శ్రీపర్వతం-37

0
6

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 37వ భాగం. [/box]

40

[dropcap]మో[/dropcap]హన్ నిద్రలేచేసరికి ఏడున్నర అయింది.

వెనుక టెంటులో జావా పని చేస్తున్నది.

వెంటనే అతను మంచం దిగి కార్యాల గురించి వెళ్లలేదు.

నిన్నను జరిగిన సంగతులను మననం చేసుకుంటున్నాడు.

తనికి దయ్యాల మీద కాని, కామినీ పిశాచాల మీద కాని నమ్మకం లేదు. అటువంటిది అర్ధరాత్రి ఒక దివ్య సుందరి వచ్చి తనను కలుసుకుంది. కొన్ని వందల సంవత్సరాల తరువాత తనకు విముక్తి దొరికినట్లు చెప్పింది. తనను సందిట పట్టుకొని ఇక్ష్వాకుల విజయపురిని చూపించింది. నగరం, దానిలో కోట, రాజవీధులు, దేవాలయాలు, బౌద్ధుల స్తూపాలు, చైత్యాలు, మండపాలు, క్రీడా రంగం, విశ్రాంతి గృహాలు, అశ్వమేధ ఘట్టం, ఇలా ఏవీ వదలి పెట్టకుండా ఎన్నో వివరాలు చెప్పింది. సజీవంగా నగరాన్ని చూపించింది. కుమారనంది ఇచ్చాడని చెప్పి, చందన పంకం, కుంకుమ పువ్వు స్తనాలకు అలదుకొని తనను గాఢంగా కౌగిలించుకుంది. తాను చూస్తుండగనే సైటు వేపు నడిచి కిందటి సాయంకాలం తవ్విన చోట పెద్ద కాంతితో వెలిగి మాయమయింది.

అతనేమీ నమ్మలేకపోతున్నాడు. ఆ విషయం శశికళకు చెప్పడమా, మానడమా అని సందేహించాడు. ఆ ఉదయం శశికళ సైటుకి రాలేదు. నిన్నను తవ్వకాలలో ఏర్పడిన పగులు వెడల్పు చేశారు. లోపల భవనం యొక్క ఆనవాళ్ళు కనిపించాయి. ఇంకా తవ్వగా శిథిలమైన భవనం కనిపించింది. రమారమి పదకుండు గంటలకు అతడు తమ శ్రమలు ఫలించాయని చెప్పడానికి వెళ్తే మరో ఊహించలేని సంఘటన ఎదురయింది.

తనను రాత్రి కౌగిలించుకున్న దివ్యమైన గ్రీకు సుందరికి, తన ఎదుట విలాసంగా స్నానం చేస్తున్న సుందరికి ఏమీ తేడాలేదు. దానితో తనకు తల దిమ్మెక్కి పోయింది. ఆమెలో బిడియం కనిపించలేదు. చాల సహజంగా, తొట్రుపడకుండా తువ్వాలు కప్పుకొని లోనికి వెళ్ళిపోయింది.

సంతోషంతో చెప్పాలనుకున్న సంగతి, ఆమె మహా సౌందర్యాన్ని చూపులతో తాకుతూ, ఆమెతో చెప్పడం మరచిపోయాడు, మోహన్. వచ్చిన వాడు వచ్చినట్లే దిగ్భ్రమ చెంది సైటుకి వెళ్ళిపోయాడు. ఎప్పటికీ అతను టెంటుకి రాకపోతే, మధ్యాహ్న భోజనం సైటుకే పంపించింది శశికళ. ఆ రాత్రి అతను టెంట్లకు వచ్చేసరికి బాగా చీకటి పడింది. ఉత్సాహంతో, తవ్వకాలలో ఏదో భవనం పునాదులు కనిపించాయని శశికళకు అతడు సూచాయగా చెప్పాడు. దానికామె ఉబ్బితబ్బిబ్బవలేదు.

రాత్రి అతను తింగి తినిన వెంటన నిద్రపోయాడు.

పొద్దున్న ఆలస్యంగా లేచాడు. ఏ రహస్యమైనా శశికళకు చెప్పకుండా దాచరాదన్న ఒప్పందం అతనికి జ్ఞాపకం వచ్చింది.

మోహన్ కార్యాలు తీర్చుకొని శశికళ టెంటులోకి వెళ్లాడు.

అక్కడ శశికళ లేదు.

“అమ్మగారు ఏరీ?” పనిచేస్తున్న జావాను అడిగాడు.

“అమ్మగారు పొద్దున్న ఆరున్నర బస్సులో హైదరాబాదు వెళ్లారు. నేనే ఆమె సూట్ కేసును పట్టుకొని వెళ్లాను” అంది జావా.

“మళ్లీ ఎప్పుడు తిరిగి వస్తారో చెప్పేరా?”

“నేనడిగాను – కాని ఆమె జవాబు చెప్పలేదు”.

మోహన్, కాగితాలలో ఏదైనా ఉత్తరముంటుందో చూశాడు. అటువంటిది ఏదీ కనిపించలేదు. తలగడ కింద వెదికాడు. అక్కడొక డైరీ కనిపించింది. ఆమె తొందరలో దానిని మరచిపోయింది.

గబగబ అతను పేజీలు తిరగేశాడు. నిన్న రాత్రి శశికళ వ్రాసినది తొందరగా అతను చదివాడు.

‘ఇవాళ నేను సైటుకు వెళ్లలేదు. కాగితాలు చాలా సర్దవలసినవి ఉన్నాయి. టిఫిన్ తిని కొంత వరకు ఆ పని చేశాను. పదకొండు గంటలకు జావా వెళ్ళిపోయింది. రెండు టెంట్ల మధ్యను నీళ్లు గోలెం దగ్గిర బట్టలు విప్పి స్నానం చేస్తున్నాను. మోహన్ ఏ ఒంటి గంట తరువాతనో వస్తాడు.

అప్పుడు అనుకోని సంఘటన జరిగింది.

మోహన్ అకస్మాత్తుగా రెండు టెంట్ల మధ్యకువచ్చాడు.

నన్నుచూసి ఆశ్చర్యపోయాడు. మా చూపులు కలుసుకున్నాయి. అతను సారీ చెప్పలేదు. వెనుకకు మళ్లి పోలేదు. అతని ముఖంలో పరవశత్వం కనిపించింది. చూపులతో నా సౌందర్యాన్ని తాగుతున్నాడు.

అతను ఏదో ముఖ్యమైన సంగతి చెప్పాలని పరుగెత్తుకొని వచ్చాడు.

తరువాత ఏమీ జరగనట్టు నేను ఒళ్ళు తుడుచుకొని నా టెంటులోకి వెళ్లిపోయాను.

అతను నా వెనుకే వస్తాడనుకున్నాను.

నా భుజం మీద చెయ్యి వెయ్యడమో లేక నన్ను కౌగిలించుకోడమో చేస్తాడనుకున్నాను.

కాని ఆ పెద్దమనిషి అటువంటి పనేదీ చెయ్యలేదు. నేను బట్టకట్టుకొని అతని టెంటులోకి వెళ్లాను. ఆ సరికే అతను సైటుకి వెళ్లిపోయాడు.

మధ్యాహ్నం భోజనానికి అతను టెంటుకి రాలేదు. జావా రెండు గంటలకు వచ్చింది. ఆమె చేత అతనికి భోజనం పంపించాను.

యాంత్రికంగా కాగితాలు సర్దుకున్నాను. రమారమి మేము సన్నిహితులుగా ఉన్నా, ఇటువంటి సంఘటన ఎప్పుడూ కలగలేదు.

రాత్రి అతను వచ్చేసరికి తొమ్మిది గంటలయింది. పెట్రోమాక్స్ లైట్లు వెలిగించి సైటులో పనిచేస్తున్నారు.

మోహన్ స్నానం చేసి బట్టలు మార్చుకొని నా టెంటులోకి భోజనానికి వచ్చాడు. కొంత సేపు మౌనంగా ఉండి తరువాత అన్నాడు.

“ఏదో పురాతన భవనపు శిథిలాలు బయట పడుతున్నాయి”.

అంతవరకే అతను అన్నాడు.

నాకేసి సూటిగా చూడలేక పోతున్నాడు. ఏదో తప్పు చేసిన వాడివలె అవుతున్నాడు. ఇంతవరకు నాతో మనసు విప్పి మాట్లాడిన మర్యాదస్తుడు మానసికంగా బాధ పడుతున్నాడు.

రాత్రి చాలావరకు ఆలోచించాను. ఇప్పుడేం చెయ్యడం?

పూర్వం వలె నన్నాతడు నిర్భయంగా ముఖంలోకి చూడలేడు. విషయం చర్చించలేడు, తవ్వకాలు సాగించలేడు.

అన్నిటికన్న ముఖ్యమైన తవ్వకాలు – నేను అతని ఎదుట నుంటే పనులు ముందుకు సాగవు.

నేను ఇక్కడి నుంచి తొలగిపోవాలి.’

మోహన్ కళ్ల వెంబడి నీళ్ళు వచ్చాయి.

జావా ఎదుట కూడా వాటిని ఆపుకోలేక పోయాడు.

***

అటు తరువాత ఆరు వారాల వరకు తవ్వకాలు చాల జోరుగా సాగాయి. ఆదనంగా మరో నాలుగు గాంగులు పనిచేశాయి.

ఎండలు విజృంభించాయి.

పొద్దున్న ఏడు గంటలకు వెళ్లినవాడు మళ్లా రాత్రి చీకటి పడిన తరువాత టెంటుకు తిరిగి వస్తున్నాడు.

క్రమంగా, తవ్వకాలలో, ఆచార్య నాగార్జునుడు చివరి సంవత్సరాలు నివసించిన సౌధం బయటపడింది. అది పంచభూములు కలిగినది. ఇప్పుడా అంతస్తులన్నీ కూలిపోయాయి. పెద్ద ఇటుకలతో నిర్మించిన భవనమది – అడుగు మెట్టు అర్థచంద్రాకారంలో, చలువ రాతితో చేసినది. శిథిలాలలో కప్పడిపోయిన వస్తువులెన్నో కనిపించాయి. మందులు నూరుకునే కల్వాలు కొన్ని కనిపించాయి. శస్త్ర చికిత్సకు పనికి వచ్చేవాడియైన పరికరాలు కొన్ని బయట పడ్డాయి. ఎక్కడా శాసనాలు కనిపించలేదు. పునాదుల కొలతలు తీసి స్కెచ్‌లు వేశాడు. మోహన్, తవ్వకాలలో లభించిన వస్తువుల పట్టిక తయారు చేశాడు. అవి ఏయే చోట్ల దొరికాయో చెప్పడానికి వీలులేక పోయింది. గవర్నమెంటు ఫోటోగ్రాఫర్లను పిలిచి ఫోటోలు తీయించాడు.

ఆరు వారాలలో తవ్వకాలు ముగిసిపోయాయి. పారావత నివాసం, ఒక అంతస్తు మాత్రమే మిగిలింది.

వారం రోజుల పాటు శ్రద్ధగా కూర్చొని రిపోర్టు తయారు చేశాడు మోహన్.

పారావత నివాసం, దారిపక్కనున్న విశ్రాంతి గృహానికి సమీపంలో ఉంది. అది పశ్చిమ ముఖంగా ఉంది. కిందభాగంలో 500 గదులున్నాయి. పై భాగంలో 400 గదులు ఉంటాయి. ఆవరణలో 50 గజాలు విడిచి విషచ్చేదిక విస్తారంగా సాగు చేయబడింది. ఎండిన ఆ మొక్కలను, రెమ్మలను టెంట్ల చుట్టూ వేస్తే పామన్నది, ఆ ప్రాంతాలలో కనిపించడం మానేసింది. పారావత నివాసం గోడలు మందంగా ఉన్నాయి. కొండలమీద ఊటనుండి వచ్చే నీరు, కాల్చిన మంటి గొట్టాల ద్వారా వస్తుంది. స్నానాల గదుల నుండి, శాచగృహాల నుండి వచ్చిన నీరు, నూరు గజాల దూరంలో ఉన్న సోక్ పిట్సుకు కాలువ ద్వారా పోతుంది. కాలువ పై కడప రాతిపలకలు కప్పారు.

కల్వాలు నల్ల సాన రాతివి. శస్త్ర చికిత్స చేసే పరికరాలు చాల వింతగా ఉన్నాయి. ఉక్కు, రాగి, వెండి లోహాలతో చేసినవి. భవనం శిథిలమై కూలిపోడం చేత, శిథిలాలను తొలగించడం చాల కష్టమయింది.

మోహన్ ఫోటోగ్రాఫర్ల దగ్గిరకి వెళ్లినప్పుడు, చాలా శిథిలాలలో వచ్చిన ఇటుకలను సరిగా పేర్చలేదు. ప్రభుత్వపు పరిశోధకులకు వాటిని చూపించినప్పుడు, వాళ్ళు ఆ స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేసి, ఇటుకలను ఒకపక్కకు పేర్చి, పునాదులను స్పష్టంగా మార్కు చేసి ఉంచమని కృష్ణమూర్తిగారు, ప్రసాద్ గారు చెప్పారు.

రిపోర్టు సమర్పించి, తవ్వకాలలో లభించిన వస్తువులను మ్యూజియమ్‌కు అప్పగించి మోహన్ టెంటుకి తిరిగి వచ్చాడు. మెగ్యా అతని కోసం కూర్చున్నాడు. పనివాళ్లకు ఇవ్వవలసిన డబ్బు వాళ్లకిచ్చి, బిల్లు మీద వేలిముద్రలు తీసుకున్నాడు మోహన్.

ఇద్దరు పనివాళ్లు జీతాలు తీసుకోలేదు. వాళ్లు సైటులో విడిచి పెట్టిన పనిముట్లను ఒకచోట చేరుస్తున్నారు.

అప్పటికి సూర్యుడు నడినెత్తికి వచ్చాడు.

ఎండ ప్రచండంగా ఉంది. పరుగెత్తుకుంటూ ఒక పనివాడు వచ్చి, జాపోస్తూ అన్నాడు “దొరా! రాళ్లకుప్పల అడుగున ఒక రాతిబొమ్మ దొరికింది. ఫోటోలు తీయిస్తారని దానిని కదపలేదు.”

మోహన్ ఆ మాటలు విని, మెగ్యాను మరికొందరిని తీసుకొని తవ్వకాల వేపు పరుగెత్తాడు. శిథిలాలలో మూడడుగుల ఎత్తు ఉన్న పాలరాతి శిల్పం కనిపించింది. దాని నిండా మట్టి అంటుకుంది. శిథిలాలలో ఉండడం చేత దొరికిన చోటు గుర్తుంచుకోవలసిన అవసరం అతనికి కనిపించలేదు. దానిని శుభ్రంగా, మట్టి పోయేటట్టు కడిగించాడు.

తరువాత దానిని పరిశీలించి చూశాడు. అది ఒకమిథున శిల్పం.

శృంగార భావాలు వారిలో గోచరించలేదు.

స్త్రీమూర్తి యవనసుందరి వలె కనిపిస్తున్నాది.

పురుషుడు అతడు ఆంధ్రుడివలె ఉన్నాడు. కాని అతను ధరించిన వస్త్రాలు బౌద్ధ భిక్షువులు ధరించేనాటివలె ఉన్నాయి. బ్రాహ్మీలిపిలో వారి పేరులు పాదపీఠంలో చెక్కబడి ఉన్నాయి. ఉపాసకో ఆనందః – ఉపాసికా శశికళా. రెండవ వేపు వారి ఇరువురి గురించి చెక్కి ఉంది. భాష సంస్కృతం – బ్రాహ్మీలిపి. ఏహునుల ఛాంతమూలుడి కాలం నాటి భాష, అక్షరాలు అంగుళం కొలతలో ఉన్నాయి. పంక్తికి పది అక్షరాలున్నాయి. అటువంటివి పదిహేడు పంక్తులు పురుషుడి గురించి, పదహారు పంక్తులు స్త్రీ మూర్తి గురించి చెక్కి ఉన్నాయి. కింద భాగంలో చిన్న ముక్క విరిగిపోయింది. శిల్పి పేరు ఆ విధంగా లేకుండా పోయింది.

ఆనందుడి గురించి, శశికళ గురించి చెక్కినది నాలుగయిదు సార్లు మోహన్ చదివాడు, అతడు ఏకసంథాగ్రాహి. ఐదుసార్లు చదవడంతో ఏ పంక్తి ఎక్కడుందో కూడా అతనికి అవగతమయింది.

అప్పటిక ఒంటిగంటన్నరయింది. తవ్వకాలలో లభించిన శిల్పాన్ని వెనుక టెంటులో శశికళ టేబులు మీద, దొంతుల కొద్ది ఉన్న కాగితాల మీద, జాగ్రత్తగా ఉంచమని పనివాళ్లకు చెప్పాడు. శిల్పాన్ని అక్కడ ఉంచిన తరువాత ఇళ్లకు వాళ్లు వెళ్లిపోవచ్చునన్నాడు. తాను అష్టభుజస్వామి ఆలయం దగ్గర ఉన్న ఫోటోగ్రాఫర్లను పిలుచుకు వచ్చి చిత్రాలు తీయిస్తానని వాళ్లతో చెప్పి వెళ్లిపోయాడు.

మ్యూజియం మీదనుంచి, నాగార్జున కొండ పక్కనుంచి, అష్టభుజస్వామి ఆలయానికి పోవాలి. రెండు మైళ్లు నడవాలి. తీరా అక్కడికి వెళ్తే ఎవరూ దొరకలేదు. మళ్లా వెనుకకు తిరిగి ఫోటోగ్రాఫర్ల గురించి కనుక్కోడానికి మ్యూజియంకు వచ్చాడు. అక్కడ క్యూరేటరు కాని, మరెవరైనా స్కాలర్లు కాని లేరు. వాళ్లందరూ ఛూలధమ్మగిరి మీద ఉన్న బంగళాకి వెళ్లారు. సాయంకాలం నాలుగు తరువాత వస్తారు. మాచర్లలో ఎవరో స్నేహితుడింట పెళ్ళని అందరు ఫోటోగ్రాఫర్లు ఒంటిగంట బస్సులో వెళ్లిపోయారు. మరునాడు ఉదయమే వస్తారు.

ఎండమండి పోతున్నది. కూజాలోని నీళ్లు తెప్పించి కడుపు నిండా తాగాడు, టెంట్లవేపు నడిచాడు.

అప్పటికి మధ్యాహ్నం మూడు గంటలయింది.

శిల్పం వెనుకకు ఆనందుడి గురించి, శశికళ గురించి చదివిన వాక్యాలను మననం చేసుకుంటున్నాడు. ఇన్నాళ్లకు తమ శ్రమ ఫలించింది. ఇక్ష్వాకుల చరిత్రలో ఆనందుడి భాగాన్ని పూర్తిచేయడానికి ఆధారాలు లభించాయి. శశికళ ఉంటే ఆమె ఎంతో సంతోషించేదో – ఆనాటి సంఘటన అతని కళ్లముందు కదిలింది. దివ్యసుందర విగ్రహమామెది. ఏ గ్రీకు శిల్పమో జీవం పోసుకొని తనకు దర్శనమిచ్చింది. తాను ఎంత అదృష్టవంతుడు.

ఒక్కసారి తలెత్తి చూశాడు అతను.

వెనుక టెంటు నుండి పొగలు పైకి లేస్తున్నాయి. క్రమంగా అవి జ్వాలలుగా నాలుకలు చాచుతున్నాయి. ముందు టెంటుకు కూడా నిప్పంటుకుంది. అన్నీ అతని కళ్ల ముందే జరుగుతున్నాయి.

గాలి దక్షిణం నుంచి ఉత్తరానికి వీస్తున్నది. క్షణంలో మంటలు ముందు టెంటు నుండి విజృంభించాయి.

అతనికి టెంట్లకు మద్య రమారమి ఒక మైలు దూరముంటుంది.

అతను పరుగెత్తుతున్నాడు. అలసిపోయి నిలబడుతున్నాడు. తిరిగి పరుగెత్తుతున్నాడు.

మరొక్క పదిహేను నిమిషాలలో టెంట్లను చేరుకున్నాడు.

జ్వాలలు భీకరంగా పైకి లేస్తున్నాయి.

కృష్ణ నుంచి కొంతమంది, తిత్తుల నింపి, గాడిదల మీద, ఎద్దుల మీద నీరు తీసుకొచ్చారు.

మోహన్ పూర్తిగా అలసిపోయాడు. తన, తమ శ్రమకు ఫలితమంతా ఆ టెంట్లలోనే ఉంది. తన సర్వస్వం అయిన శిల్పం అందులో ఉంది. మధ్యాహ్నం భోజనం అతను చెయ్యలేదు. మ్యూజియం దగ్గర తాగిన మంచినీళ్ళు ఈ సరికి ఇగిరిపోయాయి. లంబాడీ తండా అంతా వచ్చి మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నది.

మోహన్ టెంటుకు దగ్గిరలో నిలబడ్డాడు. ఎవరూ అతనిని దూరంగా ఉండమని వారించిన వాళ్లు లేరు. మంటలవేడి తీవ్రమయింది. అతనికి కళ్లు బైర్లు గమ్మాయి. ఎంత ప్రయత్నించినా నిలవ లేకపోయాడు. ఉన్న చోటునే తెలివి తప్పి పడిపోయాడు.

పక్కనే నిలబడ్డ మెగ్యా అతనిని, భుజాలు పట్టుకొని, కొంత దూరం లాక్కుపోయాడు. మరి కొంతమంది అతని ముఖం మీద నీళ్లు జల్లారు. కొంతమంది బట్టలతో విసిరారు. కాని ప్రయోజనం లేకపోయింది.

అప్పటికి నాలుగున్నర దాటింది. మంటలు తగ్గుముఖం పట్టాయి.

నలుగురు పనివాళ్లు మోహన్ భుజాల మీద మోసుకొని లంబాడీ తండా చేర్చారు. అక్కడ మెగ్యా పశువులశాల ఉంది. గొడ్లను బైటకట్టడం నుంచి అది శుభ్రంగా ఉంది. ఒక నులకమంచంమీద అతనిని పడుక్కోబెట్టారు.

మెగ్యా ఒక్కడే అక్కడ ఉన్నాడు. మిగిలిన పనివాళ్లు మంటలను ఆర్పడానికి తిరిగి టెంట్లకు వెళ్లిపోయారు.

కొద్ది సేపటిలో చల్లటి నీళ్లు తీసుకొని జావా అక్కడికి వచ్చింది.

మెగ్యా మోహన్ నుదుటి మీద చెయ్యి వేశాడు. అది కాలిపోతున్నది.

“చాల వేడిగా ఉంది. ఏం చెయ్యడం?” మెగ్యా అన్నాడు.

“దొర వడదెబ్బ తిన్నాడు. పైగా మంటలవేడి – ఎవరూ అతనిని దూరంగా తీసుకుపోలేదు. నేను బాల్టీతో చల్లని నీళ్లు తెస్తాను. వెంటనే వేడి తగ్గించకపోతే…” అంది జావా.

జావా పరుగులు పెట్టి బాల్టీలో చల్లని నీళ్లు తెచ్చింది. ఉతికిన గావంచా తెచ్చింది. ఆ సరికి మెగ్యా మోహన్ చొక్కాను, బనియను జాగ్రత్తగా తప్పించాడు.

జావా శరీరం పై భాగాన్ని చన్నీటి గుడ్డతో తుడిచింది. తరువాత మెగ్యా అతని నుదుటిమీద తడి గావంచా మడత పెట్టి వేశాడు.

ప్రతి పావుగంటకు తడి గావంచా మడత ఆరిపోయింది. ప్రతి అరగంటకు జావా మోహన్ శరీరాన్ని తడిగుడ్డతో తుడిచింది. ఇంతలో సాయంకాలమయింది. రాత్రి వచ్చింది. తండాలో అందరూ శాల బయట కూర్చున్నాడు. మంటలను పూర్తిగా ఆర్పి పనివాళ్లు తిరిగి వచ్చారు. హరికన్ లాంతరు వెలిగించారు.

ఎవరూ వండుకోలేదు – నీళ్లు తప్ప మరేమీ ముట్టుకోలేదు. అర్ధరాత్రి దాటింది. అప్పుడు మోహన్‌కి తెలివి వచ్చింది. బరువుగా మూలిగాడు. మెగ్యా అతనిని కూర్చోబెట్టాడు. శాల బయట కూర్చున్న వాళ్లు లోపలికి వచ్చారు. దొరను చూశారు అతనికి దండం పెట్టారు. అతనిని రక్షించిన దేవుడికి వేయి దండాలు పెట్టారు.

జావా, కాచి చల్లార్చిన పాలు ఇస్తే మోహన్ తాగాడు. తన చుట్టూ నిలబడిన వాళ్లను చూసి నమస్కారం చేశాడు. తిరిగి మంచంమీద పడుక్కున్నాడు.

అందరూ వెళ్లిపోయారు. మెగ్యా, జావా ఏదో కొద్దిగా తిని వచ్చారు. మోహన్ శరీరం కొంచెం చల్లబడింది. ఇద్దరూ అతని మంచం దగ్గిర కూర్చున్నారు.

మెల్లగా రాత్రి గడిచింది. రాత్రి అంతా మెగ్యా, జానా మోహన్ పడుక్కున్న మంచం పక్కనే తుంగ చాప వేసుకొని కూర్చున్నారు. ఏడు గంటలకు మోహన్ లేచాడు. చాలా నీరసంగా ఉన్నాడు. శరీరం మామూలుగా ఉంది. కళ్లు మాత్రం వేడికి ఉబ్బిపోయాయి. ముఖం చల్లటి నీటితో కడిగించి, పొద్దున్న పితికిన ఆవు పాలు కాచి, జావా తెచ్చింది. పాలు తాగిన తరువాత మోహన్‌కి కొంచెం బలం వచ్చింది.

“ఏం చేయమంటావు దొర!” మెగ్యా అడిగాడు.

“నువ్వు కార్యాలు తీర్చుకొని, క్యూరేటరు రాధాకృష్ణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్లు. నిన్నను జరిగింది చెప్పు. వాళ్ల దగ్గిర గవర్నమెంటు జీపు ఉంటుంది. దాని మీద నన్ను హిల్ కాలనీలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరరావు గారింటికి దిగబెట్టు”.

మెగ్యా తొందరగా ఏదో తిని, మ్యూజియము దగ్గరికి వెళ్లాడు, నిన్నను జరిగిన సంగతి ప్రసాద్‌కి చెప్పాడు. వెంటనే అతను జీపు తీసుకొని, మెగ్యాతో కలిసి లంబాడీ గూడానికి వచ్చాడు. నిన్న రాత్రి మెగ్యా మోహన్ చొక్కా, బనియను విప్పి వేశాడు. వాటిని జావా ఉతికి ఆరవేసింది. ఆ బట్టలు ఎండిపోయాయి. వాటిని తొడుక్కొని మంచం మీద కూర్చున్నాడు మోహన్.

మోహన్ నీరసంగా ఉన్నాడు. గడ్డం పెరిగింది. ఉబ్బిన కళ్లు ఎర్రగా ఉన్నాయి.

ప్రసాద్ వచ్చి మోహన్ పక్కను మంచం మీద కూర్చున్నారు. అతని భుజం మీద చెయ్యి వేశారు.

“మోహన్! మెగ్యానాకు అన్ని విషయాలు చెప్పాడు. విజయపురి చరిత్రలో ఈ దహనాలు కొత్త కాదు. పల్లవులు నగరంలో చాలా ప్రదేశాలు, ప్రత్యేకంగా దుర్గమంతటిని, పరిసరాలలోని దేవాలయాలను పరశురామ ప్రీతి చేశారు. భగవంతుడి దయవలన, మెగ్యా జావాలు చేసిన సేవ వలన, మీరు బతికి బయట పడ్డారు. హిల్ కాలనీలో హాస్పిటలుంది. సుబ్రహ్మణ్యేశ్వరరావు ఉన్నారు. ఆరోగ్యం కుదుటబడిన తరువాత మీరు హైదరాబాదు వెళ్లిపోవచ్చు. శశికళ గారికి సావకాశంగా ఉత్తరం వ్రాయండి. మీ రిపోర్టు, ఢిల్లీ పంపించండి” అన్నారు ప్రసాద్.

మోహన్ ముఖంలో పేద చిరునవ్వొకటి తోచింది.

మోహన్ జీపులో కూర్చున్నాడు. అతని పక్కనే ప్రసాద్ కూర్చున్నారు. వెనుక సీట్లలో జావా, మెగ్యాలు కూర్చున్నారు. జావా సిల్వర్ చెంబుతో పాలు పట్టుకుంది.

తండాలోని వాళ్లంతా, పెద్దలు, పిన్నలు, స్త్రీలు, బాలురు అందరూ జీపులో కూర్చున్న మోహన్‌కి దండాలు పెట్టారు. కన్నీళ్లతో అతనికి వీడ్కోలు చెప్పారు.

జీపును టెంట్ల దగ్గిర కొంత సేపు ఆపారు. అక్కడ కాలిన బూడిద కుప్పలుగా పేరుకుంది. ఆవరణ చుట్టూ ఉన్న హెడ్జింగు మాడిపోయింది. టెంట్లు నామ మాత్రానికి కూడా లేకుండా కాలిపోయాయి. నరసారావుపేట కుర్చీలు, కాంపు కాటులు కాలి వంగిపోయాయి. పాత్ర సామాన్లు నామరూపాలు లేకుండా పోయాయి. టైప్ రైటరు రబ్బరు రోలరు కాలిపోయింది. అక్షరాలు వంగిపోయాయి. మొత్తానికి వాటిలో ఒకటి కూడా పనికి రాకుండా పోయింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here