శ్రీపర్వతం-45

0
8

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం’ అనే చారిత్రక నవలలో ఇది 45వ భాగం. [/box]

మోహన్ చారిత్రక నవల-2.2

[dropcap]“మీ[/dropcap] పేరు చాల చక్కగా ఉంది. చాల కాలం తరువాత పరిచయమున్న నామం విన్నాను. నేను కళింగ దేశంలో జన్మించాను. అందుకే మీ పేరు నాకు ఆనందాన్ని కలిగించింది.”

కళింగ భూపతి కళ్లలో ఆనందం నాట్యం చేసింది.

“శ్రమణా! మీకు తెలిసే ఉంటుంది. మౌర్యాశోకుని జ్యేష్ఠభార్య శాక్యకుమారి. ఆమెకు మహేంద్రుడన్న తనయుడు, సంఘమిత్ర అన్న కుమారి జన్మించారు. యువరాజును రాజపుత్రిని బౌద్ధ ధర్మవ్యాప్తికి అశోక చక్రవర్తి సింహళం పంపించాడు. నాలుగున్నర శతాబ్దాల క్రింద వారు సింహళం వచ్చారు. అపుడు కళింగ దేశం నుండి మా వంశానికి చెందిన భూపతిని వారికి సహాయంగా చక్రవర్తి పంపించాడు. మేము కళింగరాజు వంశానికి చెందినవాళ్లం. మొదట సింహళ ద్వీపం చేరిన భూపతిని అందరూ కళింగ భూపతి అని పిలిచేవారు. అతడు పాండ్యరాజవంశపు బాలికను వివాహమాడాడు. అతని కుమారుడు రుద్రభూపతిగా – అతని కుమారుడు తిరిగి తాతగారి పేరుతో కళింగ భూపతిగా వ్యవహరింపబడ్డాడు. మేము రాజవంశం వారిమే. కాని ఏ రాజ్యాన్ని పాలించలేదు. బౌద్ధ మతం స్వీకరించకపోయినా, బౌద్ధ మతాభిమానులమై సింహళ రాజుల కొలువులో పలు విధాల ఉద్యోగాలు చేశాము. నేను ఇరువది ఒకటవ తరం వాడిని. మా తల్లులు పాండ్యదేశపు రాజవంశం వారు. నా భార్య కూడా ఆ వంశానికి చెందినదే. నేను చాల సంవత్సరాలు నగరపాలనా విభాగంలో ఉద్యోగం చేశాను. జేట్ఠతిస్సమహారాజు గారి సింహాసనమెక్కిన తరువాత, అతిథులుగా విచ్చేసిన మహారాజులు, రాజులు, వారి బంధువులు విడిది చేయడానికి ఈ విశ్రాంతి గృహం నిర్మించారు. రాజవంశపు మర్యాదలు తెలిసిన నన్ను ఈ గృహరక్షకునిగా నియమించారు. మీరు కళింగ దేశంలో జన్మించినట్లు చెప్తున్నారు. మా పూర్వులు కళింగ నగరంలో నివసించారు. మీ జన్మస్థలం అక్కడికి ఎంతదూరం?”

“కళింగనగరానికి ఒక క్రోశం దూరంలో శాలిపిటక గ్రామముంది. నేను ఆ గ్రామంలో…”

కళింగ భూపతి గట్టిగా అరచాడు.

“నీళ్లు! నీళ్లు!! అంగరక్షకుడి కొడుకు గుణనిధి మూర్చరోగంతో పడిపోయాడు. తొందరగా తెండి!”

లోపలి నుండి పరిచారకులు బిందెలతో నీళ్లు తెచ్చి కుర్రాడివేపు పరుగెత్తారు. కళింగ భూపతి వారికన్న ముందుగా చెట్టునీడను చేరుకున్నాడు.

శ్రమణుడు వీరందరికన్న ముందుగా, నేలను కొట్టుకొంటున్న బాలుడిని సమీపించాడు. పరిచారకులు నీళ్లు గుమ్మరించడానికి తొందరపడుతుంటే అతడు వారించాడు. ప్రహారీకి పక్కన మొలిచిన మొక్కని పెరికి తెచ్చాడు. రోగి కదలకుండా ఇద్దరు మనుషులను పట్టుకోమన్నాడు. మొక్క నుండి తుంచిన ఆకులను చేతులలో నలిపి, ఆ రసం రోగి ముక్కు కన్నాలలో పిండాడు. కొద్ది క్షణాలలో తనకేమి కానట్లే బాలుడు లేచి కూర్చున్నాడు. చుట్టూ చేరినవారిని ఆశ్చర్యంతో చూశాడు. సాధారణంగా అతనికి తెలివి వచ్చేసరికి, కట్టుకున్న బట్టలన్నీ తడిసి, తాగిన నీళ్లతో కడుపునిండి, చాలా నీరసంగా ఉండేవాడు. అందుకు భిన్నంగా ఈ దినం అతను ఉల్లాసంగా లేచి తన యింటివేపు నడిచాడు.

పరిచారకులు ఆశ్చర్యపోయారు. కళింగ భూపతి చాల హెచ్చుగా సంతోషించాడు. ఈ మధ్య గుణనిధి తరచు ఎక్కడబడితే అక్కడ పడిపోతున్నాడు. శరీరానికి దెబ్బలు తగుల్తున్నాయి. అంగరక్షకుడు యశోనిధికి అతడు ఏకైక పుత్రుడు. మూర్ఛ రోగంతో మృత్యుముఖంగా ప్రయాణం చేస్తున్న కొడుకుని చూసి తల్లిదండ్రులు విలపిస్తున్నారు. రాజవైద్యులు కాని, ఇతర భిషక్కులు కాని కుర్రవాడి రోగం కుదర్చలేకపోయారు.

ఈ సంఘటన జరిగిన మూడో నాడు, సాయంకాలవేళ, యశోనిధి మహారాజు గారినుండి సెలవు తీసుకొని భార్యతో, పుత్రుడితో విశ్రాంతి గృహానికి వచ్చాడు. ముగ్గురూ శ్రమణుని పాదాల పై బడ్డారు.

శ్రమణుడు వారిని లేవనెత్తాడు. మరో రెండువారాలు, నాసికలో పసరు పిండితే, జీవితమంతా రోగవిముక్తుడై, సుఖంగా చిరంజీవి మనగలడని అభయమిచ్చాడు.

ఈ వార్త అనూరాధ పురంలో అన్ని వాడలలోను వ్యాపించింది. ప్రజలు తండోపతండాలుగా విశ్రాంతి గృహానికి రావడం మొదలు పెట్టారు. శ్రమణుడు పరిసరాలలో లభించిన మూలికలతోను, పసరులతోను వైద్యం చేశాడు. దీర్ఘవ్యాధులు, తీవ్రమైన రోగాలు, గాయాలు, వ్రణాలు – అన్ని విధాలైన అస్వస్థతలకు అతను చికిత్స చేశాడు.

చికిత్స చేసినందుకు అతనికి పూవులు, పండ్లు కాకుండా సువర్ణాలు కూడా సంపన్నులు సమర్పించారు. పండ్లు, పూవులు వచ్చినవారికి పంచి, సువర్ణాలను మహా రాజుగారి కోశాగారానికి పంపించాడు. తాను మహారాజుగారి అతిథిగా సఖల సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు. అందుచేత తనకు లభించిన ధనమంతా మహారాజుగారికి చెందుతుందని అతను వివరించాడు. మహారాజుకి ఈ విషయం తెలిసినా అతను అవునని కాని, కాదని కాని తన అభిప్రాయం వెలిబుచ్చలేదు. కోశాధికారిని మాత్రం ఆ ధనాన్ని బౌద్ధ స్తూప నిర్మాణానికి వేరుగా ఉంచమని ఆజ్ఞాపించాడు.

శ్రమణుడు అనూరాధ పురం చేరి రెండు నెలలకు పైగా అయింది. మహారాజు జేట్ఠతిస్సుడు అతనిని పిలువనంపలేదు. దినదినం శ్రమణుని గురించి వివరాలను సేకరించి తెలుపడానికి ప్రత్యేకమైన వ్యక్తులను పరిచారకులుగా నియోగించాడు. ఆ వివరాలలో శ్రమణుడి గురించి చాల తక్కువే తెలిసింది. అతనికి వైద్యంలో నున్న ప్రావీణ్యం బహుముఖాలుగా రాణించింది. నియమబద్ధమైన జీవితం గడుపుతూ, మిత భాషిగా వ్యవహరిస్తున్న శ్రమణుడి గురించి అంతకుమించి విశేషాలు మహారాజుకు లభించలేదు.

అనుకోకుండా ఒక దినం మహారాజు శ్రమణునికి కబురు పంపాడు. రాజసభ సమావేశమయింది. శ్రమణుడు చుట్టూ మూగిన రోగులను పక్కలకు తొలగించి, సభా మందిరం చేరుకున్నాడు.

సభా భవనం విశిష్టమైనది. విశాలంగా ఉంది, రెండు వందల వరకు ఉత్తమ వంశాలకు చెందిన సభికులు ఉన్నతాసనాలలో కూర్చున్నారు. మహారాజు జేట్ఠతిస్సుడు మంత్రి సమేతంగా సభ తీర్చాడు.

శ్రమణుడు మహారాజును అభినందించాడు.

సభికులకు ఎదురుగా తనకై నిర్దేశింపబడిన ఆసనం మీద శ్రమణుడు కూర్చోలేదు అందరికీ అభిముఖంగా నిలుచున్నాడు.

అపుడు మహామంత్రి మహారాజుగారి అభిమతాన్ని శ్రమణుడికి తెలియజేశాడు.

“శ్రమణా! నువ్వు అనూరాధ పురం చేరుకొని రెండు నెలలు గడిచాయి. తీవ్రమైన గాలివానలో చిక్కుకొని, నావనుండి చిన్న తెప్పమీద కొట్టుకొని వచ్చి, తెలివి లేకుండా ఉన్న నిన్ను మా జాలరులు కనుగొన్నారు. నీకు సపర్యలు చేసి, మహారాజు గారికి ఈ విషయం తెలియజేశారు. సకల మర్యాదలతో బౌద్ధ శ్రమణుని అనూరాధ పురం చేర్చమని మహారాజు ఆజ్ఞాపించారు. రాజధాని చేరుకున్న నీకు, విశ్రాంతి గృహంలో వసతి కల్పించి, బడలిక నుండి తేరుకోడానికి వ్యవధినిచ్చారు. ఇపుడు, రాజసభలో, అందరి సమక్షంలోనీ వృత్తాంతం వినడానికి మహారాజుగారు సావధానులై ఉన్నారు”.

శ్రమణుడు మహారాజు గారిని, సభికులను మరొకసారి అభివాదనం చేసి చెప్పడం మొదలు పెట్టాడు. అతని కంఠం మృదువుగా, గంభీరంగా, శ్రవణ సుభగంగా వినిపించింది.

“నేను ఆనందుడిని, ఆంధ్రుడిని. హైమావతి నా తల్లి, సోమశర్మ నా తండ్రి. నేను కళింగదేశంలో శాలిపిటక గ్రామంలో జన్మించాను. వైశాలీ నగరంలో పెరిగాను. నన్ను కన్న తల్లిదండ్రులు, నన్ను పెంచిన తల్లిదండ్రులు బ్రాహ్మణులు. మరి, నేను బౌద్ధుడినెలా అయానని మీకందరికీ సంశయం కలుగుతుంది.

శాలిపిటక గ్రామానికి రెండు క్రోసుల దూరంలో కళింగ నగరముంది. మౌర్య చక్రవర్తి అశోకుడు నాశనం చేసిన కళింగరాజ్యముఖ్యపట్టణమది. మా గ్రామాన్ని ఒరుసుకుంటూ పారుతున్న వంశధారానది కళింగ నగరం దగ్గిర సాగరంలో కలుస్తుంది. మా గ్రామానికి కొద్ది దూరంలో సముద్రం వేపు ఒక కొండ ఉంది. దానిమీద బౌద్ధ స్తూపమొకటి, సంఘారామమొకటి ఉన్నవి.

విహారంలోని బౌద్ధ భిక్షువులు ఆచార్య ధర్మరక్షితుల సంరక్షణలో ఉండేవారు. ఒకసారి భిక్షువులందరూ అస్వస్థులయారు. అపుడు ఆచార్యులు స్వయంగా భిక్షాటనకు బయలు దేరారు. దారిలో మా గృహానికి విచ్చేశారు. బిడ్డలు లేని మాయింట్లో భిక్ష స్వీకరించడానికి వారు అంగీకరించలేదు.

వారు ఔషధమొకటి సేవించమని మా తల్లికి ఇచ్చారు.

నేను జన్మించిన నాడు వారు తిరిగి మా గృహానికి వచ్చారు. మా తల్లిదండ్రులను ఆశీర్వదించారు. ఆనందుడనే పేరు నాకు పెట్టమన్నారు. నన్ను తక్షశిలకు పంపి ఓషధీ శాస్త్రంలోను, శాస్త్ర చికిత్సలోను నిష్ణాతుడిని చేయించమన్నారు.

ఆంధ్రాపథం నుండి కళింగదేశం వచ్చి, అచట స్థిరపడిన మా తల్లిదండ్రులు, ఆ విధంగా బౌద్ధధర్మాన్ని అభిమానించి ఉపాసకులుగా ఆరాధించారు.

కొండమీదనున్న సంఘారామం చాల ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ నుండి చూస్తే వంపులు తిరిగి పారే నిర్మలమైన నది సముద్రంలో కలియడం కనిపిస్తుంది. అటు వంటి దివ్యమైన పరిసరాలలో ఆచార్యులు బౌద్ధధర్మప్రాశస్త్యం గురించి చెప్పేవారు.

అపుడు నేను నాలుగేళ్లవాడిని. మా తల్లిదండ్రులతో కలిసి ధర్మకథకుల ఉపన్యాసం వినడానికి నేను కూడా సంఘారామానికి పోయేవాడిని. వారు ఏమి చెప్పేవారో నాకు బోధపడకపోయినా, శ్రవణ పేయంగా ఉన్న వారి భాషణనకు మంత్రముగ్ధుడనై కూర్చుండే వాడిని.

జీవకుడు బుద్ధ భగవానుని అంతరంగిక వైద్యుడు. సంఘంలోని భిక్షువులకు అతడు ఉచితంగా వైద్యం చేసేవాడు. నేడు సంఘం బహుశాఖలుగా విస్తరించింది. కాబట్టి ఎందరో జీవకులు అవశ్యమని వారు చెప్పేవారు.

నేను అయిదేళ్లవాడుగా ఉన్నప్పుడు, మా తల్లిదండ్రులు దేశంలోని వివిధ బౌద్ధ క్షేత్రాలను దర్శించడానికి బయలుదేరారు. బుద్ధగయ, రాజగృహం, వారణాసి, లుంబిని – ఈ విధంగా క్షేత్రం తరువాత క్షేత్రం దర్శిస్తూ, తిరుగుదలలో వైశాలి చేరుకున్నారు.

వైశాలిలో ఒక సంపన్న గృహస్థుడు వారికి అతిథ్యమిచ్చాడు. వారు తిరిగి శాలిపేటకం చేరుకోలేదు. వైశాలిలో మహామారి కార్చిచ్చు వలె వ్యాపించింది. మా తల్లిదండ్రులు ఆ భయంకరమైన వ్యాధికి బలి అయారు.

మా తల్లి చనిపోతూ, మాకు అతిథ్యమిచ్చిన గృహస్థును ఒక కోరిక కోరింది. ఆచార్య ధర్మరక్షితుల బోధలు ఆమె మనసును విడిచి పెట్టలేదు. సంఘం విస్తరించింది. దాని సంరక్షణకు చాలమంది జీవకులు కావాలి. ఆమె తనతో తెచ్చిన వేయి సువర్ణాలను అతని చేతిలో పెట్టి, నా విద్యకు ఆ ధనాన్ని వినియోగించమంది. తక్షశిలలో వైద్యవిద్యను నేర్చుకోడానికి నన్ను పంపమంది.

నన్ను పెంచిన తల్లిదండ్రులు పద్మప్రియ, గుణ వినీతులు. ఐదవ యేటినుండి మా పెంపుడు తండ్రి గురుత్వం వహించి, తక్కిన శిష్యులతోపాటు నాకు విద్యారంభం కావించారు. వైశాలిలో ఉపనయనపర్యంతం నేను విద్యనభ్యసించాను.

ఉపనయనం తరువాత మా తండ్రి నన్ను వారణాసి పంపించారు. అక్కడ స్మృతి, ఇతిహాస, పురాణాలలో ప్రవేశం లభించింది.

వారణాసిలో మా గురుకులం పక్కనే సంగీత నిధులైన ఆచార్యులొకరు ఆశ్రమంలో ఉండేవారు. వారికి నా యందు పుత్రవాత్సల్యం. పూర్ణిమా నిశలలో వారి సన్నిధిని నేను గాంధర్వ వేదం అధ్యయనం చేశాను.

నాకు పదిహేను సంవత్సరాలు నిండగనే మా తండ్రి గుణవినీతుడు వారణాసి వచ్చి, నాకు విద్యలు నేర్పిన గురువులను సత్కరించి, వైశాలికి నన్ను తీసుకొని పోయారు. అపుడు నా కన్నతల్లి కోరికను నాకు తెలియజేశారు. తక్షశిలలో ఓషదీ శాస్త్రం, శస్త్ర చికిత్స అభ్యసించి నా విద్యను పూర్తి చేయమని చెప్పారు.

పగటిపూట విద్యగరపి కన్నకొడుకులవలె ఆదరంతో గురువులు మమ్ము చూసుకున్నారు. ముందుగా గురుదక్షిణ వేయినాణాలు చెల్లించిన వారికి ఈ సౌలభ్యం కలిగేది. పేదలైన విద్యార్థులు, గురుగృహంలో పగటిపూట పనిచేసి, రాత్రివేళల్లో గురు శుశ్రూష చేసి విద్య నేర్చుకునేవారు. నా సమయం కేవలం విద్యకోసమే వినియోగపడాలని మా తల్లిదండ్రులు కోరినట్లున్నారు. అందుకోసమే, శ్రమపడి సేకరించిన వేయి సువర్ణాలను వైశాలిలో గృహపతి దగ్గర దాచారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here