శ్రీపర్వతం-49

0
6

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం’ అనే చారిత్రక నవలలో ఇది 49వ భాగం. [/box]

మోహన్ చారిత్రక నవల-3.3

[dropcap]శ్ర[/dropcap]మణుడు వాయవ్యభాగంలోని మహాజనపథం ఒకసారి చూశాడు. మరునాడు పశ్చిమ దిక్కున, సామాన్య ప్రజల నివాసాలకు దిగువ భాగాన ఉన్న సంఘారామాలను దర్శించాడు. అప్పుడొక దృశ్యం అతని మనసును కలవర పెట్టింది. పశ్చిమాన, నగరప్రాకారం వేపున్న కొన్ని సంఘారామాలు కూలిపోయి ఉన్నాయి. కూలిపోవడం కన్న కూల్చబడడం అంటే సరిపోతుంది. దక్షిణ ద్వారానికి మీదను ఈ విహారాలున్నవి. వాటిలో భిక్షువులు అంతగా కనిపించలేదు. ఒకటి రెండు విహారాలలో చాలా తక్కువ మంది మసలుతున్నారు. వాటికి కుడిభాగాన దుర్గం వేపున్న విహారాలు భిక్షువుల సంచారంతో కలకలలాడుతూ ఉన్నాయి. ఈ భేదం గురించి సరిగా తెలుసుకోడానికి అవకాశమివ్వకుండా, జనులు కాపలా వారిని బ్రతిమాలి, తండోపతండాలుగా చికిత్సలకు రావడంతో ఆ సందేహం అతని మనసులో ఆ విధంగానే ఉండిపోయింది. క్రమంగా శ్రమణుడు నిద్రలోకి జారుకున్నాడు. మరునాటి ఉదయానికి కూడా వర్షం తగ్గలేదు.

క్రమక్రమంగా వర్షం హెచ్చుతోంది. వైద్యానికి వచ్చే ప్రజలు తగ్గిపోయారు.

కుండపోతగా వర్షం కురుస్తున్నప్పుడు, విశ్రాంతి మందిరంలో ముందు వసారాలో శ్రమణుడు, కళింగ భూపతి వర్షధారలను పరికిస్తూ కూర్చున్నారు.

కళింగ భూపతి కొద్ది సేపు మౌనంగా ఉండి ఒక ప్రశ్న వేశాడు.

“శ్రమణా! మీకు సీహళ దేశ చరిత్ర తెలుసా?”

“వివరంగా తెలియదు”..

“మీకు విజయుడి గురించి తెలుసా?”

“అంతంత మాత్రమే”

“విజయుడు ఇచట రాజ్యాన్ని స్థాపించక ముందు ఈ ద్వీపాన్ని లంక అని పిలిచేవారు.”

“ఆ సంగతి విన్నాను”.

“సీహళమన్న పేరు ఎలా వచ్చిందో తెలుసా?”

“భూపతి! నాకు తెలిసినది తక్కువ. మీరు చాల చక్కగా చెప్పగలరు. కాబట్టి సవిస్తరంగా వినిపించండి.”

“శ్రమణా! నేను మహావంశంలోని విషయాలు మీకు చెప్తున్నాను. వెంగీ దేశాన్ని పాలించే రాజుకి ఒక పుత్రిక ఉండేది. ఆమె పేరు సుప్రాదేవి. ఆ రాజకుమారి తల్లి కళింగ రాజపుత్రి. వర్తకుల బిడారం నడిపే ఒక ముఖ్యుడితో సుప్రాదేవి పారిపోయింది. కాని, అతనిని అతని పరివారాన్ని ఒక సింహం ఎదుర్కొని సుప్రాదేవిని ఎత్తుకుపోయింది. ఆ సింహం రాజకుమారిని చాల అనురాగంతో చూసింది. కొంతకాలం గడిచిన తరువాత ఆమెకు సింహబాహువనే పుత్రుడు, సింహసివాలి అన్న పుత్రిక జన్మించారు. ఆ పిల్లలు పెద్ద వాళ్లయిన తరువాత తల్లితో పాటు సింహం రక్షణనుండి తప్పించుకొని పారిపోయారు. సింహం ఈ ఎడబాటును సహించలేకపోయింది. దేశాన్ని నాశనం చేసింది. సింహాన్ని చంపిన వాళ్లకు మంచి బహుమతి ఇస్తానని దేశాన్ని పాలించే రాజు అన్నాడు. సింహబాహువు తాను సింహాన్ని చంపుతున్నానన్నాడు. తల్లి ఆ పనికి అంగీకరించలేదు. కాని అతడు తల్లి మాటను లక్ష్యపెట్టక సింహాన్ని చంపడానికి ముందుకొచ్చిడు. సింహబాహువును చూసి ఆ సింహం చాలా ఆనందంతో సాధువుగా ప్రవర్తించింది. విశ్వాసంతో తోక ఆడించింది. కాని, సింహబాహువు సింహాన్ని చంపివేశాడు. సింహబాహువు కొడుకే విజయుడు. తన తండ్రి యొక్క సింహం వంశం పేరును ఈ ద్వీపానికి పెట్టి, సింహళ అని పిలిచాడు. అదే సీహళం…..”

శ్రమణుడు శ్రద్ధగా వింటున్నాడు. ఉపరి వసనాన్ని సరిగా భుజంమీదికి సర్దుకున్నాడు.

భూపతికి చెప్పడం సాగించాడు.

“విజయుడు చిన్నతనంలో చాలా అల్లరి పనులు చేసేవాడు. చాలా దుష్కార్యాలు, నీచమైన పనులు చేశాడు. రాజపుత్రుడు చేసే అరాజకాలను ప్రజలు సహించలేకపోయారు. వారికి ఓపిక సన్నగిల్లిపోయింది. వాళ్లందరూ తమకు జరిగిన అన్యాయాల నుండి కాపాడమని రాజును బ్రతిమాలుకున్నారు. రాజు ప్రజలను తీయటి మాటలతో శాంతింప జేశాడు. పుత్రుడిని మందలించాడు. కాని, ప్రయోజనం లేకపోయింది. విజయుడు ఇంకా పెచ్చుమీరి పోయాడు. జనులు మరి భరించలేక పోయారు. కోపోద్రిక్తులై వాళ్లు రాజును సమీపించి, దుష్ట రాజకుమారుడిని చంపనేనా చంపమన్నారు, లేకపోతే దేశం నుండి బహిష్కరించమన్నారు.

“రాజు చాలా దుఃఖించాడు. ప్రజలు తిరుగుబాటు చేస్తారని భయపడ్డాడు. మరణ శిక్ష విధించడానికి బదులు రాజకుమారుడిని దేశం నుండి బహిష్కరించడానికి నిశ్చయించాడు.

బానిసకు మల్లే, కొడుకు యొక్క తల సగం భాగం గొరిగించాడు. ఆ విధంగా విజయుడి సహచారుల శిరస్సులను కూడా ముండనం చేయించాడు. వాళ్లందరినీ తెప్పల్లోకి ఎక్కించాడు. సోప్రా రేవు నుండి వాళ్లను చాల అగౌరవంగా కల్లోల సముద్రాల అవతలి తీరాలకు పంపివేశాడు.

సముద్రంలో ఇటూ ఇటూ కొట్టుకుపోయి, విజయుడు తన ఏడువందల మంది అనుచరులతో లంకా ద్వీపం దక్షిణ భాగానికి చేరుకున్నాడు.

ఏ దినాన విజయుడు లంకపై తన పాదముంచాడో ఆనాడే బుద్ధ భగవానుడు నిర్యాణం పొందాడు.”

“బుద్ధుడు లంకా ప్రజల క్షేమాన్ని ఇంద్రుడికి అప్పగించాడు. విజయుడు శ్లాఘనీయుమైన రాజ వంశాన్ని స్థాపిస్తాడని, బౌద్ధ మత పతాకను ద్వీపంలో ప్రతిష్ఠాపన చేస్తాడని భవిష్యవాణి పలికింది.”

“ఆ కాలంలో, ధనాధిపతి కుబేరుడి అనుయాయులైన యక్షులు లంకలో ఉండేవారు. వారికి మంత్రశక్తులున్నాయి. విజయుడు తన పరివారంతో ద్వీపం మీద అడుగు పెట్టగనే వాళ్లు సుందరులైన యువతులుగా అతని ఎదుటబడి, తమ అందచందాలతో అతడిని సమ్మోహితుడిని గావించారు. విజయుడు ఒక యక్షిణిని తన భార్యగా స్వీకరించాడు. ఆమె సహాయంతో యక్ష రాజపుత్రులను ఒకరి తరువాత ఒకరిని నాశనం చేశాడు.”

“రాజకుమారుడు ద్వీపాన్ని పూర్తిగా జయించిన తరువాత, అతని సామంతులు, విజయుడిని లంకకు సార్వభౌమునిగా చేయ సంకల్పించారు. రాజ వంశానికి చెందిన పడుచును పెండ్లాడిన తరువాతనే తనకు సార్వభౌమత్వం సిద్ధిస్తుందని అతను వారితో చెప్పాడు. లంకలోని ముఖ్యులందరూ భారతదేశానికి రాజప్రతినిధులను పంపించారు. తాము ఎన్నిక చేసిన వ్యక్తికి అత్యధిక సౌందర్యవతియైన రాజ పుత్రిని అన్వేషించమన్నారు. భారతదేశం నుండి రాబోయే రాజపుత్రికతో విజయుడి వివాహం నిశ్చయమయింది. పెండ్లివారు లంకా ద్వీపానికి పడవలలో బయలుదేరారు. అపుడు విజయుడు తన భార్య అయిన యక్షిణితో విషయాలు వివరించాడు. మహా శక్తులున్న దివిజులతో, భూమిపై నివసించే మానవులు ఎల్లప్పుడూ బ్రతకలేరని, అందుచేత ఒకరినొకరు అపార్థం చేసుకోకుండా విడిపోవడం ఉత్తమమని విజయుడు యక్షిణితో చెప్పాడు. యక్షిణికి విజయుడి వలన ఒక బాలుడు, ఒక బాలిక కలిగారు. యక్షిణి ఈ మాటలు విని బరువుగా నిట్టూర్చింది. చాల సేపు ఏడ్చింది. అపుడామె విజయుడి భవిష్యత్తును తెలియబరచింది.

“నీ రాజ్యం శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంది. కాని, నీకు సంతానం కలుగదు. నీ సోదరుడు సుమితుడికి రాజ్యం చేరుతుంది. అతడు శాక్య రాజ్యపుత్రిని వివాహమాడుతాడు. అతని వంశంలో జన్మించిన రాజులు, ఈ ద్వీపం యొక్క పేరును ప్రపంచంలో విదితం చేస్తారు.”

“తరువాత యక్షిణి తన పిల్లలను తీసుకొని దూర ప్రదేశానికి వెళ్లిపోయింది.”

“మంత్రుల, ప్రజల సమోంలో విజయుడిని రాజుగా అభిషిక్తుడిని చేశారు. అతడు భారతదేశం నుండి వచ్చిన రాజకుమారిని రాణిగా స్వీకరించాడు.” శ్రమణుడు శ్రద్ధగా వింటున్నాడు.

సాయంకాలం ఎప్పుడయిందో – బయట అంతా చీకటి – విశ్రాంతి మందిరంలో దీపాలు వెలిగించారు.

“మిగిలిన చరిత్ర రేపు చెప్పుకుందాం”

కళింగభూపతి లేచాడు. ఛత్రవాహకుడు అనుసరించగా అతడు స్వగృహానికి వెళ్లిపోయాడు.

శ్రమణుడు ధమ్మపథాన్ని వినయపిటకాలను, త్రిశరణాలను స్మరించాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here