శ్రీపర్వతం-55

0
9

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం’ అనే చారిత్రక నవలలో ఇది 55వ భాగం. [/box]

మోహన్ చారిత్రక నవల-4.4

[dropcap]బు[/dropcap]ద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి

శ్రమణుడు కొద్ది కాలంలో కళ్లు తెరచేసరికి అంతా అంధకారమే – ఎవరూ లేరక్కడ.

శ్రమణుడు మాయనుండి ముక్తిని పొందినట్లు భావించాడు. తనను ప్రలోభం నుండి రక్షించిన యశోనిధికి చేతులు జోడించి నమస్కరించాడు.

ఎనిమిదవనాటి రాత్రి యవన సుందరిని తీసుకొని ఒక చెలికత్తె మాత్రమే వచ్చింది.

“ఆనందులు సెలీనా నృత్యం చూసి ఆనందించగోరుతున్నాము. ఈమె మీ చరణదాసి! మా సమక్షంలో ఆమెతో మాట్లాడడానికి మీరు లజ్జిస్తున్నారు. మిమ్మల్ని ఇద్దరినీ ఏకాంతంగా విడిచి నేను వెళ్లిపోతున్నాను. మారుడు మీకు సుఖమిచ్చుగాక!!”

చెలికత్తె వెళ్లిపోయింది.

యవన సుందరి కట్టినవి చీనిచీనాంబరాలు కావు. కృష్ణా నదీముఖంలో నున్న మైసోల నగరం నుండి వచ్చిన పలుచని వలువలు. ఆ వస్త్రధారణ భారత భూమికి సంబంధించినది కాదు. హెల్లాస్ దేశపు రాజకుటుంబాలలో అంతఃపుర స్త్రీల పద్ధతి అది.

శ్రమణుడు పలుచని దుస్తులలో దేదీప్యమానమైన కాంతిలో సెలీనా శరీర సౌందర్యం చూశాడు. అతని నిగ్రహమంతా సడలిపోయింది.

సెలీనా నృత్యం చేసింది. ఆమె తనువు విలాసమధురంగా వంపులు దేరింది. ఆమె చూపులు కామంతో నిండి శ్రమణుడిని ఆహ్వానిస్తున్నవి.

శ్రమణుడు యవన సుందరి ముఖంలోకి చూస్తున్నాడు. ఆ ముఖం క్రమంగా మార్పులు చెంది యశోనిధి ముఖంగా కనిపించింది. అది కూడా ఎంతో సేపు ఉండలేదు. మృత్యువు ముఖం తన కరాళ దంష్ట్రలతో సాక్షాత్కరించింది.

శ్రమణుడిలో కదలికలన్నీ ఆగిపోయాయి. అతడు పద్మాసనంలో కూర్చునన్నాడు. కళ్లు మూసుకున్నాడు. త్రిరత్నాలను నుతించాడు.

అతనికి తెలివి వచ్చేసరికి విశ్రాంతి మందిరంలో కఠిన శయ్యపై ఉన్నాడు.

శ్రమణుడు స్నానాదులు ముగించాడు. వచ్చిన కొద్దిమంది రోగులకు ఔషధాలు యిచ్చాడు. వర్షాలు ముగిశాయి. వాతావరణం చాల రమ్యంగా ఉంది. చాల దినాలయి కనిపించని కళింగ భూపతి విశ్రాంతిమందిరంలో ప్రవేశించి మాట్లాడడానికి అవకాశమివ్వకుండా వెంటనే వెళ్లిపోయాడు.

మధ్యాహ్న భోజనం, విశ్రాంతి మొదలైనవి యథాతథంగా కొనసాగాయి. వర్షావాసానికి ఇది ఆఖరిదినం. పవారణ ఎక్కడ జరుపుకోవాలి? ఏ భిక్షు సంఘం ముందు తాను శీలంలోని విన్నవించి పవిత్రుడు కావాలి?

ఆ రాత్రి యవన సుందరిని బౌద్ధ భిక్షుణి ఒకతె లోనికి ప్రవేశ పెట్టింది. భిక్షుణి శ్రమణుడికి నమస్కరించలేదు. వెంటనే వెళ్లిపోయింది. వెళ్లిపోతూ సెలీనా చెవిలో వినీ వినిపించనట్లు పలికింది.

“సుందరీ! ఇది చివరి రాత్రి. ఈ శ్రమణుడు నిన్ను స్వీకరించకపోతే మహారాజు గారు విధించిన శిక్షకు గురి అవుతావు. నీవు జీవించాలని భావిస్తే ఇతనిని జయించు.”

శ్రమణుడా మాటలు విన్నాడో లేదో!

కాని, యవన సుందరి పలుకులకు ఒక్కసారిగా అతడు చైతన్య వంతుడయాడు.

“దినాలబట్టి మీ సన్నిధిలో ఉండే భాగ్యం లభించింది. నేను పది సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ఎథీనా నగరం నుండి నావ మీద సీహళ దేశానికి వచ్చాను. హెల్లాస్ ప్రభువులు నన్ను సీహళ మహారాజులకు కానుకగా పంపించారు. గోఠా భయ మహారాజు నన్ను సాకాంక్షగా చూసి, వయసు వచ్చిన తరువాత నేను సింహళ మహారాణీకి సపత్నిని కాగలనని సెలవిచ్చారు. నన్ను, ప్రత్యేకమైన మందిరంలో ఉంచి నాకు సంగీతనృత్య సాహిత్య కళలలో శిక్షణ ఇప్పించారు. నేను నిత్యం కడవలకొద్ది పాలలో స్నానం చేస్తాను. సుగంధ జలాలలో పునః స్నానం చేస్తాను. ప్రపంచంలో విలువైన ఆభరణాలు ధరిస్తాను. అంతకన్న విలువైన వలువలు కడతాను. అసూర్యం పశ్యగా అంతఃపురంలో తొమ్మిది సంవత్సరాలయి సకల భోగాలతో పోషింపబడుతున్నాను. గోఠా భయ మహారాజులకు తిరిగి నన్ను చూసే తీరిక లభించలేదు. జేట్ఠ తిస్సమమారాజుగారి దేవేరి నన్ను చూసి భయపడ్డారు. మహారాజు గారి దృష్టి నాపై బడితే తప్పక ఆమెకు సపత్నినౌతానని అనుమానించారు. నేను మహారాజుల శయ్యకు తగినదానినో కాదో, కాని శీలసంపన్నులు, జనప్రియులు అయిన మీకు అర్హురాలనని భావిస్తున్నాను. మిమ్మల్ని చూసిన క్షణమే నా జన్మ ధన్మమయిందని సంతోషించాను. నన్ను కాదనక స్వీకరించండి.”

కాని, ఆ మహాసౌందర్యవతికి బదులు మృత్యువే రూపుదాల్చి వికారంగా అతని ఎదుట తైతక్కలాడింది.

శ్రమణుడు స్థాణువయాడు.

అతని మనఃఫలకం మీద బుద్ధ భగవానుని దివ్యసుందర విగ్రహం ప్రలంబ పాదాకృతిలో సాక్షాత్కరించింది. మారుడు తన పుత్రికల అందరినీ పంపినా శ్రమణుని కదలించలేని స్థితి ఏర్పడింది.

క్రమంగా శ్రమణుడి శరీరం బిగుసుకుపోయింది. అతని మనసు మాత్రమే పనిచేస్తోంది. కరచరణాలలో చలనం లేదు. బుద్ధ భగవానుడి స్మేరాననమే అతని స్మృతిలో భాసించింది.

సెలీనా వేడుకొంది. దీనంగా అర్థించింది. మధురంగా పిలిచింది. శిలలను కూడా ద్రవించే రీతిలో మాట్లాడింది.

శ్రమణుడు వజ్రకఠినుడయాడు.

తూరుపు తెల్లవారింది.

శారీరకంగా, మానసికంగా అలసి మూర్ఛపోయిన సెలీనాను చెలికత్తెలు మోసుకుపోయారు.

శ్రమణుడు సమాధి నుండి మేల్కొనేసరికి చక్కని ఎండ వచ్చింది. అతను చుట్టూ చూశాడు. అది రంగశాల. మహారాజు తీరిక దొరికినప్పుడు అక్కడ వాద్యాలను వినడం కాని, సంగీతం ఆలకించడం కాని, నృత్యం దర్శించడం కాని చేస్తారు. దానిని శ్రమణుడి ప్రలోభానికి ఇపుడు వినియోగించారు.

అక్కడ పరిచారకులెవరూ లేరు. ఆ చోటు నుండి విశ్రాంతి మందిరం అరక్రోశం దూరముంది. శ్రమణుడు పాదచారియై తన వసతికి బయలుదేరాడు.

ప్రకృతి చాల అందంగా ఉంది. వానలతో వృక్షాలు, మొక్కలు ఏపుగా పెరిగి ఆకుపచ్చని అంబరాన్ని కప్పుకున్నాయి.

శ్రమణుడు కొంచెం నడిచి ముందుకు చూశాడు. నలుగురు పరిచారకులు తెల్లటి గుడ్డ కప్పిన శరీరాన్ని కట్టె మీద మోస్తున్నారు. కొంతమంది స్త్రీలు దాని వెనుక నడుస్తున్నారు.

శ్రమణుడు అడుగులు తొందరగా వేశాడు. ముందు పోతున్న వారిని చేరుకున్నాడు.

“ఎవరీ పుణ్యాత్ములు?” కట్టెను మోస్తున్న ఒకడిని శ్రమణుడడిగాడు.

వాహకులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కట్టె వెనుక పోతున్న స్త్రీలు ఒకరికనొకరు చూసుకున్నారు. అందరూ నిలిచిపోయారు. వెనుక నుండి కళింగ భూపతి విసురుగా వచ్చాడు.

“ఎందుకు ఆగిపోయారు?” అతను ప్రశ్నించాడు. కళింగ భూపతి ఆరడుగుల కృష్ణ సర్పాన్ని పీకదగ్గర పట్టుకున్నాడు.

“పూజ్యలు ఈ శరీరమెవరిదో తెలుసుకోగోరుతున్నారు.” వాహకులలో ఒకడన్నాడు.

“రాజాజ్ఞను నిర్వర్తించలేని ఒక అభాగిని శిక్షింపబడింది.”

“ఎవరు?” శ్రమణుడు తానే బట్టను పైకి తొలగించి చూశాడు. ఆమె సెలీనా. ఆమె బంగారుకాంతి కాటుక నలుపుగా మారింది.

“ఈ అమృతమూర్తికి ఏమయింది?” శ్రమణుడు కళింగ భూపతిని ప్రశ్నించాడు.

“శ్రమణా! ఈ మహాసర్పాన్ని చూస్తున్నారా? సుమకోమలమైన ఆమె పెదవి మీద ఈ భుజంగం చుంబించింది. కోరలు నాటి దంతచ్ఛదం చేసింది.”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here