శ్రీపర్వతం-42

0
10

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం’ అనే చారిత్రక నవలలో ఇది 42వ భాగం. [/box]

మోహన్ చారిత్రక నవల-1.3

[dropcap]“ఈ[/dropcap] వర్గీకరణ మొట్టమొదటలో అంతగా పాటించేవారు కారు. ఎంతమంది ప్రయాణం చేయడానికి వీలవుతుందో దానిని బట్టి నౌకలు నిర్మించేవారు.”

“విజయుడు ప్రయాణం చేసిన నౌకలో ఏడువందల మంది ఉన్నారు. వాళ్లందరూ విజయుడి అనుచరులూ, వారి భార్యలూ, వారి పిల్లలూ.

“జంబూ ద్వీపంనుండి సింహళ ద్వీపానికి ప్రయాణం చేసిన నౌకలో సింహళుడు కాక అయిదు వందలమంది వర్తకులున్నారు.

“విజయుడి కోసం పాండ్యరాజు పుత్రినిచ్చిన నౌకలో ఎనిమిది వందలమంది ప్రయాణం చేశారు.”

“ఒక పల్లెలో రథకారులు అంటే వడ్రంగులు ఉండేవారు. వాళ్లు సామాను తయారు చేయడానికి ముందుగనే కూలి తీసుకున్నారు. కాని, అన్న ప్రకారం సామాను తయారు చేసి ఇవ్వలేకపోయారు. భయపడి వేయిమంది రథకారులు ఒక మహా నౌకలో పారిపోయారు.”

అందరూ సావధానంగా వింటున్నారు.

“నౌకా విభజనం మరొక విధంగా కూడా చేస్తారు. అవి సామాన్య నౌకలు – విశేష నౌకలు – ఇవి కాక ఉన్నత నౌకలు కూడా ఉన్నాయి.”

“సామాన్య నౌకలు పదివిధాలైనవి. క్షుద్ర, మధ్యమ, భీమ, పటల, బయ, దీర్ఘ, పత్రపుట, గర్భర, మంధర అని వీటిని పిలుస్తారు. వీటిలో క్షుద్ర పదిహస్తాలు పొడవు, నాలుగు హస్తాలు వెడల్పు, నాలుగు హస్తాలు ఎత్తు ఉన్నది. అన్నిటి కన్న పెద్దదైన మంధర నూట ఇరవై హస్తాలు పొడవు, అరవై హస్తాలు వెడల్పు, అరవై హస్తాలు ఎత్తు ఉంది. ఈ నౌకలు నదీమార్గాలు లేక సంచరించగలవు. వీటిలో భీమ, భయ, గర్బర నౌకలు అశుభం కలిగించేవి. ఇవి నీటిపై నిలకడగా ఉండవు.”

“విశేషనౌకలలో ప్రత్యేకంగా పొడవుగా ఉన్నవి దీర్ఘ జాతికి చెందినవి. అవి కూడా పది రకాలు, దీర్ఘక, తరణి, లోల, గత్వర, గామిని, త్వర, జంఘాల, ప్లావిని, దారిణి, వేగిని అన్నవి.”

“ఉన్నత నౌకలు కూడా విశేష నౌకల కోవకే చెందినవి. అవి అయిదు రకాలు. అవి ఊర్ధ్య, అనూర్ధ్య, స్వర్ణముఖ, గర్భిణి, మంధర అన్నవి. వీటిలో అనూర్వ, గర్బిణి, మంధర అన్నవి అశుభం కలిగిస్తాయి.

“ఈ విశేషనౌకలు కేవలం సముద్రయానానికి కావలసినవి.”

అప్పటికి ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది.

మరునాడు మధ్యాహ్నం బ్రాహ్మణులు, మహా నావికుడు, మధ్యగా నున్న పెద్ద గదిలో కూర్చుండి, శ్రమణుడికి కబురు పంపించారు.

ఈసారి రుద్రభట్టు మాట్లాడాడు.

“ఓ శ్రమణుడా! నీకు శాస్త్రం బాగా తెలిసినట్లుంది. ఈ నౌకల గురించి మరికొన్ని ప్రశ్నలు వేయడానికి మా వాళ్ళందరూ కుతూహలంగా ఉన్నారు. వాటికి కూడా సమాధానాలివ్వ వలసింది.”

జవాబుగా శ్రమణుడు నవ్వాడు.

బ్రాహ్మణుల ఎదుట ఇంతవరకు శ్రమణుడు కూర్చోలేదు. వాళ్లు కూర్చోమని కూడా అతనితో అనలేదు.

“మనం ప్రయాణం చేస్తున్న నౌక యొక్క ముఖం హంసముఖం వలె ఉంది. ఈ నౌకాముఖాలు ఇంకా ఏవైనా ఆకృతులలో ఉంటాయా?” యజ్ఞ దత్తశర్మ ప్రశ్నించాడు.

“ఈ ఆకారం గురించి చెప్పే ముందు ఒక విషయం మీ దృష్టికి తేవలసి ఉంది. నౌకను నిర్జీవమైన వాహనంగా నావికులు పరిగణించరు. దానిని సజీవమైన ప్రాణిగా భావిస్తారు. అందుచేత ఈ నౌకా ముఖాలు వివిధమైన ఆకారాలలో నిర్మితమవుతాయి. వండ్రంగుల శిల్ప నైపుణ్యాన్ని బట్టి ఇవి రూపొందుతాయి. సింహం, ఎనుబోతు, సర్పం, ఏనుగు, పులి, బాతు, నెమలి, చిలుక, హంస, కప్ప, మానవుడు మొదలైన సజీవ ప్రాణుల ముఖాకృతులతో ఈ నౌకలు నిర్మింపబడతాయి. జీవమున్న ప్రాణివలె నౌక తన దారిని చూచుకుంటూ పోవాలి.”

“చాల బాగుందే!” అన్నాడు రుద్రభట్టు

“కాంచన మాలికలతోను, ముత్తెపుసరాలతోను నౌకా ముఖాలను అలంకరిస్తారు. నౌకలను శృంగారించడం కోసం బంగారు రేకులు, వెండి రేకులు, రాగి రేకులు ఉపయోగిస్తారు. ఒకొక్కసారి ఈ మూడు లోహాల మిశ్రమంతో తయారయిన రేకులతో నౌకాముఖం సజ్జీకరిస్తారు. హేమ మాలికలతోను, మౌక్తిక హారాలతోను అలంకృతమైన నౌక అన్నివిధాల భద్రమైనదని విజ్ఞుల అభిప్రాయం.”

“మన నౌకకు ఈ అలంకారాలున్నాయి. కాబట్టి మన ప్రయాణం క్షేమంగా జరుగుతుందని నా నమ్మకం.” అన్నాడు మహానావికుడు.

“ఇంకా ఈ నౌకా నిర్మాణంలో విశేషాలున్నాయా?” శాండిల్యుడు అడిగాడు.

“నౌకను నిర్మించడానికి ఉపయోగించే కర్ర నాలుగు జాతులకు చెందినది. వృక్షే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కలపను నాలుగు జాతులుగా విభజించారు. బ్రాహ్మణ జాతి, క్షత్రియజాతి, వైశ్యజాతి, శూద్రజాతి కష్టాలుగా వాటిని పేర్కొంటారు.”

“ఈ చాతుర్వర్ణ్యం కాష్ఠాలలో కూడా ఉందన్నమాట!” అన్నాడు రుద్రభట్టు నవ్వుతూ.

“నాలుగు జాతులూ భిన్నభిన్నమైన గుణాలు కలిగి ఉన్నాయి. బ్రాహ్మణజాతి కాష్ఠం తేలికగా, మెత్తగా ఉంటుంది. మరే జాతి కర్రతోనైనా దీనిని సులువుగా అతకవచ్చు.”

“రెండవది క్షత్రియజాతి కాష్ఠం. ఇది తేలికగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది. దీనిని మరే జాతి కర్రతోను అతకడానికి వీలుపడదు.

“మూడవది వైశ్యజాతి కాష్ఠం. ఇది మెత్తగాను, బరువుగాను ఉంటుంది.”

“నాలుగవది శూద్రజాతి కాష్ఠం. ఇది బరువుగా, గట్టిగా ఉంటుంది.”

“కొన్ని రెండు జాతులగుణాలు కలిగినవుంటాయి. వీటిని ద్విజాతి కాష్ఠాలంటారు.”

“ఏ జాతి కర్రతో చేసిన నౌక మంచిది?” యజ్ఞదత్త శర్మ అడిగాడు.

“క్షత్రియ జాతి కాష్ఠంతో నిర్మితమైన నౌక సంపదను, సుఖాన్ని ఇస్తుంది.”

“అయితే మన నౌక ఏ జాతి కాష్ఠంతో చేయబడిందో చెప్పగలవా?” మహానావికుడు ప్రశ్నించాడు.

“మన నౌక క్షత్రియజాతి కాష్ఠంతో నిర్మింపబడింది.”

మహానావికుడి ముఖంలో ఆనందరేఖ తాండవించింది.

“ఎంత మంచి మాటన్నావయ్యా!” రుద్రభట్టు దీర్ఘంగా నిట్టూర్చాడు.

“ఏవేనా నౌకల గురించి చెప్పడం కన్న మన నౌక గురించే చెప్పు” అన్నాడు శాండిల్యుడు.

“మన నౌక ఉత్తమమైనది. మీరందరూ క్షేమంగా ఘంటశాల నుండి చంపావతి వరకు ప్రయాణం చేశారు. అంతకన్న వేరే చెప్పవలసినదేముంది?”

“ఓయి శ్రమణా! మేము తిరుగు ప్రయాణం గురించి అడిగాం. గతం గురించి కాదు.” అన్నాడు రుద్రభట్టు.

“సంక్షోభం చెందని జలాలలో నౌక ప్రయాణం చేస్తే భద్రంగానే గమ్యం చేరుకుంటుంది.”

“ఏదో వివాదత్మకమైన విషయాన్ని నువ్వు మరుగు పరుస్తున్నావు.” అన్నాడు యజ్ఞదత్తశర్మ.

శ్రమణుడు నవ్వాడు.

“నేను కేవలం శాస్త్రం తెలిసిన వాడిని. అనుభవం గల వాడు మహా నావికుడు. అతనికన్న ఈ విషయాలలో బాగా తెలిసినవాడెవడూ లేడు. అందుచేత మీరందరూ అతని కౌశలం మీద గౌరవముంచి నిర్భయంగా ఉండవచ్చు.”

“ఏదో గోపనం చేస్తున్నావు. అదేదో సూటిగా చెప్పు” రుద్రభట్టు గట్టిగా అన్నాడు.

“నేనీ నౌకలో ప్రయాణం చేసేవారికి వైద్యుడిని. మహానావికుడు మీ సందేహాలు తీరుస్తాడు.”

“మహా నావికా! ఈ శ్రమణుడికేం తెలుసో పరీక్ష చేస్తున్నాము. ఈ రహస్యమేదో అతని నోటంటే వినదలచుకున్నాము. నువ్వు ఇతనిని ఆజ్ఞాపించవలసింది.” రుద్రభట్టు కోపంగా అన్నాడు.

మహా నావికుడు ఒక క్షణం ఆలోచించాడు. శ్రమణుడికి తెలిసిన రహస్యమేదో అతను కూడా ఎరుగుడు. బ్రాహ్మణులందరూ ఉద్రిక్తులై ఆ మహా రహస్యాన్ని తెలుసుకోవాలని తొందర పడుతున్నారు.

కొంత సేపు ఆలోచించి మహానావికుడు తన అంగీకారం తెలియజేశాడు.

శ్రమణుడు మళ్లీ చెప్పడం మొదలు పెట్టాడు.

“బ్రాహ్మణులారా! మీరందరూ ఎందుకు ఉద్రిక్తులవుతున్నారో నాకు తెలియదు. ఏ వస్తువుకైనా అన్నీ సుగుణాలే ఉంటాయని చెప్పలేం. కొన్ని లోపాలు కూడా ఉంటాయి. మనం ఆలోచించవలసింది, ఆ లోపాలు తీవ్రమైనవా అని.”

“అయితే మన నౌకకు కూడా లోపాలున్నాయన్నమాట!” రుద్రభట్టు పలికాడు.

“ఏవో పేరుకు మాత్రమే ఉన్నాయి”.

“ఏమిటవి?” మహానావికుడు ప్రశ్నించాడు.

“మన నౌకకు రెండే లోపాలున్నాయి. ఈ నౌక మధ్య మందిర అని మీ అందరికీ తెలుసు. దీనికి చంపావతిలో పూర్తిగా రంగు వేయించారు. రెండు తెరచాప కొయ్యలు దీనికున్నాయి. కాబట్టి ఈ నావకు పసుపురంగు వేయించాలి. దీనికి బదులు ఎరుపు రంగు వేయించారు.”

“ఏమిటేమిటి, నౌకకు రంగు వేయడంలో కూడా పద్ధతులున్నాయా?” రుద్ర భట్టు అడిగాడు.

“శాస్త్రమేమి చెప్పిందంటే, నాలుగు తెరచాపకొయ్యలున్న నౌకకు తెలుపురంగు వేయాలి. మూడు కొయ్యలున్న దానికి ఎరుపు రంగు వేయాలి. రెండు కొయ్యలున్న దానికి పసుపురంగు వేయాలి. ఒక కొయ్య ఉన్నదానికి నీలిరంగు వేయాలి. రేవులో నిలిచిన నౌకను దానికి వేసిన రంగును బట్టి సులువుగా పోల్చుకోవచ్చు.”

“ఇదొక పెద్దలోపమా? ఏ రంగయితేనేం, అన్నీ ఒకటేపని చేస్తాయి. నౌక నీటిలో ఉన్నప్పుడు కర్ర చివికిపోకుండా ఉంచడం దీని ప్రయోజనం. ఇది ముఖ్యమైనది. కంటికి ఇంపుగా కనిపించడం మరొక ప్రయోజనం. దీనిని లోపంగా పరిగణించనక్కరలేదు.” అన్నాడు యజ్ఞదత్త శర్మ.

మహా నావికుడు ఏమీ వ్యాఖ్యానం చేయలేదు. శ్రమణుడు తిరిగి చెప్పాడు.

“నౌక ఘంటశాల నుండి చంపావతి వచ్చినపుడు ఇరావతీ నదిలోని బండరాళ్లకు తగిలి కుడివేపునున్న బల్లలు దెబ్బతిన్నాయి. వాటిని చంపావతిలో బాగు చేశారు. చాల బల్లలను తీసివేసి వాటి స్థానాలలో కొత్త బల్లలను అమర్చారు. ఆ బల్లలు క్షత్రియజాతి కలపకు చెందినవి కావు. శూద్రజాతికి చెందినవని. ఆ దారువుల లక్షణమేమిటంటే దృఢంగా ఉన్నా బురువుగా ఉంటాయి. అందుచేత బరువు హెచ్చి, కుడివేపుకి నౌక అధికంగా మునిగింది. ఇంతకుముందు మీకు చెప్పే ఉన్నాను. క్షత్రియజాతి కాష్ఠం మరేజాతి కాష్ఠంతోను అతకదు. భిన్నభిన్న గుణాలు కల రెండు జాతుల బల్లలు బిగించడం రెండోలోపం.”

నౌకకు బాగుచేతలు జరిగినప్పుడు మహానావికుడు చంపావతిలో లేడు. యవద్వీపంలో ఉన్నాడు. అతడు తిరిగి వచ్చిన తరువాత ఈ పొరపాటును గుర్తించాడు. అప్పటికే తిరుగు ప్రయాణానికి ముహూర్తం నిశ్చయమయింది.

అందరూ మహా నావికుని ముఖంలోకి చూశాడు. శ్రమణుడు ఎవరివంక చూడడంలేదు. చెప్పవలసింది చెప్పడానికి ఉద్యుక్తుడయాడు.

“మహానావికుడు ఈ లోపం సరిదిద్దడానికి రాగి రేకులను లోపల అతికించాడు. శూద్రజాతి కాష్ఠం బరువుకు ఈ రాగి రేకు బరువు కూడా తోడయింది.”

“ఇప్పుడేమీ చేయడానికి మార్గాలు లేవా?” రుద్రభట్టు ప్రశ్నించాడు.

“వాతావరణం అనుకూలంగా నుండి, సాగరం సంక్షుభితవకుండా ఉండి, గమన వేగం తగ్గించి నడిపితే, గమ్యం క్షేమంగా చేరుకోవచ్చు.”

అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు. మహా నావికుడేమీ వ్యాఖ్యానించలేదు.

మహాసాగరం ఒడ్లులేని చెరువువలె కనిపిస్తున్నది. నౌక చాల నిలకడగ ప్రయాణం చేస్తున్నది.

“మనం ఏవిధంగాను భయపడనక్కరలేదు. నౌకను మహా నావికుడు భద్రంగా గమ్యం చేర్చగలడని విశ్వసిస్తున్నాను. ఇవాళకీ ప్రసంగం చాలు. శ్రమణుడు వెళ్లిపోవచ్చు.”

రుద్రభట్టు ఆనాటి సమావేశం ముగించాడు. శ్రమణుడు నిష్క్రమించాడు. మహానావికుడు బ్రాహ్మణులకు ధైర్యం చెప్పి వెళ్లిపోయాడు.

మరునాడు మధ్యాహ్నం సూర్యుడు కొంచెం పడమటికి వాలినప్పుడు, చాలమంది బ్రాహ్మణులు తమ మందిరాలు విడిచి మహాసముద్రాన్ని పరికించారు. అలలు ఎత్తుగా లేవడం లేదు. గాలికూడా అంతగా లేదు. అంతా ప్రశాంతంగా ఉంది. బ్రాహ్మణులు ఎంతో ఉల్లాసంగానున్నారు. వాళు మహానావికుడిని, శ్రమణుడిని పిలిపించారు.

“ఓయి శ్రమణుడా! నువ్వు శాస్త్రాలు చదువుతున్నావని ఇప్పుడిప్పుడే మాకు నమ్మకం కలుగుతున్నది. ప్రస్తుతం మనం సముద్ర యానం చేస్తున్నాం. దానికి సంబంధించిన విషయాలే నిన్నడుగుతున్నాం. నౌక ఎందుకు నీట మునుగుతుంది? ” రుద్రభట్టు ప్రశ్నించాడు.

శ్రమణుడు మహా నావికుడి ముఖంలోకి చూశాడు.

“అయ్యా! రుద్రభట్టుగారు! శుభంగా గమ్యం చేరాలని మేము అన్ని ప్రయత్నాలు చేస్తూంటే, పరస్పర విరుద్ధంగా ఉన్న విషయాలు ఎందుకడుగుతారు?” మహానావికుడు చిరాకుగా అన్నాడు.

“ఓ మహానావికా! మేము చదివిన శాంతి మంత్రాలు, వరుణ దేవతాది స్తుతులు మమ్మల్ని క్షేమంగా గమ్యానికి చేరుస్తాయి. ఇది నిర్వివాదమైన విషయం. ఈ శ్రమణుడు తక్షశిలలో ఓషధీ శాస్త్రం చదివానని చెప్తున్నాడు. సాధారణంగా ఈ విద్య పూర్తి అవడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది. విద్య పూర్తి కాగానే ఇతడు తక్షశిల విడిచి పెట్టినట్లు ఆ మధ్యను చెప్పాడు. ఇతడు వైద్యశాస్త్రమే చదివాడా, లేక నౌకానిర్మాణ శాస్త్రమే చదివాడా? శాస్త్ర గతమైన విషయం శుభమని అశుభమని చెప్పడానికి వీలులేదు. శాస్త్రం శాస్త్రమే!” అన్నాడు రుద్రభట్టు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here