శ్రీపర్వతం-60

0
7

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం’ అనే చారిత్రక నవలలో ఇది 60వ భాగం. [/box]

[dropcap]ఆ[/dropcap]మె ఎంత సేపటికీ ఏమీ అనకపోవటంతో ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూశాడు మోహన్.

ఆమె మౌనంగానే ఉంది.

మోహన్ మోనంగా లేచి నిలుచున్నాడు.

“వెళ్తాను” అన్నాడు. అతడి కంఠం జీరగా ధ్వనించింది.

“ఎక్కడికి?” అడిగిందామె మృదువుగా.

మోహన్ మాట్లాడలేదు.

అతడికి వెళ్లాలని లేదు, కానీ బలవంతాన వెళ్తున్నట్టుంది అతడి ప్రవర్తన.

“మన రీసెర్చి రిపోర్టు ఏం చేద్దామనుకుంటున్నావు.”

“నువ్వెలా చెప్తే అలా!” నిరాశగా ఉంది అతని స్వరం.

“మోహన్, నువ్వు నేను మనిద్దరం ఒకరికి ఒకరం తెలుసు. కాని కలసి బ్రతకటం అనే నిర్ణయం అంత త్వరగా తీసుకోవటం కుదరదు. మగవారి సంగతి వేరు. కానీ ఆడవాళ్ళు అంత తొందరగా హడావిడిగా నిర్ణయం తీసుకోవటం కష్టం. ఈ విషయం గురించి మనం కలసి ఆలోచిద్దాం. నీ గురించి నాకయితే మంచి అభిప్రాయం ఉంది. నువ్వు మంచి వాడివి. సంస్కారవంతుడివి. తెలివైనవాడివి.”

“నేనే తొందరపడ్డానేమో” ఆలోచిస్తూ అన్నాడు మోహన్.

“ఈ ప్రసక్తి మన మధ్య ఎప్పుడో రాకతప్పదు. వచ్చింది. ఆలోచిద్దాం. ఇంతకు మన రీసెర్చి గురించి నీ ఆలోచన ఏమిటి? ”

“ఇలాంటివి కామన్ అంటున్నారు. కానీ నాకు నచ్చటం లేదు. మరో మార్గం తోచటం లేదు.”

“ఒక మార్గం ఉంది.”

ఆమె వైపు చూశాడు మోహన్.

“మనిద్దరం ఎంగేజ్‌మెంట్ ప్రకటిస్తే… నేను రీసెర్చి మధ్యలో వదిలేసినందుకు నువ్వు ఏదో చేయటం కారణం అన్న వివాదం సమసిపోతుంది.”

మోహన్ ఆశ్చర్యంగా చూశాడామె వైపు.

ఇందాకే ఆలోచిచుకోవాలంది. ఇపుడేమో ఎంగేజ్‌మెంట్ ప్రకటిద్దాం అంటోంది.

అంతలో అతనికి తట్టింది.

ఆమెకి తనంటే ఇష్టమే. కాని అది స్పష్టంగా చెప్పదలచుకోలేదు.

ఆమెకి తనని వదులుకోవాలని లేదు. కానీ అంత త్వరగా ఒప్పుకున్నట్టు కనబడకూడదు.

అతడి పైదవులపై చిరునవ్వు నిలచింది.

‘మానవ మనస్సు ఎంత విచిత్రమైనది!’ అనుకున్నాడు.

“సెక్రటరీ పేరేమిటి” అడిగింది.

చెప్పాడు మోహన్.

ఆమె నవ్వుతూ ఫోను కలిపింది.

“నాన్నా… జలోటా నీకు తెలుసు కదు!”  అడిగింది

ఆవైపు సమాధానం విని నవ్వింది.

నెమ్మదిగా, స్పష్టంగా మోహన్ తనకు చెప్పిందంతా చెప్పంది.

ఆవైపు అన్నది విన్నది.

“సరే” అంది.

మోహన్ వైపు తిరిగి అంది.“అది పెద్ద సమస్య కాదు. నాన్న మేనేజ్ చేస్తారు. అయితే ఇంకా నా రిపోర్టు పూర్తి కావాలి” అంది.

“నాన్న ఎలా మేనేజ్ చేస్తారు?” అడిగాడు మోహన్.

“అది నాన్న చూసుకుంటారు. ముందు నిన్ను నాన్నకి పరిచయం చేయాలి” అంది.

“ఎప్పుడు? మన సాన్నిహిత్యం తెలిస్తే మనకు సహాయం చేస్తారా?”

“నీకు నాన్న గురించి తెలియదు. ఆయన ఎలాంటి అన్యాయం సహించరు. హి ఈజ్ వెరీ సిన్సియర్, సిస్టమెటిక్, అండ్ స్టబర్న్” అంది.

“కూతురు లాగే” అన్నడు మోహన్ నవ్వుతూ.

 ఇద్దరూ నవ్వారు.

“సాయంత్రం” అంది శశికళ.

(ముగింపు త్వరలో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here