శ్రీపర్వతం-9

0
5

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 9వ భాగం. [/box]

17

“శ్రీ టి.ఎన్. రామచంద్రన్ గారు, అతని సహచరులు 1938 మార్చినెలలో నాగార్జున కొండలో త్రవ్వకాలు తిరిగి ప్రారంభించారు. లాంగ్ హార్స్‌ట్ దొర విడచిన పని వీరు చేపట్టారు. ఈ పనిని 1940 వరకు సాగించారు. దీనిని తవ్వకాలలో రెండవ దశగా పరిగణించవచ్చు” అన్నాడు మోహన్.

సోమవారం చాలా మంచి లంచి తరువాత, వాళ్ళు కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని మాట్లాడడానికి కూర్చున్నారు. సంక్రాంతి పండుగ పదిరోజులే ఉంది. టెంట్ల ముందు ఖాళీ స్థలంలో, కుర్చీలు వేసుకొని, ఎండకు చలికాగుతూ వాళ్ళు కూర్చున్నారు. కొరియర్ అబ్బాయి హైదరాబాదు నుంచి తెచ్చిన ఆపిల్ పళ్ళను ముక్కలు కోసి సుబ్రహ్మణ్యేశ్వర రావు మధ్యను, చిన్న బల్లమీద ఉంచాడు. ముగ్గురూ పలుచని శాలువలు కప్పుకున్నారు.

లాంగ్ హార్స్‌ట్ తవ్వకాల నుండి కొన్ని విశేషాలు తెలిశాయి. శ్రీ రామచంద్రన్ జరిపిన తవ్వకాల గురించి తెలుసుకోవాలని శశికళ చాల తొందర పడుతున్నది. సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎవరు ఏది చెప్పినా తన్మయుడై వింటున్నాడు.

“1938 మార్చిలో సైటు నెంబరు 6లో తవ్వకాలు మొదలయాయి. ఈ సైటు లోయకు ఈశాన్య దిక్కుగా ఉంది. నల్లమలై శ్రేణి దిగువ భాగంలో ఈ సైటు ఉంది. లాంగ్ హార్స్‌ట్ ఇంతకు ముందు ఈ స్థలంలో తవ్వకాలు జరిపి, మూడవ స్తూపాన్ని వెలుపలికి తీశాడు. ఈ స్తూపం యొక్క పునాదులే ఉన్నాయి. బాధ్యతా రహితంగా స్తూపాన్ని ధ్వంసం చేసినట్ల అక్కడి శిథిలాలను బట్టి తెలుస్తుంది.

ఈ స్తూపం యొక్క వ్యాసం 40 అడుగుల 9 అంగుళాలు. స్తూపం 66 అడుగుల 6 అంగుళాలు చతురస్రాకారపు ఆవరణంలో ఉంది. దీని ఆయకస్తంభవేదిక 9 అడుగుల 6 అంగుళాల పొడవు, 3 అడుగుల వెడల్పు ఉంది. నాలుగు ప్రధాన దిక్కులకు అభిముఖంగా ఈ వేదికలున్నాయి. కొంచెం ఎత్తులో ప్రదక్షిణా పథముంది. దాని ద్వారం లేక ప్రవేశం తూర్పుకు ఉంది. ప్రదక్షిణా పథం చేరడానికి మెట్ల వరుసలు కనిపించలేదు. ఆయక వేదికలకు తాపిన శిల్ప ఫలకాలు ముక్కలై ఉన్నాయి. వాటిమీద మంచి చిత్రాలను చెక్కారు. పశ్చిమం వేపున ఫలకం మీద బుద్ధుడికి సుజాత ఆహారమిస్తున్న దృశ్యముంది. మరొక ఫలకం మీద బుద్దుడిని వజ్రపాణిని చెక్కారు. మరొక విరిగిన శిల్పం బోధి వృక్షం కింద కూర్చున్న వజ్రపాణి, అతనికి కొద్ది దూరంలో రెండు ఎద్దులు, బండివాడు కనిస్తారు. వర్తకులు భల్లికుడు, త్రపురషుడు రెండెడ్ల బండిమీద పోతుంటే, వాళ్ళ బండి బుద్ధుడికి సమీపంలో నేలలో కూరుకుపోయింది. ఆ చోట నుంచి కదలడానికి ఎడ్లు నిరాకరిస్తున్నాయి.

ప్రదక్షిణా పథం మీద చాల విరిగిన శిల్పాలు లభించాయి. బుద్ధుడి జీవితంలో ఘట్టాలు, జాతక కథలు వీటిపైన చెక్కబడ్డవి. కొన్ని చిత్రాలు జానపద దృశ్యాలను చూపిస్తాయి.

మరొక శిల్ప ఫలకం మీద రాజగారి చిత్రం, కుడి చేతిలో తామరపూవును పట్టుకున్న నాగరాజు చిత్రం మరొక ఫలకం మీద, మరొక విరిగిన శిల్ప ఫలకం మీద ముగ్గురు పురుషులు ఆసనం మీద, మరొక విరిగిన శిల్ప ఫలకం మీద ముగ్గురు పురుషులు ఆసనం మీద కూర్చున్న స్త్రీ వేపు నడవడం, చిత్రంచబడి ఉంది. వాళ్ళ చేతులలో చేపలు ఉండడం చేత వాళ్ళు జాలారులు కావచ్చు.

బుద్ధుడు నందుడికి లోకంలోని బాధలను చూపించే దృశ్యం, బోధి వృక్షాన్ని దానికింద ఉన్న వేదికను పూజించడం, అద్దం ముందు అలంకరించు కుంటున్న స్త్రీ, ఒంటి పేట గొలుసు మెడలో వ్రేలాడుతున్న స్త్రీ వక్షం, అంజలి ఘటించిన పురుషుడు, ఏనుగుల వరుస, మొదలయినవి చిత్రించబడిన శిల్పాలు లభించాయి.

తొక్కులలో అయిదు మానవశిరస్సుల శిల్పాలు దొరికాయి. అయిదు శిరస్సులలోను నాలుగు పురుషులకు చెందినవి. వారిలో ముగ్గురు రాజకుటుంబానికి చెందిన వారిని తలకు ధరించిన వస్త్రాలబట్టి తెలుస్తుంది. అయిదవ శిరస్సు ఒక వనితకి చెందినది. తలపైన జుత్తు చక్కగా దువ్వి, పాపడ తీసినది. ఆమె బుగ్గలు గుండ్రపటివి. ఆమె కంఠం చక్కగా తీర్చినది. ఈ నుందరమైన విగ్రహాన్ని చూస్తే భారతీయ శిల్ప కళ ఆనాడు అత్యుత్తమస్థితిలో ఉండేదని తెలుస్తుంది.

ఇంకా చాల విరిగిన శిల్పాలు ఈ ప్రాంతం నుండి లభించాయి.

స్తూపానికి తూర్పువేపు తవ్వకాలు జరిపారు.

స్తూపం నుండి 15 అడుగుల 8 అంగుళాలు వెడల్పు గల దారి 109 అడుగుల 8 అంగుళాలు పొడవుగల ఆవరణలో, దక్షిణముఖంగా ఉంది. దీని పై కప్పు దొరకలేదు. సీసావంటి ఆకారంలో పైకప్పు ఉండవచ్చు. చూరుకు మట్టి గొట్టాలు ఉన్నట్లు తెలుస్తుంది. చైత్య గృహపు గోడల వెలుపలి భాగానికి కడపరాతి పలకలు అతికారు. లోపలి భాగానికి అరంగుళం దళసరి గల చెక్క సున్నంతో గిలాబా వేసి, చాల సునువుగా తీర్చారు. లోపలి నేల, మెట్లు, కడపరాతి పలకలు తాపినవి. చైత్యగృహం యొక్క ముందు మెట్లు, 2 అడుగుల 11 అంగుళాలు వ్యాసం కలిగి, అర్థ చంద్రకారంలో ఉంది. ఇది చంద్రకాంత శిలతో చేసినది. నాగార్జున కొండ లోయలో చైత్య గృహాల ముందు మెట్లు, సాధారణంగా సాదారణంగా సాదా చంద్రకాంత శిలలు – కాని, ఈ బుద్ధచైత్యం మెట్టుకి 8 అంగుళాలు వెడల్పు గల శిల్ప ఫలకాలను మూడింటిని అతికారు. వాటి మీద జంతువులు వరుస కనిపిస్తుంది. ఇవి ఎడమవేపు నుండి కుడివేపుకు పోతున్నట్లుంటాయి. ఈ శిల్పాలలో మృగాల మధ్య లతలున్నాయి. ఏనుగులు రెండు సార్లు, సింహాలు అయిదు సార్లు, లేడి, గుర్రం, ఎలుగు బంటి, వృషభం, మహిషం ఒకొక్కసారే ఆ వరుసలో కనిపిస్తాయి. ఈ ముందు మెట్టు అతి సుందరమైన కళా ఖండంగా తీర్చబడింది.

ఈ బుద్ధ చైత్యంలో బుద్ధుడి ప్రతిమ నాలుగు ఖండాలుగా లభించింది. పద్మాసనంలో ఉన్న భాగం, బుద్ధుడి పాదాలు, బుద్ధుడి శరీరం, బుద్ధుడి ఎడమ చేయి మాత్రమే దొరికాయి. శిరస్సు లేకుండా బుద్ధ ప్రతిమ 6 అడుగుల 10 అంగుళాలు ఎత్తు ఉంది. శిరసుకు చేరిస్తే 8 అడుగుల ఎత్తుంటుంది. బుద్దుడి శరీరం మీద సంఘటి (వస్త్రం) స్పష్టంగా చెక్క బడింది. కుడి చేయి మీద, కుడి భుజం మీద ఎటువంటి వస్త్రములేదు.

పద్మాసనానికి పై భాగాన్న, చాల జాగ్రత్తగా ప్రతిమలోకి ఒక అర బిగించబడింది. అంత చక్కగా దీనిని అతకడం చేత కంటికి కనిపించదు.

ఆ అర మూతను తీస్తే, అరంగుళం వ్యాసంగల కన్నమొకటి కనబడింది. గొట్టం వంటి భాగంలో 95 ముత్యాలు దొరికాయి. వాటిలో ఒకటి అంగుళంలో ఎనిమిదవ వంతు వ్యాసం గలది. మిగిలిన ముత్యాలు ఆవగింజలు కొలతలో ఉన్నాయి. బుద్ధ ప్రతిమను శాస్త్ర పద్దతిలో ప్రతిష్ఠ చేసినట్లున్నారు.

ఈ బుద్ధ చైత్యానికి ఈశాన్య దిక్కున భూమిలో 3 అడుగుల 3 అంగుళాల లోతులో రెండు వేపుల శిల్పంతో అలంకరింపబడిన చూరు పలక ఒకటి దొరికింది.

బుద్ధ చైత్యం యొక్క సోపానమైన చంద్రకాంత శిలకు 16 అడుగుల 9 అంగుళాల దూరంలో మరొక గజపృష్ఠాకార చైత్యము వెలువడింది.

బుద్ధ చైత్యానికి తూర్పున ఒక విహారం వెలువడింది. దీనికి మూడు పక్కల గదులు వరుసలున్నాయి. ఒకొక్క వరుసలోను 5 గదులున్నాయి. ఈ వరుసల మధ్య 55 అడుగులు చౌకంగల మండపం బయట పడింది. ఈ మండపంలో స్తంభాలు 5 వరుసలలో ఉన్నాయి.

ఇందులో ఒక వరుసలో ఉన్న చివరి గదికి తూర్పుగా ఒక స్నానశాల ఉంది. దానిలో కడపరాతి పలకలతో కట్టిన కుండ ఉంది. ఆ గది నుండి పైకి నీరు పోడానికి ఒక కాలువ ఉంది. ఆ కాలువ పైన రాతి పలకలు కప్పారు. ఈ కాలువ 14 అడుగులు పోయిన తరువాత దక్షిణానికి తిరిగి మరొక 22 అడుగులు వెళ్ళి అక్కడ ఒక గోతిని కలుస్తుంది. ఈ గోయి 10 అడుగుల పొడవు 8 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతు కలది. ఈ గోతిలో అడుగున గులకరాళ్ళు, పైన ఇసుక, దాని పైన సున్నం పారలతో ఉన్నవి. ఇది నేటి సాక్ పిట్ లకు సాటియైనది.

బుద్ధ చైత్యం యొక్క ఆవరణకు ఉత్తర దశలో ఒక సామాను గది బయట పడింది. కుంభహారతి ఇచ్చే ఘటమొకటి దానిలో దొరికింది. ఈ గదికి తగులుతూ ఒక పెద్ద గది ఉంది. ఈ పెద్ద గది పొడవు 26 అడుగులు, వెడల్పు 12 అడుగులు. ఈ గది మరొక 7 అడుగులు వెడల్పులో హెచ్చి, మరో 49 అడుగులు పొడవులో పెరిగింది. ఈ గది పడమటి నుండి తూర్పుకు విస్తరించి ఉంది. దీని గోడలకు అరంగుళం దళసరి చెక్క సున్నం చేసి ఉంది. కుంభదీపమున్న సామాను గదికి 16 అడుగుల దూరంలో, పెద్ద గది నేలలో 2 అడుగుల 6 అంగుళాలు లోతులో, చాల చక్కగా కార్ఖానాలో పేర్చినట్లు 61 సున్నపురాతి పలకలు నిలబెట్టి ఉన్నాయి. (వీటిని బట్టి ఈ పెద్ద గది శిల్పి యొక్క చిత్రశాల అని తెలుస్తుంది.) అక్కడ సున్నపు రాతిని, మిగిలిన రాళ్ళను చెక్కినపుడు వచ్చే రాతి ముక్కలు చాల దొరికాయి. కాబట్టి ఇది శిల్ప యొక్క చిత్రశాల అని చెప్పవచ్చు. 61 రాతి పలకలలో, 49 పలకల పైన ఏ బొమ్మలూ చెక్క లేదు. ఏ శిల్పమూ లేని ఈ పలకలు 1 అడుగు 4 అంగుళాలు పాడవు, 1 అడుగు వెడల్పు, 2 అంగుళాల పావు మందం కలవి. ఇవి శీర్షక శిలాఫలకాలు. ఒక అడ్డు పట్టీ మీద, ఒక వేపే శిల్పముంది. తామరపూవు చెక్కిన చతురస్ర ఫలకంలో రెండు ఏనుగులు కనిపిస్తాయి. నిలువుగా పాతవలసిన స్తంభాలు ఒక పదకొండు ఉన్నాయి. వీటి మీద ఒక పక్కనే శిల్పముంది. పైన సగం పద్మం, దిగువున సగం పద్మం, మధ్యను మూడు గడులు – ఈ స్తంభాలమీద చెక్కారు. వీటన్నిటి కంటే ఒక గోధుమ రంగు రాతి పలక చాల ఆసక్తిదాయకమైనది. ఈ పలక 1 అడుగు 8 అంగుళాలు పొడవు, 1 అడుగు వెడల్పు, 3 అంగుళాలు మందం కలది. దీని పైన ఒక చిత్రం రేఖా మాత్రంగా చెక్కబడింది. సాలభంజిక ఒకతె చెట్టుకొమ్మను పట్టుకుంటున్న చిత్రమది. ఆమె కుడి చేయి నడుముపై ఉంది. చిత్రమింకా పూర్తి చేసి చెక్కవలసి ఉంది. ఆ స్త్రీ పక్కను ఆమె పరిచారిక ఉంది. పరిచారిక చిత్రం చిన్నది. ఆమె చేతిలో ఒక అలంకారపేటిక ఉంది. ఈ కర్మాగారం చివరను 7 అడుగులు పొడుగున్న ఒక రాతి అరుగు ఉంది. అక్కడ కొన్ని, చెక్కిన రాతి ముక్కలు చెల్లా చెదరుగా పడి ఉన్నాయి. ఈ అరుగు రాతి పలకలను చెక్కడానికో, లేక ముఖ్య శిల్పి కూర్చోడానికి ఉపయోగపడి ఉంటుంది.

కుంభదీపమున్న గదికి ఉత్తరాన చిన్న గది ఉంది. బహుశా ఇది సామాను గది కావచ్చు. అటుపిమ్మట జరిగిన తవ్వకాలలో ఇటువంటివే మరో రెండు గదులు వెలువడ్డాయి. బహుశా ఈ గదులలో ఒంటిగా ఉన్న బౌద్ధ భిక్షువులు ఉండేవారేమో!

సైటు 6లో 1938 చివరవరకు తవ్వకాలు జరిగాయి. 1938లో సైటు 5లో తవ్వకాలు జరిగాయి. లాంగ్ హార్స్‌ట్ దొర కొంతమట్టుకే తవ్వి విడిచి పెట్టిన 2వ స్తూపం ఇది. దీని వ్యాసం 36 అడుగుల 3 అంగుళాలు. దీనికి సమీపంలో చాల ఆయక స్తంభాల ముక్కలు పడి ఉన్నాయి. ఆయక స్తంభ వేదికలకు తాపిన శిల్ప ఫలకాలలో మరుగుజ్జులు (గణాలు) మిథునాలు, నాట్యం చేస్తున్న దేవతలు, ఎగురుతున్న దేవతలు చెక్కబడ్డారు.

ఒక పలక ముక్క మీద మిథున శిల్పముంది. అందులో ఉన్న వనిత తన ఎడమ చేతిని తన ప్రియుని కుడి భుజం మీద వేసి నట్లుంది. ఆ ప్రియుని శిరోవేష్టనం బట్టి అతడు రాజు కుటుంబం వాడని తెలుస్తుంది. మరొక మిథున చిత్రంలో, ప్రియురాలు సవిలాసంగా చెట్టు కొమ్మను పట్టుకుంటే ఆమె ప్రియుడు ఆమె చుబుకాన్ని పట్టుకొన్నట్లుంది.

ఒక పలక మీద యుద్ధదృశ్యముంది.

మరో పెద్ద పలక దక్షిణం వేపున్న ఆయక వేదిక దగ్గిర దొరికింది. ఇది ఆంధ్ర శిల్పశైలికి మచ్చుతునక. అడుగు అంచున మృగాలను చెక్కారు. పైన రెండు దృశ్యాలున్నాయి. ఒకదానిలో ఛందకుడు గౌతముడిని విడిచి వచ్చిన తరువాత, కపిలవస్తు నగరం శోకంలో మునిగిపోయింది. శుద్ధోదన మహారాజుకి చెందకుడు గౌతముడి సన్యాసం గురించి చెప్తుంటే అతడు ముఖం పక్కకు తిప్పుకున్నాడు. యశోధర మూర్ఛపోతున్న స్థితిలో ఉంది. కరకాశ్యం కూడా చిత్రంలో ఉంది.

ఈ ఫలకం యొక్క అడుగు భాగంలో ఉన్న దృశ్యం మరో విధమైనది. దేవతలు, గౌతముడు సన్యసించడం తెలుసుకున్నారు. అతని శిరోవేషనాన్ని ఒక పళ్ళెంలో పెట్టుకొని ఆనందంతో దేవతలు నాట్యం చేస్తున్నారు.

మరొక శిలాఫలకం కూడా అక్కడ లభించింది. ఈ ఫలక రెండు బాగాలుగా ఉంది. మధ్యను విశాలంగా ఉన్న భాగాల మీద ఒక స్తూపం చెక్కబడి ఉంది. రెండవ భాగంలో అలంకారార్ధం చెక్కిన మిథునాలు రెండు, ప్రేమ కలాపాలు జరుపుకుంటున్నట్లు చిత్రింపబడ్డాయి.

స్తంభంపై భాగంలో ఒకపట్టి ఉంది. ఇది శిల్పాలంకృతము. ఇటువంటి ఒక పాడవైన పట్టి అక్కడ లభించింది. ఎడమచేతి వేపు మిథున చిత్రమొకటి ఉంది. ప్రేయసీ ప్రియులు ప్రేమలో పడ్డారు. పురుషుడు రక్షకయోధుడు. అతని చేతిలో ఒక బల్లెముంది. మిగిలిన భాగంలో బుద్దుడి జీవితానికి సంబంధించిన రెండు చిత్రాలున్నాయి. ఒక చిత్రం బుద్దుడు మారుని ప్రయత్నాలకు లొంగకుండా ఉండడం చూపిస్తుంది. గౌతముడు బుద్ధత్వ ప్రాప్తిని పొందడం రెండవ దృశ్యంలో ఉంది. ఈ పట్టీ కింద పొడవైన పలకమీద బాతులు, తామరపూవులు ఒకటి వెంట ఒకటి చిత్రింపబడ్డాయి. ,

ఆయక స్తంభాలు లభించినచోట రెండు శిల్ప ఫలకాల ముక్కలు లభించాయి. ఒకదాని యందు చక్రవర్తి చిత్రముంది. అతడు తన సప్తరత్నాలయిన ఛత్రం, చక్రం, మణి, రాణి, అశ్వం, ఏనుగు, కోశాధి కారి (లేక రాజపుత్రుడు) వీరితో పరివేష్ఠితుడై ఉన్నాడు. రాణి, ధర్మచక్రం అతనికి సమీపంలో ఉన్నాయి. శిల్పఫలకం బాగా దెబ్బతింది.

ఈ సైటులోనే దొరికిన సారనాథ్ మృగదావంలో బుద్దుడి తొలి ధర్మబోధ, ధర్మ చక్రప్రవర్తన ఉంది. రెండవ శిల్పంలో కూడా చిన్న మార్పులతో ఈ చిత్రమే ఉంది. మూడవ శిల్పంలో రెక్కలున్న సింహాలు, పూర్ణకుంభం ఉన్నాయి.

తూర్పువేపు ఉన్న ఆయక వేదికపైన మరొక రకమైన శిల్పం చెక్క బడింది. దీనికి వేటితో సంబంధముందో తెలియలేదు. మూడు పూరిగుడిసెలు, ఒక దాని పై కాకి. ఆ చిత్రంలో ఉన్నాయి. ఇదేదో గ్రామ దృశ్యం అయి ఉంటుంది. ఈ చిత్రం చాల నిజ జీవితానికి ప్రతిబింబంగా తోస్తుంది.

సైటు 2లో శ్రీ రామచంద్రన్ తవ్వకాలు జరిపారు. మహా స్తూపానికి చెందిన మండపం చుట్టూ తవ్వకాలు జరిగాయి. అక్కడొక విహారం బయటపడింది. దీనికి మూడు వేపుల గదుల వరుసలున్నాయి. మండపం విహారం మద్యన ఉంది. ఈ మండపం 52 అడుగుల చతురస్రం. 6 వరుసలుగా స్తంభాలున్నాయి. విహారం యొక్క దక్షిణపు వేపున వరుసలో 9 గదులున్నాయి. లోపలికి ప్రవేశించే ద్వారం 1 అడుగు 9 అంగుళాలు వెడల్పులో ఉత్తరాభిముఖంగా ఉంది. గదుల మధ్య గోలు పెద్ద కొలతలు గల ఇటుకలతో కట్టినవి. తూర్పు వేపున్న గదులు దాటిన తరువాత మరొక పెద్ద గది బయటపడింది. దీని పొడవు 42 అడుగుల 3 అంగుళాలు. వెడల్పు 14 అడుగుల 3 అంగుళాలు. అడ్డుగోడలు కనిపించలేదు. ఈ గదిలో కుండ పెంకులు, గిన్నెలు, జారీలు, మూకుళ్ళు, మూతలు, పాత్రలుంచుకునే చట్టీలు, మనుష్యుల ఎముకల ముక్కలు, దంతపు గాజులు, చిల్ల పెంకులు దొరికాయి.

ఈ విహారం యొక్క తూర్పు వరుసలో తొమ్మిది గదులున్నాయి. వీటిలో ముందు గదిలో గోడకు తగులుతూ రాతి పలకలను వేసి అరుగులా కట్టారు. మిగిలిన గదులలో ఈ ఏర్పాటు లేదు. కాబట్టి ఈ గది ప్రత్యేకమైనదని భావించాలి. ఈ గదిలో ఒక కుండ దొరికింది. అది కొబ్బరికాయ ఆకారంలో ఉంది. అది 7 1/2 అంగుళాలు ఎత్తు. దాని మూతి దగ్గర చిన్న కన్నాలు మూడున్నాయి. దీనిలో రెండు నాణాలు కనిపించాయి. అవి ఎవరి కాలానికి చెందినవో తెలియదు.

ఎనిమిదవ గది తరువాత కొంత దూరం ఖాళీగా ఉండిపోయింది. అక్కడ రెండు కుండలు దొరికాయి. ఒకదానిలో తొమ్మిది ఎముకముక్కలు కనిపించాయి. వీటి గురించి వివరాలు తెలియలేదు. ఉత్తరం వేపున్న గదుల వరుస తూర్పు పడమరలకు వ్యాపించి 112 అడుగుల 7 అంగుళాలు పొడవుంది. ఈ వరుసలో 11 గదులున్నాయి. ఒక అంగుళం వ్యాసం కల ఎర్రమట్టి పూస, కురువింద రత్నపు పూస, పూల గురుతులు కల విలువైన చిన్నరాయి ఈ విహారం పరిసరాలలో లభించాయి.

శ్రీ రామచంద్రన్ జరిపిన తవ్వకాలలో రెండు సంస్కృత శాసనాలు లభించాయి. లిపి బ్రాహ్మీలిపి. ఒకదానిలో ప్రఖ్యాతుడైన ధర్మ కథకుని గురించి ఉంది. లేత నీలపు సున్నపు రాతి పైన చెక్కిన ఈ శాసనంలో ఒక ముక్క విరగడం చేత ధర్మ కథకుడి పేరు తెలియకుండా పోయింది.

ఈ తవ్వకాలలో సైట్లు 2,5,6 లలో లభించిన నాణాలు చాల తక్కువ. ఒక బంగారు నాణెం, 17 సత్తు నాణాలు దొరికాయి. బంగారు నాణెం రోమక చక్రవర్తి హాడ్రియన్ ముద్రకలది. ముప్పాతిక అంగుళానికి కొంచెం హెచ్చుగా వ్యాసం కలిగి, 104 ధాన్యపు గింజల తూకం గలది ఈ నాణెం.

రోముదేశంతో నాగార్జున కొండలోయకు వ్యాపార ముందని ఈ నాణెం ధృవపరుస్తుంది.”

మోహన్ చెప్పడం పూర్తయింది.

నాగార్జున కొండలోయలో వారికి మరో రోజు గడిచింది.

18

ఆ వేళ గురువారం, వచ్చే గురువారమే సంక్రాంతి. ప్రతి గురువారం మధ్యాహ్నం మ్యూజియంకు పోయి స్కాలర్లు చెప్పే విషయాలు నోట్ చేసుకోడం వాళ్ళకు అలవాటయింది. అందుచేత ఆరోజు వాళ్ళు ఏడు గంటలయే సరికి సైటు చేరుకున్నారు. తవ్విన ప్రతి ట్రెంచిలోపలికి దిగి మట్టి పొరలు చాల శ్రద్ధతో పరిశీలన చేశారు. వాటిలో ఇక్ష్వాకుల చరిత్రకు సంబంధించిన వస్తువు ఏదీ వాళ్ళకు లభించలేదు.

పదిగంటలయింది. లోయ, పుష్యమాసపుటెండలో బంగారు పూతతొడుక్కుంది. తూర్పునుంచి రావలసిన చలిగాలులను నల్లమలై శ్రేణి అడ్డివేసింది. ఉత్తర దిక్కున నుండి రావలసిన గాలులు కూడా, సిద్ధుల దరి కొండ అర్లివేయడం చేత, సూటిగా వీచడం లేదు. ట్రెంచిలకు కొద్ది దూరంలో వాళ్ళు, సమతలంలో, పెద్ద తాటాకు గొడుగు కింద, టేబిలు దగ్గర కూర్చున్నారు. టేబిలు, నాలుగు కుర్చీలు ఎప్పుడు అక్కడ ఉంటాయి. లోయలో దొంగతనాలు లేవు. తూర్పుకు, కొండవాలులో ఉన్న సైటు వేపు వచ్చేవాళ్ళు కూడా తక్కువే. అందుచేత సైటులో ఉంచిన పనిముట్లు, మిగిలిన వస్తువులు అలాగే ఉంటాయి.

శశికళ పెద్ద ప్లాస్కు నిండా కాఫీ పోసి తనతో తెచ్చింది. గొడుగు కింది కూర్చొని, కాఫీ కప్పులలో పోసుకుంటుంటే, దూరంలో వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వరరావు, అతనితో ఒక మహిళ అటువేపు రావడం కనిపించింది. శశికళ కాఫీ తిరిగి ప్లాస్కులో పోసింది.

సుబ్రహ్మణ్యేశ్వరరావుతో వచ్చిన అమ్మాయి అతనికి మల్లే, పొడవుగా బందోబస్తుగా ఉంది. లేత నీలం రంగులో నేతచీర కట్టుకుంది. ఆమె చేతులకు ఒకొక్క బంగారు గాజుంది. ఆ గాజులు కొత్త వాటిలా ఉన్నాయి. తళతళ మెరుస్తన్నాయి.

నమస్కారాలయిన తరువాత సుబ్రహ్మణ్యేశ్వర రావు ఆమెను పరిచయం చేశాడు.

“ఈమె నాగమ్మ, నాకు కాబోయే భార్య”

“ఈమె పల్నాటి యుద్ధంలో బాలనాగమ్మ కారుకదా?” నవ్వుతూ అన్నాడు మోహన్.

“ఈమె పల్నాడు మనిషే – ఈమె పూర్తి పేరు బాలనాగమ్మే!” అన్నాడు రావు.

“వీరనారీమణిని భార్యగా చేసుకోబోతున్న మీకు నా అభినందనలు” అంది శశికళ.

“అన్నట్లు, వీరు డాక్టర్ మోహన్ – వీరు డాక్టర్ శశికళ. వీరిద్దరి గురించి నీకు చెప్తునే ఉన్నాను” అన్నాడు రావు, నాగమ్మ వేపు తిరిగి.

శశికళ పంజాబీ దుస్తులు వేసుకుంది. పైన వేసుకోవలసిన వోణీ కుర్చీ మీద పడేసింది. ఎడమ చేతికి రిస్టువాచీ తప్ప గాజులు కూడా లేవు. నుదుటనున్న బొట్టు నామమాత్రానికి ఉంది. జుట్టు ముడి చుట్టుకుంది.

శశికళను చూస్తూ నాగమ్మ పదినిమిషాలు అలా ఉండిపోయింది.

“మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తున్నానని రావుగారు మాట వరసకేనా చెప్పలేదు” అంది శశికళ.

‘రెండు మూడు వారాలనుండి వద్దామనుకుంటున్నాను. ఇంటికి వెల్లవేయడం, ధాన్యాలు కొట్లలో పోయించుకోడం, ఇలా ఏవో పనులు, సంక్రాంతి వారం రోజులే ఉంది. మీ యిద్దరినీ మా యింటికి పండుగకు పిలవవచ్చాను” అంది నాగమ్మ.

“ఆ సంగతులు తరువాత మాట్లాడుకుందాం. ముందు కూర్చోండి. మీరు కాఫీ తాగుతారా?” అడిగింది శశికళ.

“తాగుతాను” అంది నాగమ్మ!

కాఫీలు నలుగురూ తాగారు.

శశికళ నాగమ్మను చూస్తూ అంది “మీరు చాలా అందంగా ఉన్నారు.”

“నాకు అందమంటే ఏమో ఈనాటికీ తెలియదు” అంది నాగమ్మ,

“నేను చెప్పేది బాహ్యమైన సౌందర్యంకాదు. మీ అంతః సౌందర్యం” అంది శశికళ.

“అంత వేగంగా మీరు కనుగొన్నారా?” అన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరరావు,

“మంచింటి పిల్ల – అందచందాలకు లోటు లేదు. అంతకు మించి గౌరవ మర్యాదలకు మించిన స్వభావం” అంది శశికళ.

“మధ్యాహ్నం వచ్చేస్తానని ఇంట్లో చెప్పాను” అంది నాగమ్మ.

“మాతోనే ఈ రోజంతా గడపాలి” అంది శశికళ.

“కాని, నేను మాత్రం శశికళ చెప్పిన విధంగానే ఇంట్లో చెప్పాను. అందుకోసం మనలను వాళ్ళు ఈ రోజు ఎదురు చూడరు” అన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరరావు.

వాళ్ళు నలుగురూ కృష్ణానదివేపు నడిచారు. అష్టభుజస్వామి ఆలయం నుండి సర్వదేవాధివాసం వరకూ గట్టు వెంబడి నడిచారు. ఎవరికి తోచిన విషయాలు వాళ్ళు చెప్తున్నారు. కృష్ణలో కాళ్ళు కడుక్కున్నారు. టెంట్లకు తిరగి వచ్చేసరికి ఒంటి గంట అయింది.

నాగమ్మ తనతో ఒక సజ్జా తెచ్చింది. మరచెంబు నిండుగా గడ్డ పెరుగు, పెరటిలో చెట్లకు పండిన చక్కరకేళి అరటిపళ్ళు, ఊరగాయలు, పచ్చళ్ళు, వేరుశనగపప్పు ఉండలు ఈ విధంగా కొన్ని తెచ్చింది.

కొరివికారం, గడ్డ పెరుగు, పచ్చళ్ళతో వాళ్ళకు కడుపునిండి పోయింది. మధ్యాహ్నం వాళ్ళు పనికి పోలేదు. టెంట్ల ముందున్న ఖాళీ జాగాలో కుర్చీలు వేసుకు కూర్చున్నారు. ఎండ చురకడం లేదు. కవోష్ణంగా ఉంది. అప్పుడప్పుడు గాలి రివట ఒకటి వీచేది.

“నన్ను చెప్పమన్నారా, శశికళను చెప్పమన్నారా?” మోహన్ అడిగాడు.

“ఎవరు చెప్పినా సరే” అంది నాగమ్మ,

“మోహన్ చెప్తే సంస్కృతం – శశికళ చెప్తే గ్రీకు” అన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరరావు.

“సంస్కృతంలోని విషయాలు పురాణాలు చెప్పే పండితుల నోటంట వింటుంటాను. కాని గ్రీకు చరిత్రలోని విషయాలు ఈ మధ్యనే ఈయన నోటంట విన్నాను. ఇంకా వినాలని ఉంది” అంది నాగమ్మ,

శశికళ నవ్వింది.

“నాకన్న మోహన్ చాల అనుభవశాలి. కానిండి! మీరు కోరినట్లే నేనే చెప్తాను” అంది. శశికళ, నాగమ్మ వేపు తిరిగి – సంభాషణ సాగించింది.

“మీరు కాలేజీలో చదవకపోయినా, హైస్కూలు చదువులు పూర్తి చేశాక చాలా పుస్తకాలు చదివారని సుబ్రహ్మణ్యేశ్వరరావు చెప్పారు. కాబట్టి నేను చెప్పేది. మీకు కష్టంగా ఉండదు. ఒకవేళ మీకే విషయమైనా తెలియకపోతే, నేను వివరంగా చెప్తాను”.

నాగమ్మ అంగీకారంగా తల ఊపింది.

ఇటు పక్క, అటుపక్క బంతిపూలు, చేమంతులు విరబూచాయి. శశికళ ఒక క్షణం వాటివేపు చేసి చెప్పడం మొదలుపెట్టింది.

“క్రీస్తుపూర్వం 1000వ సంవత్సరం నాటికి అయిదు సంస్కృతుల ప్రభావం కలిగిన సంస్కృతి ఒకటి గ్రీసు దేశంలో వ్యాపించింది. క్రీటన్, మైసీనియన్, ఆకియన్, డోరియన్, తూర్పు దేశాల సంస్కృతులవి.

గ్రీకు సంస్కృతి మేధావులు సృష్టించారు. చాల నెమ్మదిగా ఇది వ్యాప్తి చెందింది. క్షణక్షణానికి ఈ నూతన సంస్కృతికి సవాళ్ళు ఎదురయాయి. గ్రీకులు చేసిన చాల యుద్ధాలలో వారికి మంచి అనుభవం కలిగింది. చాలా శక్తివంతమైన సామ్రాజ్యాలు, పురాతన సంస్కృతులు దీనికి పునాదులుగా నిలిచాయి. గ్రీసు దేశానికి మరో పేరు హెల్లాస్, గ్రీకు భాష మాట్లాడే ప్రజలు నివసించిన భూభాగాలే గ్రీసు దేశం.

ఈజిప్టు నాగరికత, పెర్షియన్ నాగరికత తమ ముద్రను గ్రీకు సంస్కృతి మీద వేశాయి.

క్రీస్తు పూర్వం 680వ సంవత్సరంలో లిడియన్ ప్రభుత్వం నాణాలను ప్రవేశపెట్టింది. దీనిని గ్రీకులు స్వీకరించి, ఈ పద్ధతిని అభివృద్ధి చేశారు. దీని ఫలితాలు వెంటనే లభించాయి. విశ్వవ్యాప్తిని పొందింది ఈ పద్ధతి.

ఈజిప్టు నాగరికత, క్రీటు నాగరికత, మెసపొటేమియన్ నాగరికత ఈ మూడు నాగరికతలు, గ్రీసు దేశానికి సాంకేతిక విద్య, విజ్ఞాన శాస్త్రం, కళలు ప్రసాదించాయి.

పెర్షియా, కార్లేజి దేశాలు, గ్రీసు దేశపు వ్యాపారం యొక్క సవాలుకి కదిలిపోయాయి. ఇవి గ్రీసును సామంత రాజ్యంగా చేసుకున్నాయి.

గ్రీకులు చుట్టు పట్ల రాజ్యాలకు వ్యాపించారు. నగర పాలిత రాష్ట్రాలను నిర్మించారు. కాని, వారు గ్రీకు భాషనే మాట్లాడారు. గ్రీకు దేవతలనే కొలిచారు. గ్రీకు సాహిత్యమే అభ్యసించారు. గ్రీకు విజ్ఞాన శాస్త్రానికి, వేదాంతానికి, తమవంతు సమర్పించుకున్నారు. ప్రజా పాలనను గ్రీకు ధనికుల పద్ధతిలో అనుసరించారు. వాళ్ళు పై దేశాలకు వలస పోయినా, గ్రీకు సంస్కృతిని మాత్రం విడిచి పెట్టలేదు. తమతోనే తీసుకుపోయారు. వేయి సంవత్సరాల పాటు, మధ్యధరా సముద్రాన్ని సరస్సుగా వాడుకున్నారు. అదే భూమికి కేంద్రమని భావించారు.

ఆర్లోస్‌కి దక్షిణాన, సముద్రానికి దూరంగా, పైకి లేచిన పారనక్ పర్వత శిఖరాలు కనిపిస్తాయి. ఇవి చక్కగానే ఉంటాయి. కాని, వీటికన్న, వీటి మద్యను పారే యూరోటాస్ నది మాత్రం నయనమనోహరంగా ఉంటుంది. పడమటను, మంచు నిండిన టేగెటన్ పర్వత శిఖరాలు ఇంకా అందంగా ఉంటాయి. తరచు భూకంపాలు సంభవించే ఆ లోయకు లాకోనియా రాష్ట్ర మంటారు. దాని రాజధాని స్పార్టా. ఆ నగరానికి కోట గోడలవలె పర్వతాలమరాయి. స్పార్టా వైభవదశలో ఉన్నప్పుడు అయిదు గ్రామాల పంచాయితీ అది. అప్పుడు దాని జనసంఖ్య 70,000. ఈ రోజు స్పార్టా చిన్న పల్లెటూరు. అక్కడ 4,000 జనులకన్న హెచ్చు మంది లేరు. ఒకప్పుడు గ్రీసు దేశాన్ని పాలించి, ఆ దేశాన్నే నాశనం చేసిన ఆ నగరం యొక్క అవశేషాలు, అక్కడున్న మ్యూజియంలో ఇపుడు లభించవు.

మెస్సీరియన్ రాజు ఆరిస్టోడెమస్. అతడు స్పార్టానులను జయించడం కోసం ప్రశ్నలు వేయించాడు. తన రాజవంశానికి చెందిన రాజ కన్యను దేవతలకు బలినివ్వమని సలహా యిచ్చాడు. రాజు తన కూతురినే చంపించాడు. కాని యుద్ధంలో ఓడిపోయాడు.

లాకోనియన్ సమాజంలో మూడు అంతస్తులున్నాయి. పై అంతస్తులో యజమానులుంటారు. రెండవ అంతస్తులో ఉన్నవాళ్ళు హెలాట్సు – వీరు పంటలు పండించి వాటిమీద జీవించేవారు. మూడవ అంతస్తులో ఉన్న వాళ్ళు పెరియోసీలు – వీరు చుట్టుపట్ల నుండేవారు. వీళ్ళు స్వతంత్రులు. కాని, వీళ్ళకు ప్రభుత్వం నడిపే హక్కులేదు. పాలకవర్గంలోని వారితో వివాహ సంబంధాలు వీరికి నిషిద్ధం.

పాలక వర్గం వారు 32 వేలు, పెరియోసీలు 1 లక్ష 20 వేలు, హెలాట్లు 2 లక్షల 24 వేలు ఉండేవారు.

స్పార్టా చరిత్ర లైకర్ గస్ రావడంతో మారిపోయింది. అతడు రంగంలోకి రాక పూర్వం సంగీతం, కళ బాగా వర్ధిల్లాయి. కాని అతని రాకతో అవి వృద్ధి పొందడానికి అవకాశం లేకుండా పోయింది. సంగీతం చాలా వ్యాప్తిలో ఉండేది. స్పార్టా ఎప్పుడూ యుద్ధాలలోనే ఉండేది. అందుచేత సంగీతం కూడా రణ సంబంధం కలిగి ఉండేది. మిగిలిన పద్ధతులలో పాడిన సంగీతం గర్వింపబడేది.

రెండవ మెస్సీనియన్ యుద్ధంలో స్పార్టాన్లు ఓడిపోతున్నారు. అప్పుడు అట్టకాకు చెందిన కుంటి బడిపంతులు వ్రాసిన యుద్దగీతాలు పరిస్థితులను మార్చివేశాయి. మొద్దుబారిన స్పార్టాన్లు ఆ గీతాలకు మేల్కొని విజయం సాధించారు.

లైకర్ గస్ కన్న ఒక వంద సంవత్సరాలు ముందు స్పార్టాన్లు కవిత్వం మీద, కళల మీద అభిలాష ఉన్నవారే. కాని, మెస్సీనియన్ యుద్దాలు గెలవడంతో పరిస్థితి మారిపోయింది. స్పార్టాన్లు తాము గెలిచిన భూమిని పంచుకున్నారు. పాలకులు ముప్పై వేలమంది, సామాన్యులు వీరికి నాలుగు రెట్లు అధికంగా ఉన్నారు. శ్రామికులు పాలకులకు ఏడు రెట్లు హెచ్చుగా ఉన్నారు. ఏ క్షణాన్న యుద్ధం వస్తుందో, ఏ నిమిషాన తిరుగుబాటు వస్తుందో అన్నట్లుండేది. వారిని అణచివేయడానికి సైనిక శిక్షణ అవసరం వచ్చింది. సైనికుడిగా ప్రతి స్పార్టాన్ మారిపోయాడు. లైకర్ గస్ ప్రవేశపెట్టిన రాజ్యాంగం ఈ పని సాధించింది. ఒక్క రాజకీయ చరిత్రలోనే స్పార్టాన్లు పురోగమించారు. మిగిలిన నాగరికత నుండి స్పార్టా తిరోగమించింది.

స్పార్టాన్ శాసనసూత్రకారుడు లైకర్ గస్. అతడు క్రీస్తు పూర్వం 900 నుండి 600 వరకు గల కాలంలో వాడని అంటారు. స్పార్టాన్ రాజు ఛారిలాస్ పినతండ్రియే లైకర్ గస్ అని, రాజుగారి సంరక్షకుడు కూడా అతడేనని కొందరంటారు. డెల్ఫీలో భవిష్యత్కాలం గురించి కొన్ని శాసనాలు లభించాయి. అవే లైకర్ గస్ సూత్రాలని హెరోడోటస్ చెప్పాడు. ఏ ఇబ్బంది లేకుండా, ఉన్న ఆచారాలను మార్చడానికి గాని, కొత్త వాటిని ప్రవేశ పెట్టడానికి గాని, ఒక సురక్షితమైన పద్ధతి ఉంది. దేవుడి ఆజ్ఞ ప్రకారం మార్పులు జరుగుతున్నాయిన చెప్తే చాలు. ఆ నూతన సుత్రాలు అమలు పడతాయి.

లైకర్ గస్ క్రీటు రాష్ట్రంలో సంచారం చేసి, అక్కడ ఉన్న పాలనా పద్ధతులను మెచ్చుకున్నాడు. వాటిలో కొన్నింటిని లాకోనియాలో ప్రవేశ పెట్టాలని నిశ్చయించాడు.

చాలమంది రాజులు, ఉన్నత వంశస్థులు రాజ్యాంగంలో వచ్చిన ఈ మార్పులను గునుస్తూ అంగీకరించారు. అవి తమ భద్రతకు చాల ముఖ్యమని భావించారు. కాని, జమీందారుల వంశానికి చెందిన ఒక యువకుడు ఈ సూత్రాలను తీవ్రంగా వ్యతిరేకించాడు. అతని పేరు అల్ కాండర్. అంతేకాక శాసన సభ్యుడైన లైకర్ గస్ కంటి మీద కొట్టాడు.

ఈ ప్రమాదానికి లైకర్ గస్ ధైర్యం కోల్పోలేదు. వెనుకంజ వేయలేదు. వికారంగా కనిపిస్తున్న ముఖాన్ని, దెబ్బతిన్న కంటిని తన ప్రజలకు చూపించాడు. వాళ్ళు ఈ దృశ్యం చూసి ఏవగించుకున్నారు. సిగ్గుపడ్డారు. అల్ కాండర్‌ని శిక్షించమని అతనికి అప్పగించారు. లైకర్ గస్ వాళ్ళు చేసిన పనికి అభినందించి, వాళ్ళ నందరినీ పంపించి వేశాడు. ఒక్క అల్ కాండర్‌ని మాత్రం తనయింటికి తీసుకుపోయాడు. అతనిని నిందించడం కాని, శిక్షించడం కాని చేయలేదు.

అల్ కాండర్‍ని తనతో పాటు భోజనం చేయడానికి పిలిచాడు.

ఆ యువకుడు సరళమైన స్వభావం కలవాడు. విసిగిపోకుండా ఆజ్ఞలను పాలించాడు. ఆ విధంగా అతనికి లైకర్ గస్‌తో కలిసి జీవించే అవకాశం లభించింది.

లైకర్ గస్ సామాన్యుడు, శాంత స్వభావం కలవాడు, అసాధారణమైన నిగ్రహం కలవాడు, నిర్విరామంగా కృషి సలిపేవాడు. లైకర్ గస్‌తో కలిసి ఉండిన అల్ కాండర్‌కి ఈ గుణాలనన్నిటినీ పరిశీలించే అవకాశం లభించింది.

అల్ కాండర్ శత్రువుగా మారడానికి బదులు లైకర్ గస్‌ను అత్యధికంగా మెచ్చుకున్నాడు. తన స్నేహితులతోను, బంధువులతోను, లైకర్ గస్ అనుకున్నంత చెడ్డ స్వభావం కలవాడు కాడని, ఎప్పుడూ దిగులుపడి ఉండడని అతడు చెప్పాడు. ఇంకా అతడు మృదు స్వభావం కలవాడని, దయాళులైన ఉత్తముడని అందరితో చెప్పాడు.

లైకర్ గస్ తన రాజ్యాంగ సూత్రాలను పూర్తిచేశాడు. తాను తిరిగి వచ్చేవరకు వాటిలో మార్పులు తీసుకురాకుండా నగరవాసుల దగ్గిర వాగ్దానం తీసుకొని వెళ్ళిపోయాడు. తిన్నగా అతడు డెల్ఫీ వెళ్ళిపోయాడు. అక్కడ ఒక ఏకాంత స్థలంలో మరణ పర్యంతరం నిరాహార దీక్షతో ఉండి తనువు చాలించాడు.

రాజనీతి విశారదుడన్నవాడు తన మరణాన్ని సైతం దేశానికి సేవగానే భావిస్తాడు.

లైకర్ గస్‌కు ముందు ఏ రాజ్యాంగ విధానాలుండేవో, అతడు వేటిని ప్రతిపాదించాడో, అతని తరువాత వేటిని చేర్చారో చెప్పడం కష్టం.

లాకోనియాలో ఉన్న భూమిని లైకర్ గస్, ముప్పైవేల సమ భాగాలుగా విభజించి నగర వాసులకు పంచిపెట్టాడు.

ప్లూటార్కు చెప్పిన దానిని థూసిడైడ్స్ కాదన్నాడు. ఆ విధంగా భూమిని విభజించ లేదన్నాడు. పాత ఆస్తులను ముట్టుకోకుండా, కొత్తగా సంపాదించిన వాటిని ఆ విధంగా అందరికీ సమానంగా పంచి ఉండవచ్చు.

లాకోనియన్ నమాజంలో ఉన్న పాలనా పద్దతిని లైకర్ గస్ తొలగించాడు. దేశాన్ని భౌగోళికంగా విభజించాడు. పాత కుటుంబాలు చెలాయిస్తున్న అధికారం ఆ విధంగా భగ్నమయింది. విపులమైన ప్రభువుల పాలన ఏర్పడింది. ఆర్గోస్, కొరింత్, మెగరా, ఏథెన్సు రాజ్యాలలో కొంతమంది వర్తకులు భూస్వాములై ప్రభువుల పాలనకు ముప్పు తెచ్చే అవకాశం ఏర్పడింది. లైకర్ గస్ ఈ మార్పును గుర్తించాడు. అతడు తన ప్రజలను పరిశ్రమలలో కాని, వాణిజ్యంలో కాని పాల్గొననీయలేదు. వెండి, బంగారం, ఉపయోగించడం కాని, దిగుమతి చేసుకోడం కాని నిషేధించాడు. ఇనుమును మాత్రమే, ద్రవ్యానికి మారకంగా వినియోగించమని ఆదేశించాడు. భూస్వాములైన స్పార్టానులను ప్రభుత్వం నడపడానికి, యుద్ధాలు చేయడానికి స్వేచ్ఛగా విడిచి పెట్టాలని నిర్ణయించాడు.

లైకర్ గస్ యొక్క రాజ్యాంగంలో మూడు రకాల ప్రభుత్వాలు కనిపిస్తాయి. రాజుల పాలన, ప్రభువుల పాలన, ప్రజల పాలన అవి. ఈ మూడు మిళితమై ప్రతి ప్రభుత్వము మిగిలిన ప్రభుత్వాలను అతిగా వ్యవహరించకుండా, సమన్వయ పరచేదని కొందరంటారు.

స్పార్టాను ప్రతిస్పర్ధులైన రెండు రాజు కుటుంబాలవారు పాలించేవారు. కాని, వాళ్ళ అధికారాలు పరిమితంగా ఉండేవి. వాళ్ళు ప్రభుత్వపు మతానికి సంబంధించిన బలులు, పూజలు చేసేవారు. న్యాయం విచారించేవారు వాళ్ళు. యుద్ధంలో, సైన్యాలకు నాయకత్వం వహించేవారు. అన్ని విషయాలలోను, వాళ్ళు శాసన సభ యొక్క నిర్ణయాలకు బద్ధులై ఉండేవారు.

రాజ్యాంగవిధానం యొక్క ముఖ్యమైన భాగం శాసన సభ – ఇది పాలకుల అధీనంలో ఉండేది. అరవై సంవత్సరాలు దాటినవారే ఈ సభ్యత్వానికి అర్హులు. అంతకు తక్కువ వయసు వారిని అంగీకరించేవారు కాదు. ఈ సబ్యులు 28 మంది ఉండేవారు. ఎప్పుడేనా, ఏ సభ్యుడి స్థానమైనా ఖాళీ అయితే, దానికి మరొకరిని ఎన్నుకునే పద్ధతి చాల విడ్డూరంగా ఉంటుంది. పోటీచేసే సభ్యులను రాజ్యాంగ సభముందు నడిపించేవారు. ఏ అభ్యర్థిని చూసి సభికులు కరతాళ ధ్వనులు హెచ్చుగా చేస్తారో, అతనిని ఆ ఖాళీకి ఎన్నుకునేవారు.

శాసన సభలో సామాన్య ప్రజల విభాగముంది. ఇది, స్పార్టాలో ప్రజాప్రభుత్వానికి చిహ్నం. ముప్పై సంవత్సరాలు దాటిన పురుషులు దీని సభ్యులుగా చేరవచ్చు. ఈ శాసన సభా విభాగం ప్రతి పూర్ణిమనాడు సమావేశమయేది. ప్రజలకు సంబంధించిన ముఖ్య విషయాలు ఈ సభకు నివేదింపబడేవి. దీని అనుమతి లేనిదే ఏ చట్టం కూడా ఆమోదింపబడేది. కాదు.

లైకర్ గస్ రాజ్యాంగానికి చాల తక్కువ మార్పులు జరిగాయి.

శాసనసభ ప్రజా విభాగానికి ప్రభుత్వం నడిపే అధికారముంది. కాని, చట్టాలలో మార్పు తీసుకుని వచ్చే అధికారం లేదు. ఈ పని పాలక విభాగం చేతిలోనే ఉంది.

ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచమని ఎవరో మేధావి లైకర్ గస్‌ని కోరాడు. కాని లైకర్ గస్ అన్నాడు!

“స్నేహితుడా! ముందు నీ ఇంట్లోనే దానిని ప్రారంభించు”

అయిదుగురు గ్రామ పాలనాధికారుల స్పార్టా ప్రజల క్షేమం చేసేవారు. వీరు రోమన్ న్యాయాధీశులతో సమానం. వీరిని ప్రతి సంవత్సరం ఎన్నుకునేవారు. లైకర్ గస్‌కి పూర్వం నుండి గ్రామ పాలనాధికారులుండేవారు. పెర్షియన్ యుద్ధం తరువాత వీరు రాజులవలె వ్యవహరించేవారు. ఇంకా చెప్పాలంటే సార్వభౌమత్వమే వహించేవారు. విదేశాలనుండి వచ్చిన రాజదూతలను కలిసేవారు, న్యాయం పాలనలో వచ్చే వివాదాలను సరిచేసేవారు, సైన్యాలను ఆజ్ఞాపించేవారు. రాజులను పనులకు నియోగించేవారు, వారి లోపాలను క్షమించేవారు, లేక వారిని శిక్షించేవారు.

ప్రభుత్వం యొక్క ఆజ్ఞలను సైన్యము, రక్షక భటులు అమలు పరచేవారు. ఈ గ్రామ పాలకులు ప్రత్యేకంగా రహస్యంగా పోలీసులను నియమించి ప్రజలపై గూఢచారిత్వం చేయించేవారు. స్పార్టాను యువకులలో కొంతమందిని ఈ పనికి ఎంచుకున్నారు. సామాన్య ప్రజలను హెలాట్సు అంటారు. ఈ గూఢచారి సంస్థ, అకస్మాత్తుగా ప్రజలపై బడేది. సామాన్యుల్లో అనుమానమున్న వారిని హతమార్చడంలో వెనుకంజ వేసేది కాదు. యుద్ధంలో కొంతమంది హెలాట్సు చాల ధైర్యంగా పోరాడి దేశ సేవ చేశారు. పాలకులు బలశాలురైన ఆ సామాన్యులను చాలా సమర్థవంతంగా పరిగణించారు. అందుచేత వారిని ప్రమాదమైన వాళ్ళని ముద్రేశారు. పెలొపాన్నిషియన్ యుద్ధం ముగిసి ఎనిమిది సంవత్సరాలయింది. బహిరంగంగా దండోరా వేసి, శత్రువులతో ధైర్య సాహసాలతో పోరాడి, పేరుపొందిన హెలాట్సుకి స్వాంతంత్ర్యం లభిస్తుందని ప్రకటించారు. దీని వెనుకనో దురుద్దేశముంది. ఎవరయితే ముందుగా స్వాతంత్ర్యం పొందుతారో వారు ఉత్సాహంతో తిరుగుబాటు చేయగలవాళ్ళని పాలకులు భయపడ్డారు. రెండు వేలమంది హెలాట్లను వారి ధైర్య సాహసాలకు మెచ్చుకొని, స్వతంత్రమివ్వడానికి ఎంపిక చేశారు. వీళ్ళందరూ తలల మీద కిరీటాలు పెట్టుకొని, దేవాలయాల చుట్టూ తిరిగి, తమకు లభించిన స్వాతంత్ర్యంలో మురిసిపోయారు. కాని, స్పార్టానులు, అటు తరువాత, వాళ్ళనందరినీ మతమార్చారు. ఎవడు ఎలా చనిపోయాడో లోకంలో తెలియకుండా పోయింది.

స్పార్టా యొక్క బలం, గర్వం, ఆ దేశం యొక్క సైన్యంతో ముడిపడి ఉన్నాయి. ఈ బలాల ధైర్యం, క్రమశిక్షణ, యుద్ధ కౌశలం, దేశం యొక్క భద్రతకు ఆదర్శానికి మూలస్తంభాలు. ప్రతి పౌరుడు ఇరవయ్యో ఏటనుండి అరవయ్యో ఏటివరకు సైన్యంలో పనిచేయడానికి శిక్షణ పొందేవాడు. ఈ కఠోరమైన శిక్షణ నుండి, బలమైన ఆయుధాలను ధరించి, బల్లాలను విసరగలిగే పదాతులను తయారు చేసేవారు. వీరంటే ఏథీనియన్లకు కూడా భయమే. ఎప్పుడో ఎపామినోడాస్ వీళ్ళను జయించే వరకు, ఈ బలాలకు అపజయమన్నది లేదు. ఈ సైన్యం చుట్టూ స్పార్టా తన నైతిక సూత్రాలను ఏర్పరచుకుంది. మంచివాడుగా ఉండడమంటే బలశాలిగా ధైర్యవంతుడుగా ఉండడమే. యుద్ధంలో మరణించడం అత్యున్నతమైన గౌరవము, ఆనందము, అపజయం పొంది బ్రతికి ఉండడం కన్న అమర్యాద వేరొకటి లేదు. సైనికుడి తల్లి కూడా దీనిని క్షమించదు.

బలశాలులైన సైనికులును తయారు చేయడం కోసం చాల ప్రయత్నాలు జరిగేవి. మొదటిది చిన్న తనంలోనే బలహీనులైన పిల్లలను తొలగించడం అర్భకుడైన శిశువును చంపడానికి తండ్రికి హక్కు ఉంది. అంతటితో ఆగిపోలేదు. శిశువును ప్రభుత్వపు పరిశీలకులు పరీక్షచేసేవారు. లోపముండే శిశువును పర్వత శిఖరం నుండి కరకు రాళ్ళమీదికి విసిరి చంపేవారు. మరో పద్దతిలో అనారోగ్యవంతులైన శిశువులను, ఎండకు, వానకు, చలిగాలులకు విడిచి పెట్టేవారు. వివాహానికి ముందు భార్యాభర్తలు, తాము వివాహమాడదలచిన వారి ఆరోగ్యం, నడవడి బాగా పరిశీలించవలసిందని హెచ్చరించేవారు. ఆర్బిడామస్ అన్న రాజు పొట్టిగా ఉన్న పెళ్ళాన్ని పెళ్ళాడితే, అతనికి జరిమానా విధించారు. అద్వితీయమైన ప్రతిభ, సామర్థ్యం కలవారి దగ్గిరకి తమ భార్యలను పంపితే చక్కని పిల్లలు కలుగుతారని భర్తలకు చెప్పేవారు. వయసు చేతను, అనారోగ్యం చేతను క్షీణించిన భర్తలు బలమైన సంతానం కోసం యువకులను ఆహ్వానించేవారు. ఈర్ష్య పనికిరాదని, స్త్రీ తన హక్కుని పురుషుడు భావించరాదని లైకర్ గస్ అన్నాడు. తమ కుక్కలకు గుర్రాలకు మంచి పిల్లలను చేస్తున్నారు. వారి సంతానం మూర్తులైనా, దుర్బలులైనా, అనారోగ్యవంతులైనా వాళ్ళు పట్టించుకోరేమి అంటాడు లైకర్ గస్. చెప్పాలంటే స్పార్టాన్ పురుషులు బలమైన వాళ్ళు. అందమైన వాళ్ళు. వాళ్ళ భార్యలు ఇతర గ్రీకు స్త్రీలకన్న ఆరోగ్యవంతులు, సొగసైనవాళ్ళు.

శిశువులను ఏరి పారేయడం అంత ముఖ్యమైనది కాదు. వారికిచ్చే శిక్షణే విలువైనది. ఆర్చిడేమస్ రాజు ఒకసారి అన్నాడు.

“మనిషికి మనిషికి, పుట్టినప్పుడు అంత భేదం ఉండదు. ఆ మనిషి ఏ బడిలో చదువుకొని తీవ్రమైన శిక్షణకు లోనయాడో అదే ముఖ్యమైనది. ఆ విధంగా శిక్ష పొందిన వాడు చాల ఉన్నతమైనవాడు.”

స్పారాను బాలుడు ఏడు సంవత్సరాల ప్రాయంలో కుటుంబం నుండి వేరవుతాడు. తరువాత ప్రభుత్వమే ఆ కుర్రాడిని పెంచుతుంది. సైనిక శిక్షణ, మామూలు విద్య అతనికి నేర్పుతారు. ఈ పిల్లల చదువుకి ఒక మేనేజరును నియమిస్తారు. ప్రతి తరగతిలోను సమర్ధుడూ, ధైర్యశాలి అయిన బాలుడిని కాప్టన్‌గా చేస్తారు. అతడు చెప్పినట్లు వినమని మిగిలిన పిల్లలకు చెప్తారు.

అతడు విధించిన శిక్షకు లొంగమంటారు. ఆ కాప్టన్‌ను చదువులోను, క్రమశిక్షణలోను మించడానికి ప్రయత్నించమంటారు. కనీసం అతనితో సమానులుగా అవడానికి ముందుకు రమ్మంటారు. విద్యార్థిని పోటీలలో గెలుపొందేటట్లు చేయడం, కౌశల్యం పొందేటట్లు చేయడం ముఖ్యం కాదు.

కాని, యుద్ధంలో ధైర్యం, యోగ్యత సంపాదించడమే ఈ శిక్షణ యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం.

బాలురు బహిరంగంగా నగ్నంగా క్రీడలలో పాల్గొంటారు. పెద్దవాళ్ళు పిల్లలను కామించేవాళ్ళు, స్త్రీలు, పురుషులు ఆ క్రీడలను చూస్తారు. పిల్లలలో ఒకరికొకరిని పోటీ పెట్టి వారి శక్తిని, ఓర్పును, పరీక్షిస్తారు. ఏ బాలుడి లోనేనా పిరికితనం కనిపిస్తే అతడు చాలకాలం హీనంగా చూడబడతాడు.

కుర్రాడికి పన్నెండేళ్ళు రాగానే, అతడు లోపల వేసుకునే బట్టలు ఇవ్వరు. ఒకే బట్టతో సంవత్సరం కాలం గడపమంటారు. కుర్రాడు తరచు స్నానం కూడా చేయడు. ప్రతిరోజూ నీటిలో స్నానం లేపనాలను అద్దుకోడం శరీరాన్ని మెత్తగా చేస్తాయని, చల్లని గాలి, శుభ్రమైన భూమి దేహాన్ని గట్టిగా చేసి, రోగ నిరోధక శక్తిని కలిగిస్తాయిన వారి నమ్మకం. చలికాలంలోను, ఎండాకాలంలోను కుర్రాడు ఆరుబయట, యూరోటానది గట్ల నుండి తెచ్చిన రెల్లుగడ్డి చాపలమీద పడుక్కుంటాడు. కుర్రాడికి ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు తన సహచరులతో సిపాయిల బారకాసులలో జీవితం గడుపుతాడు. ఇంట్లో లభించే సదుపాయాలకు అతడు నోచుకోడు.

కుర్రాడికి చదవడం, వ్రాయడం నేర్పుతారు. అక్షరాస్యుడిని చేయడం మాత్రమే ఈ విద్య యొక్క ధ్యేయం. తన రాజ్యాంగ సూత్రాలను బాలురు వ్రాసి, చదివి, కంఠస్థం చేయడానికి లైకర్ గస్ సమ్మతించలేదు. వాటిని ముఖతః నేర్చుకోడం, ఆచరణలో పెట్టడం అతడు కోరాడు. ఉత్తమమైన ప్రభుత్వమే పౌరులకు పాఠశాల ఆ విద్య కూడా నీతికి, ధర్మానికి సంబంధించి ఉండాలి. మనసును శ్రమ పెట్టకూడదు. తెలివితేటలకన్న మనుష్యుడి మంచి నడవడిక ముఖ్యమైనది. స్పార్టాను యువకుడు స్థిరమైన మతి కలవాడు. మధువు మొదలైనవి సేవించవలసిన వాడు కాడు. కొంతమంది హెలాట్ల చేత, అంటే సామాన్యులచేత, బాగా సారాయి త్రాగించి, వారు వికార చేష్టలు చేస్తుంటే స్పార్టాను యువకులకు చూపించి, మద్యపానం ఎంత మూర్ఖమైన పనులకు దారి చూపిస్తుందో నిరూపించేవారు.

యుద్ధం కోసం స్పార్టాను యువకుడిని తయారు చేసేటప్పుడు, అతడు పొలాలలో ఆహారం అన్వేషించి, సంపాదించుకోవాలి. లేకపోతే పస్తులేనా ఉండాలి. అంతకీ ఓపిక లేకపోతే దొంగతనమేనా చేసి ఆహారం సంపాదించాలి. ఈ దొంగతనం ఎవరికీ తెలియకుండా ఉంటే ఏమీ జరగదు. కాని పట్టుపడితే ఇది నేరమే, పలుగురిలో కొరడాతో కొట్టి శిక్షిస్తారు. అతడరు బాగా ప్రవర్తిస్తే పౌరుల భోజనశాలలో ఇతరులతో కలిసి భోజనం చేయడానికి అనుమతి లభిస్తుంది. అక్కడ స్పార్టాన్ యువకుడు, పెద్దలతో కలిసి భోజనం చేసినప్పుడు, వారి సంభాషణలను శ్రద్ధతో ఆలకించి, రాజ్యం యొక్క సమస్యలను తెలుసుకుంటాడు. అంతేకాకుండా సంభాషణా చాతుర్యం కూడా అతడు అలవరచుకుంటాడు.

స్పార్బాన్ యువకుడికి ముప్ఫై యేళ్ళు వచ్చేసరికి, అతడు యౌవనంలో ఎదురయిన కష్టాలను దాటి, గౌరవం ప్రదంగా నిలదొక్కుకుంటే, అతనికి పౌరుడి సంపూర్ణమైన హక్కులు, బాధ్యతలు, సంక్రమించి, అతడు పెద్దలతో సహ పంక్తి భోజనం చేయడానికి వీలు కలిగేది.

ఇక స్పార్టాన్ బాలిక విషయంలో చప్పాలంటే ఆమె చిన్నతనం నుండి ఇంటిలోనే పెరిగేది. ప్రభుత్వపు కట్టుదిట్టాలకు లోబడి ఉండేది. ఆమె పరుగెత్తడం, కుస్తీ పట్టడం, ఇనుప చక్రాన్ని విసరడం, మొనతేలిన బాణాన్ని చిమ్మడం వంటి బలాధిక్యతతో కూడిన క్రీడలలో పాల్గొనేది. ఈ విధంగా చేస్తే ఆమె శరీరం దృఢంగా ఏర్పడి, ఆరోగ్యవంతమై, సులభంగా పిల్లలను కనడానికి యోగ్యురాలౌతుంది. నలుగురి మధ్య చేసే నాట్యాలలో ఆమె నగ్నంగానే ఆడాలి. శరీరంలో లోపాలుంటే, యువకుల మధ్యను నాట్యం చేయడానికి ఆమె సిగ్గుపడి, శరీర సౌష్టవాన్ని బాగుచేసుకుంటుంది.

“యువతులు నగ్నంగా ఉండడంలో తప్పులేదు. లజ్జావంతులైన వారుంటే అపచారం లేదు. కాని, వాళ్ళలో కులటల లక్షణాలు గర్హించదగినవి” అంటాడు పూటార్కు. యుద్ధంలో వీరత్వం చూపిన వారిమీద పాటలు పాడేవారు. వెన్నిచ్చి పారిపోయిన వారిమీద అసహ్యం కుమ్మరించేవారు. స్పార్టాను బాలికకు వారు మానసిక విద్యను గరిపి కాలం వ్యర్థం చేయలేదు.

ప్రేమ విషయానికొస్తే స్పార్టా యువకుడు నిరభ్యంతరంగా ప్రేమలో తలమునకలు కావచ్చు. స్త్రీలను ప్రేమించవచ్చు. పురుషులను ప్రేమించవచ్చు. ప్రతి కుర్రాడికి ఒక వయసు మీరిన ప్రియుడుండేవాడు. ఈ వృద్ధ ప్రియుడు, కుర్రాడి చదువు విషయంలో శ్రద్ధ తీసుకునేవాడు. కుర్రాడు కూడా అతని పట్ల అనురాగంతోను, విధేయత తోను ప్రవర్తించేవాడు.

పెళ్ళి ముందు స్పార్టాన్ యువకులు చాల స్వతంత్రంగా ఉండేవాళ్ళు, వ్యభిచారం చాలా అరుదుగా కనిపించేది. వేశ్యలకి ప్రోత్సాహం లేదు. లాకోనియాలో ఆఫ్రోడైటీ దేవాలయం ఒక్కొటే ఉంది. ఆఫ్రోడైటీ విగ్రహానికి మేలి మునుగుంది. ఆమె చేతిలో ఖడ్గముంది. ఆమె కాళ్ళకు శృంఖలాలున్నాయి. ఇవన్నీ, ప్రేమకోసం పెండ్లి చేసుకోడం అవివేకమైన పని అని, యుద్ధానికి ప్రేమ లోకువని, పెండ్లిండ్లు ప్రభుత్వం అధీనంలో ఉంటాయని తెలియ చేస్తాయి.

పురుషులు ముప్పై సంవత్సరాల ప్రాయంలోను, స్త్రీలు ఇరవై సంవత్సరాలకు వివాహానికి యోగ్యులని ప్రభుత్వం నిర్దేశించింది. స్పార్టాలో బ్రహ్మచర్యం నేరంగా పరిగణింపబడింది. బ్రహ్మచారులకు ఓటు హక్కులేదు. బహిరంగంగా జరిగే ఉత్సవాలలో యువతులు, యువకులు నగ్నంగా నాట్యం చేస్తుంటే బ్రహ్మచారులను చూడనీయరు. పూటార్కు కథనం ప్రకారం, బ్రహ్మచారులను దిగంబరులుగా చేసి, అందరి ప్రజల సమక్షంలో, చలికాలంలో కూడా, వీధులలో నడిపించి ప్రభుత్వపు చట్టాలను అతిక్రమించిన వారని చాటించేవారు. ఏదో నెపం మీద వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చిన పెద్ద మనుషులను స్త్రీలు వీథులలో నడిపించి వారిని బాధించేవారు.

పిల్లలు లేని పురుషులను స్పారా యువకులు గౌరవించేవారు కారు.

తల్లిదండ్రులే వివాహాలను కుదిర్చేవారు. కట్నాలు లేవు. కాని, సంబంధం నిశ్చయమైన తరువాత వరుడు పెళ్ళికూతుర్ని బలవంతంగా ఎత్తుకుపోయేవాడు. వధువు లొంగనట్లు ప్రవర్తించేది. వయసు వచ్చిన యువతీ యువకులు పై విధంగా వివాహాలు జరుపుకోడానికి అవకాశం లేకపోతే, ఒక చీకటి గదిలోకి ఒకే సంఖ్యలో యువతులు, యువకులు తోయబడేవారు. ఇటువంటి పరిస్థితులు ఒకప్పుడు చాల కాలం కొనసాగి, పెళ్ళికి ముందే యువతులు తల్లులయేవారు. పెళ్ళయిన తరువాతే భార్యాభర్తలలో ప్రేమ కలిగేది. స్టార్టాన్లు తమ మధ్యను వ్యభిచారం లేదని చెప్పుకుంటారు. పెళ్ళికి ముందే వాళ్ళు తమకు నచ్చిన విధంగా తిరిగేవారు. పెళ్ళి తరువాత కూడా, భర్తలు తమ భార్యలను పంచుకునేవారు. అన్నదమ్ముల మధ్య ఈ పద్ధతి ఉండేది. విడాకులు చాల అరుదు. లై సాండర్ అన్న స్పార్టాన్ సేనా నాయకుడు తన భార్యను విడిచి పెట్టి, ఒక అందగత్తెను పెళ్ళాడదలచితే అతనిని శిక్షించారు.

ప్రతి స్పార్టాన్ వురుషుడు, రాజ్యాంగనియమం ప్రకారం, తన ముప్ఫయ్యవ ఏటనుండి అరవయ్యో ఏటి వరకు పగటి ముఖ్య భోజనం పౌరభోజనశాలలో తీసుకోవాలి. అక్కడ భోజనం సాధారణంగా ఉండడమే కాకుండా తక్కువగా కూడా ఉంటుంది. ఈ విధంగా చేస్తే యుద్ధ సమయంలో కలిగే బాధలకు వారు తట్టుకోగలరని, శాంతి సమయంలో దిగజారిపోరని భావించారు. ఈ వీరులు వారి జీవితాలను ఇళ్ళవద్ద గడపరాదు. ఖరీదైన మంచాలపై విశ్రాంతి తీసుకోరాదు, విశాలమైన టేబిళ్ళమీద భుజింపరాదు. వంటవాళ్ళు పెట్టిన రుచికరములైన భోజనాలకు అలవాటు పడి కొవ్వు బలియరాదు. మనుసులను శరీరాలను ఈ విధంగా నాశనం చేసుకోరాదు. పీకలమోయ్యా తిన్న వాళ్ళకు చాల కాలం నిద్ర కావాలి. వేడనీటి స్నానం కావాలి, పని చేయకుండా హాయిగా సోమరులకు అలవాటవుతుంది. పౌరభోజనశాలకు ప్రతి పౌరుడు జొన్నలు మొదలైన వస్తువులను ఇస్తూ ఉండాలి. లేకపోతే వారి పౌరసత్వపు హక్కులు పోతాయి.

స్పార్టాలో బొజ్జ పెరిగిన పురుషులను ప్రభుత్వం బహిరంగంగా ఆక్షేపించేది, లేకపోతే దేశం నుండే బహిష్కరించేది. పేదలు, ధనికులు ఒకే విధమైన దుస్తులు ధరించేవారు. ఇనుమే వారికి ముఖ్య ధనం. దానిని హెచ్చుగా కూడబెట్టడం సాధ్యమయే పనిగాదు. కాని, మానవులకుండే అత్యాశ మాత్రం వారిని విడిచి పెట్టలేదు. శాసన సభ్యులను, గ్రామాధికారులను, రాజదూతలను, సైన్యాధిపతులను, రాజులను వీళ్ళందరినీ లంచాలిచ్చి, కొనుక్కోవచ్చు. వాళ్ళ వాళ్ళ హెూదాలకు తగినట్లుగా లంచాలివ్వవలసి వస్తుంది. ఒకసారి మరోదేశం నుండి ఒకడు రాజదూత స్పార్టా వచ్చి, ప్రజలకు తాను తెచ్చిన బంగారు పళ్ళాన్ని ప్రదర్శించాడు. ప్రజలు చెడిపోతారని ఆ రాజదూతను వెంటనే వెనుకకు పిలిపించారు. ఇటువంటి లంచాలకు ప్రజలు లొంగి పోతారని, విదేశీయుల పట్ల మోజు చూపించలేదు, వారిని ఆహ్వానించడం చాలా అరుదు. అలా ఎవరినేనా రప్పించినా, వాళ్ళు స్పార్టాలో తక్కువకాలం ఉండవలసి ఉంటుందని ముందుగానే తెలయిజెప్పేవాళ్ళు. ఇంకా వాళ్ళు మొండికెత్తి తిష్ఠ వేస్తే, స్పార్టాన్ పోలీసులు వాళ్ళను సరిహద్దుల వరకూ తీసుకుపోయి అక్కడ విడిచిపెట్టేవారు.

స్పారాన్లు విదేశాలకు పోకుండా ప్రభుత్వం శ్రద్ధ తీసుకునేది. విదేశాలలో వాళ్ళు తమకన్న గొప్పవాళ్ళు కారన్న భావం వాళ్లలో కలిగించేది. ఎవరూ వాళ్ళకు కొత్త విషయాలు నేర్పడానికి లేవనేది. పాలనా పద్ధతి నిష్ఠూరంగా వ్యవహరించేది. ప్రభుత్వాన్ని రక్షించుకోవడం దాని పని, స్వాతంత్ర్యం, విలాసం, సాహిత్యం, కళలు ఈ వింత కృత్రిమ వ్యవస్థలను కూలదోస్తాయని ప్రభుత్వం భావించింది. ఆ సమాజంలో మూడింట రెండు వంతులు భూమిదున్నే జీతగాళ్ళు అందరు యజమానులూ, బానిసలే.

ఈ స్పార్టా రాజ్యాంగం ఎటువంటి సంస్కృతిని, ఎటువంటి నాగరకుడిని తయారు చేసింది?

అన్నిటికన్న ముందు దృఢమైన శరీరం గల పురుషుడిని, కష్టాలకు ఇబ్బందులకు లోనయిన వాడిని తయారు చేసింది. ఆరోగ్యం స్పార్టా యొక్క విశిష్ట సంపద. అనారోగ్యం నేరమే. ఆత్మ నిగ్రహం, మితవాద స్వభావం, ఐశ్వర్యం కలిగినపుడు, దురదృష్టం ఎదురయినవుడు ఒకే విధంగా స్వీకరించడం ఈ గుణాలు ప్రతి స్పార్టాన్ పౌరుడిలో విధిగా ఉంటాయి. వీరిని చట్టం పాలిస్తుంది. లైకర్ గస్ ప్రవేశపెట్టిన రాజ్యాంగం క్రింద రెండు వందల సంవత్సరాలు స్పార్టా చాల బలంగల దేశమయి వర్థిల్లింది.

స్పార్టానులు స్వార్థపరులు, తుష్ణీభావంగా ఉండేవాళ్ళు, క్రూరులు. స్పార్టాన్ రాజ్యాంగం మంచి సైనికులను తయారు చేసింది. అంతకు మించి వారికి మరేది ప్రసాదించలేదు. శరీర దార్ఢ్యం కోసం వారిని పశువులుగా తీర్చి, మానసికమైన ఉదార స్వభావం వంటి మంచి గుణాలను చంపి వేసింది. ఈ రాజ్యాంగం రాకముందు దేశంలో వర్ధిల్లిన కళలన్నీ అకస్మాత్తుగా వచ్చి పోయాయి. సంగీతం, నాట్యం మాత్రం కొంతవరకు నిలిచాయి. ఇతర ప్రపంచంతో వారికి వ్యాపారం లేదు, వినోద పర్యటనలు లేవు. విజ్ఞాన శాస్త్రం వారికి తెలియదు, సాహిత్య జ్ఞానం లేదు, వేదాంత విషయాలు తెలియవు.

క్రీస్తు పూర్వం 550 తరువాత స్పార్టాలో కవులు, శిల్పులు, భవన నిర్మాతలు లేకుండా పోయారు. స్పార్టా కేవలం హెలాట్లు లేక సామాన్యుల దేశమయింది. వాళ్ళ మానసిక స్థితి, సామాన్య పదాతి యొక్క స్థితిలోనే ఉండిపోయింది.

చివరి రోజులలో స్పార్టా యొక్క సంకుచిత స్వభావం ఆ దేశం యొక్క ఆత్మ బలాన్ని కూడా మోసగించింది.

స్పార్టా పతనమయిందంటే, దేశాలన్నీ ఆశ్చర్య పోయాయి. కాని, ఏ దేశమూ విచారించలదు. ఈ రోజు ఆ గడ్డలో ఒక స్మారక స్తంభం కూడా లేకుండా పోయింది.”

శశికళ చెప్పడం ఆపింది. అప్పటికే చీకటి ముంచుకొని వచ్చింది.

ఇంతవరకు వాళ్లు శశికళ చెప్పినది వింటూ చలిగాలిని కూడా లక్ష్యం చేయలేదు.

“నాగమ్మా! నేను ఇంతవరకూ చెప్పినది మీకు ఏమయినా బోధ పడిందా?” శశికళ అడిగింది.

“మీరు చెప్తున్నంత సేపు అంతా బోధ పడినట్లే ఉంది. విషయం కొత్తది, అందుచేత మరోసారి వింటే మనసులో ఉండి పోతుంది” అంది నాగమ్మ.

“ఆ పని సుబ్రహ్మణ్యేశ్వరరావు చెప్తారు” అన్నాడు మోహన్.

ఆ రాత్రి అందరూ ఒకే కుటుంబమయి, భోజనాలు చేసి, కబుర్లు చెప్పుకుంటూ, నీరసమైన లోయలో గడిపారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here