శ్రీపర్వతం-5

0
5

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 5వ భాగం. [/box]

9

“ఇవాళ సాంబార్ చాల బాగుంది”. అన్నాడు, రావు

“సాంబారులోకి ప్రత్యేకంగా చిన్న ఉల్లిపాయలు తెప్పించాను. ఈసారి తెచ్చిన టమాటాలు కూడా బాగున్నాయి. ఈ అప్పడాలు మోహన్ అమ్మగారు పంపించారు” అంది శశికళ.

“వస్తువులుండడంలోనే తృప్తి లేదు. వాటిని బాగా వండితేనే ప్రయోజనం సిద్ధిస్తుంది” అన్నాడు మోహన్.

మొత్తానికి డిన్నర్ చాల బాగుంది.

బోజనమయిన తరువాత ముగ్గురూ వంట, టెంటుపని పూర్తిచేశారు. తరువాత సావకాశంగా కూర్చున్నారు.

మధ్యాహ్నం సైటులో ఏమీ మాట్లాడుకోడానికి వీలుపడలేదు. దక్షిణం వేపు మార్కు చేసిన ట్రెంచ్ లను ముందుగా తవ్వాలా, లేక ఉత్తరం వేపు నించి మొదలు పెట్టాలా అని సందేహం వచ్చింది. తూర్పున కొండవేపున్నవా, లేక పడమటవేపున్నవా అని కూడా ఆలోచించవలసి వచ్చింది. చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు. ఒకటి ఉత్తరంవేపు, ఒకటి దక్షిణం వేపు, ఒకటి పడమరకి, ఒకటి తూర్పుకి ఈ విధంగా త్రవ్వితే ఏదో వస్తువు బయటపడక మానదని, అప్పటినుంచీ త్రవ్వకాల పద్ధతి మార్చుకోవచ్చునని వాళ్ళు నిశ్చయించారు. ఈ నిర్ణయాలు తీసుకొని పనిమొదలు పెట్టేసరికి సాయంకాలం అయిదుగంటలయింది. సూర్యాస్తమయం తొందరలోనే అవుతుందని వాళ్ళు పనులు ఆపుచేశారు.

పెట్రోమాక్సు లైట్సు ఆర్పేశారు. రెండు టెంట్లలోను హరికన్ లాంతరులే ఉన్నాయి. చలిగా ఉండడంచేత శశికళ శాలువ భుజం మీద వేసుకుంది. మంచం మీద మఠం వేసుకుని కూర్చన్న మోహన్ చలికి లక్ష్యపెట్టకుండా బనియన్ తోనే ఉన్నాడు. బాడీ బిల్డర్ రావుకి చలి ఆమడ దూరంలో ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే.

ఎవరు మాట్లాడాలి? ఏమిటి మాట్లాడాలి?

ముగ్గురూ మౌనంగా కూర్చున్నారు.

ఇందులో రావు వినవలసినవాడు. సరదాకి ఆ మధ్య తన అనుభవాలు చెప్పాడు. మిగిలిన వాళ్ళు ఆర్కియాలజిస్టులు. ఏ సబ్జక్ట్ మీద వాళ్ళ మాట్లాడుతారో తెలియదు.

ముందుగా మంచు పగులగొట్టిన ఘనత మోహన్‌కి దక్కింది.

“మనం ప్రస్తుతానికి అష్టావధానంలో ఉన్నాం. మనం ముగ్గురమూ పృచ్చకులమే. ఏవో ప్రశ్నలు వేస్తూ ఉంటాము. ముగ్గురం అష్టావధానుమలే అడిగిన ప్రశ్నలకు ఎవరమో జవాబు చెప్తాం. అష్టావధానంలో ఒకరు గంటలు వాయిస్తారు. ఒకరు సమస్య పూర్తి చేయమంటారు. ఒకరు కథ కొంచెం చెప్తూ ఉంటారు. ఈ ముక్కలనన్నిటినీ అష్టావధానం చేసే పెద్దమనిషి తన మెదడులో భద్రపరచి, వేటికి వాటిని అనుసంధానించి, కథకు కథ, గంటలకి గంటలు, పద్యాలకు పద్యాలు ఈ విధంగా ఒక క్రమంలో చెప్పాలి. మనం ఈ పనే చేయవలసి ఉంటుంది” అన్నాడు మోహన్.

“ఈ చెప్పడానికి కూడా ఒక సక్రమమైన పద్ధతిని నిర్ణయించరాదా!” అన్నాడు రావు.

“ఆ విధంగా ఒక పథకం ప్రకారం చెప్తే అది నోట్సు తయారు చేసుకొని, కంఠతా పెట్టిన లెక్చరు వలె ఉంటుంది. అందులో జీవముండదు. చెప్పిన వారి వ్యక్తిత్వం కనుపించదు” అంది శశికళ.

“ఇది అలా కార్టీ డిన్నరు వంటిది. ఎవరికిష్టమైనవి వాళ్ళు ఎంచుకుంటారు. మన ఎదుట ఉన్న విషయాలు కూడా ప్రత్యేకంగా తయారుచేసిన డిష్‌ల వలె ఆర్కియాలజీ, బౌద్ధం, వైదికమతం, సాహిత్యం , కళలు మొదలైన ఇక్ష్వాకుల చరిత్రతో సంబంధించిన విషయాలకే పరిమితమవుతవి” అన్నాడు మోహన్.

“మోహన్! నేనో సంగతడుగుతాను. క్రిందటిసారి శశికళ గ్రీసుదేశం గురించి ముఖ్యంగా పురాతన గ్రీసు చరిత్ర గురించి చెప్పారు. దానికి మన ఇక్ష్వాకు చరిత్రకు సంబంధమేదైనా ఉందా?” రావు ప్రశ్నించాడు.

“1955-56 సంవత్సరాలలో నాగార్జున కొండలోయలో జరిగిన త్రవ్వకాలలో ఒక బౌద్ధ విహారం బయటపడింది. అందులో బుద్ధ పాదాలు చెక్కిన శిలాఫలక మొకటి లభించింది. ఆ ఫలకం మీద ఒక ప్రాకృతి శాసనం చెక్కబడి ఉంది. దానిలో ఈ విధంగా ఉంది.

సిద్ధమ్ ఆఛారియణం థేరియణం విభజ వాదానం

కాస్మీర – గంధార – యవన – వనవాస – తాంబపంని దిప

పసాద కానామ్

మహా విమార వాసినం…..

“థేరవాదులు, విభజ్యవాదులు అయిన బౌదా చార్యులు కాశ్మీర – గాంధార (గంధార) – యవన – వనవాస -తామ్ర పర్ణి ద్వీపవాసులను బౌద్ధమతంలోకి మార్చారని, వారీ మహా విహారంలోని వారని అందులో ఉంది. బోధి శ్రీ అన్న ఉపాసిక కట్టించని విహారంలో ఒక ప్రాకృత శాసనంలో కూడా ఇటువంటి వాక్యాలే ఉన్నాయి. వీటిలో యవన, గాంధార పదాలకు గ్రీకులకు సంబందముంది. గ్రీకులను రోమనులు జయించి వారి నాగరికతను స్వంతం చేసుకున్నారు. రోమక చక్రవర్తి హాడ్రియన్ క్రీస్తు శకం 117 – 138 సంవత్సరాలలో పరిపాలించాడు. అతని కాలంలో అతని ముద్రతో ఉన్న బంగారు నాణెమొకటి నాగార్జున కొండ త్రవ్వకాలలో దొరికింది.

రోముదేశంతో నాగార్జున కొండకు వర్తక వ్యాపారాలుండేవని దీనివలన తెలుస్తుంది. అందుచేత మనకి గ్రీకుల నాగరికత గురించి తెలుసుకోడం అవసరం” అన్నాడు మోహన్.

“ఈ విజయపురి త్రవ్వకాలలో ఇన్ని రహస్యాలు దాగి ఉన్నవని నాకు తెలియదు” అన్నాడు రావు.

“ఇప్పుడు నేను వైదిక విద్యా విధానం గురించి మాట్లాడుతాను” అన్నాడు మోహన్.

“మేము సావధానంగా వింటున్నాం” అంది శశికళ.

“నేను ప్రశ్నలు వేయవచ్చా?” అడిగాడు రావు.

“తప్పకుండా!” అన్నాడు మోహన్.

“అయితే మీరు మొదలు పెట్టకుండానే అడుగుతాను. విద్య నేర్చుకునేవాడు ఏ విధంగా తయారుకావాలి?”

“ఇది మంచి ప్రశ్న. మనసు చాల ముఖ్యమైనది. విద్యాభ్యాసానికి మనస్సును తయారు చేయాలి.

యస్తు విజ్ఞానవాన్ భవతి!

యుక్తేన మనసా సదా

తస్యేంద్రియాణి వశ్యాని

సదవ్వ ఇవ సారథేః

“ఈ శ్లోకం కఠోపనిషత్తులోనిది. దీని అర్థమేమంటే ఎవరయితే మనసును కేంద్రీకరించి విజ్ఞానవంతుడవుతాడో అతనికి ఇంద్రియాలు, మంచి గుర్రాలు సారథికి లొంగినట్లు, అదుపులో ఉంటాయి.”

మనో పుబ్బంగమా ధర్మా

మనో సెర్థా మనోమయా.

“ఇది ధమ్మపదంలోనిది. మనసు ముందుగా ఆలోచించిన తరువాత ధర్మం ఆచరించడం జరుగుతుంది. మనసు యొక్క శ్రద్ధ ధర్మకార్యాలను నిర్ణయిస్తుంది.”

చిత్తమేవ అస్య వశం గచ్చతి

చిత్తేన అస్య వశీభూతేన సర్వ ధర్మా వశీ భవంతి.

“ఈ సూత్రాలు శాంతిదేవుని శిక్షా సముచ్చయంలోనివి. మనస్సు అతనికి వశమయింది. మనస్సును అతడు తన వశమందు ఉంచుకోవడం చేత సర్వధర్మాలు అతనికి వశమవుతున్నవి.”

“మనస్సు అంత గొప్పదన్నమాట?”

“ఇంకా వినండి.”

మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః

తస్మాత్ తత్ అభ్యసేత్ మన్త్రీ యది చ్ఛేత్ మోక్ష మవ్యయమ్.

“ఈ శ్లోకం మాలినీ విజయోత్తర తంత్రంలోనిది. మనుష్యుల బంధమోక్షాలకు మనస్సే కారణం. కాబట్టి అవ్యయమైన మోక్షాన్ని కోరేవాడు మంత్రాల ద్వారా మనస్సును శిక్షణలో ఉంచాలి.”

రాగాది దుర్వాదర మలావలిప్తం

చిత్తం హి సంసార మువాచ వజ్రీ

“ఇది ప్రజ్ఞాపాయ వినిశ్చయ సిద్ధిలోనిది. వజ్రాయానానికి చెందిన ఆచార్యుడీ విధంగా అంటున్నాడు. రాగం మొదలైన తొలగరాని మలినాలచే మురికి చేయబడిన మనస్సునే సంసారంలేక ప్రపంచమంటారు.”

“వైదిక విద్యా విధానాన్ని తెలుసుకొని, దాని ఆదర్శాలను శాఖలను ప్రస్తుతించే ముందు మనస్సుకు సంబంధించిన ఈ శ్లోకాలు, సూత్రాలు అవుసరమవుతాయి.”

“వైదిక విద్య వేదంతో సంబంధించింది. అందుచేత ముందుగా వేదమనే పదానికి అర్థం చెప్పండి” అన్నాడు రావు.

“విద్ అంటే తెలుసుకొను అను అర్థమిచ్చే ధాతువునుండి వేదము అన్న పదం వచ్చింది.

అలౌకికం పురుషార్థోపాయం వేత్తి అనేనేతి.

వేదం వలన పురుషార్థాలను పొందే అలౌకికమైన పద్దతులు తెలుసుకోవచ్చు.

ప్రత్యక్షేణాన మిత్యా వా యుస్తూపాయో న యుధ్యతే

ఏ తం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదతా.

“మనమేదో గమ్యం చేరుకోవాలనుకుంటాం. అది మనకళ్ళకు కనబడదు. ఊహకు అందదు. దానిని వేదం చేతనే తెలుసుకుంటారు. అందుచేతనే వేదం యొక్క భావం దీనివలన నిర్ధారితమవుతుంది.”

“వేదం యొక్క సబ్జక్ట్ మాటరేదో చెప్తారా?” అడిగాడు రావు.

“ధర్మ బ్రహ్మాణి వేదైక వేద్యే

ఇది జైమిని రచించిన పూర్వ మీమాంస సూత్రం. ధర్మమూ బ్రహ్మమూ అననవి వేదం వలననే తెలుసుకోదగినవి.”

“ధర్మమంటే ఏమిటి?”

“అదృష్టమితి సర్వైర భిధీయతే.”

“ధర్మం బాహ్య ప్రపంచానికి సంబంధించినది కాదు. ఇంద్రియ గోచరమైనది కాదు. నిర్దేశించిన కొన్ని ఆచార కర్మల ఫలమే ధర్మం. అది కంటికి కనిపించదని అందరూ అంటారు”.

“బ్రహ్మము అంటే ఏమిటి?”

“శాస్త్రాదేవ ప్రయాణాత్ జగతో జన్మాది కారణం బ్రహ్మాధి గమ్యతే.”

ఈ సృష్టికి మూలకారణం బ్రహ్మము. శాస్త్రాలలో దొరికిన ఆధారాలను బట్టి దానిని తెలుసుకోవచ్చు.

నవేదవిన్మునతే తం బృహంతం.

తైత్తరీయ బ్రాహ్మణంలో ఈ విధంగా చెప్పబడింది. వేదం తెలియని వాడు బ్రహ్మము గురించి తెలుసుకోలేడు. ఎందుచేతనంటే బ్రహ్మము నిరాకారమైనది. నిర్నిమిత్తమైనది. వేదం వలన తప్ప మరో విధంగా దానిని తెలుసుకోలేము”.

“ధర్మం గురించి, బ్రహ్మము గురించి వేదం ఏ పద్ధతిలో చెప్తుంది?” శశికళ ప్రశ్నించింది.

“ధర్మం గురించి, బ్రహ్మము గురించి వేదం మూడు భాగాలలో చెప్తుంది.

మొదటిది – పూర్వకాండ లేక కర్మకాండ

రెండవది – మధ్యకాండ లేక దేవతా కాండ – దీనినే ఉపాసనా కాండ అని కూడా అంటారు.

మూడవది – ఉత్తరాకాండ లేక జ్ఞాన కాండ”

“వేదం గురించి మరేదేనా విధంగా చెప్తారా?” అడిగాడు రావు.

“మంత్ర బ్రాహ్మణముల సాహిత్యం వేదం. ఏ శబ్ద సముదాయం మంత్రంగా ఏర్పడిందో, బ్రాహ్మణముగా వెలసిందో అదే వేదమని తెలియబడుతుంది.

మంత్ర బ్రాహ్మణయోః వేదనామధేయం

ఇది ఆపస్తంబుని యాజ్ఞ పరిభాషలోనిది – మంత్రమూ బ్రాహ్మణమూ కలసి వేదమన్న పేరుతో పిలువబడుతున్నాయి”.

“మంత్రమంటే ఏమిటో వివరంగా చెప్పండి” అంది శశికళ.

“మననము – అంటే ఆలోచన – దీని నుండి మంత్రమన్న పేరు వచ్చిందని యాస్కుడు నిరుక్తంలో పేర్కొన్నాడు. ఆలోచనకి ఆధారం మంత్రం. దేవతను సంబోధిస్తూ చేసిన భాషణమే మంత్ర మంటారు. దేవతలు వరాలివ్వగరు. దీనినే అర్థాపత్యం అంటారు. కోరికలననుకరించి వారిచ్చే బహుమతులు ఇవి. ఋషులు ఈ అర్థావత్యం కోసం దేవతలను స్తుతించేటప్పుడు ఉపయోగించే పద సముదాయమే మంత్రం.”

“యజ్ఞంలో దేవతలను పూజించేటప్పుడు మంత్రాలను పఠిస్తారు. యజ్ఞ యాగాదులను నిర్వహించేటప్పుడు వేదంలోని మంత్ర భాగమంతా ఉపయుక్తమౌతుంది.”

ప్రయోగ సంవేదార్థ స్మారకాః మంత్రాః

పూర్వమీమాంస సూత్రాలలో మంత్రాలకు రెండు విధాలైన ప్రయోజనాలనున్నాయి. ఒకటి మంత్రాలను పాఠ క్రమనియమం ప్రకారం చదవడం, రెండవది వాటి యొక్క నిగూఢార్థాలను తెలుసుకోడం. మంత్రాలు కంటికగుపించని ఫలితాలనిస్తాయి. మంత్రాలను పాఠక్రమ నియమం పాటించి చదివితే చాలు. ఫలితం లభిస్తుంది.”

“వేదమేదో లౌకిక సాహిత్య మేదో ఎలా తెలుస్తుంది?” శశికళ అడిగింది.

“క్రియా కారక సంబంధేన ప్రతీయమానో వాక్యార్టో లోక వేదయో రవిశిష్టాః”

అంటాడు జైమిని. ఒక వాక్యం యొక్క అర్థం, దానిలోని క్రియలకు విభక్తులకు గల సంబంధం – వీటిని బట్టి అది వేదానికి సంబంధించిందో, లేక లౌకిక సాహిత్యానికి చెందిందో నిర్ధారణ చేయవచ్చు.

“ఆధ్యాత్మికమైన ఫలితాలను పొందడానికి మంత్రాలను సక్రమంగా చదవడం తప్పకుండా చేయాలి. అంతేకాక వాటి అర్థాలను ఆరు వేదాంగాల సహాయం వలన సరిగా సాధించాలి”.

“మంత్రానికి అర్థమేమిటి?” రావు అడిగాడు.

“మంత్రానికి మూడు విధాలైన అర్థముంది.

మొదటిది – ఆధ్యాత్మికమైన అర్థం – ఇది జ్ఞానానికి, ముక్తికి సంబంధించింది.

రెండవది – ప్రత్యక్షంగా ఎదురయే నిజాలను నిరుక్తం ద్వారా తెలిపే అర్థం.

మూడవది – యాజ్ఞికమైన అర్థం. యజ్ఞాలకు సంబంధించినది. మొదటి రెండు విధాలు ఉత్తరమీమాంస యొక్క వ్యాఖ్యానాలు. యజ్ఞపరంగా మూడవ పద్దతిని మంత్రాలను వ్యాఖ్యానించేది పూర్వ మీమాంస”.

“వేదమంత్రాలు ప్రాచీన కాలంనుండి ఒకే సంఖ్యలో ఉన్నాయా?” శశికళ ప్రశ్నించింది.”

“అతి ప్రాచీన కాలం నుండి వేదమంత్రాల సంఖ్య అప్పుడప్పుడూ పెరుగుతూనే ఉంది. అన్నిటికన్న మొదటివైన వైదిక మంత్రాలను ‘ఆవాహము’లంటారు. ఆహావమంటే పిలుపు. దీనినే ‘శంసన’మని కూడా అంటారు.

‘హోత’ అన్న పేరు కల వురోహితుడు ‘శంసావ ఓం’ అని పిలుపునిస్తాడు. నిరాకారమైన పరబ్రహ్మాన్ని మనం పిలుద్దాం, ప్రార్థిద్దాం అంటాడతడు.

అతని పిలుపుకు అధ్వర్యుడని పేరు కల పురోహితుడు బదులు పలుకుతాడు. ‘శంసామో దైవమ్’ అంటాడతడు. అయ్యా! ఇపుడు మనం పరబ్రహ్మాన్ని పిలుద్దాం (పార్థిద్దాం) ఇది ఆహావానికి జవాబు. ఆహావం తొలి మంత్రం. ఈ మంత్రంలో ‘ఓం’ లేక ‘ప్రణవము’ ఉంది. ఇది వైదికమైన మూలమంత్రం. దీనిని అక్షరమని ఋగ్వేదంలో చెప్తారు. అంటే ఓంకారం లేక ప్రణవానికి నాశనం లేదని అర్థం.

మంత్రం యొక్క మరొక ప్రాచీన రూపాన్ని ‘నివిద్’ అంటారు. ఈ పదం ఎలా పుట్టిందో ఐతరేయ బ్రాహ్మాణంలో ఉంది. ప్రజాపతికి సృష్టిచేయాలని సంకల్పం కలిగింది. అతడు మౌనంగా ఒక సంవత్సరం తపస్సు చేశాడు. అటుపిమ్మట అతడు ఒక పదాన్ని పన్నెండు సార్లు ఉచ్చరించాడు. దానినుండి విశ్వం ఆవిర్భవించింది. ఈ పన్నెండు మాత్రలు కల పదాన్నే ‘నివిద్’ అంటారు. ఋగ్వేదంలోని చాల భాగాలలో ‘నివిద్’లు ఉన్నాయి.”

“సంహిత అంటే ఏమిటి?” శశికళ అడిగింది.

“మంత్రాల సముదాయాన్నే సంహిత అంటారు. యుగాల తరబడి వైదిక మంత్రాలు, అవిభక్తంగా, ఒకటిగా ఉండేవి. పూజలు, ప్రార్థనలు క్రమక్రమంగా ఒక నిర్దిష్టమైన పద్దతిలో జరపవలసి వచ్చింది. అపుడీ మంత్రాలను విభజించవలసిన అవుసరం కలిగింది.”

“ఈ వేదాన్ని విభజించిన మహానుభావుడెవడు? ” రావు అడిగాడు.

“అతడే కృష్ణ ద్వైపాయనుడు. అంటే వేదవ్యాసుడు. అతడు వేద మంత్రాలను నాలుగు భాగాలుగా విభజించాడు. వాటిని నాలుగు సంహితలుగా పేర్కొన్నాడు. వాటినే ఋక్ సంహిత, సామ సంహిత, యజస్సంహిత, అధర్వ సంహిత అని పిలుస్తారు.”

“వీటిని అతడెవరికి బోధించాడు?” శశికళ అడిగింది.

“వీటిని తన శిష్యులైన పైలుడికి, వైశంపాయనుడికి, జైమినికి, సుమంతుడికి ముందుగా బోధిచాడు.”

“ఈ విభజన ఏ పద్ధతిని చేశాడు?” శశికళే అడిగింది.

“ఋత్విజులు అంటే పురోహితులు. వారు యజ్ఞం లేక పూజ చేయడానికి సహకరిస్తారు. వేరువేరు పురోహితులు చేయవలసిన పనిని నిర్ధారిస్తుంది. ఈ విభజన యాస్కుడు నిరుక్తంలో చెప్తాడు. ఒక పురోహితుడు ఋక్‌లను సమీకరిస్తాడు”. –

“ఎవరీ పురోహితుడు?”

“హోత’ అన్న వురోహితుడు, యజ్ఞ సమయంలో వేరు వేరు చోట్ల నుంచి ఋక్కులను సమీకరించి వాటిని తన ‘శాస్త్రంగా’ పదిల పరుస్తాడు. ఇది అతనివిధి. ‘ఋక్ అన్న పదం ‘అర్చనీ’, అన్నపదంతో సరియైనదని యాస్కుడు స్వీకరిస్తాడు “అర్చనీ’ అంటే దేవతకు చేసే ప్రార్థన.

హోతకు సంబంధించిన శాస్త్రం, ఆ విధంగా వేరయి, ఋగ్వేద సంహితగా రూపొందింది. ఈ సంహితలో ఋక్కులన్నీ సమీకరింప బడ్డాయి. ఋక్కులు ఛందో బద్ధమయినవి. అవి శ్లోక రూపంలో ఉంటాయి.”

‘రెండో పురోహితుడెవడు?”

‘రెండో పురోహితుడు యజ్ఞ దగ్గిర గానం చేస్తాడు. ఇతనిని ఉద్గాత అని పిలుస్తారు. పాటల రూపంలో ఉన్న ఋక్కుల సంకలనాన్ని సామవేదం అంటారు. ఉద్గాత దీని సరంక్షకుడు.”

“మూడవ పురోహితుడు చేసే పని ఏమిటి?”

“మూడవ పురోహితుడు అధ్వరం అంటే యజ్ఞానికి నాయకుడు. మార్గదర్శి, నేత. ఇతడు యజ్ఞం యొక్క నిర్మాణాన్ని, అంటే దానికై చేసే ఏర్పాటులన్నిటిని పర్యవేక్షిస్తాడు.

యజ్ఞ మాత్రాం విమిమీతా.

ఇతనిని అధ్వర్యుడని పిలుస్తారు. అధ్వరం యునక్తీతి అధ్వర్యుః అని వ్యుత్పత్యర్థం. అధ్వర్యం అంటే యజ్ఞం. యునక్తి అంటే పూజ తొడగడం. యజ్ఞానికి పూజ తొడిగేవాడు అధ్వర్యుడు. వచనంలో ఉన్న ఋక్కుల నన్నిటినీ, యజ్ఞ నిర్వహణకు అను సంధానించవలసిన వాటిని, ఇతడు ప్రోగు చేస్తాడు. ఈ సంకలనాన్ని యజుర్వేదమంటారు. యజుస్ అన్న పదం, యజతి – యజ్ఞం చేస్తున్నాడు అన్నదాని నుండి వచ్చింది.

“యజుర్వేదం యజ్ఞం యొక్క శరీరాన్ని నిర్ణయిస్తుంది. మిగిలిన రెండు వేదాలు ఈ శరీరం యొక్క అంగాలు. అవి అనుబంధాలు. అవసరమైన స్తోత్రాలను శాస్త్రాన్ని దేవతా స్తుతిని మంత్రాలను సమకూర్చుతాయి. ఆ విధంగా యజుర్వేదం ముఖ్యమైన వేదం. దానిమీద మిగిలిన వేదాలు ఆధారపడతాయి. ఈ మూడు వేద సంహితులను ‘త్రయీ’ అంటారు.”

“నలుగురు పురోహితులు యజ్ఞానికి అవసరం. నాలుగోవాడెవడు?”

“యజ్ఞాన్ని నెరవేర్చడం బ్రహ్మ అన్న పేరుకల ఋత్విజుడి మీద ఆధారపడి ఉంటుంది. ఇతడు మిగిలిన పురోహితులకు వారి వారి విధుల గురించి ఉత్తరువులను జారీ చేస్తుంటాడు.

సతి ప్రమాదే సమాధాతుం సమర్థః

ప్రమాదం జరిగితే సర్దుకోగలవాడు ఇతడు. అందుచేత ఈ నాలుగవ పురోహితుడైన బ్రహ్మ. మూడు వేదాలలోను ప్రవీణుడై ఉంటాడు.

సర్వవిద్యాః….. వేద త్రయోక్త సర్వ కర్మాభిజ్ఞః

“ఇతడు వేదాలను తెలిసినవాడ కాక మూడు వేదాలలోను చెప్పబడిన అన్ని కర్మలు తెలిసినవాడై ఉంటాడు.”

“యజ్ఞ నిర్వహణలో ఇతని అంతస్తు ఏది?”

“మనశ్చ వాక్ చ వర్తనీ యజ్ఞస్య”

యజ్ఞ నిర్వహణకు రెండు మార్గాలున్నాయి. ఒకటి మనస్సుకు సంబంధించినది. రెండవది మాటలకు లేక పలుకులకు సంబంధించినది. బ్రహ్మ, మనస్సుకు సంబంధించిన మార్గాన్ని అనుసరిస్తాడు. వాక్కులకు సంబంధించిన పథాన్ని హోత, ఉద్గాత, అధ్వర్యుడు అన్న ముగ్గురు పురోహితులు అనుగమిస్తారు. దీనిని బట్టి బ్రహ్మ, యజ్ఞం అంతా సవ్యంగా నిర్వహించడం అవుతున్నదో లేదో పర్యవేక్షిస్తాడు.

ప్రమాద రాహిత్యాయ మనసా సమ్యగనుసంధేయాః

యజ్ఞ నిర్వహణను సంపూర్ణంగాను భాగాలుగాను మనసులో దొర్లించి తప్పులు రాకుండా కాపాడుతాడు.

బ్రహ్మాతు ఏక ఏవ మనోరూపం యజ్ఞ భాగం సంస్కరోతి.

యజ్ఞం యొక్క నిర్వహణకు, దాని ప్రయోజనానికి, దాని ఫలితాలకు, దాని విజయానికి, దాని ఆత్మకు బ్రహ్మ ఒక్కడే బాధ్యుడు.

వాగ్రూపం యజ్ఞ మార్గం సంస్కుర్వంతి.

అంతేకాక ఈ ముగ్గరు పురోహితులు యజ్ఞానికి అవసరమైన పదాలను లేక వాక్కులను సక్రమంగా ప్రయోగించాలి. ఇది వారి విధి.

“యజ్ఞ నిర్వహణకు అవసరమైన స్తోత్రాలు, పూజలు దృష్టిలో ఉంచుకొని వేద మంత్రాలను నాలుగు సంహితలుగా విభజించారు. అధ్వర్యుడు యజ్ఞ భూమిని, దాని సమచితిని, తాను కూర్చుండి హెమం చేయవలసిన వేదికను తయారు చేస్తాడు. ఉపాసించవలసిన దేవతను ఆహ్వానించడానికి హెత ఋక్కులను ఉచ్చరిస్తాడు. ఉద్దాత హోమ కుండం చుట్టూ ఆ యజ్ఞానికి సంబంధించిన సామ ఋక్కులను గానం చేస్తూ తిరుగుతాడు. బ్రహ్మ ప్రతి యజ్ఞవిధియొక్క సూక్ష్మమైన వివరాలను కూడా విడవకుండా, యజ్ఞ నిర్వహణ, దాని ఆధ్యాత్మిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పర్యవేక్షిస్తాడు.”

“వేదమంత్రం గురించి ఇంకేమైనా తెలుసుకోవలసిన ఉన్నాయా?”

“వేదమంత్రం తెలుసుకోవాలంటే దాని ప్రయోజనాలు ముందు తెలుసుకోవాలి. ఆ మంత్రం ఏ ఋషికి చెందిందో, దాని ఛందస్సు ఏదో, ఏ దేవతను ఆహ్వానిస్తుందో, దాని వినియోగమేమిటో, దాని శబ్దార్థాలు అదృష్టార్థాలు ఏమిటో, ఈ అయిదు ప్రయోజనాలు తెలుసుకోవాలి”.

“మీరు మంత్రం గురించే చెప్పారు. వేదానికి రెండవ భాగమైన బ్రాహ్మణం గురించి చెప్పలేదు.”

“బ్రాహ్మణం బ్రహ్మ అన్న పదంతో సంబంధించింది. బ్రహ్మ అన్నపదం మంత్రానికి పర్యాయపదం. మంత్రం వలన దేవతను మననం చేస్తాము.

అంటే తలంచుతాము. బ్రహ్మ వలన దేవుని యొక్క పూజ విస్పతింపబడుతుంది. బృంహిత మౌతుంది. బ్రహ్మకు సంబంధించిన సాహిత్యమే బ్రాహ్మణం.

“తచ్ఛోదకేషు మంత్రాక్యాశేషే బ్రాహ్మణ శబ్దః

యాజ్ఞికులు, అంటే యజ్ఞం చేసే పురోహితులు మంత్రాలుగా పరిగణించి, విడిచి పెట్టిన వేదభాగం బ్రాహ్మణమంటారు.”

“అరణ్యకమన్న వైదిక సాహిత్యం గురించి చెప్తారా?”

“జీవితమంతా జ్ఞానార్జన కోనమే వివాహం చేసుకోకుండా, బ్రహ్మచారులుగా నిలిచిన వారిని ‘అరణులు’ లేక ‘అరణమానులు’ అని పిలిచేవారు. వీరు గ్రామాలను విడిచి పెట్టి, పర్ణశాలలు కట్టుకొని అడవులలో నివసించేవారు. ఈ తపస్వులు నివసించే అడవులను అరణ్యాలంటారు. ఈ జ్ఞానులు బ్రహ్మ, సృష్టి ఆత్మ, అమరత్వం మొదలైన వాటిగురించి దీర్ఘమైన ఆలోచనలు సలిపారు. ఆరణ్యకాలంలో వారి చింతన నిండి ఉంది.”

“మరి ఉపనిషత్తులంటే ఏమిటి?”

“ఉపనిషత్తుల యొక్క వ్రేళ్ళు ఋగ్వేదంలో కనిపిస్తాయి. బ్రహ్మ ఒకడే ఒకడు. అతడే కడపటివాడు. అతడే సర్వ వాప్తమైన సత్యం, ధర్మం లేక యజ్ఞం కన్న బ్రహ్మయే గొప్పవాడు. బ్రాహ్మణ సాహిత్యం మూడు భాగాలుగా లభిస్తుంది. బ్రాహ్మణముల గృహస్థుల కోసం, ఆరణ్యకాలు వానప్రస్థుల కోసం, ఉపనిషత్తులు సన్యాసుల కోసం ఇంతమాత్రం మనం గుర్తుంచుకుంటే చాలు.”

డాక్టర్ మోహన్ ప్రసంగం ఆపివేశాడు.

“తల దిమ్మెక్కిపోయింది” అన్నాడు రావు.

“మోహన్ చాల సులువుగా చెప్పడానికి ప్రయత్నించారు. తెలిసినట్లు తెలియనట్లు ఈ ప్రసంగం అనిపిస్తోంది” అంది శశికళ.

“అయితే మీకు కూడా ఇది గ్రీకు అండ్ లాటిన్‌గా ఉందా?” శశికళను ఉద్దేశించి రావు అన్నాడు.

శశికళ నవ్వింది.

“నాకు గ్రీకు లాటిన్ భాషలు కొట్టిన పిండి. గ్రీకులో చదవడం, వ్రాయడమే కాకుండా లెక్చర్లు క్లాసులు కూడా తీసుకున్నాను” అంది శశికళ.

“అయితే మరేమనమంటారు?” రావు అడిగాడు.

“పచ్చి సంస్కృతమంటాను” అంది శశికళ నవ్వుతూ.

“ఇక్ష్వాక నృపతులు అగ్ని ష్టోమ, వాజపేయ, అశ్వమేధయాగాలు చేసిన వాళ్ళు ఈ వివరాలు ముందు మన కవసరమవుతాయని చెప్పాను” అన్నాడు మోహన్.

“రేపు నేను నోట్సు వ్రాసుకునేటప్పుడు మీరు కూడా నా పక్కను కూర్చొని సంస్కృత శ్లోకాలన్నీ చెప్పాలి. లేకపోతే ఖాళీలు మిగిలిపోతాయి” అంది శశికళ.

మోహన్ అంగీకారం సూచిస్తూ తల ఉపాడు.

10

విజయపురి నగరనిర్మాణంలో ఒక విశిష్టత కనిపిస్తుంది.

కృష్ణానది కుడిగట్టున నగరం లేచింది.

కృష్ణానది, ఉత్తర వాహినిగా ఇక్కడ పారుతోంది.

ముఖ్యమైన బ్రాహ్మణ దేవాలయాలు నదీ తటాన్న ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కనిపిస్తాయి. నగరానికి పశ్చిమాన్న పవిత్రమైన ఉత్తర వాహినీ తీరాన అవన్నీ ఉన్నాయి.

నాగార్జున కొండకు కృష్ణానదికి మధ్యను కొంత ప్రదేశం ఉంది. అక్కడ శ్మశానముంది.

ధనికుల గృహాలు, విశ్రాంతి గృహాలు, వినోద గృహం, సాధారణుల ఇళ్ళు, స్నానశాలలు, ఆరుబయట రంగస్థలం, క్రీడారంగం, విశాలమైన రాజ మార్గాలు, వీథులు, స్వర్ణకారుని గృహం, విశ్వవిద్యాలయం, ఈ విధంగా అన్ని హంగులూ ఉన్నాయి.

విజయపురికి రావడానికి, ఇరుకు కొండదారి, తూర్పున ఉంది. పడమట పడవలు, నావలు కృష్ణానదిలో ప్రయాణంచేసి రాకపోకలకు ముఖ్య సాధనాలయాయి. కట్టడాలకు ఉపయోగింపబడిన తెల్లటి సున్నపురాయి నది మీదనే పైచోట్ల నుంచి వచ్చింది. ఈ రాయి చంద్రకాంత శిలలా ఉంటుంది. ఉలితో చెక్కడానికి సులువుగా ఉంటుంది.

ఈ నగరం ఎన్నాళ్లు వైభవంగా వెలసింది?

కొందరు విజయపురి, విజయశాతకర్ణి కాలంలో నిర్మితమైనదని అంటారు.

కొందరు వీరపురుష దత్తుడికాలంలో నిర్మింపబడిందంటారు. ఎవరు నిర్మించినా ఇది కొత్తగా నిర్మింపబడింది. ఇక్ష్వాకులు దీనిని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశంలో కొంత భాగం పాలించారు.

ఇక్ష్వాకుల పాలన నూట ఏభై సంవత్సరాలకు మించలేదు. పురాణాల్లో వారి పాలన నూరు సంవత్సరాలనే ఉంది.

ఈ నగరం రెండు వందల ఏండ్లు మాత్రమే జీవించింది.

పల్లవులు దీనిమీద దండెత్తి ఇక్ష్వాకుల పాలన అంతం చేశారు. నగరాన్ని ధ్వంసం చేశారు. చరిత్రలో విజయపురి చెరిగిపోయింది.

మధ్యకాలంలో, శ్రీ కృష్ణదేవరాయల పాలనలో, నాగార్జున కొండ మీద దుర్గ మొకటి, దానికి ప్రహరీ గోడలు, కట్టించారు. అప్పటికి విజయపురిలేదు. ఉంటే ఆనాటి శాసనాలలో ఆ పేరు కనిపించేది.

నవనాధ చరిత్రలో విజయపురి కీకారణ్యాలు అని ఉంది. అంటే మనుష్యులిక్కడ నివసించలేదు.

విజయపురికి పూర్వదిశాభాగంలో శ్రీ పర్వతం ఉందని శాసనాలలో లిఖింపబడి ఉంది.

శ్రీపర్వతం అంటే నల్లమలై పేరుతో వ్యవహరింవబడుతున్న పర్వతపంక్తా? చాల కొండలున్న ఆ వరుసలో ఏది శ్రీ పర్వతం?

వీరంగి మోటుకి కొంచెం దిగువను చుల్ల ధర్మగిరి ఉంది. మహాస్తూపానికి తూర్పున కొద్ది దూరంలో ఇది ఉంది. దీనినే క్షుల్ల ధర్మగిరి అంటారు. నహరాళ్ళబోడు అని దీనిని పిలుస్తారు. ఇది పర్వతం కాదు. కొండదిబ్బ. అట్టే ఎత్తుకూడా లేదు. అక్కడకు సమీపంలో ఉన్న బౌద్ధ విహారలు శ్రీపర్వతం మీదవని శాసనాలలో ఉంది.

శ్రీపర్వతమంటే శ్రీశైలమని కూడా అర్థమిస్తుంది. కాని, ఈ శైవక్షేత్రం, క్రీస్తు శకం అయిదారు శతాబ్దాల తరువతే వెలుగులోకి వచ్చింది.

విష్ణుకుండినులు తమ శాసనాలలో శ్రీ పర్వత స్వామి పాదనుధ్యాతులమనీ చెప్పుకున్నారు.

ఎవరీ శ్రీపర్వతస్వామి?

శ్రీపర్వతం శ్రీపర్వతమే!

విజయపురి విజయపురే!

విజయపురికి శ్రీపర్వతానికి మధ్య మైలు దూరముంది.

వీర పురుష దత్తుడి ఆరవ పాలనా సంవత్సరంలో వెలువడిన శాసనాలలో విజయపురి గురించి ప్రస్తావించారు.

అంతకుముందు విజయపురి లేదా?

శ్రీపర్వత ప్రాంతాలలో బౌద్ధ స్తూపాలు, చైత్యగృహాలు విహారాలు ఉన్నాయి. ఎక్కడా పేరుకేనా బ్రాహ్మణ దేవాలయం లేదు. అటువంటప్పుడు శ్రీ పర్వత స్వామి ఎవరు?

విజయపురి తూర్పు ప్రాంతంలో బౌద్ధుల కట్టడాలు ముందు నిర్మింపబడ్డాయి.

అటువేపున్న మహా స్తూపం అన్నిటికన్న ముందు నిర్మింపబడి ఉండాలి.

అమరావతిలోని స్తూపం క్రీస్తు పూర్వం రెండువందల సంవత్సరాల క్రింద నిర్మింపబడింది. అశోకుని రాజదూత మహాదేవి భిక్షు, ముందు అమరావతి స్తూపం నిర్మించి తరువాత పలువ బొగ్గకు వచ్చాడట. పలువ బొగ్గ అంటే పల్నాడు. పల్నాటి ప్రాంతాలలోనిదే నాగార్జున కొండ. బహుశా అతడే నాగార్జున కొండలోని మహా స్తూపం కూడా నిర్మించి ఉండవచ్చు. నిర్మాణం కూడా శాతవాహనుల ఔదార్యం వలననే జరిగి ఉండవచ్చు.

నాగార్జునకొండ లోయలోని మహాస్తూపం బుద్ధ ధాతువు కలిగినట్టిది. బుద్ధుని నిర్యానం తరువాత అతని అస్తికలను ఎనిమిది స్తూపాలలో ఉంచారు. అశోకుడు ఈ ఎనిమిది స్తూపాలలోని అస్తికలను వెలుపలికి తీసి, ఎనభై నాలుగు వేల స్తూపాలను దేశంలో వివిధ భాగాలలో ఉన్న పట్టణాలలో నిర్మాణం చేయించి వాటిలో బుద్ధ ధాతువులను నిక్షేపించాడు.

‘బుద్ధ ధాతుపరిగహీతస’ అని మహా స్తూపం దగ్గర దొరికిన శాసనంలో ఉంది. కాబట్టి ఈ స్తూపం కూడా అశోకుని కాలంలో నిర్మింపబడి ఉండవచ్చు.

ఒకవేళ ఈ స్తూపం రెండవ ఇక్ష్వాకు రాజు పాలనలో నిర్మింపబడితే బుద్ధ ధాతువు ఎక్కడినుండి వస్తుంది?

నాగార్జునుడు తన జీవితంలో చరమ భాగం శ్రీపర్వత ప్రాంతంలో ఒక విహారంలో గడిపాడు. అతడు క్రీస్తు వెనుక రెండో శతాబ్దానికి చెందినవాడు. కాబట్టి కొన్ని బౌద్ధుల కట్టడాలు ఇక్ష్వాకులు విజయపురికి రాకముందే నిర్మింపబడ్డాయన్నమాట.

శ్రీపర్వత ప్రాంతాన్ని ఇక్ష్వాకులలో రెండవ వాడైన సిరి వీరపురిసదతుడు తన (ఏడవ) పాలనా సంవత్సరంలో, తన ఆధిపత్యం క్రింద తీసుకున్నాడు. అంతకుముందు సంవత్సరం విజయపురిని రాజధానిగా ప్రకటించుకున్నాడు. అతని రాజ్యపాలనలో బౌద్ధుల కట్టడాలు చాల నిర్మింపబడ్డాయి. ఇందులో రాజుల గొప్పదనమేదీ లేదు. రాణుల ఔదార్యమే వాటి నిర్మాణానికి కారణం.

అతని పాలనలో ఒక బ్రాహ్మణ దేవాలయం కూడా నిర్మింపబడలేదు.

మొట్టమొదటి బ్రాహ్మణ దేవాలయం లోయకు ఉత్తర ప్రాంతంలో తేదగిరి’ సిద్ధులదరి – దగ్గిర నిర్మింపబడింది. అది ఆభీరవసుషేణుడి మువ్వయ్యవ పాలనా సంవత్సరంలో, అతని మంత్రి తిష్యశర్మ చేత ఆవిష్కరింపబడింది. అక్కడ దొరికిన మొదటి సంస్కృత శాసనంలో ఇక్ష్వాకుల ప్రసక్తే లేదు. వాళ్ళ నగరంలో ఉత్తర దిగ్భాగంలో నిర్మించిన తొలి దేవాలయానికి వాళ్ళను ఆహ్వానించనే లేదు. పై ప్రాంతాల రాజులు వచ్చారు. వారి పేర్లు శాసనంలో ఉన్నాయి. మంత్రి ఆవిష్కరించాడు.

ఇది చాల విచిత్రంగా కనిపిస్తుంది.

ఈ మంత్రి వసుషేణుని తరపున విజయపురిని పాలించే రాజ్యపాలకుడు. అందుకే అతనికి అంత స్వతంత్రం. ఎవరో, గోవా గ్రామవాసిని అయిన ఉపాసిక బోధిసిరి శ్రీపర్వత ప్రాంతంలో విహారాలు రెండు నిర్మించింది. అప్పటికి పాలిస్తున్న ఇక్ష్వాకు నృపతి పేరు, అతని పాలనా సంవత్సరం, ఆమె శాసనంలో పేర్కొంది.

అటువంటిది, విజయవురిలో తొలి బ్రాహ్మణ దేవాలయం నిర్మించినప్పుడు, పాలకులు ఇక్ష్వాకులైతే వారి పేర్లు, వారి పాలనా సంవత్సరం తప్పకుండా శాసనంలో చోటు చేసుకునేవి.

ఎందుకలా జరుగలేదు?

అష్టభుజస్వామి ఆలయం తరువాత, నదీతీరాన్ని, లోయ ఉత్తరపు చివరనుండి దక్షిణవు చివరివరకు ఎన్నో బ్రాహ్మణ దేవాలయాలు నిర్మింపబడ్డాయి. ఆ ఆలయాల పేర్లు కొత్తగా వినిపిస్తాయి. నోడగివ్వర స్వామి ఆలయం, పుష్ప భద్రస్వామి ఆలయం, సర్వదేవాధివాసం – ఈ మూడు, మూడవ ఇక్ష్వాకురాజైన ఏహువల ఛాంతమూలువి కాలంలో నిర్మితమయాయి.

లోయలో కట్టడాల నిర్మాణం రెండవరాజైన వీర పురుష దత్తుని ఆరవ పాలనా సంవత్సరంలో మొదలై నాల్గవ రాజైన రుద్ర పురుష దత్తుని పదకొండవ పాలనావత్సరం వరకు సాగింది.

ఏహువుల ఛాంతమూలుని పాలన స్వర్ణయుగం.

కోటకు చుట్టు పట్ల కుప్పలకొద్ది ఏనుగుల ఎముకలు చెదరుమదురుగా త్రవ్వకాలలో దొరికాయి.

మృతవీరుల స్మారక చిహ్నాలుగా చాయా స్తంభాలు లేచాయి. వాటిలో చాల వాటిపై శాసనాలున్నాయి. దుర్గానికి సమీపంలో ఈ స్తంభాలున్నా, ఛాయా స్తంభాల మీద పేర్కొన్న అయిదుగురు సైనిక వీరులు ‘మగలరణ’ ప్రాంతంవారు. ఈ ‘మగలరణ’ విజయ పురిలోనిదో, లేక పైదో – ఇక్ష్వాకుల రాజ్యం ధాన్యకటకం వరకు, అటు వేల్లగిరి వరకు వ్యాపించి ఉండేది.

ఈ ఛాయా స్తంభాలను బట్టి ఇక్ష్వాకుల రాజ్యం శత్రువుల దాడికి గురి అయి ఉంటుంది. లేని పక్షంలో ఇక్ష్వాకులు రాజ్య విస్తరణ కోసం చేసిన యుద్ధాలలో ఈ మృత వీరులు పాల్గొని ఉండాలి.

ఇక్ష్వాకులు రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు జరిపినట్లు తెలియదు. కాని, ఇక్ష్వాకుల రాజ్యం మీద శత్రువులు దాడులు రెండు జరిగినట్లు తెలుస్తుంది. ఆభీరవ సుషేణుడు ఇక్ష్వాకులను ఓడించి, తన మంత్రిని రాజ్యపాలకుడుగా నియమించినప్పుడు యుద్ధం జరిగి ఉంటుంది. కాని ఈ యుద్ధం విజయపురిలో జరిగినట్లు లేదు. లోయకావల రాజ్యంలో ఎక్కడో జరిగి, ఇక్ష్వాకులు ఓడి సంధి చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఆ యుద్ధంలో చనిపోయిన మృతవీరుల స్మారక స్తంభాలు, ఇక్ష్వాకులు తిరిగి తమ రాజ్యం స్వాధీనం చేసుకున్న తరువాత కోటకు సమీపంలో స్థాపించినవి.

ఆ యుద్ధం విజయపురిలో జరుగనప్పుడు ఏనుగుల ఎముకలు ఎలా వస్తాయి.

కాని, ఏనుగుల ఎముకలు కుప్పలుగా త్రవ్వకాలలో లభించాయి. రెండవ యుద్ధం లోయలో జరిగి ఉండాలి. పల్లవుల దాడితో ఇక్ష్వాకుల పాలనే అంతమయింది. ఈ ఏనుగుల ఎముకులు ఆ మహా సంగ్రామానికి చెంది ఉండవచ్చు. పల్లవులు నదీముఖంగా వచ్చినట్లు లేదు. తూర్పు ప్రాంతాన కొండల మధ్యనున్న ఇరుకు దారిలో ఏనుగులను నడిపించి అకస్మాత్తుగా విజయపురిమీద పడ్డారు.

పల్లవుల దాడిలో చాలమంది చనిపోయి ఉంటారు కాని, ఆ వీరుల స్మృతి చిహ్నాలు నిలిపే రాజ్యం ఎక్కడుంది?

మూడిన ఇక్ష్వాకు రాజు ఏహువల ఛాంతమూలుడు. బ్రాహ్మణ దేవాలయాలు ఇతని కాలంలోను, ఇతని పుత్రుడైన రుద్రపురుష దత్తుడి కాలంలోను విజయపురిలో నిర్మింపబడ్డాయి.

ప్రజలు సుఖ శాంతులతో ఉన్నప్పుడే దేవాలయాల నిర్మాణం జరుగుతుంది. అంటే ఏహువల ఛాంతమూలుని కాలంలోను, రుద్ర పురుష దత్తుని కాలంలోను రాజ్యం సుభిక్షంగా ఉంది.

అటుబౌద్ధ మతం, ఇటు బ్రాహ్మణ మతం వర్ధిల్లాయి.

విజయపురిని పాలించిన నలుగురు ఇక్ష్వాకు రాజులలోను ఛాంత మూలుడే యజ్ఞ యాగాదులను చేసినవాడు. అతని గురించి చాల శాసనాలలో, అగ్నిష్టోమ, వాజపేయ, అవ్వమేధాది క్రతువులు చేసిన వాడని అతని పుత్రుడు, పౌత్రుడు, ప్రపౌత్రుడు చెప్పుకున్నారు. ఛాంతమూలుడు విజయపురినుండే రాజ్యం పాలించాడా?

శాతవాహనులకు రాజధాని ధాన్యకటకం.

ఛాంతమూలుడు, శాతవాహనుల తరువాత, వారి పాలనలో ఉన్న కృష్ణానదీ ప్రాంతాలను తన ఆధిపత్యం క్రింద తీసుకున్నాడు. అతడు తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ధాన్యకటక ప్రాంతాలలో అతని శాసనాలు కనిపించినట్లులేవు.

లాంగ్ హారస్ట్ దొర 1926 – 27 లలో త్రవ్వకాలు మొదలు పెట్టడానికి, ఇరవై సంవత్సరాల ముందు, అమరావతిలో దొరికిన ఒక శాసనంలో ‘విజయపురం’ గురించి ప్రస్తావించబడింది. ‘విజయపుర వాసియైన చంద్రుని కుమార్తె, వర్తకుని భార్య “వణియిని’ అమరావతి స్తూపం ప్రాకారపు గోడమీద రాతి ఫలకమొకటి ఎత్తించినట్లు ఆ శాసనంలో ఉంది.

‘విజయపుర’కు చెందిన చంద్రుడు ఏ రాజు పాలించే కాలంలో ఉండేవాడో తెలియదు.

1926 వ సంవత్సరం వరకు మనకు ఇక్ష్వాకుల రాజధాని విజయపురి గురించి తెలియనే తెలియదు.

జగ్గయ్యపేట శాసనాలలో ఒకటి, రెండవ ఇక్ష్వాకు రాజైన నిరి వీరపురుషదత్తుని ఇరవయ్యవ పాలనావత్సరం నాటిది.

కాని, ఎంతమంది ఇక్ష్వాకురాజులో మనకు ఆనాడు తెలియదు. ఒకటి మాత్రం నిజం .

నాగార్జున కొండలోయలో బౌద్ధుల కట్టడాలు శాతవాహనుల కాలంనుండి ఉండి ఉండాలి. వాటికి కొద్ది దూరంలో, లోయలో పడమటి వేపు విజయపురి దశలవారీగా నిర్మాణం జరిగి ఉండాలి. కోటగోడ నిర్మాణం ఈ విషయం ధృవీకరిస్తుంది.

కోటలో, రమారమి మధ్యను, కొంచెం పడమటికి అశ్వమేధయాగం జరిపేస్థలం ఉంది. అక్కడ అవబృధ స్నాన కుండం, కూర్మచితి బయట పడ్డాయి. వాటికి సమీపంలో ఉప సంవేషణా వేదిక ఉంది. ఆ వేదిక మీద గుర్రం యొక్క అస్తిపంజరం, పట్టమహిషితో నిద్రించిన స్థితిలో లభించింది. ఈ ఆధారాలు ఆ ప్రదేశంలో అశ్వమేధం జరిగిందని చెప్తాయి. ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలు.

అయితే ఈ కంకాళానికి సంబంధించిన అశ్వమేధ యాగం ఏ ఇక్ష్వాకు రాజు పాలనలో జరిగింది?

చరిత్రకారులు ఏక కంఠంతో ఛాంతమూలుని కాలం నాటిదే అని ఒక నిర్ణయానికి వచ్చారు. శాసనాలలో అతడే అశ్వమేధం చేసినట్లుంది.

ఇక్కడ రెండు విషయాలు ఆలోచించవలసి వస్తుంది.

మొదటిది – ఛాంతమూలుడు విజయపురినుంచి పాలించాడా?

ఒక వేళ అతడు విజయపురి నుండి పాలించి, అతడే అశ్వమేధం చేశాడని అనుకుందాం.

అతని కాలంలో జరిగిన అశ్వమేధ యాగం యొక్క అవశేషాలు సంవత్సరాల వరకు అలాగే ఉన్నాయా?

అశ్వమేధం జరిపే స్థలం కోటలో రాజభవనాలకు సమీపంలో ఉంది. ఛాంతమూలుని తరువాత వీరపురుషదత్తుడు ఇరవై నాలుగు సంవత్సరాలు, ఏహువల ఛాంతమూలుడు ఇరవైనాలుగు సంవత్సరాలు, రుద్ర పురుష దత్తుడు పదకుండు సంవత్సరాలు విజయపురి రాజధానిగా పాలించారు. ఈ ఏభై తొమ్మిది సంవత్సరాలు ఈ కంకాళం ఆ విధంగానే ఉందా? చచ్చిన జంతువులు కుళ్ళ వాసన వెయ్యవా?

రెండవది – యాగం కోసం చంపిన జంతువులను అలా విడిచి పెట్టరు. చంపిన చిన్న జంతువుల ప్రేవుల తిత్తులను తీసి వండుతారు. చంపిన జంతువులను కోయనిదే ఈ పని జరుగదు. ఉపసంవేషా వేదిక మీద జంతువులను కోసి కొవ్వు తియ్యరు.

గుర్రం యొక్క అస్తి పంజరం ఉపసంవేషణా వేదిక మీద లభించింది. అంటే అశ్వమేధ యాగం ‘వృషో వాజీ’ వరకే వచ్చింది.

అధ్వర్యుడు పట్టి మహిషిమీద, మృతాశ్వం మీద బట్ట కప్పుతాడు. మనకు అశ్వం యొక్క అస్తిపంజరమే లభించింది. అంటే ఉపసంవేషణా వేదిక నుండి పట్టమహిషి వెళ్ళిపోయింది. అశ్వమేధం అసంపూర్ణంగా ఉండి పోయింది. యజ్ఞశాల హుతాశన జ్వాలల కంకితమయింది.

అవబృధ స్నాన కుండం పైకప్పు కర్ర చెక్కలతో చేసినది. ఈ సాక్ష్వాలన్నీ త్రవ్వకాలలో లభించాయి.

గ్రీసులో కొనోసస్ రాజభవనాలు త్రవ్వకాలలో బయట పడ్డాయి. వాటిలో కాలిన పైకప్పు దూలాలు మొదలైనవి కనిపించాయి. పెద్ద భూకంపం వచ్చి అలా జరిగిందని కొందరనుకున్నారు. మరికొందరు, శత్రువులు దాడి చేసి భవనాలను కాల్చివేశారని ఒక నిర్ణయానికి వచ్చారు.

ఈ విషయాలు డాక్టర్ శశికళ చెప్పారు.

అవన్నీ విజయపురిలోని కోటకు వర్తిస్తాయి.

పల్లవులు ఇంత దురన్యాయానికి పాల్పడ్డారా?

ఎన్నో సంశయాలు.

దొరికిన ఆధారాలనుండి ఇక్ష్వాకుల చరిత్రను సహజంగానే భావించాలి.

డైరీ ఇంతవరకు వ్రాసి మోహన్ తలెత్తి చూశాడు. ఎదురుగా శశికళ నిలబడింది.

“రాత్రి పన్నెండు దాటింది పెట్రోమాక్సు లైటు వెలుగుతుంటే, ఎందుకు మీరు నిద్రపోలేదో చూడాలని లోనికి వచ్చాను. మిమ్మల్ని డిస్టర్చు చేయడం లేదు కదా?” అంది శశికళ.

“యూ ఆర్ వెల్‌కమ్! నాకు అప్పుడప్పుడు సందేహాలు కలుగుతుంటాయి. వాటిని డైరీలో వ్రాస్తే బాగుండుననిపించింది. అదే ఈ రోజు మొదలు పెట్టాను.”

“ఇది చాల మంచిపని. ఈ సందేహాలకు సమాధానాలు దొరకవచ్చు దొరక్కపోవచ్చు. కాని, వాటిని లిస్టు చేయడం అవసరం.”

“ఇది మన త్రవ్వకాలకు సంబంధించింది. కాబట్టి దీనిలో రహస్యం లేదు. చదవండి.”

“చదవడం కాదు. కాపీ చేసి ఉంచుతాను. వీటి అవుసరం ముందుకు చాల ఉంది” లైటార్పి శశికళ తన టెంటులోకి వెళ్ళిపోయింది డైరీ పట్టుకొని.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here