శ్రీపర్వతం-57

0
11

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం’ అనే చారిత్రక నవలలో ఇది 57వ భాగం. [/box]

[dropcap]ప్ర[/dropcap]భుత్వ కార్యాలయం కారిడార్‌లో కొన్ని గంటలుగా ఎదురు చూస్తున్నాడు మెహన్.

అతని మనస్సులో ఆందోళనగా ఉంది. ఎందుకో తెలియని చిరాకు అతడిని వేధిస్తోంది.

ఉన్నవాడు ఉన్నట్టు సెక్రటరీ రమ్మనగానే వచ్చాడు.

అంత అర్జంటుగా రమ్మన్న సెక్రటరీ ఆఫీసు బయట కొన్ని గంటలుగా కూర్చుని ఉన్నాడు. లోపల నుంచి పిలుపు రాలేదు.

అసహనం పెరిగిపోతోంది. కానీ ఎవరి మీద చూపించాలి? అటూ ఇటూ పచార్లు చేయసాగాడు మెహన్.

సెక్రటరీ పి.ఏ. కాబోలు “కూర్చోండి. పచార్లు చేయకండి” అంది.

“నాకు ఇలా పని లేకుండా గంటలు గంటలు ఎదురు చూస్తూ కూర్చోవటం అలవాటు లేదు. సమయం అమూల్యమైనది. ఇలా వృథాగా వ్యర్థం చేయటం ఇష్టం లేదు. అర్జంటుగా రమ్మన్నారు సెక్రటరీ, అంటే కట్టు బట్టల మీద వచ్చాను.” కోపాన్ని అణుచుకుంటూ సౌమ్యంగా చెప్పాలని ప్రయత్నించాడు మోహన్. కానీ అతని ఆవేశం లెవల్ అతను బిగించిన పళ్లు, నిప్పులు కక్కే కళ్లు చెప్పకనే చెప్తున్నాయి.

ఆమె అతని వైపు పరిశీలనగా చూసింది.

“మీ పేరేమిటి?” అడిగింది.

“మోహన్, నాగార్జున సాగర్ దగ్గర తవ్వకాలు జరిపాను.”

“ఓ మీరా” లేచి నిలబడింది ఆమె.

ఆశ్చర్యంగా చూశాడు మోహన్ ఆమె వైపు.

“నేను మీరు పంపిన రిపోర్టు చదివాను. నిజంగా చాలా విషయాలు తెలిశాయి. ముఖ్యంగా ఆనందుడి గురించి మీరు కనుగొన్న విషయాలు అత్యద్భుతంగా ఉన్నాయి” అందామె ఉత్సాహాన్ని అణిచిపట్టుకోలేక.

మోహన్ అలసట, చిరాకు ఎగిరిపోయాయి

“మీకు ఆర్కియాలజీ అంటే ఆసక్తి ఉందా?”

“లేదు. నేను జెనెటిక్స్‌లో ఎమ్మెస్సీ.”

“మరి ఈ ఉద్యోగం?”

“మన దేశంలో చదివిన చదువులకు ఉద్యోగాలకీ సంబంధం ఉందా? కాంపిటీటివ్ పరీక్ష రాశాను. ఉద్యోగం వచ్చింది. నాతో జెనెటిక్స్ చదివిన వాళ్లు సేల్స్‌మేన్‌లుగా రకరకాల ఉద్యోగాలు చేస్తున్నారు.”

“మరి నా రిపోర్టు ఎలా చదివారు?”

ఆమె రహస్యం చెప్తున్నట్లు గుసగుసగా చెప్పింది.

“సెక్రటరీకి ఇంగ్లీషు రాదు. దాన్ని చదివి అర్థం చెప్పాలి” నవ్వింది.

మెహన్ ఏదో అనబోయి ఆగిపోయాడు.

ఆమె నవ్వింది, మెహన్ మనసులో మాటను గ్రహించినట్టు.

‘ఇంటర్‌కమ్’ ఎత్తి చెప్పింది. “సార్ ఆర్కియాలజిస్టు మోహన్ ప్రొద్దుట నుంచీ ఎదురు చూస్తున్నారు. పంపమంటారా?”

ఆ వైపు చెప్పింది విని జాలిగా చూసింది మోహన్ వైపు.

ప్రశ్నార్థకంగా చూశాడు మోహన్.

“ఉండండి. మనం లంచ్‌కి వెళ్దాం” అంది మెహన్ సమాధానం కోసం చూడకుండా.

‘ఇంకర్‌కమ్’లో “సార్…. నేను లంచ్ తెచ్చుకోలేదు. లంచ్‌కి వెళ్లి వస్తాను.” చెప్పింది. సమాధానం కోసం చూడకుండా పెట్టేసి మెహన్‌తో “ రండి” అంటూ బయటకు నడిచింది పర్స్ తీసుకుని. “ఖదీర్ తుం మేర లంచ్ ఖాలేనా ” …అని చెప్పింది అక్కడే వున్న నాలుగో తరగతి ఉద్యోగికి.

ఆమెని మౌనంగా అనుసరించాడు మోహన్.

క్యాంటీన్‌లో ‘లంచ్’ ఆర్డరిచ్చింది.

“మీకు ఓ విషయం చెప్పాలని పిలిచాను. ఆఫీసులో ప్రైవసీ ఉండదు.”

“చెప్పండి.”

“సెక్రటరీకి తవ్వకాలు, వాటి మీద ఆసక్తి లేదు.”

ఆశ్చర్యంగా చూశాడు మోహన్. ఏదో అనబోయి ఆపేసాడు.

ఆమె మళ్లీ నవ్వింది.

“ఆయనకి ఈ డిపార్ట్‌మెంట్ ఇష్టం లేదు. ట్రాన్స్‌ఫర్‌కి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఆదాయం అంతగా లేదు. మీకు నిధులు మంజూరు చేసిన ఆయన రిటైరయిపోయారు.”

“అయితే?”

“మీ రిపోర్టు ఆమోదం పొందదు. ఎందుకంటే దీని వల్ల ఆయనకు ఎలాంటి లాభం లేదు. మిమ్మల్ని ఇప్పుడు రమ్మన్నది మీ వల్ల ఏమైనా లాభం ఉంటుందో, లేదో తెలుసుకోటానికి.”

మెహన్ ముఖంలో మార్పును గమనించింది ఆమె.

“ఆయామ్ సారీ. పని పట్ల మీ శ్రద్ధ, లోతైన ఆలోచన నాకు నచ్చింది. నేను కూడా జెనిటిక్స్‌లో రిసెర్చి చేయాలనుకున్నాను. అది తప్పించి వేరే జీవితాన్ని ఊహించలేదు. కానీ రిసెర్చి ఫ్రొఫెసర్ కోరికలను తీర్చటం కన్నా జెనెటిక్స్‌ను వదలుకోవటం ఉత్తమం అనిపించింది. మిమ్మల్ని చూస్తుంటే నాకు జెనెటిక్స్‌లో నా ఆసక్తి గుర్తుకు వచ్చింది.”

“కాని నా రిపోర్డులో తిరస్కరించటానికి ఏమీ లోపం లేదు.”

“ఉంది. మీతో పాటు డాక్టర్ శశికళ అనే ఆవిడ కూడా తవ్వకాలలో పాల్గొంది. కాని ఆమె మధ్యలో వదిలేసి వెళ్లిపోయింది. కారణం ఏమిటి? ”

కారణం చెప్పేందుకు మోహన్ తడబడుతున్నాడు. ఆమె స్నానం చేస్తుంటే అనుకోకుండా తాను చూశానని, అందుకని ఆమె వెళ్లిపోయిందని ఎలా చెప్తాడు.!

“తవ్వకాలకి అనుమతి వచ్చిన తరువాత మీ టీంలో ఆమెని చేర్చుకున్నారు. . ఆమె మధ్యలో వదలి వెళ్లిపోయింది. కారణం తెలియదు. ఒక మహిళ పని మధ్యలో వదలి వెళ్లిపోయిందంటే కారణం ఊహించటానికి పెద్ద తెలివి అవసరం లేదు.”

“అటువంటిదేమీ లేదు.”

“మీరు అంటారు. మేము నమ్మాలి కదా? ? పైగా మీ పరిశోధన అంతా నిప్పులో కాలిపోయింది. మీరు సిద్ధాంతాలను నిరూపించే ఆధారాలు లేవు. ఫండ్స్ అంతా ఖర్చు చేశారు. గొప్ప నిజాయితీగా అయిదు వేల డ్రాఫ్ట్ పంపిచారు. కానీ మిగతా డబ్బులంతా మీరే కాజేశారు.”

“అబద్ధం.” అరిచాడు మోహన్ కోపంతో.

ఆమె నవ్వింది.

“ఇవన్నీ లోపల వండుతున్నారు. ఇంకా ఏ మసాలాలు వేస్తారో తెలియదు. వంట పూర్తయితేకానీ మీకు లోపలకు పిలుపురాదు. కుచ్ బోల్కే ఉసే షాం తక్ బిఠావో అన్నాడు నాతో..అంటే అర్ధం మిమ్మల్ని వారి ప్రతిపాదనకు ఒప్పించే సామగ్రి ఇంకా సిద్ధం కాలేదని. ఆయన మీతో ఇలా మాట్లాడితే మీరు ‘షాక్’ తినకుండా ముందే చేప్తున్నాను” అంది ఆమె.

“ఇది విజ్ఞానశాస్త్ర పరిశోధన. మేము కనుగొన్నవి చారిత్రక సత్యాలు. ఇంత వరకూ చీకటిలో ఉన్న ఎన్నో విషయాలపై వెలుతురును ప్రసరిస్తుంది నా పరిశోధన” ఆవేశంతో ఏదో అనబోతున్న మోహన్ ఆమె ముఖం చూసి ఆగిపోయాడు.

ఆమె ముఖంలో జాలి, బాధ కలగలసి కనిపిస్తున్నాయి.

“ఇట్ హెపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా” అందామె నీరసంగా నవ్వుతూ.

మోహన్ కూడా నవ్వాడు. ఇద్దరూ మౌనంగా లంచ్ ముగించారు.

“పదండి” అన్నాడు మోహన్.

ఇద్దరూ మౌనంగా ఆఫీసులోకి వెళ్ళారు.

ఆమె తాను వచ్చినట్లు చెప్పగానే మోహన్‌కు లోపలకు పిలుపు వచ్చింది.

మోహన్ లోపలకు వెళ్లాడు.

లోపల పెద్ద టేబుల్ వెనుక పెద్ద కుర్చీలో కూర్చుని ఉన్నాడు సెక్రటరీ.

“మీరు లేడీ కొలీగ్‌తో అనుచితంగా ప్రవర్తించారని రిపోర్టు అందింది. ఫండ్స్ అనవసరంగా ఖర్చు పెట్టారని, కూలీలకు తక్కువ ఇచ్చి ఎక్కువ ఇచ్చినట్టు లెక్కలు తప్పు రాశారని కంప్లయింట్ అందింది. ఎలాంటి పరిశోధనలు చేయకుండా , అన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయని సాకు చూపిస్తున్నారు. ఆ అగ్నికి కారణం మీరే అనేందుకు ఆధారాలున్నాయి. ఇన్వెస్టిగేషన్ కమిటీని వేయాలని సిఫారసు అందింది. మీరు ఖర్చు పెట్టే డబ్బులు టాక్స్ పేయర్ల డబ్బులు అని గుర్తుంచుకోవాలి. ఇష్టం వచ్చినట్టు దోచేస్తే ఎలా?”

మోహన్ ముఖం ఎర్ర బడింది. పిడికిళ్లు బిగుసుకున్నాయి. కాని ఆవేశపడితే, తొందరపడితే తన శ్రమ వృథా అవుతుంది.

మోహన్ మాట్లడకపోవటం చూసి సెక్రటరీ మళ్లీ అన్నాడు.

“మీ రిపోర్టు ఎక్స్‌పర్ట్ కమిటీకి పంపాను. రిపోర్టు రాగానే మళ్లీ ఓ సారి వచ్చికలవండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఎప్పుడు వెళ్లిపోతారు?”

చెప్పాడు మోహన్.

“రాత్రికి తొందరపడి వెళ్లకండి. రేపు పొద్దున్న వెళ్లండి” అన్నాడు సెక్రటరీ లేస్తూ….

“నేను హడావిడిగా బయలు దేరాను.”

మోహన్ మాటను పూర్తి కానివ్వలేదు అతడు. “రాత్రికి ఉండండి. నాకు అర్జంటు పనుంది.” అంటూ వెళ్లిపోయాడు.

గదిలో కాస్సేపు ఒంటరిగా నిలబడ్డాడు మోహన్.

అతనికి అవమానంగా ఉంది. ఆవేశంగా ఉంది. నిస్సహాయంగా అనిపిస్తోంది.

ఒక అద్భుతమైన ప్రపంచం నుంచి అసహ్యకరమైన ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టుంది. బయటకు వచ్చి ఆమెకు జరిగింది చెప్పాడు.

“రాత్రికి ఉండండి. ఆయన ఉండమన్నారంటే ఏదో ఉండి ఉంటుంది” అంది.

ఆమెకు “థాంక్స్” చెప్పి బయటపడ్డాడు.

ఢిల్లీ వీధులలో అలసిపోయేదాకా నడిచాడు.

ఎటు నడుస్తున్నాడో తెలియదు. ఏం చూస్తున్నాడో తెలియదు. నడుస్తూనే ఉన్నాడు. అలసిపోయినట్టు అనిపించి, నడవలేననిపించిన తరువాత ఆటో ఎక్కి హోటల్ పేరు చెప్పాడు.

గది. చేరుకుని మంచం పై పడి నిద్రపోయాడు.

ఎవరో బెల్ అదే పనిగా మోగిస్తుంటే, గాఢ సుషుప్తి నుంచి మెలుకువ వచ్చింది.

కలలో అతనికి నాగార్జునుడు, అనంతుడు, సెలీనాలు కనిపించారు. గణికలు కనిపించారు. విచిత్రమైన పాము కనిపించింది. చివరికి శశికళ కనిపించింది. స్నానం చేస్తోంది.

ఆమె ఓ శిల్పంలా ఉంది. అజంతా శిల్పంలా ఉంది. శ్రీపర్వతంలా ఉంది.

అందుకే మెలుకువ వచ్చే సరికి ఎక్కడ ఉన్నాడో అర్థం కాలేదు మోహాన్‌కు.

గది చీకటిగా ఉంది. అతను శశికళ లేదేమని అనుకున్నాడు.

బలవంతాన మంచం మీంచి లేచి వెళ్లి తలుపు తీశాడు.

“హాయ్ మై అగర్వాల్. సెక్రటరీ నే భేజా హై” అన్నాడు తలుపు తీయగానే లోపలకు వస్తూ.

“నేను మోహన్” అన్నాడు మోహన్.

అతడు చనువుగా సోఫాలో కూర్చున్నాడు.

“మీరు ఫ్రొఫెసర్ పరమ్‌జిత్ సిన్హా పేరు విన్నారా? ”

“తెలుసు. చాలా రిసెర్చ్ పేపర్లు అద్భతమైనవి చదివాను. నేను అత్యంత గౌరవించే ఆర్కియాలజిస్టు. ఢిల్లీ వస్తే ఆయనని కలవాలనుకున్నాను. కానీ ఈ సారి టైమ్ లేదు. మూడ్ లేదు.”

“గుడ్…. నీ తవ్వకాల ఫలితాలకు క్రెడిట్ ఆయనతో షేర్ చేసుకోవటం మీకు అభ్యంతరమా? ఇందుకు ఒప్పుకుంటే మీకు అన్ని అనుమతులు దొరకటమే కాదు, ఇంకా రీసెర్చ్ కి నిధులు వస్తాయి. మీ పై కేసేమీ వుండదు. విదేశీ జర్నల్స్ లో ప్రచురణ అంతా సిన్‌హా చూసుకుంటారు. ”

విభ్రమం చెందాడు మోహన్.

నోట మాట రాలేదు.

కష్టపడి రాత్రంబవళ్లు ఫీల్డులో ఉండి పరిశోధించింది తను, శశికళ. క్రెడిట్ వేరే ఆయనకు ఎలా ఇస్తారు?

“మీరు ఆలోచించుకోండి. సమయం ఉంది. ఫ్రొఫెసర్‌కి మీ పనితీరు నచ్చింది. భవిష్యత్‌లో మీతో పలు ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారు. ఆయనతో కలిస్తే మీ పేరు అంతర్జాతీయ స్థాయిలో మారు మ్రోగిపోతుంది” అన్నాడు అగర్వాల్.

మోహన్ మాట్లాడలేదు.

ఇది అతను ఊహించనిది.

“సోచ్‌లే. మీకు ఫ్రొఫెసర్ నెంబరు ఇస్తాను. ఓసారి మాట్లాడండి.” అని అతను వెళ్లిపోయాడు.

మోహన్‌కి ఏం చేయాలో తోచలేదు.

అయినా తాను ఒక్కడే ఎలా నిర్ణయం తీసుకుంటాడు? శశికళను అడగాలి.

ఆలోచిస్తుండి పోయాడు మోహన్.

చివరికి ఓ నిర్ణయానికి వచ్చాడు. అతని మనస్సులో తనని కౌగలించుకున్న గ్రీకు స్త్రీ మెదిలింది. ప్రాణాపాయంలో పడ్డ ఆనందుడు గుర్తొచ్చాడు. నెయ్యి ఇష్టంలేని రాజుకు నెయ్యి ఔషధంగా ఇచ్చి ప్రాణాలు అరచేతపట్టుకుని తప్పించుకున్న సంఘటన గుర్తుకువచ్చింది. ఇప్పుడు తాని తన పరిశోధన ఫలితాలనేకాదు, తన పరువు ప్రతిష్టలనూ కాపాడుకోవాలి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here