శ్రీపర్వతం-32

0
10

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 32వ భాగం. [/box]

38

[dropcap]వా[/dropcap]ళ్ళ భోజనాలయేసరికి రాత్రి పది దాటింది. తొందరగా వంట సామాన్లు, పాత్రలు సర్దుకొని, టెంట్లకు ముందుగానున్న ఖాళీ స్థలంలో కుర్చీలు వేసుకొని వాళ్ళు కూర్చున్నారు.

వెన్నెల, తూర్పునున్న నల్లమలై పంక్తిని ఎక్కి లోయలోకి ప్రసరించింది. జావా వేసిన మల్లె మొక్కలు బాగా మొగ్గ దొడిగాయి. చామంతుల పూత ఎప్పుడో అయిపోయింది.

“శశికళగారూ! మీరు చాలా ఆసక్తికరమైన విషయం చెప్తూ మధ్యలో ఆపేశారు. ఫారోల శాపసిద్ధాంతం కోసం చెప్పిన విషయం అసంపూర్ణంగా ఉండిపోయింది. నాకు నిద్ర రావడం లేదు. మోహన్ కూడా పన్నెండుకు ముందు పడుక్కోరు. మీరు శ్రమగా భావించకుండా ఉంటే, టుటన్ ఖమున్ సమాధిలో కనుగొన్న విచిత్రాలతో పాటు, ఆర్కెలాజికల్ సాక్ష్యాలతో స్కాలర్లు అతని జీవిత చరిత్రను ఏవిధంగా రూపొందించినది చెప్పండి. అంతే కాకుండా మమ్మీలను ఎలా తయారు చేస్తారో చెప్పండి” అన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరరావు.

“మోహన్! మీరు ఈజిప్టాలజీ బాగా చదివే ఉంటారు. నేను మళ్ళా చెప్తుంటే మీకు బోర్ కొట్టదు కదా?” అంది శశికళ.

“నేనీ విషయం అంతగా చదవలేదు. వివరంగా వినడానికి నేనుకూడా సిద్ధమే” అన్నాడు మోహన్.

శశికళ చెప్పడం మొదలు పెట్టింది.

కార్నర్‌వాన్ ప్రభువుతో హోవర్డ్ కార్డర్ పదిహేను సంవత్సరాలు కలిసి పనిచేశాడు. అతడు చనిపోయాడన్న సంగతి కార్టర్‌కి సందేహంగానే ఉండిపోయింది.

కార్టర్ 1923 అక్టోబరుతో తిరిగి ఆక్సర్స్ నగరం చేరుకున్నాడు. తనతో పనిచేసిన అహ్మతన అన్న ఫోర్‌మెన్‌తో బుటన్ ఖమున్ సమాధిని చేరుకున్నాడు.

టుట్ అంక్ అమున్ సమాధి మందిర సముదాయం గురించి మరోసారి చెప్తున్నాను. పదహారుమెట్లు లోపలికి దిగిన తరువాత ఒక వసారా ఎదురవుతుంది. ఈ వసారా పొడవు రమారమి ఇరవై అయిదు అడుగులు. వెడల్పు అయిదు అడుగులు. ఈ వసారా చివర అడ్డుగ కట్టిన గోడను తొలగించి వెళ్లే సమాధికి పక్కనున్న గదిలోకి కాలు పెడతాము. దీనిని పార్శ్వ మందిరమని పిలుద్దాం. ఈ గది పొడవు ఇరవై ఆరు అడుగులు. వెడల్పు పన్నెండడుగులు. దీనికి ఎదురుగా పదమూడడుగుల పొడవు, తొమ్మిదిన్నర అడుగులు వెడల్పుగల చిన్నగది ఒకటి ఉంది. పార్శ్వమందిరానికి కుడివేపు సమాధి మందిరం ఉంది. సమాధి మందిరానికి దిగువున కోశాగారముంది.

కోశాగారం యొక్క ద్వారం సమీపంలో ఒక బంగారు పెట్టె ఉంది. దానిమీద ఒక నక్క, దుముకడానికి సిద్ధంగా కూర్చొని ఉంది. ఈ నక్క, దేవుడికి చెందిన పవిత్రమైన మృగం. అది సమాధిలోని రహస్యాల నన్నిటినీ కాపాడుతుంది. ఆ పెట్టెను, ఇంకా అప్పుడే అర్చకులు మోసి తెచ్చినట్లుంది.

ఆ పెట్టె వెనుక నలుగురు కన్యలున్నారు. వాళ్ళు తొడిగిన బట్టలు చాలా పలుచగా ఉండి శరీరమంతా కనిపిస్తుంది. వాళ్ళు చేతులెత్తి, మెరుగు పెట్టిన గోడలకు చేరబడ్డారు. ఈ గది కూడా సమాధి గృహం వలె కనిపిస్తుంది. అక్కడనున్న చంద్రకాంత శిలా ఫలకం మీద చిత్రలిపి కనిపిస్తుంది. ఈ ఫలకం మీది భాగంలో నాలుగు గూళ్ళున్నాయి. వాటిలో చిన్న శవపేటికలున్నాయి. ఈ పేటికలలో టుటన్ ఖమున్ ప్రేగులున్నాయి. ప్రతి పేటిక కప్పుమీద రాజుగారి ముఖం చెక్కబడి ఉంది.

పెద్ద పెట్టెను కార్టర్ లాబరేటరీకి తరలించాడు. అపుడు చిన్నచిన్న శవపేటికల మీద చెక్కిన టుటన్ ఖమున్ పేరు, మరొకరి పేరు, మీద చెక్కినట్లు తెలిసింది. అఖెనటెన్ యొక్క సహపాలకుడైన స్మెన్ ఖెర్ ప్రేగుల కోసం తయారయిన పెట్టెలను టుటన్ ఖమున్ ప్రేగుల కోసం ఉపయోగించారు.

కోశాగారం కుడిచేతి మూలకు ఇరవై రెండు నల్లటి పెట్టెలున్నాయి. అవి చిన్న అమలరాలవలె ఉన్నాయి. వీటిలో టుటన్ ఖమున్ పునరుద్ధరించిన దేవతల విగ్రహాలున్నాయి.

ఈ అలమరాలపైన పధ్నాలుగు బొమ్మపడవలున్నాయి. చనిపోయిన వాళ్ళు ఈ పడవలలో ఊర్థ్వలోకాలకి పోతారు. కార్టరుకి రెండు చిన్నశవ పేటికలు కనిపించాయి. వాటిలో రెండు శిశువుల మమ్మీలున్నాయి. నెలలు నిండకపూర్వం జన్మించిన శిశువుల వలె అవి కనిపించాయి. తరువాత సలిపిన పరిశోధనంలో, ఆ మృత శిశువులు ఆడపిల్లలని, అయిదవ నెలలోను, ఏడవ నెలలోను మృతి చెందారని తెలిసింది. వాళ్ళు టుటన్ ఖమున్ కుమార్తెలయి ఉంటారు. కార్టర్ వాటిని కెయిరోకి తీసుకొని పోయిన తరువాత అవి మాయమయి పోయాయి.

పెట్టెలలోను, మందసాలలోను చాలా నగలు, విలువైన రత్నాభరణాలు కుక్కి ఉన్నాయి.

ఈ పూజా గృహానికి అగ్నేయదిశలో చలువరాతితో చేసిన ఒక దీపం కనిపించింది. ఈజిప్టు యొక్క మూడు వేల సంవత్సరాల చరిత్రలోను దీనికి సాటియైనది రాలేదు. చిన్న పీఠం మీద, ఆసన పాత్ర ఆకారంలో గిన్నె ఒకటి ఉంది.

దానికి రెండుపక్కల శాశ్వతుడైన దేవత ‘హా’ యొక్క బొమ్మలున్నాయి. ఆ పాత్ర యొక్క వెలుపలి భాగం చాలా నున్నగా ఉంది. దానిమీద ఎటువంటి అలంకరణ లేదు. మొట్టమొదట సాదాసీదాగా కనిపించిన ఆ గిన్నె, కొంచెం నిశితంగా పరిశీలించిన తరువాత అదొక అసాధారణమైన దీపమని, చాలా కౌశలంతో చేసినదని తెలియవచ్చింది. పాలరాతి గిన్నెలో నూనెపోసి, దానిలో తేలుతున్న వత్తిని వెలిగిస్తే లోపలనుండీ ఆ గిన్నె ప్రకాశించేది. అప్పుడా గిన్నె లోపలి భాగంలో టుటన్ ఖమున్, అతని భార్య అంకెసెనమున్ల చిత్రాలు కనిపిస్తాయి. వీరి మెడలలో పూలదండలున్నాయి. ఈ బొమ్మ ఆ విధంగా కనపడడానికి ఒక కిటుకుంది. పెద్దగిన్నెలో మరో చిన్న గిన్నె ఉంది. దీనిమీద రచించిన చిత్రాలు, దీపం వెలిగించడంతోనే నున్నగా ఉన్న పైగిన్నె లోపలిభాగం మీదపడి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

సమాధిలో ఆరు రంగులు మాత్రం కనిపించాయి. తెలుపు, పసుపు, నలుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులవి. ఈ రంగుల మీద గుగ్గిలంతో వార్నీష్ చేయడం చేత, ఈ పూత వేడికి కరిగి, రంగులకు గాలి తగులకుండా కప్పడం చేత, ఆ రంగులు కిందటి దినమే వేసినట్లు కనిపిస్తాయి.

చాలా ప్రయత్నాలు చేసి, చివరకు శవపేటిక తెరిస్తే, బాలరాజు టుటన్ ఖమున్ యొక్క బంగారపు బొమ్మ కనిపించింది. దివ్యమైన పనివాడితనం దానియందు కనిపిస్తుంది. మూడు వేల రెండు వందల ఏభై సంవత్సరాలకు పూర్వం ప్రజలు టుటన్ ఖమున్‌ని సమాధి చేశారు. ఏదో ఒక రోజు, మృత్యుదేవత, ఓసరిస్ అతనిని తన రాజ్యంలోకి తీసుకుపోతాడని, స్వర్గలోకంలోని నదీతటాలపై అతడు విహరిస్తాడని అంటారు. చనిపోయిన ఫారోపై కప్పిన బంగారపు తొడుగు బాలరాజు యొక్క అనంతమైన సౌందర్యాన్ని వెదజల్లుతున్నది. పునర్జన్మకిది నమూనా.

ఆ బంగారు రాజు యొక్క కళ్ళు నల్లటి గాజు రాళ్ళు తాపినవి. అవి సజీవంగా కనిపించాయి. కాని, ఆ కళ్ళు ఎవరివంక చూడడంలేదు. అధోముఖంగా ఉన్నాయి. రాచఠీవితో అవి చాలా సుందరంగా ఉన్నాయి. హుందాగా మనసుకు హత్తుకొనేటట్లున్నాయి. అవి శాశ్వతత్వాన్ని సూచిస్తున్నాయి. లోపలికి ప్రవేశించిన వారిని చాలా చులకనగ చూస్తున్నట్లున్నాయి. ధనువులవలె వంగిన కనుగొమలు ఇంద్రనీలమణితో చేసినవి. త్రాచుపాము దిగువ ఈజిప్టుకు చిహ్నం, రాబందు ఎగువ ఈజిప్టుకు – రెండు చిహ్నాలు అతని నుదిటిపై ఉన్నాయి. పాము ఉత్తరానికి, రాబందు దక్షిణానికి తిరిగి ఉన్నాయి. ఈ గిల్లు శవపేటిక ఏడడుగుల మూడంగుళాలు పొడవుంది. రెండడుగుల నాలుగంగుళాలు ఎత్తుంది. ఈ శవపేటికలో మరికొన్ని వస్తువులున్నట్లు ఆర్కియాలజిస్టులకు తెలియవచ్చింది.

ఆ శవపేటికమీద ఈ విధంగా వ్రాసి ఉంది.

“ఓ మాతా! నట్! నాశనం లేని నక్షత్రాలవలె నా పైని నీ రెక్కలు చాచవలసింది”.

టుటన్ ఖమున్ శవపేటిక సమాధి నుండి వెలుపలికి తీసుకుపోడానికి ఇబ్బందులు కలిగాయి. ఈజిప్టు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కార్టర్ చాలా కోపంతో ఈజిప్టు వదిలి ఇంగ్లాండు వెళ్లిపోయాడు.

ఇంతలో ఈజిప్టుకి స్వాతంత్ర్యం వచ్చింది.

హోవర్డ్ కార్టర్ ఉత్తర అమెరికాలో పర్యటించి తన విజయం మీద ఉపన్యాసాలిచ్చాడు. చాలా డాలర్లు గడించాడు. గౌరవ డాక్టరేట్ పట్టాలు అతనికి లభించాయి. 1924 డిసెంబరులో కార్టర్ ఇంగ్లండు చేరుకున్నాడు. ఈజిప్టు ప్రభుత్వం అతనికి టుటన్ ఖమున్ సమాధి పై పనిచేయడానికి ఆహ్వానించింది.

1925 – జనవరి – 25 తారీకున కార్టర్ టుటన్ ఖమున్ సమాధిని తెరిపించాడు, తవ్వకాలలో మూడువేల వస్తువులు లభించాయి. అక్కడ నుండి కెయిరో మూడు వందల మైళ్ళుంది. వీటినన్నిటిని 89 కర్ర పెట్టెలలో నింపారు.

కార్టర్ ఈ పెట్టెలను గమ్యం చేర్చడానికి చాలా శ్రమపడ్డారు. మేనెల రెండో వారం టెంపరేచర్లు నూరు డిగ్రీలు దాటేవి. కొన్ని వస్తువులపై కొవ్వు కరిగించి పోసి భద్రం చేశారు. వేడికి కొవ్వు కరిగి పోయే స్థితికి చేరుకుంది. కార్టర్ గుడ్డలు తడిపి ఆ పెట్టెలకు చుట్టాడు.

ఆ వేడిలో శవపేటికలను తెరవడం వలన ప్రయోజనం లేదు. కార్టర్ ఇంగ్లండు వెళ్ళిపోయాడు.

మళ్ళా సెప్టెంబరులో ఈజిప్టు తిరిగి వచ్చాడు.

టుటన్ ఖమున్ సమాధిలో పని ముగించడానికి వాలీ ఆఫ్ కింగ్స్‌కి మరలి వచ్చాడు. అక్టోబరు 13 తారీకున పని మొదలు పెట్టాడు.

పవిత్రమైన సమాధి నుండి శవపేటికలను తీయడం అనుకున్నంత సులువు కాలేదు. మమ్మీ ఆకారంలో ఉన్న పై శవపేటిక, లోపలి పేటికకు బంగారపు మేకులతో బిగించబడి ఉంది. 18-21 కారెట్ల బంగారపు మేకులవి.

రెండవ శవపేటిక చుట్టూ బట్ట చుట్టి ఉంది. చాలా పలుచగా, లోపల ఉన్నది కనిపించవలసినదా బట్ట. దానిని ముట్టుకుంటే అది విచ్చిపోయింది. శవపేటిక బంగారు పొరను గోధుమరంగు పొర ఒకటి చుట్టుకొని ఉంది. చెమ్మ చేరినట్లుంది. మమ్మీ పూర్తిగా ఎండక పూర్వమే పెట్టిలో పెట్టినుట్లుంది.

మూడవ శవపేటిక రెండవ శవపేటికలో ఉంది. అది చాలా బరువుగా ఉంది. రెండవ శవపేటిక మూత తెరిచిన తరువాత లోపలికి చూస్తే అది బంగారంతో చేసినట్లు తెలిసింది. అందుచేతనే చాలా బరువుగా ఉంది. అది 224 కిలో గ్రాములు బరువుంది. ఎనిమిది మంది చాలా శ్రమతో దానిని ఎత్తగలిగారు. శవపేటిక మీద కొట్టిన పది బంగారపు మేకులను తీసిన తరువాత, పైనున్న బంగారపు కప్పును తీయడానికి వీలయింది. అపుడు పెట్టె మూత ముందుభాగాన్ని ఎత్తారు. లోపల విస్మృతుడైన ఫారో యొక్క మమ్మీ కనిపించింది. ముఖం పైన డెత్ మాస్క్ ఉంది. దాని మీద ఒక గుడ్డ కప్పి ఉంది. కార్టర్ ఆ బట్టను తొలగించాడు. టుటన్ ఖమున్ చూపులు ఆర్కియాలజిస్టులను దాటి పైకి పోయాయి. శరీరం పూర్తిగా లేపనాలతో నిండి ఉంది. శిరోభాగాన్ని, పాదాలను మాత్రం వాటితో నింపలేదు.

ఆ శిరసు దివ్యమైన సౌందర్యంతో వెలుగొందుతున్నది. దాని నుండి దృష్టి మరల్చుకోడం కష్టం. ఫాలం మీద రాబందు – సర్పం – వీటి చిహ్నాలున్నాయి.

శిథిలమవుతున్న హారమొకటి కంఠాన్ని అలంకరించింది. నీలపు పూసలు, బంగారపు చక్రాలు ఈ హారంలో ఉన్నాయి. వక్షం మీద పెద్ద బంగారపు పేడపురుగు వేలాడుతున్నది. అతని చేతులు గుండెల మీద ముడుచుకొని ఉన్నాయి. చేతి వేళ్ళు బంగారపు బరలలో ఉండి, కొంకి కర్రను ధాన్యం నూర్చే గుదియను పట్టుకున్నాయి.

కార్టర్ వాటిని తాకగనే ఆ రాజు చిహ్నాలు విచ్చిపోయి ధూళిగా మారిపోయాయి.

శరీరానికి చుట్టిన బట్టలను వెడల్పైన బంగారు పట్టీలు కట్టి ఉంచాయి. వాటి మీద శాసనాలు లిఖింపబడి ఉన్నాయి.

ఒక శాసనం ఇలా ఉంది.

“ఓ నా ప్రియమైన పుత్రుడా! ఓసరిస్ సింహాసనానికి వారసుడా! నీ రాజవంశ జన్మ పరిపూర్ణమయినది. నీ రాజభవనం శక్తివంతమయినది. నీ పేరు ప్రజల నోళ్ళలో మెదలుతునని. నీ స్థిరత్వం జీవించిన నరుల నోళ్ళలో కొనియాడబడుతున్నది. ఓ ఓసరిస్! ఓ టుటన్ ఖమున్ రాజా! నీ హృదయం శాశ్వతంగా నీ శరీరంలో ఉంటుంది.”

-మృత శరీరం పైన పూసిన లేపనాలు చుట్టూ కట్టిన బట్టను బాగా పాడుచేశాయి. లేపనాలలోని ఆమ్లాల ప్రభావం వలన, పైన కట్టిన బట్ట నలుపెక్కి నాశనమయింది.

పైకప్పు, మమ్మీ – ఈ రెండూ పెట్టె అడుగు భాగానికి అంటుకుపోయాయి. ఆర్కియాలజిస్టులు ఆ శవపేటికను దూరంగా ఉన్న లాబరేటరీకి తీసుకుపోయారు. ఎండలో టెంపరేచరు 65° సెంటీగ్రేడ్ వరకు పోయింది. ఈ విధంగా దానిని రెండు రోజులుంచినా, ఆ మమ్మీ బయటికి రాలేదు.

1925 నవంబరు, 11 తారీఖున కార్టర్, కరిగించిన మైనం మమ్మీకి చుట్టిన బట్టం మీద రాశాడు. డాక్టర్ డెర్రీ మమ్మీ వక్షం నుండి పాదాల వరకు స్కాల్ పిల్లో కొద్ది లోతుకు కోశాడు. మమ్మీకి చుట్టిన బట్టలు నారింజపండు తొక్కవలె విచ్చిపోయాయి. తావీదులు బయటపడ్డాయి. రాజు యొక్క మృతశరీరానికి దృష్ట శక్తుల ప్రభావం లేకుండా వాటిని కట్టారు. పీకనుండి కడుపు వరకు పదమూడు పొరల బట్ట ఉంది. దాని నుండి కార్టర్ 35 రక్షరేకులును పైకి తీశాడు.

మరునాడు మమ్మీని 180° ఫారన్ హీట్ గల ఎండలో ఉంచారు. తరువాత టుటన్ ఖమున్ మమ్మీని చూడడానికి వీలయింది.

విస్మృతుడైన ఫారో యొక్క శరీరం ముతుకగా ఉంది. గోధుమ రంగు తెలుపుగా ఉంది. పాదాలకు బంగారపు పాదరక్షలున్నాయి. కాలివేళ్ళు కూడా చేతి వేళ్ళవలె బంగారపు బరలలో ఉన్నాయి. అతని కుడిచేతికి బంగారపు మురుగుంది. బుజాలకు బంగారపు భుజకీర్తులున్నాయి.

కడుపు మీద ఒక కోత కోయగనే, మమ్మీకి కట్టిన బట్టలు తొలగిపోయాయి. మెలకిందుగా, ఎడమ వేపు, పొట్ట కింద ఒక కోత కనిపించింది.

మహారాజుగారి జననాగం రెండంగుళాలు పొడవుంది. దాని చుట్టూ బట్ట చుట్టి నిలబెట్టి ఉంది. రోమ రాజి కనపించలేదు.

టుటన్ ఖమున్ తొడ ఎముకలను బట్ట డాక్టర్ డెర్రీ ఒక నిర్ధారణకు వచ్చాడు. చనిపోయే నాటికి రాజుగారి వయసు పద్దెనిమిదేళ్ళకు ఇరవై ఏళ్ళకు మధ్య నుండవచ్చునని అతడు అన్నాడు.

14వ తారీకు నాటికి విస్మృతుడైన ఫారో యొక్క కళేబరం పూర్తిగా వెలుపలికి వచ్చింది. కళ్ళలో గుడ్లు లేవు, గోతులు మాత్రం ఉన్నాయి. నాసికా రంధ్రాలలో గుడ్డలు కుక్కినట్టున్నారు. బంగారపు మాస్కు కింద ముఖం నలగకుండా ఆ పని చేసినట్లున్నారు.

పై పెదవి ఎత్తితే పళ్ళు చాలా అసహ్యంగా కనిపించాయి. మమ్మీ చెవులు చిన్నవి, చెవితమ్మెలకు పెద్దకన్నాలున్నాయి. టుటన్ ఖమున్ బట్టతలవాడు. చిన్న పూసలతో కుట్టిన కుళ్ళాయి అతని తలమీద ఉంది.

రాజుగారి మమ్మీ అయిదడుగుల నాలుగంగుళాలు పొడవుంది. బ్రతికిన దినాలలో రాజు అయిదడుగుల ఆరంగుళాలు పొడవుండేవాడు.

కార్టర్ 1925 డిసెంబరు 1వ తారీకున అక్బర్ విడిచిపెట్టాడు. ఆ విధంగా విస్మృత ఫారోని హోవర్డ్ కార్టర్ లోకానికి ప్రసాదించాడు.

ఇంతవరకూ శశికళ చెప్పింది. అప్పటికే రాత్రి ఒంటగంట అయింది.

“మీరు చెప్పవలసింది ఇంకా కొద్దిగా ఉండిపోయింది. తవ్వకాలలో బయట పడిన సామగ్రితో ఆర్కియాలజిస్టులు టుటన్ ఖమున్ చరిత్రను ఏవిధంగా సృజించగలరు? ఇక రెండో ప్రశ్న – మృత శరీరాలను ఏవిధంగా మమ్మీలుగా మార్చుతారు?” సుబ్రహ్మణ్యేశ్వరరావు ప్రశ్నించాడు.

“శశికళ బాగా అలసిపోయారు. రాత్రి కొంతవరకు విశ్రాంతి తీసుకుంటేనే కాని పొద్దున్న సైటుకి వెళ్ళలేరు” అన్నాడు మోహన్.

“నేను నాలుగు రోజుల కింద ఇక్కడికి వచ్చాను. మన మందరం బుద్ధ పూర్ణిమ ఘనంగా జరుపుకున్నాము. మీరు ఇక్కడ పని ప్రారంభించి ఆరునెలలు దాటాయి. తవ్వకాలు పూర్తికావచ్చాయి. ఇప్పటికేనా ఏదేనా వస్తువుకాని, కట్టడం కాని బయట పడితే మీ శ్రమ ఫలిస్తుంది. ఇంతకాలం ఏదో ఆశతో పనిచేశారు. ఒక సంగతి మాత్రం నిజం – తవ్వకాలలో ఏమీ చెప్పుకోదగ్గవి లభించపోయినా, విజయపురి నిజస్వరూపం గురించి, ఇక్ష్వాకుల గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. మార్చి మూడో వారం నుండి ఎండలు ముదరడం మొదలు పెట్టాయి. ఇప్పుడు మనం ఒక అగ్ని కుండంలో పనిచేస్తున్నాం. రాత్రి ఎంతో గడిస్తేనే కాని భూమి చల్లబడడంలేదు. ఇంతవరకు శశికళ చెప్పిన విషయం, ఈ రాత్రి పూర్తిచేయకపోతే, మళ్ళా తెలుసుకోడానికి అవకాశం లభించదని అనుమానంగా ఉంది” అన్నాడు రావు.

మోహన్ దీర్ఘంగా నిట్టూర్చాడు. శశికళ చెప్పడం ప్రారంభించింది.

ఈ పిరమిడ్లు ముఖ్యంగా ఈజిప్టులోనే ఉన్నాయి. ఇటువంటి కట్టడాలు కొన్ని మెసపటేమియాలో, మెక్కికోలో ఉన్నాయి. మెక్సికో సిటీకి సమీపంలో నున్న పిరమిడ్ 216 అడుగుల ఎత్తుంది.

ఈజిప్టులో గల పిరమిడ్లే లోకంలో ఖ్యాతి పొందినవి. ఇప్పటికి కూడా అక్కడ 80 పిరమిడ్లు ఉన్నాయి. గీజాకు సమీపంలో మూడు పిరమిడ్లున్నాయి. వాటిలో ఒకటి చాలా పెద్దది. ఈ ‘మహా పిరమిడ్’ ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి. దీనిని ఫారో ఖుపూ క్రీస్తుపూర్వం 2680లో పూర్తి చేశాడు. దీని నిర్మాణానికి లక్షమంది బానిసలను వినియోగించారని గ్రీకు చరిత్రకారుడు చెప్పాడు. ఈ పిరమిడ్ యొక్క భూమి పదమూడు ఎకరాలను ఆక్రమించింది. దీని ఎత్తు 450 అడుగులు. అన్ని పిరమిడ్లకు, లోపలికి ప్రవేశించేదారి ఉత్తరానికి ఉంటుంది. ఈ పిరమిడ్‌కి మాత్రం చాలా దారులున్నాయి. రెండు చిన్న గదులు వాయుప్రసారం కోసం ఉన్నాయి. పిరమిడ్ భూమి చదరంగా ఉంటుంది. ఏటవాలుగా నున్న నాలుగు భాగాలు త్రిభుజాకారంలో ఉండి పైన కలుస్తాయి.

ప్రతి పిరమిడ్ నిర్మించడానికి చాలా సంవత్సరాలు పట్టి ఉంటుంది. పైపొర మీద నాదిన రాతి పలక ఒకటి రెండున్నర టన్నుల బరువుంటుంది. ఈ రాళ్ళను నైలునది మీద పడవలలో ఎక్కించి, వేలకొలది బానిసలు నిర్మాణస్థలానికి తెచ్చేవారు. మమ్మీగా చేయబడిన రాజు దేహాన్ని పిరమిడ్‌లో ఉంచుతారు. ఆ శరీరంతో పాటు బంగారపు నగలు, మణులు కావలసిన పరికరాలైన సామానులు ఆ సమాధులలో ఉంచేవారు. శతాబ్దాల తరబడి, చాలా పిరమిడ్లలోనికి బందిపోటు దొంగలు దూరి విలువైన సామగ్రిని దోచుకున్నారు. ఈ పిరమిడ్లు గొప్పవారి సమాధులు. ఫారోలు, వీటిని రాజకుటుంబం వారి సమాధులుగా నిర్మించారు. వీటిలో వారి మృతదేహాలను శాశ్వతంగా ఉంచవచ్చు. (కాని, ఈనాటి మహానుభావులు ఈ మమ్మీలను, వారి వస్తువులను పిరమిడ్ల నుండి మ్యూజియములకు చేర్చారు).

టుటన్ ఖమున్ క్రీస్తు పూర్వం 1375 – 1357 సంవత్సరాలలో పురాతన ఈజిప్టును పాలించిన రాజులలో ఒకడు. ఇతడు తన ఎనిమిదవ సంవత్సరంలో లేక తొమ్మిదవ సంవత్సరంలోనో ఫారో అయాడు. 18వ ఏట చనిపోయాడు. ఇతడు ఫారోలలో అతిముఖ్యమైనవాడు కాడు. కాని, ఇతని సమాధి మాత్రమే దొంగలు దోచుకోకుండా మిగిలినది. అతనితో పూడ్చిన సంపద అంతా లభించింది.

ఆ సంపద మూడు అద్భుతమైన శవపేటికలు – ఒక దానిలో ఒకటి ఇమిడిన శవపేటికలు – అన్నిటికన్న లోపల ఉన్నది కడ్డీ బంగారంతో చేసినది. ఆ సమాధిలో సింహాసనాలు, పడకలు, రథాలు, విగ్రహాలు, ఆభరణాలు లభించాయి. చాలా వరకు అవి బంగారంతో చేసినవి. మరికొన్ని బంగారపు రేక తాపినవి. ఇవన్నీ ఇపుడు కెయిరో మ్యూజియంలో ఉన్నాయి. ఫారో దేహం మాత్రం, ఒక శవపేటికలో పెట్టి, సమాధిలో ఉంచారు.

పురాతన ఈజిప్టు ప్రజలు ముగ్గురు దేవతలను కొలిచేవారు. ఒక దేవత పేరు మిన్ – ఇతడ సంతానాన్ని ప్రసాదించే దేవుడు. రెండవ దేవత ‘రా’ – ఇతడు సర్వశక్తివంతుడైన సూర్యదేవుడు. ఈ ఇద్దరు దేవతల గుణాలు కలిగిన వాడు అమున్. ఈ దేవతకు మానవ శరీరముంది. పైకి లేచిన జననాంగముంది. ఇది ‘మిన్’ యొక్క గుణం. ఈకల కిరీటమూ కాంతి చక్రమూ ఉన్నాయి. ఇవి ‘రా’ యొక్క గుణం. అమున్‌ని గొర్రెపోతు రూపంలో చిత్రించారు. మానవ శరీరానికి గొర్రెపోతు తలను తగిలించారు. అధికారానికి, గౌరవానికి గొర్రెపోతు చిహ్నం.

థీబెస్‌లో నున్న మూడు నగరాలలో అమూన్‌ని ఆరాధించేవారు. కరనాక్, లక్సర్, మెడినెట్ హబు నగరాలలో ఇతనిని కొలిచేవారు. కరనాక్ అతని నివాసం – లక్సర్ అతని అంతఃపురం – మెడినెట్ హబులో అతనిని సృష్టించే దేవునిగా కొలిచేవారు. క్రమంగా అర్చకులు మరికొన్ని స్థలాలలో ఈ దేవుడి ఆలయాలు నిర్మించారు.

కరనాక్ దేవాలయాల నగరం – ఇక్కడే ఈజిప్టు ప్రధాన అర్చకుడు ఉండేవాడు. వేలకొలది అర్చకులు, అధికారులు ఒక సంస్థగా ఏర్పడ్డారు. కట్టుదిట్టంగా దానిని నడిపించారు. ఈ సంస్థ ఆర్థికంగాను రాజకీయంగాను దేశంలో ప్రాముఖ్యత వహించింది. మూడవ రామెసిస్ మహారాజు అమూన్ దేవత యొక్క అర్చకులకు 32 టన్నుల బంగారం, 1000 టన్నుల నుండి 185 బస్తాల ధాన్యం ప్రతి సంవత్సరం చెల్లించేవాడు. ఈజిప్టు దేశపు అర్చకులకు, ఆలయాలకు చెందిన ఆస్తి – 7,50,000 ఎకరాల భూమి.5,00,000 పశువులు – 1,07,000 బానిసలు, ఈజిప్టు, సిరియాదేశాలలో 169 నగరాలు ఈ అర్చకుల సంస్థకు పన్నులు చెల్లించేవి.

రాజు అఖెనటిన్ మేధావి కావచ్చు, పగటి కలలు కని ఉండవచ్చు. కాని, నైలునది ప్రజల మూడువేల సంవత్సరాల చరిత్రలోను, ఇతనొక్కడే, ఈ అర్చకుల దుర్మార్గాలను అంతం చేయడానికి ప్రయత్నించాడు. ఈ అర్చకుల సాంప్రదాయాన్ని అదుపులోకి తెచ్చి వారిని వారు చేయవలసిన పనులకు మళ్ళించాడు.

నైలు నదీ రాజ్యాలను పాలించే ఫారో, సాంప్రదాయం ప్రకారం, దేవుడి వంశంలో పుట్టినవాడు, దేవతల ఆస్తిపాస్తులను అతడే కాపాడవలసినవాడు. ఈ అర్చకులను నియమించడం కూడా అతని పనే. ఎగువ ఈజిప్టు, దిగువ ఈజిప్టులలో ఉన్న బుద్ధిమంతులను, అందరి కన్న తెలివితేటలున్న వారిని, అర్చకులుగా నియమించడం అతడు చేయవలసిన పని.

కాలక్రమంలో ఆలయాలలోని ఉద్యోగాలు లాభసాటిగా మారాయి. వీటికోసం చాలా మంది ప్రయత్నించేవాళ్ళు. ముఖ్య అర్చకులు తాము సంపాదించిన పదవులను తమ పుత్రులకు ధారాదత్తం చేసేవారు.

బుద్ధిమంతులు వాదించారు.

“అధికారులకు పుత్రులంటూ లేరు. వారి దృష్టిలో అందరూ సమానులే!”

కాని, వారీ ఉద్ఘోషలను ఎవరూ పట్టించుకోలేదు.

ఆలయాల గోడల వెనుక జరిగే పవిత్ర జీవితం, అర్చకుల ఆర్భాటాలు ప్రజలను ప్రలోభపెట్టేవి. ఉచిత భోజనం, వసతి, సంగీతం, నాట్యం, చక్కని భృతి – ఇవన్నీ జీవితమంతా లభిస్తాయంటే ఎవరు కాదంటారు? పగటి పూట మూడు సార్లు, రాత్రిపూట రెండుసార్లు, చన్నీట స్నానాలు చేస్తే ఏంపోతుంది? ఇవన్నీ భరించవచ్చు. శరీరాన్ని హాయిగా ఉంచే పద్ధతి ఇది. అన్నిటికన్న ముఖ్యమైనది, ఈ అర్చకులు బ్రహ్మచర్యం పాటించనక్కర లేదు.

ఈ ఆలయాలు, వాటికి అనుబంధించిన సంస్థలు, ఒక రోజు ఈ పవిత్రులైన పురుషులతో నిండి, క్రమంగా ఈ అర్చక సంస్థ, దేశంలో మరో దేశమయిందంటే ఆశ్చర్యపడనక్కరలేదు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here