శ్రీపర్వతం-7

0
5

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 7వ భాగం. [/box]

13

[dropcap]డి[/dropcap]సెంబరు నెల ముందుకు సాగిన కొలదీ హేమంతం విజృంభించింది. తవ్వకాలలో మోహన్‌కి, శశికళకి ఏ విధమైన అవశేషాలు లభించలేదు. ప్రతి ట్రెంచిని సహజమైన మట్టి పొర చేరేవరకు తవ్వారు. సహజమైన పొరను చేరేముందు ఎండిపోయిన మొక్కల వేళ్ళు దొరికాయి. ఆ విధంగా ప్రతి ట్రెంచి అడుగునా అవి ఉన్నాయి. ఒకప్పుడు వాళ్ళు చాల సంతోషించేవాళ్ళు. లోయలో పని చేస్తున్న స్కాలర్లతో వాళ్ళకు క్రమంగా పరిచయం కలిగింది. ఆ స్కాలర్లు చేయి వేసిన చోటులో, అమూల్యమైన అవశేషాలు బయటపడుతున్నాయి. క్యూరేటరు ప్రసాద్‌తో స్నేహం నెలకొన్న దగ్గర నుండి వాళ్ళకు కొత్త కొత్త విశేషాలు తెలుస్తున్నాయి. ఆయన ఒకటే మాట అన్నారు.

“మోహన్! శశికళా! మీరు వేరు మేము వేరని భావించకండి. మీ సైటు కూడా విజయపురిలోనిదే. శ్రీపర్వతప్రాంతంలోనిది. ఇక్ష్వాకులతో సంబంధమున్నది. మీరు తవ్వకాలలో ఏవి బయట పెట్టినా, అవి మాత్రం వారి చరిత్రనే వివరిస్తాయి. కాబట్టి, మీరు, ఈ లోయలోని తవ్వకాలను మీవిగానే భావించుకోండి. నాగార్జున సాగర్ డామ్ చాల తొందరగా ముగింపు దశకు చేరుకుంటున్నది. నాగార్జునకొండ మీద కొత్త మ్యూజియం నిర్మాణానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి….”

మధ్యలో ప్రసాద్ మాటలు ఆపేశారు.

కొంచెం సేపు ఆలోచించారు.

“మన మ్యూజియంలో నాలుగు రోజుల తరువాత ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం ఇక్కడే లంచి. స్కాలర్లు సావకాశంగా, తాము పడ్డ కష్టాలు, సాధించిన విజయాలు ఇక్కడ చర్చించుకుంటారు. వాళ్ళలో కొంతమంది మీకు తెలుసు. మీకు సహాయం చేయగలిగిన వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. వాళ్ళతో మీరు కూడా చర్చించండి. ఒక ప్రణాళికను ఏర్పరచుకోండి. ఆ ప్రకారం పని చేయండి.”

ఈ సలహా ఇద్దరికీ నచ్చింది.

ఆ రాత్రి భోజనమైన తరువాత, శశికళ, మోహన్, తాము చేసిన పనిని పునర్విమర్శించుకున్నారు. ఏ పనీ కూడా ఒక కొలిక్కిరాలేదు.

డిసెంబరు నెల, పధ్నాలుగో తారీకు, సోమవారం నాడు, మ్యూజియం దగ్గిర హడావుడిగా ఉంది. మాచర్ల నుండి వంటసామాన్లు, సరుకులు వచ్చాయి. వంటవాళ్ళు వచ్చారు. తొమ్మిదయేసరికి ఫలహారాలు ముగిశాయి. మ్యూజియంలో సభ ఏర్పాటయింది. ఆనాటి సభకు డాక్టర్ సుబ్రహ్మణ్యంగారు అధ్యక్షత వహించారు. స్కాలర్లు ఒకరూ ఒకరూ, తాము వ్రాసిన పేపర్లు చదివారు. నాగార్జున కొండలోయలో తమ అనుభవాలను తెలియజేస్తూ వారు వ్రాసినవి చదివారు. వర్థమాన శాస్త్రవేత్తలను సుబ్రహ్మణ్యంగారు ఆశీర్వదించి, పని ఉండడం చేత జీపులో గుంటూరు వెళ్ళిపోయారు.

మధ్యాహ్నం రెండున్నరకు స్కాలర్లు పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే, క్యూరేటరు ప్రసాద్, వారిలో ముగ్గిరిని మరో టేబిల్ దగ్గరికి పిలిచారు. మోహన్, శశికళ అప్పటికే అక్కడ కూర్చున్నారు. కొత్త వాళ్ళు రావడంతో కూర్చున్న వాళ్ళు లేచి నిలుచున్నారు.

“మనం ఒకరి ముఖాలు ఒకరం చూసుకుంటున్నా, సరియైన పరిచయం జరగలేదని నేను భావిస్తున్నాను. ఈ ముగ్గురూ నా సహచరులు. ఇతడు కృష్ణమూర్తి, ఇతడు కార్తికేయ శర్మ, ఇతడు కృష్ణారావు, నేను ప్రసాద్‌ని, వీళ్ళు డాక్టర్ మోహన్, డాక్టర్ శశికళ.”

పరిచయాల తరువాత ఆరుగురూ టేబిలు చుట్టూ కూర్చున్నారు. కాఫీలు తెప్పించి తాగిన తరువాత వాళ్ళు మాట్లాడుకోడానికి ఉపక్రమించారు.

“డాక్టర్ మోహన్ ఉస్మానియా విశ్వవిద్యాలంలో లెక్చరరుగా పని చేస్తున్నారు. డాక్టర్ శశికళ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ, స్పెషల్ ప్రాజెక్టు కింద, సైటు నంబరు పదిహేడుకి ఉత్తరంలో, కొండవాలులో, ఒక స్థలంలో తవ్వకాలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఒక నెల్లాళ్ళ బట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఇంతవరకు చెప్పుకోదగ్గ వస్తువులు బైటపడలేదు. తవ్వకాలు సాగుతుండగా, వీరు చాల విషయాలు తెలుసుకోవలసి ఉంది. ఏవైనా అవశేషాలు బయట పడితే, వాటికి, మనం చేస్తున్న తవ్వకాలకు సంబంధం తెలుస్తుంది. వీరికి మనం అన్నివిధాలుగా మార్గదర్శకులం కావాలి. మీ అభిప్రాయమేమిటి?”

ప్రసాద్ తన మిత్రుల ముఖాలలోకి చూశారు. వాళ్ళు తలలూపి తమ అంగీకారం సూచించారు. తిరిగి ప్రసాద్ మాట్లాడడం మొదలు పెట్టారు.

“నేను నాగార్జున కొండలోయలోని తవ్వకాల గురించి చెప్పవలసి వస్తే, ముందు పరిచయవాక్యాలు వినిపిస్తూ ఉంటాను. ఈ సంగతులు మీకు తెలిసి ఉండవచ్చు. మా మిత్రులకివి బాగా తెలుసు. మరోసారి సావకాశంగా వినండి.”

“మన నాగార్జునకొండ లోయ చంద్రవంకవలె ఉంది. ఇది గుంటూరు జిల్లాలో, పల్నాడు తవ్వకాలో, మాచర్ల పట్టణానికి పన్నెండున్నరమైళ్ళ దూరంలోను, గుంటూరుకి తొంభై రెండు మైళ్ళ దూరంలోను, హైదరాబాదుకి నూట నాలుగు మైళ్ళు దూరంలోను ఉంది. లోయ వైశాలం ఎనిమిది చదరపు మైళ్ళు, ఉత్తర దక్షిణాలకు మూడు మైళ్ళ ఆరు ఫర్లాంగులు ఉంది. కృష్ణా నదికి సమీపంలో ఉన్న ప్రాంతం సముద్రపు మట్టానికి రెండ వందల ఏభై అడుగుల ఎత్తులో ఉంది. ఫిరంగి మోటు దగ్గిర ఎనిమిది వందల పది అడుగుల ఎత్తు ఉంది. ఎద్దున మోట దగ్గిర ఆరు వందల పది అడుగుల ఎత్తు ఉంది. పుల్లారెడ్డి గూడెం దగ్గిర నాలుగు వందల ముప్పై అడుగులు ఎత్తు, నాగార్జున కొండ సముద్రపు మాట్టానికి ఒక వేయి ఇరవై అయిదు అడుగులు ఎత్తు ఉంది. జలాశయంలో పూర్తిగా నీళ్ళు నిండితే డామ్ దగ్గర అయిదువందల తొంభైనాలుగు అడుగులు లోతుంటుంది. నాగార్జున కొండ ఈ పరిస్థితులలో నలబై ఆరు అడుగులు మిగులుతుంది. నాగార్జున కొండ లోయలో వర్షపాతం తక్కువే అని చెప్పుకోవాలి. సంవత్సరంలో మొత్తం మీద ఇరవై అంగుళాల నుండి డెబ్బై అంగుళాల వరకు ఉంటుంది. ఆంధ్రదేశంలో అత్యధిక తాపమానం రెంటచింతలలో నమోదవుతుంది. తరువాత గణింపదగ్గది నూట ఇరవై డిగ్రీలవరకు ఉష్ణోగ్రత ఉంటుంది. శీతాకాలంలో అత్యల్పమైన ఉష్ణోగ్రత డెబ్బై డిగ్రీలు.”

“ఈ లోయను మాలో రెండు భాగాలుగా విభజించారు. ఫిరంగి మోటు నుండి పెద్ద కుందేళ్ళ గుట్ట వరకు ఒక గీత గీస్తే పైనుండేదే ఉత్తర భాగం, దిగువది దక్షిణ భాగం. తరువాత, ఈ భాగాలను సెక్టారులుగా విభజించారు. ఒకొక్క సెక్టరు రెండు వేల అడుగుల పొడవు, రెండువేల అడుగుల వెడల్పు ఉంటుంది. సెక్టరును తిరిగి డివిజన్ల కింద విభజించారు. ఒక డివిజను నూరడుగులు పొడవు, నూరడుగులు వెడల్పు ఉంటుంది. ఆ విధంగా సెక్టరుకి వందల డివిజనులు. ఒకొక్క డివిజనులో ఇరవై అడుగులు పొడవు, ఇరవై అడుగులు వెడల్పు గల ట్రెంచ్‌లు, పాతిక చొప్పున తవ్వారు. క్రమపద్ధతిలో లోయనంతా జల్లెడ పట్టడం జరిగింది.”

అందరూ చాల శ్రద్ధతో వింటున్నారు.

“ఈ అయిదు సంవత్సరాలలో ఇరవై సంవత్సరాలలో చేయవలసిన తవ్వకాలు జరిపాం. ఈ తవ్వకాలలో ఒక మహానగరం బయటపడింది. నగరాన్ని ఒరుసుకుంటూ కృష్ణానది ఉత్తర వాహినిగా పారుతున్నది. కృష్ణకు కుడిగట్టున విజయపురి ఉంది. విజయపురికి తూర్పు భాగంలో శ్రీ పర్వతముంది. బ్రాహ్మణ దేవాలయ సముదాయాలు, నదిగట్టున, ఉత్తరం నుండి దక్షిణం వరకు వ్యాపించి ఉన్నాయి. బౌద్ధుల కట్టడాలు విజయపురికి తూర్పు భాగంలో శ్రీపర్వతం వేపు ఉన్నాయి. హారీతి ఆలయం మాత్రం ఫిరంగి మోటు కొండపై ఉంది. రమారమి పందొమ్మిది దేవాలయ సముదాయాలు, ముప్పై రెండు బౌద్దుల కట్టడాలు తవ్వకాలలో బయటపడ్డాయి. ఇవికాక, సామాన్యుల గృహాలు, ధనికుల నివాసాలు, (విశ్రాంతి మందిరాలు) దుర్గం, క్రీడాగంణం, సమావేశ మండపం, శకుల వినోదగృహం, దారివక్కనుండే విశ్రాంతి గృహాలు, స్నానశాలలు, దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న నూతులు, వాననీటిని నిలిపే ఆయకట్టలు, ఫిరంగి

మోటునుండి కృష్ణ వరకు పారేకాలువ, రాజమార్గం, వీధులు, సందులు, స్వర్ణ కారుడి గృమం, ఈ విధంగా ఎన్నో బయట పడ్డాయి.”

ప్రసాద్ ఒక క్షణం చెప్పడం ఆపి, తిరిగి చెప్పడం మొదలు పెట్టారు.

“మీరు, వీటన్నిటినీ ఒక క్రమంలో దర్శించాలి. బ్రాహ్మణ దేవాలయాలను వేరుగా, బౌద్ధుల కట్టడాలను వేరుగా, ఎంతో మంది సంఘటితంగా చేయవలసిన పని ఇది. సమగ్రంగా వీటినన్నిటిని చూసి వచ్చిన తరువాత అందరం కలిసి చర్చలు జరుపుదాం. కృష్ణమూర్తి బౌద్ధం గురించి, బౌద్ధుల కట్టడాల గురించి, శిల్పం గురించి విశదీకరిస్తారు. కార్తికేయ శర్మ బ్రాహ్మణ దేవాలయాల గురించి చెప్తారు. కృష్ణారావు విశ్రాంతి గృహాల గురించి, వినోద గృహాల గురించి, నగర నిర్మాణం గురించి నేను చెప్తాను. ఇది మూడు నెలల పని. మీరు కొంతకాలం ఈ విధంగా వినియోగిస్తే మీ శ్రమ ఫలిస్తుంది.”

ఈ ప్రణాళిక అందరికీ నచ్చింది. సోమవారం నాడు స్వంత పనులుంటాయి. అందుచేత స్కాలర్లతో చర్చలు వాళ్ళు పెట్టుకోదలచుకోలేదు.

మ్యూజియం నుండి తిరిగి వచ్చిన తరువాత, మోహన్, శశికళ తమతమ టెంట్లలో కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నారు. సాయంకాలం చీకటి పడుతుంటే సుబ్రహ్మణ్యేశ్వరరావు వచ్చాడు. అతడు మాచర్లనుండి తిన్నగా అక్కడికి వచ్చాడు. అతడో శుభవార్త తెచ్చాడు. మాచర్ల అమ్మాయితో వివాహం నిశ్చయమయిందని, తాంబూలాలు పండుగ వెళ్ళిన తరువాత మాఘమాసంలో పుచ్చుకుంటున్నట్లు చెప్పాడు.

“మరి పెళ్ళి ముహూర్తం ఎప్పుడు పెట్టించారు?” శశికళ ప్రశ్నవేసింది.

“చాల దూరమే!” అన్నాడు మోహన్

“తప్పదు. ఈ సంవత్సరం పంటమీద వచ్చే ఆదాయం, వచ్చే సంవత్సరం వచ్చే ఆదాయం కలిపితేకాని పెళ్ళి ఖర్చులకు డబ్బు సరిపోదని వాళ్ళన్నారు. ఏం చేయడం మరి?”

“మధ్య మధ్య మీరిద్దరూ కలిసి మాట్లాడుకోడానికి వాళ్ళు ఒప్పుకున్నారా?” అడిగింది శశికళ.

“దానికి అభ్యంతరం లేదన్నారు.”

జావా పాలు తెచ్చింది. శశికళ కాఫీ తయారు చేసింది. ముగ్గురూ సావకాశంగా కాఫీలు తాగిన తరువాత, ప్రసాద్‌తో జరిగిన సంభాషణ గురించి రావుతో మోహన్ చెప్పాడు.

“గ్రీకుల గురించి శశికళ, మంత్రాలు, తంత్రం, అవ్వమేధం మొదలయిన విషయాల గురించి మోహన్ చెప్పవలసి ఉంది. సోమవారం సాయంకాలాలలో వాటి గురించి తెలుసుకోవచ్చు. మీతో పాటు, వీలయినప్పుడల్లా, నేను కూడా సైట్లను చూడడానికి వస్తాను. ఈలోగా మన సైటులో ఏవైనా బయట పడితే, మనం కోటలో పాగా వేసినట్లే.”

ఈ ప్రణాళికను కూడా మోహన్, శశికళ అంగీకరించారు.

“ముందున్నది మహాయజ్ఞం” అన్నాడు రావు.

14

సోమవారం మధ్యాహ్నం లంబాడీ గూడెం దగ్గిర టెంట్లలో విధిగా ఏదో విషయం చర్చకు వస్తుంది. సాధారణంగా భోజనాలు ఒంటిగంటకు అయిపోతాయి. రెండు గంటలు విశ్రాంతి తీసుకొని వాళ్ళు ముగ్గురూ మోహన్ టెంటులో కూర్చుంటారు. హైదరాబాదు నుంచి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మనిషి, పళ్ళు తీసుకుని వచ్చేవాడు. వాటిని తినడానికి అప్పుడు వాళ్ళకు వీలుచిక్కేది.

చలికాలం రోజు రోజుకూ విజృంభిస్తున్నది. క్రిస్టమన్ ఇంకా నాలుగే రోజులుంది. టెంట్లలో కొంచెం వెచ్చగనే ఉండేది.

సుబ్రహ్మణ్యేశ్వరరావు ముందు ప్రస్తావించాడు.

“లాంగ్ హార్స్‌ట్ దొరగురించి, అతని తవ్వకాల గురించి కొంత వరకూ చెప్పారు. మిగిలిన విషయం చెప్పడానికి వాయిదాలు వేస్తూ వచ్చారు. అతని అనుభవాలు, 1938లో తవ్వకాలు జరిపిన రామచంద్రన్ గారి అనుభవాలు చెప్తే బాగుంటుంది.”

శశికళ కూడా తల ఊపింది.

మోహన్ చెప్పడం మొదలు పెట్టాడు.

“టిబెట్టులో పురాతన కాలం నుండి ఒక సంగతి వ్యాప్తిలో ఉంది. బౌదాచార్యులలో ప్రసిద్ధులైన నాగార్జునుడు, శ్రీపర్వతం మీద ఉన్న ఒక విహారంలో తన చివరి జీవితం గడిపాడని వారు నమ్ముతారు. శ్రీ పర్వతం లేక ఛుల్ల ధమ్మగిరి పైనున్న విహారంలో అతడు నివసించి ఉండవచ్చు. అందుచేతనే నాగార్జునకొండ అన్న పేరు వచ్చి ఉండవచ్చు. కాని, నాగార్జున కొండ అన్న పేరు ఇక్కడ లభించిన శాసనాలలో ఎక్కడా కనిపించలేదు. శ్రీ పర్వతం, విజయపురి అన్న పేరులే వీటిలో ఉన్నాయి.

అమరావతీ స్తూపానికో పిట్టగోడ ఉంది. అది చాలా ప్రఖ్యాతి పొందినది. అక్కడ లభించిన శాసనాలలో, ఆ పిట్టగోడ నిర్మాణంలో నాగార్జునాచార్యుల ప్రసక్తి చాల చోట్ల ఉంది. ఈ పిట్టగోడ క్రీస్తు శకం రెండు, మూడు శతాబ్దాలలో నిర్మింపబడింది. ఈ సంగతి నిజమయితే, నాగార్జున కొండ లోయలో ఉన్న ఛుల్లధమ్మగిరిపై బౌద్ధవిహారాలు కొత్తగా లేస్తున్నప్పుడు, ఆచార్య నాగార్జునుడు అక్కడ ఉండి ఉండవచ్చు.

ఛుల్ల ధమ్మగిరిపైన సీహళవిహారం నిర్మింపబడింది. విహారానికి ఎదురుగా చైత్య గృహముంది. ఇది సింహళం నుండి వచ్చి శ్రీ పర్వతంపై స్థిరపడిన బౌద్ధులు ఆశ్రయమిచ్చినది. దీనిని బట్టి, కృష్ణానది లోయలో ఉన్న బౌద్ధులకు, సింహళ బౌద్ధులకు స్నేహ సంబంధాలు ఉండేవని నిశ్చయమవుతుంది. సింహళ విహారం నాగార్జునకొండకు అభిముఖంగా, లోయలో చాల ఎత్తైన ప్రదేశంలో కట్టబడింది. సింహళ దేశానికి, కృష్ణానది లోయకు మధ్యన వ్యాపారం జరుగుతుండేది. ఈ వ్యాపారమే, కృష్ణానదిలోయలో బౌద్ధం వర్ధిల్లడానికి మూలకారణం. ఈ వ్యాపారస్తులలో చాలామంది బౌద్ధులుగా మారారు. లేక బౌద్ధాభిమానులుగా మారారు. రాజకుటుంబంలోని స్త్రీలు బౌద్ధాన్ని అభిమానించి విహారాలను చైత్యాలను స్తూపాలను లోయలో నిర్మించడానికి కారణభూతులయారు.

లాంగ్ హార్స్‌ట్ దొర తవ్వకాలు మొదలు పెట్టినప్పుడు లోయ పరిస్థితి చాల అన్యాయంగా ఉండేది. నాగార్జునకొండ లోయలోని కట్టడాలను, ముఖ్యంగా బౌద్ధుల కట్టడాలను నిర్దాక్షిణ్యంగా ధ్వసం చేశారు. డబ్బు కోసం ఆశపడిన దొంగలు చేసిన పని కాదది. ఎన్నో స్తంభాలు, విగ్రహాలు శిల్పాలు ఏ దురాత్ముల చేతుల్లోనే విరిగి, ముక్కలై అక్కడ గృహనిర్మాణం కోసం కట్టడాలను పడగొట్టి రాళ్ళను ఉపయోగించుకోడం జరిగింది. కాని నాగార్జునకొండలోయలో ఈ విధమైన విధ్వంసం జరగడానికి అవకాశం లేదు. లోయలోకి బళ్ళు రావు, లోయను విడిచి పైకి పోలేవు.

జన ప్రవాదమేమంటే శంకరాచార్యులు తన అనుయాయులతో లోయలోకి వచ్చి బౌద్ధుల కట్టడాలను విగ్రహాలను ధ్వంసం చేశారని. ఈ లోయలోని పంట భూములు శంకరాచార్యులకు దానం చేయబడ్డవి. పుష్పగిరిలో ఉన్న శంకరుని అనుయాయులనుండి లాంగ్ హార్స్‌ట్ తవ్వకాలకు అనుమతి తీసుకున్నారు.

నాగార్జున కొండలోయలో లభించిన శాసనాలను బట్టి, క్రీస్తు పూర్వం రెండు, మూడు శతాబ్దులలో, పురాతన నగరమైన విజయపురి, బౌద్ధుల నివాసాలలో చాల పెద్దదే కాక, దక్షిణ భారతంలో గొప్ప యాత్రాస్థలం, పెద్ద విద్యాకేంద్రం. యాత్రికులు, పర్యాటకులు భారత దేశంలోని అన్ని ప్రాంతాలనుండి విజయపురి వచ్చేవారని, సింహళంనుండి, చైనా దేశం నుండి కూడా వచ్చేవారని తెలుస్తుంది.

నాగార్జున కొండ లోయలో బయట పడిన శిథిలాలు అంటే స్తూపాలు, విహారాలు, గజపృష్ఠాకార ఆలయాలు, మండపాలు, రాజభవనముండే స్థలం ఒకటి, కృష్ణానదీ తటాన్న రాతితో కట్టిన బల్లకట్టు రేవొకటి (ఇది సర్వదేవాది వాసమని తరువాత తవ్వకాలలో తెలిసింది.) ఇవన్నీ నీటి అవశేషాలే. స్తూపాలు, విహారాలు, ఆలయాలు పెద్ద ఇటుకలతో కట్టినవి. కాల్చిన ఇటుకలను మట్టితో కట్టడాలుగా కట్టి, గోడలపై చెక్క సున్నం దళసరిగా చేశారు. గోడలకు సున్నం వేశారు. వాటిపై చిత్రించడానికి వీలుకలిగేది. కట్టడాల స్తంభాలు, నేలలు, ముఖ్యమైన శిల్పాలు, గోధుమ వర్ణంలో ఉన్న సున్నపు రాతితో చేసినవి. ఈ రాయి చలువరాతిని పోలి ఉంటుంది. ఈ రాతిని చెక్కడ సులువు. ఈ రకం రాయి తప్ప మరేదీ అక్కడ ఉపయోగించలేదు. ఈ రాతిని నదీ మార్గం గుండా అక్కడికి తెచ్చేవారు. రాతితో కట్టిన పడవరేవు దగ్గిర ఆగేవి. అక్కడ నుండి ఈ రాళ్ళను లోపలికి తరలించేవారు. ఈ బల్లకట్టు రేవు పొడవు 250 అడుగులు, దీని వెడల్పు 50 అడుగులు. నది అంచున 6 అడుగుల ఎత్తులో ఉంది. ఈ శిథిలాలు ఆనాటికి కూడా నిలిచి ఉన్నాయి. ఈ చివరి నుండి ఆ చివరి వరకు మూడు వరుసల స్తంభాలున్నాయి. విరిగిన స్థితిలో అక్కడ విరిగిన పెంకుముక్కలేవీ కనపడలేదు. అందుచేత పై కప్పు కర్రతోనో, పూరి గడ్డితోనో ఉండి ఉండవచ్చు. ఈ పొడవాటి కట్టడం సరుకుల గిడ్డంగిగా ఉండవచ్చునని, సుంకాలు వసూలు చేసే రేవని లాంగ్ హార్స్‌ట్ అభిప్రాయపడ్డారు. లోయలోకి రాకపోకలు జరపడానికి భూమార్గాలు లేనందున, నదీ ప్రయాణానికి ఈ రేవు చాల ఉపకరించి ఉండవచ్చునని అతను అభిప్రాయపడ్డారు. లాంగ్ హార్స్‌ట్ రెండు ఎడ్లబళ్ళను శిథిలమైన స్థితిలో లోయలోకి తెచ్చి, వాటిని బిగించి, ఆ బళ్ళను లోయలోని శిల్పాలను ఒక చోటనుండి మరొక చోటికి తరలించడానికి ఉపయోగించారని ఇంతకుముందు మీకు చెప్పినట్లు జ్ఞాపకం. దక్షిణ భారతంలో అత్యధిక సంఖ్యలో లభించిన శిల్పాలు, విగ్రహాలు నాగార్జున కొండలోయకు చెందినవే. అయిదు వందలకు పైగా శిల్పాలు లభించాయి. వీటిలో గొప్పదనమేమంటే, ఆ శిల్పాలన్నీ చాల మంచిస్థితిలో దొరికాయి. చాల చక్కగా ఉన్నాయి.

నాగార్జున కొండలోయలో లభించిన బౌద్ధుల ఆలయాలు గజపృష్ఠాకారంలో నిర్మింపబడినవే. ఇవి దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. ఒకవేపు ద్వారముండి, రెండవ చివర వంపు దేరిన గోడతో మూసివేయబడ్డవి. ఈ చైత్యగృహాలన్నీ ఇటుకతో, చాల మందంగా కట్టబడినవి. ఈ గోడలు ఎత్తుగా ఉంది, పైకప్పు పీపావంపు వలె ఉంటుంది. తలుపు మూస్తే, లోపల కొంచెం చీకటిగా ఉంటుంది. గోడలు లోపలి వైపు నున్నగా ఉండి సున్నపు పూత పూయబడినవి. లోపలినేల, మెట్లు, రాతితో చెక్కబడినవి. లోపలికి ప్రవేశించేటప్పుడు ఎదురయే ముందుమెట్టు అర్ధచంద్రాకారంలో తయారయిన అలంకారాలు చెక్కకుండా సాదాగా ఉంటుంది. ఆని, ఒక్క ఆలయంలో ఈ ముందు మెట్టు పై అంచు మీద సింహాలు, గుర్రాలు, ఆబోతులు ఒకదాని వెంట ఒకటి ఉన్నట్లు ఉబ్బెత్తుగా చెక్కబడి ఉన్నాయి. భారతదేశంలో ఈ చంద్రకాంతశిలల మీద అంతగా శిల్పాలు చెక్కలేదు. సింహళంలో మాత్రం ఇటువంటి వాటిమీద అత్యధిక సౌందర్యం కల అలంకారాలు చెక్కారు. ఈ బౌద్ధాలయాలు ఏ దిక్కువేఏనా ముఖం ఉన్నట్లు కట్టబడ్డాయి. తూర్పువేపు ముఖం ఉండాలని పట్టింపు వీరికి లేనట్లు కనిపిస్తుంది.

మహాస్తూపానికి సమీపంలో కుడి వేపున ఒక చైత్యముంది. తవ్వకాలకు పూర్వం ఒక దిబ్బ, దానిమీద మొక్కలు, అక్కడుండేవి. తవ్వకాలు జరిగిన తరువాత, ఈ చైత్యం ఛాంతిసిరి కట్టించినది నేలపై చెక్కిన శాసనం వల్ల తెలిసింది. ఈ చైత్యం యొక్క పైకప్పు కూలి లోపల పడుతూ గోడలను పడగొట్టింది. కట్టడం యొక్క అడుగు భాగం మాత్రం చెడిపోకుండా ఉంది. రాతి పలకలు తాపిన నేలమీద చెక్కిన శాసనం మాత్రం చెడిపోకుండా ఉంది. ఈ చైత్యం ఉత్తర ముఖంగా ఉంది.

నల్లరాళ్ళ బోడుకి ఉత్తర దిశను క్రింది భాగంలో విహారమొకటి ఉంది. ఈ విహారంలో గజపృష్ఠాకారంలో ఉన్న రెండు చైత్యాలు, ఒకదానికొకటి అభిముఖంగా ఉన్నాయి. వీటిలో ఒక దానియందు బుద్ధుడు విగ్రహాలు విరిగినవి రెండు లభించాయి. ఒక విగ్రహం ఎనిమిదడుగులుంది. రెండవది సరియైన ఎత్తుకే ఉంది. దురదృష్టవశాత్తు, నిలబడిన ఈ పెద్ద విగ్రహం యొక్క శిరస్సు, చేతులు, కాళ్ళు మాత్రం లేవు. విగ్రహం యొక్క మొండెం చూస్తే, ఈ విగ్రహం చాల చక్కగా మలచబడినదని తెలుస్తుంది.

సహరాళ్ళబోడు గుట్టమీద రెండు శిరస్సులు, సరియైన మానవ శరీరపరిమాణంలో ఉన్నవి లభించాయి. కాని ఇవి ఏ కట్టడానికి చెందినవో చెప్పడం కష్టం. ఆ రెండు శిరస్సులలో ఒకటి బుద్ధుడిది కాదని తెలుస్తుంది. అప్పటికి లభించిన విగ్రహాలు శిరస్సులకన్న ఇది భిన్నంగా ఉంది. తలకు కుళ్ళాయి ఉంది. బహుశా ఈ శిరస్సు ఏ ప్రఖ్యాతుడైన బౌద్ధాచార్యునికో చెంది ఉంటుంది. అతడు ఈ ప్రాంతాలలో నివసించిన వాడయి ఉంటాడు. ఈ శిరసు మహామహుడైన ఆచార్య నాగార్జునుడిదై ఉండవచ్చు.

సాధారణంగా విహారాల ఆవరణలలో చైత్యాల నిర్మాణం జరిగింది. ప్రతి విహారానికి దానిదైన చైత్యం ఉండడం మనం చూస్తాం. అంతేకాక ప్రతి విహారంలో చిన్న పూజాస్తూపం కూడా కనిపిస్తుంది..

నాగార్జునకొండ లోయలో ఉన్న బౌద్ధ విహారాలు స్వయం సంపూర్ణమైనవి. ప్రతి ఆవరణలోను బౌద్ధ భిక్షువులు నివసించే విహారం ఉంటుంది. ఒక చైత్యగృహం లేక ఆలయం ఉంటుంది. ఒక పూజాస్తూపం ఉంటుంది. విహారంలో ఒక దీర్ఘ చతురస్రాకారమైన పెరడు ఉంటుంది. దాని చుట్టూ ఇటుకలతో కట్టిన గోడ ఉంటుంది. విహారం మధ్య భాగంలో స్తంభాలపై లేచిన చతురస్రాకార మండపం ఉంటుంది. దీని పైకప్పు కర్రతో చేసినది. ఈ మండపానికి, గోడలకు తగులుతూ గదుల వరుస ఉంటుంది. ఈ గదుల వరుసకు మందు ఒక వరండా ఉంటుంది. ఈ గదులలో బౌద్ధ భిక్షువులు నివసిస్తారు. వీటిలో కొన్నింటిని సామాను గదులుగా వినియోగిస్తారు. కొన్ని గదులు పూజకు ఉపయోగిస్తారు. సాధారణంగా ఒక పెద్ద గది మాత్రం భోజనశాలగా నియుక్తమవుతుంది. ఈ ప్రాంతాలలో పెంకులేవీ దొరకలేదు. కాబట్టి ఈ విహారాల పైకప్పులు, కర్ర పలకలతోను, చొప్పతోను తయారయనవయి ఉంటాయి.

సీహళ విహారానికి చెందిన ఒక గదిలో బహు సంఖ్యలో సీసపు నాణాలు లభించాయి. ఇవి ఆ కాలంలో వ్యాప్తిలో ఉన్న ఆంధ్రనాణాల వలె కనిపించాయి. నాణాలే కాక సీనపు లోహపు ముద్ద, నాణాలు తయారుచేసే మట్టి అచ్చు దిమ్మలు లభించాయి. దీనిన బట్టి భిక్షువులు తమకు కావలసిన నాణాలను తామే తయారు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాంతం నుండి పెద్ద తిరుగలి దిమ్మ సున్నపురాతితో చేసిన బుద్దుని చిన్న ప్రతిమ, చక్కని అలంకారాలుగల కుండలు, చూరు నీళ్ళు పారే, కాల్చిన మట్టి గొట్టం, కొన్ని స్త్రీల బొమ్మలు లభించాయి.

లాంగ్ హార్స్‌ట్ దొర తవ్వి బయటికి తీసిన రెండవ విహారం అంత పెద్దదికాదు. కాని తీరుగా అమర్చిబడినదీ కట్టడం. వెనుకనున్న అంగనంలో రెండు గజపృష్ఠాకారంలో ఉన్న చైత్యాలు, ఒకదానికొకటి అభిముఖంగా ఉన్నవి వెలువపడ్డాయి. మధ్యన మండపం, చుట్టూ గదుల వరుసలు బయట పడ్డాయి. తూర్పుకున్న ద్వారం నుండి పోతే మరొక ఆవరణలోకి ప్రవేశిస్తాం. తూర్పువేపు గోడకు తగులుతూ పొడవు పాటి కట్టడమొకటి వెలువడ్డది. ఈ పెద్ద గదికి ద్వారం వెలుపల వరాండాలో పెద్ద టేబిలు, రాతితో చేసినది కనిపించింది. గదిలోపల చుట్టూ రాతి అరుగు ఉంది. బహుశా ఇది భోజనశాల అయి ఉంటుంది. దక్షిణపు వేపు రెండు గదులు సామానుగదులై ఉంటాయి. ఒక వంటశాల, చిన్న మరుగుదొడ్డి కూడా వెలువడ్డాయి. విహారానికి సమీపంలో ఒక స్తూపం బయట పడింది. మధ్యనున్న మండప స్తంభాలు రాతితో చేసినవి. నేలపై రాతి పలకలు తాపారు. తవ్వకాలకు ముందు ఈ కట్టడమంతా భూమిలో కప్పబడి ఉంది. దానిపై ఇటుకల ముక్కలు గుట్టగా పడి ఉన్నాయి. మధ్యనున్న మండపం నేలను ఎవరో దొంగలు విరుగగొట్టి గుప్తనిధుల కోసం వెదకినట్టున్నారు. విరిగిన రాతి పలకలు చెల్లా చెదురుగా కనిపించాయి. ఈ తవ్వకం కొంచెం శ్రమదాయక మయింది.

శిథిలమైన మండపాలు లాంగ్ హార్స్‌ట్ దొరకు కనిపించాయి. వాటి పైకప్పులు విరిగి పడి ఉన్నాయి. కాని, స్తంభాలు మాత్రం నిలువుగా నిలిచి ఉన్నాయి. ఈ స్తంభాలమీద కొన్ని శాసనాలు లభించాయి. వాటి ప్రకారం ఈ కట్టడాలలో చాల వరకు విహారాలకు చెందినవని, పుణ్యచరితులైన దాతలు వీటిని యాత్రికులకు, పర్యాటకులకు విశ్రాంతి గృహాలుగా నిర్మించారని తెలుస్తుంది.

లోయ మధ్యభాగంలో, ఒకప్పుడు విజయపురి ఉన్న ప్రదేశంలో, ఒక పెద్ద మండవం యొక్క శిథిలాలు బయటపడ్డాయి. అప్పుడు చాల సుందరంగా ఉన్న అయిదు స్తంభాలు లభించాయి. స్తంభాలన్నీ దెబ్బ తిన్నాయి. మండపాన్ని అకారణంగా ఎవరో ధ్వంసం చేశారు. ఆ స్తంభాలపైన గల విస్తృతమైన అలంకారాలను బట్టి చూస్తే, ఈ స్తంభాలు రాజభవనానికి చెందని పెద్ద భవంతి యొక్క కర్ర పైకప్పును మోసేవని తోస్తుంది. ఈ కొలతలలో గల స్తంభాలు లోయలో మరెక్కడ దొరకలేదు. విహారాలకు ఉపయోగించే స్తంభాలు సాదాగా ఉండడం కాని, లేక తామరపూలు చెక్కిన గుండ్రని పలకలు గలవి కాని ఉండేవి. కాని ఉబ్బెత్తు శిల్పాలతో అలంకరింపబడినవి కావు. ఈ స్తంభాలలో రెండు రకాలైన ఆసక్తి దాయకాలైన శిల్పాలు కనిపించాయి. ఒక శిల్పంలో సైనికుడొకడు కనిపిస్తాడు. ఇతనికి పొడవాటి గడ్డముంది. ఇతడు సిథియన్ అయిఉంటాడు. ఇతని తల పైన రోమనులు ధరించే శిరస్రాణముంది. పొడవుపాటి అంగీ, షరాయి ధరించాడు. బరువైన బల్లెమొకటి చేతిలో పట్టుకున్నాడు. ఈ ఆకారం హిందువులది కాదు. అతని వస్త్రధారణ బట్టి ఉత్తరాదికి చెందిన వాడని తెలుస్తుంది. ఇటువంటి శిల్ప విగ్రహాలు రెండు దొరికాయి. రెండవ రకం శిల్పం మరొక స్తంభం మీద లభించింది. ఇది ఒక పురుష విగ్రహం, పైభాగం, నడుము వరకు, ఆచ్చాదన లేకుండా ఉంది. ఆ పురుషుడి ఎడమ చేతిలో మధువు తాగే శృంగమొకటి ఉంది. అతని ఎడమ కాలికి సమీపంలో మధువు నిండిన జాడీ ఒకటి ఉంది. దాని పైన ఒక గిన్నె బోర్లించి ఉంది. డయోనిసియస్ యొక్క ముతక రకం బొమ్మవలె ఇది కనిపిస్తుంది. రోమన్ సామ్రాజ్యానికి, దక్షిణ భారతదేశానికి మధ్యన జరిగే సముద్రవ్యాపారానికి ఈ విగ్రహం నిదర్శనం. పాశ్చాత్య దేశాల శిల్పాన్ని అనుకరించి చెక్కినట్లు ఇది కనిపిస్తుంది.

బౌద్ధులు స్తూపాలను నిర్మించడంలో ఒక ముఖ్య ప్రయోజనముంది. బుద్దుడి యొక్క శారీరకావశేషాలు కాని, బౌద్ధాచార్యుల అవశేషాలు కాని, పేటికలో పెట్టి, ఒక రాతి నగల పెట్టెలో దానిని నిక్షేపించి, దాని పైన స్తూపం నిర్మించేవారు. కొన్ని స్తూపాలలో అవశేషాలు లభించలేదు. అవి కేవలం స్మారక స్తూపాలుగా నిర్మింపబడ్డాయి.

స్తూపాలలో శారీరకావశేషాలను నిక్షేపిస్తే, వాటిని ధాతుగర్చాలని పిలుస్తారు. పాళీ భాషలో వీటిని ధాతుగబ్బాలని, సింహళ భాషలో డగోబాలని అంటారు. చాల వరకు స్తూపాలు ధాతువులపై నిర్మింప బడడం చేత, కట్టడాన్ని డగోబా అని పిలుస్తారు. నేడు స్తూపం అన్నా డగోబా అన్నా సమానార్థమే ఇస్తుంది. బుద్ధునికి అంకితం చేయబడిన స్మారక స్తూపంకాని, బుద్ధుడి శారీరకావశేషాల మీద నిర్మింపబడిన స్తూపం కాని, ఒకే విధంగా పరిగణింపబడుతున్నది.

నాగార్జునకొండ స్తూపాల పునాదులు చక్రాకారంలో ఉన్నాయి. ఇరుసు తిరిగే కుంచము, చక్రపు అడ్డకమ్ములు, చక్రం చుట్టూ ఉండే బిద్దె – ఇవన్నీ పునాదులలో కనిపించేవి. అడ్డకమ్ముల మధ్యనుండే భాగం మట్టితో నింపేవారు. పునాదులలో స్తూపం చక్రకారంలో ఉన్నా, నిలువున దానిని మధ్యకు కోస్తే గొడుగు వలె కనిపిస్తుంది.

స్తూపాలను పెద్దకొలతలు గల ఇటుకలతో, మధ్యను మట్టితో కట్టేవారు. ఈ పెద్ద ఇటుకలు 20 అంగుళాల పొడవు, 10 అంగుళాల వెడల్పు, 3 అంగుళాల దళసరితో ఉండేవి. ఇటుక పని అయిన తరువాత దానిమీద పైనుండి క్రింది వరకు చెక్క సున్నం చేసేవారు. స్తూపం పై భాగం వర్తులంగా ఉన్న హార్మికమీద నిలబేడది. నాలుగు ప్రధాన దిక్కులకు నాలుగు వేదికలుంటాయి. వీటి పైన భక్తులు పుష్పాలను ఉంచుతారు. ఆంధ్ర స్తూపాలకు ఈ వేదికలు ప్రత్యేకంగా నిర్మింపబడినవి. ఉత్తర భారత స్తూపాలలో ఈ వేదికలు కనిపించవు. ముఖ్యమైన స్తూపాలలోను, చాల పెద్ద స్తూపాలలోను ఈ వేదికల మీద అయిదు స్తంబాల చొప్పున నిలిపారు. శాసనాలలో ఈ స్తంభాలను ఆయక స్తంభాలని పేర్కొన్నారు. ఈ రకం స్తంభాలున్న వేదికలను లాంగ్ హార్స్‌ట్ దొర ఆయక వేదికలని పిలిచారు. స్తూపం చుట్టూ ప్రదక్షిణా పథముంటుంది. పథానికి కర్ర కట్టు చుట్టూ ఉంటుంది. ప్రవేశించే ద్వారాలకు బయట పెద్ద స్తంభాలు, బౌద్ధుల చిహ్నాలు చెక్కినవి ఉండేవి. ఇక్కడే పూజకు అవసరమైన పువ్వులను, దండలను అమ్మేవారు. ఆయుక్తస్తంభాలు స్తూపానికి చాల ముఖ్యమైనవి. వీటిని శిల్పాలతో అతి సుందరంగా రూపొందించేవారు.

నాగార్జున కొండ ప్రాంతంలో రెండు రకాల స్తూపాలు బయట పడ్డాయి. ఒక రకం స్తూపం ఇటుకతో కట్టబడి సాధారణంగా ఉన్నది. రెండవరకం స్తూపం ఆపాదమస్తకం శిల్పాలంకృతమైనది. స్తూపం యొక్క కింది భాగంలో సున్నపురాతి పలకల పైన చిత్రాలు చెక్కి తాపుతారు.

సాధారణంగా స్తూపం ఇటుకతో కట్టి చెక్కసున్నం చేసినది. గోళాకారంగా ఉన్న పైభాగం మీద తోరణమొకటి చుట్టుకొని ఉంటుంది. దీనిని అండమంటారు. ఆయక స్తంభ వేదికపైనను, వర్తులంగా ఉన్న క్రింది భాగం పైనను చిత్రాలు చెక్కిన శిలాఫలకాలు తాపారు. ఆయక స్తంభాల పై భాగం గుండ్రంగా ఉండడం చేత వాటిపై ఎటువంటి కప్పు వేయడానికి అవకాశం లేదని తెలుస్తుంది. అండం పై ఉన్న భాగాన్ని హార్మిక అంటారు. విలువైన వస్తువులను స్తూపానికి సమర్పించినప్పుడు ఈ హర్మికలో వేస్తారు. దీని పైన బరుమైన మూతలు ఉంటాయి. హర్మికపై ఛత్రముంటుంది. ఈ ఛత్రాన్ని రాతితో గాని కర్రతో గాని చేస్తారు.

ఆయక వేదికపై తాపిన ఫలకాల మీద బుద్దుడి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను చెక్కుతారు. ఈ శిల్ప చిత్రాలు, అనగా ఆయక వేదికపై చెక్కినవి, ఇతర చిత్రాలకన్న ఉత్తమంగా తీర్చినవి. ఆయక స్తంభాలు కేవలం స్మారకస్తంభాలు. అతని జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను, లేక పంచమహాద్భుతాలను సూచిస్తాయి. ఈ పంచమహాద్భుతాలు ఏవంటే, బుద్ధుని జననము, విషయ పరిత్యాగము, సంబుద్ధత్వము, ప్రథమ ప్రసంగము, మహాభినిష్క్రమణము అన్నవి. ఈ అయిదు అద్భుతాలను ఉబ్బెత్తు శిల్పాలలో చెక్కి వేదికను అలంకరిస్తారు.

స్తూపాలను శిల్పాలతో అంకరించడం చాల గొప్పపని. ఈ అలంకరణ ఉబ్బెత్తు శిల్పాలతో జరుగుతుంది. క్రింది భాగం నుండి అండం యొక్క మధ్యభాగం వరకు జరుగతుంది. అటుపైన చిత్రాలు చెక్కిన శిలాఫలకాలను అమర్చడానికి వీలు పడదు. అపుడు చెక్క సున్నంతో నున్నగా గచ్చువేసి దానిపై అలంకారాలను చేసేవారు.

గాంధర శిల్ప ప్రభావం, రోమన్ శిల్ప ప్రభావం నాగార్జున కొండ లోయలో లభించిన శిల్పాలయందు కనిపిస్తుంది. రోమ్‌కి, భారత దేశంలో దక్షిణ ప్రాంతమైన ఈ భాగానికి మధ్యను విరివియైన సముద్ర వ్యాపారం, బహుశా, దీనికి కారణం అయి ఉంటుంది.

కొన్ని శిలాఫలకాలమీద స్తూపాల చిత్రాలను చెక్కారు. వీటిని బట్టి నిజ స్థితిలో స్తూపం చిన్న స్తూపాలు బయటపడ్డవి.

మహాస్తూపం సాధారణమైన ఆంధ్రస్తూపం. ఈ స్తూపం పెద్ద ఇటుకలతో కట్టబడింది. ఈ ఇటుకలు 20 అంగుళాల పొడవు, 10 అంగుళాల వెడల్పు, 3 అంగుళాల దళసరి ఉన్నవని ముందే చెప్పబదింది. ఈ స్తూపం మీద పుష్పమాలలు చెక్కారు. ఈ స్తూప నిర్మాణంలో రాతిని అసలు ఉపయోగించనే లేదు. ఆయక స్తంభాలు మాత్రం రాతితో చేసినవి. అమరావతిలో వలె, ఈ స్తూపం యొక్క వ్యాసం 106 అడుగులు. వర్తులమైన అడుగు భాగం భూతలానికి 5 అడుగుల ఎత్తు వరకు లేపారు. అండం పైన ఉండే హర్మికను విడిచి పెడితే, ఈ స్తూపం 70 నుండి 80 అడుగుల ఎత్తు ఉంటుంది. వర్తులమైన అడుగుభాగం పైన 7 అడుగులు వెడల్పు గల సన్నటి దారి చుట్టూ ఉంది. దీనిని చేరడానికి మెట్లు కనిపించలేదు. బహుశా అవి ఉండేవేమో! ఆయక స్తంభవేదికలు 22 అడుగుల పొడుగు, 5 అడుగుల వెడల్పు గలవి. ఆయక వేదికల రాతి పలకలపై అతిరమణీయమైన శిల్పాలను చెక్కారు. నాలుగు ముఖ్యమైన దిక్కులకు అభిముఖంగా ఉన్న ఈ ఆయక వేదికలు పవిత్రమైన పూజాద్రవ్యాలు ఉంచడానికి అనుకూలించి, దర్శకుల దృష్టిని ఆకర్షిస్తాయి. స్తూపం చుట్టూ 3 అడుగులు వెడల్పుగల ప్రదక్షిణాపథముంది. దాని అంచున కర్రలతో కట్టిన అడ్డు కట్ట ఉంది. ఈ అడ్డుకట్ట ఇటుక పునాదులమీద వేసినది. ప్రవేశ ద్వారాల ముందు తోరణాలు నాగార్జున కొడలోయలో కనిపించలేదు.

మహాస్తూపం గల స్థలం తవ్వకాలకు ముందు ఒక పెద్ద మట్టి దిబ్బ, దానిమీద విరిగిన ఇటుకలు కనిపించాయి. ఆ మట్టి దిబ్బ పైన తుప్పలు, గడ్డి, మొక్కలు, చిన్న అరణ్యమొకటి కనిపించింది. రెండు ఆయక స్తంభాలు మాత్రం నిలిచి ఉన్నవి. మిగిలిన 18 స్తంభాలు పడిపోయాయి. స్తూపం మీది భాగమైన అండం విరిగిపోవడంతో ఆయకస్తంభాలు కూలిపోయాయి. గుప్త నిధులను వెదకే చోరులు, స్తూపం అడుగు భాగాన్న నిక్షేపించిన ధాతువు కొరకు ఈ పని చేసి ఉంటారు. అందుచేత శిథిలాలను తొలగించి, స్తూపపు పునాదులను కనుక్కోడం అవసరమయింది.

బుద్ధ ధాతువును స్తూపం యొక్క మధ్యభాగంలో నిక్షేపించలేదు. వాయువ్య దిశలో ఒక మూలను స్థాపించడం వలన అది చోరులకు లభ్యం కాలేదు. మహా స్తూపం యొక్క తవ్వకాలు చాల శ్రమదాయకమయాయి. ఈ పని ఒక నెల్లాళ్ళు పట్టింది. ఎంతకూ బుద్ధ ధాతువు కనిపించలేదు. అందరూ నిస్పృహ చెందారు. అప్పుడు ఒక పనివాడికి విరిగిన కుండ ఒకటి కంటపడింది. పునాదులలో ఉంచిన ఈ కుండ మీద మన్ను కప్పినప్పుడు అది అణిగి బద్దలైపోయింది. దొరికిన పై భాగం మీద కొన్ని తెల్లటి స్పటికపు పూసలు, ఒక చిన్న బంగారు పెట్టె కనపడ్డాయి. కుండలో నింపిన సామగ్రిని బాగా జల్లెడ పట్టిన తరువాత అందులో స్తూపాకారంలో ఉన్న ఒక వెండి పెట్టె దొరికింది. దానిలో, ముప్పాతిక అంగుళం వ్యాసంగల ఒక బంగారు భరిణ ఉంది. అందులో ఒక ఎముక ముక్క ఉంది. వెండి పెట్టె ఎత్తు రెండున్నర అంగుళాలు. వెండి పెట్టెతో బంగారపు బరిణి మాత్రమేకాక దానితో కొన్ని బంగారపు పూలు, ముత్యాలు, కెంపులు, స్పటికాలు దొరికాయి. మూడు పెద్ద స్పటికపు పూసలు, చెవులకు ధరించే అవశేషాలు కల మట్టి కుండను అడుగు గది వంటి భాగంలో ఒక మూలకు ఉంచారు. బుద్ధ దేవుడికి అంకితం జరిగిన తరువాత ఆ గది వంటి భాగాన్ని మట్టితో పూడ్చి, దానిపైన గోళాకారంలో ఉన్న అండాన్ని నిర్మించారు.

ఈ మహాస్తూపం అలంకార శిల్పాలు లేని సామాన్యమైనది. అశోకుని కాలంలో నిర్మింపబడిన ఇతర స్తూపాల వలె ఇది కూడా సాధారణమైనది. క్రీస్తుశకం మూడో శతాబ్దిలో ఆయుక స్తంభవేదికలు, ఆయక స్తంభాలు దీనికి చేర్చబడినాయి.

మహా స్తూపానికి చెందిన శాసనాలలో దీనిని “సమ్మా సంబుధస ధాతు పరపరి గమితస మహా చేతియే” అని పేర్కొనడం జరిగింది. ఈ మహాస్తూపము భగవానుడైన బుద్ధునికి అంకితము చేయబడిందని, దీనివలన తెలుస్తుంది. ఈ స్తూపంలో బుద్ధ ధాతువు లేక ఎముక అవశేషం లభించడం చేత ఇది ధాతుగర్భము. అనగా శరీరావశేషము కల సమాధి. ఇది సాధారణమైన స్మారక స్తూపంకాదు. స్మారక స్తూపాలు, అశోకుని స్తంభాలవలె బుద్ధునికి పవిత్రమైన స్థలాలు, అంటే బుద్దుడు జన్మించిన చోట, ఇతర స్థలలోను నిర్మింపబడ్డాయి. వీటి యందు బుద్ధుని అవశేషాలు లేవు.

ఈ స్తూపం ఎందుకు నిర్మింపబడిందో శాసనాలలో చెప్పలేదు. ఆయక స్తంభాలను బుద్ధునికి అంకితం చేసి, ఛాంతి సిరి మున్నగు రాజమహిళలు ప్రతిష్ఠాపన చేసినట్లు వీటిలో ఉంది. ‘మహాచేతియ నవకమ్మం’ అంటే పూర్వపు కట్టడాన్ని బాగుచేసి కొత్తగా తీర్చడం. ఈ పని ఛాంతిసిరి చేయించినదని శాసనాలలో ఉంది. ఈ మహా చైత్యం ఈ ‘నవకమ్మా’నికి ముందే, బుద్ధ ధాతువు కలిగినదని, లోకంలోని బౌద్ధులందరికీ తెలుసు. అందుచేతనే చీనా, గంధార, యవన, మున్నగు దూర దేశాలనుండి యాత్రికులు వచ్చి దీనిని దర్శించేవారు. ఈ బాగుచేతకు ముందే ఈ మహాచైత్యం లోక విఖ్యాతం.

నాగార్జునకొండలోయలో లాంగ్ హార్స్‌ట్ తవ్వకాలలో తొమ్మిది స్తూపాలు బయట పడ్డాయి. వీటిలో నాలుగు స్తూపాలు ఉబ్బెత్తు శిల్పాలతో అత్యుత్తమంగా అలంకరింపబడినవి. కాని మహాచైత్యం మాత్రమే, శాసనాలను బట్ట, బుద్ధుడికి అంకితమీయబడినదని తెలుస్తున్నది.

ఈ మహాచైత్యం క్రీస్తుశకం రెండవ శతాబ్దికి ముందే ఉండేది. ఆనాటికీ బుద్ధుడు భారత సింహళదేశాలలో విఖ్యాత మతాచార్యుడిగా పరిగణిపంబడ్డాడు. అందుచేత ఈ విషయం శాసనాలలో పేర్కొనలేదు.

అమరావతిలో గల మహా స్తూపానికి, క్రీస్తు శకం రెండు, మూడు శతాబ్దులలో రాతికట్టడం, ఆయకస్తంబాలు, రాతి పిట్టగోడ అదనంగా చేర్చబడినవని శాసనాలను బట్టి తెలుస్తున్నది. అదే కాలంలో, అదే విధంగా నాగార్జున కొండ లోయలో గల మహాస్తూపానికి కూడా ఛాంతిసిరి అలంకరణ, చేర్పులు, బాగుచేతలు చేయించింది.

మహాస్తూపంలో లభించిన ధాతువు, బుద్ధుని శరీరావశేషమేనని, నిర్మాణానికి పూర్వం దానిని ఉత్తర భారతం నుండి ఛాంతిసిరికి చాల కాలం ముందే, తెప్పించి ఉంటారని నమ్మవచ్చు.

నల్లమల శ్రేణికి దిగువ భాగంలో, లోయలో ఈశాన్యపు మూలలో, రెండవ స్తూపం మూడవ స్తూపం లభించాయి.

రెండవ స్తూపం దట్టమయిన అడవిలో ఉంది. తవ్వకాలలో దాని పునాదులు మాత్రమే లభించాయి. ఈ స్తూపానికి అభిముఖంగా ఒక చైత్యం, విహారం యొక్క ఇటుక పునాదులు కనిపించాయి. ఈ స్తూపానికి చెందిన చాల సుందర శిల్పాలను బాధ్యతా రహితంగా ముక్కముక్కలు చేశారు. ఈ స్తూపం చిన్నదే కాని, ఇది మంచి స్థితిలో ఉన్నప్పుడు, అత్యధికంగా ఉబ్బెత్తు శిల్పాలతో అలంకరించారు. ఆయక స్తంభాగాలపైన వెడల్పుగా శిల్పాలు చెక్కిన పీఠాలు లభించాయి.

మూడవ స్తూపం దట్టమైన అడవిలోనే లభించింది. ఈ స్తూపం కూడా ధ్వంసమయి ఉంది. లోయలో లభించిన ఉత్తమ శ్రేణి శిల్పాలు రెండవ, మూడవ స్తూపాల నుండే దొరికాయి. మూడవ స్తూపం యొక్క శిల్పఫలకాలు చెల్లా చెదురుగ పడి ఉన్నాయి. కోరి వాటిని విరుగ గొట్టినట్లు కనిపిస్తుంది. అదృష్టవశాత్తు, లాంగ్ హార్స్‌ట్ దొరకి, మూడవ స్తూపంలో నిక్షిప్తమైన ధాతువు లభించింది. ఉత్తర దిశగా పాతి పెట్టబడింది. గుండ్రపటి వెండి పెట్టి, మూడంగుళాల వ్యాసం కలది ఒకటి లభించింది. దానిలో బంగారపు మల్లెపూలు, ముత్యాలు, పగడాలు, వాటితో స్తూపాకారంలో ఉన్న చిన్న బంగారం భరిణ లభించాయి. ఆ బంగారపు భరిణలో మరొక చిన్న బంగారపు పెట్టె, దానిలో ఒక ఎముకముక్క, ఉన్నాయి. స్తూపాకారంలో ఉన్న వెండి పెట్టెను మట్టి కుండలో ఉంచారు. స్తూప నిర్మాణ దశలో దానిని మట్టితో కప్పినప్పుడు, కుండముక్కలయింది. ఈ స్తూపాల గురించి వివరాలు తెలియడానికి శాసనాలేవి వీటిలో లభించలేదు.

నాలుగవ స్తూపం ఎత్తయిన చోటను, రెండవ విహారానికి ఎదురుగా ఉంది. ఈ స్తూపంలో పన్నెండుగురు బౌద్ధ భిక్షువుల శరీరావశేషాలు, ఆ విహారానికి చెందిన పుణ్య పురుషుల చితాభస్మం లభించాయి. ఈ స్తూపాలనుండి విహారాల నుండి లభించిన సామగ్రిని పరిశీలిస్తే ఒక విషయం తెలుస్తుంది. ప్రతి బౌద్ధ భిక్షువుకు ఎర్రమట్టితో చేసిన పాత్రుల – నీటిజాడి, ఆహారపాత్ర, భిక్షా పాత్ర విధిగా ఉంటాయి. బౌద్ధ భిక్షువు కాని, ఆచార్యుడు కాని మరణిస్తే అతని శరీరానికి దహన సంస్కారం జరిగి, చితి భస్మాన్ని నీటి కుండలో ఉంచుతారు. కుండమీద భోజన పాత్రను బోర్లించి, మూతిని కప్పుతారు. ఈ విధంగా భోజన పాత్రలు కప్పి నిలువుగా తీర్చిన పన్నెండు నీటి కుండలు, వాటితో పాట ఆరు పెద్ద భిక్షాపాత్రలు నాటుగవల స్తూపం నుండి లభించాయి. భిక్షా పాత్రలు ఎర్రమట్టితో చేసినవి. ఇవి భోజన పాత్రకు రెండు రెట్లు కొలతలు కలవి. ఈ భిక్షా పాత్రలు మిగిలిన పాత్రలకు సమీపంలో ఉంచారు. మూడు లేక నాలుగు కుండలు ఒకొక్క గుంపుగా తీర్చారు. వాటిలో ఒక నీటికుండ మిగిలిన వాటికన్న భిన్నంగా ఉంది. అది గోళాకారంలో ఉంది. తొమ్మిది అంగుళాలు ఎత్తులో ఉంది. ఈ కుండ మూతిని ఎర్ర మట్టితో చేసిన కుండ మూకుడుతో కప్పి, దానిమీద ఒక భోజన పాత్రను ఉంచారు. ఈ కుండను మట్టితో నింపారు. ఆ మట్టిలో రెండున్నర అంగుళాలు ఎత్తు ఉండి స్తూపాకారంలో ఉన్న ఒక వెండి పెట్టె దొరికింది. దానిలో చిన్న బంగారు భరిణ, స్తూపాకారంలో ముప్పాతిక అంగుళం వ్యాసం కలది దొరికింది. చిన్న వెండి పెట్టెలో బంగారు రేకుతో చేసిన పూవులు, చౌకంగా చెక్కిన స్పటికపు పూసగల కర్ణాభరణం, శిథిలమయిన ముత్యాలు, పగడాలు కనిపించాయి. అక్కడ ఎటువంటి శాసనం లభించలేదు. ఈ అవశేషాలు ఖ్యాతి చెందిన పుణ్య పురుషుడికి చెంది ఉంటాయి. అతడు ఈ స్తూపానికి తగిలి ఉన్న విహారానికి చెంది ఉండవచ్చు. పుణ్య పురుషుడి ధాతువు ఉన్న కుండ మిగిలిన కుండలకు ఎడంగా ఆ గదిలో ఒకటి ఉంది. మిగిలిన కుండలు మూడు లేక నాలుగు ఒక గుంపుగా వేరు వేరుగదులలో లభించాయి. కాబట్టి ఈ చిన్న కుండలో ధాతువులుంచిన అతడు ఆచార్యుడుగా ఖ్యాతి నొందినవాడు. మిగిలిన కుండలలో ఉంచిన చితాభస్మం అతని ముఖ్య శిష్యులకు చెందినది కావచ్చు. ఈ కట్టడం సాధారణంగా ఉంది. ఆయక వేదికలు, ఆయకస్తంభాలు ఉన్నాయి.

అయిదవ స్తూపం మూడవ విహారానికి చెందినది. ఇది నాగార్జున కొండ దిగువున ఉంది. మూడవ విహారానికి చెందిన భిక్షువుల చితాభస్మం నీటి కుండలలో పెట్టి, వాటి పైన మూతలుంచి ఇక్కడ నిక్షేపించారు. చనిపోయిన ఆరుగురు భిక్షువులు ఒకేసారి చనిపోయారని చెప్పలేము. విహారానికి చెందిన ముఖ్యడెవరేనా చనిపోతే, అంత్యక్రియల తరువాత అతని చితాభస్మాన్ని అతని నీటి కుండలో ఉంచి, భోజన పాత్రను మూతగా ఉంచి, విహారంలో ఒక చోట ఉంచేవారు. కొంత మంది చితాభస్మ ఘటాలు జతపడిన తరువత వాటి పైన స్తూపం నిర్మించేవారు. ఒక గదిలో ఈ కుండలనన్నీ వరుసగా ఉంచడం చూస్తే, స్తూపం యొక్క అండం నిర్మించక పూర్వమే వాటిని ఉంచినట్లు తెలుస్తుంది. ఈ విహారాలకు చెందిన స్తూపాలు, సాధారణంగా ఉండి, ఇటుకతోను సున్నంతో కట్టబడినవి.

మహా పరినిబ్బాణ సూత్తం పాళీ భాషలో ఉన్న బౌద్ధ గ్రంథం. బుద్ధుడు తన నిర్యాణానికి ముందు శిష్యులతో తన చివరి మాటలు చెప్తాడు. ఈ గ్రంథంలో రెండు సూక్తులు, బుద్దుడు చెప్పినవి, మనకు లభిస్తాయి. ఈ సూక్తులు ఆయక స్తంభాలు ఎందుకు నిర్మిస్తారో, స్తూపాలు ఎందుకు లేపుతారో తెలియజేస్తాయి. ఆ

బుద్ధుడు, తన ప్రీతి పాత్రుడైన శిష్యుడు ఆనందుడితో ఈ విధంగా అంటాడు.

“విశ్వాసులైన బౌద్ధులు నాలుగు స్థలాలు సందర్శించాలి. బుద్ధుడు పుట్టిన చోటు, బుద్ధుడు సమ్యక్ సంబుధుడైన చోటు, బుద్ధుడు తన తొలి ధర్మబోధ లేక ధర్మ చక్రప్రవర్తన చేసినచోటు, బుద్ధుడు మహాపరి నిర్యాణం పొందిన చోటు – ఈ నాల్గింటిని వారు దర్శించాలి”.

స్తూపాల నిర్మాణం గురించి బుద్ధుడు చెప్పిన మాటలు కూడా అందులో ఉన్నాయి. నాలుగు రకాల మనుష్యులు కోసం స్తూపాలు నిర్మించవచ్చు. వారు బుద్ధులు, ప్రత్యేక బుద్ధులు, అర్హతులు, చక్రవర్తులు.

నాగార్జున కొండలో మహా స్తూపం బుద్ధుడికి అంకితమయినది. విహారాలతో కలిసిన స్తూపాలు ప్రఖ్యాతులైన పుణ్య పురుషులకి ఆచార్యులకు చెందినవి. శిల్పాలంకృతమైన స్తూపాలు బహుశా రాజకుటుంబం వారికి చెంది ఉండవచ్చు. శాసనాలలో రాజకుటుంబంలోని మహిళలు బౌద్ధ ధర్మాన్ని అభిమానించినవారని ఉంది. ఆ విధంగా కొంతమంది పురుషులు కూడా బౌద్ధాభిమానులై ఉండవచ్చు. వారికి స్తూపాలు కట్టించడంలో ఆశ్చర్యం లేదు.

రెండవ స్తూపం, మూడవ స్తూపం వలె, ఆరవ స్తూపం కూడా శిల్పాలంకృతమైన కట్టడమే. దీని వ్యాసం 40 అడుగులు. దీనిలో విఖ్యాతుడైన పురుషుని అవశేషాలు ఉంచినట్లు తెలుస్తుంది. మహా స్తూపానికి నైరుతి దిశలో మూడు ఫర్లాంగుల దూరంలో ఇది ఉంది. ఈ స్తూపం విహారాలకు దూరంగా ఉంది. ఈ స్తూపానికి ఆయకస్తంభవేదికలు, ఆయక స్తంభాలు ఉన్నాయి. కాని ఒక విశేషం కనిపిస్తుంది. అయిదు ఆయక స్తంభాలలో మధ్యనున్న దానిమీద (అలా నాలుగువేపులా) బుద్ధుడి ధర్మ చక్రప్రవర్తన శిల్పం ఉబ్బెత్తుగా చెక్కబడింది. ఈ స్తూపానికి సంబంధించి శిల్పాలు బాగా పాడయి మిగిలిన వాటికన్న చాల శిథిలమయాయి. ఇక్కడ శాసనమేదీ దొరకలేదు. చిన్న బంగారు భరిణెలో చిన్న ఎముక ముక్క దొరికింది. తుప్పుపట్టి అణగారిపోయిన వెండి పెట్టె, ముత్యాలు, పగడాలు, బంగారు రేకుతో చేసిన పుష్పాలు లభించాయి. రెండు బంగారపు కాసులు, పలుచనివి దొరికాయి. ఇవి ఏ బంగారపు గొలుసుకైనా వేలాడగట్టినవై ఉంటాయి. ఒకదాని మీద ఒక బ్రాహ్మణ మహిళ ముద్ర, రెండవదాని పై ఒక యువకుడి ముద్ర ఉన్నాయి. ఈ మహిళ బహుశా ఛాంతిసిరి కావచ్చు. పురుష ముద్ర ఎవరిదో తెలియదు.

నాగార్జున కొండకు దక్షిణ ప్రాంతంలో కొట్టంపలుగు అన్న రాతి గుట్ట ఒకటి ఉంది. ఈ గుట్టమీద ఏడవ స్తూపం, ఎనిమిదవ స్తూపం ఉన్నాయి. ఈ రెండు స్తూపాలకు సమీపంలో గుట్టదిగువ భాగంలో, నాలుగవ విహారం ఉంది. ఈ విమారం మూడవ విహారం వంటిదే. పైకప్పు లేని స్తంభాల మండపం 60 అడుగుల చతురస్రం దీని చుట్టూ 20 గదులున్నాయి. ఈ స్తంభాలు కొంచెం పెద్దవి. ఈ స్థలంలో ఒక స్తంభం మీద శాసనమొకటి లభించింది. దీనిని బట్టి ఇది మూడవ విహారం తరువాత నిర్మించబడినట్లు తెలుస్తుంది. కొండ మీదను 7వ స్తూపం యొక్క పునాదులు మాత్రమే ఉన్నాయి. బహుశా ఈ స్తూపం విహారానికి అనుబంధమైనదని అనుకోవచ్చు. ఆ పునాదులు కూడా శిథిలమయి చారిత్రక ప్రయోజనం లేకుండా పోయాయి. ఈ 7వ స్తూపానికి కొంచెం దూరంలో, కొండమీద ఇంకా ఎత్తులో 8వ స్తూపం యొక్క పునాదులున్నాయి. శిథిలాలు భూమిమీద 5 అడుగులు ఎత్తు వరకూ ఉన్నాయి. ఈ చిన్న స్తూపం యొక్క వ్యాసం 27 అడుగులు దీనికి ఆయక స్తంభవేదికలున్నాయి, కాని, స్తంభాలు లేవు.

తవ్వకాలు మొదలు పెట్టినప్పుడు, ఈ కట్టడం బాగా ధ్వంసం చేయబడింది. నిధులను వెదికే దొంగలు దీనిని కూలదోశారు. అందుచేత ఇక్కడ ఏవీ దొరకవని లాంగ్ హార్స్‌ట్ అభిప్రాయపడ్డారు. అయితేనేం, శ్రమపడి వెదకిన తరువాత, చిన్నకొండ మీద చాల చక్కని అవశేషాలు, చెడిపోకుండా మంచి స్థితిలోనున్నవి లభించాయి. ఇవి లోయలో లభించిన ఇతర అవశేషాల కంటే చాల ఉత్తమమైనవి. మిగిలిన స్తూపాలలో లభించిన అవశేషాలను ఎర్రమట్టి కుండలలో ఉంచారు. కాని ఈ 8వ స్తూపంలో లభించిన అవశేషాలను ఒక రాతితో చేసిన పేటికలో భద్రపరిచారు. ఈ శిలా పేటిక ఒక అడుగు నాలుగంగుళాలు ఎత్తులో ఉంది. స్తూపం యొక్క ఆకారంలో ఉంది. ఈ స్తూపానికి హర్మిక, ఛత్రం కూడా ఉండి సంపూర్ణంగా ఉంది. ఛత్రాన్ని ఒక ఇనుప చువ్వపై ఉంచారు. ఈ పేటికను నాలుగురాతి పలకలతో చేశారు. అండం మీద పుష్పమాలను చెక్కి అలంకరించారు. ఈ శిలా పేటికలో మట్టితో చేసిన స్తూపాకారం గల భరిణె ఉంది. ఇది 6 అంగుళాల ఎత్తులో ఉంది. దీని పై భాగం నున్నగా నుండి ఆకుపచ్చని పూత మెరుస్తూ కనిపించింది. ఈ కుండ భరిణెలో, స్తూపాకారంలోనే ఉండి, 4 అంగుళాలు ఎత్తుగల రాగి భరిణె ఉంది. దీనిలో 2 అంగుళాలు ఎత్తుగల చక్కని బంగారు స్తూపముంది. దీనిలో స్తూపాకారం గల మరొక బంగారు భరిణె, ఒకటిన్నర అంగుళాల ఎత్తులో ఉంది. ఈ చిన్న బంగారు స్తూపాకార పేటికలో ఒక చిన్న ఎముక ముక్క, బంగారు తామర పూవు, బంగారం రేకుతో చేసిన మల్లెపూలు, శిథిలమయిన ముత్యాలు, పగడాలు లభించాయి. దురదృష్టవశాత్తు ఈ స్తూపంలో ఎటువంటి శాసనం లభించలేదు. అస్తికావశేషాన్ని ఇంత జాగ్రత్తగా ఇన్ని పేటికలలో భద్రపరచడం చూస్తే, ఇదెవరో ప్రఖ్యాతుడి స్తూపమని తెలుస్తుంది. ఈ స్తూపం అలంకరాలు లేని సాధారణ స్తూపం. ఇటుకతోను, సున్నంతోను కట్టినది.

9వ స్తూపం నాగార్జున కొండ యొక్క దిగువ భాగమందు, లోయలో వాయువ్య దిశకు, నదీ తీరానికి సమీపంలో ఉంది. ఈ స్తూపం యొక్క వ్యాసం 42 అడుగులు. ఈ స్తూపం యొక్క కొంత భాగం శిల్పాలు చెక్కిన శిలాఫలకాలతో అలంకరింపబడింది. ఈ శిల్ప ఫలకాలలో చాల వరకు రూపు రేఖలు లేకుండా ధ్వంసం చేయబడ్డాయి. ఈ స్తూపం యొక్క పునాదులు మాత్రం నిలిచి ఉన్నాయి. స్తూపంలో మానవుల శరీరావశేషాలు లభించలేదు. ఈశాన్యపు మూలకున్న ఒక గదిలో నేలమీద, ఎద్దు, లేడి, చెవులపిల్లి, వీటి కాలివి ఎముకలు దొరికాయి. ఈ గదికి ఎదురుగా ఉన్న మరొక గదిలో ఎర్రమట్టితో చేసిన రెండు నీటి కుండలు, రెండు ఆహార పాత్రలు, నిలుచున్న స్థితిలో ఉన్నాయి. ఎటువంటి అస్తికలు దొరకలేదు. చనిపోయిన జంతువుల ప్రేతాత్మల కోసం ఈ నీటి కుండలు, ఆహార పాత్రులు ఉంచినట్లున్నారు.

గదిలో దొరికిన పెద్ద ఎముకలు ఎద్దువి, లేడి ఎముకలు కొద్దిగా ఉన్నాయి. చెవుల పిల్లి ఎముకలు చాలా లభించాయి. ఈ ఎముకలన్నీ కలిసిపోయి ఉన్నాయి. బహుశా ఈ జంతువులు చంపబడినవి కావు. బౌద్ధులు అటువంటి పని చేయరు. ఇవి పవిత్రమైన పెంపుడు జంతువులు. సహజంగా ఇవి మరణించిన తరువాత, వీటిని దహించి, అస్తికలను భద్రపరచినట్లున్నారు.

రెండు పాదముద్రిత శిల్పాలు, పతి పదాలని వీని నంటారు, 9వ స్తూపం దగ్గర దొరికాయి. మూడవది రెండవ విహారం దగ్గర దొరికింది. మూడవ బుద్ధపాద శిల్పం చాల ఉత్తమమైనది. దీని పొడవు 12 అంగుళాలు, వెడల్పు 9 అంగుళాలు. దీని దళసరి 2 అంగుళాలు. బొటన వ్రేళ్ళ చివరనొక శాసనముంది ‘శకుడైన మోతాయొక్క సోదరి బుద్ధి’ అని శాసనంలో ఉంది. రాజుగారి అంగరక్షకులుగా శకవీరులు నియోగింపబడినట్లు మరొక స్తంభశిల్పం మీద తెలుస్తుంది. నాగార్జునకొండలోయలో విజయపురిలో శకులు మొదలగు విదేశీయులు ఒక వాడలో నివసించేవారు. బుద్ధ పాదశిల్పం చాల హెచ్చుగా అలంకరించబడింది. ఈ శిల్పంలో శాక్యరాజ కుమారులు బౌద్ధం స్వీకరిస్తున్నట్లు చెక్కబడింది.

స్తూపం యొక్క అడుగు వర్తులభాగంపై అలంకారం కోసం తాపిన శిలా ఫలకాలు 2 అడుగులు వెడల్పులో, వర్తుల భాగం ఎత్తులో ఉండి, చెక్క సున్నంతో అతుక బడ్డాయి. ఈ శిలా ఫలకాల మీద సాధారణంగా స్తూపాల చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. ఆయక స్తంభ వేదికలు మీద మాత్రం బుద్ధుని జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు చెక్కబడిన ఫలకాలు తాపబడ్డాయి. స్తూపం యొక్క అండంమీద అతికిన కొన్ని ఫలకాలు, డొప్పదేరి 2 అడుగుల వెడల్పు, 3 నుండి 4 అడుగుల పొడవు కలిగి ఉన్నాయి.

నిలువుగాన్ను ఈ రాతి పలకలమీద జాతక కథలు కూడా చెక్కబడి ఉనన్నాయి.

ఆయక స్తంభవేదికలను క్రింది భాగానిక ఇఅతికినపుడు సన్నటి చతురస్రాకార స్తంభాలను ఉపయోగించారు. ఈ స్తంభాలు ఒక అడుగు వెడల్పు, అడుగు ఎత్తు, రెండంగుళాలు దళసరి కలిగినవి. ఇటువంటి స్తంభాలు చాల వరకు విరిగిపోయాయి. వీటిపైన కూడా శిల్పాలు చెక్కబడ్డాయి.

ఆయక స్తంభవేదికల పై భాగంలో అమర్చిన రాతి దూలాలు చాల సుందరమైనవి. నాగార్జునకొండలోయలో లభించిన విలువైన పురావస్తువులలో ఇవి ముఖ్యమైనవి. ఈ దూలాలు ఒకే రాతిని చెక్కి తయారు చేసినవి. చంద్ర కాంత శీలవంటి సున్నపు రాతిపై వీటిని చెక్కారు. ఈ దూలాలు ఆయక స్తంభ వేదికల పాడవును బట్టి మారుతాయి. ఈ దూలాల ముందుభాగం పై శిల్పాలు చెక్కారు. శిల్పం చెక్కిన భాగాన్ని దీర్ఘ చతురస్రాకారంగా ఉన్న చిత్ర భాగాలుగా విభజించారు. వాటి పై జాతక కథలో, బుద్ధని జీవితంలోని ఘట్టాలు చెక్కారు. ఈ దూలాల చివరలపై యక్షులను, యక్షిణులను, మకరాలను చెక్కారు. దీర్ఘ చతురస్రాకారంగా ఉన్న చిత్ర భాగాల మధ్య మిథునాల చిత్రాలను చెక్కారు. ఈ మిథున చిత్రాలకు, బుద్ధుడి చిత్రాలకు సంబంధం లేదని ఇవి కేవలం అలంకారం కోసమేనని లాంగ్ హార్స్‌ట్ దొర అభిప్రాయ పడ్డారు.

చాలా దూలాలపైనున్న శిల్పాలు దెబ్బతిన్నాయి.

ఈ శిల్పాలలో గుర్తించడానికి అవకాశం లేనివి కొద్దిగా ఉన్నాయి.

లాంగ్ హార్స్‌ట్ జరిపిన తవ్వకాలలో 1 మహా స్తూపం, 8 చిన్న స్తూపాలు, 4 విహారాలు, 6 చైత్య గృహాలు, 4 స్తంబాలు కల మండపాలు, రాజ భవనముండే స్థలం, కృష్ణానది ఒడ్డున బల్ల కట్టు రేవు, 500 కుడ్య శిల్పాలు, శాసనాలు, నాణాలు, ఆస్తి నిక్షేపాలు, ఎర్రమట్టి కుండలు లభించాయి.

1926వ సంవత్సరంలో మహమ్మద్ ఖురేషి శాసనాలు వెలికి తీసారు.

1927 నుండి 1931 వరకు లాంగ్ హార్స్‌ట్ తవ్వకాలు జరిపారు.

ఇంత వరకు చెప్పి డాక్టర్ మోహaన్ కొంత సేపు మౌనం వహించాడు.

అప్పటికే బాగా చీకటి పడింది.

దీపాలు వెలిగించి జావా వెళ్ళిపోయింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here