీసులో నాకంతగా పనిలేదు. ఈ త్రవ్వకాల గురించి తెలుసుకోవాలని ఎన్నాళ్ళనుండో ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరు కూడా సరిగా చెప్పలేదు. శ్వేత చ్ఛత్రం క్రింద టేబిలుంది. దాని చుట్టూ నాలుగు స్టూళ్ళున్నాయి. ముగ్గురం ఆ పెద్ద గొడుగు నీడలో కూర్చొని, ప్లాస్కుతో నేను తెచ్చిన కాఫీ తాగుతూ సంభాషణకు ఉపక్రమిద్దాం.”

మోహన్ నవ్వాడు. శశికళ ముఖం మీద చిరునవ్వు తోచింది. ముగ్గురూ పెద్ద గొడుగు కిందికి చేరారు. సంచీనుండి పెద్ద ధర్మాస్ ప్లాస్కు తీసి టేబిలు మీద ఉంచాడు రావు. దానితో పాటు మూడు స్టీలు గ్లాసులు కూడా పైకి తీశాడు. ముగ్గురూ సావకాశంగా కూర్చొని కాఫీ త్రాగారు.

అప్పటికి పదిగంటలయింది.

“డాక్టర్ శశికళ చెప్తారా?” రావు అడిగాడు.

“సీనియర్, డాక్టర్ మోహన్ చెప్తారు” అంది శశికళ.

“నేనే చెప్తాను. మీరు మొదటినుంచి చెప్పమంటున్నారు. కొన్ని విషయాలు మీకు తెలిసే ఉంటాయి. ఒక వేళ వాటిని పునశ్చరణ చేసినా మీరు సహించాలి” అన్నాడు మోహన్.

“నాకు ఏమీ తెలియదని మీరు భావించి మొదలు పెట్టండి” అన్నాడు రావు.

“సరే వినండి! ఈ త్రవ్వకాలు పూర్వం సాధారణంగా ఒకరు లేక ఇద్దరు – వీరి ఆధ్వర్యంలో జరిగేవి. శిల్పాలను త్రవ్వకాలలో సంపాదించి తమ గృహాలలో ఉంచుకోడానికో లేక తమ దేశానికి తరలించుకుపోడానికో ధనవంతులు అలవాటు పడ్డారు. క్రమంగా ప్రజలలో జాతీయతా భావం వృద్ధి చెంది త్రవ్వకాలలో లభించినవి ఏ ఒక్కరి సొత్తు కాకూడదని, ప్రజలందరికీ అవి చెందినవని, ప్రభుత్వం వాటిని భద్రంగా వస్తు ప్రదర్శనశాలల్లో ఉంచాలని నిర్ణయాలు జరిగాయి.”

“ఈ త్రవ్వకాలకు పురాశిల్పవస్తు శాస్త్రజ్ఞుడు అంటే ఆర్కియాలజిస్టు ఒక్కడే సరిపోడు. ఒక బృందం పనిచేయాలి. పరిశోధనకు ఆర్కియాలజిస్టు నాయకుడుగా వ్యవహరిస్తాడు. అతడు ఆది నుండి అంతం వరకు పని పూర్తయే వరకు శ్రమించాలి. అతడు త్రవ్వవలసిన స్థలాన్ని ఎంపిక చేయాలి. ఆర్థిక సహాయం కోసం ప్రయత్నించాలి. పనివాళ్ళను కుదిర్చి సక్రమంగా నిర్వహించాలి. ప్రణాళిక తయారు చేసి కార్య పురోగతిని పర్యవేక్షించాలి. పరిశోధన స్పెషలిస్టుల నుండి లభించిన వివరాలను క్రోడీకరించి, తన అభిప్రాయాలను వ్యక్తం చేసి, ప్రాజెక్టును ముగింపు చేయాలి.”

“సరియైన స్థలాన్ని నిర్ణయించడానికి భూగర్భ శాస్త్రజ్ఞుడి అవసరముంది. ఇతడు బృందంలో రెండోవాడు. మూడో వాడు సర్వేయరు. స్థలంలో కొలతలు కొలిచి చుట్టుపట్టనున్న హద్దులతో సైటు ప్లాను తయారు చేస్తాడు. తరువాత అతడు డ్రాఫ్ట్‌మన్. ఇతడు త్రవ్వకాలలో లభించిన శిల్పాలను మిగిలిన ఆధారాలను, ఎక్కడ నుండి త్రవ్వారో, ఆ వస్తువు ఎక్కడుంటుందో, సమతలం కొలతల్లో ఎక్కడుంటుందో నిర్ధారణ చేసి డ్రాయింగు గీస్తాడు. ఆఖరివాడు ఫొటోగ్రాఫరు. త్రవ్వకాలలో లభించిన వాటిని, కొలత బద్ద పక్కనుంచి ఫొటోలు తీయాలి. అప్పుడు వస్తువుల కొలతలు సరిగ్గా కంటికి ఆనుతాయి. పని ఏవిధంగా పురోగమిస్తున్నదో తెలియజేయడానికి వివిధ దశలలో ఇతడు ఫొటోలు తీస్తాడు. ప్రత్యేకమైన పనిముట్లు ఎలా ఉపయోగించిందీ తెలియజేయడానికి చిత్రాలు తీస్తాడు. సైటునూ, సైటులో పనిచేస్తున్న వాళ్ళను వివిధ కోణాలలో ఫొటోలు తీసి, ప్రింటులు తయారు చేసి, పరిశోధన ముద్రణకు అందిస్తాడు.”

అపుడు రావు ఒక ప్రశ్న వేశాడు.

“మీరు చెప్పిన దాని ప్రకారం మీ టీములో కనీసం అయిదుగురు మనుష్యులుండాలి. మీరు చూస్తే ఇద్దరే కనిపిస్తున్నారు. మిగిలిన ముగ్గురూ ఏరి?”

“ఆర్కియాలజిస్టు చేయవలసిన పనిని నేనూ, డాక్టర్ శశికళ నిర్వహిస్తున్నాము. జియాలజిస్టు అవసరం మనకు లేదు. ఎందుచేతనంటే, ప్రభుత్వం వారే మనకి స్థలం కేటాయించారు. సర్వేయరు పని, డ్రాఫ్ట్‌మన్ పని, ఫొటోగ్రాఫరు పని శశికళే చేస్తున్నారు. అంటే మేమిద్దరం అయిదుగురు స్పెషలిస్టులు చేయవలసిన పని చేస్తున్నామన్నమాట. మీరు కుదిర్చిన పని వాళ్ళు చాల అనుభవం కలవాళ్ళు. ఒక సారి చెప్తే చాలు. నిరాటంకంగా పని సాగిస్తున్నారు. ఒక్క క్షణం కూడా వాళ్ళు వ్యర్థం చేయకుండా భక్తి విశ్వాసాలతో శ్రమపడుతున్నారు. ఇదీ మన బృందం గురించి” అన్నాడు మోహన్.

“త్రవ్వకాలలో పద్దతుల గురించి, మరేవేనా తెలుసుకోవలసిన విషయాల గురించి చెప్తారా?”

“డాక్టర్ శశికళను చెప్పమని కోరుతున్నాను” అన్నాడు మోహన్.

శశికళ చెప్పడం మొదలు పెట్టింది.

“త్రవ్వకాలను రెండు పద్ధతులలో నిర్వహిస్తారు. ఒకటి సమతల పద్ధతిలో చేసేది. దీనిని హారిజాంటల్ ఎస్కవేషన్ అంటారు. రెండవది నిలువుగా తవ్వే పద్ధతి. దీనిని వెర్టికల్ ఎస్కవేషన్ అంటారు. సమతల పద్ధతిలో త్రవ్వకం చేయడంవలన, పురాతన సంస్కృతిని తెలిపే ఒక దశను బయట పెట్టడం జరుగుతుంది. ఈ పద్ధతిలో స్థలమంతటినీ కాని, విశాలమైన భాగాన్ని కాని త్రవ్వుతారు.”

“నిర్ణీతమైన తక్కువ స్థలంలో, లోతుకు నిలువుగా చేసే త్రవ్వకం రెండవ కోనకు చెందుతుంది. ఈ విధంగా త్రవ్వడం వలన ఒకొక్క సంస్కృతి ఎంత కాలముందో తెలుసుకోడానికి వీలవుతుంది. త్రవ్వకం జరిపినప్పుడు ఒకొక్క సంస్కృతికి ఒకొక్క భూమి పారను ప్రత్యేకించవచ్చు. దానిని బట్టి ఆ సంస్కృతి ఎంతకాలం వ్యాప్తిలో ఉందో నిర్ణయించవచ్చు.”

“ఒక పద్ధతి రెండో పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. పెద్ద పెద్ద తవ్వకాలలో రెండు పద్ధతులను ఉపయోగిస్తారు. నిలువుగా త్రవ్వడం వలన, ఒక ప్రదేశంలో జనులు ఎంతకాలం నివసించారో, ఎంతకాలం దానిని విడిచి పెట్టారో తెలుస్తుంది. ఆ సంస్కృతికి చెందిన వస్తువులు లభించవచ్చు. కాని, ఒక సంగతి మాత్రం గుర్తుంచుకోవాలి. దీనివలన కొద్దిగా మనకు విషయం తెలుస్తుంది. మానవ సమాజానికి చెందిన ఆర్థిక వాతావరణం, మతవాతావరణం, పాలనాయంత్రాంగం గురించి ఈ పద్ధతి అల్పంగా బయట పెడుతుంది. ఒక పురాతన సంస్కృతి గురించి తెలుసుకోవలసిన విషయాలు వివరంగా తెలియవు. మానవుడి శ్రమజీవితం యొక్క లోతు పాతులు అందవు. త్రవ్వకాలు ఫలదాయకాలో కావో ఈ పద్ధతి వలన నిర్ణయించలేం.”

“ఒక సంస్కృతికి చెందిన భూమి పొర ఎలా ఏర్పడుతుందో చూద్దాం. మానవుల నివాసం క్రింద ఉన్న ఒక ప్రదేశంలో ఒకే రకానికి చెందిన వస్తువులో, లేక మరో రకానికి చెందినవో లభిస్తాయి. పోయిన వస్తువులు కాని, మానవులు విసర్జించినవి కాని, భూమిలో కప్పబడి పోతాయి. గృహాలలో నేలలు బాగుచేసినపుడు, పాత నేలలు పాతుకు పోతాయి. కట్టడాలు కూలిపోతాయి. ఆ శిథిలాల మీద కొత్త వాటిని నిర్మిస్తారు. కొన్ని కట్టడాలను వరద నాశనం చేయవచ్చు. అపుడు ఒండ్రు మట్టి ఆ శిథిలాల మీద పేరుకొంటుంది. క్రమంతా వరద తగ్గిన తరువాత ఆ స్థలాన్ని చదును చేసి తిరిగి వాడుకుంటారు. ఒకొక్కప్పుడు దీనికి భిన్నంగా, వరద వలన ఆ ప్రదేశంలో ప్రజులున్న గురుతులు తుడుచుకుపోతాయి. ఏదో ఒక విధంగా, పురాతన నగరం యొక్క భూమి, లేక పురాతన గ్రామం యొక్క భూమి మారుతుంటుంది. ఈ మార్పుల సాక్ష్యాలను సరిగా వ్యాఖ్యానించడం వలన ఆ స్థలం యొక్క దశాబేధాలను, ఆ స్థలంలో నివసించిన వారి స్థితి గతులను మనం పునర్నిర్మించడానికి వీలవుతుంది.”

అపుడు రావు ప్రశ్నించాడు.

“అయితే మీరు ఏ పద్ధతిలో త్రవ్వకాలు సాగించడానికి నిశ్చయించారు.”

“ప్రస్తుతం మనం ఇక్ష్వాకుల సంస్కృతి గురించి త్రవ్వకాలు ప్రారంభించాం. అందుచేత నిలువుగా త్రవ్విన ట్రయల్ వలన, ఆ సంస్కృతి ఏ పొరలో లభిస్తుందో తెలుసుకుని, పిమ్మట సమతలం పద్ధతిలో త్రవ్వకాలు సాగిస్తాం” అన్నాడు మోహన్.

“అయితే మీరు చాల శ్రమపడవలసే ఉందన్నమాట!”

“ఆర్కియాలజిస్టు ఆశించినది ఒకప్పుడు లభించనే లభించదు. కొన్ని పరిస్థితులలో ఆశించినది తొందరగా దొరుకుతుంది. కాబట్టి మా పని త్రవ్వకాలు సాగించడం, ఫలితాలను మీద వాడికి విడిచి పెట్టడం” అంది శశికళ.

వాళ్ళు మరికొంచెం సేపు మాట్లాడుకున్నారు.

పన్నెండు గంటలవడంతో పనివాళ్ళు పనులు ఆపు చేశారు.

వాళ్ళు ముగ్గురూ టెంట్ల వేపు నడిచారు.

6

నాగార్జున కొండలోయలో, త్రవ్వకాలు జరుగుతున్న మూడో దశలో, అంటే 1954-1960 సంవత్సరాలలో పెద్ద ఆర్కియాలజిస్టుల బృందం ఒకటి డాక్టర్ రావిప్రోలు సుబ్రహ్మణ్యం గారి నాయకత్వంలో పనిచేసింది.

పాత మ్యూజియం దగ్గిర, లోయలో, ఒక క్లబ్బు స్థాపించారు. అక్కడ సాయంకాల వేళల్లో, తీరిక దొరికినప్పుడు, సబ్యులు రింగ్ టెన్నిస్ ఆడుకునేవారు. పేపర్లు తెప్పించి చదువుకునేవారు.

ప్రతినెల ఒక మీటింగ్ జరిగేది. ఆర్కియాలజిస్టులు తమతమ అనుభవాల గురించి మాట్లాడేవారు. డాక్టర్ సుబ్రహ్మణ్యంగారు అధ్యక్షులుగా ఆ సభలకు వ్యవహరించేవారు. ఎవరైనా పెద్దవాళ్ళు నాగార్జున కొండను దర్శించడానికి వస్తే వారిని ఆహ్వానించి మాట్లాడించేవారు.

ఆరోజు క్లబ్ ఆవరణలో సాయంకాలం అయిదు గంటల నుండి మీటింగ్ జరుగుతుందని మోహన్‌కి, శశికళకు నోటీసు పంపించారు. వీళ్ళు కూడా క్లబ్ మెంబర్లుగా చేరడం నుంచి ఈ అవకాశం లభించింది.

నవంబరు నాలుగోవారం ట్రెంచిలు మార్కు చేయడం జరిగింది. అప్పుడున్న పనివాళ్ళు చాలక మరో బృందాన్ని కూడా మోహన్ పనిలోకి తీసుకొచ్చాడు. ట్రయల్ ట్రెంట్లు తవ్వుతున్నారు. ఎంత ప్రయత్నించినా అయిదు గంటలకు వాళ్ళు పనిముగించుకో లేకపోయారు. వాళ్ళిద్దరూ బయలుదేరేసరికి అయిదున్నర అయింది.

శశికళ మొదటి రెండువారాలు ఫంట్లాం, టీ షర్టు తొడుక్కొని వచ్చింది. మూడో వారం నుండి చీర కట్టుకునే వస్తున్నది. అందుచేత బట్టలు కూడా మార్చుకోవలసిన అవసరం పడలేదు.

క్లబ్బు ఆవరణలో ఇనుప కుర్చీలు వేశారు. వాటికి ఎదురుగా చిన్నటేబులు, దానిమీద నొక కలంకారి అద్దకమున్న బందరు దుప్పటి, దాని పైన గుల్ దస్తాలో పూవులు ఉన్నాయి. అధ్యక్షుని పీఠంలో డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు కూర్చున్నారు. వయసులో ఉన్న ఆర్కియాలజిస్టు ఒకరు మాట్లాడుతున్నారు.

శశికళకు ముందున్న కుర్చీ ఒకటి ఖాళీ చేసి యిచ్చారు. మోహన్ మాత్రం వెనకకే కూర్చున్నాడు. వాళ్ళిద్దరికీ క్లబ్బు కుర్రాడు బిస్కత్తులు కాఫీ తెచ్చియిచ్చాడు. సభలో కూర్చున్నవారు పాతిక మంది కూడా లేరు. కాని, అందరూ చాల శ్రద్ధతో వింటున్నారు.

ఉపన్యాసం ఇంగ్లీషులోనే సాగుతున్నది.

“క్రీస్తు శకం మూడో శతాబ్దిలో, అంటే రమారమి పదిహేడు వందల సంవత్సరాల క్రింద ఇక్కడ వో ఆరుబయట రంగస్థలి నిర్మింపబడింది. ఆ ఆంపీ థియేటరు నిర్మించినవారి ప్రతిభను మనం గుర్తించాలి. ఇది ఒక అద్భుతమైన నిర్మాణం. ఈ రంగస్థలి మధ్య భాగంలో, దిగువన ఒక వేదిక ఉంది. అక్కడో ప్రఖ్యాతుడైన ఉపన్యాసకుడు నిలబడో, కూర్చోనో ఉపన్యాసమిచ్చేవాడు. నాలుగు పక్కల గాలరీలలో శ్రోతలు నిండి ఉండేవారు. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన సంగతి ఒకటుంది. ఈ రోజులలో పెద్దవారెవరేనా ప్రదర్శన చూడడానికి వచ్చినప్పుడు ముందుసీట్లు రిజర్వుచేసి ఉంచుతాము. ఆ రోజులలో కూడా దిగువ వరుస ఆసనాలు రిజర్వయి ఉండేవి. అటువంటి ఆసనాలలో ఒకదాని దగ్గిర ‘ధనకస’ అని చెక్కబడి ఉంది. ధనకునికి చెందిన ఆసనమది. ధనకుని కోసం ప్రత్యేకించబడింది.

ఆ రోజుల్లో కూడా రిజర్వేషను పద్ధతి అమలులో ఉండేదన్నమాట. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఉపన్యాసకుడు లేక వక్త తన అభిభాషణను క్రిందవరుస వారికే వినిపించినంత మెల్లగా మాట్లాడుతాడు. ఈ రంగస్థలిని కొండవాలులో నిర్మించడంచేత ప్రతిధ్వని ప్రభావం వలన ఆ మాటలు పై వరుసలో అందరికీ, పైన కూర్చున్న శ్రోతలందరికి, పైన కూర్చున్న శ్రోతకు కూడా స్పష్టంగా వినిపించేవి. త్రవ్వకాలు జరిపిన తరువాత కూడా ఈ ధ్వని ప్రతిధ్వనుల ప్రభావం కొనసాగుతున్నది. మేము దానిని ప్రత్యక్షంగా అనుభవించాం. మేమొక మనిషిని దిగువ వేదిక మీద నిలబెట్టాము. అతనికి ఎదురుగా ఉన్న క్రింది వరుసలో కొంత మందిమి కూర్చున్నాం. దిగువనున్న మనిషిని ఉపన్యాసమిమ్మన్నాం. అతడు మెల్లగా చెప్పిన మాటలు క్రింది వరుస వారికే కాకుండా, పై వరుసలో కూర్చున్నమాకు కూడా స్పష్టంగా వినిపించాయి. ఎప్పుడైతే రంగస్థలిని విడిచి బయటికి వచ్చామో అపుడీ అనుభవం మరి కలుగదు.”

“ఆనాటి ఇంజనీర్ల శాస్త్రీయ పరిజ్ఞానం ఎంతగా పురోగమించిందో మనకు తెలుస్తుంది. నాగార్జున సాగర్ డామ్‌కి శంకుస్థాపన చేయడానికి 1954లో పండిత జవహర్‌లాల్ నెహ్రూగారు వచ్చారు. వారు లోయను సందర్శించారు. ఈ సైటే మేము ముందు ఆయనకు చూపించాం. ఈ ప్రతిధ్వని విధానం అప్పటికి సజావుగా ఉండడం చూసి ఆయన దిగ్రాంతులయారు. అప్పుడాయన ఒక మాటన్నారు. ‘మనం ఈ ప్రదేశం నుండి ప్రతి వస్తువును ఉద్దరించాలి. ఈ లోయ అంతటిలోను త్రవ్వకాలు జరపవలసింది. మన పురాతన సంపదను వెలికితీయవలసింది. కాలానికి సంస్కృతికి మధ్యను నమన్వయం కుదరాలి. ముందు త్రవ్వకాలు నిర్వహించండి. వస్తువులను పైకి తీసుకురండి. తరువాత ఈ భూమి పై నీటిని విడిచిపెట్టండి.”

“ఇది మనకున్న రంగస్థలులలో ఉత్తమమైనది. ఈ రంగస్థలం ప్రత్యేకంగా పునర్నిర్మాణం గురించి ఎంపిక అయింది.”

ఉపన్యాసకుడు ఒక క్షణం ఆగి సభికుల వంక చూశాడు. ఎదురుగా గ్లాసులో ఉన్న నీటిని తాగి, రుమాలుతో ముఖం తుడుచుకొని తిరిగి మాట్లాడాడు.

“ఇంకొకచోట విశ్వవిద్యాలయముంది. ఈ విజయపురి నిర్మాణం గురించి ఆలోచిద్దాం. ఇక్కడ లభించిన చాల శాసనాలలో ‘విజయపురి’ అన్న పేరు మనకు కనబడుతుంది. ఇది ఇక్ష్వాకుల రాజధాని అని తెలుస్తుంది. వాళ్ళు రమారమి నూట ఏభై సంవత్సరాలు విజయపురి రాజధానిగా రాజ్యమేలారు. నగరమంతా కృష్ణానది కుడి గట్టున పొడవుగా నిర్మింపబడి ఉంది. బౌద్ధుల కట్టడాలన్నీ లోయలో తూర్పువేపు నిర్మింపబడి ఉన్నవి. బౌద్ధులు సాధారణంగా నగరానికి వెలుపల నివసించేవారు, నగరానికి వచ్చి భిక్షాటనం చేసి తిరిగి తమ నివాసాలకు మరలిపోయేవారు. బౌద్ధులుండే ఒక విహార సముదాయంలో విశ్వవిద్యాలయముంది. మన జాయింట్ డైరక్టరు జనరల్, శ్రీ టి.ఎన్. రామచంద్రన్ విశ్వవిద్యాలయాన్ని గుర్తించారు. ఇది ఛాత్రులు నివసించే విశ్వవిద్యాలయం. రెసిడెన్షియల్ యూనివర్షిటీ, ఆచార్య నాగార్జునులు అక్కడ ఉండేవారని, వారు తమ జీవితం యొక్క చరమదశను అక్కడ గడిపారని, ఆయనే ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారని, తమ మాధ్యమిక సిద్ధాంతాన్ని అంటే శూన్య వాదాన్ని ఇక్కడే తొలిసారి బోధించారని చరిత్ర చెప్తున్నది. ఈ ఛాత్రులు నివసించే విశ్వవిద్యాలయానికి, ఆధునిక విశ్వవిద్యాలయాలలో కనిపించే హంగులన్నీ ఉన్నాయి. ఉదాహరణకు, దీనికి అంటి ఛాత్రావాసం, అంటే హాస్టలు ఉండేది. దానిలో విద్యార్థులు నివసించేవారు. స్త్రీలకు ప్రత్యేకమైన హాస్టలు ఉండేది. పురుషులు హాస్టలుకు, స్త్రీలు హాస్టలకు సంబంధం లేకుండా ఉంచడానికి ప్రయత్నాలు జరిగాయి. స్త్రీల హాస్టలు యొక్క ఆవరణకు ఒక వేపే ద్వారముంది. లోపలికి పోవడం, రావడం ఆ ద్వారం నుండే జరగాలి. విశ్వవిద్యాలయానికి తగిలి వైద్యశాల ఒకటుంది. మన యూనివర్సిటీ కాంపస్ హాస్పిటలు ఉంటుంది కదా! ఆ ప్రత్యేకమైన స్థలంలో స్తంభాలు కల మండపమొకటుంది. దానిని రాతి పలకలతో చుట్టూ మూసివేశారు. అక్కడ ఉన్న స్తంభాలలో ఒకదానిమీద ఒక శాసనముంది. ‘విగతజ్వరాలయ’ అన్న పేరు అందులో ఉంది. అంటే ఆ చోట జ్వరాలను తొలగిస్తారని అర్థం. అది వైద్యశాలకాక మరేమవుతుంది?”

“దానివెనుక పట్ట ప్రదానోత్సవం జరిగే కాన్వకేషను హాలుంది. అక్కడో పెద్ద వేదిక ఉంది. దానిమీద ప్రముఖులైన ఆచార్యులు, విశ్వవిద్యాయాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కూర్చుంటారు. ఆరు బయట ఉన్న ఆసనాలలో విద్యార్థులు కూర్చుంటారు. అక్కడ మనకొక సీలు, ఛాన్సిలరు ముద్ర లభించింది. ఆ ముద్రతో పాటు వైస్ ఛాన్సలర్ సీలు కూడా ఉండి ఉంటుంది. ఆ కాన్వకేషను హాలులో మూడు ఆలయాలున్నాయి. పట్టాలు తీసుకున్న విద్యార్థులు ఆ ఆలయాలలో తమ పూజలు జరిపి మరీ వెళ్ళేవారు.”

“ఇది విశ్వవిద్యాలయమని ఎలా చెప్పగలరు? ఒకే ఆవరణలో మూడు విహారాలున్నాయి. వాటి చుట్టూ ప్రహారీగోడ ఉంది. కాబట్టి ఈ భవన సముదాయం తప్పకుండా, పైని చెప్పిన నిదర్శనాల వలన, విశ్వవిద్యాలం అయి ఉంటుందని చెప్పగలం. త్రవ్వకాలలో అక్కడ ఒక సెప్టిక్ టాంక్ బయటపడింది. సెప్టిక్ టాంకు నుండి నీరింకే గొయ్యివరకు కాలువ ఒకటి, భూమి క్రిందనుండి పోతుంది. మనం నాగరకులమని చెప్పుకుంటాం కాని, పదిహేడు వందల సంవత్సరాల క్రిందే మన వాళ్ళు అంతగా పురోగమించారు. విశ్వవిద్యాలయానికి ఒక పక్కన శిల్పుల శిక్షణా కేంద్రముంది. ఆ వసారాలో చాల ఫలకాలు, పూర్తి చెయ్యనివి, లభించాయి. ఏదో మహత్తరమైన కారణం వల్ల వాటిని అలాగే విడిచి వెళ్ళిపోయారు.”

“ఇక్కడ జరిగిన త్రవ్వకాలలో ఒక్క ఇక్ష్వాకుల దశ మాత్రమే బయటపడింది. తరువాత పన్నెండు వందల సంవత్సరాలవరకు మరే రాజుల పాలనకు చెందిన దశ కనపించలేదు. నాగార్జున కొండ అన్న పేరు మధ్యయుగం నుండి వాడుకలోకి వచ్చింది. మానవులెవరూ ఈ విజయపురిలో ఇక్ష్వాకుల తరువాత నివసించినట్లు సాక్ష్యాలు లభించడం లేదు.”

“నాగార్జున కొండలో ఉన్న మహాస్తూపం, అమరావతిలోని మహాస్తూపం ఒకే కాలంలో నిర్మింపబడినట్లు తోస్తుంది. అశోక చక్రవర్తి యొక్క దూత అయిన మహా దేవ భిక్షు శాతవాహనుల పరిపాలనా కాలంలో దానిని నిర్మించాడు. రాజుల సహకారంతో ఆ శారీరక స్తూపాన్ని నిర్మించాడు. అక్కడనుండి ఆయన పలవబొగ్గకు వచ్చాడు. ఈ పలవబొగ్గ మన పలనాడు. అక్కడ నుండి అతడు సింహళానికి పోయాడు. అక్కడ రునవేలి స్తూపం కట్టించాడు. బహుశా అతడే నాగార్జున కొండలోని మహాస్తూపం నిర్మించి ఉంటాడు. ఇక్కడ ఒక ఆయక స్తంభం మీదనున్న శాసనం ప్రకారం ఇక్కడ బుద్ధుని ధాతువు నిక్షిప్తమైనట్లు తెలుస్తుంది.

“సమ్మాసంబుధస

దాతువరపరిగహీతన”

అని ఆ శాసనంలో ఉంది. వీరపురుష దత్తుని కాలంలో ఈ స్తూపానికి ‘నవకమ్మ కారికం’ జరిగింది. అంటే పునర్నిర్మాణం జరిగింది.

“నాగార్జున కొండ లేక విజయపురి ఇక్ష్వాకుల కాలంలో గొప్ప కూడలిగా ఉండేది. ఆ కాలంలో మతరపరమైన సహనం పరమోన్నత స్థాయిలో ఉండేది. ఇక్ష్వాకులు విధిగా హిందువులు. వారి బ్రాహ్మణ దేవాలయాలను నిర్మించారు. శివ, పుష్ప భద్ర, కార్తికేయ ఆలయాలవి. వారి రాణులు బౌద్ధుల భవన నముదాయాలను నిర్మాణం చేయించారు. రాజులు వైదికమైన యజ్ఞయాగాదులు వేశారు. అగ్నిష్టోమ, వాజపేయ, అవ్వమేధ యాగాలను చేశారు. వీటికి మనకు సాక్ష్యాలు త్రవ్వకాలలో లభించాయి.”

“అశ్వమేధ ఘట్టం అటువంటిది. మొట్టమొదట హోమం చేసే చితుల గురించి ఆలోచించుదాం. చితియొక్క ఆకారాన్ని బట్టి ద్రోణ చితి, కూర్మచితి మొదలయినవి మనం గుర్తించవచ్చు. నాగార్జున కొండలోయలో, దుర్గం లోపల, కూర్మచితి బయటపడింది. తరువాత యజ్ఞ యాగాదులు చేసిన యజమాని, అంటే ప్రభువు, క్రతువు ముగిసిన తరువాత అవ బృధస్నానం చేస్తాడు. ఆ స్నానం కోసం ఇక్కడ అవబృధస్నాన కుండిక నిర్మించారు. ఈ స్నానం చాల పవిత్రమైనది. ఈ జలాలు మరి వేటితోను కలిసి అపవిత్రం కాకూడదు. అందుచేత ఈ కుండికలోని నీరు కాలువ ద్వారా కృష్ణానదిలో కలిసే ఏర్పాటులు చేశారు. కుండికలోని నీటిమట్టం ఒక ఎత్తున మించకూడదు. స్నానం చేసే యజమానికి కంఠం వరకు ఈ నీళ్ళు ఉండాలి. అతని తల నీటిలో తడియ కూడదు. ఆ ఎత్తుకు మించి నీళ్ళు నింపితే ఆ నీరు పైకి వెళ్ళిపోయే ఏర్పాటులున్నాయి. ఆ నీటి ఎత్తును బట్టి ఇక్ష్వాకుమహారాజుల ఆకారం మనకు తెలుస్తుంది. పురుషకారం ఆరు అడుగుల ఒక అంగుళం వరకు ఉంది. అంటే మహారాజు ఎత్తు, కంఠం వరకు ఆరడుగులను మించిందన్న మాట. కాబట్టి వారు ఆజానుబాహువులని, పొడవైనవారని కావ్యాలలో చెప్పిన మాట రూఢి అవుతున్నది. ఈ విధంగా మనకు ఆర్కయాలజీ పరమసత్యాన్ని బహిర్గతం చేస్తున్నది.”

“అవబృధ స్నాన కుండికకు కొద్ది దూరంలో ఉపసంవేషణా వేదిక ఉంది. ఈ వేదిక పైన పట్టమహిషి మృతాశ్వంతో ఒక రాత్రి గడుపుతుంది. అక్కడ లభించిన అశ్వకళేబరం, జతకలిసే భంగిమలో కనిపించింది. ఇటువంటి సూక్ష్మమైన వివరాలు ఒకటి కొకటి అనుసంధానిస్తే ఇక్ష్వాకుల చరిత్ర మనకు అవగతమవుతుంది.”

ఉపన్యాసకులు అంతటితో ఆగిపోయారు. ఒక నిమిషం కుర్చీలో కూర్చున్నారు.

“ఏమైనా ప్రశ్నలు వేయవచ్చా?” సభికులొకరు ప్రశ్నించారు.

“తప్పకుండా!”

“ఇక్ష్వాకుల కాలం నాటికి నాగార్జునకొండలోయలో వజ్రయానం ఉండేదా?”

“నాగార్జున కొండ త్రవ్వకాలలో అటువంటి సాక్ష్యాలు లభించలేదు. అమరావతి, శాలిహుండాం త్రవ్వకాలలో వజ్రయాన దేవతల ప్రతిమలు లభించాయి.”

“లాంగ్ హార్ట్స్ దొరగారు కృష్ణానదీ తీరాన బల్లకట్టు, సుంకాలు వసూలు చేసేశాల ఉన్నాయని వ్రాశారు. అవి ఏమయాయి?”

“రామ చంద్రన్ 1938లో తవ్వకాలు జరిపినప్పుడు కూడా నది ఒడ్డున ఉన్న ఆ స్థలం పూర్తిగా బయట పెట్టలేదు. మనం తవ్వకాలు చేసిన తరువాత ‘ఎల్’ ఆకారంలో ఉన్న గొప్ప ఆలయమొకటి వెలువడింది. కాబట్టి అది, బల్లకట్టుకాని, సుంకాలు వసూలు చేసే శాల కాని కాదు. ఈ ఆలయం పేరు సర్వ దేవాలయం. క్రింది భాగమే కాక మీదనొక అంతస్తు కూడా బయటపడింది. కాని, విచారించవలసిన విషయమేమంటే ఈ ఆలయం పూర్తిగా కాలిపోయింది. బూడిద ఈనాటికి కూడా అక్కడ లభించింది”.

“మీరు ఈ శిల్పాలను చాల వరకు పైకి తీశారు. వాటి గురించి ఆసక్తికరమైన విషయాలు, ఒకటి రెండు చెప్పగలరా?”

“నాగార్జున కొండ శిల్పాలను మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని విశేషాలు కనిపిస్తాయి. మన ఆచార వ్యవహారాలు అనాదిగా వస్తున్నవని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఎవరేనా చనిపోతే మృతశరీరానికి తలవైపున దీపం వెలిగించి పెడతాము. అటువంటిది ఈ శిల్పాలలో ఒకదానియందు కనిపిస్తుంది. కస్టమ్స్ డై హార్డ్. ఇక మరో విశేషం. ఈ శిల్పాలలో చాలమంది మనుష్యులను మనం చూస్తున్నాం. మహారాజులు, రాణులు, సామాన్యులు, చివరకు సిథియన్ సోల్డర్లు – కాని ఏ ఒక్కరూ పాదరక్షలు ధరించినట్లు శిల్పాలలో కనిపించదు. ఆ కాలానికి పాదరక్షలు వ్యహారంలో లేవా? ఉండే ఉంటాయి. కాని అంతఃపురాలలో, రాజసభలలో, ఆలయాలలో, విహారాలలో, చివరకు శ్మశానాలలో వాటిని వేసుకోరు కాబోలు. శిల్ప సంపద పవిత్రమైనది. అందుచేత జోళ్ళు తొడుక్కోని ఆచారమేదో ఆనాడు ఉండి ఉంటుంది. ఇక శిల్పాల గురించి ఆ మధ్యను మేము ఢిల్లీలో జరిగే పురావస్తువుల ప్రదర్శనకు నాగార్జున కొండలో లభించిన శిల్పాలు పంపడానికి ఏర్పాటులు చేశాం. కాని, ఈ వార్త ఎలా తెలిసిందో, ఈ ప్రాంతపు జనులు మా దగ్గరికి వచ్చి అటువంటి పని చేయడానికి వీలు లేదన్నారు. మా నాగార్జున కొండ శిల్పాలను ఎక్కడికి తరలించడానికి వీలు లేదన్నారు. వారిలో శ్రీ గుర్రం మల్లయ్య గారు కూడా ఉన్నారు. అపుడు వారికి మేము బోధపరిచాం. మన శిల్పాలు ఉత్తమ శ్రేణికి చెందినవని నలుగురూ చూస్తేనే కదా రూఢి అవుతుంది. అందుచేత రాజధానిలో వాటి ప్రదర్శనకు ఏర్పాటు చేశామని, అటుపిమ్మట వాటిని నాగార్జున కొండకు తిరిగి తీసుకువస్తామని నమ్మకంగా వారితో చెప్పాము. ఇక్కడి ప్రజలకు మన సంస్కృతి మీద, మన శిల్ప సంపద మీద ఉన్న అభిమానం రుజువు చేయడానికి ఈ సంఘటన చాలు.”

మరే ప్రశ్నలు రాలేదు.

“నా ఉపన్యాసం ముగించే ముందర రెండు మాటలు చెప్పాలి. ఈ బౌద్దానికి నాకు ఏదో అవినాభవ సంబంధముంది. నా ఆలోచనలలోను, నా చుట్టూ బౌద్ధమే నిండి ఉంది. ఆంధ్ర దేశంలో వేయేళ్ళు వర్థిల్లిన ఈ మతం నా జీవితాన్నే నడిపిస్తున్నది.”

ఉపన్యాసం ముగిసింది.

అధ్యక్షులు డాక్టర్ సుబ్రహ్మణ్యంగారు లేచి నిలుచున్నారు. గొంతు సవరించుకున్నారు.

“మిత్రులారా! మీరందరూ మన కృష్ణమూర్తి ఉపన్యాసం విన్నారు. ఈ సందర్భంలో మా గురువుగారు మార్టిమర్ వీలర్ గారి సూక్తి నొకటి చెప్తాను. ‘ఆర్కియాలజిస్టు త్రవ్వకాలు జరిపి వస్తువులను బయటికి తీయడం లేదు. అతడు ప్రజలనే వెలుపలికి తెస్తున్నాడు.’ ఆర్కియాలజిస్టు మట్టిని జల్లెడ పడుతున్నాడు. వేలకొలది సంవత్సరాల క్రింద అక్కడ నివసించిన ప్రజల జీవితాలను సమీకరిస్తున్నాడు. తొందరపాటుగా చేసిన త్రవ్వకాలలో చాల విలువైన ఆధారాలు నిర్మూలనమయాయి. నేడు మనకున్న శాస్త్ర పరిజ్ఞానం, పద్ధతి, చాల జాగ్రత్తగా, శ్రమపడి పనిచేసే ఆర్కియాలజిస్టుల బృందం యొక్క ఆధ్వర్యంలో ఏ చిన్న విషయాన్ని, ఎంత స్వల్పమైనా, విడిచి పెట్టకుండా శ్రద్ధ తీసుకుంటున్నది. కుండ పెంకులు, పిల్లలాడుకునే విరిగిన బొమ్మ, చెత్త నిండిన కుండీ ఇవి తరచు ప్రజల దైనందిన జీవితాల గురించి, విశదంగా చెప్పగలవు. చాల ఆకర్షణీయంగా కనిపించే భవనాలే ఈ పనికి అవుసరమని అనుకోనక్కరలేదు. మనం ఎంతో చేశాం. అంతకు కొన్ని రెట్లు చేయవలసిన పని ఉంది.”

సభ ముగిసింది. అందరూ శ్రీ కృష్ణమూర్తిగారిని, గురువుగారైన డాక్టరు సుబ్రహ్మణ్యం గారిని కలిసి అభినందించారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here