శ్రీపర్వతం-50

0
10

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం’ అనే చారిత్రక నవలలో ఇది 50వ భాగం. [/box]

మోహన్ చారిత్రక నవల-3.4

దినాలు ఒకటి తరువాత ఒకటి గడుస్తున్నవి. కళింగభూపతి సీహళదేశ చరిత్రను సావకాశంగా మధ్యాహ్నవేళల్లో శ్రమణుడికి చెప్పేవాడు.

“శ్రమణా! సింహబాహురవు, విజయుడు వంగ దేశానికి చెందినవారని జనశ్రుతి. విజయుడు తామ్రలిప్తి నుండి ఏడు వందల మంది అనుచరులతో దేశ బహిష్కృతుడయాడని మరొక కథ ఉంది. లంకను నాగద్వీపమని కూడా పిలిచేవారు. వేయి దక్షిణాది కుటుంబాలు విజయుడి గురించి, అతని పరివారం గురించి లంకకు వచ్చాయి. ఆ కుటుంబాలు తమతో పాటు వివాహయోగ్యులై పడుచులను తెచ్చాయి. ఆ విధంగా ఉత్తర దేశవాసులు దాక్షిణాత్యులు సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకున్నారు. ఈ సమ్మేళనం వలన ఒక ఉత్తమ సంస్కృతి సింహళంలో నెలకొంది.”

“బుద్ధుడికి సంబంధించిన కథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది. మాను, మేనల్లుడు ఒకరత్న సింహాసనం కోసం పోరాడుకున్నారు. వాళ్లు పోరాటం చాలించి ఆ సింహాసనాన్ని బుద్ధ భగవానుడికి బహూకరించారు. ఆ సింహాసనం సింహళ ద్వీపంలో ఉండేది. భారతీయులు దానిని దర్శించడానికి వచ్చేవారు.”

“దక్షిణలంకలో కళ్యాణి రాజ్యాన్ని మణియక్షుడు పాలించేవాడు. అతని కోరికను అంగీకరించి, బుద్ధ భగవానుడు తన పాదముద్రను ఛలాసి పర్వతం మీద విడిచాడు. వాటిని దర్శించడానికి భారతీయులు వచ్చేవారు. పద్దెనిమిది వృత్తులకు చెందిన వేయి కుటుంబాలు పాండ్య దేశం నుండి సింహళం వచ్చాయి.”

“మళ్లా మొదటికి వద్దాం. విజయుడికి సంతతి లేదు. అతడు వంగదేశంలో నున్న తన సోదరుని సింహళం రమ్మన్నాడు. విజయుడు మరణించిన ఒక సంవత్సరం అనంతరం అతని సోదరుని పుత్రుడు పాండువాసు దేవుడు సింహళం వచ్చి సింహాసనం అధిష్ఠించాడు. అతని తరువాత మరి ముగ్గురు రాజులు లంకను పాలించారు. పిమ్మట దేవానాం పియతిస్సుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడు మౌర్యచక్రవర్తి అశోకుని సమకాలికుడు. చాలా విఖ్యాతుడైన ఈ రాజు, అశోక చక్రవర్తి దగ్గరికి రాజప్రతినిధులను విలువైన బహుమతులతో పంపించాడు. అశోకుడు రాజదూతలకు సగౌరవంగా స్వాగతం చెప్పి, పట్టాభిషేకానికి అవసరమైన వస్తువులను పంపించాడు. దేవానాం పియతిస్సుడి పట్టాభిషేకం చాల ఘనంగా జరిగింది.”

“కొద్ది కాలం తరువాత అశోకుని పుత్రుడు మహేంద్రుడు, బౌద్ధ భిక్షువుగా సింహళానికి వచ్చాడు. మహారాజు దేవానాం పియతిస్సుడూ అతని ప్రజలూ నూతన మతమైన బౌద్ధాన్ని స్వీకరించారు.”

“అశోకుని పద్దెనిమిదవ పాలనా సంవత్సరంలో, బుద్ధగయ నుండి బోధి వృక్షాన్ని మహేంద్రుడు తెచ్చి, రాజధానియైన అనూరాధ పురంలో నాటాడు. ఆ కాలంలోనే విఖ్యాతమైన మహావిహారం నిర్మింపబడింది.”

“దేవానాం పియతిస్సుడు నలబై సంవత్సరాలు సింహళాన్ని పాలించాడు. అతని సోదరులు, ఒకరి తరువాత ఒకరు, ముగ్గురు రాజ్యం పాలించారు. వారిలో అఖరివాడు సూరతిస్సుడు. అతడు పది సంవత్సరాలు పాలించాడు. గుర్రాల వ్యాపారుల కొడుకులు, ఇద్దరు తమిళులు, అక్రమంగా దేశాన్ని జయించి ఒకరి తరువాత ఒకరు లంకను పాలించారు. కాని, పూర్వపు రాజవంశానికి చెందిన అసీలుడు తిరిగి సింహాసనం ఆక్రమించుకున్నాడు.”

“ఉత్తమ వంశానికి చెందినవాడు, ధైర్యసాహసాలు కలవాడు, ఏళారుడనే అతడు, అసేలుని పక్కకు తొలగించి, సింహళ ద్వీపాన్ని నలభై నాలుగు సంవత్సరాలు పాలించాడు. అతడు న్యాయమూర్తి, శత్రువుకి మిత్రుడికి ఒకే విధమైన న్యాయం సమకూర్చిన మహానుభావుడు. ఆవు దూడను రథం కింద మట్టించి చంపినందుకు అతడు తన కుమారుడైన రాజు పుత్రుడికి ఉరిశిక్ష విధించాడు. ఈ మహారాజు పరిపాలనలో ఒక వృద్ధురాలు, తన పంట అనావృష్టి వలన పాడవుతున్నదని మొరపెట్టుకుంది, ఈ రాజు, ఇంద్రుడు తన విధిని సక్రమంగా నిర్వహించేటట్లు చేశాడు. న్యాయ ఘంటను ప్రవేశపెట్టిన వాడితడే.”

“ఈ తమిళ రాజును దుత్తగామణి చంపి, మహారాజుగా సింహళాన్ని ఇరవై నాలుగు సంవత్సరాలు అఖండంగా పాలించాడు. ఇతడు మహాస్తూపాన్ని నిర్మించాడు. భారతదేశం నుండి చాల మంది బౌద్ధ భిక్షువులు దీని ఆవిష్కరణ మహోత్సవానికి వచ్చారు. వేయిమంది భిక్షువులు శ్రావస్తి నుండే వచ్చారు.”

“దుత్తగామణి అనంతరం అతని సోదరుడు పద్దెనిమిది సంవత్సరాలు లంకను పాలించాడు. అతని పిమ్మట అతని కనిష్ఠ పుత్రుడైన థూలధానుడిని రాజ్యాభిషిక్తుని చేయాలని బౌద్ధ భిక్షువులు ప్రయత్నించారు. కాని, అతని అన్న లంజతిస్సుడు, తమ్ముడిని ఓడించి సింహాసనం అధిష్టించాడు. ఆరు సంవత్సరాల పాలన తరువాత అతని సేనాధిపతి రాజును చంపి రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని పది సంవత్సరాలు పాలించాడు. లంజతిస్సుని రెండవ తమ్ముడు పట్టగామణి. ఇతడు అన్నను చంపిన సేదాధిపతిని సంహరించాడు. విధవయైన రాణిని పెండ్లి యాడాడు. ఆమె కుమారుని పెంచుకున్నాడు.”

“పట్టగామణి సింహాసనం ఎక్కగనే, ఒక వంక తమిళుల దండయాత్రను, మరొక వంక రాజప్రతినిధి ఒకడు లేవదీసిన తిరుగుబాటును ఎదుర్కొవలసి వచ్చింది. కాని, ఇతడు చాలా తెలివైనవాడు. తమిళులను తిరుగుబాటుదారుల వేపు మళ్లించాడు. తిరుగుబాటు అణిగిపోయింది. కాని అతడు తమిళుల ధాటికి ఆగలేకపోయాడు. తన రెండవ రాణియైన సోమదేవిని, బుద్ధ భగవానుని భిక్షాపాత్రను, రాజ్యాన్ని విడిచి అతడు పారిపోయాడు.”

“సింహళం మీద దండెత్తిన ఏడుగురు తమిళులోను ఇద్దరు రాణీ సోమదేవిని, పవిత్రమైన పాత్రను తీసుకొని భారత దేశానికి మరలిపోయారు. మిగిలిన అయిదుగురు పధ్నాలుగు సంవత్సరాలు సింహళాన్ని పాలించారు.”

“తమిళులలో మొదటి పాలకుడు పులహట్టుడు. అతనిని బలవంతాన తొలగించి రెండవ వాడు, అతనిని తొలగించి మూడవ వాడు ఈ విధంగా ఒకరి తరువాత ఒకరు దేశాన్ని పాలించారు. ఆఖరివాడిని పట్టగామణి చంపి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు.”

“పట్టగామణి సింహాసనం ఎక్కగనే, జైనులను నాశనం చేసి, రాణి సోమదేవి పేరున బౌద్ధ విహారమొకటి కట్టించాడు.”

“పట్టగామణి పన్నెండు సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతని పాలనలో బౌద్ధుల త్రిపిటకాలు, అట్టకథ, గ్రంథరూపం ధరించాయి.”

“పట్టగామణికి ఇద్దరు పుత్రులు – మహాచూలి తిస్సుడు పెద్దవాడు. ఇతడు పధ్నాలుగు సంవత్సరాలు పాలించాడు. ఇతని తరువాత ఇతని తమ్ముడు చోరనాగుడు పన్నెండు సంవత్సరాలు పాలించాడు.”

“చోరనాగుడు బౌద్దల పై శత్రుత్వం వహించాడు. బౌద్ధ విహారాలను నాశనం చేశాడు. చోర నాగుడి భార్య పేరు అనుల. ఈమె భర్తకు విషం పెట్టి చంపింది.”

“అనుల అంతటితో ఆగలేదు. మహా చూలి కొడుకు తిస్సుడిని కూడా విషం పెట్టి చంపింది. ఈ దుష్టరాణి, తన ప్రేమికులను మరో నలుగురిని, ఒకరి తరువాత ఒకరిని సింహాసనమెక్కించి, విష ప్రయోగం చేసి వరుసగా చంపించింది. ఆమె స్వయంగా సింహాసనమెక్కింది కాని, ఆమెను కూటకణ్ణ తిస్సుడు చంపి, రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు.”

“అటు పిమ్మట అయిదుగురు రాజులు సింహళాన్ని పాలించారు. ఆఖరి రాజు సోదరి సివాలీ. ఆమె సింహాసనాన్ని ఆక్రమించింది. ఆమె పినతండ్రి కొడుకు ఇళానాగుడు ఆమెను గద్దె దింపి తాను సింహాసనమెక్కాడు.”

“అతడి పాలన మొదలైన కొద్ది దినాలకే లంబకణ్ణ వంశం తిరుగుబాటు చేసింది. అతడు భారతదేశానికి పారిపోయి మూడు సంవత్సరాలు ప్రవాసిగా ఉండిపోయాడు. అతడు భారతదేశంలో సేనను సమకూర్చుకొని, తన సింహాసనం తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఆరు సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అతని పుత్రుడు చండముఖ శివుడు. ఇతడు తొమ్మిది సంవత్సరాలు పాలించాడు. అతని తమ్ముడు యశలాలకతిస్సుడు. ఇతడు అన్నను చంపి ఎనిమిది సంవత్సరాలు రాజ్యాన్ని ఏలుబడి చేశాడు. ఇతనితో విజయుడు స్థాపించిన రాజవంశం అంతమయింది.”

“యశలాలక తిస్సుడి ద్వారపాలకుడు సంభ. ఇతడు రాజును చంపి ఆరు సంవత్సరాలు రాజ్యం పాలించాడు. లంబకణ్ణ వంశానికి చెందిన వసభుడు ఇతడిని పదభ్రష్టుడిని చేసి, కొత్త రాజవంశాన్ని స్థాపించాడు. ఈ వంశపు రాజులు మూడు వందల సంవత్సరాలకు పైగా సింహళాన్ని పాలించారు.”

“లంబకణ్ణులు పురాతన జాతివారు చాల శక్తివంతులు. లంకకు బోధి వృక్షం తెచ్చిన మౌర్యుల వంవానికి చెందినవాళ్లు.”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here