శ్రీపర్వతం-36

0
9

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 36వ భాగం. [/box]

[dropcap]అ[/dropcap]టు తరువాత పరిణామాలు కూడా నిరాశజనాకాలయ్యాయి. తవ్వకాలు పూర్తవడం, నిధులు రాకపోవడం, కొత్త స్థలం, తవ్వకాల గురించి, ప్రభుత్వం నుండి అనుమతి అందకపోవడం ఇవన్నీ అతనిలో నిరుత్సాహాన్నే కలిగించాయి.

ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగుపడడం మొదలు పెట్టింది.

మోహన్ ఆవలించాడు. ఏ సంగతులు ఆలోచించకుండా నిద్రపోదామనుకున్నాడు.

ఉన్నట్టుండి అతనికి ఆనాటి తిథి వార నక్షత్రాలు జ్ఞాపకానికి వచ్చాయి. శార్వరీ నామ సంవత్సర, వైశాఖ మాస, కృష్ణ చతుర్దశి – మంగళవారం – 1960వ సంవత్సరం, మే నెల 24వ తారీఖు. భరణి నక్షత్రం మధ్యాహ్నం వెళ్ళిపోయింది. కృత్తిక వచ్చింది. ఈ మధ్య మోహన్ పనికి వెళ్ళేముందు పంచాంగం చూస్తున్నాడు. ఏ మంచి రోజు తన అదృష్టం పడుతుందో అని అతడు ఎదురుచూడడం లేదు. కాని, కొన్ని సంఘటనలకి దినాలకి సంబంధం ఉందని అతని నమ్మకం.

అతనికి నిద్ర సరిగా రాలేదు. కాని, కనురెప్పలు బరువుగా మూసుకునే ఉన్నాయి. ఒక్కొక్కసారి ఏవో కలలు – ఇంతలో తెలివి మళ్ళా నిద్ర.

“ఆనందా”

ఎవరిదో పిలుపు.

ఒక్కసారి అతనికి తెలివొచ్చి మంచం మీద లేచి కూర్చున్నాడు. డైలులో ముల్లు రెండూ పన్నెండు మీద ఉన్నాయి.

ఆవరణ గేటు వేసే ఉంది. టెంటు ద్వారాన్ని పరదా కప్పే ఉంది.

కాంతి పుంజమొకటి వాటిని దాటి లోపలికి వచ్చింది.

దాని మధ్యనో దివ్యాకృతి దర్శనమిచ్చింది.

“ప్రియ ఆనంద! ఆగతాహం ”

అతడు ఆలోచిస్తున్నాడు.

అటు తరువాత ఆమె ప్రాకృతంలో మాట్లాడడం మొదలు పెట్టింది. ఇక్ష్వాకుల శాసనాలు చదివి చదివి జీర్ణించుకున్న అతనికి ఆ భాష కొట్టిన పిండి.

“ఆనందా! లే! ఎన్ని శత సంవత్సరాలయిందో మనం గీష్మరాత్రిని విహరించి, రా!”

ఆమె అతని చేతిని పట్టుకుంది. అనిర్వచనీయమైన శక్తి అతనిలో ప్రవేశించినట్లయింది. అతడు లేని నిలబడ్డాడు.

ఆమెతోనే అతడు నడిచాడు. అతని అడుగులు తేలికగా పడుతున్నాయి. వారిరువురి ముందు విశాలమైన మార్గమొకటి కనిపించింది. దూరంగా, కుడివైపున ఉన్న విహారాలలోను, స్తూపాలలోను దీపాలు మినుకుమినుకుమంటున్నాయి. కృష్ణానదీ తీరంలో ఎత్తుకు లేచిన ఆలయ ద్వజస్థంభాల మీద జ్యోతులు వెలుగులీనుతున్నవి.

ఆమె ముందుకు నడుస్తూ అతని చేతిని తన నడుము మీదకి లాక్కొంది. తాను కూడా ఆ విధంగానే అతని నడుము మీద చేయి వేసింది. వారి ఎదుట విజయపురి శోభస్కరంగా సాక్షాత్కరించింది.

ఆమె మధురంగా నవ్వి అతనిని ప్రశ్నించింది.

“ఆనందా! నన్ను గుర్తుపట్టనేలేదా?”

అతని దగ్గిర ఏ జవాబు లేదు.

“ఏవో ఆలోచనలలో పడి నీ ఎదుటే ఉన్న నన్ను మరచిపోవడం నీకు అలవాటే కదా!”

మోహన్‌కి ఏమనాలో తోచలేదు.

ఆమె వయసు ఎంతని చెప్పడం? పాతిక సంవత్సరాలకు మించదు. ఆమె చక్కదనం! అంతటి పరమ సౌందర్యం అతడు ఇంతవరకూ చూడలేదు.

“ఈ కటివస్త్రం చీనా దేశీయుడు నీకు బహుమతి ఇచ్చిన సంగతి మరచిపోయావా? వక్షఃసీమను కప్పిన ఈ దుకూలం విసోలియాలో, రోగ విముక్తుడైన సంపన్నుడు నీకు బహూకరించిన విషయం జ్ఞాపకముందా?”

అతడు ఆమె వేపు చూశాడు. చాలా పలుచని పైటలోంచి పుష్టికరమైన పయోధరాలు కనిపిస్తున్నాయి. అలా చూడడం మరియాద కాదని దృష్టి పక్కకు తిప్పాడు.

“ఆనందా! ముఖమెందుకు పక్కకు తిప్పుకున్నావు? కాంక్షదీర నా సౌందర్యం చూడు. అయ్యో! నువ్వెంత మారిపోయావు?”

మోహన్ ఏమి జవాబు చెప్పగలడు.

“ఓ విగతజ్వరాలయ మహాభిషక్కు!”

దానికి కూడా అతడు చలించలేదు.

“అహో విధి! నేను నీ భార్యను సెలీనాను, నువ్వు నా ప్రియాతి ప్రియమైన ఆనందుడివి.”

తనకేమీ అర్థయినట్లు లేదని సూచిస్తూ అతడు తల తిప్పాడు.

“నేననుకున్నట్లే జరిగింది. ఆలోచనలలో పడి లోకాన్ని మరచిపోవడం నీకే తగును. విను, వివరంగా చెప్తాను. నేను గ్రీసు దేశంలో జన్మించాను. సింహళంలో పెరిగాను. గ్రీకు భాష వచ్చు. పాళి భాష సింహాళంలో నేర్పించారు. నువ్వు నన్ను విజయపురి తెచ్చి ప్రాకృత భాష నేర్పించావు. సప్తశతిలోని గాథనొకదాన్ని ముందు నాచే వల్లింపజేశావు.

విక్కిణ్హ ఇ మాహమాస
మ్మి మరో పాఇడిం వ ఇల్లేణ
ణిద్దూమ ముమ్ము రవ్వి అ
సామలి యధణో పడిచ్చన్తో

అంతటితో ఊరుకున్నావా? దాని ఛాయ కూడా కంఠస్థం చేయించావు.

విక్రీడితే మాఘమాసే
పామరః ప్రావరణం బలీవర్దేన
నిర్దూమ ముర్మురనిభౌ
శ్యామాల్యాః స్తనౌ పశ్యన్

ఇంతటిలో చాలునా? ఇంకా అర్థం చెప్పమన్నావా?

మోహన్‌కి ఒక్కసారి నవ్వు వచ్చింది.

“మనం నగరంమంతా తిరిగివస్తే నువ్వు మళ్ళా నా లోకంలోకి వస్తావు” ఆమె మోహన్‌ని తనతో నడిపించింది.

కృష్ణా తరంగాలను గిలిగింతలు పెడుతూ చల్లని పిల్లగాలి వాళ్ల శరీరాలను తాకుతున్నది. ఉన్నతమైన ప్రాసాదాలు ఇరుపక్కలను గల రాజమార్గం, దుర్గం, దుర్గంలోని రాజభవనాలు, అశ్వమేధ వేదిక, నది ఒడ్డున గల అష్టభుజస్వామి ఆలయం, మరుభూమి, క్రీడాంగణం, సర్వదేవాదివాసం, నోడగీవ్వర స్వామి ఆలయం, కార్తికేయుని ఆలయాలు, కుబేరమందిరం, వీధులు, సందులు, ‘కామశర’ చిహ్నంకల శేలవడ్డకుల వాడ, స్వర్ణకారుల వాడ, శక వీరుల విలాసగృహం, మహాసేన ఆలయాలు, విశ్రాంతి గృహాలు, విహారాలు, స్తూపాలు, మండపాలు – విజయపురి మహానగరాన్ని వాళ్లిద్దరూ, ఒకరి సందిటిలో ఒకరు ఇమిడి, ఈ చివరనుంచి ఆ చివరివరకు నడిచారు. ఆ నడక సునాయాసంగా ఉంది. ఆమె ఎన్నో విషయాలు చెప్తున్నది. ఎన్నో భవనాలను చూపిస్తున్నది. హారీతి దేవాలయం, ఆరుబయట రంగస్థలం చూపించి అతి లాఘవంగా మోహన్‌ని, సైటున్న చోటికి ఆమె తెచ్చింది.

“ఆనందా! మనకిక ఎడబాటు కలగదు.”

ఆమె వెనక్కు తిరిగి వెళ్లిపోయింది.

మోహన్ దిగ్ర్భమనుండి తేరుకోక పూర్వమే ఆమె తిరిగి వచ్చింది. “స్వామీ! నీ కోసమని వామ పయోధరానికి కుంకుమ పంకాన్ని, దక్షిణ స్తనానికి మలయ చందనాన్ని దట్టంగా అలదుకున్నాను. ఇది నీ కోరిక. గ్రీష్మతాపం తీర్చడానికి ఇంతకన్న రమ్యమైన పద్దతి మరొకటి లేదు. సావకాశంగా నువ్వు పాన్పుమీద కూర్చో – శ్రేష్ఠి కుమారనంది అభిమానంతో పంపిన ఈ సుగంధ ద్రవ్యాలకి సార్థకత చేకూర్చనీ?”

మోహన్ మంచం మీద కూర్చున్నాడు – ఆమె అతని వక్షాన్ని అనాచ్చాదితం చేసింది. పయ్యెద తొలగించి, అతనికి అభిముఖంగా అతని ఊరువుల మీద కూర్చొని గాఢాతిగాఢంగా కౌగిలించుకుంది.

“ఇంతటితో సరిపోదు నా బింబాధరం చుంబిస్తే దప్పిక ఉండదని నువ్వే అంటావు.”

ఆ మధుర చుంబనం ఎంత కాలముందో!

ఒక్కసారిగా ఆమె అతని నుండి వేరయింది.

ఆ కాంతి పుంజం సైటువేపు వెళ్లి పోయింది.

మోహన్ టెంటుదాటి, ఆవరణ గేటు తెరచుకొని, పైకి వచ్చాడు. అంతటా చీకటి – ఆకాశాన్న చుక్కలు.

ఆ కాంతి పుంజం సైటు వేపునడిచి, బోధి వృక్షం పడి పోయిన చోట మంటగా వెలిగి ఆరిపోయింది.

మోహన్ మెల్లిగా ఆవరణ గేటు మూశాడు. ద్వారం దగ్గిర పరదా పక్కకు తప్పించాడు. మంచం మీద కూర్చున్నాడు.

ఆమె కౌగిలించిన తన వక్షాన్ని చూసుకున్నాడు. ఆమె పీన పయోధారలకున్న కుంకుమ చందన సౌరభాలు, కుడి ఎడమలు మరి దివ్యంగా అతనిని ఆవరించుకున్నాయి.

ఆమె చుంబనంతో ఏళ్ళ తరబడి అతనిని విడువని తృష్ణ శాంతిని పొందింది.

ఇది కలా? నిజమా?

ఆమె వచ్చినప్పటికి తాను బనియనుతోనే ఉన్నాడు. కౌగిలించుకోడానికి ముందు ఆమె ఆ ఆచ్చాదనను తొలిగించింది. ఇప్పుడతని వంటి మీద బనియను లేదు. పక్కమీద కొంచెం దూరంలో ఉంది.

అతని వక్షం చందనలేపంతోను, కుంకుమ పంకంతోను ఇంకా ఆర్ద్రంగానే ఉంది. వాటి మిశ్రమసౌరభం నాసికాపుటలను అంటి పెట్టుకొని ఉంది.

ఆమె, పుణ్యోత్సవాలతో నిండిన విజయపురిని అంగుళం మేర కూడా విడువకుండా చూపించింది.

ఇక్ష్వాకు ప్రభువులందరి గురించి ఆమె చెప్పింది. వారి రాణుల గురించి చెప్పింది. తవ్వకాలలో లభించిన సాక్ష్యాలకు నూరురెట్లు అధికంగా జన జీవితం గురించి వివరించింది.

ఒకసారి, డాక్టర్ రావిప్రోలు సుబ్రహ్మణ్యం గారు నిద్రిస్తూ ఉండగా, ఇద్దరు బౌద్ధ భిక్షువులు వారిని లేపి, భూమిలో దాగిన ఒక విహారాన్ని వెలికి తీయమని, ఆ స్థలం చూపించారట.

ఆనాడు ఆ సంగతి చాల కొద్ది మందే నమ్మారు.

ఇవాళ, తనకు కలిగిన అనుభవాన్ని తలచుకొని, మోహన్ చేతులు జోడించి, ఆ పరమాచార్యులకు నమస్కరించాడు.

ఫిరంగి మోటు కొండల మీద ఆకాశం తెల్లబడుతోంది. పక్షుల కలరవాలు వినిపిస్తున్నాయి.

మోహన్ మరి పడుక్కోవడానికి ఇష్టపడలేదు. తనకు కలిగిన దివ్యమైన అనుభవాన్ని శశికళతో చెప్పాలనుకున్నాడు. కాని, ఏమని చెప్పగలడు? దివ్యాకృతితో ఒక సుందరి వచ్చి తనను గాఢంగా కౌగిలించుకుందని చెప్పాడా? విజయపురిని మూడు గంటలలో చూపించి నూట ఏభై సంవత్సరాల ఇక్ష్వాకుల చరిత్రను చెప్పిందని ఆమెను నమ్మించగలడా?

దీనికి సాక్ష్యాలేమున్నాయి?

తన వక్షాన్ని విడువని సౌగంధ్యమా?

స్నానం చేయడానికి ముందు, కొంచెం సేపు శశికళ కోసం, టెంట్ల మధ్యనున్న స్థలంలో నిలబడి అతను ఎదురుచూశాడు.

ఆమె నిద్ర లేచినట్లు లేదు.

గోలెంలోని చల్లటి నీళ్ళు అదే పనిగా ఒంటిమీద పోసుకున్నాడు. సబ్బుతో రుద్దుకుంటే గుండెలో కంటిన సౌరభం పోతుందని సందేహించాడు. ఒళ్ళు తువాలుతో తుడుచుకున్నాడు. బట్టలు వేసుకున్నాడు. అప్పటికి కూడా శశికళ లేవలేదు.

ఈ మధ్య భోజన ఫలహారల గురించి శశికళ శ్రద్ధ తీసుకుంటున్నది. మోహన్ ఆమెకు సహాయం కూడా చెయ్యటం లేదు. కాబట్టి శశికళకు ఆ బాధ్యత తప్పలేదు.

సుబ్రహ్మణ్యేశ్వరరావు విధిగా శశికళకు సహాయం చేసేవాడు. కాని, అతడు వారం రోజులై టెంట్లకు రాలేదు. కాబోయే భార్యతోను, ఆమె కుటుంబంతోను దక్షిణాది యాత్రలకు వెళ్ళిపోయాడు.

మోహన్ ఆరుగంటలకు సరిగా టెంటు విడిచి పెట్టాడు. ఎనిమిది గంటలకు టిఫిన్, కాఫీ, మంచినీళ్ళు జావా పట్టుకొచ్చింది.

పనివాళ్ళందరూ చాలా శ్రమ పడుతున్నారు. ఆ విధంగా వాళ్ళు రెండు రోజులు, నిర్విరామంగా పని చేశారు.

మూడో రోజు పదకుండు గంటలకు వాళ్ల ఎదుట ఒక రెండు భూములు గల ప్రాసాదం బయటపడింది. పై అంతస్తుకు మెట్లున్నాయి.

పేరుకు పోయిన మట్టిని తొలగించిన తరువాత కిందను, మీదను పదహారడుగులు వెడల్పు గల వసారాలు కనిపించాయి. కిందను, మీదను శిథిలమైన ద్వారాలు కనిపించాయి. పై అంతస్తులో, ద్వారం దగ్గర మట్టిని సులువుగా తొలగించారు. ద్వారానికి మూడడుగుల దూరంలో ఒక శిలాఫలకం కనిపించింది.

ఆ శిలాఫలకాన్ని కదిలించే ముందు ఫోటోలు తీయాలి. ప్రాజెక్టు ఫోటోగ్రాఫర్లు రావాలి. వాళ్ళు వచ్చేముందు ఈ సంగతి శశికళతో చెప్పడానికి మోహన్ పరుగులు తీశాడు. తాను తిరిగి వచ్చేవరకు ఏ పని చెయ్యవద్దని మెగ్యాతో మరీ మరీ చెప్పాడు.

పైన ఎండ తీవ్రంగా ఉంది.

దారిలో ఎంవరూ ఎదురవలేదు.

“శశికళా! శశికళా!” అరుస్తున్నాడు – పరుగెత్తుతున్నాడు మోహన్.

ఆవరణ గేటు తలుపు బలంగా తోశాడు. ముందున్న తన టెంటు పరదాను పక్కకు నెట్టాడు. వెనుక పరదాను కూడా పక్కకు తప్పించి, టెంట్ల మధ్య భాగం చేరి, చేష్టలు దక్కిమోహన్ నిలిచిపోయాడు.

టెంట్ల మధ్యనున్న ఖాళీస్థలంలో శశికళ స్నానం చేస్తున్నది. ఆమె ఎదురుగా ఉన్న బాలీలోని నీళ్ళు చెంబుతో శరీరంమీద పోసుకున్నది. ఆమె వంటి మీద పుట్టమన్నది లేదు.

సాధారణంగా ఆమె బాత్ రూములోనే స్నానం చేస్తుంది. టెంట్లలో ఎవరూ లేరు. జావా కూడా వెళ్లిపోయింది. మధ్యాహ్నం భోజనం తాను సైటుకి తెస్తానని శశికళ కబురు కూడా పెట్టింది. అటువంటప్పుడు హఠాత్తగా మోహన్ వస్తాడని ఆమె అనుకోలేదేమో?

ఏ సందేహం లేకుండా, స్త్రీ స్వభావానికి సహజమైన పద్ధతిలో, నగ్నంగా రెండు టెంట్ల మధ్య, ఎనిమిదడుగులు ఎత్తుకుకట్టిన గోడల మధ్య, ఆమె హాయిగా స్నానం చేస్తున్నది.

ఎండాకాలం వస్తుందని మార్చినెలలోనే సుబ్రహ్మణ్యేశ్వరరావు కంట్రాక్టరును పిలిపించి, ఎత్తైన రాటలు పాతించి, ఆ రెండు టెంట్లను కప్పుతూ విశాలమైన పెద్ద పందిరి వేయించాడు. ఎడం లేకుండా తాటికమ్మలను దగ్గిరగా వేయించాడు.

ఆ గ్రీకు ఆఫ్రోడైటీని చూస్తూ చలనం లేకుండా మోహన్ నిలబడిపోయాడు.

స్నానం పూర్తయిన తరువాత, శశికళ మోహన్ వేపు తిరిగింది. ఆమె గాభరాపడలేదు. లోపలికి పరిగెత్తలేదు.

టర్కిష్ తువ్వాలు నడుముకి చుట్టుకొని టెంటు లోపలికి నడిచింది. మోహన్ మతి తప్పినవాడివలె వచ్చిన దారితే తిరిగి సైటువేపు నడిచాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here